సంపాదకీయం: ప్రయత్నించాలే గానీ ఏదీ అసాధ్యం కాదు. ‘చేరి మూర్ఖుని మనసు రంజింప రాద’ని భర్తృహరి హితబోధ చేసినా, ఆశ ఉంటుంది గనుక మానవ ప్రయత్నం ఎప్పుడూ ఆగిపోదు. సిరియాపై యుద్ధానికి దిగడం ఆ దేశ ప్రజలకుగానీ, అమెరికాకుగానీ ఉపయోగపడదని ప్రపంచ దేశాలన్నీ చేసిన హెచ్చరికలు అగ్రరాజ్యంలో విజ్ఞత కలిగించినట్టున్నాయి. రష్యా చొరవ ఫలించి యుద్ధానికి తాత్కాలికంగా బ్రేకుపడింది. సిరియాలో ఉన్నాయంటున్న రసాయన ఆయుధాల నిల్వలను నియంత్రణలోకి తీసుకుని ధ్వంసంచేస్తానని రష్యా ఇచ్చిన హామీకి అంగీకరిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు ఒబామా ప్రకటించారు. సంక్షోభం అంచుల్లో ఉన్న ప్రపంచ ఆర్ధిక వ్యవస్థకు ఈ పరిణామంతో కాస్తంత ఊరట లభించింది. గత రెండున్నరేళ్లుగా సిరియా అంతర్యుద్ధంతో అట్టుడుకుతోంది. పట్టణాలూ, పల్లెలూ రణక్షేత్రాలుగా మారాయి. ప్రభుత్వ దళాలు, తిరుగుబాటు దళాలు పరస్పరం కలహించుకుంటూ ఊళ్లన్నిటినీ వల్లకాళ్లుగా మారుస్తున్నారు. సిరియా వర్తమాన స్థితికి అధ్యక్షుడు బషర్ అల్ అసద్ బాధ్యత ఎంత ఉన్నదో పాశ్చాత్య దేశాల బాధ్యతా అంతే ఉంది. అరబ్ ప్రపంచాన్ని కుదిపేసిన ప్రజాస్వామ్య ఉద్యమం సెగ మిగిలిన దేశాల్లాగే సిరియానూ తాకినా అది త్వరలోనే చేయి దాటిపోవడానికి పూర్తి బాధ్యత పశ్చిమ దేశాలదే. సిరియాలో లభ్యమయ్యే నాణ్యమైన చమురుపై కన్నేసిన పాశ్చాత్య ప్రపంచం ఈ సాకుగా ఆ దేశానికి పొరుగునున్న టర్కీ, ఖతార్, సౌదీ అరేబియాలద్వారా తిరుగుబాటుదారులను సాయుధం చేసింది. అందులో అల్- కాయిదా అనుకూల వర్గాలు కూడా చేరాయని తెలిసినా తన చేష్టలను మానలేదు.
గత నెల 21న సిరియా రాజధాని డమాస్కస్‌లో జరిగిన రసాయన ఆయుధ ప్రయోగం తర్వాత వందలమంది మరణించడంతో ఎప్పటినుంచో సిరియాపై కాలుదువ్వుతున్న అమెరికాకు సాకు దొరికింది. ఒకపక్క ఆ దాడికి బాధ్యులెవరో, ఏ తరహా రసాయనాన్ని ప్రయోగించారో తేల్చడానికి ఐక్యరాజ్యసమితి బృందం ప్రయత్నిస్తుంటే ఇదే అదునుగా యుద్ధ ప్రకటన చేయడానికి అమెరికా తహతహ లాడిపోయింది. అసద్ వద్ద వెయ్యి టన్నుల రసాయన ఆయుధాలు పోగుపడి ఉన్నాయని, అవన్నీ దేశంలోని 50 పట్టణాల్లో నేలమాళిగల్లో ఉంచారని ప్రకటించింది. ఇందులో నిజమెంతో, కానిదెంతో తేల్చాల్సింది అంతర్జాతీయంగా అందరూ అంగీకరించిన సంస్థలే తప్ప అమెరికా కాదు. అయినా, అలాంటి సంస్థలతో తనకు సంబంధం లేదన్నట్టు ప్రవర్తించింది. ఈ యుద్ధంలో పాలు పంచుకునేందుకు బ్రిటన్ పార్లమెంటు అంగీకరించకపోవడం, ఫ్రాన్స్ పార్లమెంటు సైతం అదే తోవలో వెళ్లవచ్చన్న అభిప్రాయం వ్యక్తం కావడంతో అమెరికా ముందుకు కదల్లేకపోయింది. రష్యాలో ఈమధ్యే ముగిసిన జీ-20 దేశాల సమావేశం కూడా ఆచి తూచి అడుగేయమని అమెరికాకు నచ్చజెప్పింది.
వీటన్నిటి వెనకా ఉన్నది ఒకే కారణం... ఆర్ధికంగా ఉన్న గడ్డు పరిస్థితులు. ఇరాక్‌పై సాగించిన దురాక్రమణ యుద్ధం పర్యవసానంగా పుట్టి విస్తరించిన ఆర్ధిక మాంద్యం దెబ్బకు కుదేలైన ప్రపంచ దేశాలు మరో సంక్షోభానికి సిద్ధంగా లేవు. ఎవరిదాకానో అవసరం లేదు... అమెరికా ప్రజలే సిరియాపై యుద్ధసన్నాహాలు చూసి వణికారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్టు కనబడుతున్న ఆర్ధిక వ్యవస్థ మళ్లీ చితికి పోతుందేమోనని భయపడ్డారు. రోజులు గడుస్తున్నకొద్దీ అమెరికన్ కాంగ్రెస్‌లో యుద్ధ ప్రతిపాదనకు చిక్కులు ఏర్పడవచ్చన్న సందేహం ఒబామాకు కలిగింది. తన మేకపోతు గాంభీర్యానికి భంగం కలగకుండా ఈ సమస్యనుంచి బయట పడటం ఎలాగా అని ఆయన ఆలోచిస్తున్నవేళ రష్యా చొరవ తీసుకుని జరిపిన దౌత్యం ఆయనకు అందివచ్చింది. ఇప్పుడు అమెరికా బెదిరించిందని కాదు... మా మిత్ర దేశం ఒప్పించింది గనుక రసాయన ఆయుధాలను అప్పగించేందుకు అంగీకరించామని అధ్యక్షుడు అసద్ చెబుతున్నారు.
ఆ ఆయుధాలను నాశనం చేయించే పూచీనాదని రష్యా హామీపడింది. యుద్ధానికి దిగుతామని బెదిరించి ఎవరినీ లొంగదీయలేరని, అంతర్జాతీయంగా అందరూ ఆమోదించిన రాజకీయ, దౌత్య మార్గాల్లో పరిష్కారం వెదకాలని రష్యా అంటున్నది. రష్యాకు సిరియాపై ఇంత ప్రేమ ఉండటానికి కారణాలున్నాయి. మధ్యధరా సముద్రంలో రష్యాకున్న ఏకైక నావికాదళ స్థావరం సిరియాలోనే ఉంది. పైగా, రష్యానుంచి భారీయెత్తున ఆయుధాలు కొంటూ అందుకు ప్రతిగా నాణ్యమైన ముడి చమురు సరఫరా చేస్తున్న దేశం సిరియా. ప్రపంచ ఆర్ధికవ్యవస్థకు చమురే ప్రాణంగా మారిన వర్త మాన స్థితిలో అలాంటి ప్రయోజనాలను వదులుకోవడానికి రష్యా సిద్ధంగా లేదు.
అసలు సిరియాలో ఉన్న రసాయన ఆయుధాలపై ఇంతగా బెంగటిల్లుతున్న అమెరికా ఆ పొరుగున ఇజ్రాయెల్ వద్దనున్న అదే బాపతు ఆయుధాల గురించి ఒక్క మాట మాట్లాడదు. 1993లో అంతర్జాతీయ రసాయన ఆయుధాల ఒప్పందంపై సంతకం చేసినా దాన్ని పార్లమెంటు ముందుకు తెచ్చి ఆమోదం పొందని దేశం ఇజ్రాయెల్. ఇంకా చెప్పాలంటే అమెరికా, రష్యాలవద్ద సైతం రసాయన ఆయుధాల గుట్టలున్నాయి. వాటిని ధ్వంసం చేయడానికి గడువు మీద గడువు కోరుతూ కాలక్షేపం చేసిన ఆ రెండు దేశాలూ తుది గడువు 2012ను కూడా దాటబెట్టేశాయి. నిజానికి అమెరికా తదితర దేశాలవద్దనున్న సంప్రదాయిక ఆయుధాలు ఈ రసాయన ఆయుధాలకంటే అత్యంత ప్రమాదకరమైనవి. వాటన్నిటినీ ధ్వంసించకుండా సిరియా వల్లే ప్రపంచానికి ఏదో పెను ముప్పు సంభవించబోతున్నదన్న అభిప్రాయం కలిగించడానికి ప్రయత్నించడం నయ వంచన. ఇప్పటికైతే, యుద్ధ భయం తాత్కాలికంగా తొలగిందిగానీ, ఈ నయ వంచన బట్టబయలై, అందరికీ సమానంగా వర్తించే నియమనిబంధనలు రూపొందినప్పుడే ప్రపంచం సురక్షితంగా ఉండగలుగుతుంది. అంతవరకూ ఏ ఒప్పందాలైనా తీసుకొచ్చేది తాత్కాలిక శాంతిని మాత్రమే.
తాత్కాలిక శాంతి!
Published Fri, Sep 13 2013 12:28 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement