బాలాకోట్‌లోని ఉగ్ర శిబిరాలపై భారత్ జరిపిన దాడికి ప్రతిదాడి అన్నట్లు.. పాకిస్తాన్‌కు చెందిన జెట్ విమానాలు భారత గగనతలంలోకి ప్రవేశించాయి. వాటిని మన వాయుసేన దీటుగా తిప్పి కొట్టింది. గత కొద్ది రోజులుగా భారత్, పాక్‌ల మధ్య జరుగుతున్న పరిణామాల దృష్ట్యా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయా..? అంత ధైర్యంగా పాకిస్తాన్ మనపైకి వచ్చి భారత్ ముందు నిలబడగలిగే సత్తా ఉందా..? ఒకవేళ యుద్ధమే కనుక అనివార్యమైతే భారత్ ముందు పాకిస్తాన్ చిత్తు కావాల్సిందేనని పలువురు నిపుణులు చెబుతున్నారు. ఆయుధాల విషయంలో ఇరు దేశాల సామర్థ్యంపై కథనం..
వ్యూహాలతో బోల్తా కొట్టించగలం..
భారత వాయుసేన తన వ్యూహాలతో శత్రువులను ఇట్టే బోల్తా కొట్టిస్తుందనేందుకు బాలాకోట్ దాడులు తాజా నిదర్శనం. 12 మిరాజ్ యుద్ధ విమానాలు మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ నుంచి సరిహద్దులకు ఆవల ఉన్న బాలాకోట్‌కు నిమిషాల్లో చేరుకోవడం, దాడులు చేసి తిరిగి రావడం ఓ విశేషమైతే.. దాడుల తర్వాత తేరుకున్న పాక్.. ప్రతిదాడులు కూడా చేయలేకపోవడానికి మన వాయుసేన వ్యూహం కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. పాక్ యుద్ధ విమానాలు చివరి నిమిషాల్లో కొన్ని నిప్పులు మాత్రమే కురిపించాయి. ఒకవేళ పాక్ విమానాలు మిరాజ్‌లపై దాడి చేసి ఉంటే.. మరింత ఎత్తులో ఎగురుతున్న యుద్ధవిమానాలు వాటిని ధ్వంసం చేసి ఉండేవి. ఈ దాడులు జరుగుతున్న సమయంలోనే నియంత్రణ రేఖ వెంబడి ఎయిర్‌బోర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ శత్రు విమానాలపై కన్నేసి ఉంచిందని చెబుతున్నారు. ఎంబ్రారర్ విమానాన్ని ఆధునీకరించి తయారుచేసుకున్న ఈ రాడార్ వందల కిలోమీటర్ల అవతల ఉన్న శత్రు విమానాలను కూడా గుర్తించి ఆ సమాచారాన్ని మనకు అందించగలవు.
మన కన్నా సగం..
పాకిస్తాన్‌తో పోలిస్తే మన వాయుసేన ఎంతో సమర్థమైందని చెప్పేందుకు ఎన్నో తార్కాణాలు ఉన్నాయి. ముందుగా అంకెల సంగతి చూద్దాం.. భారత్ అమ్ముల పొది లో ఉన్న మొత్తం యుద్ధ విమానాల సంఖ్య 2 వేలకుపైనే.. పాక్ వద్ద మాత్రం వెయ్యికి కొంచెం అటు ఇటుగా ఉన్నాయి. భారత వాయుసేనలో మిరాజ్, మిగ్, సుఖోయ్, జాగ్వార్లు పెద్ద సంఖ్యలో ఉండగా.. మన కన్నా సగమే విమానాలు పాక్ సొంతం. కాకపోతే తుపాకులతో కూడిన హెలికాప్టర్ల విషయంలో మాత్రం పాక్ మనకంటే కొం చెం సానుకూల స్థితిలో ఉంది. మన వద్ద 15 ఉండగా.. పాక్ వద్ద 49 వరకున్నాయి. పదాతి దళాల కదలికలు ఎక్కువగా ఉన్నప్పుడే ఈ హెలికాప్టర్లు ఉపయోగకరం.
కాలం మారింది..
నిన్న మొన్నటివరకు పాక్‌తో యుద్ధం అంటే అణ్వస్త్ర ప్రయోగాల భయం వెన్నాడేది. అయితే ఈ పరిస్థితి రావడం చాలా కష్టమని ఇప్పటికే అనేకమార్లు రుజువైంది. అగ్రరాజ్యాలు సైతం అణ్వస్త్రాల దాడి చివరి ఆయుధం మాత్రమేనని అంటున్నాయి. సంఖ్యాబలం పరంగా భారత వాయుసేనకు ఏమాత్రం సరితూగని పాక్.. పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతుందని అనుకోలేమని నిపుణులు అంటున్నారు. 2016 నాటి సర్జికల్ దాడులు, బాలాకోట్ దాడులు రెండూ భారత్ వైఖరిలో మార్పులకు సంకేతమని.. అవసరమైతే శక్తినంతా ఉపయోగించి తిరగబడే స్థాయికి భారత్ ఎదిగిందని అంతర్జాతీయ స్థాయిలో నిపుణులు అంటున్నారు.
తొలిసారేం కాదు..
యుద్ధవిమానాలతో పోరు విషయంలో పాకిస్తాన్‌పై భారత్ పూర్తిస్థాయిలో ఆధిక్యత సాధించడం ఇదేమీ కొత్త కాదు. 1999 నాటి కార్గిల్ యుద్ధం, 2002 నాటి సరిహద్దు ప్రతిష్టంభనల సమయంలోనూ మనోస్థైర్యం కోల్పోకుండా పాక్‌ను దెబ్బతీయడంలో భారత్ విజయం సాధించిందని ‘ఎయిర్ పవర్ ఎట్ 18,000 ఫీట్: కార్గిల్ వార్’పేరుతో బెంజిమన్ లాంబెత్ ప్రచురించిన నివేదికలో పేర్కొన్నారు. అప్పట్లో కంటికి కనిపించని లక్ష్యాలనూ గుర్తించి ధ్వంసం చేయగల క్షిపణులున్న మిగ్–29లను భారత్ ఉపయోగించింది. ఇవి పాక్‌కు చెందిన ఎఎఫ్–16లతో నేరుగా తలపడగలవు. అదే జరిగితే ఎఫ్–16లు తోకముడవాల్సిందేనని, ఈ కారణంగానే పాకిస్తాన్ వాయుసేన.. తన సరిహద్దులకు మాత్రమే పరిమితమైందని.. పదాతిదళాలకు రక్షణగా వచ్చేందుకు నిరాకరించిందని ఈ నివేదికలో ప్రస్తావించారు.
రెండోవైపు చూడాలనుకుంటే..తట్టుకోలేరు
Published Thu, Feb 28 2019 4:36 AM | Last Updated on Thu, Feb 28 2019 11:56 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment