ఆసీస్‌ను మట్టికరిపించిన టీమిండియా.. బుమ్రాకు చిరస్మరణీయం | Ind vs Aus 1st test Perth: Bumrah Led India Beat Australia By 295 Runs BGT | Sakshi
Sakshi News home page

Ind vs Aus: ఆసీస్‌ను మట్టికరిపించిన టీమిండియా.. బుమ్రాకు చిరస్మరణీయంగా!

Published Mon, Nov 25 2024 1:20 PM | Last Updated on Mon, Nov 25 2024 7:21 PM

Ind vs Aus 1st test Perth: Bumrah Led India Beat Australia By 295 Runs BGT

బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ 2024-25లో టీమిండియా శుభారంభం చేసింది. పెర్త్‌ టెస్టులో ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించింది. ఏకంగా 295 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది.  ఈ గెలుపుతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 1-0తో భారత్‌ ఆధిక్యంలోకి వెళ్లింది.

నాలుగు టెస్టుల్లో గెలవాల్సిందే
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2023-25లో భాగంగా టీమిండియా ఆసీస్‌తో తమ ఆఖరి సిరీస్‌ ఆడుతోంది. ఈ మెగా ఈవెంట్‌లో ఫైనల్‌కు చేరాలంటే ఆసీస్‌పై కచ్చితంగా నాలుగు టెస్టుల్లో గెలవాల్సిందే. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వ్యక్తిగత కారణాల వల్ల మొదటి టెస్టుకు దూరమయ్యాడు.

బాధ్యతలు తీసుకున్న బుమ్రా
అయితే, సారథిగా ఉంటానంటూ బాధ్యతలు తీసుకున్న వైస్‌ కెప్టెన్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా.. తన పనిని సమర్థవంతంగా నెరవేర్చాడు. కెప్టెన్సీతో పాటు, ఆటగాడిగానూ అదరగొట్టిన ఈ పేస్‌ దళ నాయకుడు ఆసీస్‌ గడ్డపై కెప్టెన్‌గా తొలి ప్రయత్నంలోనే ఘన విజయం అందుకున్నాడు.

అప్పుడు ఆదుకున్న పంత్‌, నితీశ్‌ రెడ్డి
పెర్త్‌ స్టేడియంలో శుక్రవారం మొదలైన ఈ టెస్టు మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన బుమ్రా తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. అయితే, పూర్తిగా సీమర్లకే అనుకూలించిన పిచ్‌పై భారత బ్యాటర్లు ఆరంభంలో తడబడ్డారు. టాపార్డర్‌లో ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌(0), వన్‌డౌన్‌ బ్యాటర్‌ దేవ్‌దత్‌ పడిక్కల్‌(0) పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించారు.

అయితే, మరో ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌(26) పట్టుదలగా నిలబడినా.. వివాదాస్పద రీతిలో థర్డ్‌ అంపైర్‌ అతడిని అవుట్‌గా ప్రకటించాడు. మరోవైపు.. విరాట్‌ కోహ్లి(5) సైతం నిరాశపరచగా.. రిషభ్‌ పంత్‌(37), అరంగేట్ర ఆల్‌రౌండర్‌ నితీశ్‌ రెడ్డి(41) రాణించడం కలిసి వచ్చింది. 

దీంతో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 150 పరుగుల గౌరవప్రదమైన స్కోరుకు ఆలౌట్‌ అయింది. ఆసీస్‌ బౌలర్లలో పేసర్లలో జోష్‌ హాజిల్‌వుడ్‌ నాలుగు వికెట్లు దక్కించుకోగా.. స్టార్క్‌, కెప్టెన్‌ కమిన్స్‌. మిచెల్‌ మార్ష్‌ రెండేసి వికెట్లు పడగొట్టారు.

చెలరేగిన బుమ్రా.. కుప్పకూలిన ఆసీస్‌
అనంతరం తొలిరోజే బ్యాటింగ్‌ మొదలుపెట్టిన ఆస్ట్రేలియాకు బుమ్రా తన పేస్‌ పదునుతో చుక్కలు చూపించాడు. అతడికి తోడుగా మహ్మద్‌ సిరాజ్‌, హర్షిత్‌ రాణా రాణించడంతో మొదటిరోజు కేవలం 67 పరుగులే చేసి ఏకంగా ఏడు వికెట్లు కోల్పోయింది. శనివారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా 104 పరుగుల వద్ద ఆసీస్‌ ఆలౌట్‌ అయింది. బుమ్రాకు ఐదు, రాణాకు మూడు, సిరాజ్‌కు రెండు వికెట్లు దక్కాయి.

జైస్వాల్‌ భారీ సెంచరీ.. శతక్కొట్టిన కోహ్లి
ఫలితంగా 46 పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌కు మొదలుపెట్టిన టీమిండియాకు ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌, కేఎల్‌ రాహుల్‌ శుభారంభం అందించారు. ఆదివారం నాటి మూడో రోజు ఆటలో యశస్వి భారీ శతకం(161) పూర్తి చేసుకోగా.. రాహుల్‌ 77 పరుగులతో  ఆకట్టుకున్నాడు. 

వీరిద్దరి భారీ భాగస్వామ్యంతో పెర్త్‌లో పట్టు బిగించిన టీమిండియా.. కోహ్లి అజేయ సెంచరీ(100)కి తోడు నితీశ్‌ రెడ్డి మెరుపు ఇన్నింగ్స్‌ (27 బంతుల్లో 38 నాటౌట్‌)కారణంగా మరింత పటిష్ట స్థితిలో నిలిచింది.

534 పరుగుల భారీ లక్ష్యం.. చేతులెత్తేసిన ఆసీస్‌
ఆరు వికెట్ల నష్టానికి 487 పరుగుల వద్ద ఉండగా.. రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. తద్వారా ఆసీస్‌ ముందు 534 పరుగుల భారీ లక్ష్యం ఉంచింది. అయితే, ఆది నుంచే మరోసారి అటాక్‌ ఆరంభించిన భారత బౌలర్లు ఆసీస్‌ను 238 పరుగులకే ఆలౌట్‌ చేశారు. దీంతో టీమిండియా జయభేరి మోగించి ఆసీస్‌కు సొంతగడ్డపై భారీ షాకిచ్చింది. 

ఇక భారత బౌలర్లలో  బుమ్రా, సిరాజ్‌ మూడేసి వికెట్లు కూల్చగా.. వాషింగ్టన్‌ సుందర్‌ రెండు, హర్షిత్‌ రాణా, నితీశ్‌ రెడ్డి ఒక్కో వికెట్‌ తమ ఖాతాలో వేసుకున్నారు. కాగా ఆస్ట్రేలియాలో టీమిండియాకు ఇదే అతిపెద్ద విజయం నమోదు చేసింది.

INDvsAUS - 295 పరుగుల తేడాతో టీమిండియా ఘనవిజయం

టీమిండియా వర్సెస్‌ ఆస్ట్రేలియా తొలి టెస్టు
👉వేదిక: పెర్త్‌ స్టేడియం, పెర్త్‌
👉టాస్‌: టీమిండియా.. బ్యాటింగ్‌
👉టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌ స్కోరు: 150 ఆలౌట్‌
👉ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌ స్కోరు: 104 ఆలౌట్‌

👉టీమిండియా రెండో ఇన్నింగ్స్‌ స్కోరు:487/6 డిక్లేర్డ్‌
👉ఆసీస్‌ లక్ష్యం: 534 పరుగులు
👉ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ స్కోరు: 238 ఆలౌట్‌
👉ఫలితం: ఆసీస్‌పై 295 పరుగుల తేడాతో టీమిండియా భారీ గెలుపు
👉ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: జస్‌ప్రీత్‌ బుమ్రా(8 వికెట్లు)
👉నాలుగురోజుల్లోనే ముగిసిన మ్యాచ్‌.

చదవండి: IPL Auction 2025: అతడికి ఏకంగా రూ. 18 కోట్లు.. కారణం మాత్రం కావ్యానే!.. పాపం ప్రీతి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement