పోలింగ్‌ అవగానే కౌంటింగ్‌.. అదే బెటర్‌ | Its Better If Polling Counting Were Done On Same Day | Sakshi
Sakshi News home page

పోలింగ్‌ అవగానే కౌంటింగ్‌.. అదే బెటర్‌

Published Fri, Jan 5 2024 11:32 AM | Last Updated on Fri, Jan 5 2024 11:32 AM

Its Better If Polling Counting Were Done On Same Day - Sakshi

ఎప్పుడో దేశ జనాభా నూరు కోట్లు దాటిన ఇండియాలో సాధారణ ఎన్నికలను దశలవారీగా  నిర్వహించడం 20వ శతాబ్దం చివర్లో మొదలైంది. జనం ఓట్లేసే రోజున పోలింగ్‌ కేంద్రాల స్వాధీనం, ఇతర అక్రమాలు నివారించడానికి కొన్ని ‘సమస్యాత్మక’ పెద్ద, చిన్న రాష్ట్రాల్లో దశలవారీ ఎన్నికలు 21వ శతాబ్దంలో కూడా దేశంలో ఆనవాయితీగా మారాయి.

లోక్‌ సభ 17వ ఎన్నికలు 2019 ఏప్రిల్‌–మే మధ్య ఏడు దశల్లో జరిగాయి. ఏప్రిల్‌ 11న మొదటి దశ పోలింగ్, మే 19న చివరి ఏడో దశ పోలింగ్‌ నిర్వహించారు. ఓట్ల లెక్కింపు మే 23న పూర్తయింది. ఈ పార్లమెంటు ఎన్నికల ప్రక్రియ పూర్తవడానికి 39 రోజుల సమయం అవసరమైంది. ఉత్తర్‌ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌ వంటి రాష్ట్రాల్లో రాజకీయ వేడి, జనాభా, జనసాంద్రత ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో ఏడెనిమిది దశల్లో ఎన్నికలు నిర్వహించడం ఇటీవలి సంత్సరాల్లో చూశాం.

2021లో కేరళ, తమిళనాడుతోపాటు నిర్వహించిన పశ్చిమ బెంగాల్‌ ఎన్నికలు సుదీర్ఘకాలం జరిగిన ఎలక్షన్లుగా చరిత్రకెక్కాయి. మొత్తం 294 సీట్లలో 292కు 2021 మార్చి 27న తొలి దశ మొదలవ్వగా, ఏప్రిల్‌ 29న చివరి, ఎనిమిదో దశ ఎన్నికలు జరిగాయి. మిగిలిన రెండు స్థానాలకు కొన్ని కారణాల వల్ల ఆలస్యం చేసి సెప్టెంబర్‌ 30న నిర్వహించారు.

మొదటి 8 దశల ఎన్నికల ఓట్ల లెక్కింపు 2021 మే 2 ఉదయం ప్రారంభించి ఫలితాలు ప్రకటించారు. చివరి రెండు స్థానాల ఫలితాలు అక్టోబర్‌ 3న వెలువడ్డాయి. ఆఖరి రెండు సీట్ల విషయం పక్కనబెడితే...మొదటి దశ ఎన్నికల పోలింగ్‌ కూ, ఓట్ల లెక్కింపు తేదీకి మధ్య 36 రోజుల విరామం ఉండడం అమెరికా, ఐరోపా దేశాల ఎన్నికల విశ్లేషకులకు వింతగా కనిపిస్తుంది. అలాగే కిందటేడాది దేశంలోనే జనాభా, లోక్‌ సభ సభ్యుల సంఖ్య రీత్యా అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు ఏడు దశల్లో జరిగాయి.

మొత్తం 403 సీట్లకు ఏడు దశల పోలింగ్‌ మొదట 2022 ఫిబ్రవరి 22న, చివరి ఏడో దశ పోలింగ్‌ మార్చి 7న జరిగాయి. మొత్తం స్థానాలకు ఓట్ల లెక్కింపు మార్చి 10న పూర్తిచేసి ఫలితాలు ప్రకటించారు. అంటే, యూపీలో కిందటి శాసనసభ ఎన్నికల ప్రక్రియ పూర్తవడానికి (మొదటి దశ పోలింగ్‌ నుంచి ఓట్ల లెక్కింపు వరకూ) 34 రోజులు పట్టాయి. 

అమెరికా, బంగ్లాదేశ్‌లో పోలింగ్‌ రోజే కౌంటింగ్‌!
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో (8న పోలింగ్‌–కౌంటింగ్‌ సోదర దేశమైన పాకిస్తాన్‌ సాధారణ ఎన్నికలు జరగనుండగా, జనవరి 7న మరో భారత ఉపఖండ దేశం బంగ్లాదేశ్‌ పార్లమెంటు (సన్సద్‌) ఎన్నికలు నిర్వహిస్తున్నారు. బంగ్లాదేశ్‌ పార్లమెంటు ఎన్నికలు, ఇంకా పాకిస్తాన్, నేషనల్‌ అసెంబ్లీ, వివిధ ప్రావిన్సుల చట్టసభల ఎన్నికల పోలింగ్, ఓట్ల లెక్కంపు ఒకే రోజు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతాయి.

అమెరికాలో సైతం అధ్యక్ష ఎన్నికలు, వాటితోపాటు జరిగే ఇతర పదవులకు ఎన్నికలు ప్రతి లీప్‌ సంవత్సరం నవంబర్‌ మొదటి సోమవారం తర్వాత వచ్చే మొదటి మంగళవారం పోలింగ్‌ పూర్తయిన వెంటనే ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. సాధారణ ఎన్నికల ఓట్ల లెక్కింపు పోలింగ్‌ తర్వాత ఎప్పుడనేది ఆయా దేశాల ఎన్నికల చట్టాల నిబంధనలను బట్టి ఉంటుంది.

అయితే, ఏ దేశంలోనైనా పోలింగ్‌ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభించి వీలైనంత త్వరగా ఫలితాలు ప్రకటిస్తేనే ప్రజాస్వామ్యంపై ప్రజలకు నమ్మకం పెరుగుతుందనే అభిప్రాయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బలపడుతోంది. అదీగాక, ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల వినియోగం, ఓట్ల లెక్కింపు పద్ధతుల ఆధునికీకరణ వంటి పరిణామాల ఫలితంగా ప్రస్తుతం పోలింగ్‌ రోజే కౌంటింగ్‌ చేపట్టడం చాలా తేలిక అయింది.

ఒకే దశలో పోలింగ్‌ జరిగినప్పుడు మాత్రమే ఎన్నికల రోజే ఓట్ల లెక్కింపు మొదలుబెట్టడం సాధ్యమౌతుంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య పంథాలో నడిచే దేశాల్లో ఒకే రోజు పోలింగ్‌ జరిగే దేశాల్లో ఎన్నికలు పూర్తయిన మరు క్షణమే ఓట్ల లెక్కింపు మొదలుబెట్టే దేశాల సంఖ్య క్రమంగా పెరుగుతుంది.

పోలింగ్‌ జరిగిన వెంటనే ఓట్ల లెక్కింపు ఆరంభించపోతే ఆ తర్వాత వెలుబడే ఎన్నికల ఫలితాలపై కొందరు అనుమానాలు వ్యక్తం చేసే ప్రమాదం ఉంటుందనే మాట పాశ్చాత్య దేశాల్లో ఇప్పుడు బాగా వినబడుతోంది. అయితే, 142 కోట్ల జనాభా, దాదాపు నూరు కోట్ల ఓటర్లు ఉన్న ఇండియాలో అమెరికా, పాక్, బంగ్లాదేశ్‌లో మాదిరిగా ఓకే రోజు పోలింగ్, అదే రోజు కౌంటింగ్‌ నిర్వహించడం సాధ్యం కాదనేది తిరుగులేని వాస్తవం.

విజయసాయిరెడ్డి, రాజ్యసభ ఎంపీ, YSRCP

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement