‘ఉచితం’పై ఆంక్షలు అనుచితం | Restrictions on free schemes objectionable | Sakshi
Sakshi News home page

‘ఉచితం’పై ఆంక్షలు అనుచితం

Published Tue, Aug 13 2013 3:28 AM | Last Updated on Wed, Sep 5 2018 3:24 PM

‘ఉచితం’పై ఆంక్షలు అనుచితం - Sakshi

‘ఉచితం’పై ఆంక్షలు అనుచితం

న్యూఢిల్లీ: ఎన్నికల మేనిఫెస్టోలో ఉచిత హామీలు ఇవ్వడం తమకున్న విశేషాధికారం అని పలు రాజకీయ పార్టీలు ఉద్ఘాటించాయి. ఈ అంశంపై ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించాలనుకోవడం సరికాదని స్పష్టం చేశాయి. ఒక్క బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) మినహా మిగిలిన పెద్ద పార్టీలన్నీ కూడా ఈ అంశంలో ఒకే తాటిపై నిలిచాయి. ఎన్నికల మేనిఫెస్టోల్లో ఉచిత హామీలను నియంత్రించేందుకు మార్గదర్శకాలు రూపొందించే అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం దేశంలోని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించింది. ఐదు జాతీయ, 23 ప్రాంతీయ పార్టీలకు చెందిన ప్రతినిధులు ఈ భేటీకి హాజరై తమ అభిప్రాయాలు తెలియజేశారు.
 
 బీఎస్పీ మినహా అన్నింటిదీ ఒకటే గళం...
 బీఎస్పీ, మరో రెండు ప్రాంతీయ పార్టీలు మినహా మిగిలిన అన్ని పార్టీలూ ఉచిత హామీలపై ఆంక్షలను వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నాయి. ఎన్నికల మేనిఫెస్టోలపై ఎలాంటి ఆంక్షలు విధించకూడదని స్పష్టం చేశాయి. పేదల సంక్షేమం కోసం, సమాజంలో సమానత తీసుకురావడం కోసమే రాజకీయ పార్టీలు హామీలిస్తాయని కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలు వాదించాయి. తమ విజన్ ఏమిటో మేనిఫెస్టో ద్వారా తెలియజేసే హక్కు ప్రతి రాజకీయ పార్టీకి ఉంటుందని బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు.
 
  సమాజంలోని వివిధ వర్గాల కోసం ఉచిత లాప్‌టాప్‌లు, ఉచిత సైకిళ్లు, ఉచిత మందులు సహా పేదలకు సహాయం చేసే పలు సంక్షేమ పథకాలు ఉన్నాయని వివరించారు. దేశం పట్ల రాజకీయ పార్టీల విజన్ ఏమిటనేది చెప్పాల్సిన బాధ్యత ఆయా పార్టీలపై ఉందని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ పార్టీల సిద్ధాంతాలు, లక్ష్యాలు, విధానాలు, పథకాలకు సంబంధించిన అంశాల్లో ఎలాంటి జోక్యాన్నీ తాము అంగీకరించబోమని సీపీఎం స్పష్టం చేసింది. ఎన్నికల కమిషన్‌తోపాటు న్యాయ వ్యవస్థకు కూడా వీటిలో జోక్యం చేసుకునే హక్కు లేదని పేర్కొంది. ఎన్నికల మేనిఫెస్టోలో హామీలు ఇవ్వడం పార్టీల ప్రాథమిక హక్కు అని సీపీఐ నేత డి.రాజా వ్యాఖ్యానించారు.
 
  ఇలా హామీ ఇవ్వడంలో ఎలాంటి తప్పూ లేదన్నారు. ఈ విషయంలో ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం సరికాదని సమాజ్‌వాదీ నేత రామ్‌గోపాల్ యాదవ్ అభిప్రాయపడ్డారు. శిరోమణి అకాలీదళ్, జేడీ(యూ), ఎన్సీపీ, ఎల్‌జేపీలు కూడా ఎన్నికల మేనిఫెస్టోపై మార్గదర్శకాల రూపకల్పనను వ్యతిరేకించాయి. అయితే బీఎస్పీ మాత్రం ఆయా పార్టీలతో విభేదించింది. ఎన్నికల సమయంలో ప్రకటించే ఉచిత హామీలపై నిషేధం విధించాలని డిమాండ్ చేసింది. అలాంటి హామీలు క్షేత్రస్థాయి వాతావరణాన్ని కలుషితం చేస్తాయని, తర్వాతి కాలంలో అమలు చేయని ఉచిత హామీల పట్ల ఓటర్లు మొగ్గు చూపే అవకాశం ఉందని అభిప్రాయపడింది. బీఎస్పీతోపాటు రెండు ప్రాంతీయ పార్టీలు నాగాలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (ఎన్‌పీఎఫ్), మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్‌ఎఫ్)లు ఉచిత హామీలపై నిషేధం విధించాలని డిమాండ్ చేశాయి. తమిళనాడు ప్రభుత్వం ఉచిత హామీలు గుప్పించడాన్ని సవాల్‌చేస్తూ దాఖలైన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. గతనెల 5న ఈ అంశంపై మార్గదర్శకాలు రూపొందించాలని ఎన్నికల సంఘానికి సూచించింది. ఈ నేపథ్యంలో ఈసీ ఈ సమావేశం నిర్వహించింది.
 
 మేనిఫెస్టోపై మార్గదర్శకాలు సరికాదు: టీడీపీ
 సాక్షి, న్యూఢిల్లీ: రాజకీయ పార్టీల మేనిఫెస్టో ఎలా ఉండాలనే అంశంపై మార్గదర్శకాలు రూపొందించడం సరికాదని టీడీపీ అభిప్రాయపడింది. టెండరు నమూనా తరహాలో మేనిఫెస్టో ఉండాలనేది ప్రజాస్వామ్య వ్యవస్థలో సాధ్యం కాదని ఆ పార్టీ నేత పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. ప్రజాలోచనలు, వాగ్దానాలను మేనిఫెస్టోలో పెట్టడం రాజకీయ పార్టీల హక్కు అని స్పష్టంచేశారు. ఈసీ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. నిర్దిష్ట వాగ్దానాలను మాత్రమే చేయాలనే తరహాలో మార్గదర్శకాలు రూపొందిం చడం సరికాదన్నారు. పార్టీలు ఇచ్చే హామీల విషయంలో సాధ్యాసాధ్యాలను ప్రజలే నిర్ణయిస్తారని, హామీలను నెరవేరుస్తారన్న నమ్మకం ఉన్న పార్టీలనే గెలిపించి అధికారంలోకి తెస్తారని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement