నితీశ్‌ రెడ్డికి అరుదైన గౌరవం.. బీసీసీఐ వీడియో వైరల్‌ | Nitish Reddy Clicks Pics As His Bumrah Names Get Carved On MCG Honours Board | Sakshi
Sakshi News home page

నితీశ్‌ రెడ్డికి అరుదైన గౌరవం.. బీసీసీఐ వీడియో వైరల్‌

Published Tue, Dec 31 2024 3:12 PM | Last Updated on Tue, Dec 31 2024 3:55 PM

Nitish Reddy Clicks Pics As His Bumrah Names Get Carved On MCG Honours Board

టీమిండియా నయా సంచలనం, ఆంధ్ర క్రికెటర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి(Nitish Kumar Reddy)కి అరుదైన గౌరవం దక్కింది. మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌(Melbourne Cricket Ground) హానర్స్‌ బోర్డులో అతడికి చోటు లభించింది. భారత జట్టు వైస్‌ కెప్టెన్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా కూడా మరోసారి ఈ గౌరవం దక్కించుకోగా.. ఈ ఇద్దరి పేర్లను బోర్డుపై చేర్చుతున్న సమయంలో నితీశ్‌ రెడ్డి ఉద్వేగానికి లోనయ్యాడు.

వీడియో షేర్‌ చేసిన బీసీసీఐ
ఈ ప్రత్యేకమైన క్షణాలను ఫోన్‌ కెమెరాలో బంధిస్తూ మధురజ్ఞాపకాలను పోగు చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ) సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

 ‘‘ఐదు వికెట్ల హాల్‌... ప్రత్యేకమైన సెంచరీ... వైస్‌ కెప్టెన్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా(Jasprit Bumrah)తో పాటు నితీశ్‌ కుమార్‌ రెడ్డి పేర్లు మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ హానర్స్‌ బోర్డులో చేరిన వేళ’’ అంటూ క్యాప్షన్‌ జతచేసింది.

కాగా బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ 2024-25లో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియాకు వెళ్లింది. తొలి టెస్టులో భారత్‌, రెండో టెస్టులో ఆసీస్‌ గెలుపొందగా.. మూడో టెస్టు డ్రా అయింది. ఈ క్రమంలో మెల్‌బోర్న్‌ వేదికగా నాలుగో టెస్టు జరిగింది.

రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి విఫలమైన చోట 
ఈ బాక్సింగ్‌ డే మ్యాచ్‌లో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ సందర్భంగా పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ నితీశ్‌ రెడ్డి శతకంతో చెలరేగాడు. సీనియర్లు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి విఫలమైన చోట 114 పరుగులతో దుమ్ములేపాడు. 

చిన్న వయసులోనే ఎంసీజీలో శతకం
తద్వారా ప్రఖ్యాత మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌(ఎంసీజీ)లో అత్యంత పిన్న వయసులో భారత్‌ తరఫున శతకం బాదిన క్రికెటర్‌గా.. 21 ఏళ్ల నితీశ్‌ రెడ్డి చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ హానర్స్‌ బోర్డులో నితీశ్‌ రెడ్డి పేరును లిఖించారు. 

బుమ్రా మరోసారి
ఇక ఇదే టెస్టులో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ సందర్భంగా జస్‌ప్రీత్‌ బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగిన విషయం తెలిసిందే. సామ్‌ కొన్‌స్టాస్‌(8), ట్రవిస్‌ హెడ్‌(1), మిచెల్‌ మార్ష్‌(0), అలెక్స్‌ క్యారీ(2), నాథన్‌ లియాన్‌(41) వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.

ఈ నేపథ్యంలో ఐదు వికెట్ల ప్రదర్శన(5/57) నమోదు చేసినందుకు గానూ బుమ్రా పేరు కూడా హానర్స్‌ బోర్డులో రాశారు. కాగా 2018లోనూ బుమ్రా ఇలాంటి ఘనత సాధించి.. తొలిసారి హానర్స్‌ బోర్డులోకెక్కాడు. ఇక 2020లో అజింక్య రహానే 112 పరుగులు చేసి తన పేరు(మొత్తంగా రెండుసార్లు)ను లిఖించుకున్నాడు. 

అంతకు ముందు టీమిండియా బ్యాటర్లు సచిన్‌ టెండుల్కర్‌, వీరేంద్ర సెహ్వాగ్‌ విరాట్‌ కోహ్లి, ఛతేశ్వర్‌ పుజారా తదితరులు కూడా ఈ గౌరవం దక్కించుకున్నారు. ఇదిలా ఉంటే.. మెల్‌బోర్న్‌ టెస్టులో టీమిండియా ఆసీస్‌ చేతిలో 184 పరుగుల తేడాతో భారీ పరాజయాన్ని చవిచూసింది. 

ఆఖరి టెస్టు గెలిస్తేనే
ఫలితంగా ఆస్ట్రేలియా 2-1తో ఆధిక్యంలోకి వెళ్లడంతో పాటు.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌(డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్‌ అవకాశాలను మెరుగుపరచుకుంది. ఇక ఇరుజట్ల మధ్య సిడ్నీ వేదికగా జనవరి 3న ఈ సిరీస్‌లో చివరిదైన ఐదో టెస్టు మొదలుకానుంది. ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవడంతో పాటు.. శ్రీలంకతో సిరీస్‌లో ఆసీస్‌ టెస్టు ఫలితాలపై భారత్‌ డబ్ల్యూటీసీ ఫైనల్‌ అవకాశాలు ఆధారపడి ఉంటాయి.

చదవండి: Rohit On Pant Batting: నిర్లక్ష్యపు షాట్లతో భారీ మూల్యం.. అతడికి నేనేం చెప్పగలను

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement