ఇంకెన్నాళ్ళో?
- పదవులు చేపట్టే దెప్పుడో?
- ఆత్రంగా ఎదురుచూస్తున్న విజేతలు
- పీఠం ఎవరికి దక్కుతుందోనన్న సందిగ్ధం
- సమీకరణాల్లో రాజకీయ పార్టీల నేతలు
- అసెంబ్లీ తర్వాతే మున్సిపల్, పరిషత్తు పీఠాలు
సాక్షి, గుంటూరు: మునిసిపల్, పరిషత్ ఎన్నికలు ముగిశాయి. ఓట్ల లెక్కింపూ జరిగిపోయింది. విజేతలెవరో తెలిసిపోయింది. కానీ కుర్చీ దక్కేదెవరికన్న సందేహం ఇంకా వెన్నాడుతోంది. గెలిచామన్న సంతోషం కంటే పదవుల్లో అధిష్టించేదెపుడనే ఆత్రం అందరిలోనూ కనిపిస్తోంది. ఎన్నడూ లేని విధంగా ఎన్నికలు జరిగినా ఓట్ల లెక్కింపులోనూ జాప్యం జరగడం... తీరా ఫలితాలు వెల్లడైనా పదవులు చేపట్టేందుకు ఏవో అడ్డంకులు. ఎంపీ, ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం తరువాతనే ఈ పీఠాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఎన్నికల కమిషన్ చెప్పిన నేపథ్యంలో ఆ రోజుకోసం అందరూ ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర విభజనకు అపాయింటెడ్ తేదీ ప్రకటించడం, అసెంబ్లీ ఎప్పుడు జరుగుతుందో ఇంకా వెల్లడి కాకపోవడంతో అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి. ఈ లోగా ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన కూడా లేకపోలేదు.
క్యాంపుల్లో అభ్యర్థులు
అధ్యక్ష స్థానాల్లో ఎవరిని కూచోబెట్టాలనే దానిపై రాజకీయ పార్టీల నేతలు సమీకరణ ల్లో మునిగి తేలుతున్నారు. మరోవైపు క్యాంపుల పేరుతో జిల్లాలోని కొన్ని మండలాల్లో గెలుపొందిన వారు జిల్లా కేంద్రంలోగల ప్రైవేటు గెస్ట్‌హౌస్‌ల్లో బస చేస్తున్నారు. మరికొందరు జిల్లాల సరిహద్దులు దాటి సేద తీరుతున్నారు. అయితే ఎన్నాళ్ళు క్యాంపులు నిర్వహించాలో తెలియని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఆటవిడుపు కోసం క్యాంపులు ఏర్పాటు చేసిన వారు ఆర్థిక భారం తట్టుకోలేక సతమతమవుతున్నారు. ముఖ్యంగా మున్సిపాలిటీలకు తొమ్మిదేళ్ళ అనంతరం ఎన్నికలు నిర్వహించారు.
ఫలితాలు వెల్లడైనా పీఠాలు అధిష్టించడంలో జాప్యంపై నిరుత్సాహంలో ఉన్నారు.మున్సిపాలిటీల్లో ఎమ్మెల్యే, ఎంపీలకు ఎక్స్ అఫీషియో హోదాలో ఓటు వేసే వీలుంది. పాలకవర్గం ఎన్నుకోవడంలో వీరికి ఓటు హక్కు కల్పించడంతో గెలుపొందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ముందుగా ప్రమాణ స్వీకారం చేయాల్సిన అవసరం ఉంది. అంతవరకూ ఎలా వీరిని కట్టడిచేయాలన్నదే వారి ఆందోళన.
జాప్యంపై టీడీపీలోనే ఆందోళన
జిల్లాలో 11 మున్సిపాలిటీల్లో టీడీపీకి స్పష్టమైన మెజార్టీ ఉంది. ఒక్క తాడేపల్లి వైఎస్సార్‌సీపీ పరమైంది. గెలిచిన మున్సిపాలిటీల్లో చైర్మన్ పీఠంపై కొన్ని చోట్ల టీడీపీలోనే అంతర్గత వివాదాలు నడిచాయి. ఈ పంచాయతీలు పార్టీ అధినేత చంద్రబాబు వద్దకు వెళ్ళాయి. మంగళగిరి మున్సిపల్ చైర్మన్ ఎవరనే విషయంలో సమస్య తలెత్తింది. ఇక్కడ మున్సిపల్ చైర్మన్ పదవి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిన గంజి చిరంజీవికే ఇవ్వాలని బాబు నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఇక్కడ సీపీఐ, సీపీఎం చెరో మూడు వార్డులు గెలుచుకోవడం, వైఎస్సార్ సీపీకి మద్దతిచ్చే అంశంలో చర్చలు జరగడంతో టీడీపీ నేతలకు ముచ్చెమటలు పడుతున్నాయి.
ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆళ్ళ రామకృష్ణారెడ్డికి మున్సిపల్ చైర్మన్‌ను ఎన్నుకునే విషయంలో ఓటు ఉండటంతో ఎంపీగా గెలుపొందిన గల్లా జయదేవ్‌ను ఓటు మంగళగిరిలో వినియోగించుకోవాలని టీడీపీ వర్గాలు ఒత్తిడి చేస్తున్నాయి. అయితే చిరంజీవికి ముగ్గురు పిల్లలున్నారని, నామినేషన్ సమయంలో మేనేజ్ చేసి పోటీ చేసి గెలుపొందారని సొంత వర్గం వారే చెబుతున్నారు. చిరంజీవి పదవికి అనర్హుడని, కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసేందుకు స్థానికులు కొందరు ఉద్యుక్తులవుతున్నారు.
అయితే ముందు జాగ్రత్తగా చిరంజీవి కేవియేట్ దాఖలు చేయడం గమనార్హం. పరిషత్తుల విషయానికొస్తే జిల్లాలో సగానికి పైగా మండలాల్లో ప్రధాన రాజకీయ పార్టీలు క్యాంపులు నడుపుతున్నాయి. హంగ్ ఏర్పడిన మండలాల్లోనూ రాజకీయం మలుపులు తిరుగుతోంది. ఏది ఏమైనా పీఠాలు ఎక్కేదెప్పుడోనని ‘స్థానిక’ నేతలకు ఎన్నాళ్ళు ఎదురు చూపులుంటాయో.. వేచి చూడాల్సిందే.