Telangana: పీఎం నరేంద్ర మోదీ వర్సెస్‌ సీఎం రేవంత్‌రెడ్డి | PM Modi satires on development of Telangana and CM Revanth counter | Sakshi
Sakshi News home page

Telangana: పీఎం నరేంద్ర మోదీ వర్సెస్‌ సీఎం రేవంత్‌రెడ్డి

Published Sun, Nov 3 2024 1:19 AM | Last Updated on Sun, Nov 3 2024 7:09 AM

PM Modi satires on development of Telangana and CM Revanth counter

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం వేదికగా తెలంగాణ అభివృద్ధిపై ప్రధాని సెటైర్లు

వాగ్దానాలు ఇవ్వడం తేలికే, అమలు కష్టమని తెలిసివచ్చిందంటూ విమర్శలు 

అలవికాని హామీలు వద్దన్న ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే వ్యాఖ్యలను ఉటంకిస్తూ దాడి 

మోదీకి కౌంటర్‌ ఇచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి..  ‘ఎక్స్‌’లో సుదీర్ఘ పోస్ట్‌

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా లేని స్థాయిలో ఇక్కడ సంక్షేమం 

గత పదేళ్ల చీకట్లను వదిలించుకుని తెలంగాణ వెలిగిపోతోంది... మోదీ దురభిప్రాయాలు, వాస్తవ లోపాలపై వివరణ ఇస్తున్నట్టు వెల్లడి

తెలంగాణ అభివృద్ధి, కాంగ్రెస్‌ సర్కారు హామీల అమలు అంశం రచ్చరేపుతోంది. తెలంగాణ సహా కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఆర్థిక వ్యవస్థలు కునారిల్లుతున్నాయని మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ కామెంట్లు చేయగా... దానిపై సీఎం రేవంత్‌రెడ్డి దీటుగా స్పందించారు. ప్రధాని మోదీ ‘ఎక్స్‌’లో చేసిన పోస్టుకు కౌంటర్‌గా ‘ఎక్స్‌’లోనే సమాధానమిచ్చారు. మోదీ దురభిప్రాయాలు, ఆయన పోస్టులోని వాస్తవ లోపాలపై వివరణ ఇస్తున్నానంటూనే విమర్శలు గుప్పించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా లేనిస్థాయిలో పథకాలు అమలు చేస్తున్నామని, ఉద్యోగాలు ఇచ్చామని పేర్కొన్నారు. రాష్ట్రంలో వివిధ పథకాలు, వాటి నుంచి లబ్ధిపొందినవారి గణాంకాలను కూడా ప్రస్తావించారు. తామిచ్చిన ప్రతి వాగ్దానం పట్ల పవిత్రమైన చిత్తశుద్ధి ఉందని వ్యాఖ్యానించారు.  

మోదీ ఏమన్నారంటే?
నెరవేర్చలేని వాగ్దానాలివ్వడం తేలికేనని, అమలు మాత్రం కష్టమని కాంగ్రెస్‌ పారీ్టకి అర్థమవుతోందని విమర్శిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. నెరవేర్చలేమని తెలిసినప్పటికీ కాంగ్రెస్‌ నేతలు ప్రతి ఎన్నికల సందర్భంగా హామీలు ఇస్తున్నారని, ప్రజల ముందు దోషులుగా నిలబడుతున్నారని మండిపడ్డారు. ‘‘ప్రస్తుతం కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రాన్నయినా చూడండి. హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అభివృద్ధి తగ్గుముఖం పట్టడంతో ఆర్థిక వ్యవస్థలు కునారిల్లిపోతున్నాయి. వారిచ్చిన గ్యారంటీలు నెరవేర్చడం లేదు. ఈ రాజకీయాలకు పేదలు, యువత, రైతులు, మహిళలు బాధితులుగా మిగిలిపోతున్నారు’’ అని ప్రధాని మోదీ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.  

మోదీకి కౌంటర్‌గా రేవంత్‌ ఏమన్నారంటే?
సాక్షి, హైదరాబాద్‌: తాము అధికారంలోకి వచ్చిన 11 నెలల్లోనే పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలోని నిరాశ, నిస్పృహలను, నాటి చీకట్లను పారదోలామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఉదయపు సూర్యుడిలా వెలుగొందుతోందన్నారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ప్రజలకిచ్చిన హామీలు నెరవేరడం లేదని, ఆ రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి కునారిల్లుతోందని విమర్శిస్తూ ప్రధాని మోదీ శుక్రవారం ‘ఎక్స్‌’లో చేసిన పోస్ట్‌కు ప్రతిగా శనివారం రేవంత్‌రెడ్డి సుదీర్ఘ పోస్ట్‌ చేశారు. 

తెలంగాణలో రైతు రాజులా బతుకుతున్నాడని.. మహిళలు, యువత, విద్యార్థులకు ఉపయోగపడే కార్యక్రమాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. మూసీ పునరుజ్జీవంతోపాటు ఫ్యూచర్‌ సిటీని నిర్మిస్తున్నామని వెల్లడించారు. మోదీ పోస్ట్‌కు కౌంటర్‌గా సీఎం రేవంత్‌ చేసిన పోస్ట్‌ యథాతథంగా.. ‘‘మీ (ప్రధాని మోదీ) ప్రకటనలో నా రాష్ట్రం, ప్రభుత్వం గురించి వెలువరించిన దురభిప్రాయాలు, వాస్తవ లోపాలపై వివరణ ఇస్తున్నందుకు సంతోషంగా ఉంది. దాదాపు దశాబ్దపు బీఆర్‌ఎస్‌ దుష్పరిపాలన తర్వాత డిసెంబర్‌ 7, 2023న తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి రాష్ట్రంలో ఉత్సాహం, ఆశలు నెలకొన్నాయి. 

బాధ్యతలు తీసుకున్న రెండు రోజుల్లోనే ప్రజలకిచ్చిన రెండు హామీలను నెరవేర్చాం. తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ప్రయాణం, రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పరిధిని 10 లక్షల రూపాయలకు పెంచుతూ నిర్ణయాలు తీసుకున్నాం. గత 11 నెలల కాలంలో తెలంగాణ తల్లులు, అక్కాచెల్లెళ్లు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ప్రయాణించారు. 

101 కోట్ల ప్రయాణాల ద్వారా తెలంగాణ మహిళలు ఏడాదిలోపే రూ.3,433.36 కోట్లు లబ్ధి పొందారు. ఏడాది పూర్తిగాకముందే తెలంగాణ రైతును రాజును చేస్తూ దేశంలో ఎక్కడా లేనివిధంగా రుణమాఫీని అమలు చేశాం. ప్రస్తుతం తెలంగాణలోని 22,22,365 మంది రైతులు ఎలాంటి అప్పులు లేకుండా రాజులా బతుకుతున్నారు. రూ.2 లక్షల వరకు రైతు రుణాలను మాఫీ చేస్తూ కేవలం 25 రోజుల్లో రూ.18 వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశాం. 

మహిళలు సంతోషంగా ఉన్నారు.. 
గృహ వినియోగానికి 200 యూనిట్ల వరకు ఎలాంటి చార్జీలు లేకుండా విద్యుత్‌ సౌకర్యం పొందుతున్న మహిళల దీవెనలు మాకు అందుతున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని మహిళలు అధిక గ్యాస్‌ ధరలతో ఇబ్బందులు పడుతుండగా.. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణలో రూ.500కే సిలిండర్‌ పొందుతున్న మహిళలు సంతోషంగా ఉన్నారు. మా హయాంలో ఇప్పటివరకు 42,90,246 మంది లబ్ధిదారులకు 1.31 కోట్ల గ్యాస్‌ సిలిండర్లను డెలివరీ చేయడంతో వారంతా సంతోషంగా వంట గదుల్లోకి వెళుతున్నారు. 

50వేల మందికి ప్రభుత్వం ఉద్యోగాలిచ్చాం.. 
గత దశాబ్ద కాలంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ లేకపోవడం, పరీక్షల నిర్వహణలో వైఫల్యాలు జరిగాయి. కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీ చేపట్టాం. గ్రూప్‌–1, 2, 3, 4 వంటి అన్ని స్థాయిల్లోని పరీక్షలను సకాలంలో నిర్వహిస్తున్నాం. దేశంలోని ఏ రాష్ట్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా చేయని విధంగా 11 నెలల కాలంలో తెలంగాణలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం 50 వేల మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగాలిచ్చింది. 

గత పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో నిర్లక్ష్యానికి గురైన విద్యార్థులు ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. వారి డైట్, కాస్మెటిక్‌ చార్జీలను 40శాతం మేరకు పెంచాం. గతంలో నిర్లక్ష్యానికి గురైన మూసీ నదిని శుద్ధి చేయడంతోపాటు పునరుజ్జీవ కార్యక్రమం చేపట్టాం. మా చెరువులను కాపాడుకుంటున్నాం. గత పదేళ్లలో నిరాటంకంగా ధ్వంసమైన నాలాలు, ఇతర నీటి వనరులను సంరక్షించుకునే పనిలో ఉన్నాం. 

మేం అధికారంలోకి వచ్చాక ఒక్క చెరువు కూడా కబ్జాకు గురికాలేదు. ఫ్యూచర్‌సిటీని సృష్టిస్తున్నాం. ఇందుకు సంబంధించిన మాస్టర్‌ప్లాన్‌ తయారవుతోంది. యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ, స్పోర్ట్స్‌ వర్సిటీతోపాటు ఇంటిగ్రేటెడ్‌ గురుకులాల ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేశాం. 

మేం ప్రజలకిచ్చిన ప్రతి వాగ్దానం పట్ల మాకు పవిత్రమైన చిత్తశుద్ధి ఉంది. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో నెలకొన్న నిరాశ, నిస్పృహలను గత 11 నెలల కాలంగా తిప్పికొడుతూ ఆ పాలనా చీకట్లను పారదోలుతున్నాం. ఉదయపు సూర్యుడిలాగా తెలంగాణ ఇప్పుడు వెలుగుతోంది’’ అని సీఎం రేవంత్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement