జైస్వాల్‌ అవుటా? నాటౌటా?.. అంపైర్‌ కళ్లకు ఏమైంది? | Jaiswal Controversial Dismissal MCG: Despite no spike on Snicko Given Out Viral | Sakshi
Sakshi News home page

జైస్వాల్‌ అవుటా? నాటౌటా?.. అంపైర్‌ కళ్లకు ఏమైంది?

Published Mon, Dec 30 2024 11:42 AM | Last Updated on Mon, Dec 30 2024 12:33 PM

Jaiswal Controversial Dismissal MCG: Despite no spike on Snicko Given Out Viral

మెల్‌బోర్న్‌ టెస్టులో టీమిండియా ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ అవుటైన తీరు వివాదాస్పదంగా మారింది. స్నీకో మీటర్‌లో స్పైక్‌ రాకున్నా జైసూను అవుట్‌గా ప్రకటించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంలో భారత బ్యాటర్‌కు అన్యాయం(Yashasvi Jaiswal’s controversial dismissal) జరిగిందంటూ టీమిండియా అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా అంపైర్‌ నిర్ణయంపై మండిపడుతున్నారు.

కాగా బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ(Border- Gavaskar Trophy) ఆడేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లిన టీమిండియా.. మూడు టెస్టులు పూర్తి చేసుకుని ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది. ఈ క్రమంలో మెల్‌బోర్న్‌ వేదికగా గురువారం మొదలైన బాక్సింగ్‌ డే టెస్టు భారత్‌కు కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే రోహిత్‌ సేనకు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌(డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్‌ ఆశలు సజీవంగా ఉంటాయి.

ఆది నుంచే తడ‘బ్యా’టు.. ‘స్టార్లు’ దారుణంగా విఫలం
ఇంతటి కీలక టెస్టులో ఆది నుంచే తడబడ్డ టీమిండియా.. తొలి ఇన్నింగ్స్‌లో జైస్వాల్‌(82) అద్భుత ఇన్నింగ్స్‌.. నితీశ్‌ కుమార్‌ రెడ్డి(114) శతకం వల్ల మ్యాచ్‌లో నిలవగలిగింది. ఇక ఆసీస్‌ను రెండో ఇన్నింగ్స్‌లో 234 పరుగులకే కట్టడి చేసి భారత బౌలర్లు మ్యాచ్‌పై ఆశలు సజీవం చేశారు.

ఈ క్రమంలో ఆసీస్‌ నిర్దేశించిన 340 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో.. మళ్లీ పాత కథే పునరావృతమైంది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(9), కేఎల్‌ రాహుల్‌(0), విరాట్‌ కోహ్లి(5) పూర్తిగా విఫలమయ్యారు. అయితే, ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ ఆది నుంచి క్రీజులో పాతుకుపోయి.. ఆసీస్‌ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు.

పంత్‌ కాసేపు
రిషభ్‌ పంత్‌(Rishabh Pant- 30)తో కలిసి టీమిండియా ఇన్నింగ్స్‌ చక్కదిద్దేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు జైస్వాల్‌. అయితే, మిగతా బ్యాటర్ల నుంచి మాత్రం అతడికి పెద్దగా సహకారం అందలేదు. అయినప్పటికీ పట్టుదలగా నిలబడ్డ జైసూ.. అనూహ్య రీతిలో పెవిలియన్‌ చేరాల్సి వచ్చింది.

నాటౌట్‌ ఇచ్చిన  ఫీల్డ్‌ అంపైర్‌
ఆసీస్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ బౌలింగ్‌లో షార్ట్‌ బాల్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధమైన జైసూ.. షాట్‌ కనెక్ట్‌ చేయడంలో విఫలమయ్యాడు. దీంతో బంతి వెళ్లి వికెట్‌ కీపర్‌ అలెక్స్‌ క్యారీ చేతుల్లో పడింది. అయితే, ఆస్ట్రేలియా అప్పీలు చేసినా ఫీల్డ్‌ అంపైర్‌ నాటౌట్‌ ఇచ్చాడు.

స్పైక్‌ రాలేదు.. అయినా
దీంతో ఆసీస్‌ రివ్యూకు వెళ్లగా.. థర్డ్‌ అంపైర్‌ నిర్ణయం కీలకంగా మారింది. అయితే, బంతి బ్యాట్‌ను లేదంటే గ్లౌవ్‌ను తాకిందా అన్న విషయం స్పష్టంగా కనబడలేదు. అంతేకాదు.. శబ్దాన్ని సూచించే స్నీకో మీటర్‌లోనూ స్పైక్‌ రాలేదు. అయినప్పటికీ తనకు బంతి గ్లౌవ్‌ను తాకినట్లుగా కనిపించిందని పేర్కొంటూ థర్డ్‌ అంపైర్‌ అవుట్‌ ఇచ్చాడు.

ఫీల్డ్‌ అంపైర్‌ నిర్ణయాన్ని తారుమారు చేసి.. జైస్వాల్‌ను అవుట్‌గా ప్రకటించాలని సూచించాడు. దీంతో టీమిండియా కీలక వికెట్‌ కోల్పోయింది. 208 బంతులు ఎదుర్కొని 84 పరుగులు చేసిన జైస్వాల్‌ ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఏడో వికెట్‌గా అతడు వెనుదిరిగాడు.

అయితే, తనను అవుట్‌గా ప్రకటించడం పట్ల జైసూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. అయితే, ఇద్దరు ఫీల్డ్‌ అంపైర్లు అతడిని మైదానం వీడాల్సిందిగా సూచించడంతో నిరాశగా వెనుదిరిగాడు.

అంపైర్‌కు కళ్లు కనిపించడం లేదా?
ఈ నేపథ్యంలో జైస్వాల్‌ అవుటైన తీరుపై విమర్శల వర్షం కురుస్తోంది. టెక్నికల్‌ ఎవిడెన్స్‌ కాకుండా.. కేవలం విజువల్‌ ఎవిడెన్స్‌ ద్వారా.. అది కూడా క్లారిటీ లేకుండా బ్యాటర్‌ను ఎలా అవుట్‌గా పరిగణిస్తారని టీమిండియా ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు. 

అంపైర్‌కు కళ్లు కనిపించడం లేదా అంటూ ఘాటు వ్యాఖ్యలు  చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా 184 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. తద్వారా ఐదు టెస్టుల సిరీస్‌లో 1-2తో వెనుకబడి ఉంది.

చదవండి: వారి మాటలు తప్పని నిరూపించా.. ఇక మిగిలింది అదే: నితీశ్‌ రెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement