Bashar Al-Assad
-
సిరియాలో మరో విష దాడి!
బీరుట్: అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న సిరియాలో మరో విష రసాయన దాడి జరిగింది. తిరుగుబాటుదారుల అధీనంలో ఉన్న డౌమా పట్టణంపై జరిగిన ఈ దాడిలో 42 మందికి పైగా ప్రజలు మృత్యువాతపడ్డారు. వందలాది పౌరులు శ్వాస, కంటిచూపు సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చనిపోయినవారిలోనూ, శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బందికి గురైన వారిలోనూ చిన్నారులే అధికంగా ఉన్నారు. పలు భవనాల్లో మృతదేహాలు కుప్పలుగా పడి ఉన్న హృదయ విదారక దృశ్యాలు కనిపించాయి. తిరుగుబాటుదారులు లక్ష్యంగా సిరియా ప్రభుత్వమే ఈ దారుణానికి పాల్పడిందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ దాడిని అమెరికా అధ్యక్షుడు ట్రంప్, పోప్ ఫ్రాన్సిస్, పలు దేశాల అధినేతలు తీవ్రంగా ఖండించారు. అయితే, ఈ ఆరోపణలను సిరియా, ఆ దేశానికి మద్దతుగా నిలుస్తున్న రష్యా ఖండించాయి. ఈ ఘటనపై తక్షణమే విచారణ జరపాలనీ, విషవాయువు ప్రయోగం జరిగినట్లు తేలితే సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అస్సద్ క్రూరత్వానికి ఇది మరో ఆధారంగా నిలుస్తుందని బ్రిటన్ విదేశాంగ శాఖ పేర్కొంది. 42 మంది వారివారి ఇళ్లలో చనిపోయి ఉండటాన్ని గుర్తించామనీ, వీరంతా ఊపిరి తీసుకోవడం కష్టమవ్వడం వల్లనే మరణించినట్లు తెలుస్తోందని, మృతుల సంఖ్య ఇంకా ఎక్కువ ఉండొచ్చనీ సహాయక సిబ్బంది చెప్పారు. చిన్నారులు, మహిళలు సహా అనేక మంది శవాలు ఇళ్లలో ఎక్కడ పడితే అక్కడ ఉండటాన్ని చూపుతూ పలు వీడియోలు విడుదలయ్యాయి. మృతుల నోళ్లు, ముక్కుల నుంచి తెల్లని నురగ బయటకు రావడం వీడియోల్లో కనిపించింది. అవి నకిలీ వీడియోలు: సిరియా రసాయనిక దాడి జరిగిందనడాన్ని సిరియా అధికారిక మీడియా ఖండించింది. తిరుగుబాటుదారులే అంతర్జాతీయంగా మద్దతు పొందటం కోసం నకిలీ వీడియోలను విడుదల చేశారని పేర్కొంది. రష్యా విదేశాంగ, రక్షణ మంత్రిత్వ శాఖలు కూడా రసాయనిక దాడి అబద్ధమని పేర్కొన్నాయి. ప్రస్తుతం డౌమా పట్టణాన్ని సిరియా భద్రతా దళాలు చుట్టుముట్టాయి. ప్రస్తుతం తూర్పు గౌటా ప్రాంతంలో తిరుగుబాటుదారుల చేతిలో ఉన్న ఏకైక పట్టణం డౌమా మాత్రమే. శనివారం మధ్యాహ్నం వైమానిక దాడి జరిగిన తర్వాత తమకు కళ్లు మండుతున్నాయనీ, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందిగా ఉందం టూ 15 మంది వైద్యశాలలకు వచ్చారు. ఆ తర్వాత శనివారం రాత్రి ఓ ప్రభుత్వ హెలికాప్టర్ వచ్చి గుర్తు తెలియని రసాయనాన్ని వెదజల్లిందనీ, దీని వల్ల ఇంకా అనేకమంది ప్రజలు విషవాయువు బారిన పడ్డారని సహాయక సిబ్బంది వివరించారు. నిరంతరాయంగా జరుగుతున్న దాడుల వల్ల మృతదేహాలను వెతకడం కష్టంగా ఉందనీ, మరణించిన వారి సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండొచ్చని వారు అంటున్నారు. విషపూరిత క్లోరిన్ వాయువుతో ప్రభుత్వ దళాలు దాడిచేసినట్లు ‘వైట్ హెల్మెట్స్’ అనే స్వచ్ఛంద సంస్థ ఆరోపించింది. 40 నుంచి 70 మంది విషవాయువు కారణంగా మరణించి ఉంటారని తెలిపింది. శుక్రవారం సాయంత్రం నుంచి సిరియా జరిపిన వైమానిక దాడులతో కలిపి మృతుల సంఖ్య 80కి పైగానే ఉంటుందంది. అసద్ ఓ జంతువు: ట్రంప్ సిరియా అధ్యక్షుడు అసద్ ఓ జంతువనీ, ఆయన చర్యను మతిలేనిదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శించారు. ఇరాన్, రష్యాల మద్దతుతోనే సిరియా రెచ్చిపోతోందన్నారు. ‘డౌమాను సిరియా సైన్యం చుట్టుముట్టి ఇతరులను అక్కడకు వెళ్లనివ్వడం లేదు. అసద్‌కు మద్దతునిస్తున్న రష్యా, ఇరాన్‌లే ఇందుకు బాధ్యులు. భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది’ అని ట్రంప్ ట్వీటర్లో పేర్కొన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా సైనిక చర్య చేపట్టి ఉంటే నేడు అసద్ అనే వ్యక్తి ఉండేవాడే కాదన్నారు. -
సిరియాలో ఆగని నరమేధం; మళ్లీ బాంబుల వర్షం
-
సిరియాలో ఆగని నరమేధం
డమస్కస్ : కల్లోల సిరియాలో నరమేధం ఇంకా ఆగలేదు. అంతర్జాతీయ సమాజం అభ్యర్థను పక్కనపెడుతూ, ఐక్యరాజ్యసమితి ఆదేశాలను బేఖాతరుచేస్తూ సిరియా సైన్యం మరోసారి వైమానిక దాడులు జరిపింది. తూర్పుగౌటాలోని నివాస సముదాయాలపై శుక్ర, శనివారాల్లో బాంబుల వర్షం కురిపించింది. తాజా దాడుల్లో 25 మందికిపైగా పౌరులు చనిపోయారు. ప్రస్తుతం తూర్పు గౌటాలో సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్న పలు ఏజెన్సీలు ఈ విషయాన్ని వెల్లడించాయి. కాల్పుల విరమణకు విరుద్ధంగా : ఫిబ్రవరి చివరివారంలో ఐక్యరాజ్యసమితి భద్రతామండలి.. ‘తూర్పుగౌటాపై దాడులను తక్షణమే నిలిపేయాలి’ అని ఏకగ్రీవ తీర్మానం చేసింసింది. నెల రోజుల కాల్పులు జరపరాదంటూ సిరియా-రష్యాలను ఆదేశించింది. ఆ నిర్ణయం తర్వాత పలు స్వచ్ఛంద సంస్థలు రంగంలోకి దిగాయి. మూడు నెలలుగా సరైన ఆహారం, వైద్యసేవలు లేక అలమటిస్తోన్న గౌటా వాసులను ఆదుకునే ప్రయత్నం చేశాయి. ఇంతలోనే కాల్పుల విమరణ ఒప్పందానికి విరుద్ధంగా అసద్ సైన్యాలు మళ్లీ జనావాసాలపై దాడులకు తెగబడ్డాయి. సేవ్ సిరియా : రాజధాని డమస్కస్‌కు తూర్పుభాగంలో ఉండే గౌటా నగరంపై గడిచిన మూడు నెలలు భీకర దాడులు జరిగాయి. ఫిబ్రవరి 19 తర్వాత సిరియా సైన్యం-రష్యన్ వైమానిక దళాలు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో 200 చిన్నారులు, 150 మంది మహిళలు సహా మొత్తం 700 మంది వరకు చనిపోయారు. మరో 1500 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాంబు దాడుల్లో 25కుపైగా ఆస్పత్రి భవనాలు కుప్పకూలడంతో వైద్యం చేయించుకునే దిక్కులేక జనం అల్లాడిపోయారు. సిరియన్ బాలల ఆర్తనాదాలకు చలించిన మిగతా ప్రపంచం ‘సేవ్ సిరియా’ అంటూ గట్టిగా నినదించింది. ఈ నేపథ్యంలోనే సిరియా సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకోవడం తెలిసిందే. -
సిరియాలో బాంబుల వర్షం : 200 మంది హతం
-
సిరియాలో మళ్లీ నరమేధం
బీరుట్ : గత కొన్నేళ్లుగా తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న తూర్పు గౌటా ప్రాంతంపై సిరియన్ ఆర్మీ ఆది, సోమవారాల్లో బాంబుల వర్షం కురిపించడంతో ఏకంగా రెండు వందల మంది పౌరులు మృత్యువాతపడ్డారు. వీరిలో 57 మందికిపైగా చిన్నారులు ఉన్నారు. 300 మందికి గాయాలయ్యాయి. సిరియాలోని ఓ మానవ హక్కుల పరిశీలన సంస్థ ఈ మేరకు వివరాలను వెల్లడించింది. కేవలం సోమవారం నాటి దాడుల్లోనే 127 మంది ప్రాణాలు కోల్పోయారని వెల్లడించింది. భారీ సంఖ్యలో క్షతగాత్రులకు సరిపడా పడకలు లేకపోవడంతో బాధితులకు చికిత్స చేయడం కష్టసాధ్యంగా మారుతోందని డాక్టర్లు తెలిపారు. డమాస్కస్ శివార్లలో 2015 తర్వాత జరిగిన అతి పెద్ద దాడులు ఇవేనని మానవ హక్కుల పరిశీలన సంస్థ చీఫ్ రమి అబ్దెల్ రెహమాన్ తెలిపారు. గౌటాలో ప్రస్తుతం పరిస్థితి అదుపు తప్పిందని చెప్పారు. దాదాపు నాలుగు లక్షల జనాభా కలిగిన ఈ ప్రాంతంలో మరోసారి భారీ దాడికి అవకాశం ఉందని అల్–వతన్ పత్రిక తెలిపింది. తూర్పు గౌటా ప్రాంతం 2012 నుంచి రెండు ఉగ్రవాదసంస్థల ఆధీనంలోనే ఉంది. డమాస్కస్ శివారు ప్రాంతమైన ఈ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు సిరియా అధ్యక్షుడు బషర్ అల్–అసద్ సైన్యాన్ని పంపించారు. దీంతో పలు పట్టణాలపై సైన్యం విమానాలతో దాడులు చేపట్టింది. ఈ నెల మొదట్లో కూడా ప్రభుత్వ బలగాలు తిరుగుబాటు దారులపై ఐదు రోజుల పాటు చేపట్టిన దాడుల్లో 250 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయాలపాలయ్యారు. ఈ ఘటనపై ఐక్యరాజ్య సమితి స్పందిస్తూ పౌరుల హత్యలను తక్షణం ఆపేయాలని సిరియా ప్రభుత్వాన్ని కోరింది. -
అసద్కే మా మద్దతు
టెహ్రాన్: పారిస్ ఉగ్రదాడి అనంతరం అగ్రరాజ్యాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు, పేద రాజ్యాలనే తేడా లేకుండా ప్రపంచమంతా ఒక్కటై ఐఎస్ఐఎస్తో పోరాడాలని నిర్ణయించుకున్నాయి. అవసరమైతే ఉగ్ర సంబంధాలు గల దేశాలతో అనుబంధాలు తెంచుకుంటామని ప్రతినబూనాయి. అయితే సోమవారం ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమీనెల్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ల మధ్య జరిగిన సమావేశం గత తీర్మానాలను ప్రశ్నార్థకంగా మార్చింది. అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న సిరియాలో శాంతి స్థాపన జరిగేలా ఎన్నికలు నిర్వహించాలన్న అంతర్జాతీయ సంస్థల నిర్ణయాన్ని ఆయతుల్లా కొట్టిపారేశారు. సదరు వ్యవహారమంతటినీ ఇస్లామిక్ దేశాలకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రగా అభివర్ణించారు. శాంతి ముసుగులో అమెరికా తన సైన్యాన్ని సిరియాలోకి దించాలని ప్రయత్నిస్తున్నదని, తద్వారా ఇక్కడి భూభాగానికి పరోక్ష పాలకుడు కావాలనుకుంటున్నదని ఆరోపించారు. అమెరికా కుట్రలపై అన్నిదేశాలు అప్రమత్తంగా ఉండాలన్న ఇరాన్ సుప్రీం.. ప్రధానంగా ఇరాన్, రష్యాలకు ఆ అవసరం మరింత ఉందని పేర్కొన్నారు. పుతిన్ తో జరిగిన సమావేశంలో ఆయతుల్లా ఇలా మాట్లాడారని, రష్యా అధ్యక్షుడు కూడా ఇరాన్ సుప్రీం అభిప్రాయంతో ఏకీభవించారని స్థానిక మీడియా వార్తా కథనాలను ప్రసారం చేసింది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఇరాన్ లో పర్యటిస్తున్న పుతిన్.. ఆయతుల్లా రెండు గంటలు ఏకాంత చర్చలు జరిపారు. ప్రస్తుత సిరియా అధ్యక్షుడు బషీర్ అల్ అసద్‌కు తమ మద్దతు కొనసాగించాలని నిర్ణయించిన ఇరాన్, రష్యాలు.. మధ్యప్రాశ్చంలో పాశ్చాత్యుల పెత్తనాన్ని అంగీకరించేదిలేదని తేల్చిచెప్పాయి. దీంతో సిరియాలో ఎన్నికల వ్యవహారం మళ్లీ మొదటికొచ్చినట్లయింది. గత జులైలో రష్యా- ఇరాన్ ల మధ్య కుదిరిన అణుఒప్పందాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని ఇరుదేశాలు నిర్ణయించాయి. అంతేకాక మిస్సైళ్లను ధ్వంసం చేయగల అత్యాధునిక ఎస్- 300 రాకెట్లను ఇరాన్ కు సరఫరా చేసేందుకు రష్యా అంగీకరించింది. ఈ మేరకు రాకెట్ల ఎగుమతి ప్రక్రియను ప్రారంభించినట్లు మాస్కోలోని అధికారవర్గాలు పేర్కొన్నాయి. సిరియాలో ప్రభుత్వ వ్యతిరేక దళాలకు మద్దతు తెలుపుతున్న అమెరికా.. ఆ మేరకు భారీ ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రి సరఫరా చేస్తున్న సంగతి తెలిసిందే. అలా అమెరికా నుంచి దిగుమతైన ఆయుధ సంపత్తిలో చాలావరకు ఐఎస్ఐఎస్ చేతిలోకీ వెళుతుండటం గమనార్హం. సున్నీ తెగకు చెందిన అసద్‌ను ఎలాగైనా సరే గద్దె దించాలని షియా వర్గీయులు తిరుగుబావుటా ఎగరేయటం, ఐఎస్ఐఎస్ కూడా షియాల నాయకత్వంలో నడుస్తుండటంతో ఈ రెండు పక్షాల మధ్య లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకున్నాయని ప్రచారం జరుగుతోంది. కాగా, ఏకైక అధికారిక సున్నీ దేశంగా కొనసాగుతున్న ఇరాన్.. తన వర్గానికే చెందిన అసద్‌కు మద్దతుగా సైన్యాన్ని రంగంలోకి దింపింది. ఇటీవలే రష్యా కూడా అసద్‌కు మద్దతుపలికి తిరుగుబాటు దళాలపై వైమానిక దాడులు జరుపుతోంది. -
రసాయన ఆయుధాల నాశనానికి ఏడాది పడుతుంది: బషర్ అల్-అసద్
సిరియా అధ్యక్షుడు అసద్ వెల్లడి డమాస్కస్: సిరియాలో రసాయన ఆయుధాలను నాశనం చేయడానికి కనీసం ఏడాది సమయం పడుతుందని ఆ దేశ అధ్యక్షుడు బషర్ అల్-అసద్ స్పష్టంచేశారు. సిరియా ఉగ్రవాద బాధిత దేశంగా మారిందని, విదేశాల మద్దతుతోనే అల్‌కాయిదా చొరబాటు శక్తులు అల్లకల్లోలం సృష్టిస్తున్నాయని చెప్పారు. 80కిపైగా దేశాలకు చెందిన అల్‌కాయిదా గెరిల్లాలు ఇందులో పాలుపంచుకుంటున్నాయని ఆరోపించారు. అంతేతప్ప ఇక్కడ జరుగుతున్నది అంతర్యుద్ధం కానేకాదని చెప్పారు. అమెరికా వార్తా చానల్ ‘ఫాక్స్ న్యూస్’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈవిషయాలు వెల్లడించారు. రసాయన ఆయుధాలను నాశనం చేయడమనేది ఆషామాషీ వ్యవహారం కాదని, సాంకేతికంగా ఇదో పెద్ద సంక్లిష్ట ప్రక్రియ అని అసద్ పేర్కొన్నారు. దీనికి కనీసం 100 కోట్ల డాలర్లు వెచ్చించాల్సి ఉంటుందన్నారు. -
తాత్కాలిక శాంతి!
సంపాదకీయం: ప్రయత్నించాలే గానీ ఏదీ అసాధ్యం కాదు. ‘చేరి మూర్ఖుని మనసు రంజింప రాద’ని భర్తృహరి హితబోధ చేసినా, ఆశ ఉంటుంది గనుక మానవ ప్రయత్నం ఎప్పుడూ ఆగిపోదు. సిరియాపై యుద్ధానికి దిగడం ఆ దేశ ప్రజలకుగానీ, అమెరికాకుగానీ ఉపయోగపడదని ప్రపంచ దేశాలన్నీ చేసిన హెచ్చరికలు అగ్రరాజ్యంలో విజ్ఞత కలిగించినట్టున్నాయి. రష్యా చొరవ ఫలించి యుద్ధానికి తాత్కాలికంగా బ్రేకుపడింది. సిరియాలో ఉన్నాయంటున్న రసాయన ఆయుధాల నిల్వలను నియంత్రణలోకి తీసుకుని ధ్వంసంచేస్తానని రష్యా ఇచ్చిన హామీకి అంగీకరిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు ఒబామా ప్రకటించారు. సంక్షోభం అంచుల్లో ఉన్న ప్రపంచ ఆర్ధిక వ్యవస్థకు ఈ పరిణామంతో కాస్తంత ఊరట లభించింది. గత రెండున్నరేళ్లుగా సిరియా అంతర్యుద్ధంతో అట్టుడుకుతోంది. పట్టణాలూ, పల్లెలూ రణక్షేత్రాలుగా మారాయి. ప్రభుత్వ దళాలు, తిరుగుబాటు దళాలు పరస్పరం కలహించుకుంటూ ఊళ్లన్నిటినీ వల్లకాళ్లుగా మారుస్తున్నారు. సిరియా వర్తమాన స్థితికి అధ్యక్షుడు బషర్ అల్ అసద్ బాధ్యత ఎంత ఉన్నదో పాశ్చాత్య దేశాల బాధ్యతా అంతే ఉంది. అరబ్ ప్రపంచాన్ని కుదిపేసిన ప్రజాస్వామ్య ఉద్యమం సెగ మిగిలిన దేశాల్లాగే సిరియానూ తాకినా అది త్వరలోనే చేయి దాటిపోవడానికి పూర్తి బాధ్యత పశ్చిమ దేశాలదే. సిరియాలో లభ్యమయ్యే నాణ్యమైన చమురుపై కన్నేసిన పాశ్చాత్య ప్రపంచం ఈ సాకుగా ఆ దేశానికి పొరుగునున్న టర్కీ, ఖతార్, సౌదీ అరేబియాలద్వారా తిరుగుబాటుదారులను సాయుధం చేసింది. అందులో అల్- కాయిదా అనుకూల వర్గాలు కూడా చేరాయని తెలిసినా తన చేష్టలను మానలేదు. గత నెల 21న సిరియా రాజధాని డమాస్కస్‌లో జరిగిన రసాయన ఆయుధ ప్రయోగం తర్వాత వందలమంది మరణించడంతో ఎప్పటినుంచో సిరియాపై కాలుదువ్వుతున్న అమెరికాకు సాకు దొరికింది. ఒకపక్క ఆ దాడికి బాధ్యులెవరో, ఏ తరహా రసాయనాన్ని ప్రయోగించారో తేల్చడానికి ఐక్యరాజ్యసమితి బృందం ప్రయత్నిస్తుంటే ఇదే అదునుగా యుద్ధ ప్రకటన చేయడానికి అమెరికా తహతహ లాడిపోయింది. అసద్ వద్ద వెయ్యి టన్నుల రసాయన ఆయుధాలు పోగుపడి ఉన్నాయని, అవన్నీ దేశంలోని 50 పట్టణాల్లో నేలమాళిగల్లో ఉంచారని ప్రకటించింది. ఇందులో నిజమెంతో, కానిదెంతో తేల్చాల్సింది అంతర్జాతీయంగా అందరూ అంగీకరించిన సంస్థలే తప్ప అమెరికా కాదు. అయినా, అలాంటి సంస్థలతో తనకు సంబంధం లేదన్నట్టు ప్రవర్తించింది. ఈ యుద్ధంలో పాలు పంచుకునేందుకు బ్రిటన్ పార్లమెంటు అంగీకరించకపోవడం, ఫ్రాన్స్ పార్లమెంటు సైతం అదే తోవలో వెళ్లవచ్చన్న అభిప్రాయం వ్యక్తం కావడంతో అమెరికా ముందుకు కదల్లేకపోయింది. రష్యాలో ఈమధ్యే ముగిసిన జీ-20 దేశాల సమావేశం కూడా ఆచి తూచి అడుగేయమని అమెరికాకు నచ్చజెప్పింది. వీటన్నిటి వెనకా ఉన్నది ఒకే కారణం... ఆర్ధికంగా ఉన్న గడ్డు పరిస్థితులు. ఇరాక్‌పై సాగించిన దురాక్రమణ యుద్ధం పర్యవసానంగా పుట్టి విస్తరించిన ఆర్ధిక మాంద్యం దెబ్బకు కుదేలైన ప్రపంచ దేశాలు మరో సంక్షోభానికి సిద్ధంగా లేవు. ఎవరిదాకానో అవసరం లేదు... అమెరికా ప్రజలే సిరియాపై యుద్ధసన్నాహాలు చూసి వణికారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్టు కనబడుతున్న ఆర్ధిక వ్యవస్థ మళ్లీ చితికి పోతుందేమోనని భయపడ్డారు. రోజులు గడుస్తున్నకొద్దీ అమెరికన్ కాంగ్రెస్‌లో యుద్ధ ప్రతిపాదనకు చిక్కులు ఏర్పడవచ్చన్న సందేహం ఒబామాకు కలిగింది. తన మేకపోతు గాంభీర్యానికి భంగం కలగకుండా ఈ సమస్యనుంచి బయట పడటం ఎలాగా అని ఆయన ఆలోచిస్తున్నవేళ రష్యా చొరవ తీసుకుని జరిపిన దౌత్యం ఆయనకు అందివచ్చింది. ఇప్పుడు అమెరికా బెదిరించిందని కాదు... మా మిత్ర దేశం ఒప్పించింది గనుక రసాయన ఆయుధాలను అప్పగించేందుకు అంగీకరించామని అధ్యక్షుడు అసద్ చెబుతున్నారు. ఆ ఆయుధాలను నాశనం చేయించే పూచీనాదని రష్యా హామీపడింది. యుద్ధానికి దిగుతామని బెదిరించి ఎవరినీ లొంగదీయలేరని, అంతర్జాతీయంగా అందరూ ఆమోదించిన రాజకీయ, దౌత్య మార్గాల్లో పరిష్కారం వెదకాలని రష్యా అంటున్నది. రష్యాకు సిరియాపై ఇంత ప్రేమ ఉండటానికి కారణాలున్నాయి. మధ్యధరా సముద్రంలో రష్యాకున్న ఏకైక నావికాదళ స్థావరం సిరియాలోనే ఉంది. పైగా, రష్యానుంచి భారీయెత్తున ఆయుధాలు కొంటూ అందుకు ప్రతిగా నాణ్యమైన ముడి చమురు సరఫరా చేస్తున్న దేశం సిరియా. ప్రపంచ ఆర్ధికవ్యవస్థకు చమురే ప్రాణంగా మారిన వర్త మాన స్థితిలో అలాంటి ప్రయోజనాలను వదులుకోవడానికి రష్యా సిద్ధంగా లేదు. అసలు సిరియాలో ఉన్న రసాయన ఆయుధాలపై ఇంతగా బెంగటిల్లుతున్న అమెరికా ఆ పొరుగున ఇజ్రాయెల్ వద్దనున్న అదే బాపతు ఆయుధాల గురించి ఒక్క మాట మాట్లాడదు. 1993లో అంతర్జాతీయ రసాయన ఆయుధాల ఒప్పందంపై సంతకం చేసినా దాన్ని పార్లమెంటు ముందుకు తెచ్చి ఆమోదం పొందని దేశం ఇజ్రాయెల్. ఇంకా చెప్పాలంటే అమెరికా, రష్యాలవద్ద సైతం రసాయన ఆయుధాల గుట్టలున్నాయి. వాటిని ధ్వంసం చేయడానికి గడువు మీద గడువు కోరుతూ కాలక్షేపం చేసిన ఆ రెండు దేశాలూ తుది గడువు 2012ను కూడా దాటబెట్టేశాయి. నిజానికి అమెరికా తదితర దేశాలవద్దనున్న సంప్రదాయిక ఆయుధాలు ఈ రసాయన ఆయుధాలకంటే అత్యంత ప్రమాదకరమైనవి. వాటన్నిటినీ ధ్వంసించకుండా సిరియా వల్లే ప్రపంచానికి ఏదో పెను ముప్పు సంభవించబోతున్నదన్న అభిప్రాయం కలిగించడానికి ప్రయత్నించడం నయ వంచన. ఇప్పటికైతే, యుద్ధ భయం తాత్కాలికంగా తొలగిందిగానీ, ఈ నయ వంచన బట్టబయలై, అందరికీ సమానంగా వర్తించే నియమనిబంధనలు రూపొందినప్పుడే ప్రపంచం సురక్షితంగా ఉండగలుగుతుంది. అంతవరకూ ఏ ఒప్పందాలైనా తీసుకొచ్చేది తాత్కాలిక శాంతిని మాత్రమే. -
సిరియాలో ‘సత్యం వధ’!
యుద్ధంలో మొట్టమొదట హతమయ్యేది నిజమేనని పదేపదే రుజువవుతూనే ఉంది. గత కొద్ది రోజులుగా సిరియాపై కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలలో నిజం నిత్య మరణాన్ని చనిచూస్తోంది. గత నెల 21 అర్థరాత్రి సిరియా రాజధానిలో జరిగిన రసాయనిక ఆయుధ ప్రయోగం అధ్యక్షుడు బషర్ అల్ అసద్ సేనల పనేనని అనడానికి ఉన్న తిరుగులేని ‘ఇంటెలిజెన్స్ ఆధారాలను’ సోమవారం కాంగ్రెస్ సభ్యుల కోసం ఏర్పాటు చేసిన రహస్య సమావేశంలో బరాక్ ఒబామా ప్రభుత్వం ప్రదర్శించింది. ఆ ఆధారాలు ‘యూట్యూబ్’ ఆధారిత నిఘా సమాచారం కావడం విశేషం. ఆ ఆధారాలకు ఆధారం ఇజ్రాయెల్ రక్షణ బల గాల 8,200వ యూనిట్ అందించిన సమాచారమేనని ‘ఫాక్స్ న్యూస్’ సైతం చెబుతోంది. అసత్య ప్రచారం ఎవరైనా చేయగలరు, అసత్యాలను తిరుగులేని ‘సత్యాలు’గా చలామణి చేసే విద్యలో ఇజ్రాయెల్ అమెరికా కంటే రెండాకులు ఎక్కువే చదివింది. సిరియాపై యుద్ధం కోసం రెండేళ్లుగా అమెరికా చెవిని ఇల్లు కట్టుకొని పోరుతున్న ఇజ్రాయెల్ చేతికే అలాంటి ‘సమాచారం’ లభించడంలో ఆశ్చర్యం లేదు. సోమవారం నాటి సమావేశానికి హాజ రైన కాంగ్రెస్ సభ్యులు ‘ఆధారాల’ విశ్వసనీయతపైగాక, యుద్ధంలోని చిక్కులను గురించే చర్చించారు, విభేధించారు, చివరికి డెమోక్రాట్లు, రిపబ్లికన్లన్న తేడా లేకుండా అంతా ఒక్కటయ్యారు. దీంతో సిరియాపై సైనిక చర్యకు సెనేట్ మంగళవారం పచ్చజెండా చూపింది. వియత్నాం నుంచి ఇరాక్, అఫ్ఘాన్ యుద్ధాల వరకు పార్టీలకతీతకంగా కాంగ్రెస్ ప్రభుత్వ ‘ఆధారాలను’ పరమ సత్యాలుగా న మ్ముతూనే ఉంది, ఆమోదముద్ర వేస్తూనే ఉంది. కాకపోతే ప్రస్తుతం కాంగ్రెస్‌పై ప్రజల్లో ఉన్న విశ్వాసం రికార్డు స్థాయిలో 25 శాతం కంటే తక్కువగా ఉంది. పైగా అసద్ రసాయనిక ఆయుధ ప్రయోగం నిజమే అయినా సైనిక జోక్యం వద్దని అత్యధిక ప్రజలు ఘోషిస్తున్నారు. అలాంటి ‘అల్పమైన’ విషయాలకు ప్రపంచంలోని అతి గొప్ప ప్రజాస్వామ్యంలో ఎలాంటి ప్రాధాన్యం లేదు. ఈ తిరుగులేని ఆధారాల కట్టుకథను ‘అసోసియేటెడ్ ప్రెస్’ కరెస్పాండెంట్ డాల్ గల్వాక్ గత నెల చివర్లో బట్టబయలు చేశారు: ‘సౌదీ గూఢచారి సంస్థ అధిపతి ప్రిన్స్ బందర్ బిన్ సుల్తాన్ ద్వారా కొందరు తిరుగుబాటుదార్లకు రసాయనిక ఆయుధాలు అందాయి. వారే డమాస్కస్ రసాయనిక ఆయుధ ప్రయోగానికి పాల్పడ్డారు’. కాబట్టి అమెరికాకు ఇజ్రాయెల్ ద్వారా అందిన ‘ఆధారాలు’ మేడ్ ఇన్ సౌదీ అరేబియా అసత్యాలు! తిరుగుబాటుదార్ల నుంచే అందిన విశ్వసనీయ సమాచారంగా గల్వాక్ తెలిపిన ఆ కథనాన్ని ధృవపరిచే ఇతర ఆధారాలు కూడా ఉన్నాయి. రసాయనిక ఆయుధ ప్రయోగం తిరుగుబాటుదార్ల పనేనని గౌటా ప్రాంత వాసులు బహిరంగంగానే చెబుతున్నట్టు గల్వాక్తో పాటూ ఇతర పాత్రికేయులు కూడా వెల్లడించారు. ఇటు అసద్ సేనల చేతిలోనూ అటూ తిరుగుబాటదార్ల చేతుల్లోనూ కూడా హతమవుతున్న సిరియన్ కుర్దులు సైతం అదే మాట అంటున్నారు. ‘ఇది అసద్‌ను ఇరికించడానికి తిరుగుబాటుదార్లు చేసిన పనే. ఐక్యరాజ్య సమితి నిపుణులు అతడే బాధ్యుడని గుర్తిస్తారనడంలో సందేహం లేదు’ అని కుర్దిష్ డెమోక్రటిక్ యూనియన్ (పీవైడీ) అధినేత సలే ముస్లిం ఆగస్టు 27నే స్పష్టం చేశారు. ఇరాక్ యుద్ధంలో జార్జి డబ్ల్యూ బుష్ అబద్ధానికి భిన్నంగా అధ్యక్షుడు బరాక్ ఒబామా ‘నిజమైన అబద్ధాన్ని’ సృష్టించారు. ‘మానవతావాద యుద్ధం’ రసాయనిక ఆయుధ ప్రయోగానికి కనీసం 2,500 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్నమాట నిజమే. అయితే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత రసాయనిక ఆయుధాల తయారీకి నాంది పలికి, ప్రయోగించడంలో అగ్రగామిగా నిలిచిన ఘనత అమెరికాదే. 1947లోనే నాటి అధ్యక్షుడు హెన్రీ ట్రూమెన్ రసాయనిక, జీవ ఆయుధాల నిషేధంపై జెనీవా ఒప్పందానికి మోకాలడ్డారు. 1950 కొరియా యుద్ధంలో అమెరికా జీవ ఆయుధ ప్రయోగంతో శాన్ఫ్రాన్సిస్కో వ్యాధి కారక బాక్టీరియాను ప్రయోగించింది. అది మొదలు పదే పదే అది రసాయనిక, జీవ ఆయుధాల ప్రయోగానికి పాల్పడుతూనే వచ్చింది. వియత్నాం యుద్ధంలో అది నిషిద్ధ నాఫాం బాంబులతో మూడు లక్షల మందిని బలిగొనడమేగాక, రసాయనిక ఆయుధాలతో 60 లక్షల మందికి తిండిపెట్టే పచ్చని పొలాలను ఎడారిగా మార్చింది. ఎట్టకేలకు 1974లో జెనీవా ఒప్పందంపై సంతకాలు చేసినా భారీగా వాటిని నిల్వచేసి, రహస్యంగా మిత్రులకు అందిస్తూ వచ్చింది. 1984లో ఇరాక్-ఇరాన్ యుద్ధంలో సద్దాం హుస్సేన్ రసాయనిక ఆయుధాలతో లక్షమంది ఇరానీయులను హతమార్చాడు. ఆ యుద్ధంలో అమెరికా సద్దాం కొమ్ముకాసింది! సద్దాం 1988లో కుర్దు తిరుగుబాటుదార్లపై రసాయనిక ఆయుధ ప్రయోగానికి పాల్పడి 5,000 మందిని హతమార్చాడు. 1991లో సీనియర్ బుష్ సద్దాంపై ‘దుష్ట నియంత’ ముద్ర వేసేవరకు అమెరికా పాలకులకు ఎన్నడూ రసాయనిక ఆయుధ ప్రయోగం అభ్యంతరం కాలేదు. సిరియా వద్ద ఉన్నాయో లేవో కూడా ఇదమిత్థంగా తెలియని రసాయనిక ఆయుధాల పట్ల ఒబామా ఆందోళనకు కూడా ఆ ‘మానవతావాదమే’ కారణం. సిరియాలోకి సైన్యాన్ని దించకుండానే అసద్ రసాయనిక ఆయుధాల గుట్టను నిర్వీర్యం చేస్తామని అమెరికా అంటున్నది. అసద్ వద్ద ఉన్నాయంటున్న 1,000 టన్నుల రసాయనిక ఆయుధాలు 50 పట్టణాలలో, భూగర్భ బంకర్లలో ఉన్నాయని ‘సమాచారం’. వాటిపై బాంబుల వర్షం కురిపిస్తే శారీన్, మస్టర్డ్ గ్యాస్‌లు వాతావరణంలోకి విడుదలై కలిగే జననష్టం ఎంత భారీగా ఉంటుందో ఊహించుకోవచ్చు. రసాయనిక ఆయుధాలను నిర్వీర్యం చేయగలవని చెబుతున్న ‘ఏజెంట్ డిఫీట్ ఆయుధాలు’ సృష్టించే ఉష్ణోగ్రతలు 1,200 డిగ్రీల నుంచి 1,500 డి గ్రీల సెంటిగ్రేడ్ వరకు ఉంటాయి. అంతటి తీవ్రమైన ఉష్ణోగ్రతలకు కూడా రసాయనిక ఆయుధాలు పూర్తిగా నిర్వీర్యం అవుతాయన్న హామీ లేదు. కానీ ఆ వేడికి సమీప ప్రాంతాలన్నీ సకల వస్తు, జీవరాశితో సహా బుగ్గికావడం మాత్రం ఖాయం. సిరియా రసాయనిక ఆయుధ ప్రయోగం ఎర్ర గీతను దాటినందుకే ఈ యుద్ధం అంటున్న ఒబామా వాదన తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడ మేత కోసం అన్నట్టుగా లేదూ? ‘ప్రజాస్వామ్య’ దురాక్రమణ డమాస్కస్ రసాయనిక ‘చేతబడి’తో సిరియా యుద్ధానికి నాంది పలికిన ఒబామా తనకు తానే కాంగ్రెస్ అనుమతి ప్రహసనానికి తెరలేపి పరిశీలకులను విస్మయంలో ముంచారు. 1983లో అధ్యక్షునికి దఖలుపడ్డ విశేష అధికారాలతోనే ఆయనకు ముందటి అధ్యక్షుడు జార్జి డబ్ల్యూ బుష్ కాంగ్రెస్ అనుమతి కోరకుండానే 2003లో ఇరాక్‌పై దురాక్రమణకు దిగారు. అలాగే ఒబామా కూడా కాంగ్రెస్ ఔన న్నా, కాదన్నా సైనిక చర్యకు దిగవచ్చు. ఆ విషయాన్ని విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ సోమవారం స్పష్టం చేశారు. సిరియాపై సైనిక చర్యకు ఆమోదం తెలిపిన సెనేట్... సైనిక చర్య 60 రోజులకు మించరాదని, అమెరికా బలగాలను సిరియా భూభాగంపై యుద్ధంలోకి దించరాదని ఆంక్షలను విధించింది. ఆ ఆంక్షలను లెక్కచేయాల్సిన అవసరం కూడా అధ్యక్షునికి లేదు. అది కూడా కెర్రీయే మంగళవారం తెలిపారు. అవసరమైతే సిరియాలోకి సైన్యాన్ని దించే అవకాశం ఉన్నదని స్పష్టం చేశారు. అమెరికా బాటలోనే కదన కుతూహలంతో ఉన్న బ్రిటన్, ఫ్రాన్స్‌లు కూడా పార్లమెంటు ఆమోదాన్ని కోరాయి. బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ పార్లమెంటు ఆమోదం పొందడంలో విఫలమై భంగపడ్డారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హాలెండె ఇంకా పార్లమెంటు ముందుకు వెళ్లలేదు. కనీసం నెలరోజుల ముందే యుద్ధానికి సిద్ధమైన ‘ముగ్గురు మిత్రులు’ కోరి తాత్సారం చేసి ‘ప్రజాస్వామ్య’ గండాన్ని ఎందుకు కొనితెచ్చుకున్నట్టు? సమాధానం ‘బందర్ బుష్’ చెప్పాల్సిందే. పుతిన్ మెడపై ‘బందర్ బుష్’ కత్తి సిరియా యుద్ధంలో కీలక పాత్రధారిగా మారిన బందర్ బిన్ సుల్తాన్ ‘బందర్ బుష్’గానే సుప్రసిద్ధులు. ఇరాక్, అఫ్ఘాన్ యుద్ధాల ‘హీరో’ జూనియర్ బుష్ తండ్రి సీని యర్ బుష్ కాలం నుంచి ఆయన అమెరికా దురాక్రమణ యుద్ధాలన్నిటిలోనూ కీలక పాత్రధారి. గతనెల మొదటివారంలో బందర్ రష్యాకు వెళ్లి అధ్యక్షుడు వ్లదిమిర్ పుతి న్‌తో సుదీర్ఘ రహస్య సమాలోచ నలు సాగించారు. ఆ సమావేశ వివరాలు ఇప్పుడు రచ్చకెక్కాయి. ‘‘ఇజ్రాయెల్ నుంచి సైప్రస్ వరకు ఉన్న మధ్యధరా సముద్ర ప్రాంతంలోని చమురు, వాయు నిక్షేపాల విషయంలో రష్యా ప్రయోజనాలు మాకు బాగా తెలుసు. అలాగే యూరప్‌కు రష్యా గ్యాస్ పైపులైను ప్రాధాన్యం కూడా తెలుసు. ఆ విషయంలో మీతో పోటీ పడే ఆసక్తి మాకు లేదు. ఆ ప్రాం తంలో మనం సహకారం నెలకొల్పుకోవచ్చు’’ అంటూ బందర్ బుష్ పుతిన్‌కు స్పష్టం చేశారు. సౌదీతో సహకారానికి సిద్ధమైతే చమురు ధరలు, ఉత్పత్తుల పరిమాణంపై కలిసి గుత్తాధిపత్యం నెరపవచ్చని ఊరించారు. చమురు ఎగుమతి దేశాల ఒపెక్కూ, రష్యా నేతృత్వంలోని గ్యాస్ ఎగుమతి దేశాల వేదికకూ (జీయీసీఎఫ్) మధ్యన ఈ ఒప్పందం కోసం పుతిన్ సిరియాను త్యాగం చేయాల్సి ఉంటుంది. అందుకు సిద్ధపడకపోతే... వచ్చే ఏడాది రష్యాలో జరగనున్న చలికాలపు ఒలింపిక్స్‌పై చెచెన్ ఉగ్రవాద దాడులు తప్పవని బందర్ స్పష్టం చేశారు. చెచెన్ ఉగ్రవాదులతో సౌదీకి ఉన్న అనుబంధాన్ని బందర్ గుర్తుచేశారు. బందర్ బ్లాక్మెయిల్ దౌత్యం ఫలితాల కోసం అమెరికా ఎదురుచూస్తోంది. గురు, శుక్రవారాల్లో రష్యాలో జరగనున్న జీ-20 దేశాల శిఖరాగ్ర సదస్సు సందర్భంగా పుతిన్, ఒబామాల మధ్య నేరుగా చర్చలు జరగను న్నాయి. అప్పుడే పుతిన్ తన నిర్ణయాన్ని వెల్లడిస్తారని భావిస్తున్నారు. అయితే ఈ కీలక సమయంలో చైనా మౌనం అటు పుతిన్‌కు ఇటు ఒబామాకు కూడా అంతు పట్టడం లేదు. బందర్ దౌత్యం విఫలమైనా యుద్ధం తప్పకపోవచ్చు. సఫలమైతే మాత్రం సౌదీ, రష్యాలు ఇవ్వనున్న చమురు షాక్‌కు ప్రపంచం సిధ్ధంగా ఉండాల్సి వస్తుంది. అసద్ ‘పరిమిత యుద్ధం’తో కుప్ప కూలవచ్చు. ఏదిఏమైనా ఈ సంక్షోభానికి మూలం చమురు నిక్షేపాల వేటేననడంలో సందేహంలేదు. ఆమాట నేటి అమెరికా రక్షణమంత్రి చుక్ హ్యాగెల్ 2007లోనే చెప్పారు: ‘మనం చేసే యుద్ధాలు చమురు కోసం కావని అంటుంటారు. కానీ అదే నిజం.’ -
సిరియా మంత్రివర్గంలో మార్పుచేర్పులు
రసాయన ఆయుధాలు ఉపయోగించి వేలాదిమంది ప్రాణాలు తీశారంటూ సిరియాలోని బషర్ ప్రభుత్వంపై విపక్షాల కార్యకర్తలు ఆరోపణలు చేసిన ఒకరోజు తర్వాత, అధ్యక్షుడు బషర్ అల్ అసద్ తన మంత్రివర్గాన్ని స్వల్పంగా పునర్వ్యవస్థీకరించారు. ప్రధానంగా సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న అంతర్గత ఘర్షణలు, ఆర్థిక ఆంక్షల నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం కావడంతో ప్రధానంగా ఆర్థిక సంబంధిత మంత్రులపైనే దృష్టిపెట్టారు. స్థానిక వాణిజ్య శాఖకు గతంలో మంత్రిగా పనిచేసిన ఖాద్రీ జమీల్‌ను ఆర్థిక వ్యవహారాల ఉప ప్రధానమంత్రిగా నియమించారు. ఆయన స్థానంలో స్థానిక వాణిజ్య శాఖ మంత్రిగా సమీర్ ఇజ్జత్‌ను నియమించారు. ఖుద్ర్ ఆర్ఫాలీ వాణిజ్యశాఖ మంత్రిగాను, కమల్ అదీన్ తౌమ్ పరిశ్రమల శాఖ మంత్రిగాను పదవులు చేపట్టారు. పర్యాటక శాఖ మంత్రిగా బిష్ర్ యజాజీ, ఉన్నత విద్యాశాఖ మంత్రిగా మాలెక్ అల్ అలీ బాధ్యతలు చేపట్టారు. సిరియాలో అంతర్యుద్ధం ఫలితంగా రసాయన దాడులు జరిగి, దానిలో దాదాపు 1300 మంది మరణించిన విషయం తెలిసిందే. వీరిలో ఎక్కువ మంది పిల్లలు కూడా ఉన్నారు. దీనిపై యూనిసెఫ్ సైతం ఆందోళన వ్యక్తం చేసింది. -
సిరియాకు ఐరాస ‘అగ్నిపరీక్ష’!
తనతో కలిసిరాని ప్రతి దేశం మీద సమితిని అడ్డం పెట్టుకుని అగ్రరాజ్యాలు ‘తనిఖీ’ అస్త్రాలు ప్రయోగించే సంప్రదాయాన్ని నెలకొల్పుతున్న సూచనలు స్పష్టంగానే కనిపిస్తున్నాయి. మరోసారి అగ్ర రాజ్యాలు ‘రసాయనిక ఆయుధాల వినియోగం’ క్రీడకు శ్రీకారం చుట్టాయి. ఇప్పుడు ఈ ఆరోపణ ఎదుర్కొం టున్న దేశం సిరియా. పశ్చిమాసియాలోని ఈ సంక్షుభిత రాజ్యం ప్రస్తుతం అంతర్యుద్ధంతో సతమతవుతోంది. సైన్యం మద్దతుతో పోరాడుతున్న కుర్దిష్ సాయుధ బృందాలకీ; అల్ కాయిదా అండదండలు ఉన్న తిరుగుబాటుదారులకీ మధ్య సిరియా నైరుతి భాగంలో సంకుల సమరమే జరుగుతోంది. అంతర్యుద్ధం అణచివేత పేరుతో దేశాధ్యక్షుడు బషర్ అల్ అసాద్ మూడుచోట్ల రసాయనిక ఆయుధాలు ప్రయోగించాడని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ ఆరోపిస్తున్నాయి. దీనితో నిజానిజా లు తేల్చడానికి ఐక్యరాజ్యసమితి నియమిం చిన ఇరవై మంది సభ్యుల తనిఖీ బృందం ఈ నెల 18న సిరియా రాజధాని డమాస్కస్ చేరుకుంది. సమితి పంపిన తనిఖీ బృందానికి సిరియా పూర్తిగా సహకరిస్తుందని విదేశ వ్యవహారాల మంత్రి ఫైయాసల్ మెక్దాద్ ముందే చెప్పారు. అలెప్పో అనే పట్టణం ఇప్పుడు ఈ వివాదానికి కేంద్ర బిందువు. సిరియా అంతర్యుద్ధం కరవు కాటకాల నుంచి పుట్టిందనిపిస్తుంది. అలెప్పోకు సమీపంగా ఉన్న దారా అనే గ్రామంలో మొదలైన ప్రభుత్వ వ్యతిరేకత రెండున్నరేళ్లలో అంతర్యుద్ధం రూపం తీసుకుంది. ఆ దుర్భిక్షం సమయంలో ఆ గ్రామంలోని పాఠశాల విద్యార్థు లు గోడల మీద ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు రాశారు. దీనితో ప్రభుత్వం చాలా కఠినంగా స్పందించింది. ఆ విద్యార్థులను అరెస్టు చేసి దారుణమైన హింసకు గురిచేసింది. ఇది 21వ శతాబ్దంలోనే రక్తపంకిల ఘటనగా పేరు మోసింది. నిజానికి పిల్లలు రాసిన నినాదాలు సత్యదూరాలు కావు. 2001 నుంచి ఆ ప్రాంతమంతా కరవు తాండవిస్తున్నది. 2009లో ఐక్య రాజ్యసమితి, ఇతర అంతర్జాతీయ సంస్థలు కలిసి చేసిన అధ్యయనం ప్రకారం ఎనిమిది లక్షల మంది రైతులు పొలాలకు దూరమయ్యారు. తనిఖీ బృందం పరిధి పెద్దది కాదు. కేవ లం మూడుచోట్ల తనిఖీతో దాని బాధ్యత పూర్తయిపోతుంది. ఇందులో ఈ సంవత్సరం మార్చి 19న ఖాన్ అల్ అస్సాల్ దగ్గర జరిగిన దాడి ఒకటి. అయితే ఆ దాడి ‘ఇస్లామిస్ట్’ తిరుగబాటుదారులదే తప్ప తమది కాదని అధ్యక్షుడు అసాద్ ఆరోపిస్తున్నారు. మిగిలిన తని ఖీలు ఎక్కడ జరుగుతాయో మాత్రం రహస్యంగా ఉంచారు. సిరియా ప్రభుత్వం అలెప్పో దగ్గర రెండు పర్యాయాలు నాడీ మండల వ్యవస్థను దెబ్బతీసే సారిన్ అనే రసాయనాన్ని ఉపయోగించిందని మొన్న జూన్‌లో అమెరికా ఆరోపించింది. అలెప్పో దగ్గరలోనే ఉన్న షేక్ మక్సూద్ దగ్గర ఏప్రిల్ 13న, కుసార్ అబూ సమారా అనే చోట మే నెల 14న రసాయనిక ఆయుధాల ప్రయోగం జరిగిందని అగ్రరాజ్యం ఆరోపణ. మే నెల 23న అద్రా పట్ణణం దగ్గర కూడా ఇలాంటి దాడి జరిగిందని అమెరికా రాయబారి సమితికి రాసిన లేఖలో పేర్కొన్నారు. అలెప్పో, హామ్స్, డెమాస్కస్లలో ఈదాడులు జరిగాయని మార్చి 25న ఫ్రాన్స్, బ్రిటన్లుసమితి ప్రధాన కార్యదర్శి బాన్‌కి మూన్‌కు ఫిర్యాదు చేశాయి. వాటి ఫలితమే సిరియాకు రసాయనిక ఆయుధాల తనిఖీ బృందం రాక. ఆ ఆయుధాలు ప్రయోగించిన ప్రదేశాల నుంచి తీసుకున్న మట్టి నమూనాలు, ప్రజల నుంచి తీసుకున్న ఇంటర్వ్యూల పరిశీలన ఇప్పటికే పూర్తయినాయి. ప్రస్తుతం అంతర్యుద్ధానికి కేంద్ర బిందువుగా ఉన్న నైరుతి ప్రాంతం చమురు వనరులు విస్తృతంగా ఉన్నదే. 2011 నుంచి జరుగుతున్న ఈ పోరులో ఇంతవరకు లక్షకు పైగా జనం మరణించారు. ఈ ఘర్షణ ఇప్పటితో ఆగేది కాదన్న భయాందోళనలు కూడా ప్రజ లలో బలపడినట్టు కనిపిస్తున్నాయి. కొద్దికాలంగా దేశం విడిచి ఇరాక్‌కు ఉత్తరంగా ఉన్న ఐక్యరాజ్యసమితి శిబిరాలకు వెళ్లిన వారి సం ఖ్య పందొమ్మిది లక్షలు. ఈ కొద్దిరోజులలోనే 30 వేల మంది సిరియన్లు, ముఖ్యంగా కుర్దిష్‌లు వె ళ్లిపోయారు. దేశంలో పోరాడుతున్న తిరుగుబాటుదారులకు కొన్ని విదేశశక్తులు ఆయుధాలు సరఫరా చేస్తున్నాయని, ఇది ఇకపై సాగదని సిరియా ప్రధాని నూరి అల్ మాలిక్ హెచ్చరించడం గమనించవచ్చు. చిత్రంగా, సిరియా ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి కారణంగానే తిరుగుబాటు శక్తులను ఆదుకోవాలన్న ఆలోచన అమెరికాకు వచ్చిం దని జూన్‌లో ఒబామా ప్రకటించడం ఈ ఉదంతం మొత్తానికి కొసమెరుపు. అఫ్ఘానిస్థా న్లో పాకిస్థాన్‌లో అల్ కాయిదాతో పోరాడుతున్న అమెరికా, సిరియాలో అల్‌కాయిదా మద్దతుదారులకు సాయం చేయడానికి నిర్ణయించిందన్నమాట. ఒక పక్క యుద్ధం జరుగుతూ ఉండగానే అకె సెల్‌స్ట్రామ్ (స్వీడన్ రసాయనిక ఆయుధాల నిపుణుడు)నాయకత్వంలోని సమితి తనిఖీ బృందం తన పని సాగించవలసి ఉంది. ఇదికూడా చిత్రంగానే అనిపిస్తుంది. గతంలో ఇరాక్ వ్యవహారంలో తనిఖీ బందానికి ఎదురైన ప్రతిఘటన, ఎదురుదాడి సిరియా నుంచి ఎదురుకాలేదు.కానీ తనతో కలిసిరాని ప్రతి దేశం మీద సమితిని అడ్డం పెట్టుకుని అగ్రరాజ్యాలు ఇలాంటి ‘తనిఖీ’ అస్త్రాలు ప్రయోగించే సంప్రదాయాన్ని నెలకొల్పుతున్న సూచనలు స్పష్టం గానే కనిపిస్తున్నాయి. డా॥గోపరాజు నారాయణరావు