Defense Department
-
YSR: ఆ కంటైనర్లలో అసలు ఏముందంటే..
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కంటైనర్లలో రక్షణ శాఖకు సంబంధించిన సామాగ్రిని తరలిస్తున్న నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాటు చేశామని.. వేల కోట్ల రూపాయలు తరలిస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ ఎం.డి షరీఫ్ హెచ్చరించారు. దేశ రక్షణ శాఖకు సంబంధించిన సామాగ్రిని చెన్నైకి తరలిస్తున్న నేపథ్యంలో పోలీసు, ఆర్మీకి చెందిన ఉన్నతాధికారులు, సిబ్బంది ఎస్కార్ట్‌గా విధులు నిర్వర్తిస్తున్న క్రమంలో రూ.వేలకోట్లు నగదు తరలిస్తున్నారంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం తగదని కడప డీఎస్పీ అన్నారు. దేశ రక్షణకు సంబంధించి సామాగ్రి తరలించే సమయంలో పక్కా ప్రణాళికతో భద్రతా ఏర్పాట్లు ఉంటాయని, సామాగ్రి వెళ్తున్న రూటులో ఎలాంటి అవాంతరాలు లేకుండా చూడాలన్న జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఆదేశాల మేరకు, రక్షణ శాఖ విజ్ఞప్తి మేరకు ఆర్మీ అధికారుల ఎస్కార్ట్‌తో పాటు పోలీస్ ఎస్కార్ట్ ఇచ్చామని తెలిపారు. వాస్తవాలు ఇలా ఉంటే సోషల్ మీడియా వేదికగా అసత్యాలు, అభూతకల్పనలు ప్రచారం చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. దుష్ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని డీఎస్పీ అన్నారు. -
తటస్థతకు తూట్లు పొడవొద్దు!
పాలనా ప్రక్రియలో పాలుపంచుకునే ఉన్నతాధికార వర్గం ఆ ప్రక్రియలో పెనవేసుకుని వుండే రాజకీయ పార్శ్వానికి ఎప్పుడూ దూరంగా ఉంటుంది. ప్రజాస్వామ్య మూలస్తంభాల్లో ఒకటైన కార్యనిర్వాహక వ్యవస్థ (ఎగ్జిక్యూటివ్)లో మంత్రులతోపాటు ఉన్నతాధికారవర్గం కూడా భాగస్వామే. ప్రభుత్వాలు మారినప్పుడల్లా మంత్రులు మారతారు. కానీ ఉన్నతాధివర్గం మాత్రం శాశ్వతం. అందుకే పాలనాపరమైన విధి నిర్వహణ వేరు... రాజకీయ ప్రచారం వేరు అనే స్పృహ అధికార యంత్రాంగానికి ఎప్పుడూ ఉంటుంది. సివిల్ సర్వీసు నిబంధనలు సైతం ఉన్నతాధికారులు రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనటానికి అంగీకరించవు. కానీ కేంద్ర ప్రభుత్వం ఇటీవల జారీచేసిన ఒక సర్క్యులర్ ఆ విభజనను కాస్తా మటుమాయం చేస్తోంది. గత తొమ్మిదేళ్లలో సాధించిన ప్రగతిని ప్రచారం చేసేందుకు సీనియర్ అధికారులు దేశంలోని 765 జిల్లాలకూ, ఆ జిల్లాల్లోని 26 కోట్ల 90 లక్షల గ్రామాలకూ తరలివెళ్లాలని ఆ సర్క్యులర్ నిర్దేశించింది. జాయింట్ సెక్రటరీ, డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్ స్థాయి ఉన్నతాధికారులు ఈ యజ్ఞంలో పాలుపంచుకోవాలట. వీరికి రథ్ ప్రభారీస్ (ప్రత్యేక అధికారులు)గా నామకరణం చేశారు. కేంద్రంలోని రక్షణ మంత్రిత్వ శాఖ సహా అన్ని శాఖలూ ఈ మాదిరి సర్క్యులర్‌నే విడుదల చేశాయి. రక్షణ శాఖ ఈ నెల 9న జారీ చేసిన ఉత్తర్వు మరింత విడ్డూర మైనది. వార్షిక సెలవుల్లో వెళ్లే సైనికులు తమ తమ నెలవుల్లో ‘సైనిక దూతలు’గా ప్రభుత్వ పథకా లను ప్రచారం చేయాలని ఆ ఉత్తర్వు పిలుపునిచ్చింది. నవంబర్ 20 మొదలుకొని జనవరి 25 వరకూ ‘వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర’ పేరుతో దీన్ని కొనసాగించాలన్నది సర్క్యులర్ సారాంశం. సరిగ్గా ఈ తేదీల మధ్యనే తెలంగాణ, రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికలుంటాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాక, ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చాక ఇలాంటి యాత్రలు ఎంతవరకూ సమంజసమన్న సంగతలావుంచి... అసలు ఉన్నతాధికార వర్గం ఈ మాదిరి ప్రచారకర్తలుగా పని చేయటం సరైనదేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పథకాల గురించి అందరికీ తెలిసేలా అవసరమైన ప్రచార ఉపకరణాలను సంసిద్ధపరచుకో వటం ఏ ప్రభుత్వానికైనా అవసరం. అందుకోసమే ప్రభుత్వంలో సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఉంటుంది. ఆ శాఖ ప్రభుత్వ పథకాల సమాచారాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్తుంది. తమ ప్రభుత్వమే మరో దఫా అధికారంలో కొనసాగేందుకు కావలసినదంతా చేస్తుంటుంది. ఇందుకు బడ్జెట్లో కేటాయింపులుంటాయి. తమది ప్రపంచంలోనే అత్యధిక కార్యకర్తలున్న రాజకీయ పార్టీ అని బీజేపీ చెప్పుకుంటుంది. ఆ పార్టీకి నోరున్న రాజకీయ నాయకుల లోటు కూడా లేదు. వీరందరినీ కాదని ప్రభుత్వ పథకాలనూ, వాటి ద్వారా సాధించిన ప్రగతినీ ప్రచారం చేసేందుకు ఉన్నతాధికార వర్గాన్ని దించాల నటంలో ఆంతర్యమేమిటన్నది అంతుపట్టని విషయం. కార్యకర్తలు, నాయకుల కంటే ఈ అధికారు లకే విశ్వసనీయత ఉంటుందని పాలకులు అనుకుంటున్నారా? ‘అధికారులు కేవలం ప్రభుత్వ కార్యాలయాల్లోని కుర్చీలకు అతుక్కుపోవాలా? తాము రూపొందించిన పథకాల ప్రభావం క్షేత్ర స్థాయిలో ఎలా ఉందో తెలుసుకోవద్దా?’ అంటూ బీజేపీ నేతలు చేస్తున్న తర్కం అర్థరహితమైనది. అలా తెలుసుకోవటానికీ, అవసరమైన మార్పులు చేసుకోవటానికీ పకడ్బందీ వ్యవస్థ అమల్లో ఉంది. రాష్ట్రాల్లో ప్రభుత్వాలున్నాయి. అవసరమైన సమాచారాన్ని సత్వరం పొందేందుకు ఎన్నో మార్గా లున్నాయి. ప్రభుత్వ పథకాల సమాచారం ప్రజలందరికీ అందించటానికి, అవి కేవలం లక్షిత వర్గాలకు మాత్రమే చేరేలా, దుర్వినియోగానికి తావులేకుండా చేయటానికి ఎన్నో నిబంధనలు అమల్లో కొచ్చాయి. కానీ ఉన్నతాధికారులే స్వయానా ప్రచారకర్తలుగా మారాలనడం, అందువల్ల మాత్రమే ప్రజలంతా అన్నీ తెలుసుకోగలుగుతారనడం సమంజసం కాదు. ఈ క్రమంలో ఉన్నతాధికార వర్గం రాజకీయాలను అంటించుకుంటే పాలనావ్యవస్థకుండే తటస్థతకు జరిగే నష్టం తీవ్రమైనది. వచ్చే ఎన్నికల్లో మరోసారి అధికారాన్ని కైవసం చేసుకోవడం ఎలాగన్నది కార్యనిర్వాహక వర్గంలోని మంత్రులకు సంబంధించిన ప్రశ్న. అదే వ్యవస్థలో భాగస్థులైన ఉన్నతాధికారవర్గం పాలనా ప్రక్రియ సజావుగా సాగటానికి, పాలకుల విధానాలూ, వారి పథకాలూ లక్షిత వర్గాలకు చేరేలా చేయటంవరకూ పూచీ పడుతుంది. అంతకుమించి ఏం చేసినా దానికి రాజకీయ మకిలి అంటుతుంది. బ్రిటిష్ వలస పాలకుల హయాంలో ఉన్నతాధివర్గం పని... కేవలం శాంతిభద్రతలను పర్యవేక్షించటం, ఖజానాకు ఆదాయం సమకూర్చటం మాత్రమే! కానీ స్వాతంత్య్రం వచ్చాక అదంతా మారింది. సంక్షేమ రాజ్య భావన బలపడటంతో జాతీయ స్థాయిలోనూ, రాష్ట్రాల స్థాయిలోనూ పాలకుల సంక్షేమ విధానాల అమలు, ప్రణాళికాబద్ధ అభివృద్ధి ఉన్నతాధికార వర్గం ప్రధాన కర్తవ్యా లయ్యాయి. రాజకీయ అస్థిరత అలుముకున్న దశలో కూడా ఉన్నతాధికార వ్యవస్థ తటస్థంగా వ్యవహరిస్తూ రాజకీయ నాయకత్వానికి అవసరమైన సలహాలిస్తూ పాలన సజావుగా సాగేందుకు దోహద పడుతోంది. సివిల్ సర్వీసు అధికారులు ఎట్టిపరిస్థితుల్లోనూ రాజకీయాల్లో లేదా మతసంబంధ అంశాల్లో తలదూర్చరాదని ఈ సర్వీసు పథ నిర్దేశకుడైన స్వర్గీయ సర్దార్ పటేల్ హితవు చెప్పారు. అందుకు పూర్తి భిన్నంగా పోయి పాలనావ్యవస్థకూ, సైనిక వ్యవస్థకూ రాజకీయ మకిలి అంటించి మన పొరుగునున్న పాకిస్తాన్ చివరికెలా అఘోరించిందో కనబడుతూనే ఉంది. అందువల్ల ఉన్నతాధికారగణాన్ని ప్రచారకర్తలుగా ఉరికించాలన్న సంకల్పాన్ని కేంద్రం విడనాడాలి. దాని తటస్థతను కాపాడాలి. -
రక్షణ శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘంలో రాహుల్ గాంధీ!
న్యూఢిల్లీ: రక్షణ శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం(స్టాండింగ్ కమిటీ) సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ బుధవారం నామినేట్ అయ్యారు. కాంగ్రెస్ మరో ఎంపీ అమర్‌సింగ్ కూడా ఇదే కమిటీకి నామినేట్ అయ్యారు. ఈ మేరకు లోక్‌సభ ఒక బులెటిన్ విడుదల చేసింది. పరువు నష్టం కేసులో అనర్హత వేటు పడకముందు రాహుల్ గాంధీ రక్షణ శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘంలో సభ్యుడిగా వ్యవహరించారు. ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని ఆగస్టు 7న పునరుద్ధరించిన సంగతి తెలిసిందే. ఎన్సీపీ ఎంపీ ఫైజల్ పి.పి.మొహమ్మద్ లోక్‌సభ సభ్యతాన్ని కూడా పునరుద్ధరించారు. ఆయనను వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ స్టాండింగ్ కమిటీకి నామినేట్ చేశారు. -
డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్లకు గ్రీన్ సిగ్నల్
కంటోన్మెంట్ (హైదరాబాద్): ఎనిమిదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న స్కైవేల ప్రాజెక్టు ఎట్టకేలకు పట్టాలెక్కనుంది. కీలకమైన స్థల సేకరణకు వీలుగా ఆర్మీ అంగీకారం తెలుపడంతో రాజీవ్ రహదారి, నాగ్‌పూర్ హైవే మార్గాల్లో రెండు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు ప్రధాన అడ్డంకులు తొలగిపోయాయి. స్కైవేలకు ఆర్మీ స్థలాలు ఇవ్వడం లేదంటూ మంత్రి కేటీఆర్ పదే పదే ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులను కలిసి మరోసారి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో స్పందించిన రక్షణ శాఖ ఉన్నతాధికారులు తదనుగుణంగా చర్యలు చేపట్టాల్సిందిగా స్థానిక మిలటరీ అధికారులు (ఎల్ఎంఏ), కంటోన్మెంట్ అధికారులకు ఆదేశాలు జారీ చేశా రు. 2017లోనే చేపట్టిన జాయింట్ సర్వేలో కొన్ని మార్పులు, చేర్పులతో తుది నివేదికను రూపొందించారు. రక్షణ వర్గాలు వెల్లడించిన సమాచారం మేరకు ప్రతిపాదిత రోడ్ల విస్తరణకు ఆర్మీ, కంటోన్మెంట్ 158 ఎకరాల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించనుంది. ప్రైవేటు స్థలాలు దీనికి అదనం. ఇక ప్రతిపాదిత మార్గాల్లో ప్రస్తుత రోడ్లను 60 మీటర్ల (196 అడుగులు)కు విస్తరించనున్నారు. ఎనిమిదేళ్ల క్రితమే ప్రతిపాదన తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికే ఏఓసీ మార్గంలో రోడ్ల మూసివేత అంశం కొనసాగుతోంది. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కొలువు తీరాక ఈ ప్రాజెక్టును చేపట్టడంతో పాటు, సెక్రెటేరియట్‌ను కంటోన్మెంట్లో ఏర్పాటు చేయాలని భావించింది. ప్రతిపాదిత సెక్రెటేరియట్ తూర్పు ద్వారం గుండా నేరుగా హకీంపేట వరకు రాజీవ్ రహాదారి మీదుగా, పడమర ద్వారం గుండా సుచిత్ర వరకు మేడ్చల్ హైవే మీదుగా రెండు స్కైవేలు నిర్మించాలని నిర్ణయించారు. ఈ మేరకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా సూత్రప్రాయ అంగీకారం తెలుపడంతో పాటు ఆర్మీ, కంటోన్మెంట్, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో జాయింట్ సర్వే కూడా పూర్తి చేశారు. ఈ మేరకు సెక్రెటేరియట్ కోసం 60 ఎకరాలు, స్కైవేలకు 90 ఎకరాల ఆర్మీ, కంటోన్మెంట్ స్థలాలు ఇవ్వాల్సి ఉంటుందని లెక్కతే ల్చారు. అయితే విలువైన స్థలాలను కోల్పోతున్న నేపథ్యంలో కంటోన్మెంట్‌కు ఏటా రూ.31 కోట్ల చొప్పున సర్వీసు చార్జీ చెల్లించాలని ప్రతిపాదించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. సెక్రెటేరియట్ నిర్మాణ ప్రతిపాదనను కూడా విరమించుకుని, పాతభవనం తొలగించి నిర్మించారు. 90 కాదు..158 ఎకరాలు వ్యూహాత్మక రోడ్డు అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్ఆర్డీపీ) కింద రాజీవ్ రహదారి, నాగ్‌పూర్ హైవే (ఎన్‌హెచ్–44) మార్గాల్లో స్కైవేల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు రూపొందించింది. ఈ మార్గాల్లో రోడ్డును 150 అడుగుల మేరకు విస్తరించాలని నిర్ణయించారు. తాజాగా ఈ స్కైవేలను మెట్రో కోసం కూడా వినియోగించుకోవాల ని నిర్ణయించారు. దీంతో రెండు మార్గాలను సుమారు 200 అడుగుల మేర విస్తరించనున్నారు. దీంతో గతంలో 90 ఎకరాల ఆర్మీ, కంటోన్మెంట్ స్థలం మాత్రమే అవసరం కాగా, ప్రస్తుతం 158 ఎకరాలు అవసరమని గుర్తించారు. ఈ ప్రతిపాదనకు ఆర్మీకూడా అంగీకరించడంతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కేందుకు మార్గం సుగమం అయ్యింది. 70 శాతం దుకాణాలు బంద్ ప్రతిపాదిత స్కైవేల నిర్మాణానికి స్థల సేకరణ చేపడితే కంటోన్మెంట్లో 70 శాతం కమర్షియల్ నిర్మాణాలు కనుమరు గు కానున్నాయి. ముఖ్యంగా రాజీవ్ రహ దారి మార్గంలో సికింద్రాబాద్ క్లబ్ నుంచి అల్వాల్ వరకు రోడ్డుకు ఇరువైపులా పెద్ద సంఖ్యలో వ్యాపార సముదాయాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ రోడ్డు కొన్నిచోట్ల 10 మీటర్ల నుంచి, గరిష్టంగా 30 మీటర్ల వరకు మాత్రమే ఉంది. తాజాగా ఈ రోడ్డును 60 మీటర్లకు విస్తరిస్తే రోడ్డుకు ఇరువైపులా వ్యాపార కేంద్రాలు దాదాపుగా తొలగించాల్సి వస్తుంది. ప్యారడైజ్– బోయిన్పల్లి మార్గంలోనూ కొన్ని వ్యాపార కేంద్రాలు రోడ్డు విస్తరణలో భాగంగా తొలగించాల్సి వస్తుంది. -
స్వయంకృతాపరాధం
పాలు పోసి పెంచిన పాము కాటేయడానికి పడగ విప్పి మీదకొస్తే ఎలా ఉంటుంది? అది ఎలా ఉంటుందో రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఇప్పుడు తెలిసొచ్చి ఉంటుంది. శత్రు దేశాలపై దాడి కోసం తాను పెంచిపోషిస్తూ వచ్చిన కిరాయి సైన్యం ‘వాగ్నర్ ప్రైవేట్ మిలటరీ కంపెనీ’, దాని అధినేత యెవ్జెనీ ప్రిగోజిన్ ఒక్కసారిగా తన మీదకే విరుచుకుపడేసరికి పుతిన్ దిగ్భ్రమకు లోనైనట్టున్నారు. గత వారాంతంలో రష్యాలో దాదాపు అంతర్యుద్ధం అంచులకు వెళ్ళిన పరిణామాలు అలాంటివి. దేశానికి దక్షిణాన అతి కీలక నగరాల్లో ఒకటైన రోస్తోవ్ – ఆన్– డాన్ చేజిక్కించుకొని, మాస్కో దిశగా వాగ్నర్ కిరాయి సైనికులు దూసుకు వస్తున్నప్పుడు పరిస్థితి భయానకంగా కనిపించింది. పైకి ఎన్ని బీరాలు పలికినా, చివరకు బెలారస్ దేశాధినేత కుదిర్చిన సంధితో పుతిన్ ఊపిరిపీల్చుకో గలిగారు. ఇప్పటికి వాగ్నర్ సేనలు వెనక్కి తగ్గి, ఉక్రెయిన్‌తో పోరుకు మళ్ళీ సరిహద్దుల దారి పట్టినా, పుతిన్‌కు తగిలిన షాక్, ఆయన ఇమేజ్‌కు పడిన దెబ్బ సామాన్యమైనవి కావు. ఎవరికీ వంగని, దేనికీ లొంగని ధీరుడిగా పేరున్న పుతిన్ ప్రతిష్ఠను ఈ తిరుగుబాటు చావుదెబ్బ తీసింది. ఉక్రెయిన్‌తో పోరులో బింకంగా ముందడుగు వేస్తున్న ఆయన ఈ దెబ్బ నుంచి కోలుకో వడం సులభమేమీ కాదు. 1999 నుంచి ఇప్పటి దాకా ప్రధానిగానో, అధ్యక్షుడిగానో అధికారంలో ఉంటూ వచ్చారు పుతిన్. రష్యాపై తిరుగులేని పట్టు బిగించిన ఈ ఏలిక తన సుదీర్ఘ హయాంలో తొలిసారిగా పెద్ద సవాలును ఎదుర్కొంటున్నారు. ‘పుతిన్‌కు వంటగాడ’నే పేరు దక్కిన ఒక దొంగ, హంతకుడు ఆ స్థాయి నుంచి ప్రైవేట్ సైనిక సంస్థకు అధిపతిగా ఎదగడం వెనక ఉన్నది పుతినే అన్నది జగమెరిగిన సత్యం. ఆఫ్రికా నుంచి అరబ్ ప్రపంచం వరకు, తాజా ఉక్రెయిన్ యుద్ధంలోనూ ఈ కిరాయి మూకల్ని వాడుకుంటూ వచ్చిందీ పుతినే! అందుకే, పూర్తి బాధ్యత కూడా ఆయనదే! ఉక్రెయిన్‌పై కార్యకలాపాల్లో రష్యా సైనికాధిపతుల పట్ల, ముఖ్యంగా రక్షణ మంత్రి పట్ల ప్రిగోజిన్ కొద్ది నెలలుగా అసంతృప్తితో ఉన్నారు. రక్షణ శాఖలో అగ్రస్థానంలో మార్పుల్ని కోరుకుంటున్నారు. ఆఖరికి ఆయన కిరాయి మూకలు తేలిగ్గా ఒక్కో నగరం దాటుకుంటూ మాస్కో సమీపా నికి రావడం అంతర్యుద్ధ మేఘాలను అలముకొనేలా చేసింది. బెలారస్ నేత లుక షెంకో తెరవెనుక రాజీతో ఇప్పటికి గండం గడిచింది. పుతిన్ మీద ప్రేమ కన్నా, డబ్బు కోసమనే ప్రాణాలకు తెగించే వాగ్నర్ మూకలు వెనుదిరగడం ఊరికే జరగలేదు. దేశద్రోహులంటూ వీరంగం వేసిన పుతిన్ చివరకు ఎవరిపై ఏ కేసులూ పెట్టనని ఒప్పుకోవాల్సి వచ్చింది. ప్రిగోజిన్‌పై చర్యలుండవని హామీ ఇవ్వాల్సొచ్చింది. రెండు లక్షల కోట్ల డాలర్ల కన్నా తక్కువకు పడిపోయిన జీడీపీతో, ఉక్రెయిన్‌తో పోరులో నష్టాలతో సతమతమవుతున్న రష్యా కొత్తగా మరో పోరు చేసే పరిస్థితిలో లేదు. వెరసి, తప్పుడు అంచనాలతో ఉక్రెయిన్‌పై 16 నెలల క్రితం యుద్ధం మొదలుపెట్టి, వెనక్కి రాలేని పద్మవ్యూహంలో చిక్కుకున్న పుతిన్‌కు ప్రపంచం ముందు ఇవి తీరని తలవంపులే. ఇవన్నీ ఆయన స్వయంకృతాపరాధాలే. బలమైన వాగ్నర్ మూకల్ని రక్షణ శాఖ కిందకు తేవాలన్న రష్యా సైనిక నేతల నిర్ణయం బెడిసికొట్టింది. వ్యూహంలో, దాడుల్లో తమ కన్నా వెనుకబడిన ప్రభుత్వ సైనిక నేతల కింద పనిచేయడం ప్రిగోజిన్‌కు మింగుడుపడని విషయం. అందువల్లే ఈ తిరుగుబాటు తలెత్తిందట. పుతిన్‌కు తాను వ్యతిరేకం కాదనే నేటికీ ప్రిగోజిన్ మాట. ఏమైనా, ఇప్పుడు రష్యాకు మరో తలనొప్పి వచ్చి పడింది. ఇకపై ఉక్రెయిన్‌పై పోరులో రష్యన్ సైనిక నేతలు మునుపటిలా ఈ కిరాయి మూకల్ని నమ్మలేరు. రక్షణ శాఖతో కాంట్రాక్ట్ ఉన్నవారే ఇకపై పోరులో పాల్గొంటారట. కానీ, అపనమ్మకమున్న యుద్ధంలో అడుగు ముందుకు పడదు. అసలే ఉక్రెయిన్‌లో ఆశించిన పురోగతి లేక అస్తుబిస్తవుతున్న పుతిన్‌కు ఇది దెబ్బ మీద దెబ్బ. తాజా తిరుగుబాటులో చేరని వాగ్నర్ ఫైటర్లను ప్రభుత్వ సైన్యంలోకి తీసుకోవాలని రష్యా యోచిస్తున్నప్పటికీ, ఇలాంటి మూకలతో రష్యా ఎలా వేగగలదో చెప్పలేం. ప్రిగోజిన్ తిరుగుబాటు ఇప్పటికి టీ కప్పులో తుపానైపోయినా, క్షీణిస్తున్న పుతిన్ పట్టుకు అది ప్రతీక. అణ్వస్త్ర రష్యా సైనిక బలగంలోని బలహీనతలూ, చీలికలూ బట్టబయలయ్యాయి. సైనిక జనరల్స్‌ను ఒకరి తర్వాత మరొకరిని తొలగిస్తూ వస్తున్న పుతిన్‌కు యుద్ధంలో తగిన వ్యూహమూ ఉన్నట్టు లేదు. మరోపక్క, తాజా ఘటనలతో యుద్ధంలో ఉక్రెయిన్ సైన్యానికి ఊహించని సానుకూలత వరించింది. ఒకవేళ యుద్ధాన్ని ముగించదలుచుకుంటే ఇరుపక్షాలకూ ఓ చిన్న కిటికీ తెరుచుకుంది. కానీ, కిందపడ్డా నాదే పై చేయి అనే పుతిన్ కానీ, ‘నాటో’ బూచితో రష్యాను దారికి తెచ్చుకోవాలని చూస్తున్న పాశ్చాత్య ప్రపంచం కానీ అందుకు ముందుకొస్తాయా? ఏమైనా రష్యా పరిణామాలను ప్రపంచం ఆసక్తిగా చూస్తోంది. పుతిన్ తదుపరి అడుగులు, భవి తవ్యంపై లెక్కలు కడుతోంది. సైన్యం, పాలనా యంత్రాంగం, వ్యాపార వర్గం సహా వ్యవస్థలన్నిటినీ విడగొట్టి, ఎవరూ అధికారం ప్రోది చేసుకోకుండా బలహీనంగా ఉంచి, నియంత్రణ తన చేతిలో పెట్టుకొనే పుతిన్ ఈ విన్యాసం ఎన్నాళ్ళు చేయగలరో చూడాలి. అందుకే, స్టాలిన్ తర్వాత దీర్ఘకాలం రష్యాను ఏలుతున్న పుతిన్ ఓ అమెరికన్ రాజకీయ శాస్త్రవేత్త అన్నట్టు ఒక రకంగా ‘బలహీన బలిష్ఠుడు’. వాగ్నర్ వ్యవహారం అందుకు తాజా ఉదాహరణ. పామును పెంచుతున్నది పగవాణ్ణి కాటేయడానికని భావించినా విషపురుగుకు తన, పర తేడా ఉండదని మర్చిపోవడమే చిక్కు. ఆ సంగతి అమెరికా, పాకిస్తాన్ నుంచి ఇప్పుడు రష్యా దాకా అందరికీ అనుభవంలోకి వచ్చిన పాఠమే! -
డేటా లీకు మూలం ‘పునరుద్ధరణే’
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 16.8 కోట్ల మంది డేటా లీకు కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రక్షణ శాఖతో పాటు టెలికం, విద్యుత్, ఇంధనం వంటి కీలకమైన ప్రభుత్వ సంస్థల వ్యక్తిగత సమాచారం కూడా తస్కరణకు గురికావటాన్ని సైబరాబాద్ పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. థర్డ్ పార్టీ ఏజెన్సీల నుంచే ఈ కీలక సమాచారం బహిర్గతమైనట్లు ప్రాథమిక విచారణలో పోలీసులు గుర్తించారు. నిందితుల రెండో రోజు కస్టడీ విచారణపూర్తిగా ప్రభుత్వ సంస్థల డేటా లీకు మూలాలను కనుక్కొనే దిశలోనే సాగింది. వెబ్సైట్ల పునరుద్ధరణ నుంచే లీకు.. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రక్షణ శాఖతో పాటు పలు కేంద్ర సంస్థలకు చెందిన వెబ్సైట్లను పునరుద్ధరణ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. సాధారణంగా బ్యాంకులు, ఆర్ధిక సంస్థలు డెబిట్, క్రెడిట్ కార్డుల నిర్వహణ సేవలను థర్డ్ పార్టీలకు అందిస్తుంటాయి. ఇదే తరహాలో కేంద్ర సంస్థల వెబ్సైట్ల రీడెవలప్ సేవలు కూడా ఆయా యాజమాన్యలు ఐటీ కంపెనీలకు అందించాయి. నోయిడా, ముంబైకి చెందిన ఔట్సోర్సింగ్ కంపెనీల నుంచే ఈ వ్యక్తిగత సమాచారం బహిర్గతమైందని సైబరాబాద్ పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. సర్వీస్ ప్రొవైడర్లకు నోటీసులు.. నిందితుల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న 12 సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్, వెబ్సైట్లను సైబరాబాద్‌లోని తెలంగాణ స్టేట్ పోలీసు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ సైబర్ సేఫ్టీ (టీఎస్పీసీసీ) విశ్లేషించి.. పలు కీలక సమాచారాన్ని గుర్తించినట్లు తెలిసింది. పలు అనుమానిత ఈ–మెయిల్స్, వెబ్‌పేజీలను వినియోగించే చిరునామా యూనిఫాం రిసోర్స్ లొకేటర్ (యూఆర్ఎల్)లను గుర్తించారు. వీటిని నిర్ధారించేందుకు టెలికం సర్వీస్ ప్రొవైడర్లు (టీఎస్పీ), ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు (ఐఎస్పీ)లను విచారించాలని పోలీసులు నిర్ణయించారు. ఈమేరకు పలు కంపెనీలకు నోటీసులు జారీ చేశారు. ఈ వ్యవహారం గొలుసుకట్టు తరహాలో ఉండటంతో మరింతమంది ఈ కేసులో అరెస్టయ్యే అవకాశాలున్నట్లు ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. ఉగ్రకోణం ఉంటే కేసు ఎన్ఐఏకు బదిలీ? బహిరంగ మార్కెట్లో నిందితులు అమ్మకానికి పెట్టిన డేటాలో 2.60 లక్షల మంది రక్షణ శాఖకు చెందిన వ్యక్తిగత సమాచారం కూడా ఉండటం గమనార్హం. దీంతో ఇప్పటికే పలుమార్లు సైబరాబాద్ పోలీసులతో హైదరాబాద్, ఢిల్లీకి చెందిన రక్షణ శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఇప్పుడు పూర్తి స్థాయిలో వివరాలు రాబట్టేందుకు కేంద్ర నిఘా సంస్థ (ఐబీ) అధికారులు కూడా భేటి కానున్నట్లు తెలిసింది. సైబర్ మోసాల కోసమే డేటా చోరీ చేశారా లేక ఏమైనా ఉగ్రకోణం దాగి ఉందా అని తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఉగ్రకోణం అంశాలు వెలుగులోకి వస్తే గనక ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు బదిలీ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కేసులో అరెస్టయిన ఏడుగురిలో నాగ్‌పూర్‌కు చెందిన జియా ఉర్ రెహ్మాన్ కీలకమని పోలీసుల విచారణలో తేలింది. ఇతను ముంబైకి చెందిన ఓ వ్యక్తి నుంచి డేటాను కొనుగోలు చేసి, జస్ట్ డయల్, డేటా మార్ట్ ఇన్ఫోటెక్, గ్లోబల్ డేటా ఆర్ట్స్, ఎంఎస్ డిజిటల్ గ్రో, ఇన్‌స్పైరీ డిజిటల్ మాధ్యమాల ద్వారా ఈ డేటాను విక్రయించేవాడు. -
డేటా ఎక్కడి నుంచి లీకైంది?
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘వ్యక్తిగత డేటా లీక్’మూలాలను తేల్చేందుకు సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఎక్కడెక్కడి నుంచి డేటా తస్కరణకు గురైంది? నిందితులు దీనిని ఎక్కడెక్కడ దాచి ఉంచారు? దానిని ఎవరెవరు కొనుగోలు చేశారు? తదితర అంశాలపై లోతుగా ఆరా తీస్తున్నారు. రక్షణ శాఖ, టెలికం వంటి 138 ప్రభుత్వ విభాగాలుసహా 16.8 కోట్ల మంది వ్యక్తిగత వివరాలను తస్కరించి, విక్రయిస్తున్న ఏడుగురు అంతర్రాష్ట్ర నిందితులను సైబరాబాద్ పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ కల్మేశ్వర్ నేతృత్వంలో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసింది. ఢిల్లీ, పలు ఇతర ప్రాంతాల్లోని పలు కంపెనీల నుంచి డేటా చోరీ జరిగినట్టు ప్రాథమికంగా గుర్తించి ఆయా సంస్థలకు నోటీసులు జారీచేసినట్టు తెలిసింది. కేసుతో వారికి ఉన్న సంబంధాలపై విచారించిన అనంతరం మరిన్ని అరెస్టులు ఉండే అవకా శం ఉన్నట్టు సమాచారం. ఈ డేటా ఎవరెవరు కొనుగోలు చేశారో కనిపెట్టేందుకు నిందితులను కస్టడీకి తీసుకొని విచారించాలని పోలీసులు నిర్ణయించారు. క్లౌడ్, హార్డ్ డిస్క్‌లలో డేటా.. ప్రజల వ్యక్తిగత వివరాలను తస్కరించిన నిందితులు డేటాను హార్డ్ డిస్క్‌లతోపాటు క్లౌడ్ సర్వీస్‌లో భద్రపరిచినట్టు పోలీసులు గుర్తించారు. ఆ క్లౌడ్ సర్వీస్‌ను యాక్సెస్ చేయడానికి అనుమతించాలని కోరుతూ గూగుల్‌కు లేఖ రాసినట్టు తెలిసింది. ప్రాథమిక దర్యాప్తు మేరకు 16.8 కోట్ల మంది వ్యక్తిగత డేటాను తస్కరించినట్టు గుర్తించామని, క్లౌడ్‌లోని డేటాను ఫోరెన్సిక్ విశ్లేషణ చేస్తే.. దొంగిలించిన డేటా మొత్తం ఎంత అనేది స్పష్టమవుతుందని దర్యాప్తు అధికారి ఒకరు తెలిపారు. ప్రభుత్వ విభాగాలకు అలర్ట్ నీట్ పరీక్షకు అర్హత సాధించిన విద్యార్థులు, వ్యాపారవేత్తలు, కార్పొరేట్ అధికారులు, బ్యాంకు ఖాతాదారులు, పాన్‌కార్డు వినియోగదారులు, వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ఉద్యోగులు, రక్షణ శాఖ సిబ్బంది, వివిధ రంగాలకు చెందిన నిపుణులు వంటి 138 కేటగిరీల వారి డేటాను నిందితులు దొంగిలించారు. అయితే వివిధ ప్రభుత్వశాఖల ఉద్యోగుల వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలూ చోరీకి గురైన నేపథ్యంలో.. ఆయా ప్రభుత్వ శాఖలను సైబరాబాద్ పోలీసులు అప్రమత్తం చేశారు. ఈమేరకు రిజర్వు బ్యాంకు, టెలికం విభాగం, కేంద్ర హోం, రక్షణ శాఖలకు లేఖలు రాశారు. ఏజెన్సీల నుంచే డిఫెన్స్ సమాచారం లీక్? రక్షణ శాఖకు చెందిన 2.6 లక్షల మంది ఉద్యోగుల డేటాను సైతం నిందితులు దొంగిలించారు. వీటిలో డిఫెన్స్ అధికారి పేరు, ఈ–మెయిల్ ఐడీ, దళం పేరు, ర్యాంకు, పనిచేస్తున్న చోటు, చిరు నామా వంటి కీలక వివరాలున్నాయి. రక్షణశాఖకు చెందిన ఖాతాల నిర్వహణ బాధ్యతలను ఔట్ సోర్సింగ్‌కు ఇచ్చారని.. ఆ ఏజెన్సీల నుంచే డేటా చోరీకి గురై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగుల వేతన ఖాతాలున్న బ్యాంకు నుంచి లేదా పేస్లిప్‌లను సిద్ధం చేసే ఏజెన్సీల నుంచి డేటా లీకై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. -
షిప్‌యార్డు ‘కీర్తి’ని చాటేలా.. రక్షణ శాఖతో రూ.934 కోట్ల భారీ ఒప్పందం
సాక్షి, విశాఖపట్నం : ఆత్మ నిర్భర్ భారత్‌ను ఇనుమడింపజేసేలా విశాఖపట్నం హిందుస్థాన్ షిప్‌యార్డు లిమిటెడ్ (హెచ్ఎస్ఎల్) భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. షిప్ రిపేర్ హబ్‌గా పరుగులు తీస్తున్న హెచ్ఎస్ఎల్.. సుదీర్ఘ విరామం తర్వాత వచ్చిన సింధుకీర్తి సబ్‌మెరైన్ రీఫిట్, మరమ్మతులకు సంబంధించి రక్షణశాఖతో సోమవారం ఎంవోయూ చేసుకుంది. రూ.934 కోట్లతో నిర్వహించే ఈ భారీ పనులను నిర్ణీత సమయంలో పూర్తిచేసి తన ప్రతి ష్టను మరింత పెంచుకునేందుకు షిప్‌యార్డు సిద్ధమవుతోంది. దీనిద్వారా స్థానిక ఎంఎస్ఎంఈలకు 1,000 పనిదినాల ఉపాధిని హెచ్ఎస్ఎల్ కల్పించనుంది. గతంలో తీవ్ర జాప్యం... సింధుకీర్తి సబ్‌మెరైన్ 2006లో మరమ్మతుల కోసం హెచ్‌ఎస్‌ఎల్‌కు రాగా, తొమ్మిదేళ్లకు పూర్తిచేశారు. అయినప్పటికీ ఇటీవల రికార్డు స్థాయిలో రీఫిట్ పనులను పూర్తిచేస్తూ ప్రపంచదేశాల చూపును తనవైపు తిప్పుకుంటూ ఇతర దేశాల నౌకల మరమ్మతుల బాధ్యతలను కూడా హెచ్ఎస్ఎల్ చేపడుతోంది. అందువల్లే భారత రక్షణశాఖ చొరవ తీసుకొని ఆత్మ నిర్భర్ భారత్ కింద సింధుకీర్తి సబ్‌మెరైన్ రీఫిట్ బాధ్యతలను షిప్‌యార్డుకి అప్పగిస్తూ భారీ ఎంవోయూ కుదుర్చుకుంది. ప్రస్తుతం సింధుకీర్తి రీఫిట్ పనులను 22 నెలల్లో పూర్తి చేస్తామని హెచ్ఎస్ఎల్ ఒప్పందంలో పేర్కొంది. రూ.934 కోట్ల ఈ భారీ ఒప్పందం ద్వారా 20కిపైగా హెచ్ఎస్ఎల్తో కలిసి పనిచేస్తున్న చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఉపాధి కలగనుంది. మొత్తం 1,000 పనిదినాలు ఎంఎస్ఎంఈలకు ఉపాధి కల్పించనున్నట్లు షిప్‌యార్డు ప్రకటించింది. నిర్ణీత 22 నెలల కంటే ముందుగానే సింధుకీర్తి సబ్‌మెరైన్ పనులు పూర్తిచేసి అప్పగించేందుకు కృషి చేస్తామని షిప్‌యార్డు ఉద్యోగులు ప్రతినబూనడం విశేషం. పెద్ద చాలెంజ్‌గా స్వీకరిస్తున్నాం కారణాలేమైనా గతంలో సింధుకీర్తి మరమ్మతుల విషయంలో చాలా ఆలస్యం జరిగింది. దానివల్ల ఎదురైన అవమానాలను భరించి మరమ్మతుల విషయంలో ఎన్నో సంస్కరణలు అమలుచేశాం. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ నిర్దేశించిన కాలపరిమితిలోపే రీఫిట్ పనులను పూర్తి చేస్తూ విదేశీ ఆర్డర్లు కూడా పొందుతున్నాం. ఇప్పుడు హెచ్ఎస్ఎల్ ప్రధాన నౌకా నిర్మాణ కేంద్రంగా దూసుకుపోతోంది. ఐదేళ్లలో ఏకంగా 14 ప్రాజెక్టులను పూర్తి చేశాం. ఇప్పటివరకు 200 నౌకలు తయారు చేయడంతోపాటు 2,000 షిప్స్ మరమ్మతు పనులను పూర్తిచేశాం. విశాఖను షిప్ రిపేర్హబ్గా తీర్చిదిద్దేందుకు సింధుకీర్తి ద్వారా వచ్చిన పెద్ద సవాల్‌గా భావించి మేమంతా దానిని స్వీకరిస్తున్నాం. – కమొడర్ హేమంత్ ఖత్రి, హెచ్ఎస్ఎల్ సీఎండీ -
సబ్‌మెరైన్ పేలినా.. సెకన్లలో అదుపులోకి..
2013 ఆగస్ట్ 13.. నౌకాదళ చరిత్రలో ముందెన్నడూ ఎరుగని ఘోర దుర్ఘటన సంభవించింది. ముంబై కొలాబా డాక్‌యార్డులో నిలిచి ఉన్న ఐఎన్ఎస్ సింధు రక్షక్ జలాంతర్గామిలో అర్ధరాత్రి వరస పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో 18 మంది సిబ్బంది మృత్యువాత పడ్డారు. పేలుళ్లతో చాలా భాగం దెబ్బతిన్న సబ్‌మెరైన్ సముద్రంలో సగం వరకు మునిగిపోయింది. దుర్ఘటన జరిగిన సమయంలో సబ్‌మెరైన్‌లో టార్పెడోలు, క్షిపణులు సహా పూర్తిస్థాయిలో ఆయుధాలు ఉన్నాయి. సబ్‌మెరైన్‌లో అర్ధరాత్రి చోటుచేసుకున్న పేలుడు శబ్దాలు రెండు కిలోమీటర్ల వరకు వినిపించాయి. యుద్ధ నౌకలో గానీ.. సబ్‌మెరైన్‌లో గానీ.. చిన్నపాటి ప్రమాదం సంభవిస్తే.. అది భారీ విపత్తుగా మారుతుంది. అగ్నిమాపక వ్యవస్థ ఉన్నప్పటికీ.. క్షణాల్లో వ్యాపించే ప్రమాదాన్ని మాత్రం నియంత్రించలేకపోతుంది. సింధు రక్షక్‌లో ప్రమాదం తర్వాత.. ఆధునిక వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చిన భారత నౌకాదళం.. రష్యా, అమెరికా వంటి దేశాల వ్యవస్థను మాత్రం అందుకోలేకపోయింది. ఇప్పుడా పరిస్థితిని అధిగమించి..అగ్రరాజ్యాల సరసన నిలిచేలా అత్యాధునిక మ్యాగజైన్ ఫైర్ ఫైటింగ్ సిస్టమ్(ఎంఎఫ్‌ఎఫ్‌ఎస్)ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది. సాక్షి, విశాఖపట్నం: ప్రపంచంలో అత్యంత కీలకమైన నౌకా దళాల్లో అగ్రభాగాన ఉన్న దేశాల సరసన ఉన్న భారత్‌లో రోజు రోజుకూ యుద్ధ నౌకలు, సబ్మెరైన్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. దానికనుగుణంగా వ్యవస్థలోనూ అత్యాధునిక మార్పులు తీసుకొచ్చేందుకు రక్షణ వ్యవస్థ అడుగులు వేస్తోంది. ఇందుకోసం రక్షణ సేవల రంగంలో వ్యూహాత్మక భాగస్వామిగా ఉన్న క్రౌన్ గ్రూప్(డిఫెన్స్ ఇంజినీరింగ్ డివిజన్) ఇప్పుడు ఎంఎఫ్ఎఫ్ఎస్ను భారత నౌకాదళంలో ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. మ్యాగజైన్ ఇక సురక్షితం ప్రతి యుద్ధ నౌక, సబ్‌మెరైన్‌లో మ్యాగజైన్ అనే కంపార్ట్మెంట్ ఉంటుంది. ఇందులో పేలుడు పదార్థాలు, యుద్ధ సామగ్రిని సురక్షితంగా నిల్వ చేస్తారు. ఈ కంపార్ట్మెంట్ను అత్యంత సురక్షితంగా డిజైన్ చేస్తారు. ఆయా యుద్ధ సామగ్రికి అవసరమైన ఉష్ణోగ్రత, పీడనం, రేడియేషన్‌లో మార్పులతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు. ఏ చిన్న సమస్య ఉత్పన్నమైనా.. మొత్తం యుద్ధనౌకతో పాటు పొరపాటున డాక్లో యాంకరేజ్ అయి ఉంటే.. పక్కన ఉన్న నౌకలు కూడా ప్రమాదం బారిన పడతాయి. అందుకే వీటిలో ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అయ్యే అగ్నిమాపక వ్యవస్థలు ఎంతో అవసరం. ఈ నేపథ్యంలో క్రౌన్ గ్రూప్ ఎంఎఫ్‌ఎఫ్‌ఎస్ ఏర్పాటుకు రక్షణ వ్యవస్థతో సంప్రదింపులు జరుపుతోంది. ఈ వ్యవస్థ ఏర్పాటైతే.. సింధు రక్షక్ సబ్‌మెరైన్‌లో మాదిరిగా పేలుడు సంభవిస్తే.. సెకన్ల వ్యవధిలోనే పరిస్థితిని అదుపులోకి తీసుకురాగలరు. విశాఖలో షిప్ బిల్డింగ్‌కు సన్నాహాలు డిఫెన్స్ సర్వీస్ సెక్టార్లో ప్రధాన పాత్రధారిగా ఉన్న క్రౌన్ గ్రూప్ విశాఖపట్నంలో తమ కార్యకలాపాలను విస్తరించాలని భావిస్తోంది. ఆత్మ నిర్భర్ భారత్‌లో భాగంగా షిప్ బిల్డింగ్ కార్యకలాపాలు విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే నగరంలో వర్క్‌షాప్ కార్యకలాపాలు ప్రారంభించిన క్రౌన్ సంస్థ.. తూర్పు నౌకాదళ అవసరాలకు అనుగుణంగా నిర్వహణ, రీఫిట్, ఆపరేషనల్ సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. విశాఖ తీరంలో షిప్ బిల్డింగ్ సెంటర్ ఏర్పాటుకు కూడా రక్షణ మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతోంది. ఇప్పటికే హిందూస్థాన్ షిప్‌యార్డు విశాఖలో ఉంది. ఇప్పుడు మరో షిప్‌యార్డు వస్తే.. యుద్ధ నౌకల తయారీలో విశాఖ నగరం కీలకంగా మారనుంది. యుద్ధ నౌకలు.. సబ్‌మెరైన్‌లో... ఫారిన్ ఒరిజినల్ ఎక్విప్మెంట్ మాన్యుఫ్యాక్చర్స్(ఓఈఎం) సహకారంతో నౌకాదళంలోని యుద్ధనౌకలు, జలాంతర్గాముల్లో ఎంఎఫ్‌ఎఫ్‌ఎస్ ఏర్పాటుకు అవసరమైన సామర్థ్యాన్ని సిద్ధం చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం భారత నౌకాదళంలో మొత్తం 150 యుద్ధ నౌకలు, సబ్మెరైన్లుండగా.. రానున్న ఐదేళ్ల కాలంలో వీటి సంఖ్య 180 వరకు చేరుకోనుంది. ఇప్పటికే వివిధ ప్రాజెక్టుల్లో భాగంగా 30 వరకూ యుద్ధ నౌకలు ఆయా షిప్‌యార్డుల్లో తయారవుతున్నాయి. వీటన్నింటిలోనూ ఈ వ్యవస్థ ఏర్పాటు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. షిప్లో మ్యాగజైన్ కంపార్ట్మెంట్ రక్షణ రంగంలో కీలకంగా వ్యవహరిస్తాం విశాఖ తీరం ఎంతో అభివృద్ధి చెందడానికి కీలకంగా ఉంది. అందుకే ఇక్కడ షిప్ బిల్డింగ్ సంస్థ ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నాం. ఇప్పటికే పశ్చిమ తీరంలో వ్యూహాత్మక షిప్‌యార్డ్‌లను కొనుగోలు చేయడం లేదా.. భాగస్వామిగా జతకట్టాలని భావిస్తున్నాం. తూర్పు తీర ప్రధాన కేంద్రంగా ఉన్న వైజాగ్‌కు దక్షిణ భాగంలో షిప్‌యార్డ్‌ను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. ఐఎన్ఎస్ జలాశ్వ, విమాన వాహక నౌక విక్రమాదిత్యకు మరమ్మతులు, సర్వీసింగ్, మెయింటెనెన్స్ వంటి సవాళ్లతో కూడిన పనిని విజయవంతంగా పూర్తి చేసి.. పీఎఫ్ఆర్, మిలాన్ విన్యాసాలకు సిద్ధం చేశాం. భవిష్యత్‌లో అన్ని యుద్ధనౌకలకు ఎంఎఫ్‌ఎఫ్‌ఎస్ అత్యవసరం కాబట్టి ఈ టెక్నాలజీని దేశంలోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాం. – కమాండర్ రాకేష్ ఆనంద్, క్రౌన్ మెరైన్ డివిజన్ హెడ్ -
మహిళల హక్కుల్ని వాయిదా వేయలేం
న్యూఢిల్లీ: నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీయే) ప్రవేశ పరీక్షకు హాజరయ్యేందుకు మహిళలను అనుమతించడాన్ని వచ్చే సంవత్సరానికి వాయిదా వేయాలన్న కేంద్ర ప్రభుత్వ వినతిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. మహిళల హక్కులను నిరాకరించాలని తాము కోరుకోవడం లేదని స్పష్టం చేసింది. వారికి ఎన్డీయేలో ప్రవేశం కల్పించడం మరో ఏడాది వాయిదా వేయలేమని తేల్చిచెప్పింది. 2022 మే నాటికి ఎన్డీయే నోటిఫికేషన్ జారీ చేస్తామని, మహిళలను అనుమతిస్తామని కేంద్రం చెప్పగా, న్యాయస్థానం అంగీకరించలేదు. తాము ఇదివరకే ఇచ్చిన ఆదేశాల ప్రకారం... ఈ ఏడాది నవంబర్లోనే వారిని పరీక్ష రాసేందుకు అనుమతించాలని స్పష్టం చేసింది. అత్యవసర పరిస్థితుల్లో సైనిక దళాలు అత్యుత్తమ సేవలు అందిస్తుంటాయని జస్టిస్ ఎస్.కె.కౌల్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం గుర్తుచేసింది. ఎన్డీయేలో మహిళలను చేర్చుకొనేందుకు ఇక ఎలాంటి జాప్యం లేకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. ఈ విషయంలో యూపీఎస్సీ, రక్షణ శాఖ కలిసి పని చేయాలని పేర్కొంది. ఎన్డీయేలో మహిళా అభ్యర్థుల కోసం సమగ్రమైన కరిక్యులమ్ రూపొందించాలని, ఇందుకోసం రక్షణ దళాల ఆధ్వర్యంలో నిపుణులతో కూడిన స్టడీ గ్రూప్‌ను యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎన్డీయేలో మహిళలకు శిక్షణ ఇచ్చే విషయంలో సలహాలు, సూచనలు ఇవ్వడానికి బోర్డ్ ఆఫ్ ఆఫీసర్ల సమావేశం నిర్వహించాలని తెలిపింది. ఎన్డీయేలో మహిళలకు ప్రవేశం నిరాకరించడాన్ని ఆక్షేపిస్తూ న్యాయవాది కుశ్ కల్రా దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటీ వాదనలు వినిపించారు. నవంబర్ 14న జరిగే పరీక్షకు మహిళలను అనుమతించలేమని, అందుకు సమయం సరిపోదని చెప్పారు. ఈ సమస్యను పరిష్కరించగల సామర్థ్యం ప్రభుత్వానికి ఉందని ధర్మాసనం బదులిచి్చంది. ఎన్డీయే ప్రవేశ పరీక్ష కోసం మహిళలు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారని, వారిని నిరాశపర్చలేమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. -
తీర భద్రతకు ‘విగ్రహ’
సాక్షి, విశాఖపట్నం: భారత తీరగస్తీదళం అమ్ముల పొదిలో మరో అధునాతన నౌక చేరుతోంది. అడ్వాన్స్డ్ ఫైర్ పవర్‌తో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఐసీజీఎస్ విగ్రహ నౌకను శనివారం చెన్నైలో కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజనాథ్సింగ్ జాతికి అంకితం చేయనున్నారు. ఆఫ్‌షోర్ పెట్రోల్ వెసల్ సిరీస్‌లో ఏడో నౌక అయిన విగ్రహని చెన్నైలోని ఎల్ అండ్ టీ షిప్ బిల్డింగ్ లిమిటెడ్ సంస్థ నిర్మించింది. ఈ నౌక కోస్ట్‌గార్డు ఈస్ట్రన్ సీబోర్డు ప్రధాన స్థావరమైన విశాఖపట్నం నుంచి కార్యకలాపాలు నిర్వర్తించనుంది. ఐసీజీఎస్ విగ్రహ చేరడం ద్వారా కోస్ట్‌గార్డ్ జాబితాలో నౌకల సంఖ్య 157కు చేరుతుంది. కోస్ట్‌గార్డ్‌కు 66 విమానాలున్నాయి. అధునాతన సాంకేతికత విగ్రహ నౌకలో అధునాతన సాంకేతిక వసతులున్నాయి. 98 మీటర్ల పొడవు, 15 మీటర్ల వెడల్పు, 3.6 మీటర్ల డ్రాట్‌తో ఉంది. దీని బరువు 2,200 టన్నులు. 9,100 కిలోవాట్స్ డీజిల్ సామర్థ్యం ఉన్న రెండు ఇంజిన్లున్నాయి. 26 నాటికల్ మైళ్ల వేగంతో 5 వేల కిలోమీటర్లు ప్రయాణించగలదు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ రాడార్లు, నేవిగేషన్, కమ్యూనికేషన్ పరికరాలు, సెన్సార్లు, సముద్ర స్థితిగతులకు అనుగుణంగా దిశను మార్చుకునే యంత్ర సామర్థ్యం దీని సొంతం. 40/60 బోఫోర్స్ గన్, ఫైర్ కంట్రోల్ సిస్టమ్‌తో 12.7 మిల్లీమీటర్ల స్టెబిలైజ్డ్ రిమోట్ కంట్రోల్ గన్లు రెండు ఉన్నాయి. రెస్క్యూ ఆపరేషన్లకు ఉపయోగపడేలా ఒక ట్విన్ ఇంజిన్ హెలికాప్టర్, నాలుగు హైస్పీడ్ బోట్లు తీసుకెళ్లగలదు. సముద్రంలో చమురుతెట్టు వంటి కాలుష్యాల నియంత్రణకు స్పందించే అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఈ నౌకలో ఉంది. -
విశాఖలో రక్షణ రంగ తయారీ పరిశ్రమ
సాక్షి, విశాఖపట్నం: ఎన్నో ప్రతిష్టాత్మక సంస్థలకు నిలయంగా ఉన్న విశాఖపట్నం కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరనుంది. బంగాళాఖాతానికి రక్షణ కవచంలా ఉంటూ శత్రుమూకల నుంచి దేశాన్ని రక్షిస్తున్న తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రం విశాఖలోనే ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశ రక్షణకు అవసరమైన కీలక ఆయుధాలు, క్షిపణులను రూపొందిస్తున్న డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) విశాఖపై తన దృష్టి సారించింది. కార్యాలయంతోపాటు రక్షణ రంగ విడిభాగాల తయారీ పరిశ్రమను నగరంలోని మధురవాడలో నెలకొల్పేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రక్షణ రంగ ఉత్పత్తుల్లో స్వదేశీ తయారీకి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్న సంగతి తెలిసిందే. రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్‌ను అమలు చేసేందుకు ఒక్కో అడుగు ముందుకేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో పలు చోట్ల రక్షణ రంగ విడిభాగాలు తయారు చేసే పరిశ్రమలు నెలకొల్పేందుకు డీఆర్డీవో సిద్ధమవుతోంది. దేశ రక్షణ రంగంలో ముఖ్య భూమిక పోషిస్తున్న విశాఖ నగరంతో పాటు మచిలీపట్నం, అనంతపురం, కృష్ణా, కర్నూలు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో రక్షణరంగ విడి భాగాల తయారీ పరిశ్రమలు నెలకొల్పేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఇందుకు ప్రధాన కేంద్రంగా డీఆర్డీవో విశాఖను ఎంపిక చేసుకుంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన డీఆర్డీవో అధికారులు మధురవాడలోని ఏపీఐఐసీ హిల్స్‌లో ఈ పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు. దీంతో హిల్ నంబర్–4లో 5 ఎకరాల స్థలాన్ని ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) డీఆర్డీవోకి కేటాయించింది. యుద్ధ విమానాలు, నౌకల పరికరాల తయారీ 5 ఎకరాల స్థలంలో యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, యుద్ధ నౌకలు, తదితరాలకు కావాల్సిన పరికరాలు తయారు చేసే కేంద్రాన్ని నెలకొల్పాలని డీఆర్డీవో భావిస్తోంది. దీంతోపాటు డీఆర్డీవో ప్ర«త్యేక కార్యాలయాన్ని ఇక్కడే ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో ముఖ్యంగా శత్రు మూకల నుంచి సైబర్ దాడిని ఎదుర్కొనేందుకు అవసరమైన పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కార్యకలాపాలు నిర్వహించనుంది. ఈ రెండింటి కోసం రూ.330 కోట్లు వెచ్చించనుంది. ఇటీవల నేవల్ సైన్స్ టెక్నాలజీ లిమిటెడ్ (ఎన్ఎస్టీఎల్)ని సందర్శించిన డీఆర్డీవో చైర్మన్ సతీష్‌రెడ్డి విశాఖలో రక్షణ రంగ విడిభాగాల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ అంశంపై ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ యతిరాజ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు మధురవాడ హిల్ నం.4లో డీఆర్డీవో కోసం 5 ఎకరాల స్థలాన్ని రిజర్వ్ చేసినట్లు తెలిపారు. -
ట్యాంక్ విధ్వంసక క్షిపణి పరీక్ష సక్సెస్
సాక్షి, హైదరాబాద్: భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ మరో ఘన విజయాన్ని సాధించింది. లేజర్ కిరణాల సాయంతో లక్ష్యాన్ని ఛేదించే ట్యాంకు విధ్వంసక క్షిపణిని బుధవారం విజయవంతంగా పరీక్షించింది. అహ్మద్‌నగర్‌లోని కేకే పర్వతశ్రేణి ప్రాంతంలో ఏబీటీ అర్జున్ ట్యాంక్ ద్వారా ప్రయోగించిన ఈ క్షిపణి 3 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని విజయవంతంగా ఢీకొట్టింది. లేజర్ కిరణాల ఆధారంగా పనిచేసే ట్యాంక్ విధ్వంసక క్షిపణులు లక్ష్యాన్ని గుర్తించడంతో పాటు వాటి కదలికలను గమనిస్తూ ప్రయాణిస్తుంది. లేజర్ కిరణాల సాయంతో మరింత కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదిస్తుంది. ఈ క్షిపణిని ఒకటి కంటే ఎక్కువ వ్యవస్థల సాయంతో ప్రయోగించేలా సిద్ధం చేశారు. పుణేలోని ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్, హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ, ఇన్స్ట్రుమెంట్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ (డెహ్రాడూన్)లు సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ క్షిపణి ప్రయోగం విజయవంతం కావడంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ హర్షం వ్యక్తం చేశారు. క్షిపణి ప్రయోగం విజయవంతం కావడంపై భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ చైర్మన్ జి.సతీశ్‌రెడ్డి డీఆర్డీవో సిబ్బందిని, పరిశ్రమ వర్గాలను అభినందించారు. -
ఆర్మీలో మహిళా అధికారుల శాశ్వత కమిషన్
న్యూఢిల్లీ: ఆర్మీలో మహిళా అధికారుల కోసం శాశ్వత కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ రక్షణ శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. షార్ట్ సర్వీసు కమిషన్ (ఎస్ఎస్సీ) కింద రిక్రూట్ చేసే మహిళా అధికారులందరినీ శాశ్వత కమిషన్‌కు తీసుకురావాలంటూ గత ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు చెప్పడం తెల్సిందే. ఈ తీర్పు మేరకు రక్షణ శాఖ శాశ్వత కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ ద్వారా ఆర్మీలో మహిళలు విస్తృతమైన పాత్ర పోషించడానికి అవకాశం ఉంటుందని, మహిళా సాధికారతకు బాటలుపడతాయని ఆర్మీ అధికార ప్రతినిధి కల్నల్ అమన్ ఆనంద్ చెప్పారు. ఇండియన్ ఆర్మీలోని అన్ని విభాగాల్లోనూ షార్ట్ సర్వీసు కమిషన్డ్ కింద ఉన్న మహిళా అధికారులందరినీ శాశ్వత కమిషన్ కిందకు తీసుకువస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసినట్టు కల్నల్ వెల్లడించారు. ఇకపై ఆర్మీ ఎయిర్ డిఫెన్స్, సిగ్నల్స్, ఇంజనీర్లు, ఆర్మీ ఏవియేషన్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ఇంజనీర్లు, ఆర్మీ సర్వీసు కార్పొరేషన్, ఇంటెలిజెన్స్ కార్పొరేషన్ వంటి విభాగాల్లో పని చేసే మహిళలంతా శాశ్వత కమిషన్ కింద నియామకాలే జరుగుతాయి. ఎస్ఎస్సీ కింద ఉన్న వారంతా శాశ్వత కమిషన్ కింద మారే డాక్యుమెంటేషన్ ప్రక్రియ త్వరలో చేపట్టనున్నారు. ఎస్ఎస్సీ కింద నియమించే వారిని తొలుత అయిదేళ్లకు నియమిస్తారు.ఆ తర్వాత వారి సర్వీస్‌ను 14 ఏళ్లకు పెంచే అవకాశం ఉంటుంది. శాశ్వత కమిషన్ ద్వారా మహిళలంతా పదవీ విరమణ వయసు వరకు సర్వీసులు కొనసాగుతారు. -
అనంతపురంలో బుల్లెట్ల తయారీ పరిశ్రమ
సాక్షి, అమరావతి: రక్షణ రంగంలో వినియోగించే బుల్లెట్ల (తూటాలు) తయారీ కేంద్రాన్ని స్టంప్ షూలీ అండ్ సోమప్ప స్ప్రింగ్స్ (ఎస్ఎస్ఎస్ స్ప్రింగ్స్) సంస్థ రాష్ట్రంలో ఏర్పాటుచేయనుంది. రూ.580 కోట్లతో అనంతపురం జిల్లాలో ఈ యూనిట్‌ను ఆ సంస్థ ఏర్పాటుచేయనున్నట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. లక్నోలో జరిగిన డిఫెన్స్ ఎక్స్పో సందర్భంగా ఎస్ఎస్ఎస్ కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపామని.. మూడు నెలల్లో నిర్మాణ పనులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా పరిశ్రమల శాఖ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ప్రకాశం జిల్లా దొనకొండలో ఏర్పాటుచేయనున్న డిఫెన్స్, ఏరోస్పేస్ క్లస్టర్‌పై విదేశీ కంపెనీలు ఆసక్తి చూపినట్లు ఆయన తెలిపారు. బోయింగ్, ఎయిర్‌బస్, బీఏఈ సిస్టమ్స్, జాకబ్స్, లాక్‌హీద్ మార్టిన్ వంటి సంస్థలు రాష్ట్రంలోని పెట్టుబడి అవకాశాలపై ఆసక్తి వ్యక్తంచేసినట్లు మేకపాటి తెలిపారు. టాటా ఏరోస్పేస్ సంస్థ కూడా రాష్ట్రంలో పెట్టుబడులపై ఆసక్తి కనబరిచిందని, త్వరలోనే సీఎం సమక్షంలో మరోమారు చర్చలు జరపనున్నట్లు తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్కు ఎన్ఎస్డీసీ సహకారం: మరోవైపు.. స్కిల్ డెవలప్మెంట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు పూర్తి సహకారం అందించడానికి కేంద్రం అంగీకారం తెలిపింది. న్యూఢిల్లీలో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎస్డీసీ) ఎండీ, సీఈఓ డాక్టర్ మనీష్‌కుమార్ ఈ మేరకు హామీ ఇచ్చినట్లు మంత్రి గౌతమ్‌రెడ్డి వెల్లడించారు. స్థానిక యువతకు ఉపాధి అందించే లక్ష్యంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమంపై విదేశీ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయని.. రెనాల్ట్ ఇండియాతో పాటు, సీమెన్స్ వంటి సంస్థలు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడానికి అంగీకరించినట్లు ఆయన తెలిపారు. -
‘క్షిపణి’ కేంద్రానికి 26న శంకుస్థాపన
సాక్షి, మచిలీపట్నం: కృష్ణా జిల్లాలో మరో కలికితురాయి చేరబోతుంది. దేశ రక్షణ వ్యవస్థలో అత్యంత కీలకమైన క్షిపణి ప్రయోగ పరీక్ష కేంద్రం ఏర్పాటుతో జిల్లాకు ప్రపంచ పటంలో ప్రత్యేక గుర్తింపు దక్కనుంది. నాగాయలంక మండలం గుల్లలమోద వద్ద సముద్ర తీరంలో దీనిని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు 385 ఎకరాల ప్రభుత్వ, అటవీ భూములను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. క్షిపణి ప్రయోగ పరీక్ష కేంద్రం నిర్మాణానికి ఈ నెల 26న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ శంకుస్థాపన చేస్తారని కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, పలువురు కేంద్ర మంత్రులు, రక్షణ శాఖ ఉన్నతాధికారులు హాజరవుతారన్నారు. శంకుస్థాపన అనంతరం నాగాయలంక జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో బహిరంగ సభ నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై డీఆర్డీవో, రెవెన్యూ, పోలీస్ ఉన్నతాధికారులతో కలెక్టర్ ఇంతియాజ్, జేసీ మాధవీలత సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ క్షిపణి ప్రయోగ కేంద్రం ఏర్పాటుతో జిల్లాకు అంతర్జాతీయ గుర్తింపు రానుందన్నారు. సమీక్షలో డీఆర్డీవో అడిషనల్ చీఫ్ ఇంజనీర్ కల్నల్ ఎంజీ తిమ్మయ్య, ఈఈ ఎం.వరప్రసాద్, డీఆర్వో ఎ.ప్రసాద్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎం.చక్రపాణి, మచిలీపట్నం ఆర్డీవో జె.ఉదయభాస్కర్ పాల్గొన్నారు. -
'అష్ట'లక్ష్మీ గ్రామోస్తుతే
పూర్తిస్థాయి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి మహిళా మంత్రిగా రికార్డులకెక్కిన నిర్మలా సీతారామన్.. ఓ మహిళగా, ఓ సాధారణ కుటుంబం వచ్చిన మహిళగా.. కేంద్ర మంత్రిగా ఆలోచించారు. సొంతింటి కలనుంచి..దేశ రక్షణ వరకు తనకున్న అనుభవాలను దృష్టిలో ఉంచుకుని,గావ్–గరీబ్–కిసాన్ నినాదంతో బడ్జెట్లో కేటాయింపులు జరిపారు. మహిళా సంక్షేమానికి పెద్దపీట ఒక మహిళగా.. అదీ ఓ సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా నిర్మలా సీతారామన్‌కు పేద, మధ్యతరగతి కుటుంబాల్లో మహిళలు పడే ఇబ్బందులు బాగా తెలుసు. అందుకే మహిళా సంక్షేమానికి తాజా బడ్జెట్లో సరిపోయేటన్ని నిధులు కేటాయించారు. ఖాతాలో డబ్బుల్లేకుండా మహిళలు ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో స్వయం సహాయక బృందాల్లో జన్‌ధన్ ఖాతాలున్న వారందరికీ.. రూ.5వేల ఓవర్ డ్రాఫ్ట్ (ఓడీ) ఇస్తామని ప్రకటించారు. ఎస్‌హెచ్‌జీ గ్రూపుల్లో ఒకరికి ముద్రలోన్ కింద లక్ష రూపాయల రుణం ఇస్తామన్నారు. ఎల్ఈడీతో వెలుగు జిలుగులు విద్యుత్ డిమాండ్ రోజురోజుకూ పెరుగుతుండడంతో దీనిపై వెచ్చిస్తున్న మొత్తాన్ని తగ్గించేందుకు కేంద్రం ఎల్ఈడీలను పంపిణీ చేసింది. ఇది సత్ఫలితాలను ఇవ్వడంతో ఇంటి వెలుగులు పెరగడంతోపాటు కరెంటు బిల్లు తగ్గించేందుకు 143కోట్ల ఎల్ఈడీ బల్బులను పంపిణీచేయనున్నట్లు ఆమె తెలిపారు. దీంతోపాటు సౌరవిద్యుత్ వినియోగాన్ని పెంచేందుకు సోలార్ స్టవ్‌లు, సోలార్ బ్యాటరీలను తక్కువ మొత్తానికి విక్రయించనున్నట్లు వెల్లడించారు. ఆయుష్మాన్ భవ ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో వైద్య సమస్యలే పతాక శీర్షికల్లో కనబడుతున్న నేపథ్యంలో ఈ సమస్యకు మందు రాసేందుకు నిర్మల నడుంబిగించారు. పేద, మధ్య తరగతికి ప్రాణవాయువైన ఆయుష్మాన్ భారత్‌పై ప్రత్యేక దృష్టిపెడుతూనే.. మెడికల్ కాలేజీలు, ఆసుపత్రుల ఆధునీకరణతోపాటు.. వైద్య విద్యను పటిష్టం చేసే దిశగా అడుగులేశారు. గత రెండు బడ్జెట్లతో పొలిస్తే.. వైద్య రంగానికి నిధులను గణనీయంగా పెంచారు. దీంతోపాటుగా సాంప్రదాయ వైద్యానికీ సరైన ప్రాధాన్యతనిచ్చారు. ప్రపంచస్థాయికి మన విద్య వివిధ రంగాల్లో నైపుణ్యత లేమి కారణంగా వస్తున్న సమస్యలకు విద్యారంగంలో ఉన్న అడ్డంకులే కారణమని గుర్తించిన నిర్మలా సీతారామన్.. పాఠశాల విద్యనుంచే మార్పులు తప్పవని నిర్ణయించారు. అందుకే పాఠశాల విద్య, ఉన్నత విద్యలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టారు. పరిశోధనలు, కొత్త ఆలోచనలను ప్రోత్సహించేలా.. నైపుణ్యతతో కూడిన విద్యకు ప్రోత్సాహాన్నిందిచేలా కేటాయింపులు చేశారు. క్రీడలకూ సమాన ప్రాధాన్యమిచ్చేలా ఖేలో ఇండియాకు కేటాయింపులు పెంచారు. మా‘ఇంటి’ మాలక్ష్మి మధ్యతరగతి ప్రజలకు సొంతిల్లు కలే. అలాంటి కలను దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ నెరవేర్చుకునేందుకు మోదీ ప్రభుత్వం ప్రారంభించిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి నిర్మల మరింత ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ పథకం కింద 81 లక్షల ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికి 26 లక్షల ఇళ్లు పూర్తయ్యాయి. మిగిలినవి కూడా వీలైనంత త్వరగా పూర్తిచేయనున్నారు. దేశ ‘రక్షణ’కు సింహభాగం మాజీ రక్షణశాఖ మంత్రిగా ఆ శాఖకు జరగాల్సిన కేటాయింపులపైనా నిర్మల వెనక్కు తగ్గలేదు. ఈ ఏడాది ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో చేసిన రూ.3.18లక్షల కోట్ల కేటాయింపులనే కొనసాగించారు. పాకిస్తాన్, చైనా సరిహద్దుల్లో భద్రతను దృష్టిలో పెట్టుకుని అధునాతన యుద్ధ విమానాలు, ఆయుధాలు కొనుగోలుకు భారీ మొత్తాన్నే వినియోగించనున్నారు. రైతే రాజుగా నిలిచేలా యూపీఏ హయాంలో పప్పు ధాన్యాలను దిగుమతి చేసుకునేందుకు పడిన కష్టం నిర్మలకు తెలుసు. గత ఐదేళ్లుగా దేశం ఈ పరిస్థితిని అధిగమించి.. ధాన్యాన్ని ఎగుమతి చేసుకునే పరిస్థితికి వెళ్లడం వెనక రైతు సేవ గొప్పదని పార్లమెంటు సాక్షిగా ప్రశంసించారు. అందుకే రైతన్న ఆదాయాన్ని రెట్టింపు చేయడంతోపాటు.. అన్ని రకాలుగా వ్యవసాయ రంగాన్ని ఆదుకునేందుకు భారీగా వరాలు కురిపించారు. మహిళనే.. కానీ! ఆడవారికి బంగారమంటే ఎంత ఇష్టమో తెలియంది కాదు. నిర్మలకు మహిళగా వారి ఆసక్తులు తెలుసు. కానీ బంగారంపై దిగుమతి సుంకం పెంచడం వెనక కూడా బలమైన కారణమే ఉంది. దిగుమతిపై వెచ్చించే వ్యయం తగ్గి తద్వారా లోటు తగ్గుతుంది. ఈ విషయంలో ఓ మహిళగా కంటే.. మంత్రిగా చేయాల్సింది అదే. సుంకం పెంచడం ద్వారా బంగారం వినియోగం కాస్త తగ్గుతుందని. బడ్జెట్ కాదు..‘బహీ ఖాతా’ 2019–20 బడ్జెట్ సమర్పణ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్రిటిష్ హయాం నుంచి వస్తున్న మరో సంప్రదాయానికి చెల్లుచీటీ పలికారు. సాధారణంగా బడ్జెట్ పత్రాలను లెదర్ బ్రీఫ్‌కేసులో తీసుకొచ్చి మీడియాకు ఫోజులివ్వడం పరిపాటి. అయితే ఈసారి నిర్మలా సీతారామన్ మాత్రం బడ్జెట్ పత్రాలను బ్రీఫ్‌కేసుకు బదులుగా ఎర్రటి సిల్క్ వస్త్రాన్ని నాలుగువైపులా కుట్టి తయారుచేసిన భారత సంప్రదాయ బహీఖాతా(లెడ్జర్)లో పెట్టుకుని పార్లమెంటుకు తీసుకొచ్చారు. ఈ ‘బహీఖాతా’పై భారత ప్రభుత్వ ముద్ర కూడా ఉండటం గమనార్హం. ప్రాచీన కాలంలో వ్యాపారస్తులు తమ పద్దు పుస్తకాలను ఇదేవిధమైన ఓ వస్త్రంలో చుట్టిపెట్టేవారు. దాన్ని బహీఖాతాగా పిలిచేవారు. ఇది కాస్తా కాలక్రమేణా సంప్రదాయంగా మారింది. పద్దుల పుస్తకాలను భద్రపరచడానికి రోమన్లు,గ్రీకులు సైతం ఇదే తరహా పద్ధతిని అనుసరించేవారని కొందరు చరిత్రకారుల అభిప్రాయం. బహీఖాతా’ అనేది భారతీయ సంప్రదాయం. దాన్నే మేం అనుసరిస్తున్నాం. ఇది పాశ్చాత్య బానిసత్వం నుంచి భారతీయతకు మారుతున్నామని చెప్పడానికి సంకేతం. అందుకే ఇది బడ్జెట్ కాదు.. ‘బహీఖాతా(పద్దుల పుస్తకం) క్రిష్ణమూర్తి సుబ్రహ్మణ్యం చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ నేను బడ్జెట్ డాక్యుమెంట్లను తీసుకొచ్చేందుకు లెదర్‌బ్యాగ్‌ని ఎందుకు ఉపయోగించలేదంటే, బ్రిటీష్ వలసవాదాన్ని వదిలించు కోవడానికే. మన ప్రత్యేకతను చాటడానికి ఇదే సరైన సమయమని భావించా. అలాగే ఇది మోయడం సులువుగా కూడా ఉంటుంది. - నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రి -
మేం కూల్చింది ఎఫ్16నే
న్యూఢిల్లీ: పాకిస్తాన్ వైమానిక దళం(పీఏఎఫ్)కు చెందిన ఎఫ్–16 కూల్చివేతపై వస్తున్న అనుమానాలను భారత వైమానిక దళం(ఐఏఎఫ్) మరోసారి కొట్టిపారేసింది. ఫిబ్రవరి 27వ తేదీన జరిగిన ఘటనలో తాము కూల్చింది ఎఫ్–16 యుద్ధ విమానమే అనేందుకు బలమైన ఆధారాలున్నాయని పేర్కొంది. సోమవారం రక్షణ శాఖ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎయిర్ వైస్ మార్షల్ ఆర్.జి.కపూర్ మాట్లాడారు. ‘ఫిబవరి 27వ తేదీన జరిగిన ఘటనలో పీఏఎఫ్ ఎఫ్–16ను వినియోగిం చడం మాత్రమే కాదు, దానిని ఐఏఎఫ్ మిగ్–21 బైసన్ విమానం కూల్చి వేసిందడానికి కూడా తిరుగులేని ఆధారాలున్నాయి’ అని తెలిపారు. ‘ఫిబ్రవరి 27వ తేదీన రెండు విమానాలు పరస్పరం తలపడిన విషయం సుస్పష్టం. అందులో ఒకటి పీఏఎఫ్‌కు చెందిన ఎఫ్–16 కాగా మరొకటి ఐఏఎఫ్‌కు చెందిన మిగ్–21 బైసన్ రకం విమానం. ఈ విషయాన్ని ఎలక్ట్రానిక్, రాడార్ వ్యవస్థలు కూడా పసిగట్టాయి’ అని వివరించారు. అయితే, భద్రతా కారణాల రీత్యా మిగతా వివరాలను తాము బహిరంగ పర్చలేక పోతున్నామన్నారు. ఈ సందర్భంగా ఆయన ఎయిర్‌బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్(అవాక్స్)కు సంబంధించిన చిత్రాలను ప్రదర్శించారు. ఫిబ్రవరి 27న ఎఫ్–16ను కూల్చివేసిన అనంతరం వింగ్ కమాండర్ అభినందన్ నడుపుతున్న మిగ్ విమానాన్ని పీఏఎఫ్ కూల్చివేయడంతో ఆయన పాక్ భూభాగంలో దిగటం, తర్వాత విడుదల తెల్సిందే. -
జి. సతీశ్‌రెడ్డికి అంతర్జాతీయ అవార్డు
సాక్షి, హైదరాబాద్: దేశ రక్షణ వ్యవస్థలకు కీలకమైన నావిగేషన్ వ్యవస్థలు అందించిన శాస్త్రవేత్త..డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ జి.సతీశ్‌రెడ్డి ప్రతిష్టాత్మకమైన ‘‘2019 మిస్సైల్ సిస్టమ్స్’’అవార్డుకు ఎంపికయ్యారు. ద అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటిక్స్ అండ్ అస్ట్రోనాటిక్స్ (ఏఐఏఏ) ఇచ్చే ఈ అవార్డు అందుకున్న తొలి భారతీయుడిగా సతీశ్‌రెడ్డి రికార్డు సృష్టించారు. రెండేళ్లకు ఒకసారి అందించే ఈ అత్యున్నత అవార్డును ఇప్పటివరకూ అమెరికన్లకు మాత్రమే అందిస్తుండగా.. తొలిసారి ఇతర దేశపు నిపుణుడికి ఇవ్వటం విశేషం. క్షిపణి వ్యవస్థను అభివృద్ధి, తయారీల్లో అత్యున్నత నైపుణ్యం కనబరిచే వారికి అందించే ఈ అవార్డును రోండెల్ జే.విల్సన్‌తో కలసి పంచుకోనున్నారు. అమెరికాలోని మేరీల్యాండ్‌లో మే ఏడు నుంచి తొమ్మిది వరకూ జరిగే డిఫెన్స్ ఫోరం కార్యక్రమంలో రోండెల్ ఈ అవార్డు అందుకుంటారని.. సతీశ్‌రెడ్డికి భారత్‌లోనే అంద జేస్తామని ఏఐఏఏ ఒక ప్రకటనలో తెలిపింది. కలామ్ స్ఫూర్తితో.. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని ఓ కుగ్రామంలో జన్మించిన జి.సతీశ్‌రెడ్డి అనంత పురంలోని జేఎన్టీయూ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. హైదరాబాద్‌లోని జేఎన్టీయూలో స్నాతకోత్తర విద్యతోపాటు పీహెచ్డీ కూడా పూర్తి చేసిన ఆయన 1986లో డీఆర్డీఎల్లో చేరారు. ఆ తర్వాత మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలామ్ అధ్యక్షుడిగా పనిచేసిన రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్సీఐ)లో విధులు కొనసాగించారు. మిస్సైల్స్ అండ్ స్ట్రాటజిక్ సిస్టమ్స్ డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ మిస్సైల్ కాంప్లెక్స్‌కు నేతృత్వం వహించారు కూడా. అంతర్జాతీయంగా అనేక నిషేధాజ్ఞలు, కట్టుబాట్లు ఉన్న తరుణంలో రక్షణ రంగంలో స్వావలంబన కోసం కృషి చేశారు. సతీశ్‌రెడ్డి డిజైన్ చేసి సిద్ధం చేసిన అత్యాధునిక ఏవియానిక్స్ వ్యవస్థలు క్షిపణులతోపాటు స్మార్ట్ గైడెడ్ బాంబుల్లోనూ వాడుతున్నారు. హోమీ జే.బాబా స్మారక బంగారు మెడల్, జాతీయ ఏరోనాటికల్ ప్రైజ్, నేషనల్ డిజైన్ అవార్డు, నేషనల్ సిస్టమ్స్ గోల్డ్ మెడల్ ఐఈఐృఐఈఈఈ (అమెరికా) అవార్డులు కూడా సతీశ్‌రెడ్డిని వరించాయి. క్షిపణి నావిగేషన్ వ్యవస్థల రూపశిల్పి భారత రక్షణ రంగంలో అత్యంత కీలకమైన క్షిపణులకు నావిగేషన్ వ్యవస్థలను డిజైన్ చేయడంతోపాటు తయారీకి అవసరమైన అనేక పరికరాలను పూర్తి స్వదేశీ టెక్నాలజీతోనే అభివృద్ధి చేసుకునేందుకు సతీశ్‌రెడ్డి కృషి చేసిన విషయం తెలిసిందే. అగ్ని, పృథ్వీ, నాగ్ క్షిపణులతోపాటు అనేక ఇతర వ్యూహాత్మక క్షిపణులకు అత్యాధునిక నావిగేషన్ వ్యవస్థలను అందించిన ఘనత సతీశ్ రెడ్డి సొంతం. రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నావిగేషన్, రాయల్ ఏరోనాటికల్ సొసైటీ, అకాడమీ ఆఫ్ నావిగేషన్ అండ్ మోషన్ కంట్రోల్ (రష్యా) సభ్యత్వం లభించిన తొలి భారతీయుడిగా సతీశ్‌రెడ్డి గుర్తింపు పొందారు. -
ఆర్మీకి ఆధునిక సాంకేతికత అవసరం
హైదరాబాద్: దేశ సరిహద్దుల్లో సైనికులు ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించాలంటే ఆర్మీకి ఆధునిక సాంకేతికత అవసరమని ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ అన్నారు. ‘దేశ రక్షణ రంగ తయారీలో స్వావలంభన’అంశంపై ఫోరం ఫర్ ఇంటిగ్రేటెడ్ నేషనల్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ దస్పల్లా హోటల్లో జరిగిన 2 రోజుల సదస్సు ఆదివారంతో ముగిసింది. సదస్సుకు హాజరైన యువ శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలు, రక్షణ రంగ నిపుణులను ఉద్దేశించి రావత్ మాట్లాడారు. పరిశ్రమలతో సంబంధాలు కొనసాగించడంలో నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లతో పోలిస్తే ఆర్మీ కాస్త వెనకబడి ఉండటం బాధాకరమన్నారు. పరిశ్రమలు, రక్షణ రంగానికి మధ్య అంతరాన్ని తగ్గించేందుకు ఆర్మీ సిద్ధంగా ఉందన్నారు. రక్షణరంగ ఉత్పత్తులను తయారు చేసే పరిశ్రమలకు తమ తో కలసి పనిచేసేందుకు అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పా రు. ఇందుకోసం ‘ఆర్మీ డిజైన్ డివిజన్’వేదికగా పనిచేస్తుందన్నారు. పారిశ్రామికవేత్తలు ఆ వేదికను సంప్రదిస్తే అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయడానికి సిద్ధంగా ఉంటారన్నారు. ఆర్మీ అవసరాలు, సమస్యలు, సవాళ్లతో కూడిన 4 నివేదికలను సిద్ధం చేశామని, వాటి మీద పనిచేయడానికి సిద్ధంగా ఉన్నవారు ముందుకురావచ్చని పేర్కొన్నారు. కృత్రిమ మేధస్సుతో సరైన నిర్ణయాలు.. ఉపగ్రహా, డ్రోన్ల వ్యవస్థలతోపాటు పలు రకాలుగా వచ్చే సమాచారాన్ని కృత్రిమ మేధస్సు(ఏఐ), బిగ్ డేటా ఎనలిటి క్స్ సహకారంతో విశ్లేషించి సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారముందని అన్నారు. రక్షణ ఉత్పత్తులను తయారు చేసుకోగలిగితే దిగుమతి చేసుకునే సమస్య ఉండదన్నారు. ఇందుకు దేశీయ పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వడానికి ఆర్మీ సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. దేశంలో కొత్తగా ఉత్తరప్రదేశ్, తమిళనాడుల్లో డిఫెన్స్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ సెక్టార్స్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రక్షణ రంగ నిపుణులు వీఎస్ హెగ్డే, సందీప్ ఉన్నితన్, లెఫ్టినెంట్ జనరల్ డీబీ షేకట్కర్, సంజయ్ పరషార్ పాల్గొన్నారు. -
ధనా ‘ధన్’
సాక్షి నాలెడ్జ్ సెంటర్: ఓ నిరాయుధీకరణ, శాంతియుత ప్రపంచం కోసం ఉద్యమాలు, ఒప్పందాలు జరుగుతోంటే.. మరోవైపు విధ్వంసాలకు కారణమవుతున్న ఆయుధ వ్యాపారం వేల కోట్ల రూపాయలతో పెరుగుతూనే ఉంది. ప్రపంచంలో శాంతి నెలకొనాలంటూ ప్రకటనలు, భారీ స్పీచులు ఇస్తున్న అగ్రరాజ్యాలే.. ఈ ఆయుధ వ్యాపారంలో మొదటివరసలో ఉండటం గమనార్హం. అమెరికా, రష్యాల మధ్య ప్రచ్ఛన్నయుద్ధం ముగిసిన తర్వాత ఆయుధ వ్యాపారం కాస్త మందగించింది. అయితే, అమెరికా, రష్యాలు మళ్లీ ఆధిపత్యం కోసం ప్రయత్నాలు చేస్తుండటం.. చైనా వీరికి పోటీ రావడంతో 2002 నుంచి ఈ వ్యాపారం మళ్లీ ఊపందుకుంది. దీనికితోడు సిరియా, యెమెన్ తదితర దేశాల్లో అంతర్యుద్ధాలు, దాయాది దేశాల మధ్య ఘర్షణలు ఈ ఆయుధ వ్యాపారానికి ఆజ్యం పోస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఏటా 10 వేల కోట్ల డాలర్ల (దాదాపు రూ.7లక్షల కోట్లు) ఆయుధ వ్యాపారం సాగుతోందని స్టాక్‌హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సిప్రీ)కి చెందిన సీనియర్ పరిశోధకుడు పీటర్ వెజెమన్ చెబుతున్నారు. 2008–12తో పోలిస్తే 2013–17లో భారీ ఆయుధాల అమ్మకాలు 10% పెరిగాయని రక్షణరంగ నిపుణులు అంటున్నారు. పశ్చిమాసియానే మొదటి కస్టమర్ అమెరికా నుంచి చాలా దేశాలు ఆయుధాలు కొనుగోలు చేస్తున్నా.. మెజారిటీ వాటామాత్రం పశ్చిమాసియా దేశాలదే. 2013–17మధ్య అమెరికా ఆయుధ ఎగుమతుల్లో దాదాపు సగం ఈ దేశాలకే జరిగాయి. ఇందుకు కారణం పశ్చిమాసియా దేశాల్లో రాజకీయ అస్థిరత, అంతర్యుద్ధాలు ఎక్కువగా జరుగుతుండటమే. ముఖ్యంగా సిరియా, యెమెన్లలో అంతర్యుద్ధాలు ఆయుధ వ్యాపారానికి ఆజ్యం పోశాయి. సౌదీ ఆరేబియా, ఈజిప్టు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లు కూడా అమెరికా నుంచి ఆయుధాలు దిగుమతి జాబితాలో ముందున్నాయి. 2012–16 మధ్యలో పశ్చిమాసియా దేశాల ఆయుధ దిగుమతులు 86% పెరిగాయని, ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఆయుధ దిగుమతుల్లో ఇది 29% అని నిపుణులు చెబుతున్నారు. అమెరికాయే నంబర్ వన్ ఆయుధాల ఎగుమతిలో అమెరికాదే అగ్రస్థానం. ప్రపంచవ్యాప్తంగా జరిగే ఆయుధ విక్రయాల్లో 34% వాటా అమెరికాదేనని సిప్రీ స్పష్టం చేసింది. ఐదేళ్ల క్రితం ఇది 30%. అమెరికా నుంచి భారీమొత్తంలో ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో సౌదీ అరేబియా ముందుంది. ఆయుధాల ఎగుమతి జాబితాలో అమెరికా తర్వాత స్థానం రష్యాదే. అయితే, రష్యాతో పోలిస్తే అమెరికా 58% ఎక్కువ ఎగుమతి చేస్తోంది. 2008–12తో పోలిస్తే 2013–17 మధ్య కాలంలో అమెరికా ఆయుధ విక్రయాలు 25% పెరగగా.. రష్యా విక్రయాలు 7.1% తగ్గాయి. మొత్తం ఆయుధ ఎగుమతుల్లో 74% వాటా.. అమెరికా, రష్యా, జర్మనీ, ఫ్రాన్స్, చైనాలదేనని సిప్రీ వివరించింది. ఆఫ్రికాలో చిల్లర ఆయుధాలే అన్ని దేశాల్లో ఆయుధాల దిగుమతులు పెరుగుతోంటే ఆఫ్రికా దేశాల్లో మాత్రం తగ్గుదల కనిపిస్తోంది. ఐదేళ్లలో ఈ దేశాల ఆయుధ దిగుమతులు 22% తగ్గాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అంతమాత్రాన.. ఆఫ్రికా దేశాల్లో యుద్ధాలు జరగడం లేదని, ఆ దేశాలు ఆయుధాలను కొనడం మానేస్తున్నాయని దీనర్థం కాదు. సాధారణంగా కాంట్రాక్టు విలువల ఆధారంగా అంతర్జాతీయ స్థాయిలో ఆయుధ విక్రయాలను లెక్కిస్తారు. భారీ ఆయుధాల కొనుగోలుకే కాంట్రాక్టులు ఉంటాయి. చిన్న, తేలికపాటి ఆయుధాలు ఈ లెక్కలోకి రావు. ఉదాహరణకు ఏ దేశమైనా మూడు పెద్ద ఓడల నిండా మెషిన్గన్లను దిగుమతి చేసుకుంటే అవి అంతర్జాతీయ స్థాయి లెక్కల్లోకి రావు. ఆఫ్రికా దేశాల్లో దిగుమతులు తగ్గడానికి కారణం కూడా ఇదే. ఈ దేశాలన్నీ చిన్న చిన్న ఆయుధాలనే బాగా కొంటున్నాయని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తెలిపింది. దూసుకొస్తున్న చైనా అమెరికాతో వాణిజ్య, సాంకేతిక రంగాల్లోనే కాక ఆయుధ విక్రయాల్లో కూడా చైనా పోటీ పడుతోంది. చైనా తన రక్షణ బడ్జెట్‌ను పెంచుకోవడంతో పాటు ఆయుధ సరఫరాదారుగా కూడా మార్కెట్లోకి ప్రవేశించింది. తాజా వివరాల ప్రకారం.. ప్రస్తుతం చైనా ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆయుధ విక్రేత. అమెరికా, రష్యా, ఫ్రాన్స్, జర్మనీల తర్వాతి స్థానం చైనాదే. ఇటీవలే బ్రిటన్ను వెనక్కు నెట్టి డ్రాగన్ కంట్రీ ఐదో స్థానాన్ని సంపాదించుకుంది. 2008–12తో పోలిస్తే 2013–17 మధ్య చైనా ఆయుధ ఎగుమతులు 38% పెరిగాయి. అమెరికా తర్వాత అత్యధిక రక్షణ బడ్జెట్ కలిగిన దేశం కూడా చైనాయే. అత్యాధునిక ఆయుధాల తయారీలో కూడా చైనా ముందుందని ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్‌కు చెందిన పరిశోధకురాలు మియా నౌవెన్స్ అన్నారు. సొంతంగా యుద్ధనౌకలను నిర్మించుకోవడమే కాకుండా పెద్ద ఎత్తున ఆయుధాలను విక్రయించడం ద్వారా బలమైన సైనిక శక్తిగా ఎదగాలని చైనా ఆకాంక్షిస్తోంది. 2013–17 మధ్య చైనా 48 దేశాలకు ఆయుధాలు విక్రయించింది. అయితే చైనా ఆయుధాల్లో ఎక్కువశాతం పాకిస్తాన్ ఖాతాలో చేరాయి. అమెరికా, రష్యా, జర్మనీ, ఫ్రాన్స్ దేశాలు ఆయుధాలు విక్రయించని.. ఇరాన్, వెనెజులా, సుడాన్, జింబాబ్వే వంటి దేశాలకు కూడా చైనా ఆయుధాలు విక్రయిస్తోంది. చైనా దూకుడుతో పోటీ పడేందుకు భారత్‌కూడా తన రక్షణ బడ్జెట్‌ను నెమ్మదిగా పెంచుతోంది. 2008–12తో పోలిస్తే 2013–17లో భారత్ రక్షణ దిగుమతులు 24% పెరిగాయి. యుద్ధ విమానాలకు గిరాకీ ఆయుధాల తయారీ, ఎగుమతుల్లో తాజా ట్రెండ్ యుద్ధ విమానాలదే. 2027 కల్లా యుద్ధ విమానాల మార్కెట్ 24,900 కోట్ల డాలర్లకు (రూ.16.6 లక్షల కోట్లు) చేరుతుందని, 3,243 యుద్ధ విమానాలు తయారవుతాయని ఫోర్కాస్ట్ ఇంటర్నేషనల్ అనే సంస్థ ‘ద మార్కెట్ ఫర్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్’పేరుతో విడుదల చేసిన అధ్యయన నివేదికలో పేర్కొంది. ఈ పదేళ్లలో తయారైన యుద్ధ విమానాలకంటే 13.1% ఎక్కువ విమానాలు వచ్చే పదేళ్లలో తయారవుతాయని పేర్కొంది. వచ్చే పదేళ్లలో ఏటా సగటున 280 విమానాలు తయారవుతాయని వెల్లడించింది. ఇందులో 1,466 విమానాలు లాక్‌హీడ్ మార్టిన్ తయారు చేసే ఎఫ్–35 విమానాలేనని తెలిపింది. ఈ నివేదిక ప్రకారం వచ్చే పదేళ్లలో అమెరికా ఎక్కువగా ఎఫ్–35 యుద్ధవిమానాలను కొంటుంది. భవిష్యత్తులో లాక్‌హీడ్ మార్టిన్ తయారు చేసే ఎఫ్–35 విమానాలను చాలా దేశాలు కొనే అవకాశం ఉంది. ఈ మార్కెట్లో 45% లాక్‌హీడ్ సొంతం చేసుకోనుంది. బోయింగ్ ఎఫ్–16, ఎఫ్/ఏ–18ఈ సూపర్ హార్నెట్, లాక్‌హీడ్ ఎఫ్–16 యుద్ధ విమానాలకు కూడా మళ్లీ డిమాండు పెరుగుతోంది. పశ్చిమాసియా దేశాల నుంచి యుద్ధ విమానాలకు ఎక్కువ డిమాండు ఉండబోతోంది. ఆ మేరకు బోయింగ్, లాక్‌హీడ్, డస్సాల్ట్, యూరోఫైటర్ కన్సార్టియంలు ఉత్పత్తిని పెంచుకోవలసి ఉంటుందని ఫోర్కాస్ట్ సంస్థ నిపుణుడు డగ్లాస్ రాయస్ చెప్పారు. వచ్చే పదేళ్లలో యూరోఫైటర్ టైఫూన్లు 95, డసాల్ట్ రఫేల్ విమానాలు 158 బయటకు వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు. భారత ప్రభుత్వం కుదుర్చుకున్న రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో అక్రమాలేమీ లేవని సుప్రీంకోర్టు స్పష్టం చేసినా కూడా దానిపై రాజకీయ రచ్చ కొనసాగుతూనే ఉంది. పార్లమెంటులో అధికార, విపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నాయి. ఆమ్నెస్టీ ఆందోళన ఆయుధ వ్యాపారం మానవహక్కులను కాలరాస్తోందని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆరోపిస్తోంది. యుద్ధాలను, తిరుగుబాట్లను అణచివేసేందుకు వినియోగిస్తున్న ఆయుధాలు అమాయక పౌరులను బలితీసుకుంటున్నాయని.. ఆమ్నెస్టీ ఆయుధ వ్యాపార నిపుణుడు అలివర్ ఫీలే ఆవేదన వ్యక్తం చేశారు. ఆయుధ వ్యాపారం ఎంతగా పెరిగితే మానవాళికి ముప్పు అంతగా పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. యెమెన్ యుద్ధంతో స్వీడన్, జర్మనీ, నెదర్లాండ్స్, నార్వే వంటి దేశాలు పశ్చిమాసియాలో ఆయుధాల విక్రయంపై ఆంక్షలు విధించాయని అలివర్ తెలిపారు. ఆయుధ వ్యాపారానికి వ్యతిరేకంగా ‘క్యాంపెయిన్ అగెనెస్ట్ ద ఆర్మ్స్ ట్రేడ్ (సీఏఏటీ) పేరుతో ఉద్యమం కూడా నడుస్తోంది. సౌదీకి బ్రిటన్ ఆయుధాలు విక్రయించడం సీఏటీటీకి విరుద్ధమంటూ.. ఈ సంస్థ బ్రిటన్ న్యాయస్థానంలో కేసు వేసింది. అయితే, బ్రిటన్ ఆయుధ విక్రయాలు చట్టబద్ధమేనని గత జూలైలో ఆ కోర్టు తీర్పునిచ్చింది. -
21 వేల కోట్లతో 111 హెలికాప్టర్లు
న్యూఢిల్లీ: భారత నౌకాదళం కోసం రూ.21,000 కోట్లతో 111 యుటిలిటీ హెలికాప్టర్లు కొనాలన్న ప్రతిపాదనకు రక్షణశాఖ ఆమోదం తెలిపింది. మరో రూ.25,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకూ ఓకే చెప్పింది. ఢిల్లీలో జరిగిన రక్షణ పరికరాల కొనుగోలు మండలి(డీఏసీ) సమావేశంలో ఈ ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. శత్రు స్థావరాలపై దాడి, నిఘా, గాలింపు, సహాయక చర్యల్లో పాల్గొనే 111 యుటిలిటీ హెలికాప్టర్లను రూ.21,000 కోట్లకుపైగా వ్యయంతో నేవీ కోసం కొనుగోలు చేయనున్నారు. వీటిని వ్యూహాత్మక భాగస్వామ్య విధానం కింద విదేశీ–స్వదేశీ సంస్థలు సంయుక్తంగా భారత్‌లోనే తయారుచేస్తాయి. సైన్యం కోసం రూ.3,364.78 కోట్లతో దేశీయంగా అభివృద్ధి చేసిన 150 అత్యాధునిక 155 ఎంఎం అర్టిలరీ గన్స్ కొనుగోలు ప్రతిపాదనకు డీఏసీ ఆమోదం తెలిపింది. సబ్ మెరైన్లపై దాడిచేయగల 24 నేవల్ మల్టీరోల్ హెలికాప్టర్ల కొనుగోలుకూ డీఏసీ పచ్చజెండా ఊపింది. 14 స్వల్పశ్రేణి క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేయాలని నిర్ణయించిన రక్షణశాఖ, వీటిలో 10 వ్యవస్థలు దేశీయంగా అభివృద్ధి చేసినవి అయ్యుండాలని షరతు పెట్టింది. గతేడాది మేలో తీసుకొచ్చిన వ్యూహాత్మక భాగస్వామ్య విధానం కింద విదేశీ ఆయుధ కంపెనీలతో జట్టుకట్టే భారత ప్రైవేటు కంపెనీలు.. యుద్ధ విమానాలు, సబ్మెరైన్లు, హెలికాప్టర్లు, సాయుధ వాహనాలను తయారుచేసేందుకు మాత్రమే వీలుంది. -
సచివాలయం, రోడ్ల విస్తరణకు భూములివ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: నూతన సచివాలయం నిర్మాణానికి బైసన్‌పోలో గ్రౌండ్స్, రోడ్ల విస్తరణకు రక్షణ భూము లు బదలాయించాల ని గత నాలుగేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం కోరుతోందని టీఆర్ఎస్ ఎంపీలు మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకొచ్చా రు. వెంటనే కల్పించుకుని రక్షణ శాఖ భూములు రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించేలా తగిన ఆదేశాలి వ్వాలని ప్రధానిని టీఆర్ఎస్ ఎంపీలు కోరారు. పార్టీ లోక్‌సభాపక్ష నేత జితేందర్‌రెడ్డి, వినోద్‌కుమార్, సీతారాం నాయక్, కొండా విశ్వేశ్వరరెడ్డి, బాల్క సుమన్, బీబీ పాటిల్, దయాకర్, బండా ప్రకాశ్, లింగయ్య యాదవ్, మల్లారెడ్డి తదితరులు శుక్రవారం పార్లమెంటు లో ప్రధానితో సమావేశమయ్యారు. నూతన సచివాలయం నిర్మాణానికి బైసన్‌పోలో గ్రౌండ్స్, రోడ్ల విస్తరణకు కంటోన్మెంట్లో స్ట్రాటజిక్ రోడ్లు బదలాయింపునకు గతంలో కేంద్ర రక్షణశాఖ మంత్రులుగా పనిచేసిన మనో హర్ పారికర్, అరుణ్ జైట్లీ సూత్రప్రాయంగా అంగీకరించారని వివరించారు. ఈ విషయమై సీఎం కేసీఆర్ కూడా పలు మార్లు కేంద్రాన్ని కోరారని వెల్లడించారు. అలాగే ఉద్యోగాల్లో స్థానికులకు ప్రాధాన్యం కల్పించేలా రూపొందించుకున్న కొత్త జోనల్ వ్యవస్థను ఆమోదించి రాష్ట్రపతి ఉత్తర్వులు విడుదలయ్యేలా చూడాలని కోరారు. తెలంగాణ విషయంలో ఎందుకింత నిర్లక్ష్యం: జితేందర్‌రెడ్డి సమావేశం అనంతరం టీఆర్ఎస్ ఎంపీలు మీడియాతో మాట్లాడారు. బైసన్‌పోలో గ్రౌండ్స్‌కు ప్రత్యామ్నాయంగా తెలంగాణ ప్రభుత్వం 595 ఎకరాలు సహా అదనంగా రూ.95 కోట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని ప్రధాని మోదీకి వివరించామని ఎంపీ జితేందర్‌రెడ్డి చెప్పారు. అయితే బైసన్‌పోలో సమీపంలో ఉన్న కట్టడాల ద్వారా రక్షణశాఖకు ఏటా రూ.31 కోట్ల ఆదాయం వస్తోందని, దీన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని కోరడం సరికాదని.. ఈ నిబంధనను తొలగించాలని విన్నవించామన్నారు. ఇటీవల కర్ణాటక అభ్యర్థన మేరకు ఆ రాష్ట్రానికి 210 ఎకరాలను ఆగమేఘాల మీద బదలాయించిన రక్షణశాఖ.. తెలంగాణ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. గతంలో పనిచేసిన ఇద్దరు రక్షణశాఖ మంత్రులు భూముల బదలాయింపునకు అంగీకరిస్తే.. ఇప్పటి రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం భూముల బదలాయింపును ఆలస్యం చేస్తున్నారని అన్నారు. అందుకే బైసన్ పోలో ఫైలు, కంటోన్మెంట్ స్ట్రాటజిక్ రోడ్ల ఫైలు విడిగా పంపాలని ఆమె కోరుతున్నారని చెప్పారు. బైసన్‌పోలో గ్రౌండ్ ఇచ్చివుంటే ఇప్పటికే రూ.400 కోట్లతో అద్భుతమైన సచివాలయాన్ని నిర్మించేవాళ్లమని జితేందర్‌రెడ్డి పేర్కొన్నారు. కంటోన్మెంట్లో రోడ్లు విస్తరిస్తేనే హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని ఎంపీ వినోద్ కుమార్ తెలిపారు. -
తెలంగాణపై ఎందుకీ సవతి తల్లి ప్రేమ?
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో నూతన సచివాలయం, ఇతర మౌలిక వసతుల నిర్మాణానికి వీలుగా రక్షణశాఖ పరిధిలోని భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదని టీఆర్ఎస్ ఎంపీలు మండిపడ్డారు. గురువారం లోక్‌సభలో ఈ అంశంపై ఆందోళన చేపట్టారు. తెలంగాణ మీద ఈ సవతి తల్లి ప్రేమ ఎందుకని టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత ఎ.పి. జితేందర్‌రెడ్డి నిలదీశారు. జీరో అవర్‌లో ఆయన మాడ్లాడుతూ ‘‘తెలంగాణలో ప్రస్తుత సచివాలయం ఇరుకుగా ఉన్నందున బైసన్ పోలో మైదానం, జింఖానా మైదానంలో నూతన సచివాలయం నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. స్థలాన్ని బదలాయించాలని ప్రధాని, రక్షణ మంత్రికి మా ముఖ్యమంత్రి పలుమార్లు విన్నవించారు. సచివాలయ నిర్మాణంతోపాటు జాతీయ రహదారి–44, రాష్ట్ర రహదారి–1పై పలు మౌలిక వసతులు నిర్మించాల్సి ఉంది. ఇందుకు మొత్తంగా 200.58 ఎకరాలు అవసరమవుతోంది. సికింద్రాబాద్ ప్రాంతంలో ఇరుకైన రహదారి కారణంగా కరీంనగర్ రోడ్డు తరచూ బ్లాక్ అవుతుంది. అందువల్ల రక్షణశాఖ పరిధిలోని ఈ మైదానాలను బదలాయించాలని అనేక మార్లు కోరగా అప్పటి రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ ఈ భూములను బదలాయించేందుకు వీలుగా రూ. 95 కోట్లు చెల్లించాలని అడిగారు. తెలంగాణ ప్రభుత్వం అందుకు అంగీకరించింది. ఇది జరిగి మూడేళ్లయినా తదుపరి చర్యలు లేవు. ఈ స్థలం కేటాయించడం వల్ల తాము కోల్పోయే ఆదాయాన్ని భర్తీ చేసేలా ఏటా రూ. 31 కోట్లు పరిహారంగా చెల్లించాలని కంటోన్మెంట్ బోర్డు కోరింది. అయితే దీన్ని మాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అడిగింది. అప్పటి నుంచి బదలాయింపు పెండింగ్‌లో ఉంది. కర్ణాటక ప్రభుత్వానికి ఇటీవల 200 ఎకరాల రక్షణ భూమిని కొద్ది సమయంలోనే బదలాయించారు. కానీ మేం మూడేళ్లుగా అడిగినా బదలాయించలేదు. తెలంగాణలో మౌలిక వసతుల నిర్మాణాలను పెండింగ్‌లో పెట్టేలా కేంద్ర ప్రభుత్వ విధానాలు ఉండరాదు’’అని పేర్కొన్నారు. గత మూడేళ్లుగా బతిమాలుతూ వచ్చామని కానీ ఇప్పుడు డిమాండ్ చేస్తున్నామన్నారు. అందుకే నిరసన కొనసాగిస్తున్నామన్నారు. అనంతరం టీఆర్ఎస్ ఎంపీలు వెల్‌లో తమ నిరసన కొనసాగించారు. -
తిరుగులేని బ్రహ్మోస్
బాలాసోర్/న్యూఢిల్లీ: సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్‌ను భారత్ మరోసారి విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని బాలాసోర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి సోమవారం క్షిపణిని ప్రయోగించినట్లు రక్షణ శాఖ వెల్లడించింది. ప్రయోగ సమయంలో సముద్రంలో అలలు తొమ్మిది మీటర్ల ఎత్తుకు ఎగిసిపడుతున్నాయని, ప్రతికూల వాతావ రణంలోనూ నిర్దేశించిన మార్గంలో బ్రహ్మోస్ ప్రయాణించిందని, క్షిపణిలోని ముఖ్య భాగాలన్నీ కచ్చితత్వంతో పని చేశాయంది. దీన్నిబట్టి అత్యంత తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లోనూ లక్ష్యాలను బ్రహ్మోస్ ఛేదించ గలదని మరోమారు రుజువైందని పేర్కొంది. క్షిపణి జీవిత కాలాన్ని పెంచే కార్యక్రమంలో భాగంగా ప్రయోగం నిర్వహించామని, త్వరలోనే దీన్ని ఆర్మీకి అప్పగించనున్నామని వెల్లడించింది. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిగా పేరొందిన బ్రహ్మోస్.. 290 కి.మీ. పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదు. -
‘స్పేస్ ఫోర్స్’ ఏర్పాటుకు ట్రంప్ ఆదేశాలు
వాషింగ్టన్: అమెరికా సైన్యంలో కొత్తగా స్పేస్ ఫోర్స్(అంతరిక్ష దళం)ను ఏర్పాటు చేయాలని ఆ దేశ రక్షణ శాఖ విభాగం పెంటగాన్‌ను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశించారు. ‘అమెరికా సైన్యంలో ఆరో విభాగంగా స్పేస్ ఫోర్స్ ఏర్పాటు కోసం తక్షణం ప్రక్రియ ప్రారంభించాలని రక్షణ శాఖ, పెంటగాన్‌ను ఆదేశిస్తున్నాను’ అని ఆయన చెప్పారు. నేషనల్ స్పేస్ కౌన్సిల్ సమావేశంలో సోమవారం ట్రంప్ ప్రసంగిస్తూ.. ‘అమెరికాను కాపాడుకునేందుకు అంతరిక్షంలో మన కార్యకలాపాలు కొనసాగడం ఒక్కటే సరిపోదు. ఆధిపత్యం సాధించాలి’ అని పేర్కొన్నారు. -
రెడీ.. వన్.. టూ.. త్రీ..
పిజ్జాల డెలివరీలు.. పెళ్లిళ్లలో 360 డిగ్రీల్లో ఫోటోలు, వీడియోలు..సెల్ఫీ వీడియోలు, ఫొటోలు తీసుకునేందుకు.. పుష్కరాలు వంటి ఉత్సవాల్లో భద్రతను పరిశీలించేందుకు.. డ్రోన్లు అన్న పేరు వినగానే మనకు గుర్తుకొచ్చేవి ఇవే. కానీ భవిష్యత్తులో అదీ ఇదీ అని కాకుండా దాదాపు అన్ని రంగాల్లోనూ తమదైన ముద్ర వేసేందుకు డ్రోన్లు సిద్ధమవుతున్నాయి! మన దేశంలో ఇప్పటివరకూ సైన్యం, భద్రతా రంగాల్లో డ్రోన్లను ఎక్కువగా వినియోగిస్తుండగా.. ఇకపై పరిస్థితి మారిపోనుంది.సాధారణ ప్రజలు కూడా డ్రోన్లను వినియోగించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం వీలు కల్పిస్తుండటమే దీనికి కారణం. ఇంతకీ డ్రోన్లతో మనకు ప్రయోజనమెంత, వాటి వినియోగంపై ఆంక్షలేమిటి, డ్రోన్లతో భవిష్యత్తు ఏమిటో తెలుసా? విమానాశ్రయాన్ని మూసేసి..! కొద్దినెలల క్రితం మైసూరు విమానాశ్రయం ఓ రెండు గంటలపాటు మూతపడింది. విమానాల రాకపోకలపై ఆంక్షలు పెట్టేశారు. ఆ సమయంలో ఏం జరిగిందో తెలుసా. విమానయాన శాఖ, కొన్ని స్టార్టప్ కంపెనీలు డ్రోన్లను పరీక్షించాయి. బెంగళూరుకు చెందిన స్కైలార్క్ ఇంజనీర్లు భద్రతా రంగంలో డ్రోన్లను మరింత సమర్థంగా ఎలా వాడవచ్చు, వేర్వేరు రంగాల్లో డ్రోన్ల వినియోగంతో వచ్చే లాభాలేమిటి అన్న అంశాలను ప్రభుత్వ ఉన్నతాధికారులకు ప్రత్యక్షంగా చూపారు. డ్రోన్లతో భారత్ ఆర్థికంగా బలోపేతం అవుతుందని, ఉద్యోగావకాశాలు పెరుగుతాయని, సామాజికంగా మార్పులు వస్తాయని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో పెను మార్పులకు డ్రోన్లు ఉపయోగపడతాయని అంచనా. ఇప్పటికే 40 వేలకుపైగా డ్రోన్లు ప్రైవేటు వ్యక్తులు వినియోగించడంపై ఆంక్షలు ఉన్నా.. మన దేశంలో ఇప్పటికే 40 వేలకుపైగా డ్రోన్లు ఉన్నట్టు అంచనా. 2022 నాటికి ప్రపంచం మొత్తమ్మీద డ్రోన్ల వాడకం రెట్టింపు అవుతుందని, వాటి మార్కెట్ 10 వేల కోట్ల డాలర్లకు చేరుకుంటుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ఒక్క యూరప్‌లోనే లక్షా 50 వేల కొత్త ఉద్యోగాల కల్పనకు డ్రోన్లు కారణమవుతాయని అంచనా. డ్రోన్లు నడిపేందుకు ప్రత్యేక నైపుణ్యం ఉన్న వారు అవసరమవుతారు. అలాగే అనవసరమైన డ్రోన్లను కూల్చేసేందుకు నిపుణుల అవసరం ఉంటుంది. ఆయా రంగాల్లోని అవసరాలకు తగ్గట్టుగా కొత్త కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయి. డ్రోన్లతో వ్యవ’సాయం’ మట్టి నాణ్యతని పరీక్షించి, సాగు చేసుకోదగ్గ పంటలపై సూచనలు ఇవ్వడం మొదలుకొని... దిగుబడులను అంచనా వేయడం వరకు డ్రోన్లు వ్యవసాయానికి అనేక విధాలుగా ఉపయోగపడతాయి. పంట పొలాల్లోని ప్రతి మొక్క, చెట్లను ఫొటోలు తీసి.. విశ్లేషించి వాటి ఆరోగ్యం ఎలా ఉందో గుర్తించవచ్చు. పొలంలోని ఏభాగంలో పోషకాల కొరత ఉందో.. ఎక్కడ ఎక్కువైందో తెలుసుకోవచ్చు. ఎరువులు, కీటకనాశినులను సమర్థంగా, తక్కువ సమయంలో పొలమంతా చల్లేందుకు డ్రోన్లను వాడుకోవచ్చు. ఇక విత్తనాలు నాటే డ్రోన్లు కూడా వస్తున్నాయి. చైనా, జపాన్ వంటి దేశాలు వ్యవసాయ రంగంలో డ్రోన్లను ఎక్కువగా వినియోగిస్తున్నాయి. మనదేశంలో పంజా బ్, కర్ణాటక తదితర రాష్ట్రాల రైతులు డ్రోన్లను వినియోగించడం మొదలుపెట్టారు. ఇక డ్రోన్ల సహాయంతో క్లౌడ్ సీడింగ్ చేయడం ద్వారా కరువు ప్రాంతాల్లో వర్షాలు కురిపించడం, వరదలు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయ చర్యలు, అభయారణ్యాల్లో వేటగాళ్ల నుంచి జంతువుల సంరక్షణకు డ్రోన్లను విస్తృతంగా వినియోగించవచ్చని నిపుణులు చెబుతున్నారు. డ్రోన్లపైనా నిఘా పెడతాయి డ్రోన్లు ఉగ్రవాదుల చేతుల్లో పడితే అసాంఘిక కార్యకలాపాలకు వినియోగించవచ్చన్న భయం ఇన్నాళ్లూ వెంటాడేది. ఇప్పుడు అలాంటి ఆందోళనలు లేవు. శత్రు డ్రోన్లకు అడ్డుకట్టే వేసే సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. ఇలా పక్కదారిపట్టే డ్రోన్ల ఆచూకీ కనిపెట్టడానికి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఇఎల్) శక్తిమంతమైన రాడర్లు, జామర్లను రూపొందించింది. విమానాశ్రయాలు, పార్లమెంటు, సరిహద్దు ప్రాంతాలు, సైనిక శిబిరాలు వంటి ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయడం వల్ల డ్రోన్లతో ఎవరైనా దాడికి దిగుతారన్న భయం ఉండ దు. ప్రస్తుతం 3 కిలోమీటర్ల పరిధిలో ఉండే డ్రోన్లను మాత్రమే ఈ టెక్నాలజీ ద్వారా పసిగట్టవచ్చు. ఈ పరిధిని పెంచడానికి పరిశోధనలు జరుగుతున్నాయి. అవయవ రవాణాతో ప్రాణదానం అవయవాలను దానం చేస్తే ఒక ప్రాణాన్ని నిలపవచ్చన్న అవగాహన ఈ మధ్య కాలంలో అందరిలోనూ పెరుగుతోంది. కానీ అవయవాలను సకాలంలో అవసరమైన చోటికి సరఫరా చేయడం సవాల్‌గా మారుతోంది. ఈ నేపథ్యంలోనే ఒక ఊరి నుంచి మరో ఊరికి రవాణా, ట్రాఫిక్ జామ్‌లు వంటి ఇబ్బందులు లేకుండా అవయవాలను సరఫరా చేయడానికి డ్రోన్లు ఉపయోగపడతాయి. గుండె, కాలేయం వంటి అవయవాలను డ్రోన్ల సాయంతో తరలించడానికి అవసరమయ్యే తక్కువ బరువున్న సరికొత్త బాక్స్‌ను శాస్త్రవేత్తలు ఇప్పటికే రూపొందించారు. ఇక మీదట ఈ అంబులెన్స్ డ్రోన్లు మనుషుల ప్రాణాలను కాపాడడానికి ఉపయోగపడతాయి. హింసాత్మక ఘటనలకు చెక్! జాతరలు, ఉత్సవాలు, సభలు సమావేశాల సమయాల్లో భద్రతా ఏర్పాట్ల కోసం డ్రోన్లను వినియోగించడం ఇప్పటికే మొదలైంది. అంతేకాదు అలాంటి కార్యక్రమాల్లో ఎవరైనా హింసకు పాల్పడే అవకాశాలుంటే.. ముందుగానే గుర్తించి, హెచ్చరికలు జారీ చేసేలా డ్రోన్లను అభివృద్ధి చేస్తున్నారు. కేంబ్రిడ్జి యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తయారు చేసిన ఈ రకమైన డ్రోన్లు రెండు కెమెరాల సాయంతో వీడియోలు తీయడమే కాకుండా.. ఐదు రకాల ముఖ కవళికలు, చర్యల ఆధారంగా అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని గుర్తిస్తాయి. తన్నడం, పిడిగుద్దులు, పొడవడం, కాల్చడం వంటి చర్యలను కూడా ఇవి గుర్తించగలవు. తద్వారా సమస్య పెద్దది కాకముందే అధికారులు రంగంలోకి దిగేందుకు వీలవుతుందని నిపుణులు చెబుతున్నారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వరంగల్), ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (బెంగళూరు) శాస్త్రవేత్తలు వీటిని వచ్చే నెలలో పరీక్షించనున్నారు. శత్రు స్థావరాలపై కిల్లర్ డ్రోన్ల నిఘా వందేళ్ల క్రితం మిలటరీ అవసరాల కోసమే తయారు చేసిన డ్రోన్లు.. ఇప్పుడు చాలా శక్తిమంతంగా తయారయ్యాయి. ప్రస్తుతం భారత సైన్యం దగ్గర 200కి పైగా డ్రోన్లు ఉన్నాయి. కొన్ని డ్రోన్లను సరిహద్దుల్లో గస్తీ కోసం వినియోగిస్తుండగా.. శత్రుస్థావరాలపై నిఘా పెట్టే విదేశీ రాడార్లను పసిగట్టే కిల్లర్ డ్రోన్లను ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేశారు. ఇక రూ. 2,650 కోట్ల వ్యయంతో డీఆర్డీవో సొంతంగా డ్రోన్ల తయారీ ప్రాజెక్టును కూడా ప్రారంభించింది. యుద్ధభూమిలో వినియోగిం చడానికి మరో 400 డ్రోన్ల అవసరముందని రక్షణ శాఖ అంచనా వేస్తోంది? -
అగ్ని–5 గ్రాండ్ సక్సెస్
బాలసోర్: దేశీయంగా అభివృద్ధి చేసిన, అణ్వాయుధాలను మోసుకెళ్లే సామర్థ్యమున్న అత్యాధునిక అగ్ని–5 ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని రక్షణ శాఖ ఆదివారం విజయవంతంగా పరీక్షించింది. 5 వేల కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఇది ఛేదించగలదు. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే ఈ క్షిపణిని ఒడిశాలోని ఏపీజే అబ్దుల్ కలాం దీవి నుంచి ఉదయం 9.45 గంటలకు మొబైల్ లాంచర్ ద్వారా ప్రయోగించి పరీక్షించామని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. క్షిపణి పరీక్ష విజయవంతం అవడంతో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) శాస్త్రజ్ఞులు, సిబ్బందికి రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అభినందనలు చెప్పారు. 2012 ఏప్రిల్ 19 నుంచి ఇప్పటివరకు మొత్తంగా ఆరుసార్లు అగ్ని–5 క్షిపణిని పరీక్షించగా, అన్నిసార్లూ విజయవంతంగా క్షిపణి తన లక్ష్యాన్ని ఛేదించింది. ఇప్పటికే అగ్ని–1 (700 కిలోమీటర్ల పరిధి), అగ్ని–2 (2 వేల కి.మీ), అగ్ని–3 (2,500 కి.మీ) క్షిపణులు రక్షణ శాఖ వద్ద ఉన్నాయి. అగ్ని–5 పరిధిని 5వేల కిలోమీటర్లకు పెంచడంతోపాటు దిక్సూచి వ్యవస్థ, ఇంజిన్, వార్‌హెడ్ తదితరాలకు సంబంధించి అత్యాధునిక సాంకేతికతను జోడించి దీనిని అభివృద్ధి చేశారు. అన్ని వ్యవస్థలూ సరిగ్గా పనిచేస్తున్నట్లు పరీక్షలో తేలిందని ఓ అధికారి తెలిపారు. క్షిపణి కచ్చితంగా సరైన మార్గంలోనే వెళ్లేలా చేయడం కోసం రింగ్ లేజర్ గైరో ఆధారిత దిక్సూచి వ్యవస్థను, మిసైల్‌లో ప్రత్యేక కంప్యూటర్ను వినియోగించారు. చైనా ముందు దిగదుడుపే అగ్ని–5 క్షిపణి ప్రస్తుతం భారత్ వద్ద ఉన్నవాటిల్లోకెల్లా అత్యాధునికమైనదే. అయితే చైనా క్షిపణులతో పోలిస్తే దీని సామర్థ్యాలు చాలా తక్కువనే చెప్పాలి. చైనా వద్దనున్న ‘సీఎస్ఎస్–10 మోడ్ 2’ క్షిపణి పరిధి 11,200 కిలో మీటర్లు. అమెరికాలోని దాదాపు అన్ని ప్రాంతాలకు ఇది చేరుకోగలదు. డీఎఫ్–41 అనే మరో క్షిపణిని కూడా చైనా అభివృద్ధి చేస్తోంది. ఇది ఒకేసారి 10 అణు వార్హెడ్లను మోసుకెళ్లగలదు. దీని పరిధి 12 వేల నుంచి 15 వేల కిలోమీటర్ల వరకు ఉండనుందని అంచనా. డీఎఫ్–41 క్షిపణితో ప్రపంచంలోని ఏ దేశంపైనైనా దాడి చేయగల సామర్థ్యం చైనా సొంతం కానుంది. ‘అగ్ని–5’ ప్రత్యేకతలు ► ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌లో భాగంగా డీఆర్డీవో ఈ క్షిపణిని పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేసింది. ► 17 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పు, 50 ట న్నుల బరువుండే ఈ అత్యాధునిక క్షిపణి 1500 కేజీల అణు వార్హెడ్లను మోసుకెళ్లగలదు. ► ఇది సైన్యానికి అందుబాటులోకి వస్తే.. 5000–5500 కిలో మీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగల ఖండాతర క్షిపణులను కలిగి ఉన్న అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్ల సరసన భారత్ చేరుతుంది. ► అగ్ని–1, అగ్ని–2, అగ్ని–3 క్షిపణులు ఇప్పటికే భారత సైన్యంలో చేరి సేవలందిస్తున్నాయి. ► ప్రస్తుతం భారత్‌కు ఉన్న అన్ని క్షిపణిల్లోకెల్లా అత్యధిక పరిధి కలిగిన క్షిపణి ఇదే. ► తూర్పున చైనా మొత్తం, పడమరన యూరప్ మొత్తం దీని పరిధిలోకి వస్తుంది. ఆసియా, యూరప్ల్లోని అన్ని ప్రాంతాలు, ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలపై దాడులు చేయగలదు. ► మొత్తంగా 800 కిలో మీటర్ల ఎత్తు వరకు వెళ్లి అక్కడి నుంచి మళ్లీ భూమిపైకి తిరిగొచ్చి లక్ష్యాలను ఢీకొట్టగలిగే సామర్థ్యం ఉంది. -
సమష్టి పోరుతోనే ఉగ్ర నిర్మూలన
న్యూఢిల్లీ: ఉగ్రవాద నిర్మూలనకు ప్రపంచ దేశాలన్నీ కలసికట్టుగా పోరాడాలని భారత్, నెదర్లాండ్స్ పిలుపునిచ్చాయి. ఉగ్రవాదుల ప్రాబల్యం, ఆర్థిక వనరులను దెబ్బతీయడానికి, సీమాంతర ఉగ్రవాద నియంత్రణకు పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించాయి. భారత పర్యటనకు వచ్చిన నెదర్లాండ్స్ ప్రధాని మార్క్ రూట్ గురువారం ప్రధాని మోదీతో చర్చలు జరిపారు మతం, జాతి, తెగ, వర్గాలతో ఉగ్రవాదాన్ని ముడిపెట్టొద్దని ఇరువురు నేతలు ఉద్ఘాటించారు. పాక్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్ర సంస్థలు దక్షిణాసియాలో శాంతికి ముప్పుగా పరిణమించాయని ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నారు. అణు సరఫరా బృందం(ఎన్ఎస్జీ)లో భారత్ సభ్యత్వానికి నెదర్లాండ్స్ మద్దతిస్తుందని రూట్ తెలిపారు. మన బంధం మరింత బలపడాలి.. వాణిజ్యం, వ్యవసాయం, ఇంధన వనరులు తదితర రంగాల్లో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని భారత్, నెదర్లాండ్స్ నిర్ణయించాయి. ఇండియా–డచ్ సీఈవోల రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొన్నాక మోదీ, రూట్ సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు. ‘అంతర్జాతీయ సౌర కూటమిలో చేరాలని నెదర్లాండ్స్‌ను గతంలోనే ఆహ్వానించాను. గురువారం వారు అందులో సభ్య దేశంగా చేరారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను’ అని మోదీ అన్నారు. భారత్‌లో అత్యధికంగా విదేశీ పెట్టుబడులు పెడుతున్న దేశాల్లో నెదర్లాండ్స్ మూడో స్థానానికి చేరిందని వెల్లడించారు. భారత్‌లో కల్పిస్తున్న కొత్త అవకాశాల పట్ల డచ్ కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయని నరేంద్ర మోదీ అన్నారు. రూట్ మాట్లాడుతూ..వాణిజ్యం, వ్యవసాయం, స్మార్ట్ సిటీస్, ఇంధన వనరుల్లో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి మెరుగైన అవకాశాలున్నాయని అన్నారు. ద్వైపాక్షిక భేటీ తరువాత విడుదలైన ఉమ్మడి ప్రకటనలో..పెట్టుబడులు, వాణిజ్య సంబంధాల అభివృద్ధిలో ప్రైవేట్ రంగ పాత్ర కీలకంగా మారిందని మోదీ, రూట్ పేర్కొన్నారు. ‘క్లీన్ గంగా’ ప్రాజెక్టుకు రూట్ కితాబు.. పవిత్ర గంగా నది ప్రక్షాళనకు ఎన్డీయే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నమామీ గంగే పథకాన్ని రూట్ ప్రశంసించారు. నీటిని ఆర్థిక వనరుగానే పరిగణించకుండా, సామాజిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, పర్యావరణ పరంగానూ విలువ ఇవ్వాలని పేర్కొన్నారు. గంగా నది శుద్ధి కార్యక్రమంలో ఈ అంశా లన్నీ ఇమిడి ఉన్నాయని కితాబు ఇచ్చారు. కాగా, గురువారం రాత్రే రూట్ స్వదేశం బయల్దేరారు. 29 నుంచి మోదీ విదేశీ పర్యటన ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 29 నుంచి ఐదు రోజుల పాటు ఇండోనేసియా, సింగపూర్ దేశాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఇరుదేశాలతో రక్షణ, భద్రతరంగానికి సంబంధించి పలు ఒప్పందాలు చేసుకుంటారు. మే 29 నుంచి 31 వరకూ మోదీ ఇండోనేసియాలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో ఇండోనేసియాతో రక్షణరంగంలో సహకారం కోసం ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నారు. అనంతరం జూన్ 1న సింగపూర్‌కు వెళ్లనున్న మోదీ ఆ దేశ ప్రధాని లీసెయిన్ లూంగ్‌తో పలు అంశాలపై విస్తృతంగా చర్చిస్తారు. అనంతరం 28 ఆసియా–పసిఫిక్ దేశాల రక్షణ మంత్రులు, ఆర్మీ చీఫ్‌లు పాల్గొనే షాంగ్రీ లా సదస్సులో మాట్లాడతారు. ఈ సదస్సులో ప్రసంగించనున్న తొలి భారత ప్రధాని మోదీనే కావడం గమనార్హం. ‘గ్రామస్వరాజ్’ సక్సెస్ ప్రధాని మోదీ ఉద్ఘాటన న్యూఢిల్లీ: ఎన్డీయే ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల వివరాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఉద్దేశించిన ‘గ్రామస్వరాజ్ అభియాన్’ కార్యక్రమం విజయవంతమైందని.. ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా ఏప్రిల్ 14 (అంబేడ్కర్ జయంతి) మొదలుకుని మే 5 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ‘భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్‌కు నివాళులర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని రూపొందించాం’ అని ఆయన ట్వీట్ చేశారు. పేదలకోసం ఉద్దేశించిన ఏడు ముఖ్యమైన కేంద్ర ప్రభుత్వ పథకాలను వివిధ బృందాలు గ్రామాల్లో పర్యటించి ప్రజలకు వివరించాయన్నారు. ‘ఈ 21 రోజుల్లో 7.53 లక్షల మందికి ఉజ్వల కనెక్షన్లు, 5లక్షల ఇళ్లకు సౌభాగ్య పథకం ద్వారా విద్యుత్ వెలుగులం దించాం. 16,682 గ్రామాల్లో 25 లక్షల ఎల్ఈడీ బల్బులను పంపిణీ చేశాం. 1.65 లక్షల మంది∙చిన్నారులు, 42,762 మంది గర్భిణులకు మిషన్ ఇంద్ర ధనుష్‌లో భాగంగా టీకాలు వేశాం’ అని ప్రధాని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు, స్థానిక సంస్థల భాగస్వామ్యం మరువలేనిదన్నారు. అందరికీ మోదీ కృతజ్ఞతలు తెలిపారు. -
తెరుచుకోనున్న కంటోన్మెంట్ దారులు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మూసేసిన అన్ని కంటోన్మెంట్ దారులను వెంటనే తెరవాలని రక్షణ శాఖ నిర్ణయించింది. ఇటీవల మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆదివారం ఒక ప్రకటన వెలువడింది. కంటోన్మెంట్లు, అక్కడి దారుల మూసివేతపై నిర్వహించిన ఈ భేటీకి 62 కంటోన్మెంట్ల ఉపాధ్యక్షులు, ఆ ప్రాంత ఎంపీలు హాజరయ్యారు. ఇకపై ఒక్కో కంటోన్మెంట్ దారి మూసివేతను సంబంధిత చట్టంలోని నిబంధనలను అనుసరించి సమీక్షించాలని నిర్ణయించారు. స్థానికులు, సైనికుల ఫిర్యాదులు, అవసరాలను ఉమ్మడిగా పరిష్కరించేందుకు ప్రామాణిక విధానాన్ని అమల్లోకి తేవాలని కూడా నిర్ణయించారు. -
‘ఎయిర్ క్యావల్రీ’ ప్రయోగం
జైపూర్: శత్రుసైన్యంపై మరింత వ్యూహాత్మకంగా దాడి చేసేందుకు భారత ఆర్మీ ‘ఎయిర్ క్యావల్రీ’ అనే నూతన విధానాన్ని ఇటీవల పరీక్షించింది. భూమిపై ఉన్న శత్రువులను కనిపెట్టి వారిపై దాడి చేసేందుకు వియత్నాం యుద్ధం సమయంలో అమెరికా ఈ విధానాన్ని ఉపయోగించింది. భవిష్యత్తు కాలానికి అను గుణంగా రక్షణ సామర్థ్యాలను పెంచుకోవడం కోసం భారత సైన్యం ఎయిర్ క్యావల్రీ విధానాన్ని రాజస్తాన్‌లోని ఎడారి ప్రాంతంలో ఈ పరీక్ష జరిపింది. ‘విజయ్ ప్రహార్’ పేరుతో భారత సైన్యం నైరుతి విభాగం ఈ కొత్త పద్ధతిని ప్రయోగాత్మకంగా పరిశీలించిందని రక్షణ శాఖ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ మనీశ్ ఓజా చెప్పారు. ఈ విధానంలో భూమిపై ఉన్న యుద్ధ ట్యాంకులు, దళాలతో సమన్వయం చేసుకుంటూ హెలికాప్టర్లు శత్రు సైన్యం, శిబిరాలపై దాడులు చేస్తాయి. -
స్కై వేలకు రక్షణ శాఖ మోకాలడ్డు
హైదరాబాద్: నగరంలో స్కై వేల నిర్మాణానికి కేంద్ర రక్షణ శాఖ మోకాలడ్డుతోందని మున్సిపల్ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు విరుచుకుపడ్డారు. శనివారం మాదాపూర్ మైండ్ స్పేస్ అండర్ పాస్ ప్రారంభ కార్యక్రమంలో మాట్లాడారు. జూబ్లీ బస్ స్టేషన్, ప్యాట్నీ సెంటర్ల వద్ద చేపట్టబోయే రెండు స్కై వేల పట్ల రక్షణ శాఖ మూర్ఖంగా వ్యవహరిస్తోందన్నారు. రెండు స్కై వేలకు అనుమతిస్తే రక్షణ శాఖకు చెందిన 100 ఎకరాల స్థలం పోతోందని, అంతే విలువైన స్థలం కోరితే శామీర్‌పేట్ లో 600 ఎకరాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. స్థలంతో పాటు ఏటా రూ.30 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించాలని రక్షణ శాఖ లేఖ రాసి కొర్రీ పెట్టిందన్నారు. జీవిత కాలం ఎలా చెల్లిస్తారని ఆయన ప్రశ్నించారు. కంటోన్మెంట్లో ఇష్టం వచ్చినట్లు రోడ్డు మూసివేస్తే సమీప కాలనీల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సహకరించకపోయినా కనీసం రోడ్లు మూసేయవద్దన్నారు. మే 5న రక్షణ శాఖ ఎస్టేట్ అధికారులు, ఎంపీలతో సమావేశం ఉందని తెలిపారు. సామరస్య ధోరణితో పరిష్కారానికి రక్షణ శాఖ ముందుకు రావాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. క్యాలెండర్‌తో పని చేస్తున్నాం అభివృద్ధి పనులను క్యాలెండర్ ప్రకారం పూర్తి చేస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తొలినాళ్లలోనే నగరంలో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు ఎస్ఆర్డీపీలో రోడ్ల అభివృద్ధికి రూ.3,000 కోట్ల నిధులు కేటాయించారని చెప్పారు. అయ్యప్ప సొసైటీ అండర్ పాస్ జనవరిలో అందుబాటులోకి రాగా మైండ్ స్పేస్ అండర్ పాస్ రెండో ఫలమని అన్నారు. ‘జూలైలో మైండ్ స్పేస్ ఫ్లయ్‌ఓవర్, డిసెంబర్లో రాజీవ్ గాంధీ స్టాట్యూ ఫ్లయ్‌ఓవర్ అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఎల్బీనగర్ కారిడార్‌లో రూ.448 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు చివరి దశలో ఉన్నాయి. మే 1వ తేదీన చింతల్‌కుంట అండర్ పాస్, జూన్‌లో కామినేని లెప్ట్ హ్యాండ్ సైడ్ ఫ్లయ్‌ఓవర్, సెప్టెంబర్‌లో ఎల్బీ నగర్ లెప్ట్ హ్యాండ్ సైడ్ ఫ్లయ్‌ఓవర్, డిసెంబర్లో ఎల్బీ నగర్ లెప్ట్ హ్యాండ్ సైడ్ అండర్ పాస్, 2019 మార్చిలో బయోడైవర్సిటీ ఫ్లయ్‌ఓవర్, కామినేని రైట్ హ్యాండ్ సైడ్ ఫ్లయ్‌ఓవర్, బైరామల్‌గూడ లెప్ట్ హ్యాండ్ సైడ్ ఫ్లయ్‌ఓవర్, జూన్‌లో ఎల్బీనగర్ రైట్ హ్యాండ్ సైడ్ ఫ్లయ్‌ఓవర్ అందుబాటులోకి రానున్నాయి’అని కేటీఆర్ చెప్పారు. 2019కి అందుబాటులోకి.. రూ.184 కోట్లతో చేపడుతున్న కేబుల్ బ్రిడ్జి 2019 మార్చికి, రూ.150 కోట్లతో రోడ్డు నంబర్ 45 నుంచి నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్ 2019 సెప్టెంబర్‌కి, రూ.263.09 కోట్లతో చేపట్టనున్న కొత్తగూడ గ్రేడర్ సపరేటర్, రూ.387 కోట్లతో చేపట్టనున్న బాలానగర్ గ్రేడ్ సపరేటర్, రూ.132 కోట్లతో ఒవైసీ హాస్పిటల్ వద్ద బహదూర్‌పుర రోడ్డు, రూ.333.55 కోట్లతో చేపట్టనున్న షేక్ పేట్ ఎలివేటెడ్ కారిడార్ 2019 డిసెంబర్‌కు, రూ.270 కోట్లతో నిర్మిస్తున్న అంబర్పేట్ 6 నంబర్ ఫ్లయ్‌ఓవర్ 2019 డిసెంబర్‌కు అందుబాటులోకి రానున్నాయని కేటీఆర్ తెలిపారు. పర్యావరణ అనుమతులు వచ్చిన తరువాత రూ.436 కోట్లతో కేబీఆర్ పార్కు చుట్టూ ఫ్లయ్‌ఓవర్ నిర్మిస్తామని వివరించారు. నగరంలో వేగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవతోనే నగరంలో అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ పేర్కొన్నారు. శనివారం మాదాపూర్‌లోని మైండ్ స్పేస్ అండర్ పాస్‌ను ఆయన మంత్రులు కేటీఆర్, మహేందర్‌రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్‌లతో కలసి ప్రారంభించారు. నిర్ణీత సమయానికి ముందే పనులు పూర్తి చేసిన జీహెచ్ఎంసీ అధికారులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తదితరులు పాల్గొన్నారు. -
అగ్నిపుత్రి మిస్సైల్ తో మైత్రి
ఆమెను చూస్తే మనుషులు ఇంత నిగర్వంగా కూడా ఉండగలరా?అనిపిస్తుంది. ‘మిస్సైల్ ఉమన్ ఆఫ్ ఇండియా’ అంటూ అందరూఆకాశానికెత్తినా, దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నా ఆమెసాదాసీదాగానే ఉంటారు. ఇదెలా సాధ్యమని అడిగితే.. ‘నేను నా పనితో బిజీగా ఉంటాను. అంతే..’ అని చెబుతారు డాక్టర్ టెస్సీ థామస్. రక్షణ రంగంలో తొలి మహిళా సైంటిస్ట్‌గా పేరొందిన ఆమె... రాష్ట్రపతి చేతుల మీదుగా ఇటీవల ఫస్ట్‌లేడీ పురస్కారం అందుకున్నారు. ఈమె సాధించిన విజయాలు మహిళా శక్తికి నిదర్శనం.. భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకం. సాక్షి, సిటీబ్యూరో : సిటీలో ఇటీవల జీఈఎస్ సదస్సు జరిగినప్పుడు అత్యధికులు ముఖ్య అతిథి ఇవాంకా ట్రంప్ గురించి మాట్లాడుకుంటే... హాజరైన అతిరథ మహారథులు మాత్రం టెస్సీ థామస్ గురించి గొప్పగా చర్చించుకున్నారు. ఆమె ఉపన్యాసాన్ని ఆద్యంతం ఆసక్తిగా విన్నారు. ఎందుకంటే న్యూక్లియర్ ప్రాజెక్టుల్లో కీలక పాత్ర పోషించడంతో పాటు మన దేశ రక్షణ రంగానికే ప్రతిష్టాత్మకమైన ‘అగ్ని’ క్షిపణి రూపకల్పలోనూ పాలుపంచుకున్న మహిళ ఆమె మాత్రమే కాబట్టి. అంతేనా.. సంప్రదాయంగా పురుషుల ఆధిపత్యంలో కొనసాగుతున్న రంగమనే నమ్మకాన్ని పటాపంచలు చేశారు. ఎందరికో రోల్ మోడలైన ఏపీజేఅబ్దుల్ కలాం ఆధ్వర్యంలో పని చేశారు. మరి కొందరు మహిళలు కీలకమైన ఆయుధ ప్రాజెక్టుల్లో కనిపిస్తున్నారంటే ఆమె అందించిన స్ఫూర్తి ఓ కారణం. రాకెట్ వైపు.. నిలిచిన చూపు.. నిప్పులు చిమ్ముతూ ఆకాశంలోకి దూసుకుపోయే రాకెట్లను అల్లంత దూరం నుంచి చూసిన టెస్సీ... ఆ తర్వాత వాటితోనే తన జీవితాన్ని ముడివేసుకుంది. 1963లో కేరళలోని అల్లాపుఝా జిల్లాలో మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన ఆమె.. ఇంటికి దగ్గర్లోని తుంబా స్పేస్ లాంచింగ్ స్టేషన్ నుంచి దూసుకుపోయే రాకెట్లను గమనిస్తూ పెరిగారు. పుణెలోని డిఫెన్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్‌లో ఎంటెక్ పూర్తి చేసి, గైడెడ్ వెపన్ కోర్సు కోసం నగరంలోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ)కి వచ్చారు. 1988లో సైంటిస్ట్‌గా మారి ఇక్కడే స్థిరపడ్డారు. ప్రస్తుతం డీఆర్డీఓలోని అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లేబొరేటరీ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. ఎదురుదెబ్బలే తిరుగులేని విజయాలు... అగ్ని క్షిపణి ప్రయోగ సమయంలో ఆమె ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు. ఎన్నో బాలారిష్టాలు, వైఫల్యాలు వేధించాయి. అగ్ని మిస్సైల్ 2006లో తన ప్రమాణాలు అందుకోవడంలో విఫలమైంది. దీంతో ఆమె బృందం ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. ఆమె దీన్నో చాలెంజ్‌గా తీసుకొనివారాంతాలు సహా రోజుకు 16 గంటలు పని చేశారు. విజయం సాధించారు. హోమ్మేకర్గా, సైంటిస్ట్‌గా జీవితాన్ని అద్భుతంగా బ్యాలెన్స్ చేసుకోగలిగారు. మతాంతర వివాహం దగ్గర్నుంచి మిస్సైల్ రీసెర్చ్ వర్క్ వరకు అన్నింట్లోనూ తన కుటుంబం మద్దతు మరువలేనిదంటారు టెస్సీ. ఆమే స్ఫూర్తి.. జీఈఎస్ సమయంలో తొలుత టెస్సీ గురించి నీతి ఆయోగ్ ట్వీట్ చేసింది. అది చూసిన మహీంద్రా గ్రూప్ చైర్మన్ఆనంద్ మహీంద్రా ‘మీట్ టెస్సీ థామస్. జీఈఎస్ 2017 స్పీకర్.మిస్సైల్ ఉమన్ ఆఫ్ ఇండియా. దేశంలోనే మిస్సైల్ ప్రాజెక్ట్‌కు సారథ్యం వహించిన తొలి మహిళ’ అంటూ ట్వీట్లో పరిచయం చేశారు. ప్రతిపాఠశాలలో ఆమె పోస్టర్‌ను ఉంచాలని, అది ఆడిపిల్లలకు స్ఫూర్తిని ఇస్తుందని చెప్పారు. వెనుకడుగొద్దు... ‘ఇంటలిజెన్స్‌లో మహిళలు ఒకడుగు ముందే ఉంటారు. అయితే ఎమోషనల్ ఇంటలిజెన్స్ దగ్గరే వీరు ఇరుక్కుపోతారు. స్టెమ్(సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్)ను కెరీర్‌గా ఎంచుకునే మహిళలకు 3డీ (డెడికేషన్, డిసిప్లిన్, డిటర్మినేషన్) తప్పనిసరిగా ఉండాలి. సైంటిస్ట్‌గా కొనసాగాలంటే అనిశ్చిత పరిస్థితులు ఎదురైనా వెనుకడుగు వేయొద్దు. అంకితభావంతో ముందుకెళ్లాలి. ప్రపంచాన్ని ఫేస్ చేయండి.. రిస్క్ తీసుకోండి.. మీ పూర్తి సామర్థ్యాన్ని చూపండి’ అంటూ టెస్సీ జీఈఎస్ సదస్సులో సందేశమిచ్చారు. ఎన్నో అవార్డులు... ♦ డీఆర్డీఓ సైంటిస్ట్ ఆఫ్ ది ఇయర్ 2008 ♦ ఇండియా టుడే ఉమన్ ఆఫ్ ది ఇయర్ 2009 ♦ పెర్ఫార్మెన్స్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2011, 2012 ♦ లాల్‌బహదూర్ శాస్త్రి నేషనల్ అవార్డ్ 2012 ♦ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ స్పెషల్ అచీవ్మెంట్ అవార్డు(సీఎన్ఎన్ ఐబీఎన్) 2012 -
‘ధనుష్’ ప్రయోగం సక్సెస్
బాలాసోర్(ఒడిశా): అణ్వాయుధాలను మోసుకుపోగల సామర్థ్యం కలిగిన బాలిస్టిక్ క్షిపణి ధనుష్ పరీక్ష విజయవంతమైంది. ఒడిశా తీరంలోని భారత నావికా దళానికి చెందిన ఓ నౌక ద్వారా ధనుష్‌ను పరీక్షించారు. 350 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఇది విజయవంతంగా ఛేదించినట్టు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. భూ ఉపరితలం నుంచి భూ ఉపరితలంపై లక్ష్యాలను ఛేదించగల పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన పృథ్వీ క్షిపణిని నావికా దళ అవసరాల కోసం అభివృద్ధి పరిచి ధనుష్ క్షిపణిగా రూపొందించారు. ఈ క్షిపణిని శుక్రవారం ఉదయం బంగాళాఖాతంలో పారాదీప్ దగ్గర్లోని ఓ నౌక ద్వారా విజయవంతంగా ప్రయోగించినట్టు అధికారులు చెప్పారు. ధనుష్ క్షిపణి 500 కిలోల పేలుడు పదార్థాలను మోసుకుపోగలదు. భూ, సముద్ర తలంలోని లక్ష్యాలను ఛేదించగలదు. ధనుష్ ఇప్పటికే భారత రక్షణ బలగాల్లో చేరింది. -
మిలటరీ పోలీసులుగా మహిళలు
ఆమోదం తెలిపిన రక్షణశాఖ న్యూఢిల్లీ: భారత సైన్యంలోకి మరింత మంది మహిళలు చేరేందుకు వీలుగా రక్షణశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్మీలో పోలీసులుగా మహిళలను చేర్చుకోవాలన్న ప్రతిపాదనకు శుక్రవారం ఆమోదం తెలిపింది. ఏడాదికి 52 మంది చొప్పున దాదాపు 800 మంది మహిళల్ని సైన్యంలో పోలీసులుగా నియమించనున్నట్లు లెఫ్టినెంట్ జనరల్ అశ్వనీ కుమార్ మీడియాకు తెలిపారు. సైన్యంలో లింగభేదాలు తొలగించేందుకు ఈ నిర్ణయం ఎంతగానో దోహదపడుతుందన్నారు. సైన్యంలో పోలీసులుగా మహిళలు ఉండడం వల్ల లైంగిక దాడి ఆరోపణలపై విచారణను సత్వరంగా పూర్తిచేసే వీలుంది. ఆర్మీలో పోలీసులుగా చేరిన మహిళల్లో కొందరిని కశ్మీర్ లోయకు కేటాయిస్తామన్నారు. స్థానిక మహిళలను తనిఖీ చేయడం సహా పలు విధులను వీరు నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. -
వనపర్తిలో ఆర్మీ ఫైరింగ్ రేంజ్
- రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం మేరకు భూముల గుర్తింపు - ప్రభుత్వ, అటవీ భూముల్లో సర్వే చేస్తున్న అధికారులు - జిల్లాకేంద్రానికి 8 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు - క్షుణ్ణంగా పరిశీలిస్తున్న రక్షణశాఖ అధికారులు సాక్షి, వనపర్తి: ఫైరింగ్ రేంజ్‌ను వనపర్తి జిల్లాలో ఏర్పాటు చేసేందుకు రక్షణశాఖ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. పదిరోజుల క్రితం ఢిల్లీ నుంచి వచ్చిన ఓ రక్షణశాఖ అధికారి వనపర్తి జిల్లా రెవెన్యూ అధికారులతో కలసి 704 ఎకరాల స్థలాన్ని పరిశీలించారు. ఈ విషయాన్ని జిల్లా అధికారులు ఇప్పటివరకు గోప్యంగా ఉంచుతూ వస్తున్నారు. కానీ శుక్రవారం మీడియాలో కథనాలు రావడంతో విషయం కాస్తా బయటకుపొక్కింది. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో కొత్తగా కట్టాలనుకుంటున్న సచివాలయంతోపాటు రాజీవ్ రహదారి, నిజామాబాద్ జాతీయ రహదారులపై కంటోన్మెంట్ ప్రాంతంలో ప్రభుత్వం నిర్మించాలనుకుంటున్న ఎలివేటేడ్ కారిడార్ల నిర్మాణానికి రక్షణశాఖకు చెందిన స్థలం కావాలని పలుమార్లు కేంద్రాన్ని కోరిన విషయం తెలిసిందే. అక్కడ భూమిని ఇస్తే రాష్ట్రంలో రక్షణశాఖకు అనుకూలంగా ఉన్న ప్రాంతంలోని భూమిని ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇందులోభాగంగా రక్షణశాఖ సికింద్రాబాద్‌లో స్థలాన్ని ఇచ్చేందుకు ఒప్పుకున్నట్లు.. దీనికి ప్రతిగా రాష్ట్ర ప్రభుత్వం వనపర్తి జిల్లాలో స్థలాన్ని కేటాయించనున్నట్లు తెలుస్తోంది. వనపర్తి మండలంలో స్థలం పరిశీలన రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరుకు వనపర్తి జిల్లా రెవెన్యూ యంత్రాంగం ఇప్పటికే వనపర్తి మండలంలోని పెద్దగూడెం, సవాయిగూడెం, కిష్టగిరి గ్రామాల శివార్లలో భూములను గుర్తించారు. సవాయిగూడెంలోని సర్వే నంబరు 85లో 227 ఎకరాలు, సర్వే నంబరు 220లో 477 ఎకరాల ప్రభుత్వ భూములను సర్వే చేసి హద్దు రాళ్లను ఏర్పాటు చేశారు. కొన్నిచోట్ల ఎర్రరంగు జెండాలను నాటారు. ఇవి పూర్తిగా ప్రభుత్వ, అటవీ భూములే అని రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. సర్వే 220 కబ్జాలో గిరిజన కుటుంబాలు సర్వే నంబర్ 220లోని సుమారు 150 ఎకరాల భూమిలో కిష్టగిరికి చెందిన 164 గిరిజన కుటుంబాలు కొన్ని దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్నాయి. వీరిలో చాలామంది ఇప్పటికీ వ్యవసాయంపై ఆధారపడి నివసిస్తున్నవారు ఉన్నారు. 2008 గిరిజన హక్కుల చట్టం ప్రకారం సాగు చేసుకుంటున్న కుటుంబాలకు పట్టాలు ఇవ్వాలని పలుమార్లు తండావాసులు అధికారులను కోరారు. ఇటీవల వనపర్తి కలెక్టర్ శ్వేతామహంతిని కూడా కలసి పట్టాలు ఇవ్వాలని విన్నవించుకున్నారు. ఎన్నో ఏళ్లుగా ఇదే భూమిని నమ్ముకుని ఉన్నామని తమకు ఎలాంటి సమాచారం లేకుండా భూములు తీసుకోవడం దారుణమని వారు వాపోయారు. నష్టపోనున్న పలువురు రైతులు సర్వే నంబరు 220 చుట్టు సర్వే నంబరు 217, 218, 221, 223లలో కిష్టగిరికి చెందిన పలువురు గిరిజనులకు చెందిన 40 ఎకరాల పట్టా భూమి ఉంది. రైతులు పొలంలోకి వెళ్లాలంటే ఫైరింగ్ రేంజ్ స్థలాన్ని దాటి వెళ్లాల్సి ఉంటుంది. ఫైరింగ్ రేంజ్ నిర్మాణం పూర్తయ్యాక అందులోకి ఇతరులకు ప్రవేశం లేకపోవడంతో, తమ భూములను కోల్పోవాల్సి వస్తుందని చుట్టుపక్కల గ్రామాల రైతులు ఆందోళన చెందుతున్నారు. అలాగే పశువుల మేతకు కూడా ఇబ్బందులు తప్పవని వారు వాపోతున్నారు. అన్నివిధాలా అనుకూలమనే భావన రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రక్షణశాఖ ఆధ్వర్యంలో ఫైరింగ్ రేంజ్‌ను ఏర్పాటు చేస్తారని వార్తలు రాగానే అక్కడి ప్రజల నుంచి వ్యతిరేకతలు రావడంతో అధికారులు వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. కానీ ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఇది పూర్తిగా ప్రభుత్వ స్థలం అని భావించిన అధికారులు రక్షణశాఖ అధికారులకు ఈ స్థలాన్ని చూపించినట్లు సమాచారం. ఇది వనపర్తి పట్టణానికి 8 కిలోమీటర్ల దూరం, జాతీయ రహదారికి 10 కిలోమీటర్లు ఉండటం, చుట్టూ కొండలు ఉండడంతో రక్షణశాఖ అధికారులు పరిశీలించినట్లు తెలుస్తోంది. పరిశ్రమ వస్తే బాగుండు ఆర్మీ ఫైరింగ్ రేంజ్ వస్తున్న విషయం మాకు ఈ రోజే తెలిసింది. అధికారులు ప్రజల అభిప్రాయం కూడా తీసుకోలేదు. చుట్టుపక్కల గ్రామాల ప్రజ లకు ఇబ్బందులు ఎదురవుతాయి. ఫైరింగ్ రేంజ్‌కు బదులుగా ఏదైన పరిశ్రమ వస్తే కనీసం కూలీ పని అయినా దొరికేది. ఫైరింగ్ రేంజ్‌తో మాకే ప్రయోజనం ఉండదు. – సాకె చిన్నారెడ్డి, సవాయిగూడెం మేం ఒప్పుకోం సర్వే నంబర్ 220లో మా తాత ముత్తాతల నుంచి వ్యవసాయం చేసుకుంటున్నాం. చాలామంది కుటుంబాలు ఇప్పటికీ వీటిపైనే ఆధారపడి ఉన్నాయి. దీనికి చుట్టు పక్కన ఉన్న మా పొలాలకు పోవాలంటే ఫైరింగ్ రేంజ్ దాటి పోవాల్సి వస్తది. ఫైరింగ్ రేంజ్ ఏర్పాటు చేయడాన్ని మేము ఒప్పుకోం. దీనిపై ఎంతటి పోరాటానికైనా సిద్ధం. – శంకర్‌నాయక్, కిష్టగిరి ప్రజలకు ఇబ్బందులు ఉండవు వనపర్తి మండలంలో 704 ఎకరాల ప్రభుత్వ, అటవీ శాఖ స్థలాన్ని రక్షణశాఖ కోసం గుర్తించిన విషయం నిజమే. రక్షణ శాఖ అధికారులు వచ్చి స్థలాన్ని పరిశీలించి వెళ్లారు. ఇంకా ఏ నిర్ణయం వెల్లడించలేదు. దీని వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. ఈ విషయమై ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు. – చంద్రారెడ్డి, ఆర్డీవో, వనపర్తి -
పరీకర్ విధానాలే కొనసాగుతాయి: జైట్లీ
న్యూఢిల్లీ: రక్షణ మంత్రిగా తాను అదనపు బాధ్యతలు చేపట్టినప్పటికీ ఆశాఖ మంత్రిగా మనోహర్ పరీకర్ అమలు చేసిన విధానాలనే కొనసాగిస్తానని ఆర్థికమంత్రి జైట్లీ స్పష్టం చేశారు. రక్షణశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన మనోహర్ పరీకర్ గోవా ముఖ్యమంత్రిగా వెళ్తున్న నేపథ్యంలో ఆశాఖ బాధ్యతలను మంగళవారం అరుణ్‌జైట్లీ చేపట్టారు. గతంలోనూ 2014 మే నుంచి నవంబర్ వరకు జైట్లీ రక్షణ మంత్రిగా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. పరీకర్ తన విధుల్ని ఎక్కడ విడిచి పెట్టారో అక్కడి నుంచి తాను కొనసాగిస్తానన్నారు. -
నేడే మనోహర్ పరీకర్ ప్రమాణం
-
నేడే పరీకర్ ప్రమాణం
⇒ రక్షణ మంత్రి పదవికి రాజీనామా.. రాష్ట్రపతి ఆమోదం ⇒ జైట్లీకి అదనంగా రక్షణ శాఖ బాధ్యతలు పణజి, సాక్షి, న్యూఢిల్లీ: గోవా సీఎంగా మనోహర్ పరీకర్ మంగళవారం సాయంత్రం ప్రమాణస్వీకారం చేయనున్నారు. దీంతో సోమవారం ఆయన రక్షణ మంత్రి పదవికి రాజీనామా చేశారు. ప్రధాని సలహా మేరకు పరీకర్ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారని రాష్ట్రపతిభవన్ ఒక ప్రకటనలో పేర్కొంది. పరీకర్‌తో పాటు 8 లేదా 9 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. గోవాలో మెజార్టీ రాకపోయిన ఇతర చిన్న పార్టీలు, స్వతంత్రుల సాయంతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. కేబినెట్లో గోవా ఫార్వర్డ్ పార్టీ(జీఎఫ్‌పీ)కి రెండు, మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ(ఎంజీపీ)కి రెండు మంత్రి పదవులు దక్కనున్నాయి. కాంగ్రెస్ లెక్కకు గడ్కరీ చెక్... గోవాలో బీజేపీ 13 స్థానాలే సాధించినా... జీఎఫ్‌పీ, ఎంజీపీ, ఇద్దరు స్వతంత్రుల సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. అసెంబ్లీలో మొత్తం 40 మంది సభ్యులుండగా.. ప్రభుత్వ ఏర్పాటుకు 21 మంది అవసరం. కాంగ్రెస్ 17 సీట్లు గెల్చుకుని అతిపెద్ద పార్టీగా అవతరించినా మెజార్టీ సభ్యుల్ని కూడగట్టడంలో విఫలమైంది. అదే సమయంలో బీజేపీ తరఫున సీనియర్ నేత గడ్కరీ రంగంలోకి పరిస్థితిని బీజేపీకి అనుకూలంగా మార్చేశారు. పరీకరే సీఎం అభ్యర్థి అంటూ గోవా అసెంబ్లీ ఎన్నికల సమయంలో జోరుగా ప్రచారం సాగింది. జైట్లీకి రక్షణ శాఖ బాధ్యతలు పరీకర్ రాజీనామాతో రక్షణ శాఖ బాధ్యతల్ని ఆర్ధిక మంత్రి జైట్లీకి అదనంగా అప్పగించారు. ప్రధాని సలహా మేరకు రక్షణ శాఖను జైట్లీకి కేటాయించారని రాష్ట్రపతి భవన్ పేర్కొంది. రక్షణ శాఖ బాధ్యతల్ని జైట్లీ చేపట్టడం ఇది రెండోసారి. సీఎంగా పరీకర్ వెళ్తుండడంతో ... శాసనసభకు పోటీ చేసేందుకు వీలుగా మాపుసా స్థానానికి డిప్యూటీ సీఎం ఫ్రాన్సిస్ రాజీనామా చేశారు. త్వరలో కేబినెట్లో మార్పులు రెండో విడత బడ్జెట్ సమావేశాల తర్వాత కేంద్ర మంత్రివర్గంలో మార్పులు జరగవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకొని మార్పులు చేస్తారని భావిస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంల్లో ఒకరిని కేంద్ర ప్రభుత్వంలో చేర్చుకునే అవకాశాలున్నాయని, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శుల్లో ఒకరిని ఆ రాష్ట్రానికి సీఎంగా చేయవచ్చని చెబుతున్నారు. మమ్మల్ని ఆహ్వానించండి..: కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ గోవా కాంగ్రెస్ శాసనసభా పక్షం సోమవారం రాత్రి రాష్ట్ర గవర్నర్‌ను కలిసి విజ్ఞప్తి చేసింది. తమ పార్టీకి తగినంత మద్దతు ఉందని, అసెంబ్లీలో బలం నిరూపించుకుంటామని గవర్నర్‌కు సమర్పించిన విజ్ఞాపన పత్రంలో పేర్కొంది. సుప్రీంను ఆశ్రయించిన కాంగ్రెస్ మనోహర్ పరీకర్‌ను గోవా సీఎంగా నియమిస్తూ ఆ రాష్ట్ర గవర్నర్ మృదులా సిన్హా తీసుకున్న నిర్ణయాన్ని సవాలుచేస్తూ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టు తలుపు తట్టింది. సోమవారం రాత్రి సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ ఖేహర్ నివాసంలో పిటిషన్ దాఖలుచేసింది. మంగళవారం ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు ప్రధాన న్యాయమూర్తి అంగీకరించారు. హోలీ నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వారం రోజులు సెలవు కావడంతో కేసును ప్రత్యేక బెంచ్ విచారించనుంది. గోవా సీఎల్పీ నేత చంద్రకాంత్ కవ్లేకర్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. గవర్నర్ నిర్ణయాన్ని రద్దు చేయాలని పిటిషన్లో కోరారు. -
సమాజీ ఆర్మీ చీఫ్ వల్లే వివాదం
ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ సభ్యుల ఆరోపణ ముంబై: మాజీ ఆర్మీచీఫ్ వీకే సింగ్ వల్లే ‘ఆదర్శ్’ వివాదం చెలరేగిందని, నిజానికి అక్కడ స్థలవివాదం ఏమీ లేదని ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ సభ్యులు ఆరోపించారు. వారు శనివారం మీడియాతో మాట్లాడుతూ.. 31 అంతస్తుల భవనం నిర్మించిన స్థలం నిజానికి రక్షణ శాఖకు చెందినది కాదని, ఆ స్థలం రాష్ట్ర ప్రభుత్వానికి చెందినదని తెలిపారు. భవనం నిర్మాణంలో ఎటువంటి అవకతవకలు జరగలేదని వారు వివరించారు. ఈ సందర్భంగా వారు తాము సమాచార హక్కు చట్టం కింద ప్రభుత్వం పొందిన డాక్యుమెంట్లను చూపించారు. సంబంధిత స్థలం రక్షణ శాఖకు చెందినది కాదని తేలడంతో సీబీఐ తమపై పెట్టిన క్రిమినల్ కేసు వీగిపోయిందన్నారు. ఇదిలా ఉండగా, కార్గిల్ యుద్ధ వీరుల నిమిత్తం మొదట ఇక్కడ ఆరు అంతస్తుల భవనం నిర్మించాలని భావించారు. కాని తర్వాత ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండా అక్కడ 31 అంతస్తుల భవనసముదాయాన్ని నిర్మించారు. దీంతో అది వివాదంగా మారింది. కాగా మాజీ ఆర్మీచీఫ్, ప్రస్తుత కేంద్ర మంత్రి వీకే సింగ్ అప్పటి కేంద్ర రక్షణ మంత్రి ఏకే ఆంథోనీని ఈ విషయమై తప్పుదోవ పట్టించారని సొసైటీ అడ్‌హక్ చైర్మన్, రిటైర్డ్ బ్రిగేడియర్ టి.కె.సిన్హా ఆరోపించారు.