Syria conflict
-
రష్యా.. మా క్షిపణులు వస్తున్నాయి: ట్రంప్
వాషింగ్టన్/ఐరాస: సిరియా వివాదం అమెరికా, రష్యాల మధ్య ఉద్రిక్తతలను పెంచుతోంది. సిరియాలో ఇటీవల జరిగిన విష రసాయన దాడిని తీవ్రంగా తీసుకున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఆ దేశంలో క్షిపణి దాడికి వెనుకాడబోమని హెచ్చరించారు. ‘సిరియా వైపు వచ్చే ప్రతీ క్షిపణినీ కూల్చేస్తామని రష్యా అంటోంది. రష్యా.. సిద్ధంగా ఉండు. మా క్షిపణులు వస్తున్నాయి. అవి మామూలువి కావు.. అత్యంత ఆధునిక క్షిపణులవి. సొంతదేశ పౌరులను విషవాయువుతో చంపే జంతువుకు నువ్వు మద్దతివ్వకుండా ఉండాల్సింది’ అంటూ ఒక ట్వీట్ చేశారు. -
సిరియా సంక్షోభం.. మళ్లీ వైమానిక దాడులు..!
డమస్కస్: అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న సిరియాలో తాజాగా సోమవారం ఉదయం వైమానిక దాడులు జరిగాయి. ప్రభుత్వ ఆధ్యర్యంలోని తాయ్ఫుర్ వైమానిక స్థావరం లక్ష్యంగా క్షిపణి దాడులు జరిగాయి. హామ్ పట్టణానికి సమీపంలో ఉన్న ఈ వైమానిక స్థావరంపై జరిగిన వైమానిక క్షిపణి దాడుల్లో పలువురు చనిపోయారని, పెద్దసంఖ్యలో గాయాలపాలయ్యారని ప్రభుత్వ మీడియా సంస్థ సనా తెలిపింది. సిరియా ప్రభుత్వ వైమానిక స్థావరంపై అమెరికా సైన్యమే వైమానిక దాడులు జరిపినట్టు భావిస్తున్నారు. అయితే, అమెరికా ఈ వార్తలను ఖండించింది. తాము వైమానిక దాడులు నిర్వహించలేదని స్పష్టం చేసింది. తాజాగా తిరుగుబాటుదారుల అధీనంలో ఉన్న డౌమా పట్టణంపై విషరసాయనిక దాడులు జరగడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. 42మందిని పొట్టనబెట్టుకొని, వందలమంది గాయపడటానికి కారణమైన గ్యాస్ దాడిపై అంతర్జాతీయ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. సిరియా ప్రభుత్వం తన సొంత ప్రజల్నే చంపుకుంటుందని మండిపడ్డాయి. సిరియా అధ్యక్షుడు అసద్ జంతువులాంటి వాడని, అతనితోపాటు అతనికి అండగా నిలుస్తున్న రష్యా, ఇరాన్ ఈ గ్యాస్ భారీ మూల్యం చెల్లించకతప్పదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. -
సిరియాలో ఆగని దాడులు
బీరుట్ : నిరంతరం బాంబుల వర్షంతో అల్లకల్లోలంగా మారిన సిరియాలో నరమేధం ఆగడం లేదు. తాజాగా ఆఫ్రిన్ సిటీపై జరిగిన దాడిలో 18 మంది మృతి చెందారు. ఉత్తర సిరియాలో కుర్దిశ్ వర్గానికి చెందిన ప్రజలు అధికంగా నివసించే ఆఫ్రిన్ సిటీపై టర్కీ ఫిరంగి దాడులు చేయడంతో వీరంతా మరణించినట్లు సిరియా మానవ హక్కుల సంఘం తెలిపింది. మరణించిన వారిలో ఐదుగురు చిన్నారులు కూడా ఉన్నట్లు పేర్కొంది. ఈ ఏడాది జనవరి 20న టర్కీ, సిరియాకు చెందిన తిరుగబాటు ప్రతినిధులు ఆఫ్రిన్ ప్రాంతంలో ప్రమాదకరమైన ఫిరంగులను ఏర్పాటు చేశారు. వీటి మూలంగానే ఆఫ్రిన్ ప్రాంతంలో అలజడులు చెలరేగుతున్నాయి. యూఎస్ మద్దతు గల కుర్దిశ్ పీపుల్స్ ప్రొటెక్షన్ యూనిట్స్(వైపీజీ) నియంత్రణలో ఉన్న ఈ ప్రాంతం ఇప్పటికే టర్కీకి చెందిన బలగాల చేతిలో చిక్కుకోవడంతో రోజుకో ఘటన జరుగుతోంది. నగర ప్రజలు పారిపోయేందుకు వీలుగా ఒకే ఒక రోడ్డు మార్గం మాత్రమే ఉండటంతో వారంతా బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. కాగా గురువారం నాటికే 30 వేల మంది ఆఫ్రిన్ ప్రజలు మరణించినట్లు ఒక నిఘా సంస్థ తెలిపింది. -
కుప్పకూలిన విమానం ; భారీగా ప్రాణనష్టం
మాస్కో : రష్యాకు చెందిన విమానం ఒకటి సిరియా గడ్డపై కూలిపోయిన ఘటనలో 32 మంది ప్రాణాలు కోల్పోయారు. సిరియాలోని లటాకియా ఫ్రావిన్స్ హమీమ్ ఎయిర్బేర్ వద్ద మంగళవారం ఈ దుర్ఘటన జరిగింది. ప్రస్తుతం రష్యా ఆధీనంలో ఉన్న ఈ ఎయిర్‌బేస్ నుంచే సిరియా గగనతలంపై దాడులు నిర్వహిస్తుండటం గమనార్హం. విమాన ప్రమాదంపై రష్యన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రటకట చేసింది. కూలిపోయింది రవాణా విమానమని, అందులో ప్రయాణిస్తున్న 32 మందిలో ఏ ఒక్కరూ ప్రాణాలతో బయటపడలేదని ప్రకటనలో పేర్కొన్నారు. చనిపోయినవారిలో ఆరుగురు విమాన సిబ్బంది కూడా ఉన్నారు. కాగా, మిగతావారు సైనికులా, లేక వైమానికదళంలో సహాయకులా అన్నది తెలియాల్సిఉంది. గతంలో సిరియా తీవ్రవాదులు రష్యన్ విమానాలను పేల్చేసిన ఉదంతాల నేపథ్యంలో నేటి ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే, ప్రాథమిక అంచనా ప్రకారం ఇది ఉగ్రచర్య కాదని, సాంకేతిక లోపం వల్లే విమానం కూలిపోయి ఉంటుందని అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఈ వార్తకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సిఉంది. కొద్ది రోజుల కిందటే రష్యాలో.. ఆంటొనోవ్ ఏఎన్–148 జెట్ విమానం పేలిపోయి 71 మంది మృతిచెందిన సంగతి తెలిసిందే. -
సిరియాలో ఆగని నరమేధం; మళ్లీ బాంబుల వర్షం
-
సిరియాలో ఆగని నరమేధం
డమస్కస్ : కల్లోల సిరియాలో నరమేధం ఇంకా ఆగలేదు. అంతర్జాతీయ సమాజం అభ్యర్థను పక్కనపెడుతూ, ఐక్యరాజ్యసమితి ఆదేశాలను బేఖాతరుచేస్తూ సిరియా సైన్యం మరోసారి వైమానిక దాడులు జరిపింది. తూర్పుగౌటాలోని నివాస సముదాయాలపై శుక్ర, శనివారాల్లో బాంబుల వర్షం కురిపించింది. తాజా దాడుల్లో 25 మందికిపైగా పౌరులు చనిపోయారు. ప్రస్తుతం తూర్పు గౌటాలో సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్న పలు ఏజెన్సీలు ఈ విషయాన్ని వెల్లడించాయి. కాల్పుల విరమణకు విరుద్ధంగా : ఫిబ్రవరి చివరివారంలో ఐక్యరాజ్యసమితి భద్రతామండలి.. ‘తూర్పుగౌటాపై దాడులను తక్షణమే నిలిపేయాలి’ అని ఏకగ్రీవ తీర్మానం చేసింసింది. నెల రోజుల కాల్పులు జరపరాదంటూ సిరియా-రష్యాలను ఆదేశించింది. ఆ నిర్ణయం తర్వాత పలు స్వచ్ఛంద సంస్థలు రంగంలోకి దిగాయి. మూడు నెలలుగా సరైన ఆహారం, వైద్యసేవలు లేక అలమటిస్తోన్న గౌటా వాసులను ఆదుకునే ప్రయత్నం చేశాయి. ఇంతలోనే కాల్పుల విమరణ ఒప్పందానికి విరుద్ధంగా అసద్ సైన్యాలు మళ్లీ జనావాసాలపై దాడులకు తెగబడ్డాయి. సేవ్ సిరియా : రాజధాని డమస్కస్‌కు తూర్పుభాగంలో ఉండే గౌటా నగరంపై గడిచిన మూడు నెలలు భీకర దాడులు జరిగాయి. ఫిబ్రవరి 19 తర్వాత సిరియా సైన్యం-రష్యన్ వైమానిక దళాలు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో 200 చిన్నారులు, 150 మంది మహిళలు సహా మొత్తం 700 మంది వరకు చనిపోయారు. మరో 1500 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాంబు దాడుల్లో 25కుపైగా ఆస్పత్రి భవనాలు కుప్పకూలడంతో వైద్యం చేయించుకునే దిక్కులేక జనం అల్లాడిపోయారు. సిరియన్ బాలల ఆర్తనాదాలకు చలించిన మిగతా ప్రపంచం ‘సేవ్ సిరియా’ అంటూ గట్టిగా నినదించింది. ఈ నేపథ్యంలోనే సిరియా సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకోవడం తెలిసిందే. -
దుమారం రేపిన టీవీ యాంకర్ వ్యాఖ్యలు
ఇస్తాంబుల్ : ఓ టీవీ చర్చా వేదికలో రాజకీయ నేతలను ఉద్దేశించి యాంకర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ‘సాధారణ పౌరుల ప్రాణాలు తీసే ముందు రాజకీయ నేతలను చంపాలి’ అని వ్యాఖ్యానించి చిక్కుల్లో పడ్డాడు. టర్కీ ప్రభుత్వ ఛానెల్ అకిట్ టీవీ యాంకర్ అహ్మత్ కేసర్ తాజాగా ఓ చర్చా కార్యక్రమం నిర్వహించాడు. దీనికి ప్రధాన-ప్రతిపక్ష నేతలు కొందరు హాజరయ్యారు. ప్రస్తుతం సిరియా నెత్తురోడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తర సిరియాపై ఉగ్రస్థావరాల మీద దాడుల కోసం టర్కీ సహకారం అందించటాన్ని నేతలంతా ముక్తకంఠంతో ఏకీభవించారు. అయితే కుర్షిద్ మిలిటెంట్లను మట్టుబెడుతున్నామన్న సాకుతో అక్కడి సాధారణ పౌరులను చంపటం సరికాదన్న కేసర్.. ఈ క్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ‘అంతలా చంపాల్సి వస్తే సాధారణ పౌరుల కంటే ముందుగా రాజకీయ నేతలను చంపాలి. ఇంత కన్నా దారుణమైన దేశద్రోహులు పార్లమెంట్లో కూర్చున్నారు. లౌకిక వాదం పేరుతో ఇస్లాం సాంప్రదాయలను తుంగలో తొక్కేస్తున్నారు. ముందు వాళ్లను చంపండి’’అంటూ వ్యాఖ్యలు చేశాడు. అంతే కేసర్ వ్యాఖ్యలపై రాజకీయ పార్టీలు భగ్గుమన్నాయి. అతన్ని అరెస్ట్ చేసి దేశద్రోహిగా పరిగణించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు అధికార పార్టీల నేతలు సైతం గొంతు కలపటం గమనార్హం. కేసర్పై ఫిర్యాదు అందటంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. మరో వైపు అతన స్వచ్ఛందంగా రాజీనామా చేసినట్లు ఛానెల్ యాజమాన్యం ప్రకటించింది. నేరం రుజువైతే టర్కీ చట్టాల ప్రకారం అతనికి మూడేళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉంటుంది. అధ్యక్షుడి వివాదాస్పద వ్యాఖ్యలు... ఇదిలా ఉంటే టర్కీ అధ్యక్షుడు రెసెప్ టయ్యిప్ ఎర్డోగన్ చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారి తీశాయి. గత వారం తూర్పు ఖరామాన్మరస్ ప్రాంతంలో ఓ బహిరంగ సభలో పాల్గొన్న ఆయన వేదిక మీదకు ఓ ఆరేళ్ల బాలికను పిలిచారు. మిలిటరీ దుస్తుల్లో ఉన్న ఆ పాపను ‘దేశం కోసం నువ్వు చనిపోతే.. జెండా కప్పి నీకు అమర జీవి బిరుదు ఇస్తాం. అందుకు నువ్వు సిద్ధమేనా?’ అని ప్రశ్నించారు. అయితే రెసెప్ గద్దించటంతో ఆ పాప ఏడుస్తూ అవునని బదులిచ్చింది. చిన్న పిల్లతో అలాంటి ప్రమాణం చేయించిన అధ్యక్షుల వారిపై సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి. -
శవాలదిబ్బ ; సిరియాలో 700 మంది హతం
మనిషి విజ్ఞానం రాశులు పోసినట్లు కనిపిస్తుందక్కడ.. శిథిలాలు, శవాలదిబ్బల రూపంలో! అత్యాధునిక టెక్నాలజీతో అత్యంత శక్తిమంతంగా తయారైన ఆయుధాలను పసిపిల్లల్ని చంపడానికి వినియోగిస్తున్నారక్కడ!! అదేమంటే, ఉగ్రవాద విముక్తి పోరాటంలో ‘నరబలి’ తప్పదన్నట్లు ప్రభుత్వాలు వ్యాఖ్యానిస్తున్నాయి!!! డమస్కస్ : గడిచిన కొద్ది రోజులుగా సిరియాలోని గౌటా నగరంపై ప్రభుత్వ దళాల దాడుల్లో కనీసం 700 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయినవారిలో 200 మంది చిన్నారులు, 110 మంది మహిళలు కూడా ఉన్నారు. వైమానిక దాడుల్లో ఆస్పత్రి భవనాలు, వందకొద్దీ ఇళ్లు నేలమట్టమయ్యాయి. ముందస్తుగా ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించి, ఆ తర్వాత మిలిటెంట్లపై దాడులు చేయాల్సిన ప్రభుత్వాలు.. ఏకబిగిన జనావాసాలపై బాంబులు జారవిడుస్తున్నాయి. దీంతో గౌటాలో ఎక్కడిక్కడ నెత్తురు ఏరులైపారుతోంది. (సిరియా అంతర్యుద్ధానికి సంబంధించి ప్రస్తుతం ట్రెండ్ అవుతోన్న ఓ పాత ఫొటో) అసలేం జరుగుతోంది? దేశ రాజధాని డమస్కస్ శివారు నగరమైన గౌటా 2013లో ప్రభుత్వ బలగాల ఆధీనంలో ఉండేది. అయితే మిగతా ప్రాంతాల్లో చావుదెబ్బతిన్న మిలిటెంట్లు వేలమంది.. సాధారణ జనంతో కలిసిపోయి గౌటా నగరంలోకి చొచ్చుకొచ్చారు. 2017నాటికి వారు తిరిగి ఆయుధ సంపత్తిని పోగేసి గౌటాలో సొంత పెత్తనం చెలాయించే స్థితికి చేరుకున్నారు. ప్రస్తుతం తిరుగుబాటు దళాలు గౌటా నగరాన్ని రొట్టెను పంచుకున్నట్లు పంచుకున్నాయి. తహ్రీర్ అల్ షమ్, అల్ రహమాన్ లీజియన్, జైష్ అల్ ఇస్లామ్ అనే గ్రూపులు తమలోతాము కలహించుకుంటూ, ప్రభుత్వ బలగాలతోనూ తలపడుతూ జనాన్ని కాల్చుకు తింటున్నాయి. (యుద్ధక్షేత్రంలో ఓ అమాయక బాలిక) దేశరాజధాని డమస్కస్‌కు 10 కిలోమీటర్ల దూరంలో 100 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉన్న గౌటా నగరంపై పట్టుసాధిస్తే తప్ప సిరియా ప్రభుత్వం మనలేని పరిస్థితి. ఉగ్రవాదుల చెర నుంచి మిగతా ప్రాంతాలను కైవసం చేసుకున్నట్లే గౌటాను కూడా ఆధీనంలోకి తెచ్చుకోవాలనే లక్ష్యంతో సిరియా సైన్యం పనిచేస్తున్నది. ఆ సైన్యాలకు రష్యా పూర్తిస్థాయిలో అండగా నిలవడమేకాక, వైమానిక దాడులు సైతం నిర్వహిస్తున్నది. తాజా సమాచారం ప్రకారం గౌటా యుద్ధక్షేత్రంలో సుమారు 4లక్షల మంది జనం చిక్కుకుపోయారు. రోజుకు ఐదు గంటల విరామం : పుతిన్ మానవ హక్కులను కాలరాస్తూ సిరియా-రష్యాలు సాగిస్తోన్న బాంబు దాడులపై అంతర్జాతీయంగా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 25న ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశం జరిగింది. ‘తక్షణమే సిరియాలో కాల్పుల విరమణ ఒప్పందం అమలు చేయాలి’ అని మండలి తీర్మానించింది. రష్యా కూడా ఆ తీర్మానానికి అనుకూలంగా ఓటేసింది. కానీ క్షేత్ర స్థాయిలో మాత్రం కాల్పుల విరమణపై రష్యా వెనక్కితగ్గలేదు. ‘మానవతా దృక్పథంతో రోజుకు ఐదు గంటలు మాత్రమే దాడుల్ని ఆపుతాం. ఆ సమయంలోనే జనం సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాల్సి ఉంటుంది’’ అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మంగళవారం ఒక ప్రకటన చేశారు. -
శాంతి తీరానికి సిరియా?
ఆగ్నేయాసియాను అతలాకుతలం చేస్తున్న సిరియా యుద్ధం ఎట్టకేలకు శాంతి తీరాన్ని చేరనున్నదనిపించే సంకేతాలు కనిపిస్తున్నాయి. సోమవారం అమెరికా, రష్యాల మధ్య కుదిరిన సిరియా తాత్కాలిక శాంతి ఒప్పందం ఫలితంగా ఈ నెల 27 నుంచి సిరియా కాల్పుల విరమణ అమల్లోకి వస్తుందని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్‌ల టెలిఫోన్ సంభాషణ తదుపరి వెలువడటం వల్ల ఈ ప్రకటన ప్రత్యేక ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఇరాన్, సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌లు కూడా ఈ ఒప్పందాన్ని ఆమోదించారు. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే మిగతా విష యాలెలా ఉన్నా అతి పెద్ద అంతర్జాతీయ మానవతావాద సవాలుగా మారిన నిస్సహాయులైన సిరియా ప్రజలకు సహాయం అందించే అవకాశం ఏర్పడుతుంది. ఆహ్వానించదగిన ఈ పరిణామంపై అనుమానాల నీలి నీడలూ కమ్ముకుంటున్నాయి. ఈ కాల్పుల విరమణ పాక్షికమైనది కావడమూ అందుకు ఒక కారణం. ఉగ్రవాద సంస్థలుగా గుర్తిస్తున్న ఐఎస్ఐఎస్కు, జబాత్ అల్ నస్రా లేదా నస్రా ఫ్రంట్‌కు ఈ కాల్పుల విరమణ వర్తించదు. పైగా ఇటు ప్రభుత్వ బలగాలకు, అటు తిరుగుబాటుదార్లకు కూడా ఆత్మరక్షణ కోసం సమాన స్థాయి ప్రతిస్పందన హక్కు ఉంటుంది. మధ్యేవాద తిరుగుబాటుదార్లుగా పిలుస్తున్న సున్నీ ఇస్లామిక్ గ్రూపులు, ఉగ్రవాదులుగా గుర్తిస్తున్న నస్రా ఫ్రంట్ పనిచేసే ప్రాంతాలు కలగలిసి ఉండటం వల్ల కాల్పుల విరమణ ప్రాంతాలను నిర్వచించడమే కష్టమౌతుంది. అసలు ఎవరు ఉగ్రవాదులనే విషయంలోనే ఏకాభిప్రాయం లేదు. అమెరికా, నాటోలు ‘మధ్యేవాద గ్రూపులు’గా పేర్కొంటున్నవన్నీ నస్రా ఫ్రంట్‌తో సంబంధా లున్నవేనని పాశ్చాత్య మీడియా సైతం పేర్కొంటోంది. ఈ నెల 19 నుంచి అమ ల్లోకి రావాల్సి ఉన్న మ్యూనిచ్ కాల్పుల విరమణ ఒప్పందానికి పురిట్లోనే సంధి కొట్టింది. కాల్పుల విరమణకు ఉన్న వారం గడువులోగా తిరుగుబాటుదార్లపై రష్యా వైమానిక దాడులను ముమ్మరం చేయడంతో అసద్ సేనలు నిర్ణయాత్మక విజయాలను సాధించి, వారిని పూర్తి రక్షణ స్థితిలోకి నెట్టేశాయి. ఆ దాడులలో పౌర నివా సాలు, ఆసుపత్రులపై బాంబులు కురిపించి రష్యా యుద్ధ నేరాలకు పాల్పడిందని ఆరోపణలు కూడా వచ్చాయి. ఇప్పటికే సిరియాలోని ఐఎస్ఐఎస్ ప్రధాన ప్రాబల్య ప్రాంతమైన అలెప్పోను చుట్టుముట్టి పట్టుబిగిస్తున్న అసద్ సేనలు 27 నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చేలోగా అక్కడి ప్రతిఘటనను పూర్తిగా నిర్మూ లించేలా రష్యా వైమానిక దాడులను ఉధృతం చేస్తుందనే వాదన సహేతుకమే. ఆ లక్ష్యం నెరవేరకపోతే ఈ నెల 12న కుదిరిన మ్యూనిచ్ ఒప్పందంలాగే తాజా ఒప్పందాన్ని కూడా అమల్లోకి రానివ్వకపోవచ్చనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. ఐఎస్ఐఎస్ 2014లో వలే బలీయమైన శక్తిగా లేదు. గత ఏడాది మే నుంచి అది సాధించిన చెప్పుకోదగిన విజయాలు లేవు. ఇటు సిరియా, అటు ఇరాక్లలో అది కుర్దుల చేతుల్లో వరుస ఓటములను చవిచూస్తోంది. ఇరాక్‌లోని మొసుల్, సిరియాలోని ‘రాజధాని’ రఖాలను కూడా అది త్వరలోనే కోల్పోతుందని భావి స్తున్నారు. అందువల్లనే అసద్‌ను గద్దె దించడమా? లేక కొనసాగించనీయడమా? అనేదే ఇప్పుడు కీలకమైనదిగా మారింది. అమెరికా చొరవతో జరుగుతున్న ఈ శాంతి ప్రయత్నాలకు అసద్ ప్రభుత్వమేగాక, రష్యా సైతం సుముఖంగా లేదనే వాదన వినవస్తోంది. రష్యా వైమానిక దాడుల అండతో అసద్ ప్రభుత్వ బలగాలు తిరుగుబాటుదార్లను కొన్ని చిన్న ప్రాంతాలకు పరిమితం చేశాయి. మరికొన్ని వారాల్లోనే తిరుగుబాటుదార్లను తుడిచి పెట్టేసే అవకాశం ఉన్న ఈ దశలో కాల్పుల విరమణ కంటే కాలయాపనే ఉత్తమమని అవి భావిస్తాయనే వాదనను కొటి ్టపారేయలేం. గత ఏడాది సెప్టెంబర్ నుంచి సిరియాలో ఐఎస్ఐఎస్పై వైమానిక దాడులను ప్రారంభించిన రష్యా నవంబర్‌లో చిన్నదే అయినా బలమైన సైనిక బలగాన్ని పంపి టర్కీ సరిహద్దులకు సమీపంలోని సిరియా వైమానిక స్థావరం లతికియాను స్వాధీనం చేసుకుంది. అప్పటి నుంచి సిరియా కేంద్రంగా మధ్య ప్రాచ్యంలోని బలాబలాల్లో మార్పు వచ్చింది. రష్యా తన వైమానిక బలగాల్లోని అత్యాధునికమైన ఎస్‌యూ-35 యుద్ధ విమానాలను, ఎస్-400 క్షిపణి వ్యవస్థలను లతికియాలో మోహరించి ఆగ్నేయాసియాలో అమెరికాతోపాటూ మరో ఆధిపత్య శక్తిగా గుర్తింపును పొందాలని తాపత్రయపడుతోంది. ఒక శాంతి ఒప్పందాన్ని కాలరాచిన వెంటనే మరో ఒప్పందం కోసం సిద్ధమైన అమెరికా వైఖరిని బట్టి చూస్తే ‘ఏది ఏమైనా అసద్ గద్దె దిగాల్సిందే’ అనే తన వైఖరి నుంచి దూరంగా జరుగుతోందని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. అదే నిజమైతే రష్యా, ఇరాన్‌లను విజేతలుగా అంగీకరించి, అది ఇరాక్ తదితర ప్రాంతాల్లోని ఐఎస్ఐఎస్ వ్యతిరేక యుద్ధానికి పరిమితం కావాల్సి ఉంటుంది. అందుకు అది సిద్ధపడు తుందా? లేక కనీసం నూతన అధ్యక్షుని రాకవరకు తాత్కాలిక శాంతితో కాల యాపన చేయాలనుకుంటుందా? అనేది ఇంకా స్పష్టం కాలేదు. ఒక వేళ ఈ తాత్కాలిక శాంతి ఒప్పందం అమల్లోకి వచ్చినా అసద్‌ను గద్దె దించడం కోసం 2011 నుంచి అమెరికా ప్రోద్బలంతో సాగుతున్న తిరుగుబాటులో కీలక పాత్రధారులుగా ఉన్న సౌదీ అరేబియా, ఖతార్ తదితర జీసీసీ దేశాలు, నాటో దేశమైన టర్కీ ఎలాంటి వైఖరి తీసుకుంటాయనే విషయంలో అనిశ్చితి ఉంది. అసద్ బలగాలు తిరుగుబాటుదార్లపై పూర్తి ఆధిక్యతను ప్రదర్శిస్తున్న ఈ దశలో తాత్కాలిక శాంతి, అసద్ ప్రభుత్వం సంఘటితం కావడానికి తోడ్పడుతుందని అవి ఇప్పటికే అమెరికా శాంతి ప్రయత్నాలపట్ల అసంతృప్తితో ఉన్నాయి. ఈ నెల 15న టర్కీ, సిరియాలోకి సేనలను పంపి భూతల యుద్ధం సాగిస్తామంటూ ఉద్రిక్తతలను తారస్థాయికి చేర్చింది. అప్పటికే సిరియాలో తన అమెరికన్ తయారీ ఎఫ్-15 యుద్ధ విమానాలను మోహరించిన సౌదీ కూడా ఖతార్ తదితర మిత్ర దేశాల సేనలతో సిరియాలో భూతల యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించి ప్రచ్ఛన్న యుద్ధ కాలపు రోజులు పునరావృతమవుతున్నాయనే ఆందోళనను రేకెత్తించింది. అందుకు అమెరికా కనీసం ఇప్పుడు సిద్ధంగా లేదనడానికి దాని శాంతి ప్రయత్నాలే నిదర్శనమని భావించవచ్చనుకోవడం సహేతుకమే. టర్కీ, సౌదీలు ఎలాంటి దుస్సాహసానికి దిగకపోతే, రష్యా ఈ ఒప్పందానికి కట్టుబడితే తాత్కాలికంగానైనా నెలకొనే శాంతి సిరియా ప్రజలకు గొప్ప ఊరట కాగలుగుతుంది. -
సిరియాలో హింస: 71 మంది మృతి
సిరియాలో నరమేథం కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో గురువారం ఓ వైపు కారు బాంబు పేలుళ్లతో దద్దరిల్లగా, మరోవైపు దేశ భద్రత సిబ్బంది, తిరుగుబాటుదారులకు మధ్య హోరాహోరిగా కాల్పులు జరిగాయి. ఆ హింసలో మొత్తం 71 మంది మరణించారని స్థానిక మీడియా శుక్రవారం వెల్లడించింది. సిరియా ఈశాన్య ప్రావెన్స్లో హస్కాలో రెండు కారు బాంబు పేలుళ్లకు తిరుగుదారులు పాల్పడ్డారు. ఆ ఘటనలో ఏడుగురు మృతి చెందగా, అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. హస్కాలోని ఓ పాఠశాల ప్రవేశ ద్వారం సమీపంలో కారు పేలుడు సంభవించి... ఇద్దరు చిన్నారుల మృతి చెందారని తెలిపింది. తల్ హలాఫ్ పట్టణంలో అల్ ఖమిస్ మార్కెట్ వద్ద మరో కారును తిరుగబాటుదారులు పేల్చేశారిని ఆ ఘటనలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారని, అనేక మంది గాయపడ్డారని పేర్కొంది. దేశంలోని వివిధ ప్రాంతాలలో తిరుగుబాటుదారులను అణిచేందుకు భద్రత సిబ్బంది చర్యలు చేపట్టింది. అందులోభాగంగా భద్రత సిబ్బందికి, తిరుగుబాటుదారులకు మధ్య హోరాహోరి కాల్పులు జరిగాయి. ఆ కాల్పులలో మొత్తం 64 మంది మరణించారని మీడియా వివరించింది. -
మా రసాయన ఆయుధాలను అప్పగిస్తాం: సిరియా
మాస్కో/వాషింగ్టన్: సిరియా సంక్షోభానికి పరిష్కారం దిశగా కీలక పరిణామం చోటు చేసుకుంది. మిత్రదేశమైన రష్యా ప్రతిపాదన ప్రకారం, తమ రసాయనిక ఆయుధాలను అంతర్జాతీయ సమాజ నియంత్రణలోకి తెచ్చేందుకు సిరియా అంగీకరించింది. తమపై అమెరికా దూకుడును తిప్పికొట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంగళవారం ప్రకటించింది. రసాయనిక ఆయుధాలను అప్పగిస్తే సిరియాపై దాడిని నిలిపివేస్తామని అమెరికా అధ్యక్షుడు ఒబామా చెప్పిన కొన్ని గంటల్లోనే సిరియా ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఆయుధాల అంశంపై మంగళవారం రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్తో జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయని సిరియా విదేశాంగ మంత్రి వాలిద్ అల్ మోలెమ్ మాస్కోలో చెప్పారు. -
దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది: మన్మోహన్సింగ్
ఆర్థిక పరిస్థితిపై ప్రధాని వ్యాఖ్యలు న్యూఢిల్లీ: అంతర్గత అంశాలతో పాటు, అంతర్జాతీయ పరిణామాల కారణంగా దేశం ప్రస్తుతం క్లిష్టమైన ఆర్థిక పరిస్థితిని ఎదుర్కొంటోందని ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ పేర్కొన్నారు. సిరియాలో ఉద్రిక్తతలు వంటి అంతర్జాతీయ అంశాలు సృష్టించిన అస్థిర పరిస్థితులను అంచనా వేయాల్సి ఉందని వ్యాఖ్యానించారు. రూపాయి రోజు రోజుకూ పతనమవుతున్న పరిస్థితిపై గురువారం పార్లమెంటులో తీవ్ర గందరగోళం చెలరేగింది. రూపాయి పతనం దేశంలో తీవ్ర భయాందోళనలు సృష్టిస్తోందని.. ఈ పతనం ఎక్కడ ఆగుతుందో ఎవరికీ తెలియటం లేదని, దీనిని నిలువరించటానికి ప్రభుత్వం ఏం చర్యలు చేపడుతోందని ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. లోక్‌సభలో వామపక్ష పార్టీలు, ఏఐఏడీఎంకే సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేయటంతో పలుమార్లు వాయిదాపడింది. దీనిపై ప్రధానమంత్రి తక్షణం ప్రకటన చేయాలని విపక్షం డిమాండ్ చేసింది. రాజ్యసభలోనూ ఈ అంశం గందరగోళానికి దారితీసింది. అస్థిర పరిణామాలు, ప్రభావాలపై అంచనా వేసి శుక్రవారం ప్రకటన చేస్తానని మన్మోహన్ తెలిపారు. ‘పీహెచ్డీ’లు ఉన్నా ఉపయోగమేంటి? లోక్‌సభ సమావేశం కాగానే ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్.. రూపాయి పతనంపై మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని స్పీకర్ మీరాకుమార్ను కోరారు. ‘‘ఆర్థిక పరిస్థితిపై మొన్న సభలో చర్చ జరిగింది. ఆర్థికమంత్రి సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చారు. పది చర్యలు వివరించారు. వాటిని అమలు చేస్తే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందన్నారు. కానీ.. వాస్తవానికి పరిస్థితి దిగజారింది’’ అని తూర్పారబట్టారు. ఆర్థికమంత్రిగా పనిచేసిన, ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ కారణమని తప్పుపట్టేందుకు చిదంబరం పరోక్షంగా ప్రయత్నించారని సుష్మా ఆరోపించారు. ఆర్థికశాస్త్రంలో పీహెచ్‌డీలు (డాక్టరేట్ డిగ్రీలు) ఉన్న వారు.. ఆర్థికవ్యవస్థను నిర్వహించలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. రూపాయి పతనం ఆగిపోతుందా, దిగజారటం కొనసాగుతుందా అనేదానిపై ప్రధానమంత్రి స్పష్టతనివ్వాలని ఆమె డిమాండ్ చేశారు. -
సిరియాలో రసాయన దాడి, 1300 మంది బలి
-
సిరియాలో రసాయన దాడి, 1300 మంది బలి
* పౌరులపై ప్రభుత్వ బలగాల ఘాతుకం * డమాస్కస్ శివారులోని రెబల్స్ స్థావరాలపై దాడి * మృతుల్లో పెద్ద సంఖ్యలో పిల్లలు వందలాది మందికి అస్వస్థత * మొదట రసాయన ఆయుధాలతో, తర్వాత విమానాల నుంచి బాంబులతో.. * జాతీయ విపక్ష కూటమి వెల్లడి.. దాడి వార్తలు కట్టుకథలన్న ప్రభుత్వం బీరుట్: అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న సిరియాలో బుధవారం చరిత్ర ఎరుగని దారుణ మారణహోమం జరిగింది. ప్రభుత్వ బలగాలు జరిపిన రసాయన ఆయుధ దాడిలో 1,300 మందికి పైగా బలయ్యారు. మృతుల్లో పెద్ద సంఖ్యలో పిల్లలు ఉన్నారు. వందల సంఖ్యలో అస్వస్థతకు గురయ్యారు. ఈమేరకు ప్రధాన విపక్ష కూటమి ‘నేషనల్ కొయిలిషన్’ వెల్లడించింది. ఆ ఆరోపణను ప్రభుత్వం ఖండించింది. అయితే మీడియాలో వచ్చిన ఫోటోలు, వీడియో దృశ్యాలు దాడికి నిదర్శనంగా నిలిచాయి. కొందరు నురగలు కక్కుతూ చనిపోతున్నట్లు, కొందరు ఎగశ్వాస తీసుకుంటున్నట్లు వాటిలో కనిపించారు. మృదేహాలపై ఎలాంటి గాయాలూ కనిపించకపోవడం రసాయన దాడి జరిగిందనడానికి ఊతమిస్తోంది. విషపు దాడి.. బాంబుల మోత.. దేశ రాజధాని డమాస్కస్‌కు దగ్గర్లోని తూర్పు గౌటాలో తిరుగుబాటుదారుల స్థావరాలపై ప్రభుత్వ బలగాలు ఉదయం రసాయనిక ఆయుధాలతో కూడిన రాకెట్లతో దాడి చేశాయని విపక్ష కూటమి తెలిపింది. విష వాయువులు పీల్చి వందలాది మంది చనిపోయారని, ఊచకోతలో కుటుంబాలకు కుటుంబాలు అసువులు బాశాయని ‘లోకల్ కోఆర్డినేషన్ కమిటీస్’ పేర్కొంది. రసాయనిక దాడి తర్వాత, యుద్ధవిమానాల నుంచి బాంబుల వర్షం కురిపించారని తెలిపింది. కడపటి వార్తలు అందే సమయానికి రసాయనిక దాడి సాగుతోందని చెప్పింది. ఇర్బిన్, దూమా, మాధామియా తదితర ప్రాంతాల్లో పదుల సంఖ్యలో చనిపోయారని తెలిపింది. దాడుల దృశ్యాలుగా పేర్కొంటూ కొంతమంది సామాజిక కార్యకర్తలు మీడియాలో కొన్ని వీడియోలు ప్రసారం చేశారు. రోడ్లపై వరుసగా ఉన్న పిల్లల మృతదేహాలు, ఆస్పత్రుల్లో ఆక్సిజన్ చికిత్స పొందుతున్న చిన్నారులు ఈ దృశ్యాల్లో కనిపించారు. బాధితులకు మసీదుల్లో, స్కూళ్లలో చికిత్స చేస్తున్నామని ఘాజ్వాన్ విదనీ అనే వైద్యుడు తెలిపాడు. రసాయనిక ప్రభావానికి విరుగుడు మందైన ఏట్రోపైన్ తగినంత స్థాయితో తమ వద్ద లేదన్నారు. కాగా, దేశ సమస్యకు రాజకీయ పరిష్కారం లభిస్తుందన్న ఆశలకు ఈ దాడితో గండి కొట్టారని విపక్ష కూటమి నేత జార్జి సబ్రా వ్యాఖ్యానించారు. సిరియాలో రసాయన ఆయుధాలు ఉన్నాయో లేవో తేల్చడానికి ఐరాస నిపుణుల బృందం ఆదివారం సిరియాకు వచ్చిన నేపథ్యంలో ఈ దాడి ఉదంతం చోటుచోసుకోవడం గమనార్హం. దాడి జరగలేదు: ప్రభుత్వం రసాయనిక దాడి వార్తలు పచ్చి అబద్ధమని ప్రభుత్వం తెలిపింది. రసాయనిక ఆయుధాలు ఉన్నాయో లేవో తనిఖీ చేయడానికి వచ్చిన ఐక్యరాజ్య సమితి బృంద కార్యకలాపాలకు ఆటంకం కలిగించడానికే ఈ వార్తలను ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. దర్యాప్తు జరపాలి: ప్రపంచ దేశాల డిమాండ్.. సిరియాలో రసాయనిక దాడి జరిగిందన్న వార్తలపై ప్రపంచ దేశాల నుంచి మిశ్రమ స్పందన లభించింది. కొన్ని దాడిని ఖండించగా, కొన్ని ఈ వార్తల వెనుక కుట్ర ఉందన్నాయి. దాడి జరిగి ఉంటే అది ఆమోదయోగ్యం కాదని, దీనిపై వెంటనే దర్యాప్తు జరపాలని యూరోపియన్ యూనియన్(ఈయూ) డిమాండ్ చేసింది. మారణ కాండపై స్పందించి, పరిస్థితి మరింత దిగజారకుండా చూడాలని ఐక్యరాజ్య సమితి, ఈయూలకు సౌదీ అరేబియా విజ్ఞప్తి చేసింది. దాడి వార్తల సంగతిని ఐరాస భద్రతా మండలి దృష్టికి తీసుకెళ్తామని బ్రిటన్ తెలిపింది. ఐరాస తనిఖీ బృందం సంఘటన ప్రాంతానికి వెళ్లి వాస్తవాలేమిటో తెలుసుకోవాలని అరబ్ లీగ్‌తోపాటు జర్మనీ, స్వీడన్, అమెరికా, ఫ్రాన్స్ తదితర దేశాలు కోరాయి. కాగా, సిరియా విపక్ష ఆరోపణలు రెచ్చగొట్టేలా ఉన్నాయని, పథకం ప్రకారమే ప్రచారంలోకి తెచ్చారని సిరియా సర్కారుకు మద్దతిస్తున్న రష్యా ఆరోపించింది. ఐరాస తనిఖీ బృందం సిరియాకు రాగానే ఈ ఆరోపణలు చేయడం అనుమానాలు రేకెత్తిస్తోందని పేర్కొంది. మరోపక్క.. పరిస్థితిపై చర్చించేందుకు భద్రతా మండలి బుధవారం రాత్రి అత్యవసరంగా సమావేశమైంది. సిరియాలో ప్రభుత్వం కానీ, రెబెల్స్ కానీ రసాయన దాడులు జరపడం ఆమోదయోగ్యం కాదని ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్‌కీ మూన్ అన్నారు.