melbourne Test
-
నా పిల్లలు ఉన్నపుడు ఇలా చేస్తారా?: మండిపడ్డ కోహ్లి
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి సహనం కోల్పోయాడు. తన అనుమతి లేకుండా వీడియో ఎలా తీస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అసలేం జరిగిందంటే.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో భారత స్టార్లు విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా భార్యాపిల్లలతో కలిసి ఆసీస్‌కు చేరుకున్నారు. ఇదిలా ఉంటే.. ఈ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా పెర్త్, అడిలైడ్, బ్రిస్బేన్ మ్యాచ్‌లు ముగియగా.. తదుపరి భారత్- ఆస్ట్రేలియా మెల్బోర్న్లో తలపడనున్నాయి.వామిక, అకాయ్‌ల వీడియో తీశారనిఇందుకోసం కోహ్లి కుటుంబంతో కలిసి మెల్బోర్న్ వినామాశ్రయానికి చేరుకున్నాడు. అయితే, ఆ సమయంలో కొంతమంది మీడియా ప్రతినిధులు కోహ్లితో పాటు అతడి భార్య అనుష్క శర్మ, పిల్లలు వామిక, అకాయ్‌ల వీడియో చిత్రీకరించినట్లు సమాచారం. దీంతో కోపోద్రిక్తుడైన కోహ్లి.. సదరు వ్యక్తుల దగ్గరకు వెళ్లి మరీ గట్టిగా హెచ్చరించాడు.నా పిల్లలు ఉన్నపుడు ఇలా చేస్తారా?అనంతరం మరోసారి మీడియాను ఉద్దేశించి మాట్లాడిన విరాట్ కోహ్లి.. ‘‘నా పిల్లలు ఉన్నపుడు నాకు కాస్త ప్రైవసీ ఇవ్వాలి కదా? నా అనుమతి లేకుండా వాళ్ల ఫొటోలు, వీడియోలు ఎలా తీస్తారు?’’ అని ప్రశ్నించాడు. నిజానికి.. కోహ్లి ఫ్యామిలీతో కలిసి వచ్చేసరికి ఆస్ట్రేలియా పేసర్ స్కాట్ బోలాండ్‌ను కొంత మంది విలేకరులు ఇంటర్వ్యూ చేస్తున్నారు.అయితే, అదే సమయంలో కోహ్లి ఎంట్రీ ఇవ్వడంతో అన్ని కెమెరాలు అతడి వైపు తిరిగాయి. ఇక పిల్లల గురించి హెచ్చరిస్తూ కోహ్లి కాస్త సీరియస్ కావడంతో.. తాము వామిక, అకాయ్‌ల ఫొటోలు, వీడియోలు తీయలేదని వారు సమాధానం ఇచ్చారట. దీంతో శాంతించిన కోహ్లి వారితో కరచాలనం చేసి అక్కడి నుంచి నిష్క్రమించినట్లు తెలుస్తోంది.పెర్త్‌లో సెంచరీ మినహాఇదిలా ఉంటే.. ఆసీస్‌తో పెర్త్ టెస్టులో గెలిచిన టీమిండియా.. అడిలైడ్ పింక్ బాల్ టెస్టులో ఓడింది. దీంతో సిరీస్ 1-1తో సమం కాగా.. బ్రిస్బేన్ టెస్టు ‘డ్రా’గా ముగిసింది. ఈ నేపథ్యంలో మెల్బోర్న్ బాక్సింగ్ డే టెస్టు(డిసెంబరు 26-30) ఇరుజట్లకు మరింత కీలకంగా మారింది. ఇక ఈ సిరీస్‌లో పెర్త్‌లో సెంచరీ చేయడం మినహా కోహ్లి పెద్దగా రాణించలేదు. ఈ క్రమంలో అతడి ఆట తీరుపై విమర్శలు వస్తున్నాయి.చదవండి: నా కుమారుడికి అవమానం జరిగింది.. అశ్విన్ తండ్రి సంచలన ఆరోపణలుIndian cricket superstar Virat Kohli has been involved in a fiery confrontation at Melbourne Airport. @theodrop has the details. https://t.co/5zYfOfGqUb #AUSvIND #7NEWS pic.twitter.com/uXqGzmMAJi— 7NEWS Melbourne (@7NewsMelbourne) December 19, 2024 -
విజయ మధురం
పది రోజుల్లో ఎంత తేడా... అత్యల్ప స్కోరు సాధించిన అవమాన భారంతో తలవంచుకున్న భారత ఆటగాళ్లు ఇప్పుడు సగర్వంగా నిలబడ్డారు. అడిలైడ్ పరాభవం తర్వాత అన్ని ప్రతికూలతలను అధిగమించిన టీమిండియా మెల్బోర్న్లో మెరిసింది. గత ఓటమి బాధను మరచిపోయేలా చేస్తూ అసాధారణ విజయంతో ఏడాదిని ముగించింది. తొలి రోజు నుంచి ఆస్ట్రేలియాపై ఆధిపత్యం ప్రదర్శించిన రహానే సేన చివరి వరకు ఆ పట్టును నిలబెట్టుకుంది. ఫలితంగా ఎప్పటికీ గుర్తుండిపోయే గెలుపుతో సిరీస్‌ను సమం చేసింది. నాలుగో రోజు ఆసీస్ మరో 67 పరుగులు జోడించి ఆలౌట్ కాగా... 70 పరుగుల విజయలక్ష్యాన్ని భారత్ రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. శతకంతో జట్టును నడిపించిన సారథి రహానే విన్నింగ్ షాట్‌తో టీమిండియా బృందంలో ఆనందం వెల్లివిరియగా ఆసీస్ పెవిలియన్‌లో నిశ్శబ్దం వినిపించింది. ఇక కొత్త సంవత్సరంలోనూ ఇదే జోరు సాగించి బోర్డర్–గావస్కర్ ట్రోఫీని నిలబెట్టుకోవడమే భారత్ తక్షణ లక్ష్యం! మెల్బోర్న్: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ను భారత్ 1–1తో సమం చేసింది. మంగళవారం నాలుగో రోజే ముగిసిన రెండో టెస్టులో భారత్ 8 వికెట్ల తేడాతో ఆసీస్‌పై ఘన విజయం సాధించింది. ఓవర్‌నైట్ స్కోరు 133/6తో ఆట కొనసాగించిన ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్‌లో 200 పరుగులకు ఆలౌటైంది. కామెరాన్ గ్రీన్ (146 బంతుల్లో 45; 5 ఫోర్లు) ఇన్నింగ్స్ టాప్ స్కోరర్‌గా నిలవగా, సిరాజ్ 3 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో 131 పరుగుల ఆధిక్యాన్ని మినహాయించి భారత్ ముందు 70 పరుగుల లక్ష్యం నిలిచింది. భారత్ 15.5 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి దీనిని అందుకుంది. శుబ్‌మన్ గిల్ (36 బంతుల్లో 35 నాటౌట్; 7 ఫోర్లు), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అజింక్య రహానే (40 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు) రెండో వికెట్‌కు 51 పరుగులు జోడించి జట్టును విజయతీరం చేర్చారు. ఆస్ట్రేలియాతో ‘సెంచరీ’ టెస్టులో భారత్‌కు విక్టరీ అందించారు. ఇరు జట్ల మధ్య మూడో టెస్టు జనవరి 7 నుంచి సిడ్నీలో జరుగుతుంది. ఆకట్టుకున్న సిరాజ్ ఆసీస్ చివరి వరుస బ్యాట్స్‌మన్ అంత సులభంగా లొంగలేదు. మిగిలిన నాలుగు వికెట్లు తీసేందుకు భారత్‌కు 37.1 ఓవర్లు పట్టాయి. గ్రీన్, కమిన్స్ (103 బంతుల్లో 22; ఫోర్) కలిసి పోరాడుతూ ఏడో వికెట్‌కు అర్ధ సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఎట్టకేలకు ఒక షార్ట్ బంతితో కమిన్స్‌ను అవుట్ చేసి బుమ్రా ఈ జోడీని విడదీశాడు. కొద్ది సేపటికి సిరాజ్ బౌలింగ్‌లో పుల్ షాట్‌కు ప్రయత్నించిన గ్రీన్... జడేజా చక్కటి క్యాచ్‌కు వెనుదిరిగాడు. ఆ తర్వాత లయన్ (15 బంతుల్లో 3)ను సిరాజ్ అవుట్ చేయగా, హాజల్‌వుడ్ (21 బంతుల్లో 10)ను బౌల్డ్ చేసిన అశ్విన్ ఆసీస్ ఆట ముగించాడు. పుజారా నిరాశ లక్ష్యం చిన్నదే అయినా 19 పరుగుల వద్దే జట్టు రెండు వికెట్లు కోల్పోవడం కొంత ఆందోళన రేపింది. మయాంక్ అగర్వాల్ (5) మరోసారి విఫలమవ్వగా, పుజారా (3) కూడా పేలవ షాట్ ఆడి గల్లీలో క్యాచ్ ఇచ్చాడు. తన సహజ ధోరణికి భిన్నంగా పుజారా కాలితో గ్రౌండ్‌ను తన్ని, ఆపై బౌండరీ వద్ద ప్రకటనల హోర్డింగ్‌ను కూడా బ్యాట్‌తో కొట్టి తన అసహనాన్ని ప్రదర్శించాడు! అయితే ఆ తర్వాత గిల్, రహానే ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. వీరిద్దరు వరుస బౌండరీలతో చకచకా పరుగులు సాధించారు. చివరకు లయన్ బౌలింగ్‌లో బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్ దిశగా పుల్ షాట్ ఆడి సింగిల్ తీయడంతో భారత్ గెలుపు పూర్తయింది. ఆస్ట్రేలియాపై మరో దెబ్బ! అసలే ఓటమి భారంతో ఉన్న ఆసీస్‌కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) షాక్ ఇచ్చింది. స్లో ఓవర్ రేట్ కారణంగా ఆ జట్టు మ్యాచ్ ఫీజులో 40 శాతం జరిమానా విధించడంతో పాటు కీలకమైన నాలుగు ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్ పాయింట్లను కూడా తగ్గించింది. నిర్ణీత సమయంకంటే ఆస్ట్రేలియా 2 ఓవర్లు ఆలస్యంగా వేసింది. నిబంధనల ప్రకారం ఒక్కో ఓవర్‌కు మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానాతో పాటు రెండు పాయింట్ల చొప్పున కోత విధిస్తారు. ఆసీస్ దిగ్గజం డేవిడ్ బూన్ ఈ మ్యాచ్ రిఫరీ కావడం విశేషం! సిడ్నీలోనే మూడో టెస్టు భారత్, ఆస్ట్రేలియా మధ్య షెడ్యూల్ ప్రకారం జనవరి 7 నుంచి సిడ్నీలోనే మూడో టెస్టు జరుగుతుంది. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (సీఏ) అధికారికంగా ప్రకటించింది. న్యూసౌత్‌వేల్స్ రాష్ట్రంలో కోవిడ్–19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మ్యాచ్ వేదికను సిడ్నీ నుంచి మార్చవచ్చని, అవసరమైతే మెల్‌బోర్న్‌లోనే మూడో టెస్టు జరపాలని ఇప్పటి వరకు ప్రతిపాదనలు వచ్చాయి. సిడ్నీలో మంగళవారం మూడు కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే కొన్ని షరతులతో టెస్టును నిర్వహించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. కట్టుదిట్టమైన కోవిడ్–19 ఆంక్షల నేపథ్యంలో ఆటగాళ్లు సిడ్నీకి ప్రయాణించనున్నారు. ► మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో భారత్ సాధించిన టెస్టు విజయాల సంఖ్య. విదేశీ గడ్డపై భారత్ అత్యధిక విజయాలు అందుకున్న వేదికగా ఎంసీజీ అవతరించింది. క్వీన్స్‌పార్క్ ఓవల్ (ట్రినిడాడ్), సబీనా పార్క్ (జమైకా), సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ (కొలంబో) మైదానాల్లో భారత్ మూడేసి టెస్టుల్లో గెలిచింది. ఇంగ్లండ్, భారత్ మాత్రమే ఎంసీజీలో నాలుగు అంతకంటే ఎక్కువ టెస్టుల్లో ఆస్ట్రేలియాపై గెలిచాయి. ► అజింక్య రహానే సెంచరీ చేసిన టెస్టు మ్యాచ్‌ల్లో భారత జట్టు ఇప్పటివరకు ఓడిపోలేదు. రహానే 12 సెంచరీలు చేయగా... 8 టెస్టుల్లో భారత్ గెలిచింది (వీటిలో ఓ టెస్టులో అతను రెండు సెంచరీలు చేశాడు). మరో మూడు టెస్టులను ‘డ్రా’గా ముగించింది. ► ఆస్ట్రేలియా గడ్డపై టాస్ ఓడిపోయి టెస్టు మ్యాచ్‌లో గెలుపొందడం 2003 తర్వాత భారత్‌కిదే తొలిసారి. 2003లో అడిలైడ్ టెస్టులో భారత్ ఈ తరహా లోనే గెలిచింది. విదేశీ గడ్డపై మాత్రం 2010 తర్వాత భారత్‌కు ఇలాంటి విజయం దక్కింది. 2010లో శ్రీలంకతో జరిగిన టెస్టులోనూ భారత్ టాస్ ఓడాక గెలుపు రుచి చూసింది. ► ఆస్ట్రేలియా గడ్డపై సిరీస్‌లోని తొలి టెస్టులో ఓడిపోయి రెండో టెస్టులో గెలిచి సిరీస్‌ను 1–1తో సమం చేసిన మూడో జట్టుగా భారత్ నిలిచింది. గతంలో వెస్టిండీస్ (1975–76 సీజన్); న్యూజిలాండ్ (2011లో) ఇలా చేశాయి. ► వరుసగా రెండు పర్యటనల్లో ఎంసీజీ మైదానంలో రెండు వరుస టెస్టులు నెగ్గడం భారత్‌కిది రెండోసారి. 1977, 1980లలో ఇలా నెగ్గిన భారత్ 2018, 2020లో పునరావృతం చేసింది. ► స్వదేశంలో జరిగిన ఓ టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ ఒక్కరు కూడా కనీసం అర్ధ సెంచరీ చేయకపోవడం 32 ఏళ్ల తర్వాత జరిగింది. చివరిసారి 1988లో డిసెంబరు 24 నుంచి 29 వరకు ఎంసీజీ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ ఎవరూ అర్ధ సెంచరీ చేయలేకపోయారు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 285 పరుగుల తేడాతో ఓడిపోయింది. ► లసిత్ మలింగ (శ్రీలంక; 6/92; 2004లో) తర్వాత గత 50 ఏళ్లలో ఆస్ట్రేలియా గడ్డపై అరంగేట్రం చేసిన టెస్టులో అత్యుత్తమ ప్రదర్శన చేసిన రెండో బౌలర్‌గా సిరాజ్ (5/77) నిలిచాడు. సిరాజ్‌తోపాటు గతంలో ఫిల్ డిఫ్రిటాస్ (ఇంగ్లండ్; 5/94; 1986లో), అలెక్స్ ట్యూడర్ (ఇంగ్లండ్; 5/108; 1998లో) కూడా ఆస్ట్రేలియాలో తమ అరంగేట్రం టెస్టులో ఐదు వికెట్లు తీశారు. గర్వంగా ఉంది: రహానే మా ఆటగాళ్ల ప్రదర్శన పట్ల గర్వంగా ఉన్నా. ముఖ్యంగా కొత్త కుర్రాళ్లు సిరాజ్, గిల్ చూపిన పట్టుదలను ఎంత ప్రశంసించినా తక్కువే. సాధారణంగా అరంగేట్ర ఆటగాళ్లు అత్యుత్సాహంతో తమపై నియంత్రణ కోల్పోతారు. కానీ నాలుగైదేళ్ల ఫస్ట్ క్లాస్ క్రికెట్ అనుభవం ఉన్న వీరిద్దరు అలాంటి అవకాశం ఇవ్వలేదు. దాంతో కెప్టెన్ పని సులువైంది. తొలి రోజు పదో ఓవర్లోనే బౌలింగ్‌కు దిగి అశ్విన్ ఆసీస్‌పై ఒత్తిడి పెంచాడు. ఐదుగురు బౌలర్ల వ్యూహం బాగా పని చేసింది. ఆల్‌రౌండర్‌గా జడేజా తన విలువ చూపించాడు. అడిలైడ్‌లో ఒక్క గంటలో మ్యాచ్ చేజారింది. అయితే దాని నుంచి పాఠాలు నేర్చుకున్నాం. ఆ ఓటమి గురించే ఆలోచిస్తూ ఉంటే ముందుకు వెళ్లలేకపోయాం. మేం అలా చేయలేదు. మరింత పట్టుదలతో, దూకుడుతో ఇక్కడ బరిలోకి దిగాలని అనుకున్నాం. ప్రతీ ఒక్కరు వ్యక్తిగతంగా రాణిస్తే ఫలితం రాబట్టగలమని తెలుసు. –అజింక్య రహానే, భారత కెప్టెన్ స్కోరు వివరాలు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 195; భారత్ తొలి ఇన్నింగ్స్ 326; ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: వేడ్ (ఎల్బీ) (బి) జడేజా 40, బర్న్స్ (సి) పంత్ (బి) ఉమేశ్ 4, లబ్‌షేన్ (సి) రహానే (బి) అశ్విన్ 28, స్మిత్ (బి) బుమ్రా 8, హెడ్ (సి) మయాంక్ (బి) సిరాజ్ 17, గ్రీన్ (సి) జడేజా (బి) సిరాజ్ 45, పైన్ (సి) పంత్ (బి) జడేజా 1, కమిన్స్ (సి) మయాంక్ (బి) బుమ్రా 22, స్టార్క్ (నాటౌట్) 14, లయన్ (సి) పంత్ (బి) సిరాజ్ 3, హాజల్‌వుడ్ (బి) అశ్విన్ 10, ఎక్స్‌ట్రాలు 8, మొత్తం (103.1 ఓవర్లలో ఆలౌట్) 200. వికెట్ల పతనం: 1–4, 2–42, 3–71, 4–98, 5–98, 6–99, 7–156, 8–177, 9–185, 10–200. బౌలింగ్: బుమ్రా 27–6–54–2, ఉమేశ్ యాదవ్ 3.3–0–5–1, సిరాజ్ 21.3–4–37–3, అశ్విన్ 37.1–6–71–2, రవీంద్ర జడేజా 14–5–28–2. భారత్ రెండో ఇన్నింగ్స్: మయాంక్ (సి) పైన్ (బి) స్టార్క్ 5, గిల్ (నాటౌట్) 35, పుజారా (సి) గ్రీన్ (బి) కమిన్స్ 3, రహానే (నాటౌట్) 27, ఎక్స్‌ట్రాలు 0, మొత్తం (15.5 ఓవర్లలో 2 వికెట్లకు) 70. వికెట్ల పతనం: 1–16, 2–19. బౌలింగ్: స్టార్క్ 4–0–20–1, కమిన్స్ 5–0–22–1, హాజల్‌వుడ్ 3–1–14–0, లయన్ 2.5–0–5–0, లబ్‌షేన్ 1–0–9–0. -
నాయకుడు నడిపించాడు
టీమిండియాదే జోరు! తొలి రోజు బౌలింగ్‌తో ప్రత్యర్థిని పడగొట్టింది. రెండో రోజు బ్యాటింగ్‌లో నిలిచింది. ఇలా ‘బాక్సింగ్ డే’ టెస్టులో రెండు రోజులు ఆతిథ్య జట్టుపై ఆధిపత్యం చాటింది. నాయకుడు అజింక్య రహానే భారత తొలి ఇన్నింగ్స్‌ను నడిపించాడు. అజేయ సెంచరీతో నిలబడ్డాడు. విహారి, రిషభ్ పంత్, రవీంద్ర జడేజాలతో విలువైన భాగస్వామ్యాలు జోడించాడు. ఇన్నింగ్స్‌కు మూలస్తంభంలా నిలుచున్నాడు. సారథి వీరోచిత పోరాటానికి మూడు సెషన్ల పాటు 80.3 ఓవర్లు బౌలింగ్ చేసిన ఆస్ట్రేలియా కేవలం 4 వికెట్లతోనే సరిపెట్టుకుంది. మెల్బోర్న్: ఈ మ్యాచ్‌కు ముందు భారత శిబిరంలో ఒకటే ఆందోళన. కోహ్లి లేడు. షమీ గాయపడ్డాడు. సిరీస్‌లో 0–1తో వెనుకబాటు. ఇన్ని ప్రతికూలతలతో బరిలోకి దిగిన భారత్ రెండు రోజులు గడిచేసరికి ఆధిక్యంలోకి వచ్చేసింది. రెండో రోజు భారత బ్యాట్స్‌మెన్ తమ బౌలర్ల శ్రమకు తగిన ప్రదర్శన ఇచ్చారు. విలువైన పరుగులు జతచేసి... దీటైన భాగస్వామ్యాలు నెలకొల్పారు. ముఖ్యంగా కెప్టెన్ అజింక్య రహానే అద్భుత ఇన్నింగ్స్ రెండో రోజును కూడా మన రోజుగా మార్చింది. ఈ తాత్కాలిక సారథి (200 బంతుల్లో 104 బ్యాటింగ్; 12 ఫోర్లు) అజేయ శతకం సాధించగా... శుబ్‌మన్ గిల్ (65 బంతుల్లో 45; 8 ఫోర్లు), రవీంద్ర జడేజా (104 బంతుల్లో 40 బ్యాటింగ్; 1 ఫోర్) ఆస్ట్రేలియా బౌలర్లపై సత్తా చాటుకున్నారు. ఆట నిలిచే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 91.3 ఓవర్లలో 5 వికెట్లకు 277 పరుగులు చేసింది. వర్షంవల్ల రెండో రోజు ఆటను కాస్త ముందుగా నిలిపేశారు. ప్రస్తుతం భారత్ 82 పరుగుల ఆధిక్యంలో ఉంది. బ్యాటింగ్ అదిరింది భారత బ్యాట్స్‌మెన్ ఆదివారం ఆస్ట్రేలియా బౌలర్లపై అదరగొట్టారు. తొలి సెషన్ కాస్త కలవర పెట్టినా... రెండు, మూడు సెషన్లు పూర్తిగా బ్యాటింగ్ ప్రతాపంతోనే సాగింది. ఓవర్‌నైట్ స్కోరు 36/1తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత్‌ను గిల్, పుజారా కాసేపు నడిపించారు. తొలిటెస్టు ఆడుతున్న గిల్ అర్ధసెంచరీకి చేరువవుతుండగా కమిన్స్ బంతి అతన్ని పెవిలియన్ చేర్చింది. అలా జట్టు స్కోరు 61 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. మరో 3 పరుగులు జతయ్యాక కమిన్స్ తన మరుసటి ఓవర్లోనే పుజారా (70 బంతుల్లో 17; 1 ఫోర్)ను పెవిలియన్ చేర్చాడు. బుల్లెట్లా దూసుకొచ్చిన బంతి అతని బ్యాట్ అంచును తాకుతూ అంతే వేగంగా వెళ్తుండగా... కీపర్ పైన్ కుడివైపునకు డైవ్ చేసి ఒంటిచేత్తో అందుకున్నాడు. 90/3 స్కోరు వద్ద తొలి సెషన్ ముగిసింది. లంచ్ బ్రేక్ తర్వాత రహానేతో కలిసి కుదురుగా ఆడుతున్న ఆంధ్ర క్రికెటర్ హనుమ విహారి (66 బంతుల్లో 21; 2 ఫోర్లు) క్రీజులో పాతుకుపోయే ప్రయత్నం చేశాడు. అయితే జట్టు స్కోరు వంద పరుగులు దాటాక విహారిని లయన్ బోల్తా కొట్టించాడు. దీంతో 52 పరుగుల నాలుగో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత రహానేకు రిషభ్ పంత్ జతయ్యాడు. ఈ జోడి కూడా ఆసీస్ బౌలింగ్‌ను చక్కగా ఎదుర్కొంది. ఐదో వికెట్‌కు 57 పరుగులు జోడించాక పంత్ ఔటయ్యాడు. రహానే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. 189/5 స్కోరు వద్ద ఇరు జట్లు టీ బ్రేక్‌కు వెళ్లాయి. రహానే వీరోచితం రహానే, జడేజా ఆఖరి సెషన్‌ను జాగ్రత్తగా ఆడారు. ముఖ్యంగా తన వికెట్ విలువ, తర్వాత ఎదురయ్యే కొత్త బంతి కష్టాలు గుర్తుంచుకొని కెప్టెన్ రహానే రక్షణాత్మక ధోరణి కనబరిచాడు. జడేజా కూడా బాధ్యత పంచుకోవడంతో వీరిద్దరి సమన్వయం ఆస్ట్రేలియాను కంగారు పెట్టించింది. రహానే గతి తప్పిన బంతుల్ని బౌండరీకి తరలిస్తూ, జట్టు స్కోరు బోర్డును కదిలించాడు. దీంతో పాటు ఆసీస్ ఫీల్డింగ్ లోపాలు అతనికి రెండు సార్లు లైఫ్‌నిచ్చాయి. వీటిని సద్వినియోగం చేసుకున్న రహానే టెస్టుల్లో 12వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో అతనికిది రెండో శతకం. రహానే, జడేజా అబే ధ్యమైన భాగస్వామ్యం ఆసీస్ బౌలర్లను నీరుగార్చింది. ఆట ముగిసే సమయానికి అజేయమైన ఆరో వికెట్‌కు వీరిద్దరు 104 పరుగులు జోడించారు. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 195; భారత్ తొలి ఇన్నింగ్స్: మయాంక్ (ఎల్బీడబ్ల్యూ) (బి) స్టార్క్ 0; శుబ్‌మన్ గిల్ (సి) పైన్ (బి) కమిన్స్ 45; పుజారా (సి) పైన్ (బి) కమిన్స్ 17; రహానే (బ్యాటింగ్) 104; విహారి (సి) స్మిత్ (బి) లయన్ 21; రిషభ్ పంత్ (సి) పైన్ (బి) స్టార్క్ 29; జడేజా (బ్యాటింగ్) 40; ఎక్స్‌ట్రాలు 21; మొత్తం (91.3 ఓవర్లలో 5 వికెట్లకు) 277. వికెట్ల పతనం: 1–0, 2–61, 3–64, 4–116, 5–173. బౌలింగ్: స్టార్క్ 18.3–3–61–2, ప్యాట్ కమిన్స్ 22–7–71–2, హజల్‌వుడ్ 21–6–44–0, నాథన్ లయన్ 18–2–52–1, కామెరాన్ గ్రీన్ 12–1–31–0. కొత్త బంతి పట్టుజారే! కొత్త బంతితో ఆట పరిస్థితి మారుతుంది. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఆసీస్‌లాంటి బౌన్సీ వికెట్లపై ఆసీస్ బౌలర్ల పట్టు మామూలుగా ఉండదు. ఎంతటి బ్యాటింగ్ ధీరుడినైనా మట్టికరిపిస్తారు. రెండో రోజు భారత బ్యాట్స్‌మెన్ అలాంటి గతి నుంచి బయటపడ్డారు. కొత్త బంతి తీసుకోగానే ఆసీస్ చేతికొచ్చిన అవకాశాన్ని రెండో స్లిప్‌లో ఉన్న స్మిత్ జారవిడిచాడు. 81వ ఓవర్లో కొత్త బంతిని అందుకున్న స్టార్క్ నిప్పులు చెరిగేందుకు సిద్ధమయ్యాడు. రహానే క్యాచ్‌ను చేజార్చిన ట్రావిస్ హెడ్ మూడో బంతి రహానేపైకి బుల్లెట్ వేగంతో దూసుకొచ్చింది. బ్యాట్ అంచును తాకుతూ స్మిత్ చేతుల్లోకి వెళ్లగా దాన్ని నేలపాలు చేశాడు. దీంతో 73 పరుగుల వద్ద లైఫ్ పొందిన రహానే కొత్తబంతితో ఇంకాస్త జాగ్రత్తగా ఆడి సెంచరీ సాధించాడు. శతకం పూర్తయ్యాక అవుట్ చేసే అవకాశం మళ్లీ స్టార్క్‌కు దక్కింది. 92వ ఓవర్ మూడో బంతిని రహానే షాట్ ఆడాడు. కానీ గాల్లోకి లేచిన ఆ బంతిని బ్యాక్వర్డ్ పాయింట్లో ట్రావిస్ హెడ్ జారవిడిచారు. అంతకుముందు కమిన్స్ (56వ ఓవర్) బౌలింగ్‌లో రిషభ్ పంత్ క్యాచ్‌ను గ్రీన్ నేలపాలు చేశాడు. ఇది చాలదు సుమా! ఇప్పటికైతే ఆధిక్యంలో ఉన్నా... అది ఆసీస్ ముందు ఏమాత్రం చాలదు. పైగా బ్యాటింగ్ ఆర్డర్లో తదుపరి స్పెషలిస్టు బ్యాట్స్‌మెనే లేడు. మిగిలున్న వారిలో ఒక్క అశ్విన్ మాత్రం ఆడగలడు. ఆ తర్వాత ఇంకెవరినీ ఆసీస్ పేస్ బౌలర్లు కాసేపైనా నిలువనీయరు. కాబట్టి మూడో రోజు ఆట ఆతిథ్య జట్టుకన్నా భారత్‌కే కీలకం. తొలి సెషన్ అంతా రహానే–జడేజా భాగస్వామ్యాన్ని కాపాడుకోవాలి. కనీసం రెండో సెషన్ వరకైనా మన ఇన్నింగ్స్ కొనసాగితే 250 పైచిలుకు పరుగుల ఆధిక్యాన్ని పెంచుకోవచ్చు. తద్వారా నాలుగో రోజు ఆసీస్‌పై ఒత్తిడి పెంచేందుకు... ఐదో రోజు ఆత్మవిశ్వాసంతో ఆడేందుకు భారత్‌కు అవకాశముంటుంది. ►రిషభ్ పంత్ వికెట్ తీయడం ద్వారా టెస్టుల్లో 250 వికెట్లు పూర్తి చేసుకున్న తొమ్మిదో ఆస్ట్రేలియా బౌలర్‌గా స్టార్క్ గుర్తింపు పొందాడు. స్టార్క్ 59 టెస్టుల్లో ఈ ఘనత సాధించాడు. ఈ జాబితాలో షేన్ వార్న్ (708 వికెట్లు), మెక్‌గ్రాత్ (563), లయన్ (392), డెన్నిస్ లిల్లీ (355), మిచెల్ జాన్సన్ (313), బ్రెట్ లీ (310), మెక్‌డెర్మట్ (291), గిలెస్పీ (259 వికెట్లు) ముందున్నారు. 9 ►ఈ మ్యాచ్‌లో శతకం చేయడం ద్వారా ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సెంచరీ చేసిన ఐదో భారత కెప్టెన్‌గా రహానే గుర్తింపు పొందాడు. గతంలో అజహరుద్దీన్ (106; అడిలైడ్‌లో 1992), సచిన్ టెండూల్కర్ (116; మెల్బోర్న్లో 1999), సౌరవ్ గంగూలీ (144; బ్రిస్బేన్‌లో 2003), కోహ్లి (115, 141; అడిలైడ్‌లో 2014లో; 147; సిడ్నీలో 2015; 123; పెర్త్‌లో 2018) ఈ ఘనత సాధించారు. ►మెల్బోర్న్ వేదికగా ‘బాక్సింగ్ డే’ టెస్టులో రెండు సెంచరీలు చేసిన తొలి విదేశీ క్రికెటర్‌గా రహానే ఘనత వహించాడు. 2014లో ఇదే మైదానంలో రహానే 147 పరుగులు చేశాడు. -
రహానే సూపర్ సెంచరీ.. ఆధిక్యంలో టీమిండియా
మెల్బోర్న్ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ అజింక్యా రహానే సెంచరీతో అదరగొట్టాడు.195 బంతులాడి 11 ఫోర్ల సాయంతో 100 పరుగులు సాధించిన రహానే తన టెస్టు కెరీర్లో 12వ శతకాన్ని నమోదు చేశాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 5 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. ప్రస్తుతం టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 82 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. రహానే 104, జడేజా 40 పరుగులతో క్రీజులో ఉన్నారు. (చదవండి : 'గెట్ అవుట్ మ్యాన్' అంటూ పాక్ క్రికెటర్ అసహనం) కాగా 36/1 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత జట్టులో ఓపెనర్ గిల్ కొన్ని మంచి షాట్లు ఆడాడు. హాఫ్ సెంచరీకి చేరువవుతున్న క్రమంలో కమిన్స్ వేసిన బంతిని అంచనా వేయడంలో పొరబడ్డ గిల్ కీపర్ పైన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 61 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. కాసేపటికే 17 పరుగులు చేసిన చతేశ్వర్ పుజారా కూడా కమిన్స్ బౌలింగ్‌లో పైన్ అద్భుత క్యాచ్‌కు వెనుదిరిగాల్సి వచ్చింది .దీంతో టీమిండియా 64 పరుగుల వద్ద ప్రధాన వికెట్‌ను కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన విహారితో కలిసి రహానే మరోవికెట్ పడకుండా ఆడుతూ 3 వికెట్ల నష్టానికి 90 పరుగుల వద్ద లంచ్ విరామానికి వెళ్లారు. లంచ్ అనంతరం 21 పరుగులు చేసిన హనుమ విహారి లయన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. తర్వాత వచ్చిన పంత్ రహానేకు సహకరిస్తూ మంచి టచ్‌లో కనిపించినా.. 29 పరుగులు చేసి స్టార్క్ బౌలింగ్‌లో పైన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో టీమిండియా 173 పరుగుల వద్ద 5వ వికెట్ కోల్పయింది. టీ విరామం అనంతరం మ్యాచ్‌కు కొద్దిసేపు వర్షం అంతరాయం కలిగించింది. అనంతరం మ్యాచ్ ప్రారంభం కాగా రహానే, జడేజా మరో వికెట్ పడకుండా ఆచితూచి ఆడుతూ స్కోరును పెంచే ప్రయత్నం చేశారు. ఆసీస్ బౌలర్లలో కమిన్స్, స్టార్క్ చెరో రెండు వికెట్లు తీయగా.. లయన్ 1 వికెట్ తీశాడు.(చదవండి : రహానే కెప్టెన్సీ భేష్..) -
సిరాజ్... ఇప్పుడే వద్దులే!
మెల్బోర్న్ : మొహమ్మద్ సిరాజ్ తొలి రోజు ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తొలి సెషన్లో ఒక్క ఓవర్ కూడా వేయని అతను లంచ్ నుంచి రాగానే బంతిని అందుకున్నాడు. ఆరంభంలో లయ అందుకోవడానికి కొంత సమయం తీసుకున్న సిరాజ్ తన మొదటి స్పెల్‌ను 6–0–24–0తో ముగించాడు. అయితే కెప్టెన్ రహానే నమ్మకాన్ని నిలబెడుతూ టీ విరామానికి ముందు లబుషేన్‌ను, బ్రేక్ తర్వాత గ్రీన్‌ను అతను అవుట్ చేశాడు. సహచర అరంగేట్ర ఆటగాడు గిల్ పట్టిన క్యాచ్‌తో తొలి వికెట్ దక్కగా... పదునైన ఇన్‌స్వింగర్‌కు గ్రీన్ వికెట్ల ముందు దొరికిపోయాడు. (చదవండి : రెండో టెస్టు: హో విల్సన్, ఇది చీటింగ్!) సిరాజ్ రెండో స్పెల్ 9–4–16–2 కావడం విశేషం. అతను రెండు క్యాచ్‌లు కూడా అందుకున్నాడు. ఆసీస్ చివరి వికెట్ అయిన కమిన్స్ ఇచ్చిన క్యాచ్‌ను లాంగాన్ బౌండరీ వద్ద అందుకున్న సిరాజ్... ఇన్నింగ్స్ ముగియడంతో తన తొలి టెస్టు జ్ఞాపికగా బంతిని అప్పుడే తన వద్ద ఉంచుకునేందుకు ప్రయత్నించాడు. అయితే అంపైర్ ఆక్సెన్‌ఫోర్డ్ దీనిని వారిస్తూ బంతిని వెనక్కి తీసుకున్నాడు. బహుశా మ్యాచ్ ముగిసిన తర్వాత ఇవ్వవచ్చేమో! (చదవండి : క్యాచ్ మిస్ అనుకున్నాం.. కానీ జడేజా పట్టేశాడు) -
రెండో టెస్టు: హో విల్సన్, ఇది చీటింగ్!
మెల్బోర్న్: మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు 195 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ డకౌట్‌గా వెనుదిరిగాడు. శుభ్‌మన్ గిల్ (38 బంతుల్లో 28; 5 ఫోర్లు), చతేశ్వర్ పుజారా (23 బంతుల్లో 7, 1 ఫోర్) క్రీజులో ఉన్నారు. మొదటిరోజు ఆటముగిసే సమయానికి భారత్ స్కోరు ఒక వికెట్‌కు 36 పరుగులు. కాగా, ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో భారత బౌలర్ల హవా సాగింది. బుమ్రా నాలుగు వికెట్లతో చెలరేగాడు. అశ్విన్ మూడు వికెట్లు, మహ్మద్ సిరాజ్ 2, జడేజా 1 వికెట్ సాధించారు. ఇక ఆసీస్ బ్యాటింగ్ చేసే సమయంలో థర్డ్ నిర్ణయాలు రెండు సార్లు టీమిండియాకు వ్యతిరేకంగా రావడం పట్ల అభిమానులు సోషల్ మీడియా వేదికంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. తన తొలి టెస్టు వికెట్‌గా మార్నస్ లబుషేన్‌ను ఔట్ చేసి జోరు మీదున్న సిరాజ్ చక్కని బంతులతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టాడు. ఆ క్రమంలోనే ఆట 50 వ ఓవర్లో ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్‌ను ఓ అద్భుతమైన బంతితో ఎల్బీగా ఔటయ్యే ప్రయత్నం చేశాడు. అయితే, సిరాజ్ అప్పీల్‌ను అంపైర్ పట్టించుకోకపోవడంతో.. టీమిండియా కెప్టెన్ రహనే డీఆర్ఎస్ కోరాడు. రీప్లేలో బంతి లెగ్‌సైడ్ వైపుగా వెళ్తున్నట్టుగా తేలడంతో థర్డ్ అంపైర్ పాల్ విల్సన్ నిర్ణయం ఫీల్డ్ అంపైర్‌కే వదిలేశాడు. అలా టిమ్ బతికిపోయాడు. ఆట 55 వ ఓవర్లోనూ అతను మరోసారి సేవ్ అయ్యాడు. అశ్విన్ వేసిన బంతిని మిడాఫ్‌లోకి షాట్ ఆడిన కామెరూన్ గ్రీన్ పరుగుకోసం యత్నించాడు.. పరుగు పూర్తవుతుందా లేదా అనే సందిగ్గంలోనే టిమ్ రన్ తీశాడు. (చదవండి: అతనికి అరుదైన గౌరవం.. ఇది రహానేకే సాధ్యం) అయితే, కీపర్ పంత్‌కు బంతి చేరడం, అతను వికెట్లను గిరాటేయడం చకచకా జరిగిపోయాయి. కానీ, టిమ్ క్రీజుకు చేరుకున్నాడా లేదా అనే విషయమై కొంత అస్పష్టత ఉండటంతో థర్డ్ అంపైర్ విల్సన్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద టిమ్‌ను నాటౌట్‌గా ప్రకటించాడు. దాంతో టిమ్ మరోసారి బతికిపోయాడు. దీంతో థర్డ్ అంపైర్ పాల్ విల్సన్‌పై భారత క్రికెట్ అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. అతను పక్షపాతంగా వ్యవరించాడని ఆరోపిస్తున్నారు. టిమ్ బ్యాట్ క్రీజు లైన్‌ను క్రాస్ చేయలేదని చెప్తున్నారు. విజువల్స్ అంత బాగా కనిపిస్తుంటే చూడరా అని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు రెండు లైఫ్‌లు వచ్చినప్పటికీ టిమ్ వాటిని వినియోగించుకోలేదు. 38 బంతుల్లో రెండు ఫోర్ల సాయంతో 13 పరుగులు చేసిన టిమ్ అశ్విన్ బౌలింగ్‌లో విహారికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. (చదవండి: క్యాచ్ మిస్ అనుకున్నాం.. కానీ జడేజా పట్టేశాడు) Just like with sledging, Australians decide where the line is. In a just world, Tim Paine would have been run out for 6.#AUSvIND pic.twitter.com/S3n0f6svoT — Aditya (@forwardshortleg) December 26, 2020 -
మైండ్‌గేమ్ ఆడనివ్వండి.. మేం మాత్రం: రహానే
సిడ్నీ: ఆసీస్ క్రికెటర్లు మైండ్ గేమ్ ఆడటంలో దిట్ట అని, అయితే వారి ఆటలు తన ముందు సాగవని టీమిండియా కెప్టెన్(తాత్కాలిక) అజింక్య రహానే అన్నాడు. మ్యాచ్‌పై దృష్టి సారించి సమిష్టిగా రాణించేలా జట్టును ముందుండి నడిపించడమే తన ముందున్న లక్ష్యమని పేర్కొన్నాడు. కాగా పింక్‌బాల్ టెస్టులో కోహ్లి ఓటమి పాలైన విషయం తెలిసిందే. కేవలం 36 పరుగులకే రెండో ఇన్నింగ్స్ ముగించి చెత్త రికార్డును నమోదు చేసి.. 8 వికెట్ల తేడాతో ఘోర పరాజయం మూటగట్టుకుంది. దీంతో సహజంగానే భారత జట్టుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆసీస్ ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్ మాట్లాడుతూ.. తొలి టెస్టులో ఓటమితో టీమిండియా ఒత్తిడిలో కూరుకుపోయిందని, ఇప్పుడు కెప్టెన్ రహానేపై ఒత్తిడి తెచ్చే విధంగా తాము ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నాడు. ఈ విషయంపై స్పందించిన రహానే.. ‘‘ఆస్ట్రేలియన్లు చాలా బాగా మైండ్ గేమ్ ఆడతారు. ఆడనివ్వండి. కానీ మేం ఆటపై దృష్టి సారిస్తాం. జట్టుగా, పరస్పరం ప్రతి ఒక్కరం సహకరించుకుంటూ ముందుకు సాగుతాం. నిజానికి కెప్టెన్సీ బాధ్యతలు దక్కడం నాకు గర్వకారణం. నాకు దక్కిన గొప్ప అదృష్టం. ఆ బాధ్యతను సక్రమంగా నెరవేర్చేందుకు శాయశక్తులా కృషి చేస్తా. ఎలాంటి ఒత్తిడికి గురికాను. నా జట్టుకు నేను అండగా ఉంటా. వాళ్లు టీం మొత్తాన్ని టార్గెట్ చేస్తారు. కాబట్టి అన్ని విధాల ప్రత్యర్థి జట్టును ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతున్నాం’’ అని చెప్పుకొచ్చాడు. (చదవండి: కోహ్లిని క్షమాపణ కోరాను: రహానే) ఇక స్వదేశానికి వెళ్లేముందు కోహ్లి తమతో మాట్లాడిన విషయాన్ని గుర్తుచేసుకున్న రహానే.. ‘‘భారత్ వెళ్లేముందు అడిలైడ్‌లో కోహ్లితో కలిసి డిన్నర్ చేశాం. తను మా అందరితో చర్చించాడు. ఒకరికి ఒకరు అండగా ఉంటూ, జట్టుగా రాణిస్తూ, ప్రతీ క్షణాన్ని ఎలా ఆస్వాదించాలో చెప్పాడు. ఒక ఆటగాడి విజయం మైదానం లోపల, వెలుపల జట్టుకు ఎలా ఉపయోగపడుతుందో వివరించాడు’’ అని పేర్కొన్నాడు. కాగా బాక్సింగ్ డే టెస్టులో ఎలాగైనా సత్తా చాటాలని టీమిండియా నెట్స్‌లో కఠోరంగా శ్రమిస్తోంది. మరోవైపు.. పితృత్వ సెలవుపై విరాట్ కోహ్లి భారత్‌కు తిరిగి రానుండగా, గాయంతో షమీ జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే.(చదవండి: ఆ స్థానంలో నన్ను ఊహించుకోలేను: ఆసీస్ కోచ్) -
'పంత్‌కు కీపింగ్...సాహాకు బ్యాటింగ్ రాదు'
మెల్బోర్న్ : ఆసీస్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘోర పరాజయం తర్వాత జట్టులో కొన్ని మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఓపెనర్ పృథ్వీ షా ఫేలవ ప్రదర్శన చేయడంతో అతని స్థానంలో గిల్, కోహ్లి స్థానంలో రాహుల్ తుది జట్టులోకి రావడం ఖాయంగా కనిపిస్తుంది. దీంతో పాటు టీమిండియా జట్టులో కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ స్థానంపై ఆసక్తి నెలకొంది. తొలి టెస్టులో అటు కీపర్‌గా.. ఇటు బ్యాట్స్‌మన్‌గా పూర్తిగా విఫలమైన వృద్ధిమాన్ సాహాకు మరో స్థానం ఇస్తారా లేక రిషబ్ పంత్‌కు చోటు ఇస్తారా అన్నది వేచి చూడాలి. అయితే వీరిద్దరిపై టీమిండియా మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. (చదవండి : రైనా, టాప్ హీరో మాజీ భార్య అరెస్ట్) 'తొలి టెస్టు తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లి పెటర్నిటీ సెలవులపై వెళ్లడంతో రాహుల్, గిల్లో ఒకరు ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. అయితే వృద్ధిమాన్ సాహా విషయంలో మాత్రం జట్టు మేనేజ్మెంట్ రెండో ఆప్షన్‌పై ఇంకా ఆలోచించాల్సి ఉంది. ఎందుకంటే పంత్ అనుకున్నంత ఫామ్‌లో లేడు.. ప్రస్తుత వాతావరణంలో పంత్‌పై అనుకూలత లేదు. వాస్తవానికి గత ఆసీస్ పర్యటనలో పంత్ మంచి ప్రదర్శన నమోదు చేశాడు. బ్యాటింగ్‌తో పాటు కీపర్‌గానూ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాడు. సరిగ్గా రెండేళ్ల తర్వాత పంత్ కీపింగ్ సరిగా చేయడని.. సాహా బ్యాటింగ్ చేయలేడనే వాతావరణంలోకి మారిపోయింది. తొలి టెస్టులో సాహా కీపర్‌గానూ.. బ్యాట్స్‌మన్‌గానూ విఫలమయ్యాడు. కాబట్టి ఇద్దరిలో ఎవరిని తీసుకున్నా మంచి ప్రదర్శన ఇస్తారన్న నమ్మకం లేదంటూ' ముగించాడు. కాగా కోహ్లి గైర్హాజరీలో అజింక్యా రహానే నాయకత్వంలో డిసెంబర్ 26 నుంచి మెల్బోర్న్ వేదికగా బాక్సింగ్ డే టెస్టు ఆడనుంది.(చదవండి : ఒక్క ఓవర్.. ఐదు వికెట్లు.. సూపర్ కదా) -
జడేజా కమ్‌బ్యాక్ ఇవ్వనున్నాడా!
అడిలైడ్ : మెల్బోర్న్ టెస్టులో ఐదుగురు స్పెషలిస్ట్ బౌలర్లతో ఆడాలని భారత్ భావిస్తే తుది జట్టులో రవీంద్ర జడేజా వచ్చే అవకాశం ఉంది. తొలి టి20 మ్యాచ్‌లో కన్‌కషన్‌కు గురైన తర్వాత కోలుకున్న జడేజా తన ప్రాక్టీస్ కొనసాగిస్తున్నాడు. అయితే అతను వంద శాతం ఫిట్‌గా ఉన్నాడా లేదా అనేది తేలలేదు. పెద్ద సంఖ్యలో ఓవర్లు బౌలింగ్ చేసే స్థాయిలో అతను ఫిట్‌గా ఉంటే మాత్రం ఆంధ్ర ఆటగాడు హనుమ విహారి స్థానంలో జడేజాను తీసుకోవాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. ‘విహారిని పక్కన పెట్టాలనుకోవడానికి అతని వైఫల్యం కారణం కాదు. జట్టు కాంబినేషన్ కోసం ఆల్‌రౌండర్‌గా జడేజా సరిపోతాడు. ఇటీవల అతని బ్యాటింగ్ చాలా మెరుగుపడింది. పైగా లైనప్‌లో ఏకైన ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మన్‌గా అతను ప్రత్యేకత చూపించగలడు’ అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు సిడ్నీలో రోహిత్ శర్మ క్వారంటైన్ కొనసాగుతోంది. అయితే కరోనా కారణంగా ఆ్రస్టేలియా దేశంలో కొత్త నిబంధనలు వస్తుండటంతో రెండో టెస్టు జరిగే మెల్బోర్న్కు రోహిత్‌ను పంపరాదని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. షెడ్యూల్ ప్రకారం మూడో టెస్టు సిడ్నీలోనే జరిగితే రోహిత్‌కు ఇబ్బంది ఉండదు. వేదిక బ్రిస్బేన్‌కు మారితే మాత్రం బీసీసీఐ రోహిత్ కోసం మళ్లీ ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. -
విరాట్ కోహ్లి ర్యాంక్ 15
దుబాయ్: మెల్బోర్న్ టెస్టులో అద్భుతంగా రాణించిన భారత టెస్టు జట్టు కొత్త కెప్టెన్ విరాట్ కోహ్లి... ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నాలుగు స్థానాలు ఎగబాకాడు. బుధవారం విడుదల చేసిన తాజా జాబితాలో అతను 15వ ర్యాంక్‌కు దూసుకొచ్చాడు. రహానే 15 స్థానాలు మెరుగుపర్చుకుని 26వ ర్యాంక్‌లో నిలిచాడు. చతేశ్వర్ పుజారా, మురళీ విజయ్‌లు వరుసగా 19, 20వ ర్యాంక్‌ల్లో కొనసాగుతున్నారు. ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్ తొలిసారి 5వ స్థానంలో నిలిచి కెరీర్లో బెస్ట్ ర్యాంక్‌ను నమోదు చేశాడు. డివిలియర్స్ (దక్షిణాఫ్రికా) అగ్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు. బౌలింగ్ విభాగంలో భారత పేసర్లు ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీలు చెరో 8 స్థానాలు మెరుగుపర్చుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరు వరుసగా 36, 38వ ర్యాంక్‌ల్లో ఉన్నారు. ఆల్‌రౌండర్ విభాగంలో అశ్విన్ మూడో ర్యాంక్‌లో ఉన్నాడు. -
గెలుస్తారా... నిలుస్తారా!
ఎట్టకేలకు భారత బౌలర్లు అంచనాలను మించి రాణించారు. నిలకడైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని నిరోధించారు. బ్యాట్స్‌మెన్ చెలరేగిపోకుండా కీలక దశల్లో వికెట్లు తీసి మ్యాచ్‌పై ఆశలు రేపారు. భారత బౌలర్ల సమష్టి ప్రదర్శన నాలుగో రోజు ఆసీస్‌ను వెనుకంజ వేసేలా చేసింది. ఎప్పటిలాగే వేగంగా పరుగులు చేసి భారీ లక్ష్యం నిర్దేశించాలన్న ఆలోచనను కట్టి పడేసింది. అయితే ధోని సేనకు పట్టు చిక్కినట్లే కనిపించినా... షాన్ మార్ష్ చలవతో ఆ జట్టు నిలబడింది. ఎంసీజీలో మూడు రకాల ఫలితాలు వచ్చేందుకు రంగం సిద్ధమైంది. చివరి రోజు ఎంత పెద్ద లక్ష్యమైనా భారత్ ఛేదిస్తుందా, లేక ఆ ప్రయత్నంలో కుప్పకూలుతుందా చూడాలి. కంగారూలు ‘డ్రా’ వైపు మొగ్గుతున్నా... పోరాడితే పోయేదేం లేదు అన్న తరహాలో వాతావరణం ప్రతికూలంగా మారితే తప్ప భారత్ విజయం కోసమే ఆడటం మాత్రం ఖాయం. ఉత్కంఠ స్థితిలో మెల్బోర్న్ టెస్టు ⇒ రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 261/7 ⇒ ప్రస్తుతం 326 పరుగుల ముందంజ ⇒ చివరి రోజు ఏ ఫలితమైనా సాధ్యం మెల్బోర్న్: భారత్, ఆస్ట్రేలియా మూడో టెస్టు మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. నాలుగో రోజు సోమవారం ఆట ముగిసే సమయానికి ఇరు జట్లు సమాన స్థితిలో నిలిచాయి. భారత బౌలర్లు నిలకడగా రాణించడంతో ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 261 పరుగులు చేసింది. క్రిస్ రోజర్స్ (123 బంతుల్లో 69; 8 ఫోర్లు), షాన్ మార్ష్ (131 బంతుల్లో 62; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేశారు. ప్రస్తుతం మార్ష్‌తో పాటు హారిస్ (8 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నాడు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 65 పరుగులు కలుపుకొని ఆసీస్ ప్రస్తుతం 326 పరుగులు ముందంజలో ఉంది. అయితే ఇంకా ఆసీస్ తమ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయలేదు. చివరి రోజు ఆ జట్టు ఎన్ని పరుగులు అదనంగా జోడిస్తుందనేది ఆసక్తికరం. ఒక వేళ ఇదే స్కోరు వద్ద డిక్లేర్ చేస్తే భారత్‌కు విజయావకాశాలు ఉంటాయి. తమ సాధారణ శైలికి భిన్నంగా నాలుగో రోజు చివర్లో ఆసీస్ ఆత్మరక్షణ ధోరణి చూస్తే ఆ జట్టు ‘డ్రా’ వైపే ఆసక్తి చూపిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అదే జరిగితే భారత్ సిరీస్ కోల్పోతుంది. సోమవారం వర్షం కారణంగా అంతరాయంతో 77.3 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ఆఖరి రోజు ఆట అరగంట ముందుగా ప్రారంభమవుతుంది. అంతకుముందు భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 465 పరుగులకే ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోరుకు మరో 3 పరుగులు మాత్రమే జోడించి చివరి 2 వికెట్లు కోల్పోయింది. హారిస్‌కు 4, జాన్సన్‌కు 3 వికెట్లు దక్కాయి. స్కోరు వివరాలు:- ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 530; భారత్ తొలి ఇన్నింగ్స్: విజయ్ (సి) మార్ష్ (బి) వాట్సన్ 68; ధావన్ (సి) స్మిత్ (బి) హారిస్ 28; పుజారా (సి) హాడిన్ (బి) హారిస్ 25; కోహ్లి (సి) హాడిన్ (బి) జాన్సన్ 169; రహానే (ఎల్బీ) (బి) లయోన్ 147; రాహుల్ (సి) హాజల్‌వుడ్ (బి) లయోన్ 3; ధోని (సి) హాడిన్ (బి) హారిస్ 11; అశ్విన్ (సి) అండ్ (బి) హారిస్ 0; షమీ (సి) స్మిత్ (బి) జాన్సన్ 12; ఉమేశ్ (సి) హాడిన్ (బి) జాన్సన్ 0; ఇషాంత్ (నాటౌట్) 0, ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (128.5 ఓవర్లలో ఆలౌట్) 465 వికెట్ల పతనం: 1-55; 2-108; 3-147; 4-409; 5-415; 6-430; 7-434; 8-462; 9-462; 10-465. బౌలింగ్: జాన్సన్ 30.5-6-133-3; హారిస్ 26-7-70-4; హాజల్‌వుడ్ 25-6-75-0; వాట్సన్ 16-3-65-1; లయోన్ 29-3-108-2; స్మిత్ 2-0-11-0. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: వార్నర్ (ఎల్బీ) (బి) అశ్విన్ 40; రోజర్స్ (బి) అశ్విన్ 69; వాట్సన్ (సి) ధోని (బి) ఇషాంత్ 17; స్మిత్ (సి) రహానే (బి) ఉమేశ్ 14; మార్ష్ (బ్యాటింగ్) 62; బర్న్స్ (సి) ధోని (బి) ఇషాంత్ 9; హాడిన్ (సి) ధోని (బి) ఉమేశ్ 13; జాన్సన్ (సి) రహానే (బి) షమీ 15; హారిస్ (బ్యాటింగ్) 8; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (75 ఓవర్లలో 7 వికెట్లకు) 261 వికెట్ల పతనం: 1-57; 2-98; 3-131; 4-164; 5-176; 6-202; 7-234; బౌలింగ్: ఉమేశ్ 14-1-73-2; షమీ 20-2-75-1; ఇషాంత్ 19-4-49-2; అశ్విన్ 22-2-56-2. సెషన్-1: వార్నర్ దూకుడు నాలుగోరోజు భారత ఇన్నింగ్స్ 15 బంతుల్లోనే ముగిసిం ది. జాన్సన్ తన వరుస ఓవర్లలో ఉమేశ్, షమీలను పెవిలియన్ పంపించాడు. అనంతరం ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌ను వార్నర్ (42 బంతుల్లో 40; 6 ఫోర్లు) దూకుడుగా ఆరంభించాడు. ఉమేశ్ బౌలింగ్‌లో ఐదు ఫోర్లు బాదాడు. ఈ క్రమంలో టెస్టుల్లో 3 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. 2 పరుగుల వద్ద స్లిప్‌లో కొట్టిన షాట్‌కు బంతి ధావన్‌కు కాస్త ముందు పడటంతో రోజర్స్ బతికిపోయాడు. అయితే పరుగులు ఇవ్వకుండా కట్టడి చేసిన అశ్విన్, ఈ భాగస్వామ్యాన్ని కూడా విడదీశాడు. ఓవర్లు: 2.3, పరుగులు: 3, వికెట్లు: 2 (భారత్) ఓవర్లు: 22, పరుగులు: 90, వికెట్లు: 1 (ఆస్ట్రేలియా) సెషన్-2: రోజర్స్ నిలకడ లంచ్ సమయంలో చాలా సేపు వర్షం కురిసి మ్యాచ్‌కు అడ్డంకిగా మారింది. కొంత విరామం తర్వాత ఆట ప్రారంభమైంది. రోజర్స్ చక్కటి షాట్లతో ఇన్నింగ్స్‌ను నడిపించాడు. 33 పరుగుల వద్ద అతను స్లిప్‌లో ఇచ్చిన క్యాచ్‌ను ధావన్ వదిలేశాడు. మరోవైపు వాట్సన్ (17)ను అవుట్ చేసి ఇషాంత్ దెబ్బ తీయగా, ఫామ్‌లో ఉన్న కెప్టెన్ స్మిత్ (14) ధోని వ్యూహానికి చిక్కాడు. ఉమేశ్ బౌలింగ్‌లో ఫైన్ లెగ్ వైపు ఆడబోయిన స్మిత్ లెగ్ స్లిప్‌లో రహానేకు క్యాచ్ ఇచ్చాడు. మరోసారి అశ్విన్, చక్కటి బంతితో రోజర్స్‌ను బోల్తా కొట్టించడంతో భారత్‌కు పట్టు చిక్కింది. ఓవర్లు: 21, పరుగులు: 84, వికెట్లు: 3 సెషన్-3: ఆదుకున్న మార్ష్ గత టెస్టులో విఫలమైన షాన్ మార్ష్ విరామం తర్వాత కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మరోవైపు సహచరులు వెనుదిరుగుతున్నా... ఏకాగ్రత కోల్పోకుండా చక్కటి షాట్లతో ఆకట్టుకున్నాడు. భారత బౌలర్లు మరో సారి ప్రత్యర్థిని నియంత్రించగలిగారు. ఫలితంగా బర్న్స్ (9), హాడిన్ (13), జాన్సన్ (15) తక్కువ వ్యవధిలో వెనుదిరిగారు. 112 బంతుల్లో మార్ష్ అర్ధ సెంచరీని చేరుకున్నాడు. ఓవర్లు: 32, పరుగులు: 87, వికెట్లు: 3