తొలినాళ్లలో ఇరాక్‌లో అమెరికాకు వ్యతిరేకంగా పోరాటం
బీరూట్: 14 ఏళ్ల అంతర్యుద్ధాన్ని తట్టుకుని ఎలాగోలా పరిపాలన సాగిస్తున్న అసద్‌ను చావుదెబ్బతీస్తూ దాడులు మొదలెట్టిన కేవలం 11 రోజుల్లో దేశంపై పట్టుసాధించిన అబూ మొహమ్మెద్ అల్ గోలానీ గురించి సర్వత్రా చర్చ మొదలైంది. జిహాదీ ఉగ్రవాదిగా మొదలైన ప్రస్థానం నేడు దేశాధినేత స్థాయిలో కొత్త పంథాలో కొనసాగనుంది. 42 ఏళ్ల గోలానీ 2003లో తొలిసారిగా అల్‌ఖైదాతో చేతులు కలిపారు.
ఇరాక్‌లో అమెరికా సేనలకు వ్యతిరేకంగా పోరాడారు. అమెరికాకు చిక్కి ఐదేళ్లు జైలుజీవితం గడిపారు. ఈ సమయంలోనే భావసారుప్యత ముఠాలను ఒక్కతాటి మీదకు తెచ్చి అల్‌ఖైదా.. అబూ బకర్ అల్ బాగ్దాదీ సారథ్యంలో ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్‌ను స్థాపించింది. 2011లో సిరియాలో అసద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం కొనసాగించాలంటూ అబూబకర్.. గోలానీని సిరియాకు పంపించాడు. అక్కడ అల్‌ఖైదా అనుబంధ నుస్రా ఫ్రంట్‌ను స్థాపించారు.
దీనిని ఆనాడే అమెరికా ఉగ్రసంస్థ ముద్రవేసింది. గోలానీని పట్టిస్తే ఒక కోటి డాలర్లు ఇస్తామని నజరానా ప్రకటించింది. 2013లో సిరియాలో అంతర్యుద్ధం మొదలయ్యాక నుస్రా ఫ్రంట్‌ను ‘ఇరాక్ అల్‌ఖైదా’లో కలిపేసి కొత్తగా ‘ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐసిస్)’ను స్థాపించాని అబూబకర్ సూచించారు. అయితే ఐసిస్ ఏర్పాటు నచ్చక సొంతంగా నుస్రా ఫ్రంట్‌ను గోలానీ కొనసాగించారు. 2013లో గోలానీని అమెరికా ఉగ్రవాదిగా ప్రకటించింది.
2016లో అల్‌ఖైదాతో తెగతెంపులు చేసుకుని సొంతంగా జభాత్ ఫతే అల్–షామ్(ది సిరియా కాంక్వెస్ట్ ఫ్రంట్)ను గోలానీ స్థాపించారు. ఇంకొక ఏడాది తర్వాత దాని పేరును హయత్ తహ్రీర్ అల్ షామ్(సిరియా విమోచన సంస్థ)గా నామకరణం చేశారు. ఇడ్లిబ్ ప్రావిన్స్‌లో తన పట్టు నిలుపుకున్నారు. స్వతంత్రంగా పోరాటంచేసే వేర్వేరు ఇస్లామిక్ ఉగ్రవాదుల ఆధిపత్యాన్ని అణచివేసి, వారిని తమలో కలుపుకుని సంస్థను మరింత పటిష్టవంతం చేశారు.
తుర్కియే అండతో చెలరేగిపోయిన వేర్పాటువాదుల దాడుల్లో చనిపోయిన కుర్దుల కుటుంబాలను కలిసి మంచివాడిగా పేరుతెచ్చుకున్నారు. 2016లో తొలిసారిగా బహిరంగంగా ప్రపంచానికి తనను తాను పరిచయం చేసుకున్నారు. మూడేళ్ల క్రితం అమెరికన్ జర్నలిస్ట్‌కు తొలిసారిగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. తమ సంస్థ పశి్చమదేశాలకు వ్యతిరేకంగా పనిచేయబోదని, సిరియాపై ఆంక్షలు విధించడం సబబుకాదని, పరోక్షంగా అమెరికా ఆంక్షలను తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘ పశి్చమదేశాల విదేశాంగ విధానాలను విమర్శించిన మాట వాస్తవమే. కానీ మేం అమెరికా, యూరప్ దేశాలతో యుద్ధాలకు దిగాలనుకోవట్లేము. మాకు శాంతిస్థాపనే ముఖ్యం’’ అని గోలానీ గతంలో వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment