India-Pakistan war
-
ఇండియా-పాక్ యుద్ధం ఆధారంగా సినిమా, వీడియో చూశారా?
విద్యుత్ జమాల్ హీరోగా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన స్పై యాక్షన్ ఫిల్మ్ ‘ఐబీ 71’. దలీప్ తాహిల్, అనుపమ్ ఖేర్, విశాల్ జెత్వా ప్రధాన పాత్రలు పోషించారు. టి–సిరీస్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై విద్యుత్ జమాల్ నిర్మించిన ఈ చిత్రం మే 12న రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘ఐబీ ఆపరేషన్1: ఇంటెలిజెన్స్ ఇన్ యాక్షన్’ అనే వీడియోను విడుదల చేశారు. ‘‘1971లో ఇండియా – పాకిస్తాన్ల మధ్య యుద్ధం జరిగింది. అయితే ఈ వార్‌లో ఇండియా గెలవడానికి కారణమైన ‘ఇంటెలిజెన్స్ బ్యూరో సీక్రెట్ మిషన్స్ ఆధారంగా, వాస్తవ ఘటనలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం’’ అని యూనిట్ పేర్కొంది. -
మన సైనికుల పరాక్రమం గర్వకారణం
న్యూఢిల్లీ: 1971లో దాయాది దేశం పాకిస్తాన్‌పై జరిగిన యుద్ధంలో భారత సైనికులు ప్రదర్శించిన ధైర్య సాహసాలు సర్వదా శ్లాఘనీయం, గర్వకారణమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మన సైనిక దళాల పరాక్రమంతో భారత్‌కు నిర్ణయాత్మక విజయం దక్కిందని గుర్తుచేశారు. విజయ్ దివస్ సందర్భంగా ఆయన బుధవారం ఈ మేరకు ట్వీట్ చేశారు. జాతీయ యుద్ధ స్మారకం వద్ద స్వర్ణ విజయ్ జ్యోతిని వెలిగించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని మోదీ వెల్లడించారు. 1971 యుద్ధంలో పాకిస్తాన్‌పై భారత్ విజయానికి 49 ఏళ్లు నిండాయి. ఏడాది పాటు జరగనున్న 50వ వార్షికోత్సవాలను మోదీ ప్రారంభించారు. ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద స్వర్ణ విజయ్ జ్యోతిని స్వయంగా వెలిగించి, వేడుకలకు శ్రీకారం చుట్టారు. 4 విజయ జ్యోతులను(కాగడాలు) దేశంలోని వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లనున్నట్లు రక్షణ శాఖ తెలియజేసింది. 1971 యుద్ధంలో పరమ వీరచక్ర, మహా వీరచక్ర పురస్కారాలు పొందిన విజేతల సొంత గ్రామాలకు ఈ జ్యోతులు వెళ్తాయని తెలిపింది. బంగ్లాదేశ్ ఆవిర్భావానికి దారితీసిన 1971 యుద్ధంలో పాకిస్తాన్లో భారత్ విజయానికి గుర్తుగా ప్రతిఏటా డిసెంబర్ 16న విజయ్ దివస్ వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ విజయానికి 49 ఏళ్ల పూర్తయిన సందర్భంగా ఈసారి ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఏడాదిపాటు స్వర్ణ విజయోత్సవాలు జరుగుతాయి. -
యుద్ధం వస్తే...12.5 కోట్ల ప్రాణ నష్టం
వాషింగ్టన్: భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య అణు యుద్ధమే గనక సంభవిస్తే మానవాళి కనివినీ ఎరగని స్థాయిలో ప్రాణ, పర్యావరణ నష్టం ఉంటుందని ఒక తాజా అధ్యయనంలో బయటపడింది. అణుయుద్ధం ప్రారంభమైన వారం రోజుల్లోనే 5 కోట్ల నుంచి 12.5 కోట్ల మంది ప్రాణాలు కోల్పోతారని పేర్కొంది. అది రెండో ప్రపంచయుద్ధం జరిగిన ఆరేళ్లలో జరిగిన ప్రాణ నష్టం కంటే ఎక్కువని వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ యుద్ధ ప్రభావం ఉంటుందని పేర్కొంది. భారత్, పాక్‌ల మధ్య ఒకవేళ 2025లో యుద్ధం జరిగితే చోటు చేసుకునే పరిణామాలపై యూనివర్సిటీ ఆఫ్ కొలరాడొ బౌల్డర్, రట్జర్స్ యూనివర్సిటీలకు చెందిన పరిశోధకులు అధ్యయనం చేశారు. ప్రస్తుతం భారత్, పాక్‌ల వద్ద సుమారు 150 చొప్పున అణ్వాయుధాలున్నాయని, అవి 2025 నాటికి 200 నుంచి 250 వరకు పెరగగలవన్నారు. భారత్, పాక్ యుద్ధం వల్ల సాధారణ మరణ రేటు ఒక్కసారిగా రెట్టింపు అవుతుందని యూనివర్సిటీ ఆఫ్ కొలరాడొ బౌల్డర్‌లో ప్రొఫెసర్ అయిన బ్రయాన్ టూన్ పేర్కొన్నారు. ఈ అధ్యయన విశేషాలను ‘సైన్స్ అడ్వాన్సెస్’ అనే జర్నన్‌లో ప్రచురించారు. ‘రెండు దేశాలు భారీగా ఆయుధాలను పెంచుకుంటున్నాయి. ఆ రెండు దేశాల్లో జనాభా కూడా ఎక్కువే. అదీకాక, రెండు దేశాల మధ్య అపరిష్కృత కశ్మీర్ సమస్య ఉంది. అందువల్ల యుద్ధమే వస్తే భారీ ప్రాణ నష్టం తప్పదు’ అని టూన్ వ్యాఖ్యానించారు. అణ్వాయుధ ప్రయోగం వల్ల వెలువడిన 16 నుంచి 36 మిలియన్ టన్నుల సూక్ష్మ కార్బన్ అణువులు కొన్ని వారాల్లోపే ప్రపంచమంతా వ్యాపిస్తాయన్నారు. ఇవి సోలార్ రేడియేషన్‌ను గ్రహించి, గాలిని మరింత వేడెక్కిస్తాయని వివరించారు. అలాగే, సూర్యరశ్మి భూమిని చేరడం 20% నుంచి 35% తగ్గుతుందని, దానివల్ల భూ ఉపరితలంపై ఉష్ణోగ్రత 2 నుంచి 5 సెల్సియస్ డిగ్రీలు తగ్గుతుందని పేర్కొన్నారు. మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా వర్షపాతం 15% నుంచి 30% తగ్గుతుందన్నారు. -
అక్టోబర్‌లో భారత్‌తో యుద్ధం!
ఇస్లామాబాద్: అక్టోబర్ లేదా నవంబర్‌లో భారత్, పాక్‌ల మధ్య యుద్ధం జరగబోతోందని పాక్ రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్ బుధవారం రావల్పిండిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘బహుశా, రెండు దేశాల మధ్య ఇదే తుది యుద్ధం కానుంది’ అని పేర్కొన్నారని పాకిస్తాన్ టుడే తెలిపింది. ‘భారత్‌లో ముస్లిం వ్యతిరేక భావజాలం ఉందని జిన్నా ఏనాడో చెప్పారు. ఆ దేశంతో చర్చలు జరిగే అవకాశాలున్నాయని ఇంకా భావించే వారు మూర్ఖుల కిందే లెక్క’ అని రషీద్ వ్యాఖ్యానించారు. కశ్మీరీలకు సంఘీభావం తెలపాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చిన ఆయన ముహర్రం తర్వాత కశ్మీర్ లోయను సందర్శిస్తానన్నారు. కశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న పాక్ ఈ అంశంపై అంతర్జాతీయ మద్దతు కూడగట్టే విషయంలో తీవ్రంగా విఫలమై, ఏకాకిగా మారిపోవడం తెల్సిందే. (చదవండి: భారత్‌తో అణు యుద్ధానికైనా రెడీ) -
యుద్ధాలు అధికారానికి సోపానాలా?
ఉగ్రవాదుల ఏరివేతకు వైమానిక దళం బాలాకోట్‌పై జరిపిన దాడి నుంచి రాజకీయ లబ్ధి పొందేందుకు అధికార బీజేపీ ప్రయత్నిస్తోందంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ దాడితో లోక్‌సభ ఎన్నికల్లో తమకు మరో పాతిక సీట్లు ఎక్కువ వస్తాయని బీజేపీ నేత యడ్యూరప్ప చేసిన వ్యాఖ్యలు వీరి ఆరోపణకు బలాన్నిచ్చాయి. అయితే, సైనిక ఘర్షణలు నిజంగానే పార్టీలు అధికారంలోకి రావడానికి దోహదపడతాయా అంటే కచ్చితంగా అవునని జవాబు చెప్పలేం. అయితే, వీటి వల్ల దేశంలో రాజకీయ ముఖ చిత్రంలో మార్పులు జరిగినట్టు గత యుద్ధాలు, సైనిక ఘర్షణల తదనంతర పరిణామాలు తెలియజేస్తున్నాయి. దేశ విభజన జరిగిననాటి నుంచి ఇంత వరకు భారత్ పాకిస్తాన్‌తో నాలుగుసార్లు, చైనాతో ఒకసారి యుద్ధానికి దిగింది. శ్రీలంకలో అంతర్యుద్ధం నివారణకు సైనిక జోక్యం చేసుకుంది. వీటి తర్వాత జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీకి మళ్లీ విజయం దక్కినా దక్కకపోయినా రాజకీయ సమీకరణాలు గణనీయంగా మారాయి. ఉదాహరణకు భారత్ 1962లో చైనాతో, 1965లో పాకిస్తాన్‌తో తలపడింది. చైనా యుద్ధంలో ఓడిపోతే, పాకిస్తాన్‌పై విజయం సాధించింది. ఈ రెండు యుద్ధాలు కూడా 1962, 1967 సార్వత్రిక ఎన్నికల మధ్యనే జరిగాయి. ఆ సమయంలో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈ యుద్ధాల తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓట్లు, సీట్లు కూడా తగ్గాయి. 1971లో జరిగిన బంగ్లాదేశ్ కోసం భారత్, పాకిస్తాన్ల మధ్య యుద్ధం జరిగింది. ఇందిరా గాంధీ హయాంలో జరిగిన ఈ యుద్ధం తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ బలం భారీగా పెరిగింది. వాజ్‌పేయి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో కార్గిల్ యుద్ధం జరిగింది. దీంట్లో భారత్ విజయం సాధించింది. తర్వాత కొన్ని నెలలకు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మళ్లీ అధికారం కైవసం చేసుకుంది. అయితే, సీట్లు మాత్రం ఏమీ పెరగలేదు. కేవలం యుద్ధాల వల్లే రాజకీయ పార్టీల తలరాత మారిందని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఎన్నికల్లో ఆర్థిక, సామాజికాంశాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. మూడో భారత్–పాక్ యుద్ధం(1971) బంగ్లాదేశ్ విముక్తి కోసం జరిగిన ఈ యుద్ధంలో భారత్ గెలిచింది. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉండగా ఈ యుద్ధం జరిగింది. 1971 ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన కొన్ని నెలలకు ఈ యుద్ధం జరిగింది. తర్వాత 1977లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఏకంగా 158 సీట్లు కోల్పోయింది. 1971 ఎన్నికల్లో 352 సీట్లు సాధించిన కాంగ్రెస్ ఈసారి 154 సీట్లతో సరిపెట్టుకుంది. ఈ ఎన్నికల్లో జనతా పార్టీ గెలిచింది. స్వాతంత్య్రం తర్వాత కేంద్రంలో ఏర్పడ్డ తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం ఇది. మొదటి భారత్–పాక్ యుద్ధం(1947) కశ్మీర్ యుద్ధంగా పేరొందిన ఇది 1947 అక్టోబర్– 1948 డిసెంబర్ల మధ్య జరిగింది. ఆ తర్వాత 1952లో జరిగిన మొదటి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. భారత్–చైనా యుద్ధం (1962) 1962, అక్టోబర్ 20 నుంచి 1962 నవంబర్ 21 వరకు జరిగింది. దీంట్లో భారత్ ఓడింది. యుద్ధం సమయంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. 1962లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 361 సీట్లు సాధించింది. ఐపీకేఎఫ్ (1987) శ్రీలంకలో అంతర్యుద్ధాన్ని నివారించడం కోసం శాంతి పరిరక్షక దళాన్ని భారత్ అక్కడికి పంపి లంక సైనిక వ్యవహారాల్లో జోక్యం చేసుకుంది. నాటి ప్రధాని రాజీవ్ గాంధీ 1991లో హత్యకు గురయ్యారు. ఐపీకేఎఫ్‌ను పంపడానికి ముందు 1984లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ రికార్డు స్థాయిలో 404 సీట్లు గెలుచుకుంది. ఈ జోక్యం తర్వాత జరిగిన (1989) ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది. రెండో భారత్–పాక్ యుద్ధం(1965) లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానిగా ఉండగా, 1965లో ఈ యుద్ధం జరిగితే, రెండేళ్ల తర్వాత 1967లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి 283 సీట్లతో అధికారం దక్కించుకుంది. అయితే, అంతకుముందు ఎన్నికలతో పోలిస్తే 78 సీట్లు తక్కువ వచ్చాయి. కార్గిల్ యుద్ధం(1999) బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో కార్గిల్ యుద్ధం జరిగింది. 1999 మే నుంచి జూలై వరకు జరిగిన ఈ యుద్ధంలో భారత్‌దే గెలుపు.ఈ యుద్ధానికి ముందు 1998లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. కార్గిల్ యుద్ధం తర్వాత 2004లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి 138 సీట్లు మాత్రమే వచ్చాయి. అంతకుముందు ఎన్నికల్లో వచ్చిన సీట్ల కంటే ఇవి 44 తక్కువ. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కూడా మెజారిటీ సీట్లు సాధించలేక పోయింది. అయినా కూడా ఇతర పార్టీలతో కలిసి యూపీఏ పేరుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. -
రెండోవైపు చూడాలనుకుంటే..తట్టుకోలేరు
బాలాకోట్‌లోని ఉగ్ర శిబిరాలపై భారత్ జరిపిన దాడికి ప్రతిదాడి అన్నట్లు.. పాకిస్తాన్‌కు చెందిన జెట్ విమానాలు భారత గగనతలంలోకి ప్రవేశించాయి. వాటిని మన వాయుసేన దీటుగా తిప్పి కొట్టింది. గత కొద్ది రోజులుగా భారత్, పాక్‌ల మధ్య జరుగుతున్న పరిణామాల దృష్ట్యా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయా..? అంత ధైర్యంగా పాకిస్తాన్ మనపైకి వచ్చి భారత్ ముందు నిలబడగలిగే సత్తా ఉందా..? ఒకవేళ యుద్ధమే కనుక అనివార్యమైతే భారత్ ముందు పాకిస్తాన్ చిత్తు కావాల్సిందేనని పలువురు నిపుణులు చెబుతున్నారు. ఆయుధాల విషయంలో ఇరు దేశాల సామర్థ్యంపై కథనం.. వ్యూహాలతో బోల్తా కొట్టించగలం.. భారత వాయుసేన తన వ్యూహాలతో శత్రువులను ఇట్టే బోల్తా కొట్టిస్తుందనేందుకు బాలాకోట్ దాడులు తాజా నిదర్శనం. 12 మిరాజ్ యుద్ధ విమానాలు మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ నుంచి సరిహద్దులకు ఆవల ఉన్న బాలాకోట్‌కు నిమిషాల్లో చేరుకోవడం, దాడులు చేసి తిరిగి రావడం ఓ విశేషమైతే.. దాడుల తర్వాత తేరుకున్న పాక్.. ప్రతిదాడులు కూడా చేయలేకపోవడానికి మన వాయుసేన వ్యూహం కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. పాక్ యుద్ధ విమానాలు చివరి నిమిషాల్లో కొన్ని నిప్పులు మాత్రమే కురిపించాయి. ఒకవేళ పాక్ విమానాలు మిరాజ్లపై దాడి చేసి ఉంటే.. మరింత ఎత్తులో ఎగురుతున్న యుద్ధవిమానాలు వాటిని ధ్వంసం చేసి ఉండేవి. ఈ దాడులు జరుగుతున్న సమయంలోనే నియంత్రణ రేఖ వెంబడి ఎయిర్‌బోర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ శత్రు విమానాలపై కన్నేసి ఉంచిందని చెబుతున్నారు. ఎంబ్రారర్ విమానాన్ని ఆధునీకరించి తయారుచేసుకున్న ఈ రాడార్ వందల కిలోమీటర్ల అవతల ఉన్న శత్రు విమానాలను కూడా గుర్తించి ఆ సమాచారాన్ని మనకు అందించగలవు. మన కన్నా సగం.. పాకిస్తాన్‌తో పోలిస్తే మన వాయుసేన ఎంతో సమర్థమైందని చెప్పేందుకు ఎన్నో తార్కాణాలు ఉన్నాయి. ముందుగా అంకెల సంగతి చూద్దాం.. భారత్ అమ్ముల పొది లో ఉన్న మొత్తం యుద్ధ విమానాల సంఖ్య 2 వేలకుపైనే.. పాక్ వద్ద మాత్రం వెయ్యికి కొంచెం అటు ఇటుగా ఉన్నాయి. భారత వాయుసేనలో మిరాజ్, మిగ్, సుఖోయ్, జాగ్వార్లు పెద్ద సంఖ్యలో ఉండగా.. మన కన్నా సగమే విమానాలు పాక్ సొంతం. కాకపోతే తుపాకులతో కూడిన హెలికాప్టర్ల విషయంలో మాత్రం పాక్ మనకంటే కొం చెం సానుకూల స్థితిలో ఉంది. మన వద్ద 15 ఉండగా.. పాక్ వద్ద 49 వరకున్నాయి. పదాతి దళాల కదలికలు ఎక్కువగా ఉన్నప్పుడే ఈ హెలికాప్టర్లు ఉపయోగకరం. కాలం మారింది.. నిన్న మొన్నటివరకు పాక్‌తో యుద్ధం అంటే అణ్వస్త్ర ప్రయోగాల భయం వెన్నాడేది. అయితే ఈ పరిస్థితి రావడం చాలా కష్టమని ఇప్పటికే అనేకమార్లు రుజువైంది. అగ్రరాజ్యాలు సైతం అణ్వస్త్రాల దాడి చివరి ఆయుధం మాత్రమేనని అంటున్నాయి. సంఖ్యాబలం పరంగా భారత వాయుసేనకు ఏమాత్రం సరితూగని పాక్.. పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతుందని అనుకోలేమని నిపుణులు అంటున్నారు. 2016 నాటి సర్జికల్ దాడులు, బాలాకోట్ దాడులు రెండూ భారత్ వైఖరిలో మార్పులకు సంకేతమని.. అవసరమైతే శక్తినంతా ఉపయోగించి తిరగబడే స్థాయికి భారత్ ఎదిగిందని అంతర్జాతీయ స్థాయిలో నిపుణులు అంటున్నారు. తొలిసారేం కాదు.. యుద్ధవిమానాలతో పోరు విషయంలో పాకిస్తాన్‌పై భారత్ పూర్తిస్థాయిలో ఆధిక్యత సాధించడం ఇదేమీ కొత్త కాదు. 1999 నాటి కార్గిల్ యుద్ధం, 2002 నాటి సరిహద్దు ప్రతిష్టంభనల సమయంలోనూ మనోస్థైర్యం కోల్పోకుండా పాక్‌ను దెబ్బతీయడంలో భారత్ విజయం సాధించిందని ‘ఎయిర్ పవర్ ఎట్ 18,000 ఫీట్: కార్గిల్ వార్’పేరుతో బెంజిమన్ లాంబెత్ ప్రచురించిన నివేదికలో పేర్కొన్నారు. అప్పట్లో కంటికి కనిపించని లక్ష్యాలనూ గుర్తించి ధ్వంసం చేయగల క్షిపణులున్న మిగ్–29లను భారత్ ఉపయోగించింది. ఇవి పాక్‌కు చెందిన ఎఎఫ్–16లతో నేరుగా తలపడగలవు. అదే జరిగితే ఎఫ్–16లు తోకముడవాల్సిందేనని, ఈ కారణంగానే పాకిస్తాన్ వాయుసేన.. తన సరిహద్దులకు మాత్రమే పరిమితమైందని.. పదాతిదళాలకు రక్షణగా వచ్చేందుకు నిరాకరించిందని ఈ నివేదికలో ప్రస్తావించారు. -
నా చేతుల్లో.. మోదీ చేతుల్లో ఉండదు..
ఇస్లామాబాద్: అణ్వాయుధాలు కలిగి ఉన్న భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఒకసారి యుద్ధం మొదలైతే తన చేతుల్లో గానీ.. భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల్లో గానీ ఉండదని పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ఒకసారి యుద్ధం ప్రారంభమయ్యాక అది ఎక్కడ వరకు వెళ్తుందో ఎవరికి తెలియదని వ్యాఖ్యానించారు. మొదటి, రెండో ప్రపంచ యుద్ధాలతోపాటు ఇప్పటివరకు జరిగిన యుద్ధాలన్నీ అవగాహనలేమి కారణంగానే ప్రారంభమయ్యాయని అన్నారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న ప్రస్తుత ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత్‌ను చర్చలకు ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో బుధవారం ఆయన పాక్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. పాక్ యుద్ధవిమానాలను తమ వైమానిక దళం సమర్థవంతంగా తిప్పికొట్టిందని.. ఒక పైలట్ జాడ తెలియడం లేదంటూ భారత విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటన చేసిన కొద్ది నిమిషాల్లోనే పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడటం గమనార్హం. ‘మీరు మా(పాక్) దేశంలోకి వస్తే.. మేము మీ(భారత్) దేశంలోకి రాగలమని తెలపడానికే బుధవారం నాటి సైనిక చర్యలు. భారత్‌కు చెందిన రెండు మిగ్ విమానాలను కూల్చివేశాం. ఒక భారత పైలట్ ప్రస్తుతం మా వద్ద ఉన్నారు. ఇరు దేశాలు కూర్చొని.. చర్చల ద్వారా ప్రస్తుత పరిస్థితిని చక్కదిద్దుకుందాం. పుల్వామా దాడిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాల బాధను అర్థం చేసుకోగలం. పుల్వామా ఘటన విషయంలో విచారణ చేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. విచారణకు పూర్తిగా సహకరిస్తాం. ప్రస్తుత పరిస్థితిని భారత్ మరింత దిగజారుస్తుందని నాకు అనుమానం ఉంది. భారత్ గనుక దాడులకు ఉదృతం చేస్తే.. మేము తప్పక ప్రతీకారం తీర్చుకుంటాం ’అని ఇమ్రాన్ స్పష్టం చేశారు. -
భారత సైనిక శిబిరాలే లక్ష్యంగా...
న్యూఢిల్లీ: కశ్మీర్లో టెన్షన్..టెన్షన్..సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం. ఊహించినట్లుగానే ప్రతీకార చర్యకు దిగిన పాకిస్తాన్ ఆర్మీ, వైమానిక దళాలతో భారత సైనిక శిబిరాలను లక్ష్యంగా చేసుకుంది. వేగంగా స్పందించిన భారత బలగాలు పాకిస్తాన్ కుట్రను భగ్నం చేసి దీటైన జవాబిచ్చాయి. ఈ క్రమంలో వైమానిక దళ పైలట్ ఒకరు గల్లంతయ్యారు. దాయాది దాడుల్ని అంతే దీటుగా తిప్పికొట్టామని, జమ్మూలోని రాజౌరీ సెక్టార్లో పాకిస్తాన్‌కు చెందిన ఎఫ్–16 యుద్ధ విమానాన్ని గాల్లోనే పేల్చేశామని భారత్ ప్రకటించింది. రెండు భారత విమానాల్ని నేలకూల్చామని తెలిపిన పాకిస్తాన్ తొలుత ఇద్దరు పైలట్లను అదుపులోకి తీసుకున్నామని వెల్లడించింది. ఆ తరువాత మాటమార్చి తమ అధీనంలో ఒక పైలటే ఉన్నారని చెప్పింది. పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో ఉగ్ర ముష్కరుల శిక్షణా శిబిరాల్ని ధ్వంసం చేసిన తరువాత బుధవారం సరిహద్దుల్లో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. పాకిస్తాన్ అదుపులో ఉన్న పైలట్‌ను వింగ్ కమాండర్ అభినందన్‌గా గుర్తించిట్లు వైమానిక వర్గాలు ధ్రువీకరించాయి. ఇరు దేశాల మధ్య పోటాపోటీ ప్రకటనలతో కశ్మీర్, ఢిల్లీ, ఇస్లామాబాద్‌లలో ఉత్కంఠత నెలకొంది. పాకిస్తాన్ నుంచి ఎదురయ్యే ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు భద్రతా బలగాల్ని అప్రమత్తం చేశారు. రెండు అణ్వాయుధ దేశాల మధ్య తలెత్తిన తాజా పరిస్థితిపై అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేసింది. ఉద్రిక్తతల్ని తగ్గించుకునేందుకు వెంటనే ప్రయత్నాలు ప్రారంభించాలని అమెరికా, చైనా, రష్యాలు రెండు దేశాలకు సూచించాయి. ఇదిలా ఉండగా, పాకిస్తాన్‌తో తాజా పరిస్థితిపై విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్..చైనా, రష్యా విదేశాంగ మంత్రులకు వివరించారు. ఆత్మరక్షణ కోసమే బాలాకోట్‌లో ఉగ్ర శిక్షణా కేంద్రాలపై వైమానిక దాడులకు పాల్పడ్డామని తెలిపారు. కుట్రను భగ్నం చేసి తిప్పికొట్టాం: భారత్ పాకిస్తాన్ గగనతలంలోకి చొరబడి మరీ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ శిబిరాల్ని భారత వైమానిక దళం నేలమట్టం చేసిన మరుసటి రోజే రెండు దేశాల్లో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. భారత సైనిక శిబిరాలు లక్ష్యంగా బుధవారం పాకిస్తాన్ వైమానిక దళం దాడులకు దిగిందని, కానీ ఆ కుట్రను భగ్నం చేసి తిప్పికొట్టామని విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు. నిబంధనలు అతిక్రమించి జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్, నౌషెరా సెక్టార్లలో మన గగనతలంలోకి చొరబడిన పాకిస్తాన్ దుశ్చర్యను వెంటనే అడ్డుకుని తరిమికొట్టామని, వెనుదిరుగుతూ పాకిస్తాన్ విమానాలు బాంబులు జారవిడిచాయని వెల్లడించారు. మన వైపు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు. ఈ క్రమంలో జరిగిన పోరాటంలో ఒక మిగ్–21 విమానాన్ని కోల్పోయామని, అందులోని పైలట్ గల్లంతయ్యారని ధ్రువీకరించారు. అదే సమయంలో పాకిస్తాన్‌కు చెందిన ఎఫ్–16 యుద్ధ విమానాన్ని నేలమట్టం చేశామని వెల్లడించారు. అవును.. ఆ పైలట్ పాక్ చెరలోనే.. గల్లంతైన పైలట్ అభినందన్ పాకిస్తాన్ చెరలో ఉన్న సంగతిని విదేశాంగ శాఖ ధ్రువీకరించింది. ఆయనను సురక్షితంగా విడుదల చేయాలని, జెనీవా నిబంధనల ప్రకారం ఆయనతో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని పాకిస్తాన్‌కు సూచించింది. ‘భారత ఆర్మీ శిబిరాలు లక్ష్యంగా బుధవారం ఉదయం పాకిస్తాన్ వైమానిక దాడులకు ప్రయత్నించింది. అప్రమత్తంగా ఉన్న మన బలగాలు పాకిస్తాన్ కుట్రను భగ్నం చేశాయి. మన గగనతలంలో పాకిస్తాన్ విమానాలను పసిగట్టిన వెంటనే వైమానిక దళం శరవేగంగా స్పందించింది. గాల్లో జరిగిన హోరాహోరీ పోరులో మిగ్ 21 బైసన్ విమానం పాకిస్తాన్‌కు చెందిన యుద్ధ విమానాన్ని నేలకూల్చింది. ఆ విమానం ఆకాశం నుంచి పాకిస్తాన్ భూభాగంలో కూలిపోవడాన్ని అక్కడి సైనికులు కూడా గమనించారు. ఈ క్రమంలో దురదృష్టవశాత్తూ ఒక మిగ్ 21 విమానాన్ని కోల్పోయాం’ అని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ చెప్పారు. ఒకటి పీఓకేలో.. మరొకటి కశ్మీర్లో.. భారత్‌కు చెందిన రెండు యుద్ధ విమానాల్ని కూల్చివేశామని ప్రకటించిన పాకిస్తాన్ అందులో ఒకటి పాక్ ఆక్రమిత కశ్మీర్లో, మరొకటి జమ్మూ కశ్మీర్లో పడిపోయిందని తెలిపింది. తమ చెరలో ఉన్న వింగ్ కమాండర్ అభినందన్ మాట్లాడుతున్న 46 సెకన్ల నిడివి గల ఓ వీడియోను పాకిస్తాన్ విడుదల చేసింది. ‘నేను భారత వైమానిక దళ అధికారిని. నా సర్వీస్ నెంబర్ 27981. నేను క్షేమంగానే ఉన్నాను. పాకిస్తాన్ జవాన్లు బాగానే చూసుకుంటున్నారు’అని ఆ వీడియోలో ఉంది. సైనిక ధర్మం ప్రకారం అభినందన్‌కు చికిత్స అందిస్తున్నామని పాకిస్తాన్ ఆర్మీ అధికార ప్రతినిధి చెప్పారు. ఉత్తరాదిలో విమాన సేవలకు అంతరాయం.. సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఢిల్లీతో పాటు జమ్మూ కశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్‌లలో 9 విమానాశ్రయాల్లో సేవలను కొన్ని గంటల పాటు నిలిపేసి, తరువాత పునరుద్ధరించారు. మరోవైపు, రాజౌరీ, పూంచ్, ఉడీ సెక్టార్లలో మంగళవారం రాత్రి నుంచే పాకిస్తాన్ వైపు నుంచి మోర్టార్, షెల్ల దాడి కొనసాగుతోంది. సరిహద్దు గ్రామాల ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని, బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ అయ్యాయి. ఆర్మీ, సరిహద్దు భద్రతా బలగాలు అత్యంత అప్రమత్తతతో వ్యవహరిస్తున్నాయి. ఇదిలా ఉండగా, ముంబైలోని కీలక ప్రాంతాల్లో ఆర్మీని మోహరించారు. సాయంత్రం 6 గంటల నుంచి ఢిల్లీ మెట్రో రైలు నెట్‌వర్క్‌లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. పాకిస్తాన్ సైనికులకు చిక్కిన వింగ్ కమాండర్ అభినందన్ యోగక్షేమాలపై రాజకీయ పక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఆయన్ని సాధ్యమైనంత త్వరగా దేశానికి తిరిగి తీసుకురావాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశాయి. ‘బ్రింగ్ బ్యాక్ అభినందన్’, ‘అభినందన్’ అనే హాష్‌ట్యాగ్‌లు ఆన్లైన్లో విస్తృతంగా ట్రెండ్ అవుతున్నాయి. అభినందన్ క్షేమంగా తిరిగొస్తాడని ఆశిస్తున్నానని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ‘మన పైలట్ ఒకరు గల్లంతైన సంగతి విని బాధపడుతున్నా. ఆయన క్షేమంగా తిరిగొస్తారని ఆశిస్తున్నా ’ అని రాహుల్ అన్నారు. వెంటనే విడుదల చేయండి: భారత్ పైలట్ అభినందన్‌ను వెంటనే విడుదల చేయాలని భారత్ పాకిస్తాన్‌ను డిమాండ్ చేసింది. అంతర్జాతీయ నిబంధనల్ని ఉల్లంఘించి గాయపడిన జవాన్‌ను వీడియోలో చిత్రీకరిం చడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు బుధవారం పాకిస్తాన్ డిప్యూటీ హైకమిషనర్ సయ్యద్ హైదర్ షాను పిలిపిం చుకున్న విదేశాంగ శాఖ తన నిరసనను తెలిపింది. జాతీయ భద్రతా విషయంలో కఠిన, నిర్ణయాత్మక చర్యలు తీసుకునేందుకు వెనకాడ బోమని తేల్చి చెప్పింది. ఆందోళనలో అభినందన్ కుటుంబం సాక్షి, చెన్నై: పాకిస్తాన్ చేతిలో బందీగా ఉన్న భారత వైమానిక దళం వింగ్ కమాండర్ అభినందన్ చెన్నైలోని తాంబరానికి చెందిన వారు. ఆయన తండ్రి వర్ధమాన్ వైమానిక దళంలో మాజీ అధికారి. స్వస్థలం కేరళ అయినా, అభినందన్ కుటుంబీకులు తాంబరంలో స్థిరపడ్డారు. అభినందన్ బందీ సమాచారం ఆయన కుటుంబీకులు, బంధువుల్ని ఆందోళనకు గురిచేస్తోంది. వైమానిక దళ అధికారులు అభినందన్ నివాసానికి వచ్చి కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతున్నారు. పైలట్ నచికేత ఎలా విడుదలయ్యారంటే.. 1999లో కార్గిల్ యుద్ధకాలంలో మిగ్–27 విమానాన్ని నడిపే పైలట్ నచికేత సాంకేతిక కారణాలతో విమానాన్ని ల్యాండ్‌చేశాడు. వెంటనే ఆయనను పాక్ సైన్యం అదుపులోకి తీసుకుంది. వెంటనే భారత దౌత్యకార్యాలయం రంగంలోకి దిగింది,. ‘అప్పుడే నాకు పాక్ విదేశాంగ శాఖ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ నచికేత విడుదలకు అంగీకరించారని, పాక్ విదేశాంగ కార్యాల యానికి వచ్చి తీసుకెళ్లాలని ఫోన్లో చెప్పారు. పైలట్‌కు అవమానం జరిగిన విదేశాంగ శాఖ కార్యాలయంలో అడుగు పెట్టే ప్రసక్తే లేదని నేను గట్టిగా చెప్పా. జెనీవా ఒప్పందం ప్రకారం యుద్ధ సమయంలో ఎవరైనా పట్టుబడితే జాగ్రత్తగా చూస్తూ, మానవత్వంతో వ్యవహరిం చాలని షరతులున్నాయి. అంతర్జాతీయ న్యాయసూత్రాలకు పాక్ కట్టుబడాల్సిందేనని చెప్పా. దెబ్బకు వారు దారిలోకొచ్చారు. పాక్ అధికారులే భారత ఎంబసీకి వచ్చి పైలట్ నచికేతను నాకు అప్పగించారు’ అని పాక్‌లో నాటి భారత హైకమిషనర్ పార్థసారథి తన అనుభవాల్ని గుర్తుచేసుకున్నారు. -
నలబైఏళ్లకు న్యాయం
సాక్షి, ముంబై : ఓ వీర పత్నికి 40 ఏళ్ల తరువాత న్యాయం జరిగింది. 1965లో భారత్-పాకిస్తాన్ల మధ్య జరిగిన యుద్ధంలో బాబాజీ జాదవ్ వీరమరణం పొందారు. ఆయన భార్య ఇందిరా జాదవ్ ప్రభుత్వం తరఫున లభించాల్సిన స్థలం కోసం అప్పటి నుంచి పోరాటం చేస్తూనే ఉంది. ఎట్టకేలకు కోర్టు మంగళవారం ఇందిరాకు న్యాయం చేసింది. అంతేకాకుండా జాప్యం జరగడానికి గల ప్రధాన కారకుడైన అప్పటి ప్రభుత్వ అధికారి నుంచి రూ.75 వేలు జరిమానా వసూలు చేయాలని కోర్టు ఆదేశించింది. ఇప్పుడు ఆమె వయసు 74 ఏళ్లు ఉండగా అనారోగ్యంతో ప్రస్తుతం పుణేలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పూర్తి వివరాలిలా ఉన్నాయి.... 1965లో భారత్-పాక్ మధ్య జరిగిన యుద్ధంలో దేశ రక్షణ కోసం పోరాడుతూ జాదవ్ వీరమరణం పొందాడు. అప్పటి ప్రధాని లాల్ బహాదూర్ శాస్త్రి ఆయన భార్య ఇందిరాకు పది ఎకరాల పంట భూమి ఉచితంగా అందజేయాలని ఆదేశించారు. కానీ పది ఎకరాల పంట భూమితో పాటు ఇల్లు కట్టుకునేందుకు రత్నగిరిలో ఐదు గుంటలు స్థలం ఇవ్వాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఆ స్థలాన్ని ఆమెకు అందజేయాలని 1967 నుంచి మిలిటరీ శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతోంది. ఎట్టకేలకు ప్రభుత్వం 1994లో ఆమెకు ఖేడ్‌లో ఓ స్థలాన్ని చూపించిం ది.ఆ స్థలం నిర్మాణుష్య ప్రాంతంలో ఉండడం వల్ల దాన్ని స్వీకరించేందుకు ఆమె నిరాకరించింది. ఆ తరవాత ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోవడమే మానేసింది. బాధితురాలు లాయర్లు అవినాశ్ గోఖలే, మయూరేష్ మోద్గీల ద్వారా ప్రజాప్రయోజనాల వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తుల బెంచి పలుమార్లు విచారణ జరిపి ప్రభుత్వాన్ని హెచ్చరించింది. అప్పటి నుంచి ఇంటి స్థలం ధర ఎంత నిర్ణయించాలనే దానిపై ప్రభుత్వం తేల్చుకోలేకపోయింది. ఆమెకు ఉచితంగా స్థలం అందజేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు. చివరకు కోర్టు ఉచితంగా అందజేయాలని తీర్పునిచ్చింది. ఇంటికోసం అందజేసే స్థలాన్ని 1998 మార్కెట్ రేటు ప్రకారం సగం ధరకే అందజేయాలని ఆదేశించింది. ఆ ప్రకారం స్థలం రేటు రూ.45 వేలు పలుకుతుంది. రూ.75 వేలు జరిమానా డబ్బులోంచి మొత్తాన్ని చెల్లించి మిగతా రూ.30 వేలు ఇందిరా జాదవ్ బ్యాంక్ ఖాతాలో జమచేయాలని కోర్టు చెప్పింది. ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా చూడాలని, వెంటనే న్యాయం చేయాలని న్యాయమూర్తులు అభయ్ ఓక్, ఎ.ఎస్.చందూర్కర్ ఆదేశించారు.