పార్టీ ఎక్కడుందోనని కేసీఆర్ టార్చ్‌తో వెతుక్కుంటున్నారు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు
బీజేపీ నేతలు ఇతర రాష్ట్రాల్లో తమ దీనావస్థను గమనంలో ఉంచుకోవాలి
ఫిరాయింపులపై మాట్లాడుతున్న ఈటల 20 ఏళ్లు ఎక్కడున్నారు?
రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధాని, కేంద్ర హోంమంత్రిని కలిశామన్న రేవంత్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: బీఆర్‌ఎస్ గతించిన చరిత్ర అని, ఆ పార్టీకి గత చరిత్ర ఉన్నది కానీ భవిష్యత్తు లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. టార్చ్ వేసుకుని ప్రజలు రావడం కాదని, బీఆర్‌ఎస్ ఎక్కడుందో టార్చ్ వేసుకుని కేసీఆర్ వెదుక్కుంటున్నారని ఎద్దేవా చేశారు. గురువారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో భేటీ అనంతరం.. తన అధికారిక నివాసంలో డిప్యూ టీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధాని, కేంద్ర హోంమంత్రిని కలిసి పలు అంశాలపై చర్చించామన్నారు. తెలంగాణ అభివృద్ధికి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశామన్నారు. ‘రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ఎక్కడుంది? టార్చ్‌లైట్ వేసి వెతకాల్సిందే కదా.. లోక్‌సభలో బీఆర్‌ఎస్‌కు ఒక్క సీటు కూడా లేదు. పార్టీ పుట్టినప్పటి నుంచి 25 ఏళ్లలో ఇంత దీనావస్థ ఎప్పుడూ లేదు..’అని రేవంత్ అన్నారు. బీజేపీ నాయకులు కూడా ఎవరైనా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే ముందు ఇతర రాష్ట్రా ల్లో వారి పార్టీ దీనావస్థను దృష్టిలో ఉంచుకుని మాట్లాడితే బాగుంటుందని సీఎం అన్నారు.
కేసీఆర్‌పై ఈటలకు ప్రేమ తగ్గనట్టుంది!
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పార్టీ ఫిరాయింపులపై మాట్లాడుతున్నారని.. 20 సంవత్సరాలు ఈటల ఎవరితో కలిసి తిరిగారో గుర్తు చేసుకోవాలని రేవంత్ సూచించారు. గతంలో కేసీఆర్ ఫిరాయింపులు ప్రోత్సహించి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్నప్పుడు, కండువాలు కప్పేటప్పుడు ఈటల ఎప్పుడైనా మాట్లాడారా..? అని ప్రశ్నించారు. అసలు 11 రాష్ట్రాల్లో ఎన్నికైన ప్రభుత్వాలను బీజేపీ పడగొట్టిన విషయమైనా ఈటలకు తెలుసా..? అని నిలదీశారు. ‘ఇప్పటికీ కేసీఆర్‌పై ఈటలకు సానుభూతి ఎందుకు? ఆయనపై ఇంకా ప్రేమ తగ్గనట్లు ఉంది.
అయినా వారిద్దరూ ప్రేమించుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. వాళ్ల నాయకుడు ఇంకా కేసీఆరే అని ఈటల అనుకుంటున్నట్లున్నారు..’అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలని, తర్వాత తమ ఫోకస్ అంతా అభివృద్ధిపైనే ఉంటుందని చెప్పారు. టీపీసీసీ అధ్యక్షుడి ఎంపిక, మంత్రివర్గ విస్తరణ అంశాలు ఏఐసీసీ పరిశీలనలో ఉన్నాయని అన్నారు. పదవుల విషయంలో తమకు ఏకాభిప్రాయం ఉందని, ఎందుకు ఆలస్యం అవుతోందో ఏఐసీసీ పెద్దలనే అడగాలని అన్నారు. ఇలావుండగా భద్రాచలానికి సమీపాన ఏపీలో ఉన్న ఐదు గ్రామాలు, దేవుడి మాన్యాలను తెలంగాణలో విలీనం చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రధానిని కోరినట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment