ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టులో ఓటమి పట్ల టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. భారీ లక్ష్యం ముందున్నా ఆఖరి వరకు పోరాడాలని నిశ్చయించుకున్నామని.. అయితే, ప్రణాళికలు పక్కాగా అమలు చేయలేకపోయామని పేర్కొన్నాడు. ఏదేమైనా ఆస్ట్రేలియా బౌలర్లు అద్భుతంగా ఆడారని.. టెయిలెండర్లు కూడా అద్భుత పోరాటపటిమతో మ్యాచ్‌ను తమ నుంచి లాగేసుకున్నారని రోహిత్ అన్నాడు.
184 పరుగుల భారీ తేడాతో ఓటమి
బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border-Gavaskar Trophy)లో భాగంగా ఆస్ట్రేలియాతో ఐదు టెస్టులు ఆడుతున్న భారత్.. పెర్త్‌లో గెలిచి, అడిలైడ్‌లో ఓడింది. అనంతరం బ్రిస్బేన్ టెస్టును డ్రా చేసుకుంది. అయితే, మెల్‌బోర్న్‌లో జరిగిన బాక్సింగ్ డే టెస్టు(Boxing Day Test)లో మాత్రం 184 పరుగుల భారీ తేడాతో ఓటమిని చవిచూసింది.
మానసికంగా వేధిస్తోంది
ఈ నేపథ్యంలో ఆసీస్ చేతిలో ఘోర పరాభవంపై స్పందించిన రోహిత్ శర్మ.. పరాజయానికి గల కారణాలను విశ్లేషించాడు. ‘‘ఈ ఓటమి చాలా బాధాకరం. మానసికంగా వేధిస్తోంది. మ్యాచ్ గెలిచేందుకు ఎన్నో మార్గాలు ఉంటాయి. కానీ మేము మాత్రం విజయానికి దారిని కనుక్కోలేకపోయాం.
ఆఖరి వరకు పోరాడాలని భావించాం. కానీ దురదృష్టవశాత్తూ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయాం. ఆస్ట్రేలియాను 90/6కు కట్టడి చేసినా.. ఆ తర్వాత మళ్లీ పట్టు కోల్పోయాం. స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాం. అయితే, మేము చేయగలిగిందంతా చేశామనే నమ్ముతున్నా.
సులువైన టార్గెట్ కాదని తెలుసు.. అయినా
అయితే, వాళ్లు పోరాడిన తీరు అసాధారణం. ముఖ్యంగా ఆఖరి వికెట్‌కు అద్భుతం చేశారు. ఇక ఆఖరి రోజు 340 పరుగుల లక్ష్యం ఛేదించడం అంత సులువు కాదని తెలుసు. అయినా.. అందుకు పునాది వేసేందుకు తీవ్రంగా శ్రమించాం. కానీ ఆసీస్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో మేము అనుకున్న లక్ష్యానికి దూరమయ్యాం’’ అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
ఆసీస్‌లో తొలిసారి.. అయినా అద్భుతంగా
ఇక తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ(114)తో చెలరేగిన ఆంధ్ర కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy) ప్రస్తావన రాగా.. ‘‘అతడు తొలిసారి ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు మ్యాచ్‌లు ఆడుతున్నాడు. అయినప్పటికీ అద్భుత పోరాటపటిమ కనబరిచాడు. అతడి టెక్నిక్స్ కూడా బాగున్నాయి.
విజయవంతమైన ఆల్‌రౌండర్‌గా ఎదిగే అన్ని లక్షణాలు అతడిలో ఉన్నాయి. రోజురోజుకూ అతడు మరింత మెరుగుపడాలని కోరుకుంటున్నా. మేనేజ్‌మెంట్, జట్టు నుంచి అతడికి పూర్తి సహకారం ఉంది’’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. నితీశ్ రెడ్డికి మంచి భవిష్యత్తు ఉందన్నాడు.
భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా- నాలుగో టెస్టు
👉వేదిక:మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్, మెల్‌బోర్న్
👉టాస్: ఆస్ట్రేలియా- తొలుత బ్యాటింగ్
👉ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరు- 474
👉భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరు- 369
👉ఆసీస్ రెండో ఇన్నింగ్స్ స్కోరు- 234
👉భారత్ విజయ లక్ష్యం- 340
👉భారత్ రెండో ఇన్నింగ్స్ స్కోరు- 155
👉ఫలితం: 184 పరుగుల తేడాతో భారత్ ఓటమి
👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ప్యాట్ కమిన్స్(మొత్తం 90 పరుగులు, ఆరు వికెట్లు)
చదవండి: అద్భుతమైన టెస్టు.. ఆఖరికి మాదే పైచేయి.. వాళ్లిద్దరు సూపర్: కమిన్స్
Comments
Please login to add a commentAdd a comment