టెస్టు క్రికెట్‌లోనూ రాణించగలనని నిరూపించానని టీమిండియా యువ సంచలనం నితీశ్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy) అన్నాడు. విమర్శకులకు ఆటతోనే సమాధానం చెప్పినందుకు సంతోషంగా ఉందన్నాడు. కాగా ఆసీస్‌తో టెస్టు సిరీస్‌లో నితీశ్ కుమార్ రెడ్డికి చోటు దక్కడం చాలా మందికి ఆశ్చర్యానికి గురి చేసింది. టీ20 ఆటగాడు టెస్టుల్లో రాణించగలడా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి.
అయితే, ప్రఖ్యాత మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో తన అద్భుత శతకంతో ఈ ఆంధ్ర ఆటగాడు అందరి అనుమానాలను పటాపంచలు చేశాడు. ఈ ప్రదర్శనతో తన సత్తా ఏమిటో చూపించాడు.
వారి మాటలు తప్పని నిరూపించా
ఈ క్రమంలో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో నితీశ్ మాట్లాడుతూ.. ‘నా ఆట గురించి చాలా మందికి సందేహాలు ఉన్నాయనే విషయం నాకూ తెలుసు.
ఐపీఎల్‌లో రాణించిన ఆటగాడు ఇక్కడ సరిపోతాడా అని అన్నారు. వారి మాటలను తప్పని నిరూపించాలనుకున్నా. ఇప్పుడు అదే చేసి చూపించా. భారత జట్టు కోసం వంద శాతం శ్రమించేందుకు నేను సిద్ధం’ అని వ్యాఖ్యానించాడు.
అదే విధంగా.. సెంచరీ సాధించిన క్షణాలు అపూర్వమని నితీశ్ రెడ్డి గుర్తు చేసుకున్నాడు. కోహ్లి అభినందనలు అందుకోవడం చాలా ఆనందంగా ఉందని అతడు అన్నాడు.
‘అది చాలా గొప్ప క్షణం. కోహ్లి ఆటను చూస్తూ, అభిమానిస్తూ పెరిగిన నేను ఇప్పుడు అతనితో కలిసి ఆడాను. పెర్త్‌లో కోహ్లి సెంచరీ చేసినప్పుడు మరో ఎండ్‌లో నేనున్నాను. నా ప్రదర్శనను కోహ్లి ఎంతో అభినందించి ప్రోత్సహించాడు.
ఇక మిగిలింది అదే
చాలా బాగా ఆడావని చెప్పాడు. ఇలాంటి సమయం గురించే నేను కలలుగన్నాను. నా సెంచరీ పూర్తి చేసుకునేందుకు సహకరించిన సిరాజ్‌కు కృతజ్ఞతలు.
నిజానికి నా శతకంకంటే సిరాజ్ చివరి బంతిని డిఫెన్స్ ఆడినప్పుడే మైదానం దద్దరిల్లింది’ అని నితీశ్ గుర్తు చేసుకున్నాడు. గత కొన్నేళ్లుగా తన బ్యాటింగ్‌ను మెరుగుపర్చుకునేందుకు ఎంతో కష్టపడ్డానని, ఇప్పుడు బౌలింగ్‌లో కూడా పదును పెంచాల్సి ఉందని నితీశ్ చెప్పాడు.
Comments
Please login to add a commentAdd a comment