మాస్కో/వాషింగ్టన్: సిరియా సంక్షోభానికి పరిష్కారం దిశగా కీలక పరిణామం చోటు చేసుకుంది. మిత్రదేశమైన రష్యా ప్రతిపాదన ప్రకారం, తమ రసాయనిక ఆయుధాలను అంతర్జాతీయ సమాజ నియంత్రణలోకి తెచ్చేందుకు సిరియా అంగీకరించింది. తమపై అమెరికా దూకుడును తిప్పికొట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంగళవారం ప్రకటించింది. రసాయనిక ఆయుధాలను అప్పగిస్తే సిరియాపై దాడిని నిలిపివేస్తామని అమెరికా అధ్యక్షుడు ఒబామా చెప్పిన కొన్ని గంటల్లోనే సిరియా ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఆయుధాల అంశంపై మంగళవారం రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌తో జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయని సిరియా విదేశాంగ మంత్రి వాలిద్ అల్ మోలెమ్ మాస్కోలో చెప్పారు.