నాయకుడు నడిపించాడు | Ajinkya Rahane Has Emerged As True Leader In 2nd Test | Sakshi
Sakshi News home page

నాయకుడు నడిపించాడు

Published Mon, Dec 28 2020 1:29 AM | Last Updated on Mon, Dec 28 2020 7:19 AM

Ajinkya Rahane Has Emerged As True Leader In 2nd Test - Sakshi

టీమిండియాదే జోరు! తొలి రోజు బౌలింగ్‌తో ప్రత్యర్థిని పడగొట్టింది. రెండో రోజు బ్యాటింగ్‌లో నిలిచింది. ఇలా ‘బాక్సింగ్‌ డే’ టెస్టులో రెండు రోజులు ఆతిథ్య జట్టుపై ఆధిపత్యం చాటింది. నాయకుడు అజింక్య రహానే భారత తొలి ఇన్నింగ్స్‌ను నడిపించాడు. అజేయ సెంచరీతో నిలబడ్డాడు. విహారి, రిషభ్‌ పంత్, రవీంద్ర జడేజాలతో విలువైన భాగస్వామ్యాలు జోడించాడు. ఇన్నింగ్స్‌కు మూలస్తంభంలా నిలుచున్నాడు. సారథి వీరోచిత పోరాటానికి మూడు సెషన్ల పాటు 80.3 ఓవర్లు బౌలింగ్‌ చేసిన ఆస్ట్రేలియా కేవలం 4 వికెట్లతోనే సరిపెట్టుకుంది.

మెల్‌బోర్న్‌: ఈ మ్యాచ్‌కు ముందు భారత శిబిరంలో ఒకటే ఆందోళన. కోహ్లి లేడు. షమీ గాయపడ్డాడు. సిరీస్‌లో 0–1తో వెనుకబాటు. ఇన్ని ప్రతికూలతలతో బరిలోకి దిగిన భారత్‌ రెండు రోజులు గడిచేసరికి ఆధిక్యంలోకి వచ్చేసింది. రెండో రోజు భారత బ్యాట్స్‌మెన్‌ తమ బౌలర్ల శ్రమకు తగిన ప్రదర్శన ఇచ్చారు. విలువైన పరుగులు జతచేసి... దీటైన భాగస్వామ్యాలు నెలకొల్పారు. ముఖ్యంగా కెప్టెన్‌ అజింక్య రహానే అద్భుత ఇన్నింగ్స్‌ రెండో రోజును కూడా మన రోజుగా మార్చింది. ఈ తాత్కాలిక సారథి (200 బంతుల్లో 104 బ్యాటింగ్‌; 12 ఫోర్లు) అజేయ శతకం సాధించగా... శుబ్‌మన్‌ గిల్‌ (65 బంతుల్లో 45; 8 ఫోర్లు), రవీంద్ర జడేజా (104 బంతుల్లో 40 బ్యాటింగ్‌; 1 ఫోర్‌) ఆస్ట్రేలియా బౌలర్లపై సత్తా చాటుకున్నారు. ఆట నిలిచే సమయానికి భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 91.3 ఓవర్లలో 5 వికెట్లకు 277 పరుగులు చేసింది. వర్షంవల్ల రెండో రోజు ఆటను కాస్త ముందుగా నిలిపేశారు. ప్రస్తుతం భారత్‌ 82 పరుగుల ఆధిక్యంలో ఉంది. 

బ్యాటింగ్‌ అదిరింది
భారత బ్యాట్స్‌మెన్‌ ఆదివారం ఆస్ట్రేలియా బౌలర్లపై అదరగొట్టారు. తొలి సెషన్‌ కాస్త కలవర పెట్టినా... రెండు, మూడు సెషన్లు పూర్తిగా బ్యాటింగ్‌ ప్రతాపంతోనే సాగింది. ఓవర్‌నైట్‌ స్కోరు 36/1తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత్‌ను గిల్, పుజారా కాసేపు నడిపించారు. తొలిటెస్టు ఆడుతున్న గిల్‌ అర్ధసెంచరీకి చేరువవుతుండగా కమిన్స్‌ బంతి అతన్ని పెవిలియన్‌ చేర్చింది. అలా జట్టు స్కోరు 61 పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోయింది. మరో 3 పరుగులు జతయ్యాక కమిన్స్‌ తన మరుసటి ఓవర్లోనే పుజారా (70 బంతుల్లో 17; 1 ఫోర్‌)ను పెవిలియన్‌ చేర్చాడు.

బుల్లెట్‌లా దూసుకొచ్చిన బంతి అతని బ్యాట్‌ అంచును తాకుతూ అంతే వేగంగా వెళ్తుండగా... కీపర్‌ పైన్‌ కుడివైపునకు డైవ్‌ చేసి ఒంటిచేత్తో అందుకున్నాడు. 90/3 స్కోరు వద్ద తొలి సెషన్‌ ముగిసింది. లంచ్‌ బ్రేక్‌ తర్వాత రహానేతో కలిసి కుదురుగా ఆడుతున్న ఆంధ్ర క్రికెటర్‌ హనుమ విహారి (66 బంతుల్లో 21; 2 ఫోర్లు) క్రీజులో పాతుకుపోయే ప్రయత్నం చేశాడు. అయితే జట్టు స్కోరు వంద పరుగులు దాటాక విహారిని లయన్‌ బోల్తా కొట్టించాడు. దీంతో 52 పరుగుల నాలుగో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత రహానేకు రిషభ్‌ పంత్‌ జతయ్యాడు. ఈ జోడి కూడా ఆసీస్‌ బౌలింగ్‌ను చక్కగా ఎదుర్కొంది. ఐదో వికెట్‌కు 57 పరుగులు జోడించాక పంత్‌ ఔటయ్యాడు. రహానే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. 189/5 స్కోరు వద్ద ఇరు జట్లు టీ బ్రేక్‌కు వెళ్లాయి.  

రహానే వీరోచితం 
రహానే, జడేజా ఆఖరి సెషన్‌ను జాగ్రత్తగా ఆడారు. ముఖ్యంగా తన వికెట్‌ విలువ, తర్వాత ఎదురయ్యే కొత్త బంతి కష్టాలు గుర్తుంచుకొని కెప్టెన్‌ రహానే రక్షణాత్మక ధోరణి కనబరిచాడు. జడేజా కూడా బాధ్యత పంచుకోవడంతో వీరిద్దరి సమన్వయం ఆస్ట్రేలియాను కంగారు పెట్టించింది. రహానే గతి తప్పిన బంతుల్ని బౌండరీకి తరలిస్తూ, జట్టు స్కోరు బోర్డును కదిలించాడు. దీంతో పాటు ఆసీస్‌ ఫీల్డింగ్‌ లోపాలు అతనికి రెండు సార్లు లైఫ్‌నిచ్చాయి. వీటిని సద్వినియోగం చేసుకున్న రహానే టెస్టుల్లో 12వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో అతనికిది రెండో శతకం. రహానే, జడేజా అబే ధ్యమైన భాగస్వామ్యం ఆసీస్‌ బౌలర్లను నీరుగార్చింది. ఆట ముగిసే సమయానికి అజేయమైన ఆరో వికెట్‌కు వీరిద్దరు 104 పరుగులు జోడించారు.

స్కోరు వివరాలు
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌: 195; భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: మయాంక్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) స్టార్క్‌ 0; శుబ్‌మన్‌ గిల్‌ (సి) పైన్‌ (బి) కమిన్స్‌ 45; పుజారా (సి) పైన్‌ (బి) కమిన్స్‌ 17; రహానే (బ్యాటింగ్‌) 104; విహారి (సి) స్మిత్‌ (బి) లయన్‌ 21; రిషభ్‌ పంత్‌ (సి) పైన్‌ (బి) స్టార్క్‌ 29; జడేజా (బ్యాటింగ్‌) 40; ఎక్స్‌ట్రాలు 21; మొత్తం (91.3 ఓవర్లలో 5 వికెట్లకు) 277. వికెట్ల పతనం: 1–0, 2–61, 3–64, 4–116, 5–173.
బౌలింగ్‌: స్టార్క్‌ 18.3–3–61–2, ప్యాట్‌ కమిన్స్‌ 22–7–71–2, హజల్‌వుడ్‌ 21–6–44–0, నాథన్‌ లయన్‌ 18–2–52–1, కామెరాన్‌ గ్రీన్‌ 12–1–31–0.

కొత్త బంతి పట్టుజారే!
కొత్త బంతితో ఆట పరిస్థితి మారుతుంది. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఆసీస్‌లాంటి బౌన్సీ వికెట్లపై ఆసీస్‌ బౌలర్ల పట్టు మామూలుగా ఉండదు. ఎంతటి బ్యాటింగ్‌ ధీరుడినైనా మట్టికరిపిస్తారు. రెండో రోజు భారత బ్యాట్స్‌మెన్‌ అలాంటి గతి నుంచి బయటపడ్డారు. కొత్త బంతి తీసుకోగానే ఆసీస్‌ చేతికొచ్చిన అవకాశాన్ని రెండో స్లిప్‌లో ఉన్న స్మిత్‌ జారవిడిచాడు. 81వ ఓవర్లో కొత్త బంతిని అందుకున్న స్టార్క్‌ నిప్పులు చెరిగేందుకు సిద్ధమయ్యాడు.

రహానే క్యాచ్‌ను చేజార్చిన ట్రావిస్‌ హెడ్‌
మూడో బంతి రహానేపైకి బుల్లెట్‌ వేగంతో దూసుకొచ్చింది. బ్యాట్‌ అంచును తాకుతూ స్మిత్‌ చేతుల్లోకి వెళ్లగా దాన్ని నేలపాలు చేశాడు. దీంతో 73 పరుగుల వద్ద లైఫ్‌ పొందిన రహానే కొత్తబంతితో ఇంకాస్త జాగ్రత్తగా ఆడి సెంచరీ సాధించాడు. శతకం పూర్తయ్యాక అవుట్‌ చేసే అవకాశం మళ్లీ స్టార్క్‌కు దక్కింది. 92వ ఓవర్‌ మూడో బంతిని రహానే షాట్‌ ఆడాడు. కానీ గాల్లోకి లేచిన ఆ బంతిని బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌లో ట్రావిస్‌ హెడ్‌ జారవిడిచారు. అంతకుముందు కమిన్స్‌ (56వ ఓవర్‌) బౌలింగ్‌లో రిషభ్‌ పంత్‌ క్యాచ్‌ను గ్రీన్‌ నేలపాలు చేశాడు.

ఇది చాలదు సుమా!
ఇప్పటికైతే ఆధిక్యంలో ఉన్నా... అది ఆసీస్‌ ముందు ఏమాత్రం చాలదు. పైగా బ్యాటింగ్‌ ఆర్డర్‌లో తదుపరి స్పెషలిస్టు బ్యాట్స్‌మెనే లేడు. మిగిలున్న వారిలో ఒక్క అశ్విన్‌ మాత్రం ఆడగలడు. ఆ తర్వాత ఇంకెవరినీ ఆసీస్‌ పేస్‌ బౌలర్లు కాసేపైనా నిలువనీయరు. కాబట్టి మూడో రోజు ఆట ఆతిథ్య జట్టుకన్నా భారత్‌కే కీలకం. తొలి సెషన్‌ అంతా రహానే–జడేజా భాగస్వామ్యాన్ని కాపాడుకోవాలి. కనీసం రెండో సెషన్‌ వరకైనా మన ఇన్నింగ్స్‌ కొనసాగితే 250 పైచిలుకు పరుగుల ఆధిక్యాన్ని పెంచుకోవచ్చు. తద్వారా నాలుగో రోజు ఆసీస్‌పై ఒత్తిడి పెంచేందుకు... ఐదో రోజు ఆత్మవిశ్వాసంతో ఆడేందుకు భారత్‌కు అవకాశముంటుంది.

►రిషభ్‌ పంత్‌ వికెట్‌ తీయడం ద్వారా టెస్టుల్లో 250 వికెట్లు పూర్తి చేసుకున్న తొమ్మిదో ఆస్ట్రేలియా బౌలర్‌గా స్టార్క్‌ గుర్తింపు పొందాడు. స్టార్క్‌ 59 టెస్టుల్లో ఈ ఘనత సాధించాడు. ఈ జాబితాలో షేన్‌ వార్న్‌ (708 వికెట్లు), మెక్‌గ్రాత్‌ (563), లయన్‌ (392), డెన్నిస్‌ లిల్లీ (355), మిచెల్‌ జాన్సన్‌ (313), బ్రెట్‌ లీ (310), మెక్‌డెర్మట్‌ (291), గిలెస్పీ (259 వికెట్లు) ముందున్నారు. 9

►ఈ మ్యాచ్‌లో శతకం చేయడం ద్వారా ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సెంచరీ చేసిన ఐదో భారత కెప్టెన్‌గా రహానే గుర్తింపు పొందాడు. గతంలో అజహరుద్దీన్‌ (106; అడిలైడ్‌లో 1992), సచిన్‌ టెండూల్కర్‌ (116; మెల్‌బోర్న్‌లో 1999), సౌరవ్‌ గంగూలీ (144; బ్రిస్బేన్‌లో 2003), కోహ్లి (115, 141; అడిలైడ్‌లో 2014లో; 147; సిడ్నీలో 2015; 123; పెర్త్‌లో 2018) ఈ ఘనత సాధించారు. 
►మెల్‌బోర్న్‌ వేదికగా ‘బాక్సింగ్‌ డే’ టెస్టులో రెండు సెంచరీలు చేసిన తొలి విదేశీ క్రికెటర్‌గా రహానే ఘనత వహించాడు. 2014లో ఇదే మైదానంలో రహానే 147 పరుగులు చేశాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement