రష్యాలో నివసించడంపై ఆస్మా అసంతృప్తి
మాస్కో: పదవీచ్యుత సిరియా అధ్యక్షుడు బషర్ అల్–అసద్ భార్య ఆస్మా(49) విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. రష్యాను వీడి వెళ్లేందుకు ప్రత్యేక అనుమతి ఇవ్వాలని కూడా ఆమె అభ్యర్థించారు. ఆమె దరఖాస్తును మాస్కోలోని న్యాయస్థానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ నెలారంభంలో తిరుగుబాటుదార్లు అసద్ ప్రభుత్వాన్ని కూలదోయడం, అధ్యక్షుడు రష్యాకు కుటుంబం సహా పలాయనం కావడం తెలిసిందే.
రష్యా ప్రభుత్వం ఆ కుటుంబానికి ఆశ్రయం కల్పించింది. అయితే, వారిపై పలు ఆంక్షలను విధించింది. అసద్, ఆయన కుటుంబీకులను మాస్కో వీడి వెళ్లరాదని, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనరాదని కట్టడి చేసింది. అసద్ తమ వద్ద దాచిన 270 కిలోల బంగారం, సుమారు రూ.17 వేల కోట్ల ధనంతోపాటు, మాస్కోలోని 18 అపార్టుమెంట్లు తదితర ఆస్తులను రష్యా ప్రభుత్వం స్తంభింపజేసినట్లు చెబుతున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఆస్మా అల్–అసద్ రష్యాలో ఉండేందుకు అంగీకరించడం లేదని, పుట్టి పెరిగిన లండన్ వెళ్లేందుకే మొగ్గు చూపుతున్నారని సమాచారం. సిరియన్ల కుటుంబంలో లండన్‌లో జన్మించిన ఆస్మా అక్కడే చదువుకున్నారు. 25 ఏళ్ల వయస్సులో 2000వ సంవత్సరంలో సిరియా వెళ్లారు. అదే ఏడాది అసద్‌తో ఆమె వివాహమైంది. ఆమెకు ద్వంద పౌరసత్వం ఉంది. ఇలా ఉండగా, అసద్ సోదరుడు మహెర్ అల్–అసద్ అతడి కుటుంబానికి రష్యా అధికారికంగా ఆశ్రయం కల్పించలేదు. ఆయన దరఖాస్తు పరిశీలనలో ఉందని చెబుతున్నారు. మహెర్ కుటుంబాన్ని గృహ నిర్బంధంలో ఉంచి, ఆస్తుల్ని స్తంభింపజేసినట్లు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment