టీమిండియా ఆటగాళ్లను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ సురీందర్ ఖన్నా(Surinder Khanna) సంచలన వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ సేనను ‘అబద్దాల కోరు’గా అభివర్ణిస్తూ ఘాటు విమర్శలు చేశాడు. సరిగ్గా ఆడటం చేతగాకే సాకులు వెదుక్కొంటూ.. వివాదాలు సృష్టించేందుకు సిద్ధమవుతున్నారంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు.
శుభారంభం చేసినా..
భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా కంగారూ జట్టుతో ఐదు టెస్టులో ఆడుతోంది. అయితే, పెర్త్‌లో 295 పరుగుల తేడాతో గెలిచి.. శుభారంభం చేసినా.. తర్వాత అదే జోరు కొనసాగించలేకపోయింది.
అడిలైడ్‌లో జరిగిన పింక్ బాల్ టెస్టులో ఓడిపోయిన టీమిండియా.. బ్రిస్బేన్ టెస్టును డ్రా చేసుకుంది. మెల్‌బోర్న్ వేదికగా ముగిసిన బాక్సింగ్ డే టెస్టులో మాత్రం ఘోర ఓటమిని చవిచూసింది. కాస్త కష్టపడినా కనీసం డ్రా చేసుకోగలిగే మ్యాచ్‌లో 184 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
జైస్వాల్ అవుటైన తీరుపై వివాదం
ఇక ఈ మ్యాచ్‌లో చక్కటి ఇన్నింగ్స్ ఆడుతూ జట్టును గట్టెక్కించే ప్రయత్నం చేసిన యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అవుట్((Yashasvi Jaiswal’s controversial dismissal) జరిగిందంటూ) కావడంతో భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో జైసూ.. లెగ్‌సైడ్ దిశగా షాట్ ఆడేందుకు యత్నించాడు. అయితే, బంతి వెళ్లి వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ చేతుల్లో పడింది.
ఈ నేపథ్యంలో ఆసీస్ అప్పీలు చేయగా ఫీల్డ్ అంపైర్ స్పందించలేదు. దీంతో కంగారూలు రివ్యూకు వెళ్లగా.. చాలాసార్లు రీప్లేలో చూసినా స్పష్టత రాలేదు. స్నీకో మీటర్‌లోనూ బంతి బ్యాట్‌ను లేదంటే గ్లౌవ్‌ను తాకినట్లుగా శబ్దం రాలేదు. అయినప్పటికీ విజువల్ ఎవిడెన్స్ కారణంగా.. ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని థర్డ్ అంపైర్ తారుమారు చేస్తూ.. జైస్వాల్‌ను అవుట్‌గా ప్రకటించారు.
కీలక సమయంలో కీలక వికెట్ కోల్పోయి
ఫలితంగా కీలక సమయంలో కీలక వికెట్ కోల్పోయిన టీమిండియా ఓటమికి బాటలు పడ్డాయి. అయితే, తాను అవుట్ కాలేదని టెక్నాలజీ(స్నీకో) చెబుతున్నా అవుట్‌గా ప్రకటించడం పట్ల జైస్వాల్ అంపైర్ల వద్ద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. అయినప్పటికీ వాళ్లు అతడిని మైదానం వీడాల్సిందిగా కోరగా.. ఈ విషయమై వివాదం చెలరరేగింది.
మండిపడ్డ సన్నీ
ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్‌తో పాటు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా సైతం థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. జైస్వాల్ స్పష్టంగా నాటౌట్ అని తెలుస్తున్నా.. ఆసీస్‌కు అనుకూలంగా ఎలా వ్యవహరిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, సురీందర్ ఖన్నా మాత్రం ఈ విషయంలో భిన్నంగా స్పందించాడు.
నిజాయితీ ఆడటం నేర్చుకోండి
‘‘ఇందులో వివాదం సృష్టించడానికి తావులేదు. నాలుగు కోణాల్లో పరిశీలించిన తర్వాత బంతి బ్యాటర్ గ్లౌవ్‌ను తాకి.. అలెక్స్ క్యారీ చేతుల్లో పడినట్లు తేలింది. ఆకాశ్ దీప్ కూడా ఇలాగే.. తాను క్యాచ్ అవుట్ అయినా.. మైదానం వీడకుండా ఫిర్యాదులు చేస్తూ ఉండిపోయాడు.
వీళ్లంతా అబద్దాల కోరులు. ముందు నిజాయితీ ఆడటం నేర్చుకోండి. అప్పుడే మీరు గెలుస్తారు. అయినా, బ్యాట్ మన చేతుల్లోనే ఉన్నపుడు.. అది బంతిని లేదంటే గ్లౌవ్‌ను తాకిందా లేదా స్పష్టంగా తెలుస్తుంది కదా!
అందుకే ఓడిపోయాం
మనం చెత్తగా ఆడాం కాబట్టే ఓడిపోయాం. ఇంత చెత్తగా ఎవరైనా బ్యాటింగ్ చేస్తారా? రండి వచ్చి ఐపీఎల్‌లో పరుగులు సాధించండి. మరీ దూకుడుగా ఆడితే ఫలితాలు ఇలాగే ఉంటాయి. సానుకూల దృక్పథంతో ఆడండి.
కనీసం కొత్త సంవత్సరంలో అయినా టీమిండియాను అదృష్టం వరిస్తుందో చూడాలి’’ అంటూ సురీందర్ ఖన్నా సంచలన వ్యాఖ్యలు చేశాడు. వార్తా సంస్థ IANSతో మాట్లాడుతూ ఈ మేర వ్యాఖ్యానించాడు.
కాగా ఢిల్లీకి చెందిన సురీందర్ ఖన్నా 1979- 84 మధ్య టీమిండియా తరఫున 10 వన్డేలు ఆడి.. 176 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే.. ఆసీస్- టీమిండియా మధ్య ఆఖరిదైన ఐదో టెస్టు సిడ్నీలో జరుగనుంది. జనవరి 3-7 మధ్య ఈ మ్యాచ్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.
చదవండి: అతడి కోసం పట్టుబట్టిన గంభీర్.. లెక్కచేయని సెలక్టర్లు? త్వరలోనే వేటు?
Comments
Please login to add a commentAdd a comment