
డెమాస్కస్: సిరియాలో మరోసారి ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ ఘర్షణల్లో భాగంగా 17 మంది మృతిచెందారు. మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ ప్రభుత్వంలో అకృత్యాలకు పాల్పడిన ఓ అధికారిని అరెస్టు చేసే సమయంలో ఈ ఘర్షణ వెలుగు చూసింది.
వివరాల ప్రకారం.. సిరియాలోని టార్టస్ ప్రావిన్స్‌లో మరోసారి ఘర్షణలు చోటుచేసుకున్నాయి. మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ ప్రభుత్వంలో అకృత్యాలకు పాల్పడిన ఓ అధికారిని అరెస్టు చేసేందుకు బలగాలు ప్రయత్నించే క్రమంలో ఘర్షణ జరిగింది. ఈ సందర్భంగా ఘర్షణలో 17 మంది చనిపోయారని అక్కడి మీడియా తెలిపింది. ఇదే సమయంలో సిరియా కొత్త అధికారుల జనరల్ సెక్యూరిటీ ఫోర్స్‌లో 14 మంది చనిపోయారని సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ పేర్కొంది.
ఇదిలా ఉండగా.. ఇటీవల సిరియాలో తిరుగుబాటుదారుల కారణంగా మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ దేశం విడిచి పారిపోయిన విషయం తెలసిందే. అనంతరం, రష్యా ఆయనకు ఆశ్రయం కల్పించింది. మరోవైపు.. సిరియాలో తాత్కాలికంగా కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఈ నేపథ్యంలో అసద్ హయాంలో పలు నేరాలకు పాల్పడిన అధికారులను టార్గెట్ చేస్తున్నారు.