ఉ.6 గంటలకల్లా లెక్కింపు కేంద్రం దగ్గర ఉండాలి
ఫారం–17 సీ కాపీని తీసుకెళ్లాలి
పోటీలో ఉన్న అభ్యర్థులందరి ప్రతి ఓటునూ కరెక్టుగా నోట్ చేసుకోవాలి
ఏదైనా తప్పు కన్విస్తే అక్కడే ఉన్న ఆర్వోకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలి
వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ ప్రతినిధి కొమ్మసాని శ్రీనివాసులరెడ్డి
సాక్షి, అమరావతి: కౌంటింగ్ సమయంలో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ ప్రతినిధి, హైకోర్టు న్యాయవాది కొమ్మసాని శ్రీనివాసులరెడ్డి సూచించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కౌంటింగ్ కేంద్రాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏజెంట్లకు దిశానిర్దేశం చేశారు. ఆయన ఏమన్నారంటే..
⇒ ఉ.6 గంటలకల్లా ఏజెంట్లు కౌంటింగ్ హాల్ దగ్గర ఉండాలి. ఫారం–17 సీ కాపీని తీసుకెళ్లాలి.
⇒ పోటీలో ఉన్న అభ్యర్థులందరి ప్రతి ఓటు కరెక్టుగా నోట్ చేసుకోవాలి. ఏదైనా తప్పు కన్పిస్తే వెంటనే అక్కడే ఉన్న ఆర్వోకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలి.
⇒ అనారోగ్యం, ఇతర కారణాలతో బయటకు వచ్చేవారు రిటర్నింగ్ అధికారికి చెప్పి బయటకు రావాలి. ఒకసారి బయటకొస్తే లోపలికి రానివ్వరని గమనించాలి.
⇒ స్వతంత్ర అభ్యర్థులకు పోలైన ఓట్లను కూడా జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి.
⇒ ఏజెంట్లు ప్రతి రౌండ్ తర్వాత షీట్‌పై సంతకం చేసే ముందు మన పార్టీ అభ్యర్థి ఓట్లు మాత్రమే కాకుండా, టీడీపీ–జనసేన–బీజేపీ, ఇతర అభ్యర్థులకు పోలైన ఓట్లను స్పష్టంగా సరిచూసుకోవాలి. తేడా ఉన్నట్లుగా గుర్తిస్తే మరొక మారు కౌంటింగ్ చేయమని కోరాలి. అన్ని సరిపోయినప్పుడే సంతకం చేయాలి.
⇒ కౌంటింగ్ ఏజెంట్లతో అభ్యర్థి టచ్‌లో ఉంటూ అక్కడ ఏదైనా అవాంతరాలు ఎదురైతే, కౌంటింగ్ ఏజెంట్‌తో కానీ, చీఫ్ ఎలక్షన్ ఏజెంట్‌తో కానీ రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలి. అక్కడ పరిష్కారం కాకపోతే వెంటనే పార్టీ కేంద్ర కార్యాలయం దృష్టికి తీసుకురావాలి.
⇒ ఏదైనా తప్పు జరుగుతోంది అని కౌంటింగ్ కేంద్రంలో గుర్తిస్తే చక్కటి లాజిక్‌తో ఆర్వోకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలి.
⇒ రిజెక్ట్ అయిన పోస్టల్ బ్యాలెట్ కంటే తక్కువ మార్జిన్ వచ్చి ఉంటే మళ్లీ పోస్టల్ బ్యాలెట్స్‌ని లెక్కించమని కోరే అధికారం అభ్యర్థికి, కౌంటింగ్ ఏజెంట్‌కి ఉంది.
⇒ పోస్టల్ ఓట్లను సంబంధిత ఫారంలో నింపి అభ్యర్థి, అబ్జర్వర్ కూడా చూసి సంతకం చేసిన తర్వాత ఆ రౌండ్ ఫలితం ప్రకటిస్తారు.
⇒ కౌంటింగ్ పూర్తయి డిక్లరేషన్ ఫామ్ ఇచ్చేవరకు కౌంటింగ్ హాల్‌లో అభ్యర్థి ఉండాలి.
Comments
Please login to add a commentAdd a comment