ఇబ్రహీంపట్నం, న్యూస్‌లైన్: ఎన్నికల నేపథ్యంలో సైబరాబాద్ పరిధిలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు పోలీస్ కమిషనర్ సీవీ. ఆనంద్ పేర్కొన్నారు. శుక్రవారం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ మాట్లాడుతూ.. మున్సిపల్, ఎంపీటీసీ, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సైబరాబాద్ పరిధిలో మొత్తం 42 లక్షలకు పైగా ఓటర్లు, 4,372 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని తెలిపారు.
అతి సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు 350 వరకు ఉన్నట్లు గుర్తించామని ఆయన చెప్పారు. ఎన్నికల విధుల్లో 8,658 మంది సివిల్ పోలీసులతో పాటు 30 కంపెనీల ఆర్మ్‌డ్ రిజర్వు బలగాలు పాల్గొంటాయని తెలిపారు. సైబరాబాద్ పరిధిలోని అన్ని ఠాణాల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో విస్తృతంగా వాహనాల తనిఖీలను నిర్వహిస్తున్నట్లు కమిషనర్ చెప్పారు. ఇప్పటి వరకు రూ. 5.90 కోట్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. సైబరాబాద్ పరిధిలో 2200 లెసైన్‌సడ్ ఆయుధాలున్నాయని, ఇప్పటివరకు 92 శాతం మంది డిపాజిట్ చేశారని ఆయన తెలిపారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు సంబంధించి 47 కేసులు, ఎక్సైజ్ కేసులు 93, సాధారణ కేసులు 322 నమోదు చేసి 1407 మందిని బైండోవర్ చేసినట్లు కమిషనర్ చెప్పారు.
అభ్యర్థులు ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రచారంలో వినియోగించే వాహనాలకు, మైకులకు అనుమతి తప్పనిసరి అని చెప్పారు. అభ్యర్థులు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయరాదని సూచించా రు. ప్రార్థనా స్థలాల వద్ద ఎన్నికల ప్రచారాన్ని నిషేధిం చినట్లు ఆయన తెలిపారు. కౌంటింగ్ తర్వాత విజయోత్సవ ర్యాలీలు చేపట్టరాదని, డీజేలు వాడరాదని సీవీ ఆనంద్ చెప్పారు. సైబరాబాద్ పరిధిలో వచ్చే నెల 13న పలు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నందున పటిష్టమైన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎల్బీనగర్ డీసీపీ విశ్వప్రసాద్, ఏసీపీ సురేందర్‌రెడ్డి, సీఐ మహ్మద్ గౌస్ తదితరులు పాల్గొన్నారు.
మంచాల/యాచారం: సైబరాబాద్ సీపీ సీవీ. అనంద్ శుక్రవారం సాయంత్రం మంచాల, యాచారం ఠాణాల ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణ సందర్భంగా గ్రామాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఠాణాల్లో ఆయన పలు రికార్డులను పరిశీలించారు. సీపీ ఆనంద్‌తో పాటు ఏసీపీ సురేందర్‌రెడ్డి, సీఐలు అశోక్ కుమార్, జగదీశ్వర్, ఎస్సైలు ఉన్నారు.
ఎన్నికలకు పటిష్ట భద్రత
Published Sat, Mar 29 2014 3:55 AM | Last Updated on Tue, Oct 16 2018 6:27 PM
Advertisement
Advertisement