వాషింగ్టన్: భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య అణు యుద్ధమే గనక సంభవిస్తే మానవాళి కనివినీ ఎరగని స్థాయిలో ప్రాణ, పర్యావరణ నష్టం ఉంటుందని ఒక తాజా అధ్యయనంలో బయటపడింది. అణుయుద్ధం ప్రారంభమైన వారం రోజుల్లోనే 5 కోట్ల నుంచి 12.5 కోట్ల మంది ప్రాణాలు కోల్పోతారని పేర్కొంది. అది రెండో ప్రపంచయుద్ధం జరిగిన ఆరేళ్లలో జరిగిన ప్రాణ నష్టం కంటే ఎక్కువని వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ యుద్ధ ప్రభావం ఉంటుందని పేర్కొంది.
భారత్, పాక్‌ల మధ్య ఒకవేళ 2025లో యుద్ధం జరిగితే చోటు చేసుకునే పరిణామాలపై యూనివర్సిటీ ఆఫ్ కొలరాడొ బౌల్డర్, రట్జర్స్ యూనివర్సిటీలకు చెందిన పరిశోధకులు అధ్యయనం చేశారు. ప్రస్తుతం భారత్, పాక్‌ల వద్ద సుమారు 150 చొప్పున అణ్వాయుధాలున్నాయని, అవి 2025 నాటికి 200 నుంచి 250 వరకు పెరగగలవన్నారు. భారత్, పాక్ యుద్ధం వల్ల సాధారణ మరణ రేటు ఒక్కసారిగా రెట్టింపు అవుతుందని యూనివర్సిటీ ఆఫ్ కొలరాడొ బౌల్డర్‌లో ప్రొఫెసర్ అయిన బ్రయాన్ టూన్ పేర్కొన్నారు. ఈ అధ్యయన విశేషాలను ‘సైన్స్ అడ్వాన్సెస్’ అనే జర్నన్‌లో ప్రచురించారు.
‘రెండు దేశాలు భారీగా ఆయుధాలను పెంచుకుంటున్నాయి. ఆ రెండు దేశాల్లో జనాభా కూడా ఎక్కువే. అదీకాక, రెండు దేశాల మధ్య అపరిష్కృత కశ్మీర్ సమస్య ఉంది. అందువల్ల యుద్ధమే వస్తే భారీ ప్రాణ నష్టం తప్పదు’ అని టూన్ వ్యాఖ్యానించారు. అణ్వాయుధ ప్రయోగం వల్ల వెలువడిన 16 నుంచి 36 మిలియన్ టన్నుల సూక్ష్మ కార్బన్ అణువులు కొన్ని వారాల్లోపే ప్రపంచమంతా వ్యాపిస్తాయన్నారు. ఇవి సోలార్ రేడియేషన్‌ను గ్రహించి, గాలిని మరింత వేడెక్కిస్తాయని వివరించారు. అలాగే, సూర్యరశ్మి భూమిని చేరడం 20% నుంచి 35% తగ్గుతుందని, దానివల్ల భూ ఉపరితలంపై ఉష్ణోగ్రత 2 నుంచి 5 సెల్సియస్ డిగ్రీలు తగ్గుతుందని పేర్కొన్నారు. మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా వర్షపాతం 15% నుంచి 30% తగ్గుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment