
ఇస్లామాబాద్: పహల్గాం దాడి ఘటనకు పాకిస్తాన్‌పై భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లో భారత సైన్యం మెరుపు దాడులు చేసింది. ఆపరేషన్ సింధూర్ పేరిట.. పాక్‌లోని కొట్లీ, మురిడ్కే, బహవల్పూర్, ముజఫరాబాద్ ప్రాంతాల్లో దాడులు జరిపింది. ఇక, భారత్ దాడులపై పాక్ ప్రధాని షహబాబ్ షరీఫ్ స్పందించారు. ఈ చర్యలకు పాకిస్తాన్ కచ్చితంగా బదులు తీర్చుకుంటుంది అని చెప్పుకొచ్చారు.
భారత్ దాడులను పాక్ సైన్యం ధ్రువీకరించింది. భారత్ దాడులపై పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘పాక్ శత్రువు భారత్.. మా దేశంలోని ఐదు ప్రాంతాల్లో దాడులు జరిపింది. ఈ చర్యలకు పాకిస్తాన్ కచ్చితంగా బదులు తీర్చుకుంటుంది. ఈ సమయంలో పాక్ సైన్యం వెంట దేశమంతా నిలబడి ఉంది. శత్రువును ఎలా ఎదుర్కోవాలో పాకిస్తాన్ ఆర్మీకి తెలుసు. ప్రత్యర్థి దుష్ట ప్రణాళికలను ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేరనీయం’ తెలిపారు. అలాగే, ఈ దాడులను ఆయన యుద్ధ చర్యలు అని పేర్కొన్నారు.
మరోవైపు పాక్ ప్రధాని ప్రకటన తర్వాత సరిహద్దులో పాక్ ఆర్మీ రెచ్చిపోయింది. పూంఛ్, రాజౌరి సెక్టార్లలో పాక్ సైన్యం కాల్పులు ప్రారంభించింది. దీంతో భారత్ సైతం కాల్పులు మొదలుపెట్టింది. ఎల్‌వోసీ వెంట ఇరు దేశాల సైనికుల కాల్పులతో ఉద్రిక్త వాతావారణం నెలకొంది. దాడులు జరిగిన ప్రాంతాల్లో మురిడ్కే టెర్రరిస్టు గ్రూప్ లష్కరే తొయిబాకు హెడ్ క్వార్టర్స్‌గా ఉంది. ఇక పంజాబ్ ప్రావిన్స్‌లోని బహవల్పూర్‌లో మసూద్ అజార్ నేతృత్వంలోని జైష్ -ఎ- మహ్మద్ స్థావరం ఉంది.
పాక్ డీజీ ఐఎస్‌పీఆర్ లెప్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరీ స్పందించారు. ఈ దాడులు జరిగినట్లు తెలిపారు. ఈ దాడుల్లో ముగ్గురు చనిపోయారని, 12 మందికి గాయాలైనట్టు పాక్ ఆర్మీ పేర్కొంది. సమయం చూసుకొని బదులుగా స్పందిస్తామని పేర్కొన్నారు. భారత్ తాత్కాలిక ఆనందాన్ని శాశ్వత దుఃఖంతో భర్తీ చేస్తామని అన్నారు.
పాక్ అప్రమత్తం..
భారత్ దాడుల అనంతరం పాక్ డిఫెన్స్ వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి. లాహోర్, సియాల్‌కోట్ ఎయిర్‌పోర్ట్‌లను 48 గంటల పాటు మూసివేసింది. దేశంలో పరిస్థితులను గమనిస్తున్నట్టు అధికారులు చెప్పుకొచ్చారు.