ధనా ‘ధన్‌’ | 10 percent increase weapon business in five years | Sakshi
Sakshi News home page

ధనా ‘ధన్‌’

Published Sun, Jan 6 2019 1:29 AM | Last Updated on Sun, Jan 6 2019 7:58 AM

10 percent  increase weapon business in five years - Sakshi

సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌: ఓ నిరాయుధీకరణ, శాంతియుత ప్రపంచం కోసం ఉద్యమాలు, ఒప్పందాలు జరుగుతోంటే.. మరోవైపు విధ్వంసాలకు కారణమవుతున్న ఆయుధ వ్యాపారం వేల కోట్ల రూపాయలతో పెరుగుతూనే ఉంది. ప్రపంచంలో శాంతి నెలకొనాలంటూ ప్రకటనలు, భారీ స్పీచులు ఇస్తున్న అగ్రరాజ్యాలే.. ఈ ఆయుధ వ్యాపారంలో మొదటివరసలో ఉండటం గమనార్హం. అమెరికా, రష్యాల మధ్య ప్రచ్ఛన్నయుద్ధం ముగిసిన తర్వాత ఆయుధ వ్యాపారం కాస్త మందగించింది. అయితే, అమెరికా, రష్యాలు మళ్లీ ఆధిపత్యం కోసం ప్రయత్నాలు చేస్తుండటం.. చైనా వీరికి పోటీ రావడంతో 2002 నుంచి ఈ వ్యాపారం మళ్లీ ఊపందుకుంది. దీనికితోడు సిరియా, యెమెన్‌ తదితర దేశాల్లో అంతర్యుద్ధాలు, దాయాది దేశాల మధ్య ఘర్షణలు ఈ ఆయుధ వ్యాపారానికి ఆజ్యం పోస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఏటా 10 వేల కోట్ల డాలర్ల (దాదాపు రూ.7లక్షల కోట్లు) ఆయుధ వ్యాపారం సాగుతోందని స్టాక్‌హోం ఇంటర్నేషనల్‌ పీస్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ (సిప్రీ)కి చెందిన సీనియర్‌ పరిశోధకుడు పీటర్‌ వెజెమన్‌ చెబుతున్నారు. 2008–12తో పోలిస్తే 2013–17లో భారీ ఆయుధాల అమ్మకాలు 10% పెరిగాయని రక్షణరంగ నిపుణులు అంటున్నారు.     

పశ్చిమాసియానే మొదటి కస్టమర్‌ 
అమెరికా నుంచి చాలా దేశాలు ఆయుధాలు కొనుగోలు చేస్తున్నా.. మెజారిటీ వాటామాత్రం పశ్చిమాసియా దేశాలదే. 2013–17మధ్య అమెరికా ఆయుధ ఎగుమతుల్లో దాదాపు సగం ఈ దేశాలకే జరిగాయి. ఇందుకు కారణం పశ్చిమాసియా దేశాల్లో రాజకీయ అస్థిరత, అంతర్యుద్ధాలు ఎక్కువగా జరుగుతుండటమే. ముఖ్యంగా సిరియా, యెమెన్‌లలో అంతర్యుద్ధాలు ఆయుధ వ్యాపారానికి ఆజ్యం పోశాయి. సౌదీ ఆరేబియా, ఈజిప్టు, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లు కూడా అమెరికా నుంచి ఆయుధాలు దిగుమతి జాబితాలో ముందున్నాయి. 2012–16 మధ్యలో పశ్చిమాసియా దేశాల ఆయుధ దిగుమతులు 86% పెరిగాయని, ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఆయుధ దిగుమతుల్లో ఇది 29% అని నిపుణులు చెబుతున్నారు. 

అమెరికాయే నంబర్‌ వన్‌ 
ఆయుధాల ఎగుమతిలో అమెరికాదే అగ్రస్థానం. ప్రపంచవ్యాప్తంగా జరిగే ఆయుధ విక్రయాల్లో 34% వాటా అమెరికాదేనని సిప్రీ స్పష్టం చేసింది. ఐదేళ్ల క్రితం ఇది 30%. అమెరికా నుంచి భారీమొత్తంలో ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో సౌదీ అరేబియా ముందుంది. ఆయుధాల ఎగుమతి జాబితాలో అమెరికా తర్వాత స్థానం రష్యాదే. అయితే, రష్యాతో పోలిస్తే అమెరికా 58% ఎక్కువ ఎగుమతి చేస్తోంది. 2008–12తో పోలిస్తే 2013–17 మధ్య కాలంలో అమెరికా ఆయుధ విక్రయాలు 25% పెరగగా.. రష్యా విక్రయాలు 7.1% తగ్గాయి. మొత్తం ఆయుధ ఎగుమతుల్లో 74% వాటా.. అమెరికా, రష్యా, జర్మనీ, ఫ్రాన్స్, చైనాలదేనని సిప్రీ వివరించింది. 

ఆఫ్రికాలో చిల్లర ఆయుధాలే 
అన్ని దేశాల్లో ఆయుధాల దిగుమతులు పెరుగుతోంటే ఆఫ్రికా దేశాల్లో మాత్రం తగ్గుదల కనిపిస్తోంది. ఐదేళ్లలో ఈ దేశాల ఆయుధ దిగుమతులు 22% తగ్గాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అంతమాత్రాన.. ఆఫ్రికా దేశాల్లో యుద్ధాలు జరగడం లేదని, ఆ దేశాలు ఆయుధాలను కొనడం మానేస్తున్నాయని దీనర్థం కాదు. సాధారణంగా కాంట్రాక్టు విలువల ఆధారంగా అంతర్జాతీయ స్థాయిలో ఆయుధ విక్రయాలను లెక్కిస్తారు. భారీ ఆయుధాల కొనుగోలుకే కాంట్రాక్టులు ఉంటాయి. చిన్న, తేలికపాటి ఆయుధాలు ఈ లెక్కలోకి రావు. ఉదాహరణకు ఏ దేశమైనా మూడు పెద్ద ఓడల నిండా మెషిన్‌గన్‌లను దిగుమతి చేసుకుంటే అవి అంతర్జాతీయ స్థాయి లెక్కల్లోకి రావు. ఆఫ్రికా దేశాల్లో దిగుమతులు తగ్గడానికి కారణం కూడా ఇదే. ఈ దేశాలన్నీ చిన్న చిన్న ఆయుధాలనే బాగా కొంటున్నాయని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ తెలిపింది. 

దూసుకొస్తున్న  చైనా 
అమెరికాతో వాణిజ్య, సాంకేతిక రంగాల్లోనే కాక ఆయుధ విక్రయాల్లో కూడా చైనా పోటీ పడుతోంది. చైనా తన రక్షణ బడ్జెట్‌ను పెంచుకోవడంతో పాటు ఆయుధ సరఫరాదారుగా కూడా మార్కెట్‌లోకి ప్రవేశించింది. తాజా వివరాల ప్రకారం.. ప్రస్తుతం చైనా ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆయుధ విక్రేత. అమెరికా, రష్యా, ఫ్రాన్స్, జర్మనీల తర్వాతి స్థానం చైనాదే. ఇటీవలే బ్రిటన్‌ను వెనక్కు నెట్టి డ్రాగన్‌ కంట్రీ ఐదో స్థానాన్ని సంపాదించుకుంది. 2008–12తో పోలిస్తే 2013–17 మధ్య చైనా ఆయుధ ఎగుమతులు 38% పెరిగాయి. అమెరికా తర్వాత అత్యధిక రక్షణ బడ్జెట్‌ కలిగిన దేశం కూడా చైనాయే. అత్యాధునిక ఆయుధాల తయారీలో కూడా చైనా ముందుందని ఇంటర్నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ స్ట్రాటజిక్‌ స్టడీస్‌కు చెందిన పరిశోధకురాలు మియా నౌవెన్స్‌ అన్నారు. సొంతంగా యుద్ధనౌకలను నిర్మించుకోవడమే కాకుండా పెద్ద ఎత్తున ఆయుధాలను విక్రయించడం ద్వారా బలమైన సైనిక శక్తిగా ఎదగాలని చైనా ఆకాంక్షిస్తోంది. 2013–17 మధ్య చైనా 48 దేశాలకు ఆయుధాలు విక్రయించింది. అయితే చైనా ఆయుధాల్లో ఎక్కువశాతం పాకిస్తాన్‌ ఖాతాలో చేరాయి. అమెరికా, రష్యా, జర్మనీ, ఫ్రాన్స్‌ దేశాలు ఆయుధాలు విక్రయించని.. ఇరాన్, వెనెజులా, సుడాన్, జింబాబ్వే వంటి దేశాలకు కూడా చైనా ఆయుధాలు విక్రయిస్తోంది. చైనా దూకుడుతో పోటీ పడేందుకు భారత్‌కూడా తన రక్షణ బడ్జెట్‌ను నెమ్మదిగా పెంచుతోంది. 2008–12తో పోలిస్తే 2013–17లో భారత్‌ రక్షణ దిగుమతులు 24% పెరిగాయి. 

యుద్ధ విమానాలకు గిరాకీ 
ఆయుధాల తయారీ, ఎగుమతుల్లో తాజా ట్రెండ్‌ యుద్ధ విమానాలదే. 2027 కల్లా యుద్ధ విమానాల మార్కెట్‌ 24,900 కోట్ల డాలర్లకు (రూ.16.6 లక్షల కోట్లు) చేరుతుందని, 3,243 యుద్ధ విమానాలు తయారవుతాయని ఫోర్‌కాస్ట్‌ ఇంటర్నేషనల్‌ అనే సంస్థ ‘ద మార్కెట్‌ ఫర్‌ ఫైటర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌’పేరుతో విడుదల చేసిన అధ్యయన నివేదికలో పేర్కొంది. ఈ పదేళ్లలో తయారైన యుద్ధ విమానాలకంటే 13.1% ఎక్కువ విమానాలు వచ్చే పదేళ్లలో తయారవుతాయని పేర్కొంది. వచ్చే పదేళ్లలో ఏటా సగటున 280 విమానాలు తయారవుతాయని వెల్లడించింది. ఇందులో 1,466 విమానాలు లాక్‌హీడ్‌ మార్టిన్‌ తయారు చేసే ఎఫ్‌–35 విమానాలేనని తెలిపింది. ఈ నివేదిక ప్రకారం వచ్చే పదేళ్లలో అమెరికా ఎక్కువగా ఎఫ్‌–35 యుద్ధవిమానాలను కొంటుంది. భవిష్యత్తులో లాక్‌హీడ్‌ మార్టిన్‌ తయారు చేసే ఎఫ్‌–35 విమానాలను చాలా దేశాలు కొనే అవకాశం ఉంది. ఈ మార్కెట్‌లో 45% లాక్‌హీడ్‌ సొంతం చేసుకోనుంది. బోయింగ్‌ ఎఫ్‌–16, ఎఫ్‌/ఏ–18ఈ సూపర్‌ హార్నెట్, లాక్‌హీడ్‌ ఎఫ్‌–16 యుద్ధ విమానాలకు కూడా మళ్లీ డిమాండు పెరుగుతోంది. పశ్చిమాసియా దేశాల నుంచి యుద్ధ విమానాలకు ఎక్కువ డిమాండు ఉండబోతోంది. ఆ మేరకు బోయింగ్, లాక్‌హీడ్, డస్సాల్ట్, యూరోఫైటర్‌ కన్సార్టియంలు ఉత్పత్తిని పెంచుకోవలసి ఉంటుందని ఫోర్‌కాస్ట్‌ సంస్థ నిపుణుడు డగ్లాస్‌ రాయస్‌ చెప్పారు. వచ్చే పదేళ్లలో యూరోఫైటర్‌ టైఫూన్‌లు 95, డసాల్ట్‌ రఫేల్‌ విమానాలు 158 బయటకు వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు. భారత ప్రభుత్వం కుదుర్చుకున్న రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో అక్రమాలేమీ లేవని సుప్రీంకోర్టు స్పష్టం చేసినా కూడా దానిపై రాజకీయ రచ్చ కొనసాగుతూనే ఉంది. పార్లమెంటులో అధికార, విపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నాయి.  

ఆమ్నెస్టీ ఆందోళన 
ఆయుధ వ్యాపారం మానవహక్కులను కాలరాస్తోందని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ ఆరోపిస్తోంది. యుద్ధాలను, తిరుగుబాట్లను అణచివేసేందుకు వినియోగిస్తున్న ఆయుధాలు అమాయక పౌరులను బలితీసుకుంటున్నాయని.. ఆమ్నెస్టీ ఆయుధ వ్యాపార నిపుణుడు అలివర్‌ ఫీలే ఆవేదన వ్యక్తం చేశారు. ఆయుధ వ్యాపారం ఎంతగా పెరిగితే మానవాళికి ముప్పు అంతగా పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. యెమెన్‌ యుద్ధంతో స్వీడన్, జర్మనీ, నెదర్లాండ్స్, నార్వే వంటి దేశాలు పశ్చిమాసియాలో ఆయుధాల విక్రయంపై ఆంక్షలు విధించాయని అలివర్‌ తెలిపారు. ఆయుధ వ్యాపారానికి వ్యతిరేకంగా ‘క్యాంపెయిన్‌ అగెనెస్ట్‌ ద ఆర్మ్స్‌ ట్రేడ్‌ (సీఏఏటీ) పేరుతో ఉద్యమం కూడా నడుస్తోంది. సౌదీకి బ్రిటన్‌ ఆయుధాలు విక్రయించడం సీఏటీటీకి విరుద్ధమంటూ.. ఈ సంస్థ బ్రిటన్‌ న్యాయస్థానంలో కేసు వేసింది. అయితే, బ్రిటన్‌ ఆయుధ విక్రయాలు చట్టబద్ధమేనని గత జూలైలో ఆ కోర్టు తీర్పునిచ్చింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement