
హరియాణాలోని హిసార్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతున్న ప్రధాని మోదీ
ప్రధాని మోదీ ధ్వజం
తెలంగాణ ప్రభుత్వం అడవులపై బుల్డోజర్లు ప్రయోగిస్తోంది
జంతువులను ప్రమాదంలో పడేసేలా వ్యవహరిస్తోంది.. ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలను విస్మరించిందన్న పీఎం
‘తెలంగాణ ప్రభుత్వం ప్రకృతిని నాశనం చేసేలా, జంతువులను ప్రమాదంలో పడేసేలా వ్యవహరిస్తోంది. అడవుల్ని ధ్వంసం చేస్తోంది. వాటిపై బుల్డోజర్లు ప్రయోగిస్తోంది..’
–ప్రధాని మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ విస్మరించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. హామీలను పక్కన పెట్టి బుల్డోజర్లను ప్రయోగించడంలో రేవంత్ సర్కార్ నిమగ్నమైందని ధ్వజమెత్తారు. మేం పర్యావరణాన్ని కాపాడుతుంటే, తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అటవీ సంపదను నాశనం చేస్తోందని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రజలు నమ్మక ద్రోహానికి గురవుతున్నారని విమర్శించారు.
తాము అభివృద్ధి ఎజెండాతో ముందుకెళుతూ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నట్లు చెప్పారు. హరియాణాలోని హిసార్‌లో ‘మహారాజ అగ్రసేన్ ఇంటర్నేషనల్’ విమానాశ్రయాన్ని ప్రధాని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన ర్యాలీలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే తెలంగాణలో ఇటీవల వివాదం రేకెత్తిన కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారాన్ని ప్రస్తావించారు.
కాంగ్రెస్ ప్రభుత్వాల విశ్వాస ఘాతుకం
హరియాణాలో మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను తాము పూర్తిగా అమలు చేస్తున్నట్లు ప్రధాని తెలిపారు. కానీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్‌లలో అక్కడి ప్రభుత్వాలు విశ్వాస ఘాతుకానికి పాల్పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తెలంగాణ ప్రభుత్వం ప్రకృతిని నాశనం చేసేలా, జంతువులను ప్రమాదంలో పడేసేలా వ్యవహరిస్తోంది. అడవుల్ని ధ్వంసం చేస్తోంది. వాటిపై బుల్డోజర్లు ప్రయోగిస్తోంది..’అని మోదీ ధ్వజమెత్తారు.
అవినీతిలో కర్ణాటకను నంబర్ వన్‌గా నిలిపారు
కాంగ్రెస్ అధికారంలో ఉన్న హిమాచల్‌నప్రదేశ్‌లోనూ అభివృద్ధి, సంక్షేమం అటకెక్కిందన్నారు. కర్ణాటకలో కరెంట్ నుంచి పాల దాకా, బస్సు చార్జీల నుంచి విత్తనాల వరకు ప్రతిదాని రేట్లు పెరిగాయని ప్రధాని మండిపడ్డారు. అక్కడి సీఎం అవినీతిలో దేశంలోనే నంబర్ వన్‌గా ఆ రాష్ట్రాన్ని నిలిపారని ఆరోపించారు. బీజేపీది అభివృద్ధి మోడల్ అయితే, కాంగ్రెస్‌ది అబద్ధాల మోడల్ అని విమర్శించారు.