భారత సైనిక శిబిరాలే లక్ష్యంగా... | India demands immediate safe release of IAF pilot | Sakshi
Sakshi News home page

యుద్ధ మేఘాలు

Published Thu, Feb 28 2019 4:00 AM | Last Updated on Thu, Feb 28 2019 8:31 AM

India demands immediate safe release of IAF pilot - Sakshi

న్యూఢిల్లీ: కశ్మీర్‌లో టెన్షన్‌..టెన్షన్‌..సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం. ఊహించినట్లుగానే ప్రతీకార చర్యకు దిగిన పాకిస్తాన్‌ ఆర్మీ, వైమానిక దళాలతో భారత సైనిక శిబిరాలను లక్ష్యంగా చేసుకుంది. వేగంగా స్పందించిన భారత బలగాలు పాకిస్తాన్‌ కుట్రను భగ్నం చేసి దీటైన జవాబిచ్చాయి. ఈ క్రమంలో వైమానిక దళ పైలట్‌ ఒకరు గల్లంతయ్యారు. దాయాది దాడుల్ని అంతే దీటుగా తిప్పికొట్టామని, జమ్మూలోని రాజౌరీ సెక్టార్‌లో పాకిస్తాన్‌కు చెందిన ఎఫ్‌–16 యుద్ధ విమానాన్ని గాల్లోనే పేల్చేశామని భారత్‌ ప్రకటించింది. రెండు భారత విమానాల్ని నేలకూల్చామని తెలిపిన పాకిస్తాన్‌ తొలుత ఇద్దరు పైలట్‌లను అదుపులోకి తీసుకున్నామని వెల్లడించింది. ఆ తరువాత మాటమార్చి తమ అధీనంలో ఒక పైలటే ఉన్నారని చెప్పింది.

పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో ఉగ్ర ముష్కరుల శిక్షణా శిబిరాల్ని ధ్వంసం చేసిన తరువాత బుధవారం సరిహద్దుల్లో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. పాకిస్తాన్‌ అదుపులో ఉన్న పైలట్‌ను వింగ్‌ కమాండర్‌ అభినందన్‌గా గుర్తించిట్లు వైమానిక వర్గాలు ధ్రువీకరించాయి. ఇరు దేశాల మధ్య పోటాపోటీ ప్రకటనలతో కశ్మీర్, ఢిల్లీ, ఇస్లామాబాద్‌లలో ఉత్కంఠత నెలకొంది. పాకిస్తాన్‌ నుంచి ఎదురయ్యే ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు భద్రతా బలగాల్ని అప్రమత్తం చేశారు. రెండు అణ్వాయుధ దేశాల మధ్య తలెత్తిన తాజా పరిస్థితిపై అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేసింది. ఉద్రిక్తతల్ని తగ్గించుకునేందుకు వెంటనే ప్రయత్నాలు ప్రారంభించాలని అమెరికా, చైనా, రష్యాలు రెండు దేశాలకు సూచించాయి. ఇదిలా ఉండగా, పాకిస్తాన్‌తో తాజా పరిస్థితిపై విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌..చైనా, రష్యా విదేశాంగ మంత్రులకు వివరించారు. ఆత్మరక్షణ కోసమే బాలాకోట్‌లో ఉగ్ర శిక్షణా కేంద్రాలపై వైమానిక దాడులకు పాల్పడ్డామని తెలిపారు.

కుట్రను భగ్నం చేసి తిప్పికొట్టాం: భారత్‌
పాకిస్తాన్‌ గగనతలంలోకి చొరబడి మరీ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌ శిబిరాల్ని భారత వైమానిక దళం నేలమట్టం చేసిన మరుసటి రోజే రెండు దేశాల్లో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. భారత సైనిక శిబిరాలు లక్ష్యంగా బుధవారం పాకిస్తాన్‌ వైమానిక దళం దాడులకు దిగిందని, కానీ ఆ కుట్రను భగ్నం చేసి తిప్పికొట్టామని విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు. నిబంధనలు అతిక్రమించి జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్, నౌషెరా సెక్టార్లలో మన గగనతలంలోకి చొరబడిన పాకిస్తాన్‌ దుశ్చర్యను వెంటనే అడ్డుకుని తరిమికొట్టామని, వెనుదిరుగుతూ పాకిస్తాన్‌ విమానాలు బాంబులు జారవిడిచాయని వెల్లడించారు. మన వైపు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు. ఈ క్రమంలో జరిగిన పోరాటంలో ఒక మిగ్‌–21 విమానాన్ని కోల్పోయామని, అందులోని పైలట్‌ గల్లంతయ్యారని ధ్రువీకరించారు. అదే సమయంలో పాకిస్తాన్‌కు చెందిన ఎఫ్‌–16 యుద్ధ విమానాన్ని నేలమట్టం చేశామని వెల్లడించారు.

అవును.. ఆ పైలట్‌ పాక్‌ చెరలోనే..
గల్లంతైన పైలట్‌ అభినందన్‌ పాకిస్తాన్‌ చెరలో ఉన్న సంగతిని విదేశాంగ శాఖ ధ్రువీకరించింది. ఆయనను సురక్షితంగా విడుదల చేయాలని, జెనీవా నిబంధనల ప్రకారం ఆయనతో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని పాకిస్తాన్‌కు సూచించింది. ‘భారత ఆర్మీ శిబిరాలు లక్ష్యంగా బుధవారం ఉదయం పాకిస్తాన్‌ వైమానిక దాడులకు ప్రయత్నించింది. అప్రమత్తంగా ఉన్న మన బలగాలు పాకిస్తాన్‌ కుట్రను భగ్నం చేశాయి. మన గగనతలంలో పాకిస్తాన్‌ విమానాలను పసిగట్టిన వెంటనే వైమానిక దళం శరవేగంగా స్పందించింది. గాల్లో జరిగిన హోరాహోరీ పోరులో మిగ్‌ 21 బైసన్‌ విమానం పాకిస్తాన్‌కు చెందిన యుద్ధ విమానాన్ని నేలకూల్చింది. ఆ విమానం ఆకాశం నుంచి పాకిస్తాన్‌ భూభాగంలో కూలిపోవడాన్ని అక్కడి సైనికులు కూడా గమనించారు. ఈ క్రమంలో దురదృష్టవశాత్తూ ఒక మిగ్‌ 21 విమానాన్ని కోల్పోయాం’ అని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రవీశ్‌ కుమార్‌ చెప్పారు.

ఒకటి పీఓకేలో.. మరొకటి కశ్మీర్‌లో..
భారత్‌కు చెందిన రెండు యుద్ధ విమానాల్ని కూల్చివేశామని ప్రకటించిన పాకిస్తాన్‌ అందులో ఒకటి పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో, మరొకటి జమ్మూ కశ్మీర్‌లో పడిపోయిందని తెలిపింది. తమ చెరలో ఉన్న వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ మాట్లాడుతున్న 46 సెకన్ల నిడివి గల ఓ వీడియోను పాకిస్తాన్‌ విడుదల చేసింది. ‘నేను భారత వైమానిక దళ అధికారిని. నా సర్వీస్‌ నెంబర్‌ 27981. నేను క్షేమంగానే ఉన్నాను. పాకిస్తాన్‌ జవాన్లు బాగానే చూసుకుంటున్నారు’అని ఆ వీడియోలో ఉంది. సైనిక ధర్మం ప్రకారం అభినందన్‌కు చికిత్స అందిస్తున్నామని పాకిస్తాన్‌ ఆర్మీ అధికార ప్రతినిధి చెప్పారు.

ఉత్తరాదిలో విమాన సేవలకు అంతరాయం..
సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఢిల్లీతో పాటు జమ్మూ కశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్‌లలో 9 విమానాశ్రయాల్లో సేవలను కొన్ని గంటల పాటు నిలిపేసి, తరువాత పునరుద్ధరించారు. మరోవైపు, రాజౌరీ, పూంచ్, ఉడీ సెక్టార్లలో మంగళవారం రాత్రి నుంచే పాకిస్తాన్‌ వైపు నుంచి మోర్టార్, షెల్‌ల దాడి కొనసాగుతోంది. సరిహద్దు గ్రామాల ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని, బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ అయ్యాయి. ఆర్మీ, సరిహద్దు భద్రతా బలగాలు అత్యంత అప్రమత్తతతో వ్యవహరిస్తున్నాయి. ఇదిలా ఉండగా, ముంబైలోని కీలక ప్రాంతాల్లో ఆర్మీని మోహరించారు. సాయంత్రం 6 గంటల నుంచి ఢిల్లీ మెట్రో రైలు నెట్‌వర్క్‌లో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు.

పాకిస్తాన్‌ సైనికులకు చిక్కిన వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ యోగక్షేమాలపై రాజకీయ పక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఆయన్ని సాధ్యమైనంత త్వరగా దేశానికి తిరిగి తీసుకురావాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశాయి. ‘బ్రింగ్‌ బ్యాక్‌ అభినందన్‌’, ‘అభినందన్‌’ అనే హాష్‌ట్యాగ్‌లు ఆన్‌లైన్‌లో విస్తృతంగా ట్రెండ్‌ అవుతున్నాయి. అభినందన్‌ క్షేమంగా తిరిగొస్తాడని ఆశిస్తున్నానని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. ‘మన పైలట్‌ ఒకరు గల్లంతైన సంగతి విని బాధపడుతున్నా. ఆయన క్షేమంగా తిరిగొస్తారని ఆశిస్తున్నా ’ అని రాహుల్‌ అన్నారు.



వెంటనే విడుదల చేయండి: భారత్‌
పైలట్‌ అభినందన్‌ను వెంటనే విడుదల చేయాలని భారత్‌ పాకిస్తాన్‌ను డిమాండ్‌ చేసింది. అంతర్జాతీయ నిబంధనల్ని ఉల్లంఘించి గాయపడిన జవాన్‌ను వీడియోలో చిత్రీకరిం చడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు బుధవారం పాకిస్తాన్‌ డిప్యూటీ హైకమిషనర్‌ సయ్యద్‌ హైదర్‌ షాను పిలిపిం చుకున్న విదేశాంగ శాఖ తన నిరసనను తెలిపింది. జాతీయ భద్రతా విషయంలో కఠిన, నిర్ణయాత్మక చర్యలు తీసుకునేందుకు వెనకాడ బోమని తేల్చి చెప్పింది.  

ఆందోళనలో అభినందన్‌ కుటుంబం
సాక్షి, చెన్నై: పాకిస్తాన్‌ చేతిలో బందీగా ఉన్న భారత వైమానిక దళం వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ చెన్నైలోని తాంబరానికి చెందిన వారు. ఆయన తండ్రి వర్ధమాన్‌ వైమానిక దళంలో మాజీ అధికారి. స్వస్థలం కేరళ అయినా, అభినందన్‌ కుటుంబీకులు తాంబరంలో స్థిరపడ్డారు. అభినందన్‌ బందీ సమాచారం ఆయన కుటుంబీకులు, బంధువుల్ని ఆందోళనకు గురిచేస్తోంది. వైమానిక దళ అధికారులు అభినందన్‌ నివాసానికి వచ్చి కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతున్నారు.

పైలట్‌ నచికేత ఎలా విడుదలయ్యారంటే..
1999లో కార్గిల్‌ యుద్ధకాలంలో మిగ్‌–27 విమానాన్ని నడిపే పైలట్‌ నచికేత సాంకేతిక కారణాలతో విమానాన్ని ల్యాండ్‌చేశాడు. వెంటనే ఆయనను పాక్‌ సైన్యం అదుపులోకి తీసుకుంది. వెంటనే భారత దౌత్యకార్యాలయం రంగంలోకి దిగింది,. ‘అప్పుడే నాకు పాక్‌ విదేశాంగ శాఖ నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చింది. అప్పటి పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ నచికేత విడుదలకు అంగీకరించారని, పాక్‌ విదేశాంగ కార్యాల యానికి వచ్చి తీసుకెళ్లాలని ఫోన్‌లో చెప్పారు. పైలట్‌కు అవమానం జరిగిన విదేశాంగ శాఖ కార్యాలయంలో అడుగు పెట్టే ప్రసక్తే లేదని నేను గట్టిగా చెప్పా. జెనీవా ఒప్పందం ప్రకారం యుద్ధ సమయంలో ఎవరైనా పట్టుబడితే జాగ్రత్తగా చూస్తూ, మానవత్వంతో వ్యవహరిం చాలని షరతులున్నాయి. అంతర్జాతీయ న్యాయసూత్రాలకు పాక్‌ కట్టుబడాల్సిందేనని చెప్పా. దెబ్బకు వారు దారిలోకొచ్చారు. పాక్‌ అధికారులే  భారత ఎంబసీకి వచ్చి పైలట్‌ నచికేతను నాకు అప్పగించారు’ అని పాక్‌లో నాటి భారత హైకమిషనర్‌ పార్థసారథి తన అనుభవాల్ని గుర్తుచేసుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement