ఆస్ట్రేలియాతో రెండో టెస్టు కోసం టీమిండియా సన్నద్ధమవుతోంది. అడిలైడ్ వేదికగా శుక్రవారం నుంచి మొదలుకానున్న పింక్ బాల్ మ్యాచ్ కోసం ప్రాక్టీస్‌లో తలమునకలైంది. ఇక ఈ టెస్టు కోసం రెగ్యులర్ కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ జట్టుతో చేరడంతో.. భారత తుదిజట్టు కూర్పుపై చర్చలు నడుస్తున్నాయి.
రాణించిన రాహుల్
కాగా పితృత్వ సెలవుల కారణంగా రోహిత్ గైర్హాజరైన నేపథ్యంలో.. పెర్త్‌లో ఆసీస్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియాకు జస్‌ప్రీత్ బుమ్రా సారథ్యం వహించాడు. ఈ పేస్ బౌలర్ కెప్టెన్సీల్లో భారత్ కంగారూలను 295 పరుగుల తేడాతో మట్టికరిపించింది. ఇక ఈ విజయంలో.. బ్యాటింగ్ విభాగంలో ఓపెనింగ్ జోడీ యశస్వి జైస్వాల్(161), కేఎల్ రాహుల్(77)లతో పాటు విరాట్ కోహ్లి(100 నాటౌట్) కీలక పాత్ర పోషించారు.
ఓపెనర్‌గా వస్తాడా? లేదంటే
ఇదిలా ఉంటే.. రోహిత్ శర్మ రాకతో కేఎల్ రాహుల్ స్థానం ప్రశ్నార్థకంగా మారింది. అడిలైడ్ టెస్టులో ఈ కర్ణాటక బ్యాటర్ ఓపెనర్‌గా వస్తాడా? లేదంటే మిడిలార్డర్‌లో బరిలోకి దిగుతాడా అన్న సందేహాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం మీడియాతో మాట్లాడిన కేఎల్ రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
తుదిజట్టులో చోటు ఉండాలి కదా!
‘‘ముందుగా నాకు తుదిజట్టులో చోటు దక్కడమే ముఖ్యం. ఇక బ్యాటింగ్ ఆర్డర్‌లో ఎక్కడైనా రావడానికి సిద్ధంగా ఉన్నాను. జట్టు ప్రయోజనాల కోసం ఏ స్థానంలోనైనా ఆడతా. ఓపెనర్‌గా అయినా.. మిడిలార్డర్ బ్యాటర్‌గా అయినా జట్టును గెలిపించేందుకు నా వంతు కృషి చేస్తా.
మొదట్లో కాస్త కష్టంగా ఉండేది..
ఇప్పటి వరకు నా కెరీర్‌లో వేర్వేరు స్థానాల్లో బ్యాటింగ్ చేశాను. మొదట్లో కాస్త కష్టంగా ఉండేది. అయితే, అది కూడా టెక్నిక్ పరంగా కాకుండా.. మానసికంగా కాస్త ఇబ్బందిగా ఉండేది. తొలి 20 -25 బంతుల పాటు కఠినంగా తోచేది.
ఇక ఇప్పటికి చాలాసార్లు నేను టెస్టుల్లో, వన్డేల్లో వేర్వేరు స్థానాల్లో ఆడాను కాబట్టి పరిస్థితిలో కాస్త మార్పు వచ్చింది. ఇప్పుడు ఏ స్థానంలో ఎలా ఆడాలో నాకు స్పష్టత ఉంది. తొలి 30- 40 బంతుల పాటు నిలదొక్కుకోగలిగితే.. ఆ తర్వాత నా రెగ్యులర్ స్టైల్‌లో ముందుకు సాగడం తేలికవుతుంది’’ అని స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ చెప్పుకొచ్చాడు.
విదేశీ గడ్డపై ఐదు
కాగా కేఎల్ రాహుల్ ఇప్పటి వరకు తన కెరీర్లో 54 టెస్టులు ఆడి 3084 పరుగులు చేశాడు. ఇందులో ఎనిమిది శతకాలు ఉండగా.. వీటిలో రెండు సౌతాఫ్రికా, రెండు ఇంగ్లండ్, ఒకటి ఆస్ట్రేలియాలో సాధించినవి. ఇక పెర్త్ టెస్టులోనూ రాహుల్ తొలి ఇన్నింగ్స్‌లో 26 పరుగులే చేసినా.. రెండో ఇన్నింగ్స్‌లో కీలకమైన అర్ధ శతకం(77)తో రాణించాడు.
శుబ్‌మన్ గిల్ కూడా వచ్చేశాడు
ఇదిలా ఉంటే.. రోహిత్ శర్మతో పాటు శుబ్‌మన్ గిల్ కూడా రెండో టెస్టుకు అందుబాటులోకి వచ్చాడు. దీంతో రాహుల్ బ్యాటింగ్ ఆర్డర్ మారటంతో పాటు.. ధ్రువ్ జురెల్‌పై వేటు పడే అవకాశం ఉంది. ఇక బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే.
చదవండి: వినోద్ కాంబ్లీని కలిసిన సచిన్.. చేయి వదలకుండా బిగించడంతో.. ఆఖరికి
Comments
Please login to add a commentAdd a comment