restrictiions
-
కోటక్ బ్యాంక్‌కు ఆర్బీఐ షాక్..
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ కోటక్ మహీంద్రా బ్యాంక్‌కు రిజర్వ్ బ్యాంక్ షాకిచ్చింది. ఆన్లైన్, మొబైల్ బ్యాంకింగ్ మాధ్యమాల ద్వారా కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దని ఆదేశించింది. అలాగే కొత్త క్రెడిట్ కార్డులను జారీ చేయకుండా ఆంక్షలు విధించింది. ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయి. బ్యాంకు ఐటీ రిస్క్ మేనేజ్మెంట్లో ‘తీవ్రమైన లోపాలు’ బయటపడటం ఇందుకు కారణమని ఆర్బీఐ పేర్కొంది.అయితే, క్రెడిట్ కార్డు కస్టమర్లు సహా ప్రస్తుతమున్న ఖాతాదారులందరికీ బ్యాంకు యథాప్రకారం సేవలు అందించడాన్ని కొనసాగించవచ్చని తెలిపింది. మే 4న కోటక్ మహీంద్రా బ్యాంకు ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్న నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. బ్యాంకు ఎక్స్టర్నల్ ఆడిట్‌ను నిర్వహించి, అందులో బయటపడే సమస్యలను, తాము గు ర్తించిన లోపాలను పరిష్కరిస్తే ఆంక్షలను సమీక్షిస్తామని ఆర్బీఐ పేర్కొంది. పదే పదే సాంకేతిక అంతరాయాలు తలెత్తుతున్న కారణంగా 2020 డిసెంబర్లో హెచ్డీఎఫ్సీ బ్యాంకుపై కూడా ఆర్బీఐ దాదాపు ఇదే తరహా ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఐటీ సంబంధ తనిఖీలో కీలకాంశాలు2022, 2023 సంవత్సరాల్లో నిర్వహించిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధ తనిఖీల్లో తీవ్ర ఆందోళనకరమైన అంశాలను గుర్తించినట్లు రిజర్వ్ బ్యాంక్ పేర్కొంది. ‘ఐటీ ఇన్వెంటరీ నిర్వహణ, యూజర్ యాక్సెస్ మేనేజ్మెంట్, వెండార్ రిస్క్ మేనేజ్మెంట్, డేటా సెక్యూరిటీ వంటి అంశాల్లో తీవ్రమైన లోపాలు, నిబంధనలను పాటించకపోవడం మొదలైన వాటిని గుర్తించాం‘ అని వివరించింది. వాటిని సమగ్రంగా, సకాలంలో పరిష్కరించడంలో బ్యాంకు నిరంతరం వైఫల్యం చెందుతున్న కారణంగా తాజా చర్యలు తీసుకోవాల్సి వచి్చందని ఆర్బీఐ తెలిపింది. పటిష్టమైన ఐటీ మౌలిక సదుపాయాలు, రిస్క్ మేనేజ్మెంట్ వ్యవస్థ లేకపోవడం వల్ల కోర్ బ్యాంకింగ్ సిస్టం (సీబీఎస్), ఆన్లైన్ .. డిజిటల్ బ్యాంకింగ్ మాధ్యమాలు గత రెండేళ్లుగా తరచూ మొరాయిస్తూ, కస్టమర్లను తీవ్ర అసౌకర్యానికి గురి చేస్తున్నాయని వివరించింది. ఈ ఏడాది ఏప్రిల్ 15న కూడా ఇదే తరహా ఘటన చోటు చేసుకున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలోనే కస్టమర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బ్యాంకుకు సంబంధించిన నిర్దిష్ట వ్యాపార విభాగాలపై ఆంక్షలు విధించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. -
న్యూ ఇయర్ వేడుకలపై నిషేధం
సాక్షి, గచ్చిబౌలి (హైదరాబాద్): న్యూ ఇయర్ వేడుకలపై నిషేధం ఉందని సైబరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. డిసెంబర్ 31న పబ్‌లు, బార్లు, హోటళ్లు, రిసార్ట్లు నిర్దేశించిన సమయానికే మూసేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కోవిడ్ నేపథ్యంలో ఎలాంటి వేడుకలు నిర్వహించొద్దని తెలిపారు. ఎవరైనా వేడుకలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ‘గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్ల లోనూ న్యూ ఇయర్ వేడుకల నిర్వహణకు అనుమతి లేదు. ఎవరైనా వేడుకలు నిర్వహిస్తే ఫిర్యాదు చేయాలి. బార్లు, పబ్‌లు, ఈవెంట్ల పేరిట సింగర్స్, డ్యాన్సర్లకు అనుమతి లేదు. ఎవరైనా ఈవెంట్ల పేరిట టికెట్లు విక్రయించినా, ఆన్లైన్లో పెట్టినా డయల్ 100, వాట్సాప్ కాల్‌కు ఫిర్యాదు చేయాలి. బార్లు, పబ్‌లు, స్టార్ హోటళ్లు, రిసార్ట్‌లపై నిఘా ఉంటుంది. ఎక్కడికక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్‌లు నిర్వహిస్తాం’అని ఆయన తెలిపారు. కాగా నగరంలో నిషేధానికి సంబంధించి ప్రభుత్వ ఆదేశాల కోసం వేచి చూస్తున్నామని సిటీ కమిషనర్ అంజనీకుమార్ వెల్లడించారు. ఇక డ్రంక్ అండ్ డ్రైవ్‌లు మాత్రం నగరవ్యాప్తంగా విస్తృతంగా చేపడుతున్నారు. -
క్రిస్మస్ వేడుకలపై కఠిన ఆంక్షలు
లండన్: ఇంగ్లాండ్ ప్రజల ఆశలపై బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ నీళ్లు చల్లారు. క్రిస్మస్ వేడుకలపై కఠినమైన ఆంక్షలు విధించారు. బంధు మిత్రులతో కలిసి పండుగ ఘనంగా జరుపుకోవాలని లక్షలాది మంది ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. కరోనా వైరస్‌లో కొత్త రకం(వేరియెంట్) విజృంభిస్తున్న నేపథ్యంలో రాజధాని లండన్‌తో సహా పశ్చిమ, ఆగ్నేయ ఇంగ్లాండ్‌లో క్రిస్మస్ వేడుకలపై కొత్త టైర్–4 స్థాయి ఆంక్షలు విధిస్తున్నట్లు బోరిస్ జాన్సన్ శనివారం ప్రకటించారు. ఇవి ఆదివారం ఉదయం నుంచే అమల్లోకి వస్తాయన్నారు. ప్రధానమంత్రిగా దేశ ప్రజల రక్షణ తన బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజల భావోద్వేగాలు తనకు తెలుసని, అయినప్పటికీ భారమైన హృదయంతో ఆంక్షలు విధించాల్సి వస్తోందన్నారు. ► ఇంగ్లాండ్‌లో టైర్–4 ప్రాంతంలో ఉన్నవారు క్రిస్మస్ రోజున సొంత ఇంట్లో మినహా బయట ఎక్కడా ఎవరినీ కలవడానికి వీల్లేదు. ఇంట్లో ఒంటరిగా ఉన్న వారికి మినహాయింపు లభిస్తుంది. ఇతర దినాల్లో విద్య, వైద్యం కోసం బయటకు వెళ్లడానికి అనుమతి ఉంటుంది. ► టైర్–4 ప్రాంతాలు మినహా దేశవ్యాప్తంగా డిసెంబర్ 23 నుంచి 27వ తేదీ వరకు కరోనా ఆంక్షల్లో ఇచ్చిన సడలింపులను ప్రభుత్వం రద్దు చేసింది. కేవలం డిసెంబర్ 25న మాత్రమే ఈ సడలింపులు అమల్లో ఉంటాయి. ► టైర్–4 ప్రాంతాల్లో ఆదివారం ఉదయం నుంచి వ్యాయామశాలలు, సెలూన్లు, అత్యవసరం కాని దుకాణాలు మూసివేయాలి. ∙ఆగ్నేయ ఇంగ్లాండ్‌లోని టైర్–3 ప్రాంతాల్లో టైర్–4 ఆంక్షలను అమలు చేస్తారు. కెంట్, బకింగ్హమ్షైర్, బెర్క్‌షైర్, సుర్రే(వేవెర్లీ మినహా), గోస్పోర్ట్, హావెంట్, పోర్ట్స్మౌత్, రోథర్, హేస్టింగ్స్‌లో టైర్–4 ఆంక్షలు ఉంటాయి. ► లండన్ నగరంతోపాటు పశ్చిమ ఇంగ్లాండ్‌లోని బెడ్ఫోర్డ్, సెంట్రల్ బెడ్ఫోర్డ్, మిల్టన్ కీనెస్, లూటన్, పీటర్‌బరో, హెర్ట్‌ఫోర్డ్‌షైర్, ఎసెక్స్(కోలచెస్టర్, అటిల్స్ఫోర్డ్, టెండ్రింగ్ మినహా)లో టైర్–4 ఆంక్షలు అమలవుతాయి. ► యునైటెడ్ కింగ్డమ్(యూకే)లో అంతర్భాగమైన వేల్స్‌లోనూ క్రిస్మస్ సంబరాలపై ఆంక్షలు విధించారు. ఇవి శనివారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. డిసెంబర్ 23 నుంచి 28వ తేదీ వరకు ఇచ్చిన సడలింపులను కేవలం డిసెంబర్ 25వ తేదీకే పరిమితం చేశారు. -
విషాదం నుంచి విహారం వైపు..
బీజింగ్: చైనా తన 71వ ప్రజా రిపబ్లిక్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఎనిమిది రోజుల అధికారిక సెలవు దినాలు ప్రకటించింది. జాతీయ సెలవుదినాలతో పాటు ఈ యేడాది శరద్రుతువులో వచ్చే పండుగ కలిసి రావడంతో దేశవ్యాప్తంగా ప్రజలు కోవిడ్ సంక్షోభం తరువాత, విహార యాత్రలకు సిద్ధమౌతున్నారు. చైనాలో జాతీయ సెలవుదినాలు, ప్రయాణాలపై ఆంక్షలు సడలించడంతో భారీ సంఖ్యలో వివిధ ప్రాంతాలకు ప్రజలు తరలివెళుతున్నట్టు టూర్ ఆపరేటర్లు తెలిపారు. అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు కొనసాగుతుం డడంతో, దేశీయ ప్రయాణాలకు, బంధువులను కలిసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారని వారు తెలిపారు. దేశీయ విమాన ప్రయాణాలు 1.5 కోట్లకు చేరవచ్చునని, ఇది గత యేడాదితో పోల్చుకుంటే పది శాతం అధికమని హాంకాంగ్ కేంద్రంగా వెలువడే సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపింది. టికెట్ల బుక్కింగ్ వెబ్సైట్ ‘‘కునార్’’ ప్రారంభించిన కొద్ది సేపటికే టిక్కెట్లన్నీ పూర్తిగా అయిపోయాయని ఆ పత్రిక తెలిపింది. హై స్పీడ్ రైళ్ళల్లో కూడా సీట్లన్నీ రిజర్వు అయిపోయాయని జిన్హువా వార్తా సంస్థ వెల్లడించింది. కోవిడ్ నుంచి కోలుకుంటోన్న చైనా ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతామని ధీమా వ్యక్తం చేసింది. -
పాక్‌లోనే దావూద్..!
ఇస్లామాబాద్: పూటకో మాట మార్చే తన బుద్ధిని పాకిస్తాన్ మరోసారి బయట పెట్టుకుంది. అండర్ వరల్డ్ డాన్, ముంబై పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం తమ గడ్డ మీదే ఉన్నాడని చెప్పినట్టుగానే చెప్పి యూ టర్న్ తీసుకుంది. దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్‌లోనే ఉన్నాడని ఎప్పట్నుంచో భారత్ చేస్తున్న వాదనలు నిజమేనని తొలిసారిగా ఆ దేశ మీడియా వెల్లడించింది. దావూద్ పాక్ గడ్డ మీదే ఉన్నాడని మీడియా కథనాల ద్వారా అయినా అంగీకరించడం ఇదే మొదటిసారి. పాక్ ప్రభుత్వం ఆంక్షలు విధించిన నిషిద్ధ 88 ఉగ్రవాద సంస్థలు, వారి నాయకుల జాబితాను శనివారం వెల్లడించింది. అందులో భారత్ మోస్ట్ వాంటెడ్ నేరగాడు దావూద్ ఇబ్రహీం పేరు కూడా ఉంది. తమ దేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థలు, వ్యక్తులపైనే ఆంక్షలు ఉంటాయి కాబట్టి దావూద్ పాక్‌లోనే ఉన్నాడని అంగీకరించినట్లే. కానీ ఎప్పటి మాదిరిగానే పాక్ కుటిల బుద్ధిని బయటపెట్టుకుంటూ దావూద్ తమ గడ్డ మీద లేడని పాత పాటే పాడుతోంది. మీడియా కథనాలు నిరాధారమైనవీ, తప్పుదోవ పట్టించేలా ఉన్నాయంటూ పాక్ విదేశాంగ శాఖ పేర్కొంది. ఐక్యరాజ్యసమితి నిబంధనల ప్రకారమే ఉగ్ర సంస్థలపై ఆంక్షలు విధించామని, ఇది సాధారణ ప్రక్రియనేనని తెలిపింది. గ్రే లిస్ట్ నుంచి బయటపడడానికే.. ఉగ్రవాద సంస్థల్ని పెంచి పోషిస్తున్నందుకుగాను ఫ్రాన్సు రాజధాని పారిస్ కేంద్రంగా పనిచేస్తున్న ఫైనాన్షియల్ యాక్షన్ టాక్స్‌ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) సంస్థ పాకిస్తాన్‌ను 2018 జూన్‌లో గ్రే లిస్ట్‌లో ఉంచింది. 2019 చివరికల్లా ఉగ్రవాద నిర్మూలనకు కృషి చేయాలని గడువు విధించింది. ఆ తర్వాత కరోనా సంక్షోభంతో గడువు పెంచింది. 2020 జూన్ నాటికి కూడా పాక్ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో గ్రే లిస్టులోనే కొనసాగించాలని నిర్ణయించింది. గ్రే లిస్ట్‌లో ఉంటే అంతర్జాతీయంగా ఎలాంటి ఆర్థిక సాయం పాక్‌కి అందదు. దీంతో గ్రే లిస్ట్ నుంచి బయటపడడానికి పాకిస్తాన్ శుక్రవారం హఫీజ్ సయీద్, మసూద్ అజర్, దావూద్ ఇబ్రహీంతో పాటుగా 88 ఉగ్ర సంస్థలు, వాటి నాయకుల ఆస్తులు, బ్యాంకు అకౌంట్లు జప్తు చేస్తూ ఆదేశాలు జారీ చేసినట్టుగా ది న్యూస్ కథనం వెల్లడించింది. జమాత్ ఉద్ దవా, జైషే మహమ్మద్, తాలిబన్, అల్‌ఖైదా, హక్కానీ గ్రూప్ వంటి సంస్థల అన్ని రకాల ఆర్థిక లావాదేవీలపై ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసినట్టుగా ఆ కథనం పేర్కొంది. 1993 ముంబై పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీంను అప్పగించాల్సిందిగా అప్పగించాల్సిందిగా భారత్ ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తోంది. ó∙కరాచీలోనే తలదాచుకున్నాడని ఆధారాలను బయట పెట్టినా తమ వద్ద లేడని బుకాయిస్తూ వస్తోంది. -
చైనాపై మరిన్ని ఆంక్షలు: అమెరికా
వాషింగ్టన్: చైనాపై ఒత్తిడిని మరింత పెంచాలని అమెరికా యోచిస్తోంది. డ్రాగన్ దేశంపై మరిన్ని ఆంక్షలు విధించాలని భావిస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి, అమెరికాలో ఆ వైరస్ మృత్యుహేల నేపథ్యంలో ఇప్పటికే చైనాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మండిపడ్తున్న విషయం తెలిసిందే. హాంకాంగ్‌లో కొత్త జాతీయ భద్రత చట్టం, వీఘర్ ముస్లింలపై వేధింపులు, టిబెట్‌లో భద్రతాపరమైన ఆంక్షలు.. మొదలైన వాటి విషయంలో అమెరికా ఆగ్రహంగా ఉంది. ‘ప్రసిడెంట్ ట్రంప్‌ను కాదని నేను ముందే చెప్పలేను. కానీ చైనాపై అమెరికా తీసుకోనున్న చర్చల గురించి మీరు త్వరలోనే వింటారు’ అని వైట్ హౌజ్ ప్రెస్ సెక్రటరీ కేలీ మెక్ఎనానీ బుధవారం మీడియాతో వ్యాఖ్యానించారు. కొత్త వీసా రూల్స్‌తో కష్టాలే నూతన వీసా నిబంధనల వల్ల అమెరికాలోని భారతీయ విద్యార్థులు ఇబ్బందులను, అనిశ్చితిని ఎదుర్కొంటారని యూఎస్‌లోని భారత దౌత్యాధికారి పేర్కొన్నారు. యూఎస్‌లోని యూనివర్సిటీలు, కాలేజీలు తమ విద్యా సంవత్సర ప్రణాళికలను ఇంకా ప్రకటించని ప్రస్తుత పరిస్థితుల్లో జారీ అయిన ఈ నిబంధనలు భారతీయ విద్యార్థులను మరింత అనిశ్చితిలోకి, మరిన్ని కష్టాల్లోకి తీసుకువెళ్తాయని భారతీయ రాయబార కార్యాలయ అధికార ప్రతినిధి తెలిపారు. ఈ విషయాన్ని భారత ప్రభుత్వం సంబంధిత అమెరికా అధికారుల దృష్టికి తీసుకువెళ్లిందన్నారు. భారత్, అమెరికా ప్రజల మధ్య సంబంధాల విషయంలో ఉన్నతవిద్యలో భాగస్వామ్యం అత్యంత కీలకమైన అంశమన్నారు. పూర్తిగా ఆన్లైన్ క్లాస్‌లకు మారిన విద్యాసంస్థల్లో చదువుతున్న విదేశీ విద్యార్ధులు స్వదేశాలకు వెళ్లాల్సిందేనని అమెరికా ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిబంధనలతో ఎక్కువగా నష్టపోయేవారిలో భారతీయ విద్యార్థులే అధికం. -
‘హెచ్1’ దెబ్బ అమెరికాకే..!
న్యూఢిల్లీ: టెక్నాలజీ నిపుణులకు వీసాలివ్వటంపై మరిన్ని పరిమితులు విధిస్తే అమెరికన్ కంపెనీలకే ప్రతికూలమవుతుందని దేశీ ఐటీ పరిశ్రమల సమాఖ్య నాస్కామ్ వ్యాఖ్యానించింది. ఈ వీసాలపై విదేశీ నిపుణులను నియమించుకునే అమెరికన్ కంపెనీలు సరైన వారు దొరక్క బలహీనంగా మారతాయని, ఉద్యోగాలకు ముప్పు తప్పదని పేర్కొంది. వివాదాస్పద హెచ్–1బీ వీసాలు అత్యధికంగా భారతీయులకే దక్కుతుండటం వారి ప్రతిభకు తార్కాణమని, వీటిలో చాలా మటుకు వీసాలను అంతర్జాతీయ, అమెరికన్ బహుళజాతి దిగ్గజాలు స్పాన్సర్ చేస్తున్నాయని నాస్కామ్ తెలియజేసింది. విదేశీ కంపెనీలు డేటాను తమ దేశంలోనే భద్రపర్చాలంటూ ఒత్తిడి చేసే దేశాలకు ఇచ్చే హెచ్–1బీ వీసాలపై 10–15 శాతం మేర పరిమితి విధించే అంశాన్ని అమెరికా పరిశీలిస్తోందంటూ వార్తలొచ్చిన నేపథ్యంలో నాస్కామ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ అంశంపై ఇప్పటిదాకా అమెరికా ప్రభుత్వం నుంచి అధికారికంగా ధృవీకరణ ఏదీ రాలేదని, అధికారులిచ్చే స్పష్టమైన వివరణ కోసం ఎదురు చూస్తున్నామని నాస్కామ్ తెలిపింది. ఒకవేళ ఇలాంటిదేమైనా అమలు చేసిన పక్షంలో ప్రధానంగా ఉత్తర అమెరికా మార్కెట్ నుంచే భారీగా ఆదాయాలు పొందుతున్న 150 బిలియన్ డాలర్ల భారతీయ ఐటీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడనుంది. సాధారణంగా భారతీయ ఐటీ సంస్థలు అత్యధికంగా హెచ్–1బీ వీసాలపైనే తమ ఉద్యోగులను అమెరికాలోని క్లయింట్ లొకేషన్స్‌కు పంపిస్తుంటాయి. అయితే, ఇటీవలి కాలంలో వీసాల పరిశీలన చాలా కఠినతరంగా మారడంతో దేశీ ఐటీ సంస్థలు అమెరికాలోని స్థానికులనే ఎక్కువగా రిక్రూట్ చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. ‘ఒకవేళ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉద్యోగులను రిక్రూట్ చేసుకోవడాన్ని అమెరికా విధానాలు కఠినతరం చేసిన పక్షంలో దాని వల్ల.. వారిపై ఆధారపడి ఉన్న అమెరికా కంపెనీలే బలహీనపడతాయి. ఆయా సర్వీసులను మళ్లీ విదేశాల నుంచి పొందాల్సి వస్తుంది’ అని నాస్కామ్ ఒక ప్రకటనలో తెలిపింది. పరిమితులపై ఇంకా సమాచారం రాలేదు: కేంద్ర వాణిజ్య శాఖ డేటా లోకలైజేషన్ నిబంధనలు అమలు చేసే దేశాలకిచ్చే హెచ్–1బీ వీసాలపై పరిమితులు విధించే విషయంపై అమెరికా నుంచి అధికారికంగా ఎలాంటి సమాచారం రాలేదని కేంద్ర వాణిజ్య శాఖ వర్గాలు తెలిపాయి. చెల్లింపుల సేవలు అందించే పేమెంట్ సర్వీసుల సంస్థలు భారతీయ వినియోగదారుల డేటాను భారత్‌లోనే ఉంచాలంటూ కేంద్రం గతేడాది ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే, ఇలాంటి నిబంధనలనే వ్యతిరేకిస్తూ.. తాజాగా హెచ్–1బీ వీసాల విషయంలో భారత్ లాంటి దేశాలను అమెరికా టార్గెట్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. -
చర్చలైనా, యుద్ధమైనా సై
సింగపూర్: వాణిజ్య అంశాలపై అమెరికా, చైనాల మధ్య పోరు మరింత రసవత్తరంగా మారుతోంది. ఈ విషయంలో అమెరికాతో చర్చలకైనా, యుద్ధానికైనా తాము సిద్ధంగా ఉన్నామని చైనా స్పష్టం చేసింది. చర్చలకు ఇప్పటికీ తాము సిద్ధమేనని, కానీ ఒకవేళ అమెరికా గానీ యుద్ధమే కోరుకుంటే తుదిదాకా పోరాడతామని హెచ్చరించింది. సింగపూర్‌లో ఐఐఎస్ఎస్ షాంగ్రి–లా సదస్సుకు హాజరైన సందర్భంగా చైనా రక్షణ మంత్రి జనరల్ వై ఫెంగీ ఈ విషయాలు చెప్పారు. ‘అమెరికా మొదలుపెట్టిన వాణిజ్య వివాదం విషయానికొస్తే.. అమెరికా కోరుకుంటే మేమూ చర్చలకు సిద్ధమే. కాదూ.. యుద్ధం చేయదల్చుకుంటే దానికి కూడా సిద్ధమే‘ అని ఆయన చెప్పారు. మరోవైపు, దేశభద్రత పేరిట చైనా టెలికం కంపెనీ హువావేపై అమెరికా ఆంక్షలు విధించడం అర్ధరహితమన్నారు. ఆ సంస్థ యజమాని మాజీ సైనికాధికారి అయినంత మాత్రాన అది మిలిటరీ కంపెనీ కాదని ఫెంగీ వ్యాఖ్యానించారు. 539 బిలియన్ డాలర్ల పైగా ఉన్న వాణిజ్య లోటును భర్తీ చేయాలంటూ చైనా మీద అమెరికా ఒత్తిడి తెస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 250 బిలియన్ డాలర్ల విలువ చేసే చైనా దిగుమతులపై అమెరికా ప్రభుత్వం ఇటీవలే సుంకాలు పెంచింది. ప్రతిగా చైనా కూడా 60 బిలియన్ డాలర్ల విలువ చేసే అమెరికన్ దిగుమతులపై టారిఫ్‌లు పెంచింది. ఇరు దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధాలు ప్రపంచ మార్కెట్లను కలవరపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫెంగీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆసియా–పసిఫిక్ ప్రాంత దేశాల మధ్య బంధాలు మెరుగుపర్చుకునేందుకు తీసుకోతగిన చర్యల గురించి చర్చించడం ఈ సదస్సు ప్రధానోద్దేశం. అమెరికా ఎకానమీకే నష్టం.. అమెరికా తెరతీసిన వాణిజ్య యుద్ధంతో ఆ దేశానికి ఒనగూరిందేమీ లేకపోగా.. ఆ దేశ ఎకానమీకే ఎక్కు వగా నష్టం జరుగుతోందని చైనా ప్రభుత్వం వ్యాఖ్యానించింది. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవడానికి తాము సిద్ధంగానే ఉన్నామని, అయితే సిద్ధాంతాల విషయంలో మాత్రం రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. తమ ఉత్పత్తులపై అమెరికా సుంకాలు విధించిన దరిమిలా తాజాగా విడుదల చేసిన శ్వేతపత్రంలో ఈ అంశాలు పేర్కొంది. చైనా ఉత్పత్తులపై అమెరికా టారిఫ్‌లు విధించడం వల్ల అగ్రరాజ్యంలో ఉత్పత్తి వ్యయాలు, ఉత్పత్తుల ధరలు పెరిగిపోయాయని.. ఫలితంగా ఆ దేశ ఆర్థిక వృద్ధికి ప్రమాదకరంగా మారాయని చైనా వ్యాఖ్యానించింది. -
‘ఎస్–400’పై అమెరికా కన్నెర్ర
వాషింగ్టన్: రష్యా నుంచి అత్యాధునిక ఎస్–400 క్షిపణి నిరోధక వ్యవస్థను కొనుగోలు చేయాలన్న భారత్ నిర్ణయంపై అగ్రరాజ్యం అమెరికా మరోసారి మండిపడింది. భారత్ ఈ ఒప్పందం విషయంలో ముందుకెళితే అమెరికా–ఇండియాల రక్షణ సంబంధాలపై తీవ్రమైన ప్రభావం పడుతుందని హెచ్చరించింది. ఈ విషయమై అమెరికా రక్షణశాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి మాట్లాడుతూ..‘అమెరికా నుంచి ఆయుధాల కొనుగోళ్లు పెరుగుతున్నంతకాలం రష్యా నుంచి ఎస్–400ను కొనుగోలు విషయంలో భారత్‌పై ఎలాంటి ప్రభావం ఉండదనడం సరికాదు. క్యాస్టా చట్టం ప్రకారం రష్యా నుంచి ఆయుధాల, ఇతర టెక్నాలజీని కొనుగోలు చేసే దేశాలపై ఆంక్షలు అమలవుతాయి. దీనివల్ల భారత్‌కు భవిష్యత్‌లో అత్యాధునిక సాంకేతిక సహకారం ఆగిపోతుంది. రష్యా నుంచి ఆయుధాలు కొనుగోలు చేయడం వల్ల ఆ దేశం అనుసరిస్తున్న దుందుడుకు విధానాలకు మద్దతుపలికినట్లు అవుతుంది. ఈ విషయంలో ట్రంప్ ప్రభుత్వం చాలా స్పష్టతతో ఉంది. నాటో భాగస్వామి అయిన టర్కీతో ఇదే విషయమై చర్చలు సాగుతున్నాయి. ఎస్–400 వ్యవస్థ కారణంగా అనేక ఇబ్బందులు ఉన్నాయి. మా అత్యుత్తమ టెక్నాలజీ వ్యవస్థలను రష్యన్ ఆయుధ వ్యవస్థలతో కలగాపులగం కానివ్వం’ అని స్పష్టం చేశారు. -
‘ఉచితం’పై ఆంక్షలు అనుచితం
న్యూఢిల్లీ: ఎన్నికల మేనిఫెస్టోలో ఉచిత హామీలు ఇవ్వడం తమకున్న విశేషాధికారం అని పలు రాజకీయ పార్టీలు ఉద్ఘాటించాయి. ఈ అంశంపై ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించాలనుకోవడం సరికాదని స్పష్టం చేశాయి. ఒక్క బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) మినహా మిగిలిన పెద్ద పార్టీలన్నీ కూడా ఈ అంశంలో ఒకే తాటిపై నిలిచాయి. ఎన్నికల మేనిఫెస్టోల్లో ఉచిత హామీలను నియంత్రించేందుకు మార్గదర్శకాలు రూపొందించే అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం దేశంలోని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించింది. ఐదు జాతీయ, 23 ప్రాంతీయ పార్టీలకు చెందిన ప్రతినిధులు ఈ భేటీకి హాజరై తమ అభిప్రాయాలు తెలియజేశారు. బీఎస్పీ మినహా అన్నింటిదీ ఒకటే గళం... బీఎస్పీ, మరో రెండు ప్రాంతీయ పార్టీలు మినహా మిగిలిన అన్ని పార్టీలూ ఉచిత హామీలపై ఆంక్షలను వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నాయి. ఎన్నికల మేనిఫెస్టోలపై ఎలాంటి ఆంక్షలు విధించకూడదని స్పష్టం చేశాయి. పేదల సంక్షేమం కోసం, సమాజంలో సమానత తీసుకురావడం కోసమే రాజకీయ పార్టీలు హామీలిస్తాయని కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలు వాదించాయి. తమ విజన్ ఏమిటో మేనిఫెస్టో ద్వారా తెలియజేసే హక్కు ప్రతి రాజకీయ పార్టీకి ఉంటుందని బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. సమాజంలోని వివిధ వర్గాల కోసం ఉచిత లాప్‌టాప్‌లు, ఉచిత సైకిళ్లు, ఉచిత మందులు సహా పేదలకు సహాయం చేసే పలు సంక్షేమ పథకాలు ఉన్నాయని వివరించారు. దేశం పట్ల రాజకీయ పార్టీల విజన్ ఏమిటనేది చెప్పాల్సిన బాధ్యత ఆయా పార్టీలపై ఉందని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ పార్టీల సిద్ధాంతాలు, లక్ష్యాలు, విధానాలు, పథకాలకు సంబంధించిన అంశాల్లో ఎలాంటి జోక్యాన్నీ తాము అంగీకరించబోమని సీపీఎం స్పష్టం చేసింది. ఎన్నికల కమిషన్‌తోపాటు న్యాయ వ్యవస్థకు కూడా వీటిలో జోక్యం చేసుకునే హక్కు లేదని పేర్కొంది. ఎన్నికల మేనిఫెస్టోలో హామీలు ఇవ్వడం పార్టీల ప్రాథమిక హక్కు అని సీపీఐ నేత డి.రాజా వ్యాఖ్యానించారు. ఇలా హామీ ఇవ్వడంలో ఎలాంటి తప్పూ లేదన్నారు. ఈ విషయంలో ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం సరికాదని సమాజ్‌వాదీ నేత రామ్‌గోపాల్ యాదవ్ అభిప్రాయపడ్డారు. శిరోమణి అకాలీదళ్, జేడీ(యూ), ఎన్సీపీ, ఎల్జేపీలు కూడా ఎన్నికల మేనిఫెస్టోపై మార్గదర్శకాల రూపకల్పనను వ్యతిరేకించాయి. అయితే బీఎస్పీ మాత్రం ఆయా పార్టీలతో విభేదించింది. ఎన్నికల సమయంలో ప్రకటించే ఉచిత హామీలపై నిషేధం విధించాలని డిమాండ్ చేసింది. అలాంటి హామీలు క్షేత్రస్థాయి వాతావరణాన్ని కలుషితం చేస్తాయని, తర్వాతి కాలంలో అమలు చేయని ఉచిత హామీల పట్ల ఓటర్లు మొగ్గు చూపే అవకాశం ఉందని అభిప్రాయపడింది. బీఎస్పీతోపాటు రెండు ప్రాంతీయ పార్టీలు నాగాలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్), మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్)లు ఉచిత హామీలపై నిషేధం విధించాలని డిమాండ్ చేశాయి. తమిళనాడు ప్రభుత్వం ఉచిత హామీలు గుప్పించడాన్ని సవాల్‌చేస్తూ దాఖలైన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. గతనెల 5న ఈ అంశంపై మార్గదర్శకాలు రూపొందించాలని ఎన్నికల సంఘానికి సూచించింది. ఈ నేపథ్యంలో ఈసీ ఈ సమావేశం నిర్వహించింది. మేనిఫెస్టోపై మార్గదర్శకాలు సరికాదు: టీడీపీ సాక్షి, న్యూఢిల్లీ: రాజకీయ పార్టీల మేనిఫెస్టో ఎలా ఉండాలనే అంశంపై మార్గదర్శకాలు రూపొందించడం సరికాదని టీడీపీ అభిప్రాయపడింది. టెండరు నమూనా తరహాలో మేనిఫెస్టో ఉండాలనేది ప్రజాస్వామ్య వ్యవస్థలో సాధ్యం కాదని ఆ పార్టీ నేత పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. ప్రజాలోచనలు, వాగ్దానాలను మేనిఫెస్టోలో పెట్టడం రాజకీయ పార్టీల హక్కు అని స్పష్టంచేశారు. ఈసీ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. నిర్దిష్ట వాగ్దానాలను మాత్రమే చేయాలనే తరహాలో మార్గదర్శకాలు రూపొందిం చడం సరికాదన్నారు. పార్టీలు ఇచ్చే హామీల విషయంలో సాధ్యాసాధ్యాలను ప్రజలే నిర్ణయిస్తారని, హామీలను నెరవేరుస్తారన్న నమ్మకం ఉన్న పార్టీలనే గెలిపించి అధికారంలోకి తెస్తారని చెప్పారు.