పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లపై వైఎస్సార్‌సీపీ న్యాయ పోరాటం | YSRCP amendment petition challenging latest order of Election Commission: AP | Sakshi
Sakshi News home page

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లపై వైఎస్సార్‌సీపీ న్యాయ పోరాటం

Published Fri, May 31 2024 4:38 AM | Last Updated on Fri, May 31 2024 7:26 AM

YSRCP amendment petition challenging latest order of Election Commission: AP

కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు విరుద్ధంగా సీఈవో మెమోలపై పిటిషన్‌ 

అత్యవసరంగా విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం 

ఓ మెమోలో కొంత భాగం.. మరో మెమోను పూర్తిగా ఉపసంహరణ 

సంతకం ఉండి, పేరు, హోదా, సీలు లేకపోయినా ఆ పోస్టల్‌ బ్యాలెట్‌ ఆమోదం 

ఆ మేర చర్యలు తీసుకోవాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశిస్తూ తాజాగా ఉత్తర్వులు 

హైకోర్టుకు సీఈసీ నివేదన.. వైఎస్సార్‌సీపీ కోరిన మేరకు ఈ వివరాలను రికార్డు చేసిన కోర్టు

ఎన్నికల సంఘం తాజా ఉత్తర్వులను సవాలు చేస్తూ వైఎస్సార్‌సీపీ సవరణ పిటిషన్‌  

ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేసిన టీడీపీ.. ఈ పిటిషన్‌లో అభ్యర్థనను సవరించాలన్న ధర్మాసనం

సాక్షి, అమరావతి: పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల విషయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) తీసుకున్న వివాదాస్పద నిర్ణయంపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ న్యాయ పోరాటం ప్రారంభించింది. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) మార్గదర్శకాలకు విరుద్ధంగా సీఈవో ఈ నెల 25, 27వ తేదీల్లో జారీ చేసిన మెమోలను రద్దు చేయాలని కోరుతూ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై లంచ్‌ మోషన్‌ రూపంలో అత్యవసరంగా విచారణ జరపాలని అప్పిరెడ్డి తరఫు న్యాయవాది సన్నపురెడ్డి వివేక్‌ చంద్రశేఖర్‌ హైకోర్టు ధర్మాసనాన్ని అభ్యర్ధించారు.

దీంతో న్యాయమూర్తులు జస్టిస్‌ సత్తిరెడ్డి సుబ్బారెడ్డి, జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి ప్రతాప్‌ల ధర్మాసనం లంచ్‌ మోషన్‌ రూపంలో గురువారం అత్యవసర విచారణకు అంగీకరించింది. పోస్టల్‌ బ్యాలెట్‌ డిక్లరేషన్‌ ఫాంపై అటెస్టింగ్‌ అధికారి సంతకం ఉంటే చాలని, తన పేరు, హోదా వివరాలు చేతితో రాసినా కూడా ఆమోదించాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం గత ఏడాది జూలై­లో మార్గదర్శకాలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాల్లో ఈ మార్గదర్శకాలు అమలవుతున్నాయి. అయితే తెలుగుదేశం పార్టీ అడిగిందే తడవుగా, సీఈవో ఆ మార్గదర్శకాలకు తూట్లు పొడిచారు. 

టీడీపీకి అను­కూలంగా వాటిని సడలించారు. పోస్టల్‌ బ్యాలెట్‌ డిక్లరేషన్‌ ఫాంపై అటెస్టింగ్‌ అధికారి సంతకం ఉండి.. పేరు, హోదా వివరాలు చేతితో రాయకపోయినా కూడా ఆ పోస్టల్‌ బ్యాలెట్‌ను ఆమోదించాలంటూ ఈ నెల 25, 27వ తేదీల్లో మెమోలు జారీ చేశారు. ఈ నిర్ణయం అత్యంత వివాదాస్పదంగా మారింది. కూటమి తప్ప, అన్నీ రాజకీయ పక్షాలు ఎన్నికల ప్రధాన అధికారి నిర్ణయంపై అందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇది అంతిమంగా శాంతిభద్రతల సమస్యగా మారుతుందని భయపడుతున్నాయి. 

దేశంలో ఎక్కడా లేని నిబంధన ఏపీలో అమలు  
సీఈవో ఇచ్చిన సడలింపుల అమలును నిలిపేసి, కేంద్ర ఎన్నికల సంఘం గత ఏడాది జూలైలో జారీ చేసిన మార్గదర్శకాలను యథాతథంగా, నిజమైన స్ఫూర్తితో అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పిటిషన్‌ దాఖలు చేసింది. ఇందులో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని ప్రతివాదులుగా చేర్చింది. మధ్యాహ్నం ఈ వ్యాజ్యం విచారణకు రాగా, వైఎస్సార్‌సీపీ తరఫున సీనియర్‌ న్యాయ­వాది పి.వీరారెడ్డి, న్యాయవాది వివేక్‌ చంద్రశేఖర్‌ వాదనలు వినిపించారు. దాదాపు రెండు గంటల పాటు వాదనలు కొనసాగాయి.

సీఈవో తన పరిధి దాటి మరీ మెమోలు జారీ చేశారన్నారు. దేశంలో ఎక్కడా లేని ఉత్తర్వులను ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే అమలు చేస్తున్నారని తెలిపారు. సీఈవో మెమోల వల్ల వచ్చే నష్టం గురించి ధర్మాసనానికి వివరించారు. పోస్టల్‌ బ్యాలెట్‌ డిక్లరేషన్‌ ఫాంపై అటెస్టింగ్‌ అధికారి సంతకం ఉంటే చాలని, తన పేరు, డిజిగ్నేషన్‌ వివరాలు చేతితో రాసినా కూడా ఆమోదించాలని కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు చెబుతున్నాయని, ఇందుకు విరుద్ధంగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు ఉంటే, దానిని తిరస్కరించవచ్చని తెలిపారు.

అయితే ఇప్పుడు సీఈవో ఆ మార్గదర్శకాలకు తిలోదకాలిచ్చారని, కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అమలు చేయడం లేదన్నారు. దీనిని తీవ్రంగా పరిగణించాలని కోరారు. కౌంటింగ్‌ ప్రక్రియలో నిష్పాక్షికత కోసమే ఈ వ్యాజ్యం దాఖలు చేశామన్నారు. నిబంధనలకు తూట్లు పొడిచే అధికారం సీఈవోకు లేదన్నారు. కొన్ని రాజకీయ పారీ్టలకు మేలు చేసేందుకే సీఈవో ఈ మెమో జారీ చేశారని తెలిపారు.

పేరు, హోదా, సీలు లేకపోయినా ఆమోదించాలి  
25, 27వ తేదీల్లో జారీ చేసిన మెమోలపై వివరణ ఇవ్వాలని ధర్మాసనం కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఎన్నికల సంఘం తరఫున సీనియర్‌ న్యాయవాది అవినాష్‌ దేశాయ్‌ వాదనలు వినిపిస్తూ, పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల విషయంలో సీఈవో తమ అభిప్రాయాన్ని కోరారని తెలిపారు. అధికారుల సంతకం విషయంలో ఏదైనా సందేహం ఉన్నా, వెరిఫికేషన్‌ అవసరం అయినా, ఫెసిలిటేషన్‌ సెంటర్ల వద్ద ఉన్న అటెస్టింగ్‌ అధికారుల నమూనా సంతకాలు, పేర్లు, హోదాల వివరాలను తీసుకోవాలంటూ ఈ నెల 25వ తేదీన జారీ చేసిన మెమోలోని రెండో పేరాను ఉపసంహరించుకుంటున్నట్లు అవినాష్‌ చెప్పారు.

ఈ రెండో పేరాకు అనుగుణంగా 27న జారీ చేసిన మెమోను పూర్తిగా ఉపసంహరించుకున్నట్లు ఆయన కోర్టుకు వివరించారు. ఇదే సమయంలో పోస్టల్‌ బ్యాలెట్‌ డిక్లరేషన్‌ ఫాంపై అటెస్టింగ్‌ అధికారి సంతకం ఉండి, పేరు, హోదా, సీలు లేకపోయినా కూడా ఆ పోస్టల్‌ బ్యాలెట్‌లను ఆమోదించాలంటూ తాజాగా (30వ తేదీన) ఆదేశాలు జారీ చేశామని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వీటిని దేశ వ్యాప్తంగా అమలు చేస్తామని చెప్పారు.

ఈ సమయంలో వీరారెడ్డి జోక్యం చేసుకుంటూ, 25న ఇచ్చిన మెమోలోని పేరా 2, 27న ఇచ్చిన మెమోను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పిన విషయాన్ని రికార్డ్‌ చేయాలని కోర్టును కోరారు. ఇందుకు ధర్మాసనం అంగీకరించి, అవినాష్‌ చెప్పిన విషయాలను రికార్డ్‌ చేసింది. అవినాష్‌ జోక్యం చేసుకుంటూ, అసలు ఈ వ్యాజ్యానికి విచారణార్హతే లేదన్నారు. ధర్మాసనం స్పందిస్తూ, ఇది రెగ్యులర్‌ కేసు కాదని గుర్తు చేసింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement