మోదీకిదే నా సవాల్‌ | Telangana CM Revanth Reddy Open Challenge To PM Modi Over Jobs Issue | Sakshi
Sakshi News home page

మోదీకిదే నా సవాల్‌

Published Sun, Dec 8 2024 4:14 AM | Last Updated on Sun, Dec 8 2024 4:15 AM

Telangana CM Revanth Reddy Open Challenge To PM Modi Over Jobs Issue

బ్రాహ్మణ వెల్లెంల రిజర్వాయర్‌లో కృష్ణమ్మకు పూజలు చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రాజనర్సింహ, ఉత్తమ్‌కుమార్, ఎంపీ చామల, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

తొలి ఏడాదిలో రుణమాఫీ చేశారా? 55 వేల ఉద్యోగాలిచ్చారా? 

చేస్తే చూపించండి.. ఢిల్లీ నడిబజారులో క్షమాపణ చెబుతా: సీఎం రేవంత్‌రెడ్డి

లేదంటే మా ప్రభుత్వాన్ని అభినందించండి.. ప్రధానిగా మీ గౌరవం పెరుగుతుంది

నడ్డావి అడ్డగోలు మాటలు.. ఈటల, కిషన్‌రెడ్డీ దొంగల సోపతి పట్టొద్దు 

గెలిస్తే ఉప్పొంగడం, ఓడితే కుంగిపోవడం తెలంగాణకు మంచిదా? 

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆత్మపరిశీలన చేసుకోవాలి 

ఏడాదిగా ప్రతిపక్ష నేత కుర్చీని ఖాళీగా ఉంచడంపై ఏం చెబుతారు..?

నల్లగొండ ప్రజాపాలన విజయోత్సవ సభలో రేవంత్‌ ప్రశ్న

బ్రాహ్మణ వెల్లెంల– ఉదయ సముద్రం ఎత్తిపోతల ప్రాజెక్టు, యాదాద్రి థర్మల్‌ ప్లాంట్‌ రెండో యూనిట్‌ను ప్రారంభించిన సీఎం 

నల్లగొండ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: గత 75 ఏళ్లలో దేశంలోని ఏ రాష్ట్రంలోనూ, ఏ ప్రభుత్వం, ఏ సీఎం కూడా తొలి ఏడాదిలోనే 55,143 ఉద్యోగాలు ఇవ్వలేదని.. దీనిపై తాను సూటిగా ప్రధాని మోదీకే సవాల్‌ విసురుతున్నానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. మోదీ పాలనలో, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా మొదటి ఏడాదిలోనే 55 వేల ఉద్యోగాలు ఇస్తే లెక్క చూపాలని... ఢిల్లీ నడిబజార్‌లో క్షమాపణ చెప్పి తలవంచుకొని వస్తానని సవాల్‌ చేశారు. గెలిస్తే ఉప్పొంగడం, ఓడిపోతే కుంగిపోవడం తెలంగాణ సమాజానికి, ప్రజాస్వామ్యానికి మంచిదా, కేసీఆర్‌ ఎందుకు బయటికి రావడం లేదని సీఎం ప్రశ్నించారు. దీనిపై కేసీఆర్‌ ఆత్మపరిశీలన చేసుకోవాలని వ్యాఖ్యానించారు. శనివారం సాయంత్రం నల్లగొండ జిల్లా కేంద్రంలోని గంధంవారిగూడెంలో జరిగిన ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే... 

’’కేసీఆర్, బీఆర్‌ఎస్‌ వారు మాట్లాడిన ప్రెస్‌మీట్ల కాగితాలు తీసుకెళ్లి ఈటల రాజేందర్, కిషన్‌రెడ్డి అవే నకలు కొడుతున్నారు. కిషన్‌రెడ్డి, ఈటల మారాలి. ఆ దొంగల సోపతి పడితే మీరు కూడా దొంగల బండి  ఎక్కుతారు. అటే పోతారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా.. అడ్డగోలుగా మాట్లాడవద్దు. ఏది పడితే, ఎలా పడితే అలా మాట్లాడితే చెల్లదు. మీరు కేసీఆర్‌లా తయారుకాకండి. మోదీ పాలనలో, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా మొదటి ఏడాదిలోనే 55 వేల ఉద్యోగాలు ఇస్తే లెక్క చూపండి. మోదీకి సవాల్‌ చేస్తున్నా.. ఢిల్లీ నడిబజార్‌లో మీకు క్షమాపణ చెప్పి తలవంచుకొని వస్తా. 

లేకపోతే నా లెక్క అప్పజెబుతా. మీ నాయకులు, మీరు తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించండి. అప్పుడే ఈ దేశ ప్రధానమంత్రిగా మీ గౌరవం పెరుగుతుంది. అంతేకాదు మేం తొలి ఏడాదే 25.50 లక్షల మంది రైతుల రుణమాఫీ చేశాం. రూ.21 వేల కోట్లు వారి ఖాతాల్లో వేశాం. మోదీ, కేసీఆర్‌ మీరు ఎప్పుడైనా చేశారా? సవాల్‌ విసురుతున్నా. మోదీ అధికారంలో ఉన్నప్పుడైనా, బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనైనా ఒక్క ఏడాదిలోనే ఇలా రుణమాఫీ చేస్తే.. నేను మా మంత్రులతో సహా వచ్చి క్షమాపణ చెబుతాం. 

కేసీఆర్‌ ఆత్మపరిశీలన చేసుకోండి.. 
గెలిస్తే ఉప్పొంగడం, ఓడిపోతే కుంగిపోవడం తెలంగాణ సమాజానికి, ప్రజాస్వామ్యానికి మంచిదా? కేసీఆర్‌ ఎందుకు బయటికి రావడం లేదు? ఎందుకు మాట్లాడటం లేదు? అధికారంలో ఉంటే చలాయిస్తాం, ఓడిపోతే ఫామ్‌హౌస్‌లో పడుకుంటామంటే ఎలా? దీనిపై ప్రజలకు ఏం సమాధానం చెబుతారు? మేం ఎన్నికల్లో పోటీ చేయలేదా? ఓడినా, గెలిచినా ప్రజల్లో ఉండలేదా? రెండుసార్లు మీరు గెలిచారు. మేం ఓడిపోయాం.. అయినా జానారెడ్డిలాంటి పెద్దలు ప్రజల్లో ఉండి, అసెంబ్లీలో పాలకపక్షానికి సూచనలు, సలహాలు ఇస్తూ, తప్పిదాలపై ప్రభుత్వాన్ని నిలదీశారు.

మా ఎమ్మెల్యేలను గుంజుకున్నా, సీఎల్పీ హోదాను తొలగించినా మొక్కవోని ధైర్యంలో భట్టి విక్రమార్క కొట్లాడారు. ఇప్పుడు సంవత్సరం పూర్తయినా మీరు ప్రతిపక్ష నాయకుడిగా మీ పాత్ర పోషించారా? అసెంబ్లీకి వచ్చారా? ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా, టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడిగా, పదేళ్లు సీఎంగా మీకున్న అనుభవాన్ని, మీ వయసును తెలంగాణ ప్రజల కోసం ఏ ఒక్కరోజైనా వినియోగించారా? ఆలోచించాలి. ఆత్మపరిశీలన చేసుకోవాలి. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కుర్చీ ఖాళీగా ఉంచడం పట్ల తెలంగాణ సమాజానికి ఏం సమాధానం చెబుతారు? 

గాలి బ్యాచ్‌ని ఊరి మీదకు వదిలారు.. 
ప్రభుత్వ నిర్ణయాలు మీకు నచ్చకపోతే, ప్రజలకు కష్టం వస్తే ప్రజలపక్షాన మాట్లాడాల్సింది పోయి ఒక గాలి బ్యాచ్‌ను తయారు చేసి ఊరి మీదికి వదిలారు. వారేం మాట్లాడుతున్నారో, ఏం చేస్తున్నారో ఎప్పుడైనా విన్నారా? ప్రతి అభివృద్ధి పనిని అడ్డుకుంటున్నారు. ఉద్యోగాలు ఇవ్వొద్దన్నప్పుడు, గ్రూప్‌–4, గ్రూప్‌–1 పరీక్షలు పెట్టవద్దన్నప్పుడు, డీఎస్సీ నోటిఫికేషన్‌ రద్దు చేయాలన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ముందుకు వెళుతుంది? కేసీఆర్‌ ఆత్మపరిశీలన చేసుకోవాలి. రాష్ట్రం ఏర్పడినప్పుడు రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో ఉంటే.. కేసీఆర్‌ రూ.7 లక్షల కోట్లు అప్పుతో మాకు అప్పగించారు. అప్పులకు ప్రతి నెలా రూ.6,500 కోట్ల చొప్పున ఏడాదికి రూ.65 వేల కోట్లు వడ్డీ కట్టాల్సి వస్తోంది. 

నాడు ‘ఔటర్‌’ రోడ్డు.. ఇప్పుడు ‘రీజనల్‌’ రోడ్డు 
నాడు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఔటర్‌ రింగ్‌ రోడ్డు వేశారు. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా రీజనల్‌ రింగు రోడ్డు తీసుకువచ్చి అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటాం. 50వేల ఎకరాల్లో ఫ్యూచర్‌ సిటీగా కొత్త నగరాన్ని నిర్మించుకుని, పెట్టుబడులు తెచ్చి.. నిరుద్యోగులకు, ఇంజనీర్లకు, డాక్టర్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత మాదే. మూసీ కాలుష్యంతో మనుషులు జీవించలేని పరిస్థితి నల్లగొండ ప్రాంతానికి రాబోతోందని వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ చెప్పింది. అందుకే మూసీలో గోదావరి జలాలను పారించేందుకు, పారిశ్రామిక కాలుష్యం నుంచి కాపాడేందుకు ప్రక్షాళన చేపట్టాం. అడ్డం వచ్చే వారి సంగతి ప్రజలే చూసుకోవాలి..’’ అని సీఎం రేవంత్‌ పేర్కొన్నారు. 

ఉచిత విద్యుత్‌ ఇచ్చింది వైఎస్సార్‌ కాదా? 
‘‘వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తామని వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చెప్పినప్పుడు.. కొందరు కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుందన్నారు.ఆ మాటలు తప్పు అని నిరూపించి రైతులకు ఉచిత కరెంటును ఇచ్చారు. దేశంలోనే మొదటిసారిగా రైతులకు ఉచిత కరెంటు ఇస్తూ, వారి రూ.1,200 కోట్ల కరెంటు బిల్లులను మాఫీ చేస్తూ, వేల మంది రైతులపై విద్యుత్‌ చౌర్యం కేసులను ఎత్తివేస్తూ.. ఒక్క సంతకంతో హామీలు అమలు చేశారు. మేం ఆయనను ఆదర్శంగా తీసుకుని వ్యవసాయానికి 24 గంటల ఇస్తున్నాం. ఇళ్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ ఇస్తున్నాం. రూ.500కే వంటగ్యాస్‌ సిలిండర్‌ అందిస్తున్నాం. వైఎస్సార్‌ రాజీవ్‌ ఆరోగ్యశ్రీని అమల్లోకి తెస్తే... కేసీఆర్‌ వచ్చి నిరీ్వర్యం చేశారు. మేం వచ్చాక ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచాం. వరి వేస్తే ఉరేనని కేసీఆర్‌ అన్నారు. మేం వరి సాగు చేయాలని చెప్పడమేకాదు సన్నాలకు రూ.500 బోనస్‌ ఇస్తున్నాం.’’ 

తెలంగాణను దేశానికే రోల్‌మోడల్‌గా చేస్తాం : ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి 
నల్లగొండ:  రాబోయే నాలుగేళ్లలో తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశానికే రోల్‌ మోడల్‌గా నిలబెడతామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. నల్లగొండ ప్రజాపాలన విజయోత్సవ సభలో వారు మాట్లాడారు. తమ ప్రభుత్వం ఓవైపు రాష్ట్ర అభివృద్ధికి ప్రణాళికలు అమలు చేస్తూనే, మరోవైపు అప్పులు తీర్చుకుంటూ ముందుకుసాగుతోందని భట్టి విక్రమార్క చెప్పారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గురుకులాలను పెట్టిందే తప్ప నిర్వహణను పట్టించుకోలేదని.. తాము యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ గురుకులాలను నియోజకవర్గానికి ఒకటి చొప్పున నిర్మిస్తున్నామని చెప్పారు. గత సర్కారు యాదాద్రి పవర్‌ ప్లాంట్‌ మొదలుపెట్టిందే తప్ప పర్యావరణ అనుమతులు తీసుకోలేకపోయిందని.. తాము అనుమతులు తెప్పించి, నిధులిచ్చి పనులు వేగవంతం చేశామని తెలిపారు. 

నల్లగొండ ప్రాజెక్టులపై నిర్లక్ష్యం: ఉత్తమ్‌ 
గత పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో నల్లగొండ జిల్లాలోని ప్రాజెక్టులన్నీ నిర్లక్ష్యం చేసిందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. నాడు కాంగ్రెస్‌ ప్రభుత్వం సొరంగ మార్గాన్ని ప్రారంభిస్తే బీఆర్‌ఎస్‌ పట్టించుకోలేదని మండిపడ్డారు. ఆ ప్రాజెక్టును పూర్తిచేసి మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుందన్నారు. కార్యకర్తల కష్టం, త్యాగంతో తాము ఈ స్థాయిలో ఉన్నామని.. వారికి ఏ కష్టం వచి్చనా అండగా ఉంటామని చెప్పారు. 

ఎస్‌ఎల్‌బీసీ.. ఇక ఆర్‌ఆర్‌ ప్రాజెక్టు: కోమటిరెడ్డి 
ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గాన్ని ఇక నుంచి ఆర్‌ఆర్‌ (రాజశేఖర్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి) ప్రాజెక్టుగా పేరు పెట్టుకున్నానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. నాడు వైఎస్సార్‌ ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గానికి శంకుస్థాపన చేస్తే.. ఇప్పుడు సీఎం రేవంత్‌ ఆ ప్రాజెక్టు పూర్తికి నిధులు ఇస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్‌ కాళేశ్వరం పేర కూలేశ్వరం ప్రాజెక్టు కట్టారని.. నల్లగొండ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసినందుకే జిల్లా ప్రజలు బీఆర్‌ఎస్‌ను పాతాళానికి తొక్కారని వ్యాఖ్యానించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement