టెహరాన్: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది. హమాస్ నేత ఇస్మాయిల్ హనియా మీద తామే దాడిచేసి అంతమొందించినట్లు ఇజ్రాయెల్ అధికారికంగా ప్రకటించడంతో ఇరాన్ ఘాటుగా స్పందించింది. హనియాను చంపడం హేయమైన ఉగ్రవాద చర్యగా ఇరాన్ వ్యాఖ్యానించింది.
తాజాగా హమాస్ నేత ఇస్మాయిల్ హనియాను తాము అంతమొందించినట్టు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ తెలిపారు. హూతీలపై కూడా ఇదే విధంగా దాడి చేస్తామని హెచ్చరించారు. ఇటీవలి కాలంలో హూతీ ఉగ్రవాదులు- ఇజ్రాయెల్‌పై భారీగా క్షిపణులు ప్రయోగిస్తున్నారు. వారికి ఇదే మా హెచ్చరిక. ఇప్పటికే హమాస్, హెజ్‌బొల్లాలను ఓడించాం. ఇరాన్ రక్షణ, ఉత్పత్తి వ్యవస్థలను నాశనం చేశాం. సిరియాలో బషర్ అల్ అసద్ పాలనను పడగొట్టాం. హనియా, సిన్వర్, నస్రల్లాలను హతమార్చాం. ఇక హూతీలను తుదముట్టిస్తాం అని కామెంట్స్ చేశారు.
దీంతో, కాట్జ్ వ్యాఖ్యలపై ఇరాన్ స్పందించింది. ఈ క్రమంలో ఐక్యరాజ్యసమితిలోని ఇరాన్ అంబాసిడర్ అమీర్ సయీద్ ఇరవాని మాట్లాడుతూ.. హనియాను ఇజ్రాయెల్ చంపడం హేయమైన ఉగ్రవాద చర్య కిందికి వస్తుంది. ఇజ్రాయెల్ ఉగ్ర పాలన ప్రాంతీయ, అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పుగా మారుతోందని తీవ్ర విమర్శలు చేశారు. ఇదే సమయంలో ఇజ్రాయెల్‌పై ప్రతీకార దాడులు చేయడంలో తప్పు ఏమీ లేదని కామెంట్స్ చేశారు.
ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్ వ్యాఖ్యలపై తాజాగా సిరియా కూడా స్పందించింది. ఈ సందర్బంగా తమ దేశంలో గందరగోళం సృష్టించవద్దని సిరియా నూతన విదేశాంగశాఖ మంత్రి అసద్ హసన్ అల్-షిబానీ.. ఇరాన్‌ను హెచ్చరించారు. ఇదే సమయంలో సిరియా ప్రజల ఆకాంక్షను గౌరవించాలి అంటూ ట్విట్టర్ వేదికగా తెలిపారు.
ఇక, గాజాలో కాల్పుల విరమణ కోసం హమాస్ చర్చల ప్రయత్నాలకు హనీయే నాయకత్వం వహించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ ఏడాది జూలై 31న టెహ్రాన్‌లోని గెస్ట్‌హౌస్‌లో హనీయేను ఇజ్రాయెల్ దళాలు హతమార్చాయి. అలాగే, సెప్టెంబరు 27న, ఇజ్రాయెల్ హెజ్‌బొల్లా చీఫ్ హసన్ నస్రల్లాను బీరూట్ బాంబు దాడిలో హతమార్చింది. దీని తర్వాత అక్టోబరు 16న గాజాలో హనీయే వారసుడు యాహ్యా సిన్వార్ హత్య జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment