
ఎయిర్ వైస్ మార్షల్ ఆర్.జి.కపూర్
న్యూఢిల్లీ: పాకిస్తాన్ వైమానిక దళం(పీఏఎఫ్)కు చెందిన ఎఫ్–16 కూల్చివేతపై వస్తున్న అనుమానాలను భారత వైమానిక దళం(ఐఏఎఫ్) మరోసారి కొట్టిపారేసింది. ఫిబ్రవరి 27వ తేదీన జరిగిన ఘటనలో తాము కూల్చింది ఎఫ్–16 యుద్ధ విమానమే అనేందుకు బలమైన ఆధారాలున్నాయని పేర్కొంది. సోమవారం రక్షణ శాఖ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎయిర్ వైస్ మార్షల్ ఆర్.జి.కపూర్ మాట్లాడారు. ‘ఫిబవరి 27వ తేదీన జరిగిన ఘటనలో పీఏఎఫ్ ఎఫ్–16ను వినియోగిం చడం మాత్రమే కాదు, దానిని ఐఏఎఫ్ మిగ్–21 బైసన్ విమానం కూల్చి వేసిందడానికి కూడా తిరుగులేని ఆధారాలున్నాయి’ అని తెలిపారు.
‘ఫిబ్రవరి 27వ తేదీన రెండు విమానాలు పరస్పరం తలపడిన విషయం సుస్పష్టం. అందులో ఒకటి పీఏఎఫ్‌కు చెందిన ఎఫ్–16 కాగా మరొకటి ఐఏఎఫ్‌కు చెందిన మిగ్–21 బైసన్ రకం విమానం. ఈ విషయాన్ని ఎలక్ట్రానిక్, రాడార్ వ్యవస్థలు కూడా పసిగట్టాయి’ అని వివరించారు. అయితే, భద్రతా కారణాల రీత్యా మిగతా వివరాలను తాము బహిరంగ పర్చలేక పోతున్నామన్నారు. ఈ సందర్భంగా ఆయన ఎయిర్‌బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్(అవాక్స్)కు సంబంధించిన చిత్రాలను ప్రదర్శించారు. ఫిబ్రవరి 27న ఎఫ్–16ను కూల్చివేసిన అనంతరం వింగ్ కమాండర్ అభినందన్ నడుపుతున్న మిగ్ విమానాన్ని పీఏఎఫ్ కూల్చివేయడంతో ఆయన పాక్ భూభాగంలో దిగటం, తర్వాత విడుదల తెల్సిందే.