అసద్‌ పాలన అంతం | Syrian Rebels Say They Have Encircled Capital Damascus | Sakshi
Sakshi News home page

అసద్‌ పాలన అంతం

Published Sun, Dec 8 2024 7:33 AM | Last Updated on Mon, Dec 9 2024 4:34 AM

Syrian Rebels Say They Have Encircled Capital Damascus

తిరుగుబాటుదారుల చేతుల్లోకి సిరియా

విదేశం పారిపోయిన నిరంకుశ పాలకుడు బషర్‌ అల్‌ అసద్‌

దేశానికి స్వేచ్ఛ ప్రసాదించినట్లు ప్రకటించిన రెబల్స్‌

రాజధాని డమాస్కస్‌లో సంబరాలు చేసుకున్న ప్రజలు

అధికార మార్పిడికి సిద్ధమన్న ప్రధాని ఘాజీ జలానీ

డమాస్కస్‌/బీరూట్‌: అర్ధ శతాబ్దానికిపైగా అసద్‌ కుటుంబ అరాచక, నిరంకుశ పాలనలో, అంతర్యుద్ధంతో అణచివేతకు, వెనకబాటుకు గురైన పశ్చిమాసియా దేశం సిరియా చరిత్రలో కీలక పరిణామం సంభవించింది. ఒక్కో నగరాన్ని, ప్రాంతాన్ని ఆక్రమించుకుంటూ వస్తున్న తిరుగుబాటుదారులు ఆదివారం దేశ రాజధాని డమాస్కస్‌లో కాలుమోపి అసద్‌ పాలనకు తెరదించారు. అధ్యక్షుడుసహా భద్రతా బలగాలు దేశాన్ని విడిచి పారిపోవడంతో ఇక సిరియాకు స్వేచ్ఛ లభించిందని తిరుగుబాటుదారులు ప్రకటించారు. 

అధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌ ఉక్కుపిడికిలి కింద నలిగిపోయిన ప్రజలు ఆయన పాలన అంతమైందని తెల్సి వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. భద్రతా బలగాలు వదిలివెళ్లిన తుపాకులు టీనేజర్లు తీసుకుని గాల్లోకి కాల్పులు జరిపి హర్షాతిరేకాలు వ్యక్తంచేశారు. అన్యాయంగా ఏళ్ల తరబడి కారాగారాల్లో చీకటి కొట్టాల్లో మగ్గిపోయిన అమాయకులందరినీ సయ్యద్‌నాయా జైలు నుంచి విడిపించినట్లు తిరుగుబాటుదారులు ప్రభుత్వ టెలివిజన్‌ ఛానెల్‌లో అధికారికంగా ప్రకటించారు. 

రక్షణశాఖ కార్యాలయం ఉన్న ప్రఖ్యాత ఉమాయద్‌ స్కే్కర్‌ వద్దకు చేరుకుని జనం మూడు నక్షత్రాలు, త్రివర్ణ సిరియా విప్లవ జెండాలను ఎగరేశారు. మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ‘‘ ఇడ్లిబ్‌ నుంచి మొదలెట్టి డమాస్కస్‌ సిటీదాకా రావడానికి తిరుగుబాటు సింహాలకు ఎంతోకాలం పట్టలేదు. మా ఆనందాన్ని మాటల్లో వర్ణించలేం’’ అని స్థానికులు ఆనందంతో చెప్పారు. దేశాధ్యక్షుడు, సైనిక కాపలాలేని అధ్యక్ష కార్యాలయం, అసద్‌ కుటుంబ నివాసాల్లోకి జనం చొరబడి అక్కడి విలువైన వస్తువులు, నిత్యావసర సరకులు ఎత్తుకెళ్లారు.

 దేశం రెబెల్స్‌ చేతుల్లోకి వెళ్లడంపై దేశ ప్రధాని మొహహ్మెద్‌ ఘాజీ అల్‌ జలానీ స్పందించారు. ‘‘ అధ్యక్షుడు పారిపోయారు. నేనెక్కడికీ పారిపోలేదు. నా సొంతింట్లోనే ఉన్నా. అధికారంలోకి రాబోతున్న విపక్షాలు, తిరుగుబాటుదారులకు ఇదే నా ఆహ్వానం. అధికార మార్పిడికి సిద్ధం. ప్రజలు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసంచేయడం, లూటీచేయడం మానుకోవాలి’’ అని ప్రధాని ఘాజీ జలానీ వీడియో సందేశంలో ప్రకటించారు. 

నిరంకుశ పాలన ముగిందని తెలిసి గత 14 ఏళ్లుగా తుర్కియే, జోర్డాన్, లెబనాన్‌ దేశాల్లో తలదాచుకుంటున్న సిరియన్లు చాలా మంది మళ్లీ స్వదేశానికి తిరుగు పయనమయ్యారు. ఇడ్లిబ్‌ వద్ద జాతీయరహదారి వద్ద క్యూ కట్టిన కార్లతో ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. లెబనాన్‌లోని మస్కా బోర్డర్‌ గుండా సిరియన్లు లోపలికి వస్తున్నారు. ‘‘ బషర్‌ పాలనతో పోలిస్తే ఇకపై సిరియాలో పరిస్థితి చాలా ఆశాజనకంగా ఉండొచ్చు. అందుకే స్వదేశం వెళ్తున్నాం’’ అని హమా నుంచి శరణార్థిగా లెబనాన్‌కు వచ్చిన సమీ అబ్దెల్‌ లతీఫ్‌ చెప్పారు.

మెరుపువేగంతో ఆక్రమణ
2018 ఏడాది తర్వాత తిరుగుబాటుదారులు మళ్లీ డమాస్కస్‌ దాకా రాలేకపోయారు. కానీ నవంబర్‌ 27 నుంచి విపక్షాల దన్నుతో రెబల్స్‌ మెరుపువేగంతో ముందుకు కదిలారు. సొంత యుద్ధాల్లో బిజీగా ఉన్న ఇరాన్, రష్యాల నుంచి అసద్‌ సైన్యానికి ఎలాంటి ఆయుధ, సైనిక సాయం లేకపోవడంతో తిరుగుబాటుదారులకు ఎదురే లేకుండాపోయింది. అలెప్పో, హమా, హోమ్స్‌ మొదలు సిరియా దక్షిణప్రాంతాన్నంతా ఆక్రమించిన రెబెల్స్‌ వడివడిగా రాజధాని డమాస్కస్‌ వైపుగా కదిలి విజయపతాకం ఎగరేశారు. 

హయత్‌ తహ్రీర్‌ అల్‌–షామ్‌(హెచ్‌టీఎస్‌) గ్రూప్‌ నేతృత్వంలో ఈ తిరుగుబాటుదారులు అసద్‌ సైన్యంతో పోరాడి యావత్‌ దేశాన్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నారు.  2017 నుంచే వాయవ్య సిరియా మొత్తాన్ని పాలిస్తున్న హెచ్‌టీఎస్‌ గ్రూప్‌ ఇప్పుడు యావత్‌సిరియాను సురక్షిత దేశంగా ఏ విధంగా పాలిస్తుందో వేచిచూడాల్సిందే. 

అంతర్యుద్ధాన్ని రూపుమాపి, అమెరికా ఆంక్షలను తట్టుకుని దేశాన్ని ముందుకు నడిపించాల్సి ఉంది. అంతర్జాతీయ సమాజంతోపాటు, మైనారిటీల మెప్పు పొందేందుకు బహుళత్వాన్ని, పరమత సహనాన్ని సాధించేందుకు హెచ్‌టీఎస్‌ అధినేత అబూ మొహమ్మెద్‌ గోలానీ ఏ మేరకు సిద్ధపడతారోనని పశ్చిమాసియా దేశాలు ఎదురుచూస్తున్నాయి.

 ‘‘తక్షణం జెనీవాలో చర్చలు మొదలెట్టి కొత్త ప్రభుత్వానికి అంతర్జాతీయ గుర్తింపు, సాధారణ రాజకీయ, అధికార మార్పిడి ప్రక్రియకు శ్రీకారం చుట్టాలి’’ అని ఐరాసలో సిరియా రాయబారి గెయిర్‌ పెడర్‌సన్‌ కోరారు. సిరియాలో అసద్‌పాలన అంతమైన నేపథ్యంలో ప్రాంతీయ భద్రతపై ఇరాన్, ఈజిప్ట్, సౌదీ అరేబియా, జోర్డాన్, రష్యా, తుర్కియే, ఖతార్‌ దేశాల విదేశాంగ మంత్రులు అత్యవసరంగా సమావేశమై తాజా పరిస్థితిపై చర్చించారు.  

అదును చూసి ఆక్రమించిన ఇజ్రాయెల్‌
సిరియాతో సరిహద్దును పంచుకుంటున్న ఇజ్రాయెల్‌ ఈ పరిణామాన్ని తనకు అనువుగా మార్చుకుంటోంది. 1974లో కుదిరిన ఒప్పందాన్ని కాలరాస్తూ గోలన్‌హైట్స్‌ సమీప నిస్సైనికీకరణ(బఫర్‌జోన్‌) ప్రాంతాన్ని ఇజ్రాయెల్‌ సేనలు ఆక్రమించాయి. యుద్ధం సందర్భంగా 1967 జూన్‌లో సిరియా నుంచి గోలన్‌హైట్స్‌ ప్రాంతాన్ని ఇజ్రాయెల్‌ ఆక్రమించిన విషయం విదితమే. దేశం తమ స్వాధీనంలోకి వచ్చిన నేపథ్యంలో తన పేరును అహ్మద్‌ అల్‌షారాగా గోలానీ మార్చుకున్నారు. తొలిసారిగా డమాస్కస్‌లోని ఉమయ్యాద్‌ మసీదుకు వచ్చి అందరి సమక్షంలో ప్రసంగించారు.

 ‘‘ ప్రభుత్వ సంస్థల వద్ద కాల్పులు జరపకండి. అధికార మార్పిడి జరిగేదాకా ప్రభుత్వ కార్యాలయాలన్నీ ప్రధాని ఘాజీ జలానీ సారథ్యంలోనే పనిచేస్తాయి’’ అని చెప్పారు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం ఆపేందుకు సోమవారం ఉదయం దాకా డమాస్కస్‌లో కర్ఫ్యూ విధించారు. ‘‘ సిరియా ఇప్పుడు అందరికీ. డ్రూజ్‌లు, సున్నీలు, అల్లవీట్, మైనారిటీలందరికీ సమాన హక్కులుంటాయి’’ అని రెబల్‌ కమాండర్‌ అనాస్‌ సల్ఖాదీ ప్రకటించారు. రెబల్స్‌కు మద్దతు తెలుపుతున్నట్లు ఆదివారం యెమెన్‌ ప్రకటించింది. జర్మనీ, ఫ్రాన్స్‌సహా చాలా యూరోపియన్‌ దేశాలు అసద్‌ పాలన అంతంపై హర్షంవ్యక్తంచేశాయి. 

సురక్షితంగా భారతీయులు 
న్యూఢిల్లీ: అసద్‌ ప్రభుత్వం కూలిపోయి సిరియా తిరుగుబాటుదారుల చేతుల్లోకి వెళ్లినాసరే అక్కడి భారతీయులు క్షేమంగానే ఉన్నారని భారత సర్కార్‌ ఆదివారం స్పష్టంచేసింది. డమాస్కస్‌లో భారత రాయబార కార్యాలయం యథాతథంగా పనిచేస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అక్కడి భారతీయులతో ఇండియన్‌ ఎంబసీ సంప్రతింపులు జరుపుతోందని, అంతా సురక్షితంగా ఉన్నారని ఆయా వర్గాలు వెల్లడించాయి.

రష్యాలో అసద్‌ ?
మిత్రదేశాలు ఇరాన్, రష్యాల నుంచి సైనికసాయం అందక, సొంత సైన్యంతో తిరుగుబాటుదారులను ఎదుర్కొనే సామర్థ్యంలేక అధ్యక్షుడు అసద్‌ దేశాన్ని వీడారు. రష్యా తయారీ ఇలూషిన్‌–ఐఎల్‌76 రకం సిరియా ఎయిర్‌ఫ్లైట్‌ నంబర్‌ 9218 విమానంలో ఆదివారం తెల్లవారుజామునే అసద్‌ దేశం వదిలి పారిపోయారని సిరియా స్థానిక మీడియాలో వార్తలొచ్చాయి. అసద్‌ రష్యా లేదా ఇరాన్‌కు పారిపోయి ఉంటారని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. అయితే అసద్‌కు, ఆయన కుటుంబానికి రష్యా ఆశ్రయం కల్పించినట్లు ఆదివారం రాత్రి వార్తలు వెలువడ్డాయి. ఆయన మాస్కో చేరుకున్నట్లు తెలిపాయి.

 అసద్‌ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన ఉన్నతాధికారుల జాడ కూడా తెలీడంలేదు. సైన్యాధికారులు ఇరాక్‌ వెళ్లినట్లు తెలుస్తోంది. దేశం విడిచివెళ్లడానికి ముందే అసద్‌.. తిరుగుబాటుదారులతో హడావిడిగా చర్చలు జరిపి శాంతియుతంగా అధికార మార్పిడిపై తగు సూచనలు చేసి వెళ్లారని రష్యా విదేశాంగ శాఖ ఆదివారం ప్రకటించింది. ఇంకా తమ సైనిక స్థావరం సిరియాలోనే కొనసాగుతుందని రష్యా స్పష్టంచేసింది. రష్యా ముఖం చాటేయడంతోనే అసద్‌ పారిపోయాడని కాబోయే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వ్యాఖ్యానించారు.

సుస్థిర శాంతి సాధ్యమా?
ఇన్నాళ్లూ అసద్‌ ఏలుబడిలో యావత్‌ సిరియా లేదని వాస్తవ పరిస్థితులు స్పష్టంచేస్తున్నాయి. 14 రాష్ట్రాలకుగాను కేవలం మూడు రాష్ట్రాల్లోనే అసద్‌ పాలన కొనసాగుతోంది. మిగతా చోట్ల వేర్వేరు తిరుగుబాటుదారుల కూటములు, మిలిటెంట్‌ ముఠాలు పాలిస్తున్నాయి. తక్కువ ప్రాంతానికి పరిమితమైనాసరే ఇరాన్, రష్యాల ప్రత్యక్ష సహకారం ఉండబట్టి అసద్‌ పరిపాలిస్తున్న ప్రాంతానికి మాత్రమే అంతర్జాతీయ గుర్తింపు లభిస్తోందని తెలుస్తోంది. కొన్ని ప్రాంతాలను తుర్కియే దన్నుతో ‘సిరియన్‌ నేషనల్‌ ఆర్మీ’ పాలిస్తోంది. అమెరికా నుంచి సాయం పొందుతున్న కుర్ద్‌ల బలగాలు కొన్నిచోట్ల పాలిస్తున్నాయి. ఐసిస్‌ ఉగ్రసంస్థ కొంత ప్రాంతాన్ని ఏలుతోంది. హెచ్‌టీఎస్‌ తిరుగుబాటుదారులు, విపక్షాల ఫైటర్లు ఇంకొన్ని ప్రాంతాలను తమ అధీనంలో ఉంచుకున్నారు. గోలన్‌హైట్స్‌సహా కొంతభాగాన్ని దశాబ్దాల క్రితమే ఇజ్రాయెల్‌ ఆక్రమించుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement