democracy country
-
పోలింగ్ అవగానే కౌంటింగ్.. అదే బెటర్
ఎప్పుడో దేశ జనాభా నూరు కోట్లు దాటిన ఇండియాలో సాధారణ ఎన్నికలను దశలవారీగా నిర్వహించడం 20వ శతాబ్దం చివర్లో మొదలైంది. జనం ఓట్లేసే రోజున పోలింగ్ కేంద్రాల స్వాధీనం, ఇతర అక్రమాలు నివారించడానికి కొన్ని ‘సమస్యాత్మక’ పెద్ద, చిన్న రాష్ట్రాల్లో దశలవారీ ఎన్నికలు 21వ శతాబ్దంలో కూడా దేశంలో ఆనవాయితీగా మారాయి. లోక్ సభ 17వ ఎన్నికలు 2019 ఏప్రిల్–మే మధ్య ఏడు దశల్లో జరిగాయి. ఏప్రిల్ 11న మొదటి దశ పోలింగ్, మే 19న చివరి ఏడో దశ పోలింగ్ నిర్వహించారు. ఓట్ల లెక్కింపు మే 23న పూర్తయింది. ఈ పార్లమెంటు ఎన్నికల ప్రక్రియ పూర్తవడానికి 39 రోజుల సమయం అవసరమైంది. ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో రాజకీయ వేడి, జనాభా, జనసాంద్రత ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో ఏడెనిమిది దశల్లో ఎన్నికలు నిర్వహించడం ఇటీవలి సంత్సరాల్లో చూశాం. 2021లో కేరళ, తమిళనాడుతోపాటు నిర్వహించిన పశ్చిమ బెంగాల్ ఎన్నికలు సుదీర్ఘకాలం జరిగిన ఎలక్షన్లుగా చరిత్రకెక్కాయి. మొత్తం 294 సీట్లలో 292కు 2021 మార్చి 27న తొలి దశ మొదలవ్వగా, ఏప్రిల్ 29న చివరి, ఎనిమిదో దశ ఎన్నికలు జరిగాయి. మిగిలిన రెండు స్థానాలకు కొన్ని కారణాల వల్ల ఆలస్యం చేసి సెప్టెంబర్ 30న నిర్వహించారు. మొదటి 8 దశల ఎన్నికల ఓట్ల లెక్కింపు 2021 మే 2 ఉదయం ప్రారంభించి ఫలితాలు ప్రకటించారు. చివరి రెండు స్థానాల ఫలితాలు అక్టోబర్ 3న వెలువడ్డాయి. ఆఖరి రెండు సీట్ల విషయం పక్కనబెడితే...మొదటి దశ ఎన్నికల పోలింగ్ కూ, ఓట్ల లెక్కింపు తేదీకి మధ్య 36 రోజుల విరామం ఉండడం అమెరికా, ఐరోపా దేశాల ఎన్నికల విశ్లేషకులకు వింతగా కనిపిస్తుంది. అలాగే కిందటేడాది దేశంలోనే జనాభా, లోక్ సభ సభ్యుల సంఖ్య రీత్యా అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఏడు దశల్లో జరిగాయి. మొత్తం 403 సీట్లకు ఏడు దశల పోలింగ్ మొదట 2022 ఫిబ్రవరి 22న, చివరి ఏడో దశ పోలింగ్ మార్చి 7న జరిగాయి. మొత్తం స్థానాలకు ఓట్ల లెక్కింపు మార్చి 10న పూర్తిచేసి ఫలితాలు ప్రకటించారు. అంటే, యూపీలో కిందటి శాసనసభ ఎన్నికల ప్రక్రియ పూర్తవడానికి (మొదటి దశ పోలింగ్ నుంచి ఓట్ల లెక్కింపు వరకూ) 34 రోజులు పట్టాయి. అమెరికా, బంగ్లాదేశ్‌లో పోలింగ్ రోజే కౌంటింగ్! వచ్చే ఏడాది ఫిబ్రవరిలో (8న పోలింగ్–కౌంటింగ్ సోదర దేశమైన పాకిస్తాన్ సాధారణ ఎన్నికలు జరగనుండగా, జనవరి 7న మరో భారత ఉపఖండ దేశం బంగ్లాదేశ్ పార్లమెంటు (సన్సద్) ఎన్నికలు నిర్వహిస్తున్నారు. బంగ్లాదేశ్ పార్లమెంటు ఎన్నికలు, ఇంకా పాకిస్తాన్, నేషనల్ అసెంబ్లీ, వివిధ ప్రావిన్సుల చట్టసభల ఎన్నికల పోలింగ్, ఓట్ల లెక్కంపు ఒకే రోజు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతాయి. అమెరికాలో సైతం అధ్యక్ష ఎన్నికలు, వాటితోపాటు జరిగే ఇతర పదవులకు ఎన్నికలు ప్రతి లీప్ సంవత్సరం నవంబర్ మొదటి సోమవారం తర్వాత వచ్చే మొదటి మంగళవారం పోలింగ్ పూర్తయిన వెంటనే ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. సాధారణ ఎన్నికల ఓట్ల లెక్కింపు పోలింగ్ తర్వాత ఎప్పుడనేది ఆయా దేశాల ఎన్నికల చట్టాల నిబంధనలను బట్టి ఉంటుంది. అయితే, ఏ దేశంలోనైనా పోలింగ్ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభించి వీలైనంత త్వరగా ఫలితాలు ప్రకటిస్తేనే ప్రజాస్వామ్యంపై ప్రజలకు నమ్మకం పెరుగుతుందనే అభిప్రాయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బలపడుతోంది. అదీగాక, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వినియోగం, ఓట్ల లెక్కింపు పద్ధతుల ఆధునికీకరణ వంటి పరిణామాల ఫలితంగా ప్రస్తుతం పోలింగ్ రోజే కౌంటింగ్ చేపట్టడం చాలా తేలిక అయింది. ఒకే దశలో పోలింగ్ జరిగినప్పుడు మాత్రమే ఎన్నికల రోజే ఓట్ల లెక్కింపు మొదలుబెట్టడం సాధ్యమౌతుంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య పంథాలో నడిచే దేశాల్లో ఒకే రోజు పోలింగ్ జరిగే దేశాల్లో ఎన్నికలు పూర్తయిన మరు క్షణమే ఓట్ల లెక్కింపు మొదలుబెట్టే దేశాల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. పోలింగ్ జరిగిన వెంటనే ఓట్ల లెక్కింపు ఆరంభించపోతే ఆ తర్వాత వెలుబడే ఎన్నికల ఫలితాలపై కొందరు అనుమానాలు వ్యక్తం చేసే ప్రమాదం ఉంటుందనే మాట పాశ్చాత్య దేశాల్లో ఇప్పుడు బాగా వినబడుతోంది. అయితే, 142 కోట్ల జనాభా, దాదాపు నూరు కోట్ల ఓటర్లు ఉన్న ఇండియాలో అమెరికా, పాక్, బంగ్లాదేశ్‌లో మాదిరిగా ఓకే రోజు పోలింగ్, అదే రోజు కౌంటింగ్ నిర్వహించడం సాధ్యం కాదనేది తిరుగులేని వాస్తవం. విజయసాయిరెడ్డి, రాజ్యసభ ఎంపీ, YSRCP -
ప్రజాస్వామ్యంలో ఓటు కీలకం
ఆదిలాబాద్ అగ్రికల్చర్, న్యూస్‌లైన్ : ప్రజాస్వామ్యం దేశంలో ఓటు హక్కు ఎంతో కీలకమైందని, ప్రతీ ఒక్కరు ఓటుహక్కును వినియోగించుకొని మంచి ప్రజా నాయకులను ఎన్నుకొని దేశాభివృద్ధికి పాటుపడాలని జిల్లా కలెక్టర్ అహ్మద్‌బాబు అన్నారు. జాతీయ ఓటర దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జెడ్పీ సమావేశ మందిరంలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ప్రజాస్వామ్యంలో ప్రపంచంలోనే భారతదేశం మొట్టమొదటిదని తెలిపారు. జిల్లాలో రెండు నెల లుగా జిల్లా యంత్రాంగంతో పాటు ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, యువజన సం ఘాలు, మీడియా ప్రతినిధుల కృషితో 2 లక్షల పదివేల మంది నూతన ఓటర్లను నమోదు చేసినట్లు వివరించారు. గతంలో 16 లక్షల ఓటర్లు ఉండగా.. ఆ సంఖ్య ప్రస్తుతం 19 లక్షలకు చేరుకున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికీ నమోదు కాకుండా మిగిలిపోయిన వారు కూడా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు ఓటర్లుగా నమోదు చేసుకోవాలలని సూచించారు. ఓటు విలువ ఎనలేనిది : ఎస్పీ జిల్లా ఎస్పీ గజరావ్‌భూపాల్ మాట్లాడుతూ, ఓటు హక్కు ఎంతో గొప్ప ఆయుధమని, దాని విలువ ఎనలేనిదని అన్నారు. కొంతమంది దాని విలువ తెలియక వినియోగించుకోవడం లేదని, ప్రతి ఒక్కరు తప్పక ఓటు వేయాలని పేర్కొన్నారు. ప్రశాంతంగా ఎన్నికల ప్రభావా న్ని నిలబెడతామని, కుల, మతం, భాష, వర్గాలకు ప్రభావితం కాకుండా ప్రతి ఒక్కరు నిర్భయంగా ఓటు చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. వృద్ధ మహిళా ఓటర్లు అయిన లక్ష్మీబాయి(96), సుభద్ర(85)లను జిల్లా కలెక్టర్, ఎస్పీ సన్మానించారు. ఓటర్ల దినోత్సవం సందర్భంగా పది నియోజకవర్గాల్లో ఉపన్యాసాలు, డ్రాయింగ్, పెయింటింగ్, క్విజ్ పోటీలు నిర్వహించి జిల్లాస్థాయిలో గెలుపొందిన వారికి జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. జిల్లాస్థాయిలో ప్రథమ స్థానంలో గెలుపొందిన వారిని హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు పంపనున్నట్లు తెలిపారు. డీఆర్వో ఎస్ఎస్ రాజ్, డబ్ల్యూఎస్‌డీ పనసారెడ్డి, డీఎస్పీ లతామాధురి, ఏఎస్పీ సృజన, ఆర్డీఓ ఎన్. సుధాకర్‌రెడ్డి, ఎన్సీసీ బెటాలియన్ కమాండెంట్, ఇతర అధికారులు, యువజన సంఘాలు, విద్యార్థులు, ఎన్సీసీ క్యాడెట్లు పాల్గొన్నారు. ఓటు విలువను తెలుసుకో అంటూ... ఆదిలాబాద్ అగ్రికల్చర్ : ఓటు విలువను ప్రతీ ఒక్కరు తెలుసుకోవాలంటూ యువజన సంఘాలు, విద్యార్థులు, 32 ఆంధ్రప్రదేశ్ బెటాలియన్ ఎన్సీసీ క్యాడెట్లు శనివారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ అహ్మద్‌బాబు, ఎస్పీ గజరావ్‌భూపాల్ జెండా ఊపి ప్రారంభించారు. డైట్ మైదానం నుంచి ప్రారంభమైన ర్యాలీ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా జెడ్పీ కార్యాలయం వరకు చేరుకుంది. ఓటర్లుగా నమోదుకండి.. ఓటరు గుర్తింపుకార్డు పొందండి.. ఓటు విలువను తెలుసుకోండి అనే నినాదాలతో ర్యాలీ కొనసాగించారు. కలెక్టర్‌చౌక్‌లో మానవహారంగా ఏర్పడి విద్యార్థులు, ఇతర అధికారులతో జిల్లా కలెక్టర్, ఎస్పీ ఓటు హక్కు ప్రాముఖ్యతపై నినాదాలు చేయించారు. ఆర్డీవో సుధాకర్‌రెడ్డి, తహశీల్దార్ సిడాం దత్తు, ఎన్నికల పర్యవేక్షకులు ప్రభాకర్‌స్వామి, ఇతర అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.