counting of votes
-
ఈవీఎంలలో అవకతవకలపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదులు
న్యూఢిల్లీ: హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎంలు) అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం ఎన్నికల సంఘానికి మరిన్ని ఫిర్యాదులు చేసింది. దాదాపు 20 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ టికెట్లపై పోటీ చేసిన అభ్యర్థులు లిఖితపూర్వకంగా ఫిర్యాదులు అందించారు. ఈ నెల 8న జరిగిన ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కొన్ని ఈవీఎంల బ్యాటరీలు 99 శాతం చార్జింగ్‌తో ఉన్నట్లు తేలిందని పేర్కొన్నారు. అది ఎలా సాధ్యమని ప్రశ్నించారు. మిగతా ఈవీఎంల బ్యాటరీల్లో 80 శాతం కంటే తక్కువ చార్జింగ్ ఉందన్నారు. 99 శాతం చార్జింగ్ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. తమ పార్టీ ఫిర్యాదులపై ఈసీ తగిన చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ పేర్కొన్నారు. ఈసీకి ఫిర్యాదు చేసిన 20 మంది కాంగ్రెస్ అభ్యర్థులు అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈవీఎంలను తారుమారు చేశారని వారు అనుమానిస్తున్నారు. అందుకే న్యాయం కోసం ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. -
కశ్మీరంలో కూటమి
శ్రీనగర్/జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో ఆర్టీకల్ 370 రద్దయ్యి, కేంద్ర పాలిత ప్రాంతంగా మారిన తర్వాత జరిగిన తొలి శాసనసభ ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. మూడు పార్టీ లతో కూడిన విపక్ష ‘ఇండియా’ కూటమికే పట్టంగట్టారు. శాసనసభలో మొత్తం 90 స్థానాలకు గాను ఆ కూటమి 49 స్థానాలు సొంతం చేసుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ సాధించింది. ఇండియా కూటమిలోని నేషనల్ కాన్ఫరెన్స్ 42 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్ ఆరు, సీపీఎం ఒక స్థానం దక్కించుకున్నాయి. మూడు పార్టీ లు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి.జమ్మూకశ్మీర్‌లో మంగళవారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. ప్రధాన ప్రాంతీయ పార్టీ అయిన నేషనల్ కాన్ఫరెన్స్ బలం పెరిగింది. ఆ పార్టీ ఓట్లశాతం 2014లో 20.77 ఉండగా, ఇప్పుడు 23.43 శాతానికి చేరుకుంది. మరో ప్రాంతీయ పార్టీ పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ) ఈ ఎన్నికల్లో కేవలం 3 సీట్లకే పరిమితమైంది. ఆ పార్టీ ఓట్ల శాతం 22.67 నుంచి 8.87కు పడిపోయింది. ఈ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగిన బీజేపీ మెరుగైన ఫలితాలే సాధించింది. సొంతంగా 29 సీట్లలో జెండా ఎగురవేసింది. 2014 ఎన్నికల్లో ఆ పార్టీకి 25 స్థానాలు దక్కగా, ఈసారి మరో నాలుగు స్థానాలు పెరగడం గమనార్హం. అంతేకాకుండా ఓట్ల శాతం 23 శాతం నుంచి 25.64 శాతానికి పెరిగింది. కానీ, జమ్మూకశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు రవీంద్ర రైనా ఓటమి పాలయ్యారు. మహిళలు ముగ్గురే తమ కూటమికి అధికారం దక్కినప్పటికీ కాంగ్రెస్‌కు మాత్రం ఈ ఎన్నికల ఫలితాలు నిరాశ కలిగించాయి. పదేళ్ల క్రితం ఆ పార్టీ 12 సీట్లు గెలుచుకోగా, ప్రస్తుతం కేవలం ఆరు సీట్లు దక్కాయి. కశ్మీర్ లోయలో ఐదు స్థానాలు, జమ్మూ ప్రాంతంలో కేవలం ఒక స్థానం లభించింది. ఓట్ల శాతం కూడా 18 నుంచి 12 శాతానికి తగ్గిపోయింది. ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అనూహ్య విజయం సాధించింది. ఒక స్థానంలో పాగా వేసింది. జమ్మూకశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్(జేపీసీ)కు ఒక స్థానం లభించింది. ఏడుగురు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. మొత్తం 90 మంది నూతన ఎమ్మెల్యేల్లో మహిళలు ముగ్గురే ఉన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి సకీనా మసూద్, షమీమా ఫిర్దోస్, బీజేపీ నుంచి షగున్ పరిహర్ గెలిచారు. జమ్మూకశ్మీర్ నూతన ముఖ్యమంత్రిగా నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా బాధ్యతలు స్వీకరిస్తారని పార్టీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా ప్రకటించారు. -
కశ్మీర్, హరియాణాల్లో నేడే ఓట్ల లెక్కింపు
చండీగఢ్: హరియాణా, జమ్మూకశ్మీర్‌ల్లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి మొదలయ్యే ఈ ప్రక్రియ కోసం భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశామంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల రక్షణ వ్యవస్థ ఉంటుందని తెలిపింది. జమ్మూ కశ్మీర్లో మొత్తం మూడు విడతలుగా, హరియాణాలో ఈనెల 5న ఒకే విడతలో పోలింగ్ జరగడం తెలిసిందే. -
Venezuela presidential election: వెనిజులాలో... మళ్లీ పాత కథే!
కారకాస్: వెనిజులా అధ్యక్ష ఎన్నికల్లో అంతా ఊహించిందే జరిగింది. అధ్యక్షుడు నికొలస్ మదురో వరుసగా మూడోసారి విజయం సాధించినట్టు ఆ దేశ ఎన్నికల సంఘం (సీఎన్ఈ) ప్రకటించింది. ఆదివారం జరిగిన దేశవ్యాప్త పోలింగ్ అనంతరం రాత్రి ఓట్ల లెక్కింపు చేపట్టారు. 80 శాతం ఓట్లను లెక్కించేసరికి మదురోకు విజయానికి అవసరమైన 51 శాతం ఓట్లు లభించినట్టు సీఎన్ఈ చీఫ్ ఎల్విస్ అమోరోసో అర్ధరాత్రి అనంతరం ప్రకటన విడుదల చేశారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి ఎడ్మండో గొంజాలెజ్‌కు 44 శాతం ఓట్లొచ్చినట్టు వెల్లడించారు. దీనిపై విపక్షాలన్నీ తీవ్రంగా మండిపడ్డాయి. ఓట్ల లెక్కింపును ప్రహసనప్రాయంగా మార్చేసి ప్రజాస్వామ్యాన్ని మరోసారి మంటగలిపారని విపక్ష నేత మరియా కొరీనా మచాడో దుమ్మెత్తిపోశారు. ‘‘మదురోను ఓడించేందుకు జనమంతా వెల్లువలా కదిలొచ్చి గొంజాలెజ్‌కు ఓటేశారు. ఆయన కనీసం మూడింట రెండొంతుల ఓట్లతో ఘనవిజయం సాధించారు. మా బూత్‌లవారీ విశ్లేషణలో కూడా అదే తేలింది. ఓటింగ్ సరళిని చూసిన మీదట ఓటమి ఖాయమని మదురోకు అర్థమైపోయింది. ఫలితాలను తారుమారు చేసేందుకు పథకం ప్రకారం విపక్ష కూటమి పర్యవేక్షకులను పోలింగ్ బూత్‌ల నుంచి తరిమేశారు. అనంతరం మదురో చేతిలో కీలుబొమ్మ అయిన సీఎన్ఈ చీఫ్ ఫలితాలను ఆయనకు అనుకూలంగా వక్రీకరించారు’’ అంటూ ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తక్షణం దేశవ్యాప్తంగా మొత్తం 30 వేల పోలింగ్ బూత్‌లవారీగా పోలైన ఓట్ల వివరాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. సీఎన్ఈ మాత్రం అందుకు సుముఖంగా లేదు. దీనికితోడు పోలింగ్ ముగిశాక ఫలితాల వెల్లడిని నిర్ధారిత సమయం కంటే ఏకంగా ఆరు గంటలపాటు ఆలస్యం చేశారు. ఫలితాలను మదురోకు అనుకూలంగా మార్చేందుకే ఇలా చేశారని విపక్ష కూటమి దుయ్యబట్టింది. ఫలితాలను చట్టపరంగా సవాలు చేస్తామని ప్రకటించింది. మదురో మాత్రం విదేశీ శక్తులతో కలిసి కొందరు కుట్ర పన్ని ఈవీఎంలను హాక్ చేసేందుకు ప్రయతి్నంచారంటూ విపక్షాలపై ప్రత్యారోపణలకు దిగారు. శాంతిభద్రతలకు భంగం కలిగించజూస్తే ఏం చేయాలో పోలీసులు, సైన్యం చూసుకుంటాయని హెచ్చరించారు. వెనిజులాలో పాతికేళ్లుగా యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ పాలనకు తెర దిచేందుకు విపక్షాలన్నీ మచాడో సారథ్యంలో ఒక్కతాటిపైకి వచ్చి పోటీ చేశాయి.ఫలితాలపై దేశాల పెదవి విరుపు వెనిజులా ఎన్నికల ఫలితాలు అస్సలు నమ్మశక్యంగా లేవని అమెరికా, చిలీ,ఉరుగ్వేతో పాటు చాలా దేశాలు పేర్కొన్నాయి. అవి ప్రజల మనోగతాన్ని, ఓటింగ్ సరళిని ప్రతిఫలించడం లేదని స్పష్టం చేశాయి. చిలీ అధ్యక్షుడు గేబ్రియెల్ బోరిక్, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తో పాటు బ్రిటన్ కూడా ఈ మేరకు ప్రకటన చేసింది. -
కౌంటింగ్‌లో ఓట్ల తేడాలపై అధ్యయనం
సాక్షి ప్రతినిధి, విజయనగరం: సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపులో తేడాలపై అధ్యయనం చేస్తున్నామని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. పోలింగ్ అక్రమాలపై కాలమే సమాధానం చెబుతుందని అన్నారు. ఆయన గురువారం ఉమ్మడి విజయనగరం జిల్లా వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి ఇక్కడ మీడియాతో మాట్లాడారు. గత ఐదేళ్లలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఎలాంటి అవినీతికి తావు లేకుండా అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అందించిందని చెaప్పారు.ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చాలని విద్య, వైద్య రంగాల్లో అనేక సంస్కరణలు తెచ్చామన్నారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిని, ప్రజల తలసరి ఆదాయాన్ని, వారి కొనుగోలు శక్తినీ పెంచామని వివరించారు. అంతకన్నా మెరుగ్గా సంక్షేమ పథకాలను అందిస్తామన్న కూటమిని నమ్మి ఈ ఎన్నికల్లో ప్రజలు వారిని గెలిపించారన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా కూటమి ఆ హామీలన్నీ అమలు చేయాలని కోరారు. ప్రాజెక్టుల్లో కొద్దిపాటి మిగులు పనులనూ పూర్తి చేసి ప్రజలకు వాటి ఫలాలను అందించాల్సిన బాధ్యత కొత్త ప్రభుత్వంపై ఉందన్నారు.ఏమాత్రం తేడా చేసినా నష్టపోయేదీ ప్రజలేనని అభిప్రాయపడ్డారు. ప్రజలు నష్టపోకూడదని, వారికి అన్నివిధాలా మేలు జరగాలని పార్టీ తరఫున ఆశిస్తున్నామన్నారు. ఐదేళ్ల పాటు ప్రజాసేవకు అవకాశమిచ్చిన ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు. ఇకపైన కూడా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటామన్నారు. ఎన్ని కష్టాలొచ్చినా, ప్రత్యర్థులు ఇబ్బందులకు గురిచేసినా ఏమాత్రం వెరవకుండా పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు, నాయకులకు ధన్యవాదాలు చెప్పారు.వారికి అన్నివేళలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో మాజీ ఉప ముఖ్యమంత్రులు పీడిక రాజన్నదొర, పాముల పుష్పశ్రీవాణి, మాజీ డిప్యూటీ స్పీకరు కోలగట్ల వీరభద్రస్వామి, ఎమ్మెల్సీ డాక్టర్ సురే‹Ùబాబు, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యేలు శంబంగి వెంకట చిన్న అప్పలనాయుడు, బొత్స అప్పలనర్సయ్య, కడుబండి శ్రీనివాసరావు, అలజంగి జోగారావు తదితరులు పాల్గొన్నారు. -
కొనసాగుతున్న కౌంటింగ్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు బుధవారం ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. స్ట్రాంగ్ రూమ్‌ల నుంచి బ్యాలెట్ బాక్సులను తీసుకొచ్చి 4 హాళ్లలో ఏర్పాటు చేసిన 96 టేబుళ్లపై ఉంచి 25 బ్యాలెట్ పేపర్లను ఒక బండిల్‌గా కట్టే ప్రక్రియను మొదట ప్రారంభించారు. ఆ బండిళ్లు కట్టే ప్రక్రియ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. 5 గంటలకు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. అర్ధరాత్రి దాటినా కూడా మొదటి రౌండ్ ఫలితాలు వెల్లడికాలేదు. కౌంటింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. 4 రౌండ్ల తర్వాత మొదటి ప్రాధాన్యత ఫలితం పట్టభద్రుల నియోజకవర్గంలో మొత్తం 4,63,839 ఓట్లుండగా 3,36,013 ఓట్లు పోలయ్యాయి. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. నాలుగు రౌండ్లలో ఈ లెక్కింపు పూర్తవుతుంది. నాలుగు హాళ్లలో ఏర్పాటు చేసిన 96 టేబుళ్లలో ఒక టేబుల్‌కు ఒక రౌండ్లో వెయ్యి ఓట్లు లెక్కిస్తున్నారు. అంటే ప్రతి రౌండ్లో 96 వేల చొప్పున 4వ రౌండ్లలో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపడతారు. మొదటి రౌండ్‌కు 6 గంటల సమయం: మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపునకు దాదాపు 6 గంటల సమయం పట్టింది. మిగతా మూడు రౌండ్ల ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం 11 గంటల వరకు పూర్తయ్యే అవకాశముంది. ఓట్ల లెక్కింపు సమయంలోనే ఆయా అభ్యర్థులకు బ్యాలెట్ పేపర్లు చూపి ఏ అభ్యరి్థకి మొదటి ప్రాధాన్యత ఓటు వేశారో చూపించి, ఆ అభ్యర్థి డబ్బాలో వేస్తున్నారు. ఒక వేళ ఏదేని ఓటు చెల్లకపోతే అది ఏజెంట్లకు చూపి చెల్లని ఓట్ల డబ్బాలో వేస్తున్నారు. ఇలా ప్రతి రౌండ్లోనూ కౌంటింగ్ సందర్భంగా చెల్లిన, చెల్లని ఓట్లు లెక్కిస్తున్నారు. పూర్తయిన మొదటి రౌండ్ కౌంటింగ్ బుధవారం రాత్రి 12 గంటలకు మొదటి ప్రాధాన్యత ఓట్ల మొదటి రౌండ్ లెక్కింపు పూర్తయ్యింది. సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన మొదటి రౌండ్ లెక్కింపునకు ఆరు గంటల సమయం పట్టింది. అయితే మిగతా మూడు రౌండ్లకు అంత సమయం పట్టదని, వాటికి తక్కువ సమయమే పడుతుందని అధికారులు చెబుతున్నారు. మొత్తానికి నాలుగు రౌండ్లలో జరిగే మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం 11 గంటల వరకు పూర్తయ్యే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. -
ఎన్నికల అధికారులకు అభినందనలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని శాంతియుతంగా పూర్తిచేసినందుకు, మొత్తం ఎన్నికల ప్రక్రియను అత్యంత ప్రొఫెషనల్ పద్ధతిలో నిర్వహించినందుకు జిల్లాల ఎన్నికల అధికారులకు, ఆర్వోలకు, ఎన్నికల సిబ్బందికి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా అభినందనలు తెలిపారు. ఇటువంటి ప్రతిభావంతులైన అధికారుల బృందానికి నాయకత్వం వహించినందుకు ఎంతో గర్వపడుతున్నట్లు చెప్పారు. ప్రజాస్వామ్య పండుగను రాష్ట్రంలో ఎంతో విజయవంతంగా నిర్వహించడంతోపాటు ఓట్ల లెక్కింపు ప్రక్రియలో రాష్ట్రవ్యాప్తంగా అనుసరించిన మంచి పద్ధతులను భవిష్యత్తు తరాలవారికి ఎంతో ఆదర్శంగా, మార్గదర్శకంగా ఉండే విధంగా ఒక కరదీపిక రూపొందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లాల వారీగా అనుసరించిన వినూత్న పద్ధతులను భారత ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లేందుకు మూడు రోజుల్లో తమ కార్యాలయానికి నివేదికలు పంపాలని కోరారు. అన్ని జిల్లాల నివేదికల ఆధారంగా సమగ్ర నివేదికను రూపొందించి భారత ఎన్నికల సంఘానికి పంపుతామని చెప్పారు. ఐదేళ్లకు ఒకసారి నిర్వహించే ప్రజాస్వామ్య పండుగను రాష్ట్రంలో ఎంతో విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. విమర్శలకు ఆస్కారం లేకుండా రూపొందించిన శుద్ధమైన ఓటర్ల జాబితా మొత్తం ఎన్నికల ప్రక్రియ విజయవంతంగా నిర్వహించేందుకు నాందిపలికిందని చెప్పారు. ఈ జాబితా రూపొందించేందుకు కృషిచేసిన అధికారులకు, సిబ్బందికి, అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులకు, ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భారత ఎన్నికల సంఘం 2024 మార్చి 16న ఎన్నికల షెడ్యూలు ప్రకటించినప్పటి నుంచి జూన్ 4న ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తిచేసేంతవరకు రాష్ట్రస్థాయి నుంచి జిల్లా, మండలస్థాయి వరకు ఎన్నికల యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం ఎంతో నిబద్ధతతో విధులు నిర్వర్తించినట్లు చెప్పారు. ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ యంత్రాంగం అవిరళ కృషిచేసిందన్నారు. కొన్నిచోట్ల చెదురుమదురు సంఘటనలు మినహా మొత్తం ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహంచడంలో సహకరించిన రాజకీయపక్షాల ప్రతినిధులు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. -
ఈవీఎంనే మార్చేశారు
మడకశిర (శ్రీసత్యసాయి జిల్లా): శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం ఓట్ల లెక్కింపులో అధికారులు ఈవీఎంనే మార్చేశారు. ఇందులోనూ ఓట్లు తప్పులతడకగా చూపాయి. ఓట్లలో తేడా ఉండటంతో వైఎస్సార్సీపీ అభ్యర్థి అభ్యంతరం చెప్పారు. చివరకు ఈ ఈవీఎం పార్లమెంట్ నియోజకవర్గానిదని తేలడంతో అందరూ నివ్వెరపోయారు. దీంతో అధికారులు వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కించారు. ఇది బయటపడిన సంఘటన మాత్రమే. బయటకు తెలియని ఇటువంటి ఈవీఎం మారి్పడి ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా ఇంకెన్ని జరిగాయోనన్న అనుమానాలు అందరికీ కలుగుతున్నాయి. మంగళవారం మడకశిర అసెంబ్లీ, హిందూపురం ఎంపీ స్థానాల ఓట్ల లెక్కింపు హిందూపురం బిట్ కళాశాలలో జరిగింది. ఒక గదిలో లోక్‌సభ ఓట్లు, పక్క గదిలోనే అసెంబ్లీ అభ్యర్థుల ఓట్ల లెక్కింపు చేపట్టారు. మడకశిర నియోజకవర్గం రొళ్ల మండలం పిల్లిగుండ్లు 131 పోలింగ్ బూత్ పార్లమెంట్ ఓట్ల ఈవీఎంను అధికారులు అసెంబ్లీ ఓట్లు లెక్కిస్తున్న టేబుల్ వద్దకు తీసుకొచ్చారు. ఇందులో బీఎస్పీ అభ్యర్థికి 414, వైఎస్సార్సీపీ అభ్యర్థికి 5, టీడీపీ అభ్యర్థికి 349 ఓట్లు వచ్చినట్లు చూపింది. వైఎస్సార్సీపీకి బలమున్న గ్రామంలో ఓట్లు మరీ తక్కువగా రావడంతో అనుమానం వచి్చన రొళ్ల జెడ్పీటీసీ సభ్యుడు అనంతరాజు వైఎస్సార్సీపీ అభ్యర్థి ఈర లక్కప్ప ద్వారా ఆర్వోకు ఫిర్యాదు చేయించారు. దీంతో దాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టి చివర్లో పరిష్కారం చూపుతామని ఆర్వో చెప్పారు. కౌంటింగ్ చివరలో టీడీపీకి 285 ఓట్ల ఆధిక్యం వచ్చింది. దీంతో పక్కన పెట్టిన ఈవీఎం సంగతి తేల్చాలంటూ వైఎస్సార్సీపీ అభ్యర్థి లక్కప్ప పట్టుబట్టారు. దీంతో ఆ ఈవీఎంను అధికారులు పరిశీలించగా పార్లమెంట్‌కు సంబంధించినదిగా తేలింది. తప్పును గుర్తించిన అధికారులు తీరిగ్గా ఆ పోలింగ్ బూత్‌కు సంబంధించి అసెంబ్లీ ఈవీఎం తీసుకువచ్చారు. అది అసలు ఓపెనే కాలేదు. దీనిపై వైఎస్సార్సీపీ అభ్యర్థి తీవ్ర అభ్యంతరం చెప్పడంతో చివరకు వీవీ ప్యాట్ స్లిప్పులు తీసుకొచ్చి లెక్కించారు. అందులో టీడీపీకి 349 ఓట్లు, వైఎస్సార్సీపీకి 414 ఓట్లు వచ్చాయి. చివరకు స్వల్ప ఆధిక్యంతో టీడీపీ గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. ఒకవేళ ఈవీఎం మారిన సంగతి బయటపడకుండా, పార్లమెంటు ఈవీఎం ఓట్లే లెక్కించి ఉంటే వైఎస్సార్సీపీ అభ్యర్థికి 414 ఓట్లకు బదులు 5 ఓట్లే వచ్చి ఉండేవి. ఎంతో పకడ్బందీగా జరగాల్సిన ఓట్ల లెక్కింపులో ఈవీఎం మారిపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పైగా, వైఎస్సార్సీపీ అభ్యర్థి పట్టుబట్టిన తర్వాత అసెంబ్లీ ఈవీఎం తెచ్చారు. అది కూడా ఓపెన్ కాకపోవడం అనుమానాలను మరింత బలపరుస్తోంది. ఇలా ఈవీఎం మారిన ఘటన ఒక్కటే బయటపడింది. ఎవరికీ తెలియకుండా రాష్ట్రవ్యాప్తంగా ఇంకెన్ని ఈవీఎంలు మారిపోయాయి, వాటిలో ఎన్ని లెక్కలు తేడాలున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈవీఎం మారిపోవడం, అసెంబ్లీ ఈవీఎం తెరుచుకోకపోవడంపై ఈసీని ఆశ్రయిస్తామని వైఎస్సార్సీపీ అభ్యర్థి లక్కప్ప చెప్పారు. ఇలా ఈవీఎంలపై అనుమానం ఉన్న అభ్యర్థులు వారంలోగా ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ఏ అభ్యర్థి నుంచైనా ఫిర్యాదు వస్తే 5% వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించాలి. ఈ మేరకు సుప్రీంకోర్టు గతంలోనే తీర్పు ఇచి్చంది. ఈ ఎన్నికల్లో ఆది నుంచి పలు వివాదాలు చోటు చేసుకోవడం, ఇప్పుడు మడకశిరలో ఈవీఎంనే మార్చేసిన తీరుతో ఓట్ల లెక్కింపుపై అనుమానాలున్న అభ్యర్థులు ఈసీకి ఫిర్యాదులు చేయడానికి సిద్ధపడుతున్నారు. -
సంబరాలు... సవాళ్ళు...
దేశవ్యాప్తంగా ఎన్నికలు ముగిశాయి. ఇక, కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. వరుసగా మూడోసారి కూడా మోదీ సారథ్యంలోని బీజేపీయే పగ్గాలు చేపడుతుందని అంచనాలు వినిపిస్తున్న వేళ ఓట్ల లెక్కింపుతో అసలైన ఫలితాలు ఇవాళ రానున్నాయి. అయితే, ఎన్నికలు ముగింపు దశలో ఉండగానే జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) గత శుక్రవారం వెలువరించిన దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) గణాంకాలు ఆసక్తికరమైన చర్చ రేపుతున్నాయి. జీడీపీ వృద్ధి దాదాపు 7.8 శాతం ఉండవచ్చని తొలుత అందరూ భావించినా, వాస్తవంలో అది 8.2 శాతానికి చేరింది. అంతకు ముందు ఏడాది (2022–23) సాధించిన 7 శాతంతో పోలిస్తే ఇది గణనీయమైన మెరుగుదల. పైగా, వరుసగా మూడు ఆర్థిక సంవత్సరాలుగా మన ఆర్థిక వ్యవస్థ 7 శాతం, అంతకు మించి పెరిగిందన్న మాట. దీంతో ప్రపంచంలో అత్యంత వేగంగా పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలుస్తోందని నిపుణుల మాట. ఇది విశేషమే... కాదనలేం. కానీ, ఈ ఏడాది కూడా ఇదే పురోగతిని నిలబెట్టుకోవడానికి ఏం చేయాలి? అలాగే, దేశాన్ని వేధిస్తున్న నిరుద్యోగం తదితర సమస్యల మాటేమిటి?నిజానికి, దేశ వాస్తవిక జీడీపీ ఇటు అధికారిక, అటు ప్రైవేట్ అంచనాలన్నిటినీ అధిగమించి ఆశ్చర్యపరిచింది. కోవిడ్ దెబ్బ కొట్టిన తర్వాత, అందులోనూ ప్రపంచమంతా నత్తనడక నడుస్తున్నప్పుడు వృద్ధిలో ఈ రకమైన గణాంకాలు వచ్చాయంటే, అనేక ఆటుపోట్లను భారతీయ గృహవ్యవస్థ, వ్యాపారాలు తట్టుకొని దృఢంగా నిలబడడమే కారణం. అలాగే, ప్రధానంగా నిర్మాణ, వస్తూత్పత్తి రంగాల పుణ్యమా అని కూడా గడచిన 2023–24 ఆర్థిక సంవత్సరంలో మన ఆర్థికవ్యవస్థ అనుకున్న దాని కన్నా మెరుగైన వృద్ధిని సాధించినట్టు విశ్లేషణ. ప్రైవేట్ పెట్టుబడులు వేగం పుంజుకోకున్నా, ప్రాథమిక వసతి సౌకర్యాల కల్పనలో ప్రభుత్వ పెట్టుబడులు ఆర్థిక వృద్ధిలో సింహభాగానికి కారణమని చెబుతున్నారు. కేంద్రంలో కొత్త ప్రభుత్వం వచ్చాక ప్రైవేట్ పెట్టుబడులు పెరుగుతాయని భావిస్తున్నారు. మొత్తం మీద వచ్చే సర్కారుకు ఈ అంకెలు, ఇటీవల భారతీయ రిజర్వ్ బ్యాంక్ బదలాయించిన మిగులు నిధుల లాంటివి కొంత సౌకర్యాన్నిచ్చే అంశాలు. అక్కడ నుంచి సమతూకం నిండిన ఆర్థికాభివృద్ధి వైపు ఎలా నడిపించాలన్నది కీలకమైన అంశం. గమనిస్తే... ఆర్థిక వృద్ధిలో మెరుగుదల ఏడేళ్ళ పాటు నిదానంగా సాగింది. దానికి కొత్త ఊపునిచ్చేందుకు మోదీ సర్కార్ ఏటా రైల్వే, రోడ్లు, పట్టణ రవాణా, వాటర్‌వర్క్స్, రక్షణ ఉత్పత్తులపై ఏటా రూ. 11 లక్షల కోట్లు ఖర్చు పెడుతోంది. దీనివల్ల లక్షలాది ఉద్యోగాలు రావాలి. కానీ, వాస్తవ పరిస్థితులు మాత్రం కొంత భిన్నంగా ఉన్నాయి. దేశంలో నిరుద్యోగ సమస్య ఇప్పటికీ ప్రబలంగా కనిపిస్తోంది. దానికి తోడు ఆర్థిక వ్యత్యాసం, ద్రవ్యోల్బణం సామాన్యుల్ని వేధిస్తున్నాయి. ఉదాహరణకు భవన నిర్మాణ రంగంలో నూటికి 80 మంది ఉండే నైపుణ్య రహిత కార్మికుల సగటు రోజు వారీ కూలీ సైతం అనేక రాష్ట్రాల్లో జాతీయ సగటు కూలీ కన్నా తక్కువే ఉందని విశ్లేషణలు తేల్చాయి. మహిళా శ్రామికుల కూలీలైతే మరీ కనాకష్టం. ప్రభుత్వ లెక్కల ప్రకారమే... మన దేశ తలసరి ఆదాయం, మరో మాటలో నికర జాతీయ ఆదాయం 2014–15లో రూ.72,805 ఉండేది. అది కేవలం 3.83 శాతం వార్షిక చక్రవృద్ధి రేటుతో 2022–23లో రూ.98,374కు చేరింది. వాస్తవిక ద్రవ్యోల్బణ ప్రభావాన్ని గనక పరిగణనలోకి తీసుకుంటే, ఈ వృద్ధి రేటు అసలైతే ఇంకా తక్కువే ఉంటుంది. అది అటుంచితే – విద్య, ఆరోగ్యం, ప్రజారవాణా, కాలుష్యం వగైరా అంశాల్లో సగటు జనాభా జీవన ప్రమాణాలు మెరుగుపడలేదు. సరికదా ఇంకా దిగజారాయి. అదే విషాదం. ఇంకా చెప్పాలంటే, ప్రపంచంలోని అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరణ అనే నినాదంలో గర్వించడానికి తగిన అంశాలు కొన్నే కనిపిస్తున్నాయి. ప్రపంచ దేశాల తలసరి ఆదాయం జాబితాలో 2018లో మనం 153వ స్థానంలో ఉండేవాళ్ళం. అప్పటితో పోలిస్తే, మనం మెరుగుపడి 144వ స్థానానికి చేరాం. కానీ, ఇప్పటికీ మనం అడుగునే ఉన్నామని మర్చిపోలేం. సాధించిన కొద్దిపాటి మెరుగుదల దేశ ప్రజల్ని దారిద్య్రం నుంచి బయటపడేయడానికి చాలదు. నాణ్యమైన జీవన ప్రమాణాలకూ సరిపోదు. 2029 నాటికి గానీ మన దేశం తలసరి ఆదాయంలో ఉజ్బెకిస్తాన్, పాపువా న్యూ గినియా, అంగోలా లాంటి దేశాలను అధిగమించలేదని గుర్తించాలి. కాబట్టి, కొత్త ప్రభుత్వానికి తన ముందున్న సవాలేమిటో స్పష్టంగా తెలుస్తూనే ఉంది. భారత జనాభాలో ఇప్పటికీ అధిక శాతం గ్రామీణ, బస్తీ ప్రాంతాల్లోనే నివసిస్తోంది. వారి కష్టనష్టాలు, జీవన పరిస్థితులు స్టాక్ మార్కెట్ల విజృంభణను చూసి చప్పట్లు కొట్టే వర్గాలకు పెద్దగా తెలియవు. తాజా ఎన్నికల దయతో నిరుద్యోగం, ఆర్థిక అసమతౌల్యం, ద్రవ్యోల్బణం లాంటివి మళ్ళీ కనీసం చర్చకైనా వచ్చాయి. ‘గ్రామీణ ప్రాంతాల్లోని దురవస్థల’ ప్రస్తావన జరిగింది. అందుకే, గడచిన నాలుగు త్రైమాసికాలను కలిపి తీసిన ఆఖరి లెక్కలు పైకి సంతోషం రేపుతున్నా, క్షేత్రస్థాయిలోని ఇలాంటి అనేక సమస్యల పరిష్కారానికి కృషి చేయకపోతే కష్టమే. ఇప్పటి లెక్కలతో తృప్తిపడి, ఉదాసీనంగా వ్యవహరించకుండా సవాళ్ళను ఎదుర్కొంటూ ముందడుగు వేయాలి. అందుకోసం ఆర్థిక విధానాలను నిర్ణయించే ప్రభుత్వ యంత్రాంగం దీర్ఘకాలిక దృష్టితో వ్యవహరించాలి. ప్రజల నైపుణ్యాలను పెంచి, వారిని మరింత ఉద్యోగార్హులుగా తీర్చిదిద్దడంపై దృష్టిపెట్టాలి. అందుకు తగ్గ సంస్కరణలు చేపట్టాలి. అప్పుడే ఏటికేడు ఈ వృద్ధి అంకెలు స్థిరపడతాయి. సామాన్యుల జీవితాలు నిలబడతాయి. లేదంటే ‘వికసిత భారత్’ మాటల్లో, లెక్కల్లోనే మిగిలిపోతుంది. -
లోక్‌సభ ఓట్ల లెక్కింపుపై ‘డబుల్’ ఉత్కంఠ
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల ఫలితాల వేళ తెలంగాణలో ఉత్కంఠ నెలకొంది. పోలింగ్ జరిగిన 22 రోజుల తర్వాత జరుగుతున్న ఓట్ల లెక్కింపు కో సం రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పక్షాలు ఎదురుచూస్తున్నాయి. పోలింగ్ సరళి, ఎగ్జిట్ పోల్స్‌ను బ ట్టి.. రాష్ట్రంలో పోటీ రెండు జాతీయ పార్టీల మధ్యే జరిగిందన్న అంచనాలు వెలువడ్డాయి. దీంతో కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు కూడా మెజార్టీ సీట్లు త మకంటే తమకేనని.. డబుల్ డిజిట్ స్థానాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కచ్చితంగా పది స్థానాలు గెలుస్తామని కాంగ్రెస్.. పది కంటే ఎక్కువే గెలుస్తామని బీజేపీ నేతలు చెప్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ ఎన్ని స్థానాల్లో గెలుస్తామన్న దానిపై క చ్చితమైన లెక్కలు చెప్పకపోయినా.. కనీస స్థానా ల్లో విజయం దక్కుతుందని ఆశిస్తోంది. మరోవైపు జాతీయ స్థాయిలో ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతోందన్న దానిపైనా రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. 12 సీట్లు కూడా రావొచ్చంటున్న కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో ఊపు మీదున్న కాంగ్రెస్ పార్టీ.. లోక్‌సభ ఎన్నికల్లోనూ సానుకూల ఫలితాలు వస్తాయనే అంచనాలో ఉంది. కనీసం తొమ్మిది, పది స్థానాల్లో గెలుస్తామన్న ధీమా ఆ పార్టీ నేతల్లో కనిపిస్తోంది. పోలింగ్ సరళిని బట్టి చూస్తే మరో రెండు, మూడు సీట్లు కూడా గెలుస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. దక్షిణ తెలంగాణలోని నల్లగొండ, భువనగిరి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్‌తోపాటు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పూర్తి పట్టు సాధించిన వరంగల్, మహబూబాబాద్, పెద్దపల్లి లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు నల్లేరు మీద నడకేనని అంటున్నారు. సికింద్రాబాద్, ఆదిలాబాద్ స్థానాల్లోనూ విజయం సాధిస్తామని లెక్కలు వేస్తున్నారు. చేవెళ్ల, మల్కాజ్గిరి, జహీరాబాద్ లోక్‌సభ స్థానాల్లో బీజేపీ నుంచి గట్టిపోటీ ఎదురైనా.. విజయ తీరం చేరుతామనే అంచనాలో ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ బలహీనపడటం, బీజేపీకి సంస్థాగత బలం లేకపోవడం, అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ఎన్నికలు రావడంతో పెద్దగా ప్రజా వ్యతిరేకత లేకపోవడం, గ్రామీణ స్థాయిలో పార్టీకి ఉన్న పట్టు వంటివి అనుకూలిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మోదీ మేజిక్‌తో బీజేపీదే హవా అంటున్న కమలనాథులు మోదీ మేజిక్‌తో తెలంగాణలోనూ బీజేపీ హవా కొనసాగుతుందని ఆ పార్టీ ముఖ్య నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్లు గెలిచి సత్తా చాటుతామని అంటున్నారు. ఎగ్జిట్ పోల్స్‌లో వెలువడిన అంచనాలను మించి సీట్లు సాధిస్తామని చెబుతున్నారు. గత ఎన్నికల్లో గెలిచిన నాలుగు ఎంపీ సీట్లకు అదనంగా మరో ఆరేడు సీట్లు గెలుస్తామని అంటున్నారు. రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల్లో జాతీయ పార్టీలే ప్రభావం చూపాయని కమలనాథులు చెబుతున్నారు. కేంద్రంలో మళ్లీ మోదీ ప్రభుత్వం ఏర్పడుతుందనే అంచనాలు తమకు ఉపకరించాయని.. ఈ ఎఫెక్ట్‌తో పలు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి బదిలీ అయ్యాయని అంచనా వేస్తున్నారు. ఎగ్జాక్ట్ పోల్స్ తమకే అనుకూలమంటూ బీఆర్ఎస్ లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఎగ్జిట్ పోల్స్‌తో సంబంధం లేకుండా ఎగ్జాక్ట్ పోల్స్ ఫలితాలు తమకు అనుకూలంగా ఉంటాయని బీఆర్ఎస్ అంటోంది. బీఆర్ఎస్ ఒకట్రెండు స్థానాలకు మించి గెలిచే అవకాశం లేదని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నా.. బీఆర్ఎస్ మాత్రం అంతకంటే మెరుగైన ఫలితాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎనిమిది లోక్‌సభ సెగ్మెంట్ల పరిధిలో బీఆర్ఎస్ ఆధిక్యత కనబర్చిందని.. అదే తరహాలో ఇప్పుడు ఫలితాలు ఉంటాయని అంచనా వేసుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికల తరహాలో ఇప్పుడు కాంగ్రెస్ అనుకూల ఓటింగ్ జరగలేదని.. అదే సమయంలో బీజేపీ భారీగా ఏమీ పుంజుకోలేదని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. బీఆర్ఎస్తో పోలిస్తే కాంగ్రెస్ ఓటు బ్యాంకుకే ఎక్కువగా గండి పడిందని పేర్కొంటున్నారు. అంతేగాకుండా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ 17 రోజుల పాటు చేసిన బస్సుయాత్ర కూడా ప్రభావం చూపిందని.. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఓటేసినవారిలో కొంత మేర తిరిగి అనుకూలంగా మారారని చెబుతున్నారు. కాంగ్రెస్, బీజేపీతో జరిగిన ముక్కోణపు పోటీ బీఆర్ఎస్కు అక్కడక్కడా అనుకూలిస్తుందనే అంచనా వేస్తున్నారు.ఢిల్లీ పీఠం ఎవరిదో..?లోక్‌సభ ఎన్నికల్లో జాతీయ స్థాయి ఫలితాలు ఎలా ఉంటాయన్నదానిపై తెలంగాణ రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. ఈసారి కూడా మోదీ నేతృత్వంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ పేర్కొనడం ఓవైపు.. ఎగ్జిట్ పోల్స్ ఫెయిలవుతాయని, ఇండియా కూటమి గెలుస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చేసిన కామెంట్స్ మరోవైపు ఉత్కంఠ రేపుతున్నాయి. దేశవ్యాప్తంగా మోదీ ప్రభావం ఎలా ఉంటుంది?ఇండియా కూటమికి ఉన్న సానుకూలతలేంటి? ఏ రాష్ట్రంలో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనే అంశాలపై చర్చ జరుగుతోంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఫలితాలు ఎలా ఉంటాయన్నదానిపైనా తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఎడతెగని చర్చ నడుస్తోంది.ఆ స్థానాలపై మరింత ఆసక్తితెలంగాణలోని నాలుగైదు నియోజకవర్గాల్లో ఫలితం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. బీజేపీ నేత, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ తరఫున ఎంపీ అభ్యరి్థగా బరిలోకి దిగిన దానం నాగేందర్ తలపడుతున్న సికింద్రాబాద్ ఫలితంపై అందరి ఫోకస్ ఉంది. పీసీసీ చీఫ్, సీఎం రేవంత్‌రెడ్డి గతంలో ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్గిరి.. ఎన్డీయే ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే కేంద్ర మంత్రి అయ్యే చాన్స్ ఉందంటున్న బండి సంజయ్ బరిలో ఉన్న కరీంనగర్.. బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన నేతలు పోటీ చేస్తున్న జహీరాబాద్, నాగర్‌కర్నూల్, వరంగల్ తదితర స్థానాల్లో ఫలితాలపైనా ఆసక్తి ఉంది. -
రాష్ట్రంలో రూ.483.15 కోట్ల నగదు, సొత్తు స్వాధీనం: ముఖేష్‌కుమార్ మీనా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని ఈ ఏడాది జనవరి 1 నుంచి ఈనెల 2 వరకు రూ.483.15 కోట్ల విలువైన నగదు ఇతర సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా తెలిపారు. ఓట్ల లెక్కింపు ఏర్పాట్లతోపాటు ఎన్నికల కోడ్ అమల్లో భాగంగా చేపట్టిన చర్యలను సోమవారం సచివాలయంలో ఆయన మీడియాకు వెల్లడించారు. ఎన్నికల కోడ్ అమల్లో భాగంగా రూ.170 కోట్ల నగదు, రూ.61.66 కోట్ల విలువైన లిక్కర్, రూ.35.97 కోట్ల విలువైన డ్రగ్స్, రూ.186.17 కోట్ల విలువైన ఆభరణాలు, రూ.29.34 కోట్ల విలువైన ఉచితాల వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు. వీటన్నింటికీ సంబంధించి 11,249 కేసులను, ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు సంబంధించి 1,270 కేసులను నమోదు చేసినట్లు మీనా తెలిపారు. ఇక ఎన్నికల హింసలో ఇద్దరు మృతిచెందగా 912 మందికి గాయాలయ్యాయన్నారు. ఈ హింస సందర్భంగా రూ.1,19,13,650 కోట్ల విలువైన ఆస్తి నష్టం జరిగిందన్నారు. 1,03,461 మందిని బైండోవర్ చేశామని.. అలాగే, సమస్యలు, అల్లర్లు సృష్టించే 551 మందిని గుర్తించి చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు.తొలిసారిగా 1,985 ప్రాంతాల్లో కార్టన్ సెర్చ్..ఇదిలా ఉంటే.. సి–విజిల్ ద్వారా 24,557 ఫిర్యాదులు రాగా అందులో 95 శాతం ఫిర్యాదులను 100 నిమిషాల్లోనే పరిష్కరించినట్లు ముఖేష్‌కుమార్ మీనా తెలిపారు. పోలింగ్ అనంతరం హింసను నివారించేందుకు రాష్ట్రంలో తొలిసారిగా కార్టన్ సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించామని.. సమస్యాత్మకమైన 1,985 ప్రాంతాలను గుర్తించి అక్కడ సోదాలు నిర్వహించారని ఆయన తెలిపారు. ఇప్పటివరకు 1,200 సోదాలు నిర్వహించడం ద్వారా 4,595 వాహనాలను, 1,269 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు 153 మందిపై కేసులు నమోదుచేశామని ఆయన వివరించారు. పోలింగ్ అనంతరం సమస్యలను, అల్లర్లను సృష్టించే 12,639 మందిని గుర్తించి సీఆర్పీసి కింద బైండోవర్ చేసినట్లు మీనా తెలిపారు. -
21 రోజుల నిరీక్షణ.. ఉత్కంఠకు నేడే తెర
సాక్షి, అమరావతి: ఓటర్ల తీర్పు వెల్లడికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. మరి కొద్ది గంటల్లో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఫలితాలపై గత 21 రోజులుగా రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల్లో నెలకొన్న ఉత్కంఠకు తెరపడనుంది. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లను, ఆ తర్వాత 8.30 గంటల నుంచి ఈవీఎంలలో నిక్షిప్తం అయిన ఓట్లను లెక్కిస్తారు. ఇప్పటికే విడుదలైన మెజార్టీ సర్వేల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వైఎస్సార్సీపీ రెండోసారి అధికారం చేపట్టనుందని తేల్చాయి. గత నెల 13వ తేదీన రాష్ట్ర అసెంబ్లీకి, లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. అయితే దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో పోలింగ్ నిర్వహించడం, శనివారంతో చివరి దశ పోలింగ్ ముగియడంతో ఫలితాల కోసం జూన్ 4 వరకు వేచి చూడాల్సి వచ్చింది. నేటి మధ్యాహ్నానికి ఫలితాలపై స్పష్టత వస్తుంది. అయితే ఈవీఎం కంట్రోల్ యూనిట్ల ఓట్ల లెక్కింపు పూర్తి అయినప్పటికీ, ప్రతి నియోజకవర్గంలో ఐదు వీవీప్యాట్లలోని స్లిప్‌లను కూడా చివర్లో లెక్కించాల్సి ఉంటుంది. అందువల్ల అధికారికంగా ఫలితాల ప్రకటనకు కొంత జాప్యం అవుతుంది.తొలి ఫలితం కొవ్వూరు, నరసాపురంరాష్ట్రంలో మొత్తం 4.13 కోట్ల మంది ఓటర్లు ఉండగా, ఇందులో ఈవీఎంల ద్వారా 3.33 కోట్ల మంది, పోస్టల్ బ్యాలెట్ ద్వారా 5.15 లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళలు, వృద్ధులు అ్యధిక సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకోవడం ద్వారా రికార్డు స్థాయలో 81.8 శాతం ఓటింగ్ నమోదైంది. 175 అసెంబ్లీ స్థానాలకు 2,387 మంది, 25 లోక్‌సభ స్థానాలకు 454 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఓట్ల లెక్కింపు కోసం 33 చోట్ల 401 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ తర్వాత కొన్ని చోట్ల హింసాత్మక సంఘటనలు చేటు చేసుకోవడంతో, ఓట్ల లెక్కింపు సందర్భంగా అటువంటి సంఘటలను పునరావృతం కాకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు 111 అసెంబ్లీ స్థానాల్లో 5 – 6 గంటల్లోనే పూర్తి కానుంది. 61 నియోజకవర్గాల్లో 6 – 8 గంటలు, మూడు నియోజకవర్గాల్లో 9 – 10 గంటల సమయం పట్టనుంది. పార్లమెంటు ఫలితాలకు సంబంధించి 13 రౌండ్లు ఉన్న రాజమండ్రి, నరసాపురం ఫలితాలు తొలుత వెల్లడి కానుండగా, 27 రౌండ్ల లెక్కింపు ఉన్న అమలాపురం ఫలితం ఆలస్యంగా రానుంది. అసెంబ్లీ విషయానికి వస్తే కేవలం అయిదు గంటలలోపే తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు, నరసాపురం ఫలితాలు.. ఆలస్యంగా భీమిలి, పాణ్యం ఫలితాలు వెల్లడి కానున్నాయి.ఒంటరిగా సిద్ధంవైఎస్సార్సీపీ ఎవరితో పొత్తు లేకుండా ఒంటరిగానే 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసింది. తెలుగుదేశం పార్టీ జనసేన, బీజేపీలతో జట్టు కట్టి కూటమిగా పోటీలో నిలిచింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సిద్ధం పేరుతో ముందస్తుగా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోగా, తెలుగుదేశం పార్టీ సీట్ల పంపకం, అభ్యర్థుల ఎంపికపై సిగపట్లు పడుతూ ప్రచారంలో వెనుకబడ్డారు. టీడీపీ 144 అసెంబ్లీ, 17 పార్లమెంటు స్థానాల్లో, భారతీయ జనతాపార్టీ ఆరు పార్లమెంటు, 10 అసెంబ్లీ.. జనసేన రెండు పార్లమెంటు, 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ పడుతున్నాయి. వైఎస్సార్సీపీ అత్యధిక స్థానాల్లో సామాన్యులను అభ్యర్థులుగా నిలబెట్టగా, తెలుగుదేశం పార్టీ పొత్తులు పెట్టుకొని తమ పార్టీకి చెందిన అభ్యర్థులను బీజేపీ, జనసేనల్లోకి పంపి అభ్యర్థులుగా నిలబెట్టింది.ఫలితాలు ఇలా తెలుసుకోవచ్చు..ఎన్నికల సరళిని, ఫలితాలను ఎప్పటికప్పుడు తెలియచేసేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. లెక్కింపులో ఒక రౌండు పూర్తి కాగానే ఆ ఫలితాలను కౌంటింగ్ సెంటర్ వద్ద మైక్‌లో వెల్లడించడంతో పాటు, మీడియా ప్రతినిధులకు కనపడే విధంగా డిస్ప్లే బోర్డులను కూడా ఏర్పాటు చేసింది. ప్రతి రౌండు ఫలితాలను సువిధా యాప్‌లో అప్లోడ్ చేయనున్నారు. నియోజకవర్గ ఫలితాలతో పాటు దేశ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల ఫలితాలను తెలుసుకోవడానికి ఎన్నికల సంఘం ప్రత్యేకంగా ఒక వెబ్‌సైట్‌ను, యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. https://results.eci.gov.in వెబ్సైట్ ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు. దీంతోపాటు ‘ఓటర్స్ హెల్ప్¬లైన్’ అనే యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా ఎన్నికల ఫలితాల సరళిని తెలుసుకోవచ్చు. 25,209 మంది సిబ్బంది : ముఖేష్ కుమార్ మీనారాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాల్లో 2,387 మంది, 25 పార్లమెంటు స్థానాల్లో 454 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చడానికి పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. సోమవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు కోసం 25,209 మంది సిబ్బందిని వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఓట్ల లెక్కింపును పర్యవేక్షించడానికి 119 మంది కేంద్ర అబ్జర్వర్లు ఇప్పటికే రాష్ట్రానికి చేరుకున్నారన్నారు. పార్లమెంటు స్థానాలకు తొలుత 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభించి, 8.30 తర్వాత ఈవీంఎల లెక్కింపును కూడా ప్రారంభించనున్నట్లు తెలిపారు. పోస్టల్ బ్యాలెట్లో డిక్లరేషన్ ఫారంపై రిటర్నింగ్ అధికారి నియమించిన అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం ఉంటే సరిపోతుందని, దీనిపై ఇక ఎటువంటి అభ్యంతరాలను అనుమతించమని స్పష్టం చేశారు. ఈసారి అత్యధిక సంఖ్యలో పోస్టల్ బ్యాలెట్లు నమోదు కావడంతో 25 చోట్ల నాలుగు రౌండ్లు కూడా లెక్కింపు జరగనుందన్నారు. ప్రతి 500 ఓట్లు ఒక రౌండ్‌గా లెక్కిస్తామని, ఇది సుదీర్ఘ పక్రియ కావడంతో ఒకొక్క రౌండ్ పూర్తి కావడానికి కనీసం రెండున్నర గంటల సమయం పడుతుందని చెప్పారు. అదే ఈవీఎంల లెక్కింపులో ప్రతి రౌండు సగటున 25 నిమిషాల నుంచి 30 నిమిషాల్లో పూర్తవుతుందన్నారు. లెక్కింపు ప్రారంభమైన అయిదు గంటల్లోనే మెజార్టీ నియోజకవర్గాల ఫలితాలు వెల్లడవుతాయని స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద 45,000 పోలీసు సిబ్బందితో పాటు 67 కంపెనీల సాయుధ బలగాలను వినియోగిస్తున్నట్లు తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద డ్రోన్ కెమెరాలతో కూడా నిఘా పెట్టామని, లోపల ఈవీఎంల తరలింపు నుంచి ఓట్ల లెక్కింపు మొత్తం వీడియో చిత్రీకరణ చేస్తామన్నారు. ఏజెంట్లు తమ అభ్యంతరాలను లిఖిత పూర్వకంగా ఇవ్వాలని, దురుసుగా వ్యవహరిస్తే ఎన్నికల నిబంధన 54 కింద కౌంటింగ్ హాల్ నుంచి బయటకు పంపిస్తామని స్పష్టం చేశారు. రీ కౌంటింగ్ కోరితే దానికి గల స్పష్టమైన కారణాలను లిఖిత పూర్వకంగా ఇవ్వాలన్నారు. ఆ కారణాలతో ఆర్వో ఏకిభవిస్తేనే రీ కౌంటింగ్‌కు అనుమతిస్తారని చెప్పారు. కౌంటింగ్ హాళ్లలోకి మొబైల్ ఫోన్లను అనుమతించరని స్పష్టం చేశారు. కౌంటింగ్ తర్వాత అభ్యర్థి గెలిచినట్లు ఫారం 20 ఇవ్వడానికి కనీసం గంట– గంటన్నర పడుతుందని, అప్పటి వరకు అభ్యర్థి వేచి ఉండాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం మద్యం అమ్మకాలపై నిషేధం విధించామని తెలిపారు. -
సంబరాలకు సిద్ధంకండి: సజ్జల రామకృష్ణారెడ్డి
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘనవిజయం సాధిస్తుందని.. వైఎస్ జగన్మోహన్రెడ్డి మళ్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఎన్నికల సంఘం మంగళవారం ఓట్ల లెక్కింపు చేపడుతుందని.. వైఎస్సార్సీపీ విజయకేతనం ఎగురవేస్తుందని, ఉ.10.30 గంటల నుంచి సంబరాలకు సిద్ధంకావాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం సజ్జల మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారు.ఇండియా టుడే–మై యాక్సిస్ ఎగ్జిట్ పోల్స్ బోగస్ అంటూ కొట్టిపారేశారు. ఆ సంస్థ జనసేన, బీజేపీకి ఎగ్జిట్ పోల్స్‌లో ఇచ్చిన స్థానాలు, ఓట్ల శాతమే అందుకు నిదర్శనమన్నారు. ఆ ఎగ్జిట్ పోల్స్‌లో 21 స్థానాల్లో పోటీచేసిన జనసేనకు ఏడు శాతం ఓట్లు వస్తాయని పేర్కొన్నారని.. ఈ లెక్కన ఒక్కో శాసనసభ స్థానంలో జనసేన అభ్యర్థికి 61 శాతం ఓట్లు రావాల్సి ఉంటుందని.. ఇది సాధ్యమయ్యే పనేనా? అంటూ ప్రశ్నించారు. బీజేపీ వ్యూహంలో భాగంగా దక్షిణాదిలో నాలుగు సీట్లు ఎక్కువ వచ్చినట్లు చూపించే ప్రయత్నంలో ఇది భాగమని చెప్పారు. బీజేపీ కూటమిలో టీడీపీ భాగస్వామి కాకపోయి ఉంటే.. ఇండియా టుడే–యాక్సిస్ మై ఇండియా ఈ రీతిలో ఎగ్జిట్ పోల్స్ వెల్లడించేదే కాదన్నారు.స్కిల్ స్కాంలో చంద్రబాబు అరెస్టుపై రాష్ట్రంలో అసలు చర్చే జరగలేదని.. దానివల్ల టీడీపీకి ప్రజల్లో సానుభూతి వచ్చిందని ఆ సంస్థ పేర్కొనడం విడ్డూరమన్నారు. టైమ్స్ నౌ, దైనిక్ భాస్కర్ సహా రాష్ట్రంలోని పరిస్థితులపై సంపూర్ణ అవగాహన ఉన్న సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్‌లో వైఎస్సార్సీపీ ఘనవిజయం సాధిస్తున్నట్లు తేల్చాయని సజ్జల గుర్తుచేశారు. ఆ సంస్థలు ఎగ్జిట్ పోల్స్‌లో పేర్కొన్న స్థానాల కంటే వైఎస్సార్సీపీ అధిక స్థానాల్లో విజయం సాధిస్తుందని స్పష్టంచేశారు.ఓట్ల లెక్కింపునకు సంబంధించి ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా వైఎస్సార్సీపీ కౌంటింగ్ ఏజెంట్లందరూ అప్రమత్తంగా ఉండాలని సజ్జల పిలుపునిచ్చారు. సంయమనంతో వ్యవహరిస్తూ.. వైఎస్సార్సీపీ అభ్యరి్థకి వచ్చిన ఒక్క ఓటు కూడా పోకుండా అభ్యర్థి ఖాతాలో పడేలా జాగ్రత్త వహించాలని ఆయన సూచించారు. కౌంటింగ్ పూర్తయి వైఎస్సార్సీపీ అభ్యర్థి గెలుపొందినట్లు డిక్లరేషన్ తీసుకునే వరకు కౌంటింగ్ కేంద్రం నుంచి కదలవద్దని సజ్జల కోరారు. టీడీపీ విజ్ఞప్తి మేరకే ఆ సడలింపులుఇక పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఎన్నికల సంఘం సడలింపులను సుప్రీంకోర్టు కొట్టేసినంత మాత్రానా వాళ్లు చేసింది తప్పు తప్పు కాకుండా పోదన్నారు. పోలింగ్ పూర్తయిన తర్వాత పోస్టల్ బ్యాలెట్ నిబంధనలను సడలించడంలో ఆంతర్యమేమిటని.. పోస్టల్ బ్యాలెట్ల అంశంలో దేశవ్యాప్తంగా ఒక రూలూ.. రాష్ట్రంలో మరో రూలా? ఇదెక్కడి న్యాయమంటూ ఆయన ప్రశ్నించారు. టీడీపీ నేతల విజ్ఞప్తి మేరకు పోస్టల్ బ్యాలెట్ నిబంధనలను సడలించడం విడ్డూరంగా.. అనుమానాస్పదంగా ఉందని.. అందుకే ఆ అంశంపై న్యాయపోరాటం చేశామని సజ్జల చెప్పారు.తన శక్తి ఇంత ఉందని ఒక రౌడీ ఎలాగైతే రౌడీయిజం చేసి అందరినీ భయపెడతాడో చంద్రబాబూ కూడా బీజేపీతో పొత్తు కుదిరాక ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకుని అధికారులను బదిలీలు చేయిస్తూ యంత్రాంగంపై పట్టు సాధించే ప్రయత్నం చేశారని విమర్శించారు. చంద్రబాబుకు భయపడి కొందరు అధికారులు టీడీపీకి అనుకూలంగా ప్రవర్తించేందుకు అవకాశముందని.. అందుకే ఓట్ల లెక్కింపులో ఏజెంట్లను అప్రమత్తంగా ఉండాలని సూచించామన్నారు.తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నామో అధికారంలో ఉన్నప్పుడు కూడా అంతే బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నామని.. ఎన్నికల సంఘం నిబంధనలను పాటిస్తున్నామని సజ్జల గుర్తుచేశారు. గత ఎన్నికల సమయంలో అధికారంలో ఉన్న బాబు.. ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్లి సీఈఓను బెదిరించారని గుర్తుచేశారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా కళ్లెదుట ఘోరపరాజయం కన్పిస్తుండటంవల్లే ఆయన నిశ్శబ్దంగా ఉన్నారని.. ఓటమికి మానసికంగా సిద్ధమవుతున్నారంటూ ఎద్దేవా చేశారు.కౌంటింగ్‌లో అప్రమత్తంగా ఉండాలి⇒ ఉదయం 6కల్లా లెక్కింపు కేంద్రం దగ్గర ఉండాలి ⇒ కౌంటింగ్ ఏజెంట్లకు సజ్జల దిశానిర్దేశం ‘ఈ ఎన్నికల్లో మనం పక్కాగా గెలుస్తున్నాం.. అయినా కౌంటింగ్‌లో మన పార్టీ తరఫున ఏజెంట్లుగా ఉంటున్న మీరు అప్రమత్తంగా ఉండాలి’.. అని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. వైఎస్సార్సీపీ మళ్లీ రెండోసారి ప్రభుత్వం ఏర్పాటుచేయబోతోందని.. వైఎస్ జగన్ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారని ఆయన చెప్పారు.ఏజెంట్లు ఉ.6 గంటలకల్లా కౌంటింగ్ హాల్ దగ్గర కచ్చితంగా ఉండాలని.. హాల్లో కౌంటింగ్ ప్రారంభం సమయం నుంచి ముగింపు దశ వరకు చాలా చురుగ్గా ఉండాలన్నారు. అదే సమయంలో సంయమనం పాటిస్తూ ఈవీఎం, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఖచ్చితంగా కౌంట్ అయ్యేలా చూస్తూ, లెక్కింపు న్యాయబద్ధంగా సజావుగా సాగేలా ప్రయత్నం చేయాలన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పారీ్టకి వచ్చిన ఒక్క ఓటు కూడా పోకుండా పాజిటివ్‌గా పార్టీ అకౌంట్లో పడేవిధంగా జాగ్రత్త వహించాలని.. కౌంటింగ్ పూర్తయి డిక్లరేషన్ తీసుకునే వరకు కూడా అక్కడ నుంచి ఎవరూ కదలొద్దన్నారు.తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం కౌంటింగ్ ఏజెంట్లతో జూమ్ ద్వారా సజ్జల సమావేశం నిర్వహించారు. కౌంటింగ్ కేంద్రాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన వారికి దిశానిర్దేశం చేశారు. సమావేశంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, విశ్రాంత ఆర్డీఓ ప్రభాకర్‌రెడ్డి, లీగల్ సెల్ ప్రతినిధులు మలసాని మనోహర్‌రెడ్డి, కొమ్మసాని శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ ఏజెంట్లు జాగ్రత్తగా ఉండాలి
సాక్షి, అమరావతి: కౌంటింగ్ సమయంలో వైఎస్సార్సీపీ ఏజెంట్లు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ ప్రతినిధి, హైకోర్టు న్యాయవాది కొమ్మసాని శ్రీనివాసులరెడ్డి సూచించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కౌంటింగ్ కేంద్రాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏజెంట్లకు దిశానిర్దేశం చేశారు. ఆయన ఏమన్నారంటే.. ⇒ ఉ.6 గంటలకల్లా ఏజెంట్లు కౌంటింగ్ హాల్ దగ్గర ఉండాలి. ఫారం–17 సీ కాపీని తీసుకెళ్లాలి. ⇒ పోటీలో ఉన్న అభ్యర్థులందరి ప్రతి ఓటు కరెక్టుగా నోట్ చేసుకోవాలి. ఏదైనా తప్పు కన్పిస్తే వెంటనే అక్కడే ఉన్న ఆర్వోకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలి. ⇒ అనారోగ్యం, ఇతర కారణాలతో బయటకు వచ్చేవారు రిటర్నింగ్ అధికారికి చెప్పి బయటకు రావాలి. ఒకసారి బయటకొస్తే లోపలికి రానివ్వరని గమనించాలి. ⇒ స్వతంత్ర అభ్యర్థులకు పోలైన ఓట్లను కూడా జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. ⇒ ఏజెంట్లు ప్రతి రౌండ్ తర్వాత షీట్‌పై సంతకం చేసే ముందు మన పార్టీ అభ్యర్థి ఓట్లు మాత్రమే కాకుండా, టీడీపీ–జనసేన–బీజేపీ, ఇతర అభ్యర్థులకు పోలైన ఓట్లను స్పష్టంగా సరిచూసుకోవాలి. తేడా ఉన్నట్లుగా గుర్తిస్తే మరొక మారు కౌంటింగ్ చేయమని కోరాలి. అన్ని సరిపోయినప్పుడే సంతకం చేయాలి. ⇒ కౌంటింగ్ ఏజెంట్లతో అభ్యర్థి టచ్‌లో ఉంటూ అక్కడ ఏదైనా అవాంతరాలు ఎదురైతే, కౌంటింగ్ ఏజెంట్‌తో కానీ, చీఫ్ ఎలక్షన్ ఏజెంట్‌తో కానీ రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలి. అక్కడ పరిష్కారం కాకపోతే వెంటనే పార్టీ కేంద్ర కార్యాలయం దృష్టికి తీసుకురావాలి. ⇒ ఏదైనా తప్పు జరుగుతోంది అని కౌంటింగ్ కేంద్రంలో గుర్తిస్తే చక్కటి లాజిక్‌తో ఆర్వోకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలి. ⇒ రిజెక్ట్ అయిన పోస్టల్ బ్యాలెట్ కంటే తక్కువ మార్జిన్ వచ్చి ఉంటే మళ్లీ పోస్టల్ బ్యాలెట్స్‌ని లెక్కించమని కోరే అధికారం అభ్యర్థికి, కౌంటింగ్ ఏజెంట్‌కి ఉంది. ⇒ పోస్టల్ ఓట్లను సంబంధిత ఫారంలో నింపి అభ్యర్థి, అబ్జర్వర్ కూడా చూసి సంతకం చేసిన తర్వాత ఆ రౌండ్ ఫలితం ప్రకటిస్తారు. ⇒ కౌంటింగ్ పూర్తయి డిక్లరేషన్ ఫామ్ ఇచ్చేవరకు కౌంటింగ్ హాల్లో అభ్యర్థి ఉండాలి. -
కౌంటింగ్ ముంగిట మరో కుట్ర
సాక్షి, అమరావతి: కీలకమైన ఓట్ల లెక్కింపు సందర్భంగా పోలీసు శాఖ వివాదాస్పద నిర్ణయం తీసుకోవడం విస్మయపరుస్తోంది. చంద్రబాబు ఒత్తిడికి ఎన్నికల కమిషన్ (ఈసీ), రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు తలొగ్గి వ్యవహరిస్తున్నారన్నది మరోసారి స్పష్టమైంది. అత్యంత వివాదాస్పద పోలీసు అధికారిగా గుర్తింపు పొందిన ఒంగోలు పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ (పీటీసీ) ఎస్పీ ఏఆర్ దామోదర్‌కు హఠాత్తుగా ఓట్ల లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షించే బాధ్యతలు అప్పగించారు.రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలోని ఈ కంట్రోల్ రూమ్ బాధ్యతలు అప్పగించడం గమనార్హం. అదీ పంజాబ్ ఎన్నికల పరిశీలకుడిగా వెళ్లిన ఆయన పోలింగ్ ముగిసిన తరువాత వ్యక్తిగత పనులపై సెలవులో ఉన్నారు. సెలవులో ఉన్న దామోదర్‌ను హఠాత్తుగా పోలీసు ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని.. కంట్రోల్ రూమ్ పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తించాలని ఉత్తర్వులు జారీచేయడం వెనుక ఏదో పెద్ద గూడుపుఠాణి ఉందన్నది స్పష్టమవుతోంది. టీడీపీకి వీర విధేయుడు.. 2007 గ్రూప్–1 బ్యాచ్‌కు చెందిన ఏఆర్ దామోదర్ అత్యంత వివాదాస్పద అధికారిగా గుర్తింపు పొందారు. ప్రధానంగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా వైఎస్సార్సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి టీడీపీలో చేరడంలో కీలకపాత్ర పోషించిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఆయన అత్యంత సన్నిహితుడు. వారి మధ్య బంధుత్వం కూడా ఉందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు, ఏబీ వెంకటేశ్వరరావు అండతో ఆయన అడ్డగోలుగా వ్యవహరించారు. పశి్చమ గోదావరి జిల్లా అదనపు ఎస్పీగా ఆయన వివాదాలకు కేంద్ర బిందువయ్యారు.ఆయనపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇక నాన్ కేడర్ ఎస్పీ అయినప్పటికీ దామోదర్‌ను 2019 సంవత్సరంలో ఎన్నికల కోసమని విజయనగరం జిల్లా ఎస్పీగా నియమించారు. వైఎస్సార్సీపీ పటిష్టంగా ఉన్న విజయనగరం జిల్లాలో టీడీపీకి అనుకూలంగా వ్యవహరించేందుకే ఆయనకు ఎస్పీగా బాధ్యతలు అప్పగించారు. అనుకున్నట్లుగానే 2019 ఎన్నికల పోలింగ్ రోజున టీడీపీ రౌడీమూకలు కర్రలు, కత్తులతో బీభత్సం సృష్టించి కురుపాం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పుష్పశ్రీవాణిని బంధించాయి.దాదాపు నాలుగు గంటలపాటు టీడీపీ రౌడీమూకలు స్వైర విహారం చేసినా పోలీసులు, ఎస్పీగా ఉన్న దామోదర్ సైతం పట్టించుకోలేదు. సరికదా అదనపు బలగాలను కూడా అక్కడికి పంపించలేదు. అప్పట్లో విశాఖపట్నం డీఐజీ స్పందించి అదనపు బలగాలను కురుపాం పంపించడంతో నాలుగు గంటల తరువాత పరిస్థితి అదుపులోకి వచ్చింది. అదీ దామోదర్ అసమర్థ, నిర్లక్ష్యపూరిత ట్రాక్ రికార్డ్.అలాంటి అధికారికి కంట్రోల్ రూమ్ బాధ్యతలా?ఎన్నికల విధుల్లో ఉద్దేశపూర్వకంగా అంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏఆర్ దామోదర్‌కు ప్రస్తుతం రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో కంట్రోల్ రూమ్ బాధ్యతలు అప్పగించారు. డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా, ఈసీకి నోడల్ అధికారిగా ఉన్న అదనపు డీజీ (శాంతి, భద్రతలు) శంకబాత్ర బాగ్చీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలు చెలరేగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం, ఎక్కడైనా విధ్వంసకర సంఘటనలు జరిగితే వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకురావడం, అందుకోసం జిల్లా ఎస్పీలకు తగిన ఆదేశాలు జారీచేయడం ఆయన బాధ్యత. అంటే.. డీజీపీ తరఫున జిల్లా ఎస్పీలకు ఆయనే ఆదేశాలు జారీచేస్తారు.2019 ఎన్నికల్లో హింసాత్మక సంఘటనలను అడ్డుకోవడంలో విఫలమైన ఆయన ప్రస్తుతం కంట్రోల్ రూమ్ బాధ్యతలను ఎలా నిర్వహించగలరని డీజీపీ, అదనపు డీజీ భావించారో అర్థంకావడంలేదు. టీడీపీకి అనుకూలంగా వ్యవహరించేందుకే దామోదర్‌కు ఈ బాధ్యతలు అప్పగించారా అనే సందేహాలు బలపడుతున్నాయి. ఇటీవల పోలింగ్ రోజున పల్నాడు నుంచి అనంతపురం జిల్లా వరకు టీడీపీ గూండాలు విధ్వంసానికి పాల్పడ్డాయి.అదే రీతిలో కౌంటింగ్ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా దాడులు, దౌర్జన్యానికి కుట్ర పన్నుతున్నాయని నిఘా వర్గాలు ఇప్పటికే వెల్లడించాయి. అయినాసరే.. టీడీపీకి అనుకూల అధికారిగా గుర్తింపు పొందిన దామోదర్‌కు కంట్రోల్ రూమ్ బాధ్యతలు అప్పగించడం వెనుక పక్కా కుట్ర ఉన్నట్లుగా స్పష్టమవుతోంది. టీడీపీ విధ్వంసకాండకు కొమ్ముకాసేందుకు.. టీడీపీ గూండా మూకలపై కఠిన చర్యలు తీసుకోకుండా ఎస్పీలను నిలువరించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసు వర్గాలే వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. -
అవాంతరాలను ఉపేక్షించొద్దు: ముఖేష్‌కుమార్ మీనా
సాక్షి, అమరావతి: ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఎలాంటి అవాంతరాలకు తావులేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ఆటంకాలు కలిగించేందుకు ప్రయత్నించే వారిని ఉపేక్షించొద్దని.. నిర్దాక్షిణ్యంగా బయటకు పంపడమే కాకుండా చట్టపరంగా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా ఆదేశించారు. రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో ఆదివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెల 4న నిర్వహించనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమ ఏర్పాట్లను జిల్లాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో తీవ్రమైన పోటీ నెలకొన్న దృష్ట్యా ఓట్ల లెక్కింపు జరిగే 4వ తేదీతో పాటు దానికి ముందు, తర్వాత రోజుల్లో భావోద్వేగాలు అదుపుతప్పే అవకాశం ఉందన్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఉత్పన్నం కాకుండా, వాటి ప్రభావం ఓట్ల లెక్కింపు కార్యక్రమాలపై ఉండకుండా తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో ఏమాత్రం రాజీపడకుండా కఠినంగా వ్యవహరించాలని మీనా సూచించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..కౌంటింగ్ పూర్తికాగానే ఈవీఎంలను భద్రపర్చాలి..ఓట్ల లెక్కింపు పూర్తయిన వెంటనే వాయిదా వేయకుండా అదేరోజు ప్రతి ఈవీఎంకు సీల్‌వేసి భద్రపర్చాలి. ఫలితాల ప్రకటనకు సంబంధించిన ఫారం–21సి/21ఇ లు ఓట్ల లెక్కింపు పూర్తయిన మరుసటి రోజే ఈసీఐకి చేరేలా చేపట్టాల్సిన చర్యలపై మార్గదర్శకాలను జారీచేశాం. అందుకనుగుణంగా చర్యలు చేపట్టాలి. ఇండెక్స్ కార్డులో ఎలాంటి తప్పులకు ఆస్కారంలేకుండా ఎంతో జాగ్రత్తగా ఆ కార్డును పూరించాలి. ఆయా కార్డులు అన్నీ ఈనెల 8లోపు మా కార్యాలయానికి అందజేయాలి. ప్రతి టేబుల్ వద్ద ఒక్కో ఏజెంట్..ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద ఒక ఏజంట్‌ను నియమించుకునే అవకాశాన్ని కల్పించాలి. అయితే, ఆర్వో టేబుల్ వద్ద అభ్యర్థి లేనప్పుడు మాత్రమే ఒక ఏజంట్‌కు అవకాశం కల్పించాలి. కౌంటింగ్ కేంద్రంలోకి వచ్చే ఏజెంట్ చేతిలో ఫారం–17సి, పెన్ను లేక పెన్సిల్, ప్లెయిన్ పేపర్ మాత్రమే ఉండేలా చూడాలిజ అంతకుమించి ఏమున్నా అనుమతించొద్దు. అథారిటీ లెటర్లు కలిగిన పాత్రికేయులు అందరినీ మీడియా కేంద్రంలోకి అనుమతించాలి. వారు సెల్‌ఫోన్ కలిగి ఉన్నప్పటికీ అభ్యంతరం చెప్పొద్దు. కౌంటింగ్ సెంటర్లోకి మాత్రం సెల్‌ఫోన్‌తో వారిని అనుమతించడానికి వీల్లేదు.కౌంటింగ్‌కు పటిష్ట చర్యలు..ఓట్ల లెక్కింపు కేంద్రాలు అన్నీ ఫైర్‌సేఫ్టీ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. అందుకు తగ్గట్లుగా అగ్నిమాపక శాఖ నుండి ధృవీకరణ పత్రాన్ని తప్పనిసరిగా పొందాలి. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ప్రవేశం, నిష్క్రమణ ప్రణాళికను పటిష్టంగా ఏర్పాట్లుచేసుకోవాలి. ఈ ప్రణాళికకు జిల్లా స్థాయి కమిటీ ఆమోదం తప్పనిసరిగా ఉండాలి. అదే విధంగా ప్రవేశం, నిష్క్రమణ ద్వారాలను తెలిపే సైన్ బోర్డులను అన్నిచోట్లా ఏర్పాటుచేయాలి. మొత్తం మీద ఓట్ల లెక్కింపు కార్యక్రమం విజయవంతానికి పటిష్టమైన చర్యలు చేపట్టాలి.అదనపు సీఈఓలు పి. కోటేశ్వరరావు, సీఈఓ ఎంఎన్ హరేంధిర ప్రసాద్, జాయింట్ సీఈఓ ఎస్. వెంకటేశ్వరరావుతో పాటు అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు వారి జిల్లాల నుండి ఈ వీడియో కాన్షరెన్స్‌లో పాల్గొన్నారు. -
ఏజెంట్లే కీలకం
సాక్షి, అమరావతి: ఓట్ల లెక్కింపు ముహూర్తం సమీపించడంతో కౌంటింగ్ ఏజెంట్ల పాత్ర కీలకం కానుంది. ఈ ప్రక్రియపై పూర్తి అవగాహనతో పాటు నిబంధనలపై పట్టున్న వ్యక్తులను ఎంపిక చేసి రాజకీయ పార్టీలు శిక్షణ ఇస్తున్నాయి. కౌంటింగ్ హాళ్లలో టీడీపీ ఘర్షణలకు దిగి ఉద్రిక్తత రేకెత్తించే ప్రణాళికలు రూపొందించినట్లు స్పష్టమవుతున్నందున వైఎస్సార్సీపీ ఏజెంట్లు అత్యంత అప్రమత్తంగా ఉండాలని పార్టీ నేతలు సూచిస్తున్నారు. కౌంటింగ్ ప్రక్రియ మొత్తం రికార్డు అవుతుందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని సంయమనం పాటించాలని పేర్కొంటున్నారు. టీడీపీ ఏజెంట్లు పదేపదే అభ్యంతరాలు, అనుమానాలు వ్యక్తం చేసినా వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత కౌంటింగ్ సూపర్వైజర్లు, రిటర్నింగ్ ఆఫీసర్లదే కాబట్టి వైఎస్సార్సీపీ ఏజెంట్లు పరిస్థితులను నిశితంగా గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఏవైనా అభ్యంతరాలు, అనుమానాలుంటే కౌంటింగ్ ఏజెంట్లు కచ్చితంగా లిఖితపూర్వకంగా రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు అందజేసి అక్నాలెడ్జ్మెంట్ (ధ్రువీకరణ) పత్రం తీసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. నోటిమాటగా అభ్యంతరం తెలిపితే అది చట్టం ముందు నిలబడదు కాబట్టి ప్రతీది లిఖితపూర్వకంగా తెలియచేయడం తప్పనిసరి. వీవీ ప్యాట్లకు సంబంధించి ప్రతి నియోజకవర్గానికి ఐదు చొప్పున లాటరీ ద్వారా ఎంపిక చేసి లెక్కిస్తారు. ఈవీఎంలలో పడిన ఓట్లకు, వీవీ ప్యాట్లలో ఉన్న ఓట్లకు తేడా ఉంటే ఫైనల్‌గా వీవీ ప్యాట్లలోని ఓట్లనే పరిగణించాలని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది.రీ కౌంటింగ్ హక్కు లెక్కింపు ప్రారంభంలోనే ఈవీఎంల సెక్యూరిటీని ఏజెంట్లు జాగ్రత్తగా పరిశీలించాలని, ప్రతి రౌండ్లోనూ అప్రమత్తంగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఓట్ల లెక్కింపు మొదలైన క్షణం నుంచి చిట్ట చివరి వరకూ ఏజెంట్లు కేంద్రంలోనే ఉండాలి. లెక్కింపు పూర్తయి గెలిచిన అభ్యర్థి ధ్రువీకరణ పత్రం తీసుకున్న తర్వాతే బయటకు రావాలి. ఈవీఎంలలో ఓట్ల వివరాలు కౌంటింగ్ సిబ్బంది ద్వారా స్పష్టంగా వినిపించకపోతే ఒకటికి రెండుసార్లు నిర్ధారించుకోవాలి.కౌంటింగ్‌లో అనుమానాలు తలెత్తితే రీ కౌంటింగ్ కోరే హక్కు ఏజెంట్లకు ఉంటుంది. మంగళవారం ఉదయం 8 గంటల కల్లా లెక్కింపు ప్రారంభం కానున్నందున ఏజెంట్లు ఉదయం 6 గంటల లోపే కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోవాలి. ఏజెంట్‌గా ఉంటున్న వ్యక్తులు భారత ప్రభుత్వ గుర్తింపు కార్డు, ఏజెంట్ నియామక పత్రం రెండూ తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలి. కౌంటింగ్ కేంద్రంలోకి ఫారం–17 సీ, పెన్ను లేదా పెన్సిల్, తెల్ల కాగితాన్ని మాత్రమే అనుమతిస్తున్నారు. సెల్ఫోన్లు, ఇతర వస్తువులను అనుమతించరు. -
పోస్టల్ బ్యాలెట్లపై భద్రం
సాక్షి, అమరావతి: పెద్ద ఎత్తున పోలైన పోస్టల్ బ్యాలెట్లు ఈసారి ఎన్నికల ఫలితాల్లో కీలక పాత్ర పోషించనున్నాయి. పోలింగ్ శాతం పెరగడం, పోస్టల్ బ్యాలెట్లు 4.97 లక్షలకు పైగా పోల్ అయిన నేపథ్యంలో జూన్ 4 జరిగే ఓట్ల లెక్కింపుల్లో అత్యంత కీలకం కానున్నాయి. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో ఎన్నికల సంఘం చివరి నిమిషంలో నిబంధనలు మార్చినందున లెక్కింపు విషయంలో ఏజెంట్లు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని, సుదీర్ఘంగా సాగే అవకాశం ఉన్నందున ప్రత్యేకంగా ఒక ఏజెంట్ పర్యవేక్షించాలని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. నిబంధనలు, లెక్కింపు విధానంపై ఏజెంట్లు ముందస్తు అవగాహన కలిగి ఉండాలని సూచిస్తున్నారు.చెల్లనివిగా ఎప్పుడు పరిగణిస్తారంటే?» బ్యాలెట్ పేపరుపై ఓటు ఎవరికి నమోదు కాకపోవడం, ఒకటి కంటే ఎక్కువ మంది అభ్యర్థులకు ఓటు వేసినా తిరస్కరిస్తారు.» బ్యాలెట్ పేపరు చిరిగినా, గుర్తు పట్టలేనంతగా మారినా, ఓటు ఎవరికి వేశారో తెలిసే విధంగా ఏమైనా గుర్తులు లేదా ఏదైనా రాసి ఉన్నా తిరస్కరిస్తారు.» నకిలీ బ్యాలెట్ పేపర్లను తిరస్కరిస్తారు.» ఇలా తిరస్కరించిన ఓట్లన్నీ ఆర్వో పక్కన పెడతారు.» ప్రతీ దశలో చెల్లని ఓట్లను ఆర్వో విడివిడిగా కట్టలు కట్టి ఉంచాలి» ఈవీఎం ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత గెలిచిన అభ్యర్థి ఓట్లు తిరస్కరించిన పోస్టల్ బ్యాలెట్లు కంటే తక్కువ ఉంటే వాటిని ఆర్వో తిరిగి పరిశీలిస్తారు.» తిరస్కరించిన పోస్టల్ బ్యాలెట్లను ఆర్వో, అబ్జర్వర్లు ఒకొక్కటే పరిశీలించి తుది ఫలితాన్ని ప్రకటిస్తారు. డిక్లరేషన్ 13 ఏ అత్యంత కీలకం» ఓటరు తన ఓటును కవర్ ‘ఏ’లో పొందుపరచి దానికి డిక్లరేషన్ 13 ఏ జత చేసి ఈ రెండింటినీ కవర్ ‘బీ’లో ఉంచి బ్యాలెట్ బాక్స్‌లో వేస్తారు.» బ్యాలెట్ బాక్స్ నుంచి కవర్ బీ తెరవగానే ముందుగా బ్యాలెట్ పేపర్ ఉండే కవర్ ‘ఏ’ ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవకూడదు.» కవర్ బీ తెరవగానే అందులో ఫారం 13 సీలో రెండు డాక్యుమెంట్లు తప్పనిసరిగా ఉండాలి. బ్యాలెట్ పేపర్ (ఫారం 13 బీ) ఉండే కవర్ ఏ, ఓటరు ఇచ్చిన డిక్లరేషన్ 13 ఏ ఫారం ఉండాలి» ఈ రెండూ విడివిడిగా లేకపోతే ఆ ఓటును చెల్లని ఓటుగా పరిగణించి పక్కన పెట్టాలి.» ఆ తర్వాత 13 ఏ డిక్లరేషన్ సరిగా ఉందా? లేదా? అన్నది పరిశీలించాలి.» ఈ డిక్లరేషన్ ఫారంపై ఓటరు సంతకంతోపాటు అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం, సీల్ ఉందో లేదో పరిశీలించాలి.» ఒకవేళ అటెస్టింగ్ అధికారి సంతకం ఉండి, సీల్ లేకపోయినా ఆ ఓటును తిరస్కరించవద్దని ఎన్నికల సంఘం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.» అటెస్టింగ్ అధికారి సంతకంపై అనుమానం ఉంటే ఏజెంట్లు తమ అభ్యంతరాన్ని ఆర్వోకు తెలియచేయాలి.» ఆర్వో తమ వద్ద ఉన్న అటెస్టింగ్ అధికారి సంతకంతో సరి పోల్చి ఒకే విధంగా ఉంటే ఆమోదిస్తారు. లేకపోతే తిరస్కరిస్తారు.» ఈ ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాతే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు విధానం మొదలవుతుంది.» తొలుత కవర్ ఏ ఓపెన్ చేసి అందులోని ఫారం 13 బీ బ్యాలెట్ పేపర్‌ను ఓపెన్ చేస్తారు.» 13 ఏపై ఉన్న బ్యాలెట్ సీరియల్ నెంబర్, 13 బీ మీద ఉన్న బ్యాలెట్ సీరియల్ నెంబర్ సరిపోలాలి.» ఈ రెండు నెంబర్లలో తేడా ఉంటే ఆ ఓటును చెల్లని ఓటుగా పరిగణించాలి.» ఏజెంట్లు తమ ఫిర్యాదులు ప్రతీది లిఖిత పూర్వకంగా ఇవ్వాలిపోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ఇలా» జూన్ 4 ఓట్ల లెక్కింపు తొలుత పోస్టల్ బ్యాలెట్లతోనే మొదలవుతుంది. ఉదయం 8 గంటల కల్లా ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండటంతో ఏజెంట్లు ఉదయం 6 గంటలలోపే కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోవాలి. కౌటింగ్ కేంద్రంలో మొత్తం 15 టేబుళ్లు ఉంటాయి. ఒకవైపు ఏడు మరో వైపు ఏడు చొప్పున అమర్చి చుట్టూ కంచె వేస్తారు. ఈ రెండు వరుసల మధ్యలో రిటర్నింగ్ ఆఫీసర్ టేబుల్ వద్ద పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కోసం టేబుల్ ఉంటుంది. ఆర్వో పర్యవేక్షణలోనే మొత్తం పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు జరుగుతుంది. » పోస్టల్ బ్యాలెట్లలో రెండు రకాలుంటాయి. మిలటరీలో సేవలందించే వారు ఎలక్ట్రానిక్ రూపంలో పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకోగా 85 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులు, కోవిడ్ బాధితులు, పోలింగ్ రోజు విధులు నిర్వహించిన ఉద్యోగులు సాధారణ విధానంలో పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకున్నారు. ఈ రెండు విధానాల్లోనూ ఓట్ల లెక్కింపు ఒకే రకంగా ఉంటుంది. ఎలక్ట్రానిక్ విధానంలో ఓటు వేసిన వారి క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా వివరాలను తెలుసుకుంటారు. » పోస్టల్ బ్యాలెట్లో రెండు రకాల కవర్లు ఏ, బీతో పాటు మూడు రకాల ఫారమ్స్ 13 ఏ, 13 బీ, 13 సీ ఉంటాయి. తొలుత పోస్టల్ బ్యాలెట్‌ను ఎన్నికల నిబంధనల ప్రకారం ఓటరు వినియోగించుకున్నారా? లేదా? అనేది పరిశీలించి లెక్కింపు అర్హతను నిర్థారిస్తారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో ఇదే అత్యంత ప్రధానమైనది. పోస్టల్ బ్యాలెట్ చెల్లుతుందా? లేదా? ఎలాంటి సందర్భాల్లో ఏజెంట్లు అభ్యంతరం చెప్పవచ్చో ఇప్పుడు చూద్దాం.. -
ఎల్లుండే ‘లోక్‌సభ’ కౌంటింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం 10వేల మంది సిబ్బందిని ఎంపిక చేసినట్టు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ వెల్లడించారు. 4న జరిగే లోక్‌సభ ఓట్ల లెక్కింపుతోపాటు 2న జరిగే ఉమ్మడి మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఓట్ల లెక్కింపు, 5న జరిగే ఉమ్మడి నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని 17 లోక్‌సభ సీట్ల ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్రవ్యాప్తంగా 34 ప్రాంతాల్లో 120 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని వికాస్‌రాజ్ తెలిపారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం 10 వేల మంది సిబ్బందిని ఎంపిక చేశామని.. ఇందులో 50 శాతం సిబ్బంది రిజర్వ్‌లో ఉంటారని చెప్పారు. ర్యాండమైజేషన్ పద్దతిలో సిబ్బందిని ఎంపిక చేసి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్టు వివరించారు. మూడంచెల భద్రత మధ్య ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్‌కు సంబంధించి ఒక కౌంటింగ్ కేంద్రం ఉంటుందని.. ఒక కేంద్రంలో 24 టేబుల్స్ ఉంటాయని వికాస్‌రాజ్ తెలిపారు. అయితే మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో 28 టేబుల్స్ అవసరమవడంతో.. రెండు హాల్స్ ఏర్పాటు చేశామని వివరించారు. ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని.. గుర్తింపు కార్డు ఉంటేనే కేంద్రం లోపలికి అనుమతిస్తామని తెలిపారు. కౌంటింగ్ కేంద్రంలోకి సెల్ఫోన్లు, కెమెరాలు సహా ఎలాంటి ఎల్రక్టానిక్ పరికరాలను అనుమతించబోమన్నారు. ఇప్పటివరకు 2.18 లక్షల పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయని.. ఇంకా ఈటీపీబీఎస్ (ఎ ల్రక్టానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టం)లు వస్తున్నాయని, కౌంటింగ్ రోజు ఉదయం 8 గంటలలోపు వచ్చిన వాటిని పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. ఈ లెక్కన పోస్టల్ బ్యాలెట్ల సంఖ్యపై కౌంటింగ్ రోజే స్పష్టత వస్తుందన్నారు. చొప్పదండి, దేవరకొండ, యాకుత్‌పురా అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధికి సంబంధించి ఓట్ల లెక్కింపునకు 24 రౌండ్లు పడుతుందని.. ఆర్మూరు, భద్రాచలం, అశ్వారావుపేట సెగ్మెంట్లకు సంబంధించి 13 రౌండ్లలోనే పూర్తవుతుందని వివరించారు. సీఈసీ ఆదేశాల మేరకు ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ర్యాండమ్‌గా ఐదు పోలింగ్ కేంద్రాల్లోని వీవీ ప్యాట్ రసీదులను లెక్కిస్తామని తెలిపారు. 2,414 మంది సూక్ష్మ పరిశీలకులులోక్సభ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కోసం 2,414 మంది సూక్ష్మ పరిశీలకులను (మైక్రో అబ్జర్వర్లను) నియమించినట్టు వికాస్‌రాజ్ తెలిపారు. ఒక్కో టేబుల్‌కు ఒక అబ్జర్వర్ ఉంటారని చెప్పారు. లెక్కింపు కోసం ఒక టేబుల్‌కు ఒక ఏఆర్ఓ, ఇద్దరు సహాయకులు ఉంటారన్నారు. కౌంటింగ్ ఏజెంట్లకు సంబంధించి ముందుగానే సమాచారం ఇవ్వా ల్సి ఉంటుందని చెప్పారు. స్ట్రాంగ్ రూమ్ నుంచి లెక్కింపు కేంద్రం వరకు బారికేడ్లు, పటిష్ట భద్రత మధ్య తరలిస్తామని.. ఇదంతా సీసీ కెమెరాల్లో రికార్డు అవుతుందని వివరించారు. కౌంటింగ్ రోజు మద్యం దుకాణాలను మూసివేస్తామన్నారు. ఆ రోజున ర్యాలీలకు అనుమతి ఉండదని తెలిపారు. ఒకవేళ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పోలీసులు అనుమతిస్తే ర్యాలీలు చేసుకోవచ్చన్నారు. ఎప్పటికప్పుడు పరిశీలకుల అను మతి తర్వాత ఫలితాలు వెల్లడిస్తారని.. కౌంటింగ్ హాల్లో, మీడియా సెంటర్ వద్ద ప్రకటిస్తామని, వెబ్సైట్లోనూ అప్లోడ్ చేస్తా మని తెలిపారు. ఆదివారం జరిగే ఉమ్మడి మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ అక్కడి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో జరుగుతుందని తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ దుప్పలపల్లిలోని తెలంగాణ వేర్‌హౌజ్ కార్పొరేషన్ గోదాం ఆవరణలో జరుగుతుందని వికాస్‌రాజ్ వెల్లడించారు. -
తొలి ఫలితం కొవ్వూరు, నరసాపురం
సాక్షి, అమరావతి: వచ్చే జూన్ 4న కొన్ని నియోజకవర్గాల అభ్యర్థుల భవితవ్యం ఓట్ల లెక్కింపు మొదలైన కొన్ని గంటల్లోనే తేలిపోనుండగా.. మరికొన్ని నియోజకవర్గాల తుది ఫలితం కోసం రాత్రి వరకు వేచిచూడాల్సి ఉంటుంది. పోలైన ఓట్లు, కౌంటింగ్ హాళ్లలో ఏర్పాటు చేసిన టేబుళ్ల ఆధారంగా ఎన్నికల సంఘం నియోజకవర్గాల వారీగా ఓట్ల లెక్కింపునకు అవసరమైన రౌండ్లను నిర్ధారించింది.దీని ప్రకారం.. రాష్ట్రంలో అన్నింటికంటే ముందుగా తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు (ఎస్సీ), పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గాల తుది ఫలితాలు మధ్యాహ్నంలోపే ప్రకటించే అవకాశముందని ఎన్నికల సంఘ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లో కేవలం 13 రౌండ్లలోనే లెక్కింపు పూర్తికానుంది. ఇదే సమయంలో రంపచోడవరం (ఎస్టీ), చంద్రగిరి నియోజకవర్గాల్లో అత్యధికంగా 29 రౌండ్ల లెక్కింపు జరుగుతుంది. ఆ తర్వాత పాణ్యం, భీమిలి నియోజకవర్గాల్లో 25 రౌండ్ల లెక్కింపు జరుగుతుంది. ఈ రెండు నియోజకవర్గాల్లో తుది ఫలితాల వెల్లడికి రాత్రి 7 గంటల వరకు వేచిచూడాల్సి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. 111 చోట్ల 20, అంత కంటే తక్కువ రౌండ్లలోనే పూర్తి రాష్ట్రంలోని మొత్తం 175 నియోజకవర్గాల్లో అత్యధికంగా 111 నియోజకవర్గాల్లో 20కంటే తక్కువ రౌండ్లలోనే లెక్కింపు పూర్తికానుంది. ఈ నియోజకవర్గాల ఫలితాలను మధ్యాహ్నం 2 గంటల్లోగా పూర్తిచేయాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. దీని ప్రకారం.. కౌంటింగ్ హాళ్లల్లో తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. 60 నియోజకవర్గాల్లో 21 నుంచి 25 రౌండ్ల వరకు ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ నియోజకవర్గాల ఫలితాలను సాయంత్రంలోగా వెల్లడిస్తారు. ఎటువంటి గందరగోళం లేకుండా అందరి అనుమతితోనే సువిధ యాప్‌లో అప్లోడ్ చేసిన తర్వాతే ఫలితాలను ప్రకటించనున్నట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన వెంటనే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రకటనకు సంబంధించిన ఫారం–21సీ, 21ఈలను అదేరోజు ఫ్లైట్‌లో కేంద్ర ఎన్నికల సంఘానికి పంపాల్సి ఉంటుంది. -
ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం
సాక్షి, మచిలీపట్నం: సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమం జూన్ 4న నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్‌కుమార్ మీనా తెలిపారు. ఈ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీల నేతలు, ఏజెంట్లు, కార్యకర్తలు సహకరించాలని కోరారు. కృష్ణాజిల్లా మచిలీపట్నానికి గురువారం వచ్చిన ఆయన కృష్ణా విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. అక్కడ ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూములు.. భద్రత, కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. ఇక్కడ చేసిన, చేయనున్న ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ ఆస్మిలను అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గాల వారిగా లెక్కింపు కేంద్రాలు, టెబుళ్లు, రౌండ్ల కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కౌంటింగ్‌ను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. లెక్కింపు సమయంలో అభ్యర్థి లేదా వారి ఏజెంట్ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే వారిని కౌంటింగ్ హాల్ నుండి బయటకు పంపేస్తామన్నారు. కౌంటింగ్ రోజున ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని ముఖేష్‌కుమార్ మీనా అధికారులకు సూచించారు. పోస్టల్ బ్యాలెట్ల అంశం సీఈసీ పరిధిలో ఉంది..పోస్టల్ బ్యాలెట్లపై వైఎస్సార్సీపీ చేసిన విన్నపాన్ని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ దృష్టికి తీసుకెళ్లామని, అది సీఈసీ పరిధిలో ఉందని ముఖేష్‌కుమార్ మీనా వెల్లడించారు. నేడో, రేపో దీనిపై స్పష్టత వచ్చే అవకాశముందన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్, గన్నవరం రిటర్నింగ్ అధికారి గీతాంజలి శర్మ, డీఆర్ఓ కె.చంద్రశేఖరరావు, పలువురు రిటర్నింగ్ అధికారులు, పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారి షాహిద్ బాబు, సర్వే ల్యాండ్ రికార్డుల ఏడీ మనీషా త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు. -
ఓట్ల లెక్కింపులో ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి: సజ్జల రామకృష్ణారెడ్డి
సాక్షి, అమరావతి: అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు సమయంలో కౌంటింగ్ ఏజెంట్లు అప్రమత్తతతో వ్యవహరించాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ముఖ్యంగా ప్రత్యర్థి పార్టీల ఏజెంట్ల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. బుధవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో కౌంటింగ్ ఏజెంట్ల వర్క్‌షాప్, జూమ్ మీటింగ్‌లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. కౌంటింగ్ ఏజెంట్ల సందేహాల నివృత్తికి కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆయన చెప్పారు. ఎటువంటి సమస్య ఉన్నా కేంద్ర కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో కూడా చాలా అప్రమత్తంగా ఉండాలన్నారు. నియమ నిబంధనలను క్షుణ్ణంగా తెలుసుకోవాలని సూచించారు. పోస్టల్ బ్యాలెట్ విషయంలో గుంటూరులో వేల ఓట్లు మన పార్టీ నష్టపోవాల్సి వచ్చిందని గుర్తుచేశారు. ప్రతి ఓటూ విలువైనదేనని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్లపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామని, దానికి సంబంధించి ఆదేశాలు రాగానే తెలియజేస్తామని చెప్పారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు వ్యవస్ధలను మేనేజ్ చేస్తూ వారికి అనుకూలంగా నిర్ణయాలు వచ్చేలా చేస్తున్నారని అన్నారు. ఇటీవలి కాలంలో ఈసీ తీరు అనుమానాలకు తావిచ్చేలా ఉన్నందున, అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఎన్నికల నియమ నిబంధనల పట్ల పూర్తి అవగాహనతో ఉండాలని తెలిపారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ మరోసారి అధికారంలోకి వస్తుందని, మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని, ఇందులో ఎటువంటి అనుమానమూ లేదని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విస్పష్టంగా చెప్పారు. వచ్చే నెల 9వ తేదీన వైఎస్ జగన్ మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు. సమావేశానికి హాజరైన వారికి విశ్రాంత ఆర్డీవో ముదిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పలు సూచనలు చేశారు. ఏజెంట్ల సందేహాలు నివృత్తి చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఇన్చార్జి, శాసన మండలి విప్ లేళ్ళ అప్పిరెడ్డి ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు.పోస్టల్ బ్యాలెట్ లెక్కించే విధానం⇒ ఎన్నికల అధికారి నియోజకవర్గం ఓట్ల లెక్కింపులో మొదట విధిగా పోస్టల్ బ్యాలెట్లని లెక్కించాలి⇒ మొదటి కవరు–బి పైన నియోజకవర్గం పేరు, ఎన్నికల అధికారి అడ్రెస్సు, ఓటరు సంతకం ఉండాలి. (ఓటరు సంతకం తప్పనిసరికాదు).⇒ మొదటి కవరు–బి (ఫారం – 13సి) తెరిచి చూసినప్పుడు అందులో 13 – ఏ డిక్లరేషన్, ఫారం 13–బి (కవరు – ఏ) విడివిడిగా ఉండాలి. లేకపోతే అది చెల్లుబాబు కాదు. అందులో కవరు – ఏ లేకపోయినా, 13–ఏ డిక్లరేషన్ లేకపోయినా, 13–ఏ డిక్లరేషన్ మీద ఓటరు సంతకం లేకపోయినా, 13–ఏ డిక్లరేషన్ మీద పోస్టల్ బ్యాలెట్ క్రమ సంఖ్య నమోదు చేయకపోయినా, నమోదు చేసినట్లయితే అది 13–బి (పోస్టల్ బ్యాలెట్ కవరు) మీద ఉన్న క్రమ సంఖ్యతో సరిపోలక పోయినా, 13 – ఏ డిక్లరేషన్ మీద గజిటెడ్ అధికారి సంతకం లేకపోయినా, ఒకవేళ సంతకం ఉండి హోదా తెలియజేసే స్టాంప్ లేదా హోదా తెలియజేసే విధంగా చేతితో రాసి కాని లేకపోతే ఆ పోస్టల్ బ్యాలెట్ చెల్లనిదిగా పరిగణించాలి.⇒ 13– ఏ డిక్లరేషన్‌లో అన్ని అంశాలు సరిగా ఉన్నట్లయితే, ఫారం 13 – బి పోస్టల్ బ్యాలెట్ కలిగి ఉన్న కవరు(కవరు – ఏ)ను పరిశీలించాలి. 13– ఏ డిక్లరేషన్‌లో పేర్కొన్న బ్యాలెట్ పేపర్ క్రమసంఖ్య, 13 – బి పోస్టల్ బ్యాలెట్లో ఉన్న క్రమసంఖ్య ఒకటి కాకపోయినా, ఓటరు ఎవ్వరికీ ఓటు వేయకపోయినా, ఓటరు తమ ఓటుని ఒకరికంటే ఎక్కువ మందికి వేసినా, బ్యాలెట్ పేపరు చిరిగిపోయి పూర్తిగా సమాచారం కనిపించకపోయినా, ఓటరు ఓటుని ఎవరికి వేశారో పూర్తి సందిగ్ధంగా ఉన్నప్పుడు, ఓటరు తనే ఓటు వేసినట్లుగా గుర్తించినప్పుడు (ఉదాహరణకు ఓటరు పేరు రాసినా, సంతకం చేసినా) దానిని చెల్లని ఓటుగా పరిగణించాలి. ప్రతి బ్యాలెట్ పేపర్లో నమోదు చేసిన అంశాలను పోటీ చేసే అభ్యర్థుల ప్రతినిధిగా ఉన్న ఏజెంట్/అభ్యర్థికి విధిగా సంబంధిత ఎన్నికల అధికారి చూపించి నిర్ణయం తీసుకోవాలి. బ్యాలెట్ పేపరు లెక్కించిన తరువాత రిజల్ట్ షీట్ (ఫారం–20)లో నమోదు చేయాలి. -
మధ్యాహ్నం 2 గంటలకే 111 అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాల వెల్లడి
సాక్షి, అమరావతి: వచ్చే నెల 4న ఓట్ల లెక్కింపునకు పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) ముఖేష్ కుమార్ మీనా కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపారు. సత్వరమే ఫలితాల ప్రకటనకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని మొత్తం 175 శాసన సభ నియోజకవర్గాల్లో 111 నియోజకవర్గాల్లో 20 రౌండ్ల లోపు లెక్కింపు జరుగుతుందని, వీటి ఫలితాలు మధ్యాహ్నం 2 గంటల్లోపే ఇచ్చేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. 61 నియోజకవర్గాల్లో 21 నుండి 24 రౌండ్లు లెక్కింపు జరుగుతుందని, వీటి ఫలితాలు సాయంత్రం 4 గంటల్లోపు వస్తాయన్నారు. మిగిలిన 3 నియోజకవర్గాల్లో 25 రౌండ్లకు పైబడి ఓట్ల లెక్కింపు జరుగుతుందని, సాయంత్రం 6.00 గంటల్లోపు వీటి ఫలితాలు రావొచ్చని వివరించారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపునకు టేబుళ్లను పెంచి సకాలంలో పూర్తి చేస్తామన్నారు. రాత్రి 8 – 9 గంటల మధ్య అన్ని నియోజకవర్గాల తుది ఫలితాలు ప్రకటించేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. న్యూఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ బుధవారం రాష్ట్ర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియపై సమీక్షించారు. లెక్కింపు ప్రక్రియలో అనుసరించాల్సిన విధానాలు, శాంతిభద్రతల పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో కౌంటింగ్‌కు చేపట్టిన ఏర్పాట్లను సీఈవో మీనా వివరించారు. ఎన్నికల అనంతరం హింసాత్మక ఘటనలు జరిగిన జిల్లాల్లో ఓట్ల లెక్కింపు రోజు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. 144 సెక్షన్ అమలుతో పాటు ఆ జిల్లాల్లో సీనియర్ అధికారులను నియమిస్తున్నట్లు తెలిపారు. డిజీపీతో పాటు తాను కూడా పల్నాడు జిల్లాల్లో పర్యటించి అక్కడి పరిస్థితులను పరిశీలించామని, అధికారులను అప్రమత్తం చేశామని తెలిపారు. ఓట్ల లెక్కింపులో లోపాలు జరగకూడదు ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటనలో ఎటువంటి లోపాలు, జాప్యం జరగడానికి వీల్లేదని, అందుకోసం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, త్వరితగతిన కచ్చితమైన ఫలితాలను ప్రకటించాలని సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ రాష్ట్ర అధికారులకు చెప్పారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఓట్ల లెక్కింపును విజయవంతంగా పూర్తి చేయాలని అన్ని నియోజకవర్గాల ఆర్వోలు, జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలు, సీపీలకు సూచించారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన వెంటనే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రకటనకు సంబంధించిన ఫారం–21 సీ, 21ఈలను అదే రోజు ఫ్లైట్‌లో ఈసీకి పంపాలని ఆదేశించారు. ఓట్ల లెక్కింపు సమయంలో అభ్యర్థులు, ఏజెంట్లు ఎటువంటి అవాంతరాలు కలిగించకుండా లెక్కింపు ప్రక్రియపై వారికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని చెప్పారు. ఓట్ల లెక్కింపు కేంద్రాలు, స్ట్రాంగ్ రూముల్లో కూలీల విషయంలో ఎంతో అప్రమత్తంగా ఉండాలని, అపరిచితులను ఎవ్వరినీ అందుకు వినియోగించొద్దని చెప్పారు. గుర్తింపు కార్డులు ఉన్నవారినే లెక్కింపు కేంద్రాల్లోకి అనుమతించాలన్నారు. ఎన్నికల అనంతరం పల్నాడు జిల్లాలో హింసాత్మక ఘటనలు జరిగినందున, ఈ జిల్లా అధికారులు ఎంతో అప్రమత్తంగా ఉండాలని, ఓట్ల లెక్కింపు రోజు ఎటువంటి ఘటనలకు తావు లేకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. స్టేట్ పోలీస్ నోడల్ ఆఫీసర్, అడిషనల్ డీజీ ఎస్ బాగ్చీ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్పీలను, సీపీలను అప్రమ్తతం చేశామని, శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. లెక్కింపు కేంద్రాల వద్ద ఏర్పాట్లు, త్వరితగతిన ఖచ్చితమైన ఫలితాల ప్రకటనకు చేపడుతున్న చర్యలు, శాంతి భద్రతల పరిరక్షణకు చేస్తున్న బందోబస్తు ఏర్పాట్లను ఆర్వోలు, జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలు నితీష్ వ్యాస్‌కు వివరించారు. ఈ సమావేశంలో అదనపు సీఈవో హరేంధిర ప్రసాద్, రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల ఆర్వోలు, జిల్లా ఎన్నికల అధికారులు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు తదితరులు వారి నియోజకవర్గాల నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. -
ఓట్ల లెక్కింపునకు పటిష్ట ఏర్పాట్లు చేశాం
నరసరావుపేట/బాపట్ల: ఓట్ల లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో) ముఖేష్‌కుమార్ మీనా తెలిపారు. మంగళవారం పల్నాడు జిల్లా నరసరావుపేటతో పాటు బాపట్లలో ఆయన పర్యటించారు. నరసరావుపేట మండలం కాకాని సమీపంలోని జేఎన్టీయూ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన మీనా జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమస్యాత్మక జిల్లా అయినా పల్నాడులో రీపోలింగ్‌కు అవకాశం లేకుండా ఎన్నికలు నిర్వహించారంటూ అధికారులను అభినందించారు. వెబ్‌కాస్టింగ్ వంటి ఏర్పాట్లు చేసినా కొన్ని బూత్‌లలో జరిగిన ఘటనలు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించటంతో కేంద్ర ఎన్నికల కమిషన్ పలు కఠిన చర్యలు తీసుకుందని చెప్పారు. కౌంటింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించి.. ఎన్నికల కమిషన్‌పై ప్రజలకు నమ్మకం తీసుకొస్తామన్నారు. అవాంఛనీయ ఘటనలు జరిగితే సంబంధిత రిటరి్నంగ్ అధికారి వెంటనే స్పందించాలని ఆదేశించారు. మద్యం అమ్మకాలను నిషేధించాలి డీజీపీ హరీ‹Ùకుమార్‌గుప్తా మాట్లాడుతూ.. జూన్ 3, 4, 5 తేదీల్లో మద్యం అమ్మకాలను నిషేధించాల్సిన అవసరం ఉందన్నారు. అగ్నిమాపక పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ శ్రీకేశ్ మాట్లాడుతూ.. పారదర్శకంగా ఓట్ల లెక్కింపు నిర్వహించేందుకు 700 మందికి పైగా కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లతో పాటు ఇతర సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారని తెలిపారు. ఎస్పీ మలికా గార్గ్ మాట్లాడుతూ.. కౌంటింగ్ సందర్భంగా పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు 1,196 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఏడు ఈవీఎంలు ధ్వంసం చేసిన కేసుల్లో 59 మందిని అరెస్టు చేశామని చెప్పారు. సమావేశంలో పోలీస్ అధికారులు గోపినాథ్ జెట్టి, సర్వశ్రేష్ఠ త్రిపాఠి, శ్రీకాంత్, జేసీ శ్యాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఎల్రక్టానిక్ పరికరాలను అనుమతించొద్దు అలాగే బాపట్ల ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములను, కౌంటింగ్ కేంద్రాల్లోని ఏర్పాట్లను సీఈవో ముఖే‹Ùకుమార్ మీనా మంగళవారం పరిశీలించారు. కలెక్టర్ పి.రంజిత్‌బాషా, ఎస్పీ వకుల్ జిందాల్, జేసీ సీహెచ్ శ్రీధర్, ఆర్వోలతో మీనా సమావేశమయ్యారు. ఎన్నికల కమిషన్ జారీ చేసిన పాస్‌లున్న వారినే కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతించాలని ఆయన ఆదేశించారు. సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను లోపలికి అనుమతించవద్దని ఆదేశించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్ సత్తిబాబు, అదనపు ఎస్పీ విఠలేశ్వరరావు, ఆర్వోలు ఉన్నారు. -
కౌంటింగ్ ఏజెంట్లే కీలకం
సత్తెనపల్లి: సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ జూన్ 4న ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ఎన్నికల నిబంధనలు–1961 ప్రకారం అభ్యర్థి లేదా ఎలక్షన్ ఏజెంట్ ఆమోదంతో కౌంటింగ్ ఏజెంట్లను నియమిస్తారు. కౌంటింగ్ సమయంలో అభ్యర్థి తరఫున ప్రతినిధిగా వ్యవహరించే కౌంటింగ్ ఏజెంట్ల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. కౌంటింగ్‌కు మూడు రోజుల ముందు సాయంత్రం 5గంటల్లోపు కౌంటింగ్ ఏజెంట్ల నియామకానికి సంబంధించిన ఫారం–18ను సంబంధిత రిటర్నింగ్ అధికారికి సమర్పించాలి. ఆర్వోలు కౌంటింగ్ ఏజెంట్లకు ఐడీ కార్డులు తయారు చేసి పంపుతారు. కౌంటింగ్‌కు గంట ముందు అపాయింట్మెంట్ లెటర్, ఐడీ కార్డ్ ఆర్వోలకు సమర్పించాల్సి ఉంటుంది. ఫారం–19 ద్వారా కౌంటింగ్ ఏజెంట్ అపాయింట్మెంట్ను రద్దు చేసే అధికారం అభ్యర్థి లేదా ఎలక్షన్ ఏజెంట్‌కు ఉంటుంది. ఏజెంట్లకు అవగాహన అవసరం సార్వత్రిక ఎన్నికల లెక్కింపు ప్రక్రియలో ఫారం–17సీ పార్ట్–2 ఎంతో కీలకమైంది. ప్రతి కౌంటింగ్ ఏజెంట్, పరిశీలకులు, సహాయ పరిశీలకులు దీనిపై అవగాహన కలిగి ఉండాలి. కంట్రోల్ యూనిట్లో నమోదైన మొత్తం ఓట్లు, ఫారం–17సీలో పొందుపరిచిన మొత్తం ఓట్లు సరిపోల్చి చూడాలి. పార్లమెంటరీ, అసెంబ్లీ నియోజకవర్గం నంబర్, పోలింగ్ కేంద్రం పేరు, ఆ పోలింగ్ కేంద్రంలో వినియోగించిన కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్ల గుర్తింపు నంబర్లను ఆ ఫారంలోనే నమోదు చేస్తారు. ఆ పోలింగ్ కేంద్రం పరిధిలోని ఓటర్ల సంఖ్య, ఓటు వేయడానికి వచ్చిన ఓటర్ల సంఖ్య, పోలింగ్ కేంద్రంలోకి వచ్చాక ఓటు వేయడానికి నిరాకరించి వెళ్లిపోయిన వారు, ఓటింగ్ యంత్రంలో నమోదైన మొత్తం ఓట్ల సంఖ్య ఫారం–17సీలో ఉంటాయి. టెండర్ బ్యాలెట్లు, సరఫరా చేసిన పేపర్ సీళ్లు (ఓటరుకు పోలింగ్ కేంద్రంలో ఇచ్చే రెండు రంగుల స్లిప్‌లు), సీరియల్ నంబర్లు, ఎన్ని పేపర్లు వినియోగించారు, వినియోగించని పేపర్ సీళ్లు ఎన్ని తిరిగి రిటర్నింగ్ అధికారికి వెళ్లాయి, పాడైపోయిన పేపర్ సీళ్లు, సీరియల్ నంబర్ల వంటి వివరాలు ఇందులో ఉంటాయి.ట్యాంపరింగ్ జరిగితే..కంట్రోల్ యూనిట్ టేబుల్‌పైకి రాగానే అభ్యర్థి సీలింగ్ సెక్షన్ సక్రమంగా ఉందో లేదో కౌంటింగ్ ఏజెంట్లు, పరిశీలకులు చూసుకోవాలి. రిజల్ట్ సెక్షన్‌పై స్ట్రిప్ సీల్, గ్రీన్ పేపర్ సీల్ సక్రమంగా ఉన్నాయో లేదో చూడాలి. సీరియల్ నంబర్లు ఫారం–17సీలో నమోదు చేసినవే ఉండాలి. కంట్రోల్ యూనిట్ పేపర్ సీళ్లు, అడ్రస్ ట్యాగ్ల ట్యాంపరింగ్ జరిగాయని గుర్తిస్తే పరిశీలకులు ఆ విషయాన్ని రిటర్నింగ్ అధికారి, అబ్జర్వర్ల దృష్టికి తీసుకెళ్లాలి. ట్యాంపరింగ్ జరగని కంట్రోల్ యూనిట్లను మాత్రమే లెక్కించాలి.మార్గదర్శకాలు ఇవీ..అభ్యర్థులు 18 సంవత్సరాలు నిండిన వారిని ఏజెంట్లుగా నియమించుకుంటే వారు కౌంటింగ్ సక్రమంగా వీక్షించేందుకు వీలుంటుంది. సాయుధ రక్షణ కలిగిన వ్యక్తులను కౌంటింగ్ హాల్లోకి అనుమతించరాదని ఈసీఐ ఆదేశాలు స్పష్టం చేస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేయర్లు, మునిసిపల్, జెడ్పీ చైర్మన్లు, పబ్లిక్‌రంగ సంస్థలు, కార్పొరేషన్ల చైర్మన్లు కూడా ఏజెంట్లుగా కూర్చునేందుకు అనర్హులు. ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం పొందేవారు, ప్రభుత్వ–ఎయిడెడ్ సంస్థల్లో పనిచేసే పార్ట్ టైమ్ ఉద్యోగులు, పారామెడికల్ స్టాఫ్, రేషన్ డీలర్లు, అంగన్వాడీ ఉద్యోగులు పోలింగ్ ఏజెంట్లుగా ఉండకూడదు. ప్రభుత్వ శాఖల ఉద్యోగులు ఏజెంట్లుగా వ్యవహరిస్తే ప్రజా ప్రాతినిధ్య చట్టం–1951 సెక్షన్ 134 (ఏ) ప్రకారం శిక్షార్హులవుతారు. వీరికి మూడు నెలల జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ కలిపి విధించే అవకాశం ఉంది. సర్పంచ్‌లు, పంచాయతీ వార్డు సభ్యులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కౌంటింగ్ ఏజెంట్లుగా కూర్చునేందుకు ఎలాంటి అభ్యంతరం ఉండదు. భారత పౌరసత్వం కలిగిన ఎన్నారైలు కూడా కూర్చోవచ్చు. ప్రభుత్వ గన్‌మెన్ సౌకర్యం ఉన్నవారు ఎన్నికల ఏజెంట్‌గా, కౌంటింగ్ ఏజెంట్‌గా ఉండకూడదు. అలాంటి వ్యక్తి సెక్యూరిటీతో గాని, సెక్యూరిటీ లేకుండా గానీ కౌంటింగ్ హాల్లోకి ప్రవేశించకూడదు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి తనకున్న సాయుధ రక్షణను స్వచ్ఛందంగా వదులుకుంటే కౌంటింగ్ హాల్లో కూర్చునేందుకు అనుమతిస్తారు. ఒక కౌంటింగ్ హాల్లో 14 టేబుళ్లు, ఒక ఆర్వో టేబుల్ కలిపి మొత్తం 15 టేబుళ్లు ఉంటాయి. ఆ మేరకు అభ్యర్థులు తమ ఏజెంట్లను నియమించుకోవచ్చు. పోస్టల్ బ్యాలెట్లు, ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ (ఈటీ పీబీఎస్) లెక్కింపునకు అదనపు టేబుళ్లు అవసరం అని భావిస్తే అందుకోసం వేరే కౌంటింగ్ హాల్లో అదనపు టేబుళ్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అప్పుడు అభ్యర్థులు అక్కడ అదనంగా మరో కౌంటింగ్ ఏజెంట్‌ను నియమించుకోవచ్చు.