సిరియాలో మళ్లీ మారణహోమం.. 1000 మంది మృతి | 1000 Dead In Syria Over Assad Loyalists Clash With Forces | Sakshi
Sakshi News home page

సిరియాలో మళ్లీ మారణహోమం.. 1000 మంది మృతి

Published Sun, Mar 9 2025 7:42 AM | Last Updated on Sun, Mar 9 2025 9:17 AM

1000 Dead In Syria Over Assad Loyalists Clash With Forces

బీరుట్‌: సిరియా అట్టుడుకుతోంది. మాజీ అధ్యక్షుడు అసద్ మద్దతుదారులు, ప్రభుత్వ భద్రతా దళాల మధ్య జరిగిన ఘర్షణల కారణంగా దాదాపు 1000 మంది మరణించారు. వీరిలో 750 మంది పౌరులు ఉన్నట్టు స్థానిక మీడియా సంస్థలు చెబుతున్నాయి.

గత రెండు రోజులుగా సిరియాలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ అధ్యక్షుడు బషర్‌ అల్‌-అసద్ మద్దతుదారులు, ప్రభుత్వ భద్రతా దళాల మధ్య జరిగిన ఘర్షణ చోటుచేసుకుంది. ఇరు వర్గాల మధ్య ప్రతీకార దాడుల్లో భారీగా ప్రాణ నష్టం జరిగింది. అసద్ మద్దతుదారులు జాబ్లే నగరంలో భద్రతా సిబ్బందిని హత్య చేయడం కారణంగా ఈ ఘర్షణలు మొదలయ్యాయి. శుక్రవారం నుంచి ప్రభుత్వ దళాలు భారీ స్థాయిలో అసద్ తెగకు చెందిన అలావైట్లు అధికంగా ఉండే ప్రాంతాల్లో ప్రతీకార దాడులకు దిగాయి. అలవైట్‌లను ఊచకోత కోశారని స్థానికులు తెలిపారు.

దీంతో, సిరియా మరోసారి అతలాకుతలమైంది. దాడుల నేపథ్యంలో మృతదేహాలు వీధుల్లో చెల్లాచెదురుగా పడి ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. బ్రిటన్‌కు చెందిన సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ ప్రకారం ప్రభుత్వ భద్రతా బలగాలకు చెందిన 125 మందితో పాటు అసద్‌కు మద్దతుగా పోరాడిన 148 మంది ప్రాణాలు కోల్పోయారు. తీరప్రాంత నగరం లటాకియా చుట్టుపక్కల ప్రాంతాలలో విద్యుత్ , తాగునీటిని నిలిపివేశారని, బేకరీలను మూసివేశారని అబ్జర్వేటరీ పేర్కొంది.

ఇదిలాఉండగా.. 14 ఏళ్ల సిరియా సంక్షోభంలో ఇది భయంకరమైన మారణకాండ అని యుద్ధ నియంత్రణ సంస్థ ఒకటి తెలిపింది. అసద్‌ను పదవి నుంచి దించేసి తిరుగుబాటుదారులు అధికారాన్ని చేజిక్కించుకున్న మూడు నెలల తర్వాత డమాస్కస్‌లో ఏర్పడిన ఘర్షణలు నూతన ప్రభుత్వానికి సవాల్‌గా మారాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement