ఎటు చూసినా మృతదేహాలే | Mass grave found near Syria capital | Sakshi
Sakshi News home page

ఎటు చూసినా మృతదేహాలే

Dec 19 2024 6:31 AM | Updated on Dec 19 2024 6:31 AM

Mass grave found near Syria capital

సిరియా తిరుగుబాటుదారులపై చిత్రహింసలు 

డమాస్కస్, కుతైఫాల్లో సామూహిక ఖననాలు 

వెలుగులోకి బషర్‌ అసద్‌ సర్కారు అకృత్యాలు 

డమాస్కస్‌: ఎక్కడ చూసినా శవాల కుప్పలు. రాజధాని డమాస్కస్‌తోపాటు కుతైఫా, ఆద్రా, హుస్సేనియాల తదితర ప్రాంతాల్లో సామూహిక సమాధులు! సిరియాలో ఇటీవల కుప్పకూలిన అసద్‌ ప్రభుత్వం అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తిరుగుబాటుదారులను బంధించి జైళ్లలో చిత్రహింసలు పెట్టడమే గాక దారుణంగా హతమార్చినట్టు తేలింది. అలా అదృశ్యమైనవారి మృతదేహాలు ఎక్కడపడితే అక్కడ బయటపడుతున్నాయి. సిరియా అంతటా సామూహిక సమాధులేనన్న వార్తల నేపథ్యంలో సిరియన్‌ ఎమర్జెన్సీ టాస్‌్కఫోర్స్‌ (ఈటీఎఫ్‌) అనే అమెరికాకు చెందిన స్వచ్ఛంద సంస్థ ఇటీవల దేశంలో పర్యటించింది. దాని పరిశీలనలో దిగ్భ్రాంతి కలిగించే విషయాలు బయటికొచ్చాయి... 

లక్షల మంది గల్లంతు 
సిరియాలో తిరుగువాబాటు చేసిన వారందరినీ బషర్‌ అల్‌ అసద్‌ ప్రభుత్వం నిర్బంధించింది. జైళ్లలో పెట్టి చిత్ర హింసలకు గురి చేసింది. ఆ క్రమంలో వేలాది మంది గల్లంతయ్యారు. వారి ఆచూకీ ఎవరికీ తెలియలేదు. అలా 2011 నుంచి ఇప్పటివరకు ఏకంగా లక్ష మందికి పైగా అదృశ్యమయ్యారు. 2014లో కనపించకుండా పోయిన సోదరుడి కోసం ఓ మహిళ, 2013లో అరెస్టయిన కుమారుడి కోసం ఓ తండ్రి ఇప్పటికీ వెదుకుతూనే ఉన్నారు. హయత్‌ తహ్రీర్‌ అల్‌షామ్‌ (హెచ్‌టీఎస్‌) తిరుగుబాటు సంస్థ దేశాన్ని హస్తగతం చేసుకోవడం, అసద్‌ రష్యాకు పారిపోవడం తెలిసిందే. అనంతరం సిరియా రక్షణ దళం వైట్‌హెల్మెట్స్‌తో కలిసి హెచ్‌టీఎస్‌ సిరియా అంతటా జైళ్లు, నిర్బంధ కేంద్రాలను తెరిచింది. అసద్‌ హయాంలో నిర్బంధించిన వేలాది మందిని విడుదల చేసింది. ఆ తర్వాత ఆచూకీ లేకుండాపోయిన తమ ఆత్మీయులకోసం అనేకమంది జైళ్ల చుట్టూ తిరుగుతున్నారు. 

వారేమైనట్టు? 
తిరుగుబాటుదారులను చిత్రహింసలు పెట్టి చంపాక అసద్‌ సర్కారు సామూహికంగా ఖననం చేసింది. అవన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అలా ఇప్పటికే ఏకంగా లక్షకు పైగా మృతదేహాలను కనుగొన్నారు! సామూహిక సమాధులున్న మరో 66 ప్రాంతాలనూ గుర్తించారు. డమాస్కస్‌ వాయవ్యంగా ఉన్న కుతైఫా పట్టణంలో వేలాది మృతదేహాలను వేర్వేరు చోట్ల సామూహికంగా ఖననం చేసినట్లు ఈటీఎఫ్‌ తెలిపింది. డమాస్కస్‌ విమానాశ్రయ మార్గంలో హుస్సేనియేయాలోనూ సామూహిక సమాధులు బయటపడ్డాయి. దక్షిణ సిరియాలో పన్నెండు సామూహిక సమాధులు కనుగొన్నారు. సిరియాలో గల్లంతైన వారిలో 80,000 మందికి పైగా చనిపోయినట్టు హక్కుల సంఘం ఇప్పటికే తేలి్చంది. 60,000 మందిని చిత్రహింసలకు గురిచేసి చంపినట్లు బ్రిటన్‌కు చెందిన వార్‌ మానిటర్‌ సిరియన్‌ అబ్జర్వేటరీ ఫర్‌ హ్యూమన్‌ రైట్స్‌ (ఎస్‌ఓహెచ్‌ఆర్‌) తెలిపింది. 

గుర్తించలేని స్థితిలో శవాలు 
ఖననం చేసి చాలాకాలం కావడంతో చాలావరకు శవాల అవశేషాలే మిగిలాయి. దాంతో మృతులనుగుర్తించడం కష్టంగా మారింది. చేసేది లేక పుర్రెలు, ఎముకలనే భద్రపరుస్తున్నారు. డీఎన్‌ఏ నమూనాల డాక్యుమెంటేషన్, తదుపరి విశ్లేషణ కోసం బ్లాక్‌ బాడీ బ్యాగుల్లో విడిగా ఉంచుతున్నారు. హత్యకు గురైన వారిని మున్ముందైనా గుర్తించగలమని ఈటీఎఫ్‌ ఆశాభావం వెలిబుచి్చంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement