గెలిచి ఇంటికి పాక్‌... సెమీస్‌కు న్యూజిలాండ్‌ | Sri Lanka helps New Zealand to qualify for T20 World Cup semifinals | Sakshi
Sakshi News home page

T20 WC 2026: గెలిచి ఇంటికి పాక్‌... సెమీస్‌కు న్యూజిలాండ్‌

Feb 28 2026 11:03 PM | Updated on Mar 1 2026 3:42 AM

Sri Lanka helps New Zealand to qualify for T20 World Cup semifinals

మెరుగైన రన్‌రేట్‌తో కివీస్‌ ముందంజ 

లంకపై 5 పరుగులతో గట్టెక్కిన పాక్‌ 

ఫర్హాన్‌ శతకం వృథా

పల్లెకెలె: శ్రీలంకతో తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ 212 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది...మ్యాచ్‌ గెలవడం మాత్రమే కాకుండా లంకను 147 పరుగుల వరకే పరిమితం చేసి ఉంటే పాక్‌ సెమీఫైనల్‌కు చేరేది. కానీ తారిఖ్‌ వేసిన 16వ ఓవర్‌ ఐదో బంతికి షనక సింగిల్‌ తీయడంతో లంక స్కోరు 148 పరుగులకు చేరింది. దాంతో పాక్‌ ఆశలు గల్లంతయ్యాయి. ‘గ్రూప్‌ 2’లో పాక్‌కంటే మెరుగైన రన్‌రేట్‌ ఉన్న న్యూజిలాండ్‌ సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. లంకపై మ్యాచ్‌లో చివరకు 5 పరుగుల తేడాతో గెలిచినా పాక్‌ టోర్నీనుంచి నిష్క్రమించింది.  

శనివారం జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీస్కోరు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ సాహిబ్‌జాదా ఫర్హాన్‌ (60 బంతుల్లో 100; 9 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరుపు శతకం సాధించగా, ఫఖర్‌ జమన్‌ (42 బంతుల్లో 84; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) చెలరేగాడు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసి పోరాడి ఓడింది. కెప్టెన్‌ షనక (31 బంతుల్లో 76 నాటౌట్‌; 2 ఫోర్లు, 8 సిక్స్‌లు) విరుచుకుపడగా, పవన్‌ రత్నాయకే (37 బంతుల్లో 58; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించాడు.  

ఫర్హాన్, ఫఖర్‌ ధనాధన్‌ 
టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాక్‌కు ఓపెనర్లు ఫర్హాన్, ఫఖర్‌లు ధనాధన్‌ ఆరంభమిచ్చారు. ఇద్దరు పోటీ పడి బౌండరీలు, సిక్స్‌లు బాదుతూ పాక్‌ స్కోరును వాయువేగంతో పెంచారు. పవర్‌ప్లేలో 64/0 స్కోరు చేసిన పాకిస్తాన్‌... పదో ఓవర్‌ ముగియక ముందే 100కు చేరుకుంది. ఫర్హాన్‌ 32 బంతుల్లో, ఫఖర్‌ 27 బంతుల్లో అర్ధసెంచరీలు సాధించారు. 

ఓవర్‌కు 10 పైచిలుకు రన్‌రేట్‌ నమోదు చేసిన పాక్‌ 14వ ఓవర్లలోనే 150 పరుగుల మార్క్‌ దాటింది. 16వ ఓవర్‌ వేసిన చమీర ఎట్టకేలకు ఫఖర్‌ను బౌల్డ్‌ చేసి 176 పరుగుల ఓపెనింగ్‌ జోడీని విడగొట్టాడు. తర్వాత పాక్‌ వికెట్లు పేకమేడలా కూలాయి. నాఫే (2), షాదాబ్‌ (7), నవాజ్‌ (0), కెప్టెన్ సల్మాన్‌ (0) ఇలా వరుసగా బ్యాటర్లంతా విఫలమయ్యారు. మరో వైపు 59 బంతుల్లో ఫర్హాన్‌ సెంచరీ పూర్తయింది.  

ఆశలు రేపిన షనక 
భారీ లక్ష్యఛేదనలో ఆతిథ్య లంక తడబడింది. నిసాంక (3), మిశార (26), అసలంక (25) వేగంగా ఆడేందుకు యత్నించి వికెట్లు పారేసుకున్నారు. దీంతో విజయానికి ఆమడ దూరంలో నిలిచింది. అయితే రత్నాయకే రాణించగా, కెప్టెన్ షనక అనూహ్యంగా ఆఖరి ఓవర్లో చెలరేగి గెలుపు ఆశలు పెంచాడు. 

6 బంతుల్లో 28 పరుగుల అసాధ్యమైన సమీకరణం ఉండగా... షాహిన్‌ అఫ్రిది చివరి  ఓవర్లో షనక వరుసగా 4, 6, 6, 6లతో 22 పరుగులు పిండుకున్నాడు. ఇక 2 బంతుల్లో 6 పరుగులు చేయాల్సిన తరుణంలో స్టేడియమంతా మునివేళ్లపై నిలబడింది. కానీ ఒత్తిడికి గురైన షనక ఆ రెండు బంతులకు పరుగు తీయలేకపోవడంతో పాక్‌ గెలుపు ఖాయమైంది.  

స్కోరు వివరాలు 
పాకిస్తాన్‌ ఇన్నింగ్స్‌: ఫర్హాన్‌ (సి) లియనాగే (బి) మదుషంక 100; ఫఖర్‌ (బి) చమిర 84; ఖాజా నాఫే (సి) అసలంక (బి) మదుషంక 2; షాదాబ్‌ రనౌట్‌ 7; నవాజ్‌  (సి) తీక్షణ (బి) షనక 0; సల్మాన్‌ (సి) తీక్షణ (బి) షనక 0; ఉస్మాన్‌ నాటౌట్‌ 8; షాహిన్‌ అఫ్రిది (ఎల్బీడబ్ల్యూ) (బి) మదుషంక 4; నసీమ్‌ షా రనౌట్‌ 1; అబ్రార్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 212. వికెట్ల పతనం: 1–176, 2–179, 3–198, 4–199, 5–199, 6–203, 7–207, 8–210. బౌలింగ్‌: మదుషంక 4–0–33–3, చమిర 4–0–48–1, తీక్షణ 4–0–35–0, షనక 4–0–42–2, వెల్లలాగే 3–0–37–0, లియనాగే 1–0–14–0. 

శ్రీలంక ఇన్నింగ్స్‌: నిసాంక (సి) నవాజ్‌ (బి) నసీమ్‌ షా 3; మిశార (బి) అబ్రార్‌ 26; అసలంక (బి) అబ్రార్‌ 25; రత్నాయకె (సి) అయూబ్‌ (బి) అఫ్రిది 58; మెండిస్‌ (బి) అబ్రార్‌ 3; లియనాగే (బి) నవాజ్‌ 5; షనక నాటౌట్‌ 76; వెలలాగే నాటౌట్‌ 2; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 207. వికెట్ల పతనం: 1–8, 2–33, 3–75, 4–94, 5–101, 6–162. బౌలింగ్‌: షాహిన్‌ అఫ్రిది 4–0–48–1, నసీమ్‌ షా 4–0–36–1, అబ్రార్‌ 4–0–23–3, ఉస్మాన్‌ 4–0–43–0, నవాజ్‌ 2–0–21–1, షాదాబ్‌ 2–0–33–0.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement