ఏ పని చేస్తే ఏం జరుగుతుందో.. తెలిసీతెలియని వయసులో ఆ బాలుడు చేసిన పని.. సిరియా ముఖచిత్రాన్నే మార్చేసింది. నిరంకుశ పాలనపై దేశం మొత్తాన్ని ఒకతాటిపైకి తెచ్చి నిరసన గళం విప్పేలా చేసింది. అసద్ నియంత పాలనకు వ్యతిరేకంగా అప్పటిదాకా రెబల్స్ చేస్తున్న తిరుగుబాటును.. ముమ్మరం చేయడానికి నాంది పలికింది. ఆ చర్యే.. దశాబ్దాల పోరు తర్వాత సిరియాకు స్వేచ్ఛా వాయువుల్ని అందించబోతోంది. కానీ, యుక్తవయసుకొచ్చిన అతని ముఖంలో మాత్రం సంతోషం కనిపించడం లేదు.
తన తండ్రి హఫీజ్ మరణాంతరం వారసత్వంగా వచ్చిన సిరియా అధ్యక్ష పదవిని బలవంతంగానే అంగీకరించాడు డాక్టర్ బషర్ అల్ అసద్. అయితే నియంత పోకడకు అలవాటు పడడానికి అతనికి ఎంతో సమయం పట్టలేదు. అదే సమయంలో అరబ్ విప్లవం మొదలైంది. కుటుంబ పాలనలో నలిగిపోయిన సిరియన్లకు ఈ విప్లవం ఓ ఆశాజ్యోతిలా కనిపించింది. దారా ప్రాంతానికి చెందిన 14 ఏళ్ల మువావియా సియాస్నే.. ఈజిప్ట్, ట్యూనీషియలో ఏం జరిగిందో టీవీల్లో చూశాడు. పరుగున వెళ్లి తన స్నేహితులను పోగు చేశాడు. స్కూల్ ఆ గోడ మీదే కొన్ని రంగులు తీసుకుని రాతలు రాశాడు.
‘‘డాక్టర్.. తర్వాత నీ వంతే!’’ అంటూ అధ్యక్షుడు అసద్‌ను ఉద్దేశించి సరదాగా రాసింది సియాస్నే బృందం. పిల్ల చేష్టలనుకుని.. ఎవరూ ఆ రాతల్ని పట్టించుకోలేదు. కానీ, కొన్నాళ్లకు పోలీసులు ఆ రాతలను సీరియస్‌గా తీసుకున్నారు. దగ్గర్లోని కొందరు కుర్రాళ్లను అదుపులోకి తీసుకుని రాసిందో ఎవరో కనిపెట్టే ప్రయత్నం చేశారు.
ఈలోపు విషయం సియాస్నే తండ్రికి తెలిసి భయపడ్డాడు. ‘ఎందుకు రాశావ్?’ అనే కొడుకును అడిగితే.. అలా జరిగిపోయిందంటూ నిర్లక్క్ష్యపు సమాధానం ఇచ్చాడు. అయితే వెంటనే దాక్కోమని సలహా ఇచ్చాడు ఆ తండ్రి. ఉదయం వెళ్లొచ్చులే అని ఆ రాత్రి ప్రశాంతంగా నిద్రపోయాడు ఆ బాలుడు. అయితే..
వేకువజామున 4 గం. ప్రాంతలో మువావియా సియాస్నే చేతులకు బేడీలు పడ్డాయి. గోడ మీద రాతలు రాసే టైంలో మరో ముగ్గురు స్నేహితులు మువావియా వెంట ఉండడంతో.. వాళ్లనూ లాక్కెళ్లారు. పాడై పోయిన భోజనం, ఒంటి మీద నూలుపోగు లేకుండా కర్రలతో బాదుతూ.. కరెంట్ షాక్‌తో థర్డ్ డిగ్రీ ప్రయోగించి.. దాదాపు నెలన్నరపాటు ఆ నలుగురికి నరకం అంటే ఏంటో చూపించారు. ఇంతలో తమ బిడ్డల కోసం ఆ తండ్రులు స్టేషన్ల గడప తొక్కారు.
‘‘వీళ్లను మరిచిపోండి. ఇళ్లకు పోయి మీ పెళ్లాలతో మళ్లీ పిల్లల్ని కనండి. చేతకాకపోతే.. మీ ఆడాళ్లను మా దగ్గరకు పంపండి’’ అంటూ అతిజుగుప్సాకరంగా మాట్లాడిన ఆ పోలీసుల మాటలను దిగమింగుకుని వాళ్ల తండ్రులు వెనుదిరిగారు. మానవ హక్కుల సంఘాల ద్వారా తమ పిల్లలను విడిపించే ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ఈలోపు నెల గడిచింది. విషయం దేశం మొత్తం పాకింది.
అధ్యక్షుడు అసద్‌కు కోపం తెప్పించిన ఆ నలుగురు పిల్లల విముక్తి కోసం వేల మంది రోడ్డెక్కారు. వాళ్లను విడుదల చేయాలంటూ నినాదాలు చేస్తూ ఉద్యమించారు. ఈ ఉద్యమం దావానంలా వ్యాపించింది. మార్చి 15, 2011లో అసద్ పాలనకు వ్యతిరేకంగా సిరియా వ్యాప్తంగా సంఘటితంగా జరిగిన ప్రజా నిరసన కార్యక్రమాలు(Day of Rage).. ఆ దేశ చరిత్రలోనే ప్రత్యేకంగా నిలిచిపోయింది. అయితే.. అప్పటికే అణచివేతను అలవాటు చేసుకున్న అసద్.. ఆ ఉద్యమాన్ని హింసాత్మకంగా మారేదిశగా కవ్వింపు చర్యలకు దిగాడు. అది కాస్త.. లక్షల మందితో తిరుగుబాటుగా తయారైంది.
45 రోజుల తర్వాత.. క్షమాభిక్ష పేరిట ఆ నలుగురిని విడిచిపెట్టారు. మరోసారి ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాల వైపు చూడకూడదని లిఖితపూర్వకంగా రాయించుకున్నారు. అయితే.. మువావియా జీవితం అప్పటి నుంచి కుదేలయ్యింది. నాలుగేళ్ల తర్వాత అంతర్యుద్ధంలోనే తన తండ్రి తుటాలకు బలయ్యాడు. ఆ తర్వాతి రోజుల్లో సిరియా విముక్తి పేరిట ఏర్పాటైన సైన్యంలో చేరాడతను. ఇన్నేళ్ల అంతర్యుద్ధాన్ని.. అందులో పోయిన లక్షల ప్రాణాలను తల్చుకుంటూ.. తాను అలాంటి పని చేయకుండా ఉండాల్సిందని కాదని అంటున్నాడు.
‘‘మేం జైలు నుంచి బయటకు వచ్చాక.. బయట ఇసుకేస్తే రాలని జనం ఉన్నారు. వాళ్లంతా మాకు మద్దతుగా వచ్చారా? అని ఆశ్చర్యపోయాం. ఆ క్షణం సంతోషంగానే అనిపించింది. కానీ, ఇప్పుడు ఆరోజు నేను అలా చేయకుండా ఉండాల్సిందేమో అనిపిస్తోంది. ఆనాడు అలా నేను గోడ మీద రాసి ఉండకపోతే.. అసద్‌కు కోపం తెప్పించి ఉండకపోతే.. తిరుగుబాటు ఈ స్థాయిలో జరిగి ఉండేది కాదేమో!. లక్షల ప్రాణాలు పోయేవి కావేమో అని పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నాడు’’.. అయితే అసద్ పాలనకు ముగింపు పడినందుకు మాత్రం తనకు సంతోషంగానే ఉందంటున్నాడతను.
కీలక పరిణామాలు..
మువావియా-అతని స్నేహితుల అరెస్ట్.. తదనంతర పరిణామాల తర్వాత అసద్ పాలనను వ్యతిరేకిస్తూ ప్రజలు ఉద్యమాలు చేశారు. ఉగ్ర సంస్థలు, తిరుగుబాటు దారులు మరోవైపు ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెట్టే యత్నం చేశారు. కానీ, వీటినీ అసద్ సర్కార్ ఉక్కుపాదంతో అణచివేస్తూ వచ్చింది. నిరంకుశ పాలన దిశగా అసద్‌ను అడుగులేయించింది. 2015 సెప్టెంబర్‌లో రష్యా రాకతో అసద్ బలం పుంజుకోగా.. 2017 ఏప్రిల్‌లో అసద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమెరికా సేనలు పరోక్షంగా సిరియాలో రంగ ప్రవేశం చేశాయి.
మానవహక్కుల ఉల్లంఘన, అక్రమ అరెస్ట్‌లు, జనంపైకి రసాయన ఆయుధాల ప్రయోగం, కుర్దులను అణగతొక్కడం, ప్రభుత్వ ఆధ్వర్యంలో కిడ్నాప్‌లు, హత్యలు వంటి అరాచకాలు ఆనాటి నుంచి నిత్యకృత్యమయ్యాయి.అసద్ పాలనలో దాదాపు ఐదు లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అంతర్యుద్ధం కారణంగా 13 లక్షల మంది సిరియాను వదిలి విదేశాలకు శరణార్థులుగా వలసవెళ్లారు.
అయితే 14 ఏళ్ల అంతర్యుద్ధానికి ముగింపు పలుకుతూ గత నెల 27న ఇడ్లిబ్ సిటీ ఆక్రమణతో మొదలైన తిరుగుబాటుదారుల జైత్రయాత్ర రాజధాని డమాస్కస్‌దాకా కొనసాగడంతో 59 ఏళ్ల అసద్ మిత్రదేశం రష్యాకు పలాయనం చిత్తగించక తప్పలేదు.
హమ్జా అలీ అల్ ఖతీబ్.. బషర్ అల్ అసద్ కర్కశపాలనకు బలైన ఓ పసిప్రాణం. కేవలం 13 ఏళ్ల వయసులో ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్నాడంటూ అభియోగాలు మోపి అరెస్ట్ చేసి.. కస్టడీలో తీవ్రంగా హింసించారు. చివరకు.. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించడం ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలకు కారణమైంది. రమారమి.. మువావియా సియాస్నేని హింసించిన సమయంలోనే ఈ ఘటనా జరిగింది. అయితే సోషల్ మీడియాలో సిరియా నియంతాధ్యకక్షుడు అసద్‌కు వ్యతిరేకంగా.. హమ్జా పేరిట నడిచిన ఉద్యమం ఈనాటికీ ప్రత్యేకంగా నిలిచిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment