అద్భుతమైన టెస్టు.. ఆఖరికి మాదే పైచేయి.. వాళ్లిద్దరు సూపర్‌: కమిన్స్‌ | Ind vs Aus MCG: Cummins Says What An Amazing Test Happy To Contribute After Win | Sakshi
Sakshi News home page

అద్భుతమైన టెస్టు.. ఆఖరికి మాదే పైచేయి.. వాళ్లిద్దరు సూపర్‌: కమిన్స్‌

Published Mon, Dec 30 2024 12:54 PM | Last Updated on Mon, Dec 30 2024 2:54 PM

Ind vs Aus MCG: Cummins Says What An Amazing Test Happy To Contribute After Win

మెల్‌బోర్న్‌ టెస్టు అద్భుతంగా సాగిందని.. ఆఖరికి తామే పైచేయి సాధించడం పట్ల సంతోషంగా ఉందని ఆస్ట్రేలియా కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌(Pat Cummins) హర్షం వ్యక్తం చేశాడు. బంతితో పాటు బ్యాట్‌తోనూ తాను రాణించడం సంతృప్తినిచ్చిందని పేర్కొన్నాడు. ట్రవిస్‌ హెడ్‌కు బాల్‌ ఇవ్వడం వెనుక తమ కోచ్‌ హస్తం ఉందని.. ఈ విషయంలో క్రెడిట్‌ ఆయనకే ఇస్తానని కమిన్స్‌ తెలిపాడు.

బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా సొంతగడ్డపై టీమిండియా(India vs Australia)తో ఐదు టెస్టులు ఆడుతోంది. ఈ క్రమంలో పెర్త్‌ మ్యాచ్‌లో ఓడిన కంగారూ జట్టు.. అడిలైడ్‌ టెస్టుతో విజయాన్ని రుచిచూసింది. అనంతరం బ్రిస్బేన్‌ టెస్టు వర్షం వల్ల డ్రా కాగా.. ఇరుజట్లు మధ్య మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో నాలుగో టెస్టు జరిగింది.

340 పరుగుల లక్ష్యం
ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆతిథ్య ఆసీస్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగులు చేసిన కంగారూలు.. భారత్‌ను 369 పరుగులకు కట్టడి చేశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో 234 పరుగులకు ఆలౌట్‌ అయిన కమిన్స్‌ బృందం.. టీమిండియాకు 340 పరుగుల లక్ష్యాన్ని విధించింది.

అయితే, సోమవారం నాటి ఆఖరి రోజు ఆటలో భాగంగా 155 పరుగులకే ఆలౌట్‌ కావడంతో.. ఆసీస్‌ 184 రన్స్‌ తేడాతో జయభేరి మోగించింది. తద్వారా సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది. ఇక ఈ మ్యాచ్‌లో మొత్తంగా 90(49, 41) పరుగులు చేయడంతో పాటు.. కమిన్స్‌ ఆరు వికెట్లు తీశాడు. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కించుకున్నాడు.

మాదే పైచేయి
ఈ క్రమంలో విజయానంతరం కమిన్స్‌ మాట్లాడుతూ.. ‘‘అద్భుతమైన టెస్టు మ్యాచ్‌ ఆడాము. ప్రేక్షకులు కూడా మాకు మద్దతుగా నిలిచారు. వారి నుంచి అద్భుత స్పందన లభించింది. విజయంలో నా పాత్ర కూడా ఉన్నందుకు సంతోషంగా ఉన్నాను.

లబుషేన్‌(72, 70), స్మిత్‌(140, 13 ) రాణించడం వల్ల పటిష్ట స్థితిలో నిలిచాం. నిజానికి ఈరోజు తొలి సెషన్‌లో మాదే పైచేయి. కానీ అనూహ్య రీతిలో వాళ్లు పుంజుకుని.. రెండో సెషన్‌లో రాణించారు. అయితే, మేము మాత్రం సానుకూల దృక్పథంతోనే ఉన్నాము.

ఫీల్డింగ్‌ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నాం. ఇక హెడ్‌తో బౌలింగ్‌ చేయించాలన్నది మా కోచ్‌ ఆలోచనే. ఆ విషయంలో క్రెడిట్‌ మొత్తం ఆయనకే ఇస్తాను. జట్టు ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నాను’’ అని పేర్కొన్నాడు. 

సిడ్నీ టెస్టులోనూ ఇదే తరహా ఫలితం పునరావృతం చేస్తామని కమిన్స్‌ ధీమా వ్యక్తం చేశాడు. కాగా ఈ మ్యాచ్‌లో బ్యాటర్‌గా విఫలమైన ట్రవిస్‌ హెడ్‌(0, 1) రిషభ్‌ పంత్‌(Rishabh Pant-30) రూపంలో కీలక వికెట్‌ తీసి మ్యాచ్‌ను మలుపు తిప్పడంలో సహాయం చేశాడు.

చదవండి: మానసిక వేదన.. అందుకే ఓడిపోయాం.. నితీశ్‌ రెడ్డి మాత్రం అద్భుతం: రోహిత్‌ శర్మ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement