కుటుంబ పాలనలో.. ఆ పాలకుల నియంతృత్వ పోకడలతో యాభై ఏళ్లుగా చిధ్రమైంది సిరియా. దశాబ్దంపైగా సాగిన అంతర్యుద్ధం ఆ నేలపై ఐదు లక్షల మందిని పొట్టనపెట్టుకోగా.. 13 లక్షల మందిని దేశం విడిచిపోయేలా చేసింది. చివరకు తిరుగుబాటుదారులు పైచేయి సాధించడంతో నియంతాధ్యక్షుడు బషర్ అల్ అసద్ దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది. దీంతో.. 2024 డిసెంబర్ 8న సిరియా స్వేచ్ఛా వాయువుల్ని పీల్చింది. కానీ..
సిరియాలో చీకట్లు తొలగినా.. ఇంకా తెలవారలేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అసద్ పలాయనం తర్వాత ఊహించిందే జరుగుతోంది. ప్రజా జీవనం అస్తవ్యస్థంగా మారిపోయింది. అలాగే సైన్యం, భద్రతా బలగాలు వెనక్కి తగ్గడం.. శాంతిభద్రతలు పూర్తిగా పట్టు తప్పాయి. చాలాచోట్ల దోపిడీల్లాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రజాస్వామ్యయుతంగా ప్రభుత్వం ఏర్పడడం అక్కడ ఇప్పట్లో కుదరని పని. పోనీ.. ఆపద్ధర్మ ప్రభుత్వమైనా ఏర్పడాలన్నా కొత్త తలనొప్పి వచ్చిపడింది!.
నా కేబినెట్‌లో పని చేసినవాళ్లంతా రెబల్స్‌కు సన్నిహితులే. కాబట్టి సిరియాలో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకైనా ఎక్కువ సమయం పట్టకపోవచ్చు.
-ప్రధాని ముహమ్మద్ అల్ జలీల్రాజధాని డమాస్కస్ సహా ప్రధాన నగరాలు మా ఆధీనంలోకి వచ్చాయి. సిరియాలో కొత్త ప్రభుత్వం కొలువుదీరడానికి ఎక్కువ టైం పట్టకపోవచ్చు. మేం ఎలాంటి ఆటంకాలు కలిగించబోం.
-రెబల్స్ గ్రూప్స్సిరియాలో ప్రజాస్వామ్యయుత ప్రభుత్వ ఏర్పాటుకు మా పూర్తి మద్ధతు తప్పక ఉంటుంది.
- విపక్షాల కూటమిసిరియాలో ప్రభుత్వ ఏర్పాటునకు ప్రజలు మాత్రమే కాదు.. ఆయుధం పట్టి పోరాడిన వాళ్ల మద్దతు కూడా ముఖ్యమే!
-హెచ్‌టీఎస్ గ్రూప్ నేత డిమ మౌస్సా
పైన ప్రకటనలన్నీ ప్రభుత్వ సానుకూలంగానే కనిపిస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో ఆధిపత్య పోరులో అవి తలమునకలైపోయాయి. ప్రభుత్వ ఏర్పాటునకు ప్రభుత్వాలు ముమ్మరం చేశామని, చర్చలు జరుపుతున్నామని చెప్పిన రెబల్ గ్రూప్ హెచ్‌టీఎస్.. ఇంకోపక్క యుద్ధాన్ని మాత్రం కొనసాగిస్తోంది. తూర్పు సిరియాలోనే అతిపెద్ద పట్టణమైన దెయిర్ అల్ జౌర్‌పై పట్టుకోసం దాని మిత్రపక్షాలతో తీవ్రంగా యత్నిస్తోంది. ఇంకోవైపు సిరియన్ డెమోక్రటిక్ ఫోర్సెస్ స్వాధీనంలో ఉన్న అలెప్పోపై.. టర్కీ మద్దతుతో సిరియన్ నేషనల్ ఆర్మీ విరుచుకుపడుతోంది. ఇంకా కొన్ని రెబల్ గ్రూప్స్.. పలు ప్రాంతాల్ని తమ ఆధీనంలోకి తీసుకునేందుకు యత్నిస్తున్నాయి. ఇవికాకుండా..
ఇదీ చదవండి: అసద్ పీఠాన్ని కూలదోసిన పిల్ల చేష్టలు!
సిరియాలో ఆయుధ కారాగారాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ తన దాడులను ఉధృతం చేసింది. ముఖ్యంగా రసాయనిక ఆయుధాలు హెజ్‌బొల్లాలాంటి ప్రమాదకరమైన ఉగ్రవాద సంస్థల చేతుల్లోకి వెళ్లకూడదనే ఉద్దేశంతో తాము దాడుల్ని కొనసాగిస్తున్నామని ప్రకటించుకుంది. ఈ దాడుల్లో ఇజ్రాయెల్‌కు అమెరికా కూడా సహాకారం అందిస్తోంది.
మరోవైపు.. ఈ పరిణామాలను ఉగ్ర సంస్థలు తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశమూ లేకపోలేదు. ఇప్పటికే రెబల్స్‌లో కొన్నింటికి వీటి మద్దతు ఉంది. హెచ్‌టీఎస్ లాంటి సంస్థ మూలాలు ఆల్‌ఖైదా నుంచే ఉన్నాయి. పైగా ఒకప్పుడు అలావైట్, సున్నీల మధ్య చిచ్చులో జిహాదీ గ్రూపులు చలి కాచుకున్న చరిత్ర ఉండనే ఉంది. ఇప్పుడు రాజకీయ సంక్షోభం తలెత్తితే గనుక ఆ గ్రూపులు మరింత బలపడొచ్చు.
ప్రస్తుతానికి.. సిరియాలో అధికారాన్ని చేపట్టేందుకు అసలు ప్రతిపక్షమే లేదు. అంతర్యుద్ధం ముగిసిపోయిందనడానికి అస్సలు వీల్లేదు. తిరుగుబాటు గ్రూపుల మధ్య విభేదాలు, అంతర్గత పోరు నడుస్తోంది. వీటికి తోడు విదేశీ జోక్యం ఈ సమస్యను మరింత జఠిలంగా మార్చే అవకాశమూ లేకపోలేదు. కాబట్టి.. వీలైనంత త్వరగా అధికార శూన్యత భర్తీ జరిగి.. దేశం వెలుతురు దిశగా పయనించాలని సిరియా ప్రజానీకం బలంగా కోరుకుంటోంది.
Comments
Please login to add a commentAdd a comment