Municipal Related Issues
-
అక్రమ వెంచర్‌పై కొరడా
సాక్షి, కొడంగల్: పట్టణంలోని లాహోటీ కాలనీ నుంచి కొండారెడ్డిపల్లికి వెళ్లే దారిలో అనుమతి లేకుండా వెలిసిన వెంచర్‌పై మున్సిపల్ అధికారులు కొరడా ఝులిపించారు. ప్లాట్ల హద్దు రాళ్లను తొలగించారు. కొడంగల్ మున్సిపాలిటీగా మారిన తర్వా త పట్టణంలోని పలు చోట్ల అక్రమ వెంచర్లు వెలిశాయి.ఈ విషయం తెలుసుకున్న మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి ఇర్షాద్, కార్య నిర్వాహక అధికారి పద్మ, మున్సిపల్ సిబ్బంది మంగళవారం వీటిని పరిశీలించారు. లాహోటీ కాలనీ నుంచి కొండారెడ్డిపల్లికి వెళ్లే దారిలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి శిఖం భూమిని కొనుగోలు చేసి ప్లాట్లుగా విభజించాడు. ఎలాంటి అనుమతులు లేకుండానే శిఖం భూమిలో ప్లాట్లు చేసి విక్రయించాడు. పట్టణానికి చెందిన పలువురు వ్యాపారులు వీటిని కొనుగోలు చేశారు. కొండారెడ్డిపల్లికి వెళ్లే దారి కావడంతో పాటు మాజీ ఎమ్మెల్యే ఇంటికి సమీపంలో ఉండటంతో కొడంగల్ వ్యాపారులు ప్లాట్లను కొనుగోలు చేశారు. దీంతో విపరీతంగా డిమాండ్ పెరిగింది. కొద్ది రోజుల్లోనే కోట్ల రూపాయలు వ్యాపారం జరిగింది. ఈ ప్లాట్లకు మున్సిపల్ అనుమతి లేదు. టౌన్ అండ్ కంట్రీ పర్మిషన్ లేదు. లే అవుట్ లేదు. శిఖం భూమిని కొనుగోలు చేసి రెవెన్యూ అధికారుల నుంచి నాలా (నాన్ అగ్రికల్చర్ ల్యాండ్) పర్మిషన్ తీసుకున్నారు. దీనిపై స్పందించిన మున్సిపల్ సిబ్బంది వెంచర్ వద్దకు వెళ్లి పరిశీలించారు. అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన వెంచర్లలోని హద్దు రాళ్లను తొలగించారు. ఇందులో ప్లాట్లు కొనుగోలు చేసిన వ్యక్తులకు ఇళ్లు నిర్మించుకునేందుకు అనుమతి ఇవ్వకూడదని మున్సిపల్ అధికారులు నిర్ణయించారు. అన్ని అనుమతులు తీసు కొని లే అవుట్ చేసిన తర్వాతనే అనుమతులు ఇ స్తామని టీపీఓ ఇర్షాద్, ఈఓ పద్మ తెలిపారు. పట్టణంలో అక్రమంగా వెలిసిన వాటిని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. -
ఏం సార్ పోలీసులకు పెళ్లాం, బిడ్దలుండరా?
శాంతియుతంగా సాగుతున్న మునిసిపల్ కార్మికుల సమ్మెపై సర్కార్ ఉక్కుపాదం మోపింది. పోలీసుల ద్వారా ఉద్యమాన్ని అణచివేసింది. సోమవారం నిర్వహించతలపెట్టిన మంత్రి కాలవ శ్రీనివాసులు ఇంటి ముట్టడిని భగ్నం చేసింది. కార్మికులపై పోలీసులు విరుచుకుపడ్డారు. పిడిగుద్దులు గుద్ది బలవంతంగా ఈడ్చి వాహనాల్లోకి విసిరేశారు. ఈ క్రమంలో మహిళలని కూడా చూడకుండా మగ పోలీసులు విచక్షణారహితంగా ప్రవర్తించారు. అనంతపురం న్యూసిటీ: పారిశుద్ధ్య పనులను ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చి కార్మికులను రోడ్డుపాలు చేసే జీఓ 279ను రద్దు చేయాలని, కనీస వేతనాలు అమలు చేయాలని మునిసిపల్ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపడుతున్న సమ్మెలో తారస్థాయికి చేరింది. డిమాండ్ల సాధనలో భాగంగా సోమవారం సీపీఎం, సీఐటీయూ, ఏఐటీయూసీ, ఎస్‌యూసీఐ మద్దతుతో మునిసిపల్ కార్మికులు రామ్‌నగర్‌లోని మంత్రి కాలవ శ్రీనివాసులు ఇంటి ముట్టడించేందుకు భారీ సంఖ్యలో వెళ్లారు. ఇంటి ముందు బైఠాయించి జీఓ 279ను రద్దు చేయాలని నినాదాలు చేశారు. అనంతరం ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించగా అప్పటికే అక్కడ భారీగా మోహరించిన పోలీసులు అడ్డుకున్నారు. దొరికిన కార్మికులను దొరికినట్టుగా అక్కడి నుంచి ఈడ్చిపడేశారు. కొంతమంది నాయకులను చుట్టుముట్టి కాళ్లు, చేతులు పట్టుకుని లాగేశారు. చేతులు పెడవిరిచి, మెడను తిప్పి, పిడిగుద్దులు గుద్దారు. నొప్పితో విలవిలలాడినా కర్కశంగా వ్యవహరించారు. మహిళా కార్మికులపైనా విరుచుకుపడ్డారు. లేడీ కానిస్టేబుళ్లతో వారిని అక్కడి నుంచి పక్కకు పంపించే అవకాశం ఉన్నా మగ పోలీసులు రెచ్చిపోయారు. మహిళలు పక్కకు కదలకుండా వారిని చుట్టుముట్టి.. వారిని చేతులతో నెట్టుతూ బలవంతంగా వాహనాల్లోకి కుక్కారు. ఒంటిపై దుస్తులు జారిపోతున్నా ఏమాత్రం పట్టించుకోలేదు. డీఎస్పీ వెంకట్రావ్ ఆదేశాల మేరకు కార్మికులను బలవంతంగా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీసుల తోపులాటలో సీఐటీయూ నాయకులు గోపాల్, మంజుల, నాగరత్న, ఆదిలక్ష్మి, శివ గాయపడ్డారు. వీరిని పోలీసు స్టేషన్ నుంచి సర్వజనాస్పత్రికి తరలించారు. మంజుల, ఆదిలక్ష్మిలకు ఫ్రాక్చర్ అయినట్లు తెల్సింది. దుర్మార్గపు చర్య జీఓ 279 రద్దు చేయాలని పోరాడుతున్న కార్మికులపై దాడులు చేయడం దుర్మార్గపు చర్య అని వామపక్షాల నేతలు నాగేంద్ర, రాజారెడ్డి, నాగరాజు, కార్మిక సంఘాల నేతలు గోపాల్, రాజేష్‌గౌడ్ ఖండించారు. ఉద్ధేశ్యపూర్వకంగానే కార్మికులపై పోలీసులు దాడులు చేశారన్నారు. మహిళా కార్మికులని చూడకుండా దాడులు చేయడం సరికాదన్నారు. మహిళలను మగ పోలీసుల ద్వారా బలవంతంగా జీపులోకి తోసేయడం దారుణమన్నారు. సమ్మెను ప్రభుత్వం నిర్వీర్యం చేయడానికి కుట్ర చేస్తోందని ధ్వజమెత్తారు. ఈ నెల 19 నుంచి ప్రత్యక్ష ఆందోళన చేపడతామని స్పష్టం చేశారు. అత్యవసర సేవలకు కార్మికులు రారని తేల్చి చెప్పారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మంగళవారం కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు. పరామర్శ పోలీసుల తోపులాటలో గాయపడ్డ కార్మికులను వైఎస్సార్సీపీ కార్పొరేటర్ జానకి పరామర్శించారు. కార్మికుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని ఆమె తప్పుబట్టారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం సరికాదని ధ్వజమెత్తారు. పోలీసులా.. పశువులా? ఏం సార్ పోలీసులకు పెళ్లాం, బిడ్దలుండరా? ఎక్కడపడితే అక్కడ చేతులు వేస్తారా? యదపై చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తించారు. ఒంటిపై చీరలేకుండా ఊడదీశారు. దెబ్బలు తగిలినా బాధ లేదు. కానీ పోలీసులు చేసిన పనులు బాగలేవు. వాళ్లు పోలీసులా..పశువులా? – మంజుల, పారిశుద్ధ్య కార్మికురాలు -
సర్కార్ జులుం
సాక్షి, గుంటూరు: తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె ఉధృత రూపం దాల్చింది. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు గొంతెత్తాయి. ఈ క్రమంలో టీడీపీ సర్కార్ నిరసన గళాలలను అణచివేసేందుకు పోలీసులను ప్రయోగిస్తోంది. ఎక్కడికక్కడ కార్మిక నాయకులు, కార్మికులను అరెస్టు చేస్తూ ఉద్యమంపై ఉక్కుపాదం మోపుతోంది. జిల్లాలో ము న్సిపల్ కార్మికుల సమ్మె గురువారం ఎనిమిదో రోజుకు చేరుకుంది. బాపట్ల, పొన్నూరు మినహా అన్ని మున్సిపాల్టీల్లో సమ్మె కొనసాగుతోంది. గుంటూరు నగరపాలక సంస్థ, తెనాలి, వినుకొం డ, నగరసరావుపేట, చిలకలూరిపేట, పిడుగురాళ్ల, మంగళగిరి, తాడేపల్లి, సత్తెనపల్లి, రేపల్లే ము న్సిపాల్టీల్లో 3700 మంది కాంట్రాక్టు పారి శుద్ధ్య కార్మికులు ఉండగా వీరిలో 2597 మంది సమ్మెలో పాల్గొంటున్నారు. 1,744 మంది ఇంజి నీరింగ్ విభాగం కాంట్రాక్టు కార్మికులు సమ్మెలో పాల్గొనడం లేదు. పారిశుద్ధ్య కార్మికులు చాలా వరకూ సమ్మె పాల్గొంటుండటంతో పారిశుద్ధ్యం క్షిణించిం ది. దీంతో ప్రభుత్వం పోటీ కార్మికులను రంగంలోకి దించి పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తోంది. పోలీసుల దౌర్జన్యం.. ఎనిమిది రోజులుగా పారిశుద్ధ్య కార్మికుల సమ్మె కొనసాగుతున్నా స్పందించని ప్రభుత్వం పోటీ కార్మికులను పనుల్లోకి తీసుకురావడంపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం 774 మంది పోటీ కార్మికులను రంగంలోకి దించి పారిశుద్ధ్య పనులు చేయిస్తోంది. దీంతో ఆయా మున్సిపాల్టీల్లో సమ్మెలో ఉన్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు పోటీ కార్మికుల విధులను అడ్డగిస్తున్నారు. సత్తెనపల్లి మున్సిపల్ అధికారులు పోటీ కార్మికులతో పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్న సమయంలో సమ్మెలో ఉన్న కార్మికులు కూలీలు చెత్త తరలిస్తున్న ట్రాక్టర్‌ను ఏరియా ఆస్పత్రి వద్ద అడ్డుకున్నారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు నిరసన చేస్తున్న సీఐటీయూ పట్టణాధ్యక్షుడు జగన్నథరావు సహా 24 కార్మికులను మంది కార్మికులను అరెస్టు చేశారు. గుంటూరు కార్పొరేషన్‌లోని ఒకటో డివిజన్లో పోటీ కార్మికుల విధులను అడ్డగించేకి ప్రయత్నించిన మున్సిపల్ కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. చిలకలూరిపేట సంజీవనగర్‌లో పారిశుద్ధ్య విధులు నిర్వర్తిస్తున్న కూలీలను మున్సిపల్ కార్మికులు అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులు నిలువరించి వెనక్కు పంపించారు. సీఎం దిష్టి బొమ్మ దగ్ధం.. వేల మంది పారిశుద్ధ్య కార్మికులకు అన్యాయం చేసేలా జీవో 279ని రద్దు చేయకుండా నియంతృత్వ పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబు దిష్టి బొమ్మను గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట కార్మికులు దగ్ధం చేశారు. కార్మిక వ్యతిరేక ప్రభుత్వానికి కాలం చెల్లిందని కార్మికులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జీవో 279ని రద్దు చేయాలని కోరుతూ మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ తెనాలి శాఖ అధ్వర్యంలో గురువారం సాయంత్రం మున్సిపల్ కార్యాలయం ఎదుట ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీడీపీ ప్రభుత్వం కార్మికులపై అణచివేత ధోరణితో వ్యవహరిస్తు పోలీసులతో కేసులు పెట్టించి భయబ్రాంతులకు గురిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జేఎసీ కన్వీనర్ మధుబాబు, రాష్ట్ర కార్యదర్శులు పి.రామచంద్రరావు, సోమ శంకర్, తెనాలి నాయకులు పాల్గొన్నారు. ఆత్మహత్యలే శరణ్యం.. జీవో 279ని రద్దు చేయకుంటే మాకు ఆత్మహత్యే శరణ్యమని ఉరితాళ్లను మెడకు బిగించుకుని మంగళగిరి పట్టణంలో కార్మికులు వినూత్న నిరసన తెలిపారు. తాడేపల్లిలో కార్మికులు మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. మున్సిపల్ కార్మికుల సమ్మె నేపథ్యంలో బుధవారం రేపల్లె పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు పట్టణంలో 144 సెక్షన్ విధించారు. నరసరావుపేటలో కార్మికులు మున్సిపల్ కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించి ఆర్డీవో ఆఫీస్‌కు చేరుకుని ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. పటిష్ట బందోబస్తు.. జిల్లాలో మున్సిపల్ కార్మికుల సమ్మె ఉద్రిక్తంగా మారడంతో ప్రభుత్వం దీక్షా శిబిరాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య విధుల నిర్వహిస్తున్న కూలీలను మున్సిపల్ కార్మికులు అడ్డుకోకుండా పోలీసులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపై పోలీసులను ప్రదర్శించి ప్రభుత్వం ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తోందని కార్మిక సంఘాల నేతలు, కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెనాలిలో ఉద్రిక్తత తెనాలిఅర్బన్: తెనాలిలో మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు చేపట్టిన సమ్మెలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోటీ కార్మికులను కాంట్రాక్ట్ కార్మికులు అడ్డుకోవడంతో మున్సిపల్ అధికారులు పోలీసుల రక్షణలో పారిశుద్ధ్య నిర్వాహణ పనులు చేయిస్తున్నారు. గురువారం ఆర్ఆర్ నగర్లో ఇదే జరిగింది. అయితే ఈ సమాచారాన్ని మున్సిపల్ కమిషనర్ శకుంతల త్రీటౌన్ పోలీసులకు అందించారు. ఎస్ఐ అశోక్‌కుమార్ మహిళా కానిస్టేబుల్స్‌తో అక్కడకు చేరుకున్నారు. కూలీలను అడ్డుకుంటే సహించేదిలేదని, కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అయిన కార్మికులు వినకపోవడంతో మహిళా కానిస్టేబుల్స్ వారిని వారించారు. ఇంతలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఘటనలో కాంట్రాక్ట్ కార్మికురాలు ఎం.జయలక్ష్మి సృహతప్పి కింద పడింది. వెంటనే తోటి కార్మికులు ఆమెను జిల్లా వైద్యశాలకు తరలించారు. విష యం తెలుసుకున్న కార్మికులు వైద్యశాలకు వచ్చి చికిత్స పొందుతున్న జయలక్ష్మిని పరామర్శించా రు. సుమారు 16 మందిని త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించి బైండవర్ చేసి వదిలేశారు. అనంతరం మున్సిపల్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ముఠాకార్మిక సంఘం డాల్ మిల్ కార్మిక సంఘ నాయకులు అక్కడికి వచ్చి మద్దతు తెలిపారు. కార్యక్రమంలో సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు, నాయకులు జోనేష్, లక్ష్మణరావు పాల్గొన్నారు. -
ఉద్యమం.. ఉద్రిక్తం
తాడేపల్లిగూడెం (తాలూకా ఆఫీస్ సెంటర్): మునిసిపల్ కాంట్రాక్ట్ పారి శుధ్య కార్మికుల సమ్మె తాడేపల్లిగూడెంలో ఉద్రిక్తతకు దారితీసింది. 279 జీఓను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్ట ణాలలో కాంట్రాక్టు పారిశుధ్య కార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పురపాలక సంఘం అధికారులు గురువారం కాంట్రాక్ట్ కార్మికుల స్థానంలో వేరే వారితో స్థానిక వీకర్స్ కాలనీ తదితర ప్రాంతాలలో పారిశుధ్య పనులు చేయించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ విషయం తెలిసి సమ్మెలో ఉన్న కార్మికులు అక్కడికి చేరుకుని ప్రైవేట్ వ్యక్తులను పనులు చేయవద్దని కోరారు. తాము సమ్మెలో ఉన్నామని, సహకరించాలని కోరారు. ఇంతలో పోలీసులు అక్కడకు చేరుకుని సమ్మెలో ఉన్న కార్మికులను బలవంతంగా జీపులోకి ఎక్కించడం మొదలుపెట్టారు. దాంతో కార్మికులకు, పోలీస్‌లకు మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో ముగ్గురు మహిళా కార్మికులు మర్రి చంద్రకళ, మండెల్లి జుయసుధ, కూనుపాముల దయామణి స్పృహ తప్పారు. వారిని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులు జీపులోకి మహిళా కార్మికులను ఎక్కించి వెనుక డోర్ వేయకుండానే వాహనాన్ని పోనివ్వడంతో కొంతమంది కార్మికులు కింద పడిపోయారు. వారికి తీవ్రగాయాలు కాగా హుటాహుటిన ఏరియా ఆసుపత్రికి తరలించారు. మహిళా కార్మికులు తాటికొండ మిరియ, ముత్యాలమహాలక్ష్మి లకు తలకు, చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. గోసాల రవి అనే కార్మికుడి చేయి బెణికింది. తరువాత స్థానిక ఏరియా ఆసుపత్రి అత్యవసర విభాగం వద్దకు పారిశుధ్య కార్మికులు చేరుకుని ధర్నా నిర్వహించారు. కాంట్రాక్ట్ కార్మికులపై దౌర్జన్యం చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న కార్మిక నేతలు కర్రి నాగేశ్వరరావు, డి.సోమసుందర్, మండల నాగేశ్వరరావు, సిరపరపు రంగారావు, గుంపుల సత్యకృష్ణ, జనసేన నాయకులు నీలపాల దినేష్, సీఐ మూర్తి, ఎస్సైలు, ట్రాఫిక్ పోలీసులు ఏరియా ఆసుపత్రికి చేరుకున్నారు. సీఐ మూర్తి ఆధ్వర్యంలో కార్మిక నాయకులతో చర్చలు జరిగాయి. ప్రభుత్వం స్పందించే వరకు ఉద్యమం ఆగదు ప్రభుత్వం స్పందించే వరకు ఉద్యమం ఆగదని ఏఐటీయూసీ, సీఐటీయూ నాయకులు డి.సోమసుందర్, కర్రి నాగేశ్వరరావులు హెచ్చరించారు. ఓ వైపు కార్మికులు సమ్మె చేస్తుండగా పోటీగా కూలీ లను తీసుకువచ్చి పారిశుధ్య పనులు చేయించడం సరికాదన్నారు. 279 జీవో విధానం అంతా లోపభూయిష్టమన్నారు. ఎన్నో ఉద్యమాలు చూశామని పోలీసులు దౌర్జన్యం చేసినా, పోటీ కార్మికులను దింపినా ఉద్యమం తీవ్రతరం అవుతుందన్నారు. రానున్న ఎన్నికలలో సత్తా చూపించండి ప్రభుత్వం పారిశుధ్య కాంట్రాక్ట్ కార్మికులపై కక్షసాధింపులు చేస్తున్నందున, కార్మికులు రానున్న ఎన్నికలలో తమ సత్తా చాటాలని ఓట్లు రూపంలో ప్రభుత్వానికి గుణపాఠం నేర్పాలని ఏఐటీయూసీ నాయకులు డి.సోమసుందర్ కార్మికులకు పిలుపునిచ్చారు. రక్తం కారుతున్నప్పటికి సమ్మె వీడవద్దన్నారు. ఉద్యమాలు తీవ్రతరం చేద్దాం అన్నారు. ప్రజా ప్రతినిధులు తమ, తమ ఇళ్ళు వద్ద ఆయా సందర్భాలలో పారిశుధ్య కార్మికులచే పనులు చేయించుకుంటున్నారని, వీరికి కాంట్రాక్ట్ కార్మికులు అవసరం లేదా అంటూ ప్రశ్నించారు. అధికారులకు సైతం పారిశుధ్య కార్మికుల సంక్షేమం పట్టడం లేదన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నడుచుకోవాలి: సీఐ మూర్తి పారిశుధ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో సమ్మె చేస్తున్న కార్మికుల స్థానంలో ప్రభుత్వం వేరే కార్మికులతో పనులు చేయిస్తుందని, వారిని అడ్డుకోవడం తగదని సీఐ మూర్తి అన్నారు. పోలీసులు డ్యూటీలు చేస్తున్నారే తప్ప కార్మికులను ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదని వివరించారు. 8వ రోజుకు సమ్మె పారిశుధ్య కార్మికుల సమ్మె గురువారం నాటికి 8వ రోజుకు చేరింది. పురపాలక సంఘం శిబిరం వద్ద కార్మికులు వంట వార్పు కార్యక్రమం చేయడం ద్వారా తమ నిరసనను ప్రభుత్వానికి తెలిపారు. పలువురు కార్మిక నాయకులు పాల్గొన్నారు. -
మున్సిపల్ కార్మికుల సమ్మె తీవ్రతరం
నెల్లూరు, వెంకటగిరి: వెంకటగిరి మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె మంగళవారం తీవ్ర రూపం దాల్చింది. పట్టణంలో పారిశుధ్య పనులు చేపట్టేందుకు కమ్మవారిపల్లి, దగ్గవోలు, సాంబయ్యబావి దళిత, గిరిజన వాడల నుండి 100 మందికి పైగా ప్రయివేటు వ్యక్తులను పనులకోసం ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ , మున్సిపల్ కమిషనర్ గంగాప్రసాద్‌లు మంగళవారం ఉదయం తీసుకువచ్చారు. వారిని కార్మిక సంఘాల నాయకులు అడ్డుకోవడంతో పోలీసుల రంగప్రవేశం చేసి 14 మందిని అరెస్టు చేసి డక్కిలి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆ సమయంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కె. చినవెంకటరమణయ్య సీఎం చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. మధ్యాహ్నం అరెస్టు చేసిన కార్మిక సంఘాల నాయకులను వ్యక్తిగత పూచీకత్తుతో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్సై కొండపనాయుడు మాట్లాడుతూ సమ్మెలో అవాంఛనీయ సంఘటనలు జరకుండా ముందస్తు జాగ్రత్తల నేపథ్యంలో కార్మిక సంఘాల నాయకులను అరెస్టు చేసి అనంతరం విడుదుల చేసినట్లు తెలిపారు. కార్మికుల సమ్మెను విరమింపజేసేందుకు ప్రయత్నించాల్సిన అధికారపార్టీ ప్రజాప్రతినిధులు, అధికారులు వారిని రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీసు కేసుల పేరుతో వారిని అరెస్టు చేసి ఉద్యమంపై ఉక్కుపాదం మోపడంపై కార్మిక సంఘాల నేతలు మండిపడుతున్నారు. కార్మికులు విధులకు హజరుకాకపోతే ప్రయివేటు వ్యక్తులతో పారిశుధ్యం పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవడం అధికారపార్టీ నాయకుల మొండివైఖరికి నిదర్శనమని కార్మిక సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆదేశాలతో ఇతర ప్రాంతాలనుంచి ప్రయివేటు వ్యక్తులను రప్పించి పారిశుధ్య పనులు చేయించడం ఏమిటని ప్రశ్నించారు. కార్మిక వ్యవస్థ నిర్వీర్యానికి కుట్ర కావలిఅర్బన్: మున్సిపల్ కార్మిక వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని సీపీఎం పట్టణ కార్యదర్శి పి.పెంచలయ్య అన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం ముందు పారిశుద్ధ్యం కార్మికులు చేస్తున్న సమ్మెలో భాగంగా బుధవారం అర్ధనగ్న ప్రదర్శన చేశారు. ప్రజాసంఘాలు, వైఎస్సార్‌ఎస్‌యూ, వామపక్షాల ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు ఈ ప్రదర్శన జరిగింది. అనంతరం పెంచలయ్య మాట్లాడుతూ 279 జీఓను తెచ్చి పారిశుద్ధ్య కార్మికులకు అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 15 మందిచేయాల్సిన పనిని కేవలం ఇద్దరు కార్మికులచేత చేయించాలని ప్రయత్నిస్తోందన్నారు. సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు టి. మాల్యాద్రి, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి సత్యనారాయణ, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకుడు అంకయ్య, పద్మ, మాలకొండయ్య, రమ, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ప్రయివేటు కార్మికులను అడ్డుకున్న మున్సిపల్ కార్మికులు ఆత్మకూరు: మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ కార్మికులతో పారిశుధ్యపనులను చేపట్టారు. వీరిని మంగళవారం రాత్రి మున్సిపల్ కార్మికులు అడ్డుకున్నారు. రాత్రి సమయాల్లో కమిషనర్ ప్రయివేటు వ్యక్తులతో పనులు చేయించడం దారుణమని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ఎల్‌ఆర్‌పల్లి, జెఆర్‌పేట ప్రాంతాల్లో పనులు చేస్తున్న వారిని సమ్మె కార్మికులు అడ్డుకుని పనులు నిలిపివేయించారు. కమిషనర్ చర్యలను ఖండిస్తూ వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక నాయకులు హజరత్తయ్య, నాగరాజు, గడ్డం నాగేంద్ర, పెంచలయ్య, పలువురు మహిళా కార్మికులు ఉన్నారు. -
ఎక్కడి చెత్త అక్కడే!
కర్నూలు (టౌన్): ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ కర్నూలు కార్పొరేషన్లో మున్సిపాల్టీల్లో కాంట్రాక్టు పద్ధతిలో పని చేస్తున్న కార్మికులు సమ్మెబాట పట్టారు. ప్రభుత్వం ఇటీవల తెచ్చిన 279 జీవోను రద్దు చేయాలని మున్సిపల్ జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగారు. రెండో రోజు ఆదివారం జిల్లాలోని కర్నూలు కార్పొరేషన్‌తో పాటు ఆదోని, నంద్యాల, ఎమ్మిగనూరు, డోన్, నందికొట్కూరు, ఆత్మకూరు, ఆళ్లగడ్డ, గుడూరు మున్సిపాలిటీలలో కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న కార్మికులు సమ్మె కొనసాగించారు. జిల్లాలోని 9 మున్సిపాల్టీలలో 2,500 మంది కార్మికులు కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్నారు. కర్నూలు కార్పొరేషన్ పరిధిలో 500 మంది కాంట్రాక్టు కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. దీంతో చెత్త సేకరణ సమస్యగా మారింది. కార్మికులు విధులను బహిష్కరించడంతో కల్లూరు, పాత కల్లూరు, స్టాంటన్‌పురం, మామిదాల పాడు, మునగాలపాడు ప్రాంతాల్లో చెత్త పేరుకుపోతుంది. అలాగే ఇంటింటికి చెత్త రెండురోజులుగా నగరంలోని అనేక ప్రాంతాల్లో నిలిచిపోయింది. విధుల బహిష్కరణ– నగరంలో ర్యాలీ జీవో 279 రద్దు చేయాలని ఐఎన్టీయూసీ నాయకుడు రమణ, ఏఐటీయూసీ నాయకుడు రామకృష్ణారెడ్డి సీఐటీయూ రాముడు, వైఎస్ఆర్ టీయూసీకి చెందిన నాయకుడు స్వాములు డిమాండ్ చేశారు. రెండో రోజు అన్ని యూనియన్లకు కన్వీనర్‌గా వై.వి.రమణ నాయకత్వం వహించారు. కర్నూలులో కార్మికులు ర్యాలీ నిర్వహించారు. స్థానిక మున్సిపల్ ఒపెన్ ఎయిర్ థియేటర్ నుంచి కొండారెడ్డి బురుజు, కోట్ల సర్కిల్ వరకు ఊరేగింపు నిర్వహించారు. అక్కడే మానవహారం నిర్వహించారు. జేఏసీ నాయకులు మాట్లాడుతూ సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాల్సిన ప్రభుత్వం బెదిరింపు చర్యలకు పాల్పడటం బాధాకరమన్నారు. కార్మికులపై కేసులు బనాయించేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని విమర్శించారు. రెండు రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వంలో చలనం లేదన్నారు. ఇప్పటికైనా కార్మికుల పొట్టగొడుతున్న జీవో 279 రద్దు చేయాలని, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమానపనికి సమాన వేతనం, అవసరానికి తగ్గట్లు కార్మికుల సంఖ్యను పెంచాలని కోరారు. ప్రైవేటు వ్యక్తులతో చెత్తతరలింపునకు రంగం సిద్ధం రెండు రోజులుగా కాంట్రాక్టు కార్మికులు సమ్మె చేస్తుండటంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు శ్రీకారం చుట్టింది. రాత్రి 1 గంట తరువాత పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు ప్రైవేటు వ్యక్తులను నియామించాలని నిర్ణయించింది. అలాగే కర్నూలులో రెగ్యులర్ కింద 348 మంది కార్మికులు పనిచేస్తున్నారు. నగరంలో ఉన్న 13 డివిజన్లలో డివిజన్‌కు 15 నుంచి 20 మందిని కేటాయించి పారిశుద్ధ్య పనులు చేయించాలని అధికారులు నిర్ణయించారు. కాగా సమ్మెను నీరుగార్చే చర్యలకు ప్రభుత్వం పాల్పడితే అడ్డుకుంటామని జేఏసీ నాయకులు రమణ చెప్పారు. విధిలేని పరిస్థితుల్లో సమ్మెలో పాల్గొంటున్నామని, సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించకుండా ఒంటెద్దు పోకడలకు పోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. -
తెనాలి మున్సిపల్ సమవేశం రసాభాసా
-
ఎత్తుకు పైఎత్తు!
పదవికాదు... నమ్మిన సిద్ధాంతానికే కట్టుబడి ఉండాలి. అది నిజమైన రాజకీయ నాయకునికి ఉండాల్సిన నిబద్ధత. పార్టీ మారిన వెంటనే పదవికి రాజీనామా చేయడం నైతిక బాధ్యత. దానిని తూచా తప్పకుండా పాటిస్తున్నారు సాలూరు మునిసిపల్ వైస్‌చైర్‌పర్సన్‌కాకి పాండురంగ. పార్టీ మారిన వెంటనే ఇబ్బంది పెట్టాలని యోచించిన అధికార పార్టీకి వైస్‌చైర్మన్ పదవికి రాజీనామా అస్త్రంతో దీటైన సమాధానం ఇస్తున్నారు. సాక్షిప్రతినిధి, విజయనగరం: తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక పోకడలు నచ్చక ఆ పార్టీ నుంచి బయటకు రావాలనుకుంటున్న నేతలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఇదే కోవలో ఇటీవల వైఎస్సార్సీపీలో చేరిన సాలూరు మున్సిపల్ వైస్ చైర్మన్ కాకి పాండురంగపై అవిశ్వాసం పెట్టడానికి సిద్ధపడుతున్నారు. వైఎస్సార్సీపీ గుర్తుతో గెలిచిన ఎమ్మెల్యేలు టీడీపీలో చేరినా పదవులకు రాజీనామా చేయకుండా వేలాడుతుంటే... తాను మాత్రం పార్టీ మారాక ఆ పార్టీతో వచ్చిన పదవితో పనేంటని రాజీనామాకు సిద్ధపడుతూ వారికి తగిన బుద్ధి చెబుతున్నారు. టీడీపీలో అవినీతి నచ్చకే... వస్త్ర వ్యాపారంతో ప్రాచుర్యం పొందిన కాకి పాండురంగ 20 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. మొదటిసారి 2009లో కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. 2014లో తిరిగి కౌన్సిలర్‌గా గెలుపొంది వైస్ చైర్మన్ పదవి పొందారు. ప్రస్తుతం 22వ వార్డు కౌన్సిలర్‌గా నాలుగున్నరేళ్లపాటు ఉన్న ఆయన చైర్పర్సన్ గొర్లె విజయకుమారితో విభేదించేవారు. రెండేళ్ల క్రితం చైర్పర్సన్, ఆమె భర్తపైనా వ్యతిరేక కరపత్రాలు విడుదల చేశారు. ఉద్యోగాలు అమ్ముకుంటున్న వైనాన్ని, అవినీతిని నిర్భయంగా కరపత్రాల ద్వారా బట్టబయలు చేశారు. ఈ క్రమంలో టీడీపీతో ఆయనకు దూరం పెరిగింది. మరోవైపు సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొరపై అభిమానం ఏర్పడింది. ఈ నేపథ్యంలో గత నెలలో ఎమ్మెల్యే రాజన్నదొర సారధ్యంలో వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ సమక్షంలో పాండురంగ వైఎస్సార్సీపీలో చేరారు. -
ఏకగ్రీవంగా రామగుండం మున్సిపల్ ఎన్నికలు
-
మహిళా కార్మికురాలి గొంతు పట్టుకున్న సీఐ ఫిరోజ్
ఒంగోలు టౌన్: ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నగర శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన నగర పాలక సంస్థ కార్యాలయం ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఫెడరేషన్ నాయకులు, సీఐటీయూ నాయకులు, కార్మికులు నగర పాలక సంస్థ కార్యాలయం గేట్లువేసి దాని ముందు బైఠాయించారు. ఉదయం తొమ్మిది గంటలకు బైఠాయించిన కార్మికులు, నాయకులు గంటసేపు నినాదాలు చేశారు. పోలీసులు రంగప్రవేశం చేయడంతో ఒక అరగంటపాటు నిర్వహించి కార్యక్రమాన్ని ముగిస్తామంటూ నాయకులు చెప్పారు. అయితే ఒంగోలు వన్‌టౌన్ ఏఎస్ఐ సుబ్బారావు నగర పాలక సంస్థ కార్యాలయ గేటుకు తగిలించిన సీఐటీయూ జెండాను తొలగించారు. దీంతో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అప్పటికే అక్కడకు పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. గేటు ముందు బైఠాయించిన సీఐటీయూ నాయకులను బలవంతంగా పక్కకు లాగారు. ఆ సమయంలో తీవ్ర పెనుగులాట జరిగింది. సీఐటీయూ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీరాం శ్రీనివాసరావును బలవంతంగా అక్కడ నుంచి లాగుతున్న సమయంలో ఆయన చొక్కా చినిగిపోయింది. దీంతో అక్కడే ఉన్న మహిళా కార్మికులు పోలీసుల చర్యలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో సీఐ ఫిరోజ్ మహిళలని కూడా చూడకుండా చిడిపోతు ఏసమ్మ అనే మహిళా కార్మికురాలి గొంతు పట్టుకోవడంతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఒంగోలు డీఎస్పీ శ్రీనివాసరావు హుటాహుటిన అక్కడకు చేరుకొని పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించారు. పోలీసుల చర్యలను ఎండగడుతూ నగర పాలక సంస్థ కార్యాలయం నుంచి నాయకులు, కార్మికులు ప్రదర్శనగా బయల్దేరి స్థానిక చర్చి సెంటర్లో కొద్దిసేపు మానవహారం నిర్వహించారు. మున్సిల్ కార్మికులను చిన్నచూపు చూస్తోంది మునిసిపల్ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని సీఐటీయూ, మునిసిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు విమర్శించారు. తొలుత నగర పాలక సంస్థ కార్యాలయాన్ని ముట్టడించిన సమయంలో కార్మికులను ఉద్దేశించి సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్ శ్రీనివాసరావు, నగర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీరాం శ్రీనివాసరావు, ఏపీ మునిసిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు కె.సామ్రాజ్యం మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు గొడ్డలిపెట్టుగా మారిన జీఓ నం 279ని రద్దు చేయాలని, జీఓ నం 151 ప్రకారం పెరిగిన వేతనాలు అమలు చేయాలంటూ గత రెండేళ్ల నుంచి నిరసనలు, ధర్నాలు చేపట్టినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఈ నెల 5వ తేదీ ఆర్థిక శాఖామంత్రి యనమల రామకృష్ణుడు, మున్సిపల్ శాఖామంత్రి నారాయణ, డీఎంఈ కన్నబాబులను రాష్ట్ర ప్రతినిధి బృందం కలిసి సమస్యను విన్నవించగా, ఒకరోజు గడువు కావాలని మంత్రుల బృందం సూచించిందన్నారు. ఆ తరువాత మరో నాలుగు రోజులు గడువు కావాలని మంత్రుల బృందం పేర్కొందన్నారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ రాష్ట్రవ్యాప్తంగా ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చారు. తాము ఉదయం 9 గంటలకు నగర పాలక సంస్థ కార్యాలయం గేట్లువేసి అక్కడే బైఠాయించామని, పదిన్నర గంటలకల్లా తమ ఆందోళన ముగిస్తామంటూ పోలీసులకు చెప్పినప్పటికీ, వారు అత్యుత్సాహాన్ని ప్రదర్శించి ప్రశాంతంగా జరుగుతున్న బైఠాయింపు కార్యక్రమాన్ని ఉధృతంగా మార్చారన్నారు. మహిళలని కూడా చూడకుండా మగ పోలీసులు వారిపై అనుచితంగా ప్రవర్తించడాన్ని తీవ్రంగా ఖండించారు. మహిళలను తాకరాదని చట్టం చెబుతున్నప్పటికీ పోలీసులు మహిళా కార్మికురాలి గొంతు పట్టుకొని దౌర్జన్యంగా వ్యవహరించడంపై తీవ్రంగా ఆక్షేపించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు తంగిరాల మహేష్, కొర్నెపాటి శ్రీనివాసరావు, దామా శ్రీనివాసులు, తంబి శ్రీనివాసులు, ఫెడరేషన్ నాయకులు గోపి, రత్నకుమారి పాల్గొన్నారు. -
మధిర మున్సిపాలిటీలోఅవినీతి తిమింగలాలు..!
మధిర ఖమ్మం : మధిర మున్సిపాల్టీలో ఏదైనా పని కావాలంటే అధికారులకు, సిబ్బందికి ముడుపులు చెల్లించుకోవాల్సిందేనన్న విమర్శలు వినవస్తున్నా యి. ఇటీవల ఏసీబీ అధికారులు దాడిచేసి పట్టపగలే అక్రమంగా డబ్బులు తీసుకున్న ఇద్దరు ఉద్యోగులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని కేసు నమోదు చేశారు. ఈ కార్యాలయంలో మరికొన్ని అవినీతి తిమింగలాలు ఉన్నాయని ప్రజల నుంచి ఆరోపణలు వినవస్తున్నాయి. ఇక్కడ ఒక్కో పనికి ఒక్కో రేటును సిబ్బంది నిర్ణయించినట్టు తెలిసింది. జనన, మరణ ధృవీకరణ పత్రాలతోపాటు ఎల్ఆర్ఎస్, విద్యుత్ మీటరు కనెక్షన్ పొందాల న్నా, తల్లిదండ్రుల వారసత్వపు ఆస్తిని పిల్లల పేరు మీదకు బదలాయించాలన్నా ముడుపులు చెల్లిం చాల్సిందేనట. ముడుపులు ఇస్తేనే ఫైలు కదులుతుందని దరఖాస్తుదారులకు సిబ్బంది ప్రత్యక్షంగానే చెబుతున్నట్టుగా విశ్వసనీయ సమాచారం. కొన్ని ఉదాహరణలు సుమారు మూడు నెలల క్రితం గుంటూరుకు చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు మధిర రైల్వేస్టేషన్ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరికి డెత్ సర్టిఫికెట్లు ఇచ్చారు. మరొకరికి ఇవ్వకుండా ఆపి, ఆ ఒక్కరికి పోస్టుమార్టం రిపోర్టు రాలేదని చెప్పారు. దీంతో బాధిత కుటుంబానికి చెందిన బంధువులు గుంటూరు నుంచి పలుమార్లు మధిర మున్సిపల్ కార్యాల యం చుట్టూ తిరిగారు. పైసలిస్తేనే ఆ డెత్ సర్టిఫికె ట్ ఇస్తామంటున్రాని వారు విలేకరులతో చెప్పా రు. దీనిపై మున్సిపల్ కార్యాలయ సిబ్బందిని విలేకరులు.. ‘‘పోలీసులు ఇచ్చిన ఎఫ్ఐఆర్ ఉండ గా పోస్టుమార్టం రిపోర్టుతో సంబంధమేమిటి? కాజ్ ఆఫ్ డెత్ లేకుండా ఇచ్చే డెత్ సర్టిఫికెట్‌కు పోస్టుమార్టం రిపోర్టు ఎందుకు?’’ అని ప్రశ్నిస్తే సమాధానం లేదు. రెండు మూడు రోజులు తరువాత కొందరు రాజకీయ నాయకులు ఒత్తిడి చేసిన తరువాతనే వారికి డెత్ సర్టిఫికెట్ ఇచ్చారు. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి సమీపంలో ఒక ఇల్లు ఉంది. అతని కుటుంబ సభ్యులు ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికెట్స్ తీసుకొచ్చి మున్సిపల్ కార్యాలయంలో ఇచ్చారు. మృతుని పేరు మీద ఉన్న ఇంటిని కుటుంబ సభ్యుల పేరు మీదకు మార్చాలని కోరారు. ఇందుకోసం అక్కడి సిబ్బంది రెండువేల రూపాయలు లంచంగా తీసుకున్నారట. డబ్బులు ఇచ్చి నెల దాటినప్పటికీ ఈ రోజుకు కూడా ఆ సర్టిఫికెట్ ఇవ్వలేదు. రెడ్డి గార్డెన్స్ కల్యాణ మండపం సమీపంలో ఒకరు నూతనంగా భవనాన్ని నిర్మించుకున్నారు. ఆ ఇంటికి విద్యుత్ కనెక్షన్ కోసం రూ.12వేలు లంచం డిమాండ్ చేశారట. నూతన కట్టడాల సంగతి చెప్పనక్కరలేదు. రేకుల షెడ్డు నిర్మాణానికి, భవన నిర్మాణానికి, దుకాణం ఏర్పాటుకు, బడ్డీకొట్టు నడుపుకునేందు కు రేట్లు చేసినట్టుగా ఆరోపణలు వినవస్తున్నాయి. పలుకుబడిగల వారికి ఇంటి పన్ను తగ్గిస్తున్నట్లు విమర్శలున్నాయి. ఇంటిపన్ను ఎక్కువ వస్తున్న దని సాధారణ వ్యక్తులు ఫిర్యాదు చేస్తే... ‘‘అందు లో మేము చేసేదేమీ ఉండదు. కంప్యూటర్లో కొలతలు నమోదు చేయగానే ఆటోమేటిక్‌గా పన్ను నిర్థారణతో రశీదు వస్తుంది’’ అని చెబుతున్నారని కొందరు చెప్పారు. అవినీతి తిమింగలాలకు డబ్బులు ముట్టచెప్పలేక కొంతమంది ఇల్లు కట్టుకోలేకుండా, దుకాణాలు నడపలేక చేతులెత్తేసిన దాఖలాలు ఉన్నాయి. కమిషనర్ వివరణ పై ఉదాహరణలను, ఆరోపణలను మున్సిపల్ కమిషనర్ దేవేందర్ దృష్టికి ‘సాక్షి’ తీసుకెళ్లింది. ఆయన వివరణ కోరింది. ‘‘ఇక్కడ అవినీతి అనేదే లేదు. కొంతమంది బురద జల్లుతున్నారు. ఎవరైనా అడిగితే నాతో చెప్పండి’’ అని అన్నారు. ప్రక్షాళన చేయాలి మున్సిపల్ కార్యాలయంలో అవినీతి రాజ్యమేలుతోంది. అధికారులు, సిబ్బంది అడుగుతున్న లంచాలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఏ పని కావాలన్నా డబ్బులు ముట్టచెప్పాల్సిందే. అదేమిటని ప్రజాప్రతినిధులమైన మేము ప్రశ్నిస్తే.. నిబంధనలు అడ్డం వస్తున్నాయని చెబుతున్నారు. కానీ పైసలిస్తే మాత్రం వారికి నిబంధనలు అడ్డురావు. పరిస్థితి దారుణంగా ఉంది. – ములకలపల్లి వినయ్‌కుమార్, 15వ వార్డు సభ్యుడు. -
గళమెత్తిన పారిశుద్ధ్య కార్మికులు
విజయనగరం మున్సిపాలిటీ : పట్టణ ప్రాంతాల్లో నూతన పారిశుద్ధ్య విధానం అమలును వ్యతిరేకిస్తూ శుక్రవారం మున్సిపల్ ఔట్సోర్సింగ్ చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి స్వల్ప ఉద్రిక్తతల నడుమ ముగిసింది. జీఓ నంబర్ 279ను వ్యతిరేకిస్తూ సీఐటీయూ చేపట్టిన ఈ కార్యక్రమంలో విజయనగరం మున్సిపాలిటీ సహా సాలూరు, బొబ్బిలి, పార్వతీపురం మున్సిపాలిటీల ఔట్సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. అంతకుముందు విజయనగరం మున్సిపల్ పారిశుధ్ధ్య కార్మికులంతా మున్సిపల్ కార్యాలయం నుంచి ప్రదర్శనగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అనంతరం నాలుగు మున్సిపాలిటీల కార్మికులు కలెక్టర్ కార్యాలయం ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించి పెద్ద పెట్టున నినాదాలు చేశారు. సుమారు రెండు గంటల పాటు నిరసన చేపట్టిన అనంతరం కలెక్టరేట్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు, కార్మికుల మధ్య స్వల్ప తోపులాటు చోటు చేసుకుంది. పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చివరికి జిల్లా రెవెన్యూ అధికారి వెంకటరావు వచ్చి సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇవ్వటంతో కార్మికులు అక్కడి నుంచి వెనుదిరిగారు. మా పొట్టలు కొట్టద్దు ఔట్ సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలను జీఓ నంబర్ 279 పేరిట రోడ్డున పడేయొద్దని సీఐటీయూ నేతలు రెడ్డి శంకరరావు, టీవీ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త పారిశుద్ధ్య విధానాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట చేపట్టిన నిరసన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా విజయనగరం మున్సిపాలిటీలో జీఓ నంబర్ 279 అమలుకు చర్యలు చేపట్టడం దుర్మార్గపు చర్యగా పేర్కొన్నారు. ఇలాంటి చర్యలతో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా జరగకపోతే ప్రజారోగ్యానికి పెనుముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. తాజా విధానంతో ప్రజల నుంచి యూజర్ చార్జీలు వసూలు చేయనున్నారన్నారు. కార్యక్రమంలో కార్మిక సంఘాల నేతలు జగన్మోహనరావు, యు.శంకరరావు, భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఏసీబీ వలలో మున్సిపల్ ఉద్యోగులు
మధిర ఖమ్మం : లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు ఉద్యోగులు పట్టుబడిన సంఘటన మంగళవారం మధిర మున్సిపాల్టీలో జరిగింది. బాధితుడు కోదాటి వేణుగోపాల్ తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని అంబేడ్కర్ సెంటర్ సమీపంలో కోదాటి రాజమౌళికి 6-90, 91 ఇంటి నంబర్లలో రెండు ఇళ్లు ఉన్నాయి. ఆయనకు ఇద్దరు కుమారులు వేణుగోపాల్, వెంకటేశ్వరరావు ఉన్నారు. రాజమౌళి చనిపోయిన తరువాత ఆ ఇళ్లను చిన్నకుమారుడు వెంకటేశ్వరరావుకు అప్పట్లో బదిలీచేశారు. ఈ విషయంపై 2014లో ఒక న్యాయవాదిని వెంటబెట్టుకుని వేణుగోపాల్ మధిర మున్సిపాల్టీకి వచ్చాడు. ఇద్దరు కుమారులకు చెందిన ఆస్తిని ఒకరి పేరుమీద ఎలా బదిలీ చేశారని ప్రశ్నించగా పొరపాటు జరిగిందని, తిరిగి ఆ ఇళ్లను రాజమౌళి పేరుమీదకు బదిలీచేశారు. ఖమ్మంలో నివసిస్తున్న వేణుగోపాల్‌కు వాటర్‌ప్లాంట్ ఉంది. ప్లాంట్‌ను మధిరకు షిఫ్ట్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఈనెల 8న దరఖాస్తు చేసుకున్నాడు. రూ.30 వేలు ఇస్తేనే ఫైలు కదులుతుందని బిల్ కలెక్టర్, ఇన్చార్జ్ ఆర్ఐ పి.వెంకటేశ్వర్లు చెప్పాడు. చివరకు రూ. 6 వేలు ఇస్తేనే పొజిషన్ సర్టిఫికెట్ ఇస్తానన్నాడు. విసిగిపోయిన వేణుగోపాల్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పొజిషన్ సర్టిఫికెట్ పూర్తయిందని, రూ.6 వేలు ఇచ్చి తీసుకెళ్లాలని వేణుగోపాల్‌కు ఇన్చార్జ్ ఆర్ఐ తెలుపగా పక్కా ప్రణాళికతో ఏసీబీ అధికారులు మంగళవారం మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. ఉదయం వెళ్లి సర్టిఫికెట్ అడగ్గా లంచ్ తరువాత రమ్మని తెలిపాడు. ఔట్సోర్సింగ్ ఉద్యోగిని నిర్మలకు డబ్బులు ఇవ్వమని వెంకటేశ్వర్లు చెప్పగా ఇచ్చాడు. ఆమె డబ్బును హ్యాండ్‌బ్యాగ్‌లో పెట్టుకుంది. అక్కడే సిద్ధంగా ఉన్న ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలో దాడిచేసి రూ.6 వేలను స్వాధీనం చేసుకున్నారు. పరీక్షలు చేసి ఇన్చార్జ్ ఆర్ఐ వెంకటేశ్వర్లు, నిర్మలను నిందితులుగా గుర్తించి కేసు నమోదు చేశారు. కార్యాలయంలోని పలు ఫైళ్లను పరిశీలించారు. ఇన్చార్జ్ ఆర్ఐ వెంకటేశ్వర్లు, అవుట్సోర్సింగ్ ఉద్యోగిని నిర్మలపై కేసు నమోదుచేసి కోర్టుకు రిమాండ్ చేస్తామని ఏసీబీ డీఎస్పీ కిరణ్‌కుమార్ తెలిపారు. దాడిలో ఖమ్మం ఏసీబీ సీఐ రమణమూర్తి, వరంగల్ సీఐలు వెంకట్, క్రాంతి, ఏసీబీ సిబ్బంది పాల్గొన్నారు. -
అధికారులపై ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి చిందులు
సాక్షి, కర్నూలు : మున్సిపల్ అధికారులపై నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్మావతి నగర్లో ఆక్రమణలు తొలగింపునకు చర్యలు చేపట్టిన మున్సిపల్ అధికారులను సోమవారం ఆయన అడ్డుకున్నారు. దీంతో అధికారులకు ఆయనకు తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. గత ఉప ఎన్నికల సమయంలో ఇల్లు, షాపులు పగలగొడితే మాట్లాడని బ్రహ్మానంద రెడ్డి ఇప్పుడు జోక్యం చేసుకోవడం ఏమిటని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఈ విషయంలో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. -
ఇచ్చిందే మాంసం
మెదక్ మున్సిపాలిటీ : జిల్లా కేంద్రంలో మాంసం విక్రయాలు విచ్చల విడిగా కొనసాగుతున్నాయి. అనారోగ్యంతో మృత్యువాత పడే స్థితిలో ఉన్న జీవాలను చౌక ధరలకు కొనుగోలు చేసి, వాటిని కోసి విక్రయిస్తున్నారు. మరికొందరు మాంసం వ్యాపారులు గొర్రెలను కోసి మేక పొట్టేలుగా నమ్మించి అంటగడుతున్నారని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో 50 నుండి 60 వరకు మాంసం దుకాణాలున్నాయి. కిలో మాంసం ధర రూ.400ల వరకు విక్రయిస్తున్నారు. అనారోగ్యంతో ఉన్న గొర్రెలు, మేకలను కటికలు అతి తక్కువ ధరలకు కొనుగోలు చేస్తున్నారు. వధశాల లేకపోవడంతో ఇంటి వద్దనే అపరిశుభ్ర వాతావరణంలో వాటిని వధించి మార్కెట్‌కు తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. ఆడ గొర్రెల మాంసాన్ని పొట్టేలుగా నమ్మించి అమ్ముతున్నారని ప్రజలు వాపోతున్నారు. ఎలాంటి మాంసం అమ్ముతున్నారో ప్రజలకు తెలియడం లేదు. పశువైద్యాధికారి ధ్రువీకరణ చేశాకే ఆరోగ్యంగా ఉన్న గొర్రెలు, మేకలను వధశాలలో కోయాలి. కానీ వధశాల లేకపోవడంతో కటికలు తమ ఇష్టమైన ప్రదేశాల్లో మూగజీవాలను కోసి ఇష్టానుసారంగా విక్రయిస్తున్నారు. వెటర్నరీ అధికారులు, మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ లోపంతో అపరిశుభ్రమైన మాంసం విక్రయాలు జరుగుతున్నాయి. ఇది ప్రజారోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది. అనుమతి లేకుండా మేకపోతుల మాసం విక్రయం మెదక్ జిల్లా కేంద్రం కావడంతో మాంసం విక్రయాలు ఎక్కువగా జరుగుతుంటాయి. అయితే మాంసం వ్యాపారులు నిబంధనలు పాటించకుండా విక్రయాలు జరుపుతున్నారని వినియోగదారులు విమర్శిస్తున్నారు. నిబంధనల ప్రకారం మాంసం విక్రయదారులు తమ ఇష్టానుసారం గొర్రె పోతులు, మేక పోతులను వధించడానికి వీల్లేదు. పశువైద్యులు పరీక్షించాకే వధించాల్సి ఉంటుంది. కానీ వ్యాపారులు అలాంటి నిబంధనలు పాటించకుండా అనారోగ్యంతో చనిపోయే స్థితిలో ఉన్న గొర్రెలు, మేకలను కోస్తూ మాంసం విక్రయాలు చేస్తున్నారని, ఈ విషయంలో వెటర్నరీ, మున్సిపల్ అధికా రులు లంచాలు తీసుకుంటూ నాణ్యతను పట్టించుకోవడం లేదని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. వైద్య పరీక్షల మాటే లేదు జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణంలో సుమారు లక్ష మేర జనాభా ఉండగా ఒక్క వధశాల కూడా లేకపోవడం గమనార్హం. వ్యాపారులు గొర్రెలు, మేకలు తీసుకొచ్చాక, డాక్టర్లు వాటిని పరిశీలించి, పూర్తి ఆరోగ్యంగా ఉన్నాయని ధృవీకరించిన తరువాతే వాటిని వధించాలి. అనంతరం వైద్యులు మరోసారి పరీక్షలు చేసి, క్షుణ్నంగా పరిశీలించి, వాటి మాంసం సురక్షితమైందని ముద్ర వేయాలి. ఆ తరువాతే మాంసాన్ని దుకాణాల్లో పెట్టి విక్రయించాల్సి ఉంది. గ్రామాల్లో నాణ్యమైన ఆరోగ్యవంతమైన మాంసం దొరుకుతుందని ప్రజలు నమ్ముతారు. పండుగలు, శుభకార్యాల సందర్భంగా మాంసం వ్యాపారులు దోపిడీ చేస్తున్నారు. నాణ్యతతోపాటు తూకం వేయడంలోనూ వ్యాపారులు ప్రజలను మోసం చేస్తున్నారు. మార్కెట్లో అమ్మకం చేసే మాంసంపై ఈగలు, దోమలు వాలకుండా దోమ తెరలు వాడాల్సినప్పటికీ కనీస నిబంధనలు పాటించడం లేదు. ఇప్పటికైనా మున్సిపల్, వెటర్నరీ అధికారులు స్పందించి మాంసం విక్రయదారులు నిబంధనలు పాటించి, ప్రజల ఆరోగ్యాలు కాపాడేలా చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు. మున్సిపల్ అధికారులే చూసుకోవాలి మాంసం విక్రయం విషయాలను మున్సిపల్ అధికారులు చూసుకోవాలి. వారే డాక్టర్‌ను ఏర్పాటు చేసుకోవాలి. మున్సిపాలిటీ అధికారులు వధశాల ఏర్పాటు చేసి అక్కడ మూగజీవాలను పరిశీలించి కోసేందుకు అనుమతులు ఇవ్వాలి. – అశోక్‌కుమార్, జిల్లా వెటర్నరీ అధికారి, మెదక్ పట్టించుకునే దిక్కేది..? అధికారులు ఆరోగ్యమైన గొర్రెలు, మేకలు పరిశీలించకుండానే విక్రయదారులు అనారోగ్యానికి గురైన జీవాలను వధిస్తూ మాంసం విక్రయిస్తూ..ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారు. విక్రయదారులు తమ ఇష్టానుసారంగా నాణ్యతలను పాటించకుండా మాంసం విక్రయిస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. – విజయ్, మెదక్ వధశాల లేకపోవడంతోనే.. మెదక్ పట్టణంలో మాంసం విక్రయానికి వధశాల లేకపోవడంతో సమస్య ఉత్పన్నమవుతుంది. మున్సిపాలిటీకి సంబం«ధించి వధశాల ఉంటే అక్కడే ఒక డాక్టర్‌ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. వెటర్నరి డాక్టర్ సర్టిఫై చేసిన తరువాత ఆరోగ్యవంతమైన జీవాలను కోసి అమ్మాల్సి ఉంటుంది. – సమ్మయ్య, మున్సిపల్ కమిషనర్, మెదక్ -
జీవో 151 అమలు చేయాల్సిందే
ద్వారకానగర్ (విశాఖ దక్షిణ): మున్సిపల్ పారిశుధ్య కార్మికులు కనీస వేతనం రూ.18కు పెంచుతూ విడుదల చేసిన జీవో నంబరును 151ను అమలు చేయాలని మున్సిపల్ కార్మికులు డిమాండ్ చేశారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. విశాఖ మున్సిపల్ వర్కర్ల యూనియన్ అధ్యక్షుడు జి.సుబ్బారావు, గౌరవ అధ్యక్షుడు వెంకటరెడ్డి మాట్లాడుతూ కనీస వేతనం పెంచుతూ విడుదలైన జీవోను రెండేళ్లయినా జీవీఎంసీ అధికారులు అమలు చేయకపోవడం దారుణమన్నారు. వేతనాలు పెంచడానికి చర్య తీసుకోని అధికారులు పారిశుధ్యం పనులను ప్రైవేటికరించడానికి ఉద్దేశించిన జీవో 279ను మాత్రం అమలు చేయడం బాధాకరమన్నారు. జీవో 279ను వెంటనే రద్దు చేయాలని, జీవో 151ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలన్నారు. కార్మికులకు ఇవ్వవలసిన గ్లౌజ్‌లు, సబ్బులు, షూ, నూనె వెంటనే పంపిణీ చేయాలన్నారు. కార్మికులు సమస్యలు పరిష్కరించని పక్షంలో ఈ నెల 15వ తేదీ తర్వాత సమ్మె దిగుతామని హెచ్చరించారు. ధర్నాలో సీఐటీయూ జి ల్లా మాజీ అధ్యక్షుడు అజశర్మ, సీఐటీయూ నగర అధ్యక్షుడు కుమార్, యూనియన్ నాయకులు నాగేశ్వరరావు, రాజు, నాయుడు పాల్గొన్నారు. -
అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన కౌన్సిలర్లు
సాక్షి, కృష్ణా: గుడివాడ పురపాలక సంఘం వైస్ చైర్మన్ అడపా బాబ్జీపై టీడీపీ కౌన్పిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. 2014 ఎన్నికల్లో పురపాలక సంఘంలో మొత్తం 36 మంది కౌన్సిల్ సభ్యులలో వైఎస్సార్ సీపీ 20, టీడీపీ 16 మంది సభ్యులు గెలుపొందారు. ఇందులో చైర్మన్, వైస్ చైర్మన్ వైఎస్సార్ సీపీ సొంతం చేసుకుంది. రెండేళ్ల కిందట చైర్మన్ యాలవర్తి శ్రీనివాసరావుతో పాటు 11 మంది కౌన్సిలర్లు టీడీపీలోకి ఫిరాయింపు అయ్యారు. దీంతో టీడీపీ బలం 28కి పెరిగింది. కౌన్సిలర్లు 28 సభ్యులతో సంతకాలతో కూడిన అవిశ్వాస తీర్మానం కాపీలను కలెక్టర్ లక్ష్మికాంతంకు పంపించారు. కలెక్టర్ దీనిపై ప్రత్యేక సమావేశం కోసం సభ్యలకు నోటీసులు జారీ చేయాలని ఆర్డీఓ చక్రపాణిని ఆదేశించారు. -
రూ.250కే కుళాయి కనెక్షన్
సాక్షి, అమరావతి: పట్టణాల్లోని పేదలకు తక్కువ మొత్తానికి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇవ్వనున్నారు. కేంద్ర ప్రభుత్వం గుర్తించిన అమృత్ (అటల్‌మిషన్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్) పట్టణాల్లో ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రోత్సాహాలు అందుబాటులోకి రానున్నాయి. సాలీనా రూ.500 ఇంటి పన్ను చెల్లించే బీపీఎల్ కుటుంబాలకు రూ.250కే కుళాయి కనెక్షన్లు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వీలయినంత ఎక్కువ మందికి ఈ కనెక్షన్లు ఇచ్చేందుకు వీలుగా ఆయా పట్టణాల్లో రక్షిత మంచినీటి సరఫరా పథకాలను సిద్ధం చేస్తున్నారు. కనెక్షన్లు తీసుకోవాలంటూ కొన్ని పట్టణాల్లో మున్సిపల్ అధికారులు ప్రచారం కూడా ప్రారంభించారు. గ్రేటర్ విశాఖలో బీపీఎల్ కుటుంబాల వివరాలను సేకరించి కనెక్షన్లు కోసం దరఖాస్తు చేయాలని అక్కడి అధికారులు సమాచారం కూడా ఇస్తున్నారు. వచ్చే అక్టోబర్‌లోపు కుళాయి కనెక్షన్లు ఇవ్వడానికి అనువుగా అధికారులు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 2015–16లో రాష్ట్రంలోని 31 పట్టణాల్లో కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకాన్ని అమలులోకి తీసుకువచ్చింది. ఈ పట్టణాల్లో రక్షిత మంచినీరు, భూగర్భ మురుగునీటి సరఫరా పథకాలను చేపట్టేందుకు రూ.2000 కోట్లు విడుదల చేసింది. ఆ పట్టణాల్లో రక్షిత మంచినీటి పథకాల నిర్మాణాలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది. ఆ నేపథ్యంలోనే కుళాయి కనెక్షన్ల మంజూరుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దాదాపు 16 లక్షల కుళాయి కనెక్షన్లు ఇచ్చేందుకు అనువుగా ఈ పథకాలు చేపట్టారు. తెల్లరేషన్ కార్డు కలిగి, సాలీనా రూ.500 ఇంటి పన్ను చెల్లిస్తున్న కుటుంబాలు కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. కనెక్షన్ ఇచ్చే సమయంలో పైపులు తదితరాలకు రూ.1000 వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉన్నందున బీపీఎల్ కుటుంబాలు ఎనిమిది వారాల్లో కుళాయి కనెక్షన్ డిపాజిట్‌ను చెల్లించాల్సి ఉంటుంది. గ్రేటర్ విశాఖలో వచ్చే అక్టోబరులోపు రెండు లక్షల కనెక్షన్లు ఇచ్చేందుకు అనువుగా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. గుంటూరు నగరపాలక సంస్ధతోపాటు మున్సిపాల్టీల్లో దరఖాస్తు చేసుకున్న వారికి కనెక్షన్లు మంజూరు చేస్తున్నారు. నరసరావుపేట మున్సిపాల్టీలో దరఖాస్తు చేసుకున్న ఐదు రోజుల్లో కుళాయి అమర్చుతున్నారు. గుంటూరు జిల్లాలో దాదాపు 60 వేల కనెక్షన్లు ఇచ్చేందుకు అనువుగా రక్షిత మంచినీటి పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఏలూరు, మచిలీపట్నం, నెల్లూరు, అనంతపురం, కాకినాడ పట్టణాల్లోని అధికారులు బీపీఎల్ కుటుంబాలు చెల్లిస్తున్న ఇంటిపన్ను రూ.500 నుంచి రూ.750లకు పెంచితే మరి కొన్ని కుటుంబాలకు కుళాయి కనెక్షన్ పొందే అవకాశం ఏర్పడుతుందని, ఆ మేరకు అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పంపారు. -
న్యాయం జరిగే వరకూ పోరాటం
ధర్మవరం : ‘మాకు ఇంటి స్థలం చూపి ఇంటి నిర్మాణం చేసే వరకు మేము మున్సిపల్ కార్యాలయం ఆవరణంలోనే నివసిస్తాం. వంటా ఇక్కడే.. స్నానాలు ఇక్కడే.. నిద్రించేది ఇక్కడే.. చివరికి తమ పిల్లలకు పాఠశాలలకు పంపాలన్నా ఇక్కడి నుంచే పంపిస్తాం’ అంటూ పట్టణంలోని లక్ష్మీనగర్‌లో ఇళ్లు కోల్పోయిన బాధితులు చెబుతున్నారు. పట్టణంలోని లక్ష్మీనగర్‌లో మున్సిపల్ అధికారులు వాటర్ ట్యాంక్ నిర్మించాలని అక్కడ కొన్నేళ్లుగా నివసిస్తున్న వారిని బుధవారం పోలీసు బందోబస్తు మధ్య మున్సిపల్ అధికారులు ఇళ్లను జేసీబీలతో కూల్చేసిన విషయం తెలిసిందే. ఇళ్లులేక రోడ్డున పడ్డ బాధితులు తమ సామాన్లను తీసుకుని మున్సిపల్ కార్యాలయం ఆవరణంలోకి చేరుకున్నారు. మున్సిపల్ కార్యాలయం గేట్ వద్దనే స్టౌవ్‌లు పెట్టుకుని వంటా వార్పు చేసుకుంటున్నారు. బుధవారం రాత్రి కార్యాలయం ఆవరణంలోనే నిద్రించిన బాధితులు గురువారం ఉదయం కూడా అక్కడే స్నానాలు చేశారు. తమ పిల్లలను పాఠశాలలకు పంపించారు. వంటా వార్పు అక్కడే చేసుకున్నారు. దీంతో మున్సిపల్ అధికారులు కార్యాలయానికి రావడానికి వెనుకంజ వేసి ఎవరూ కార్యాలయంలోకి రాలేదు. పట్టణ పోలీసులు వచ్చి మీకు న్యాయం జరుగుతుందని మీరు మున్సిపల్ కార్యాలయం నుంచి వెళ్లిపోవాలని సర్దిచెప్పినా వారు వినలేదు. తమకు న్యాయం జరిగే వరకు మున్సిపల్ కార్యాలయంలోనే నివసిస్తామని బాధితులు చెబుతున్నారు. -
విజయవాడ మున్సిపల్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత
సాక్షి, విజయవాడ: విజయవాడ మున్సిపల్ కార్యాలయం వద్ద మంగళవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. సమస్య పరిష్కారం కోసం కార్పొరేషన్‌ను ముట్టడించేందుకు కార్మికులు భారీగా తరలివచ్చారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు కార్పొరేషన్లోనికి చొచ్చుకు పోయేందుకు యత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, కార్మికుల మధ్య తీవ్ర వాగ్వాదం జరుగడంతో తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలో కార్మికులను బలవంతంగా పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. దీంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. -
మున్సిపల్ అధికారుల తీరుపై నిరసన
గుంటూరు రూరల్: మున్సిపల్ కార్యాలయంలో జరిగిన వివాదంలో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితులను అరెస్ట్ చేయటంతో గ్రామస్తులు ఆందోళన నిర్వహించిన ఘటన మండలంలోని బుడంపాడు గ్రామంలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాగునీరు కలుషితమై ఇబ్బందులు పడుతున్నామని అధికారులను అడిగితే దురుసుగా మాట్లాడటమే కాకుండా పోలీసులకు ఫిర్యాదు చేసి అరెస్టులు చేయిస్తారా అంటూ గ్రామస్తులు ప్రధాన రహదారిలో వాహనాలను నిలిపి ఆందోళనకు దిగారు. నెలరోజులుగా మురికినీరు తాగి రోగాల బారిన పడి ఆస్పత్రుల్లో చేరుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ సిబ్బంది సరఫరాచేసే ట్యాప్ నీటిని వాటర్ బాటిల్స్‌లో పట్టి నిరసన తెలిపారు. రోడ్డుపై ట్రాఫిక్ నిలిచిపోవటంతో సౌత్‌జోన్ డీఎస్పీ ఆర్వీఎస్ఎన్ మూర్తి, డీఎస్పీ సీతారామయ్య ఘటనా స్థలికి చేరుకుని గ్రామస్తులకు నచ్చజెప్పి ఆందోళన విరమింప జేశారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట.. అనంతరం ఆందోళన కారులు మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. మున్సిపల్ సీసీ, ఏఈలు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలించలేదు. అయితే కార్యాలయంపై దాడిచేసి ఉద్యోగిని అసభ్య పదజాలంతో దూషించినందుకు, కార్యాలయంలోని ఫర్నీచర్, బయోమెట్రిక్ మెషిన్లను ధ్వంసం చేసిన కేసులో పలువురు ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. మంచి నీటిని సక్రమంగా సరఫరా చేయమని అడిగితే అరెస్టులు ఏమిటని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు మూడు గంటలకుపైగా ఆందోళన కొనసాగింది. విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ లఠ్కర్ ప్రజలతో మాట్లాడుతూ అధికారులపై దాడి చేయటం సమంజసంకాదన్నారు. అనంతరం స్థానికులు ప్రస్తుతం మురుగు నీరు వస్తున్నందున గ్రామానికి 40 లారీల నీటిని అధికారులు అందజేయాలని కోరగా, అధికారులు ప్రస్తుతం 15 లారీలు వస్తున్నాయని వాటిని పెంచి సరిపడేంతగా పంపుతామని చెప్పారు. అయితే కార్యాలయంపై దాడిచేసిన ఘటనలో నిందితులను అదుపులోకి తీసుకున్నామని, విచారణ చేసి చర్యలు తీసుకుంటామని సౌత్‌జోన్ డీఎస్పీ మూర్తి తెలిపారు. -
మాంసం అంతా మోసం..!
విజయనగరం మున్సిపాలిటీ: మనం తింటున్నది నాణ్యమైన మాంసమేనా..? పట్టణంలో ఆరోగ్యవంతమైన జంతు మాంసాలే విక్రయిస్తున్నారా..? మున్సిపల్ అదికారులు పరిశీలించి ముద్ర వేసిన మాంసాన్ని మనం కొంటున్నామా..? అని ఎవరైనా అడిగితే లేదనే సమాధానం వస్తోంది. జిల్లా కేంద్రంలో మాంసం విక్రయాల వెనుక మోసం దాగి ఉందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. నాసిరకం, అనారోగ్య జంతువుల మాంసాన్ని మున్సిపాలిటీ అనుమతి లేకుండా విక్రయించేస్తున్నట్టు సమాచారం. ఫ్రిజ్‌ల్లో మిగులున్న చికెన్, మటన్ నిల్వలను మరుసటి రోజు విక్రయిస్తున్నారు. మిగులు చికెన్, మటన్‌ను హోటళ్లకు తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఏ ఒక్కరు చర్యలు తీసుకున్న దాఖలాలు లేకపోవడం గమనార్హం. నిఘా కరువు.. నగరంలో మాంసం విక్రయాలుపై నిఘా కరువైంది. మున్సిపల్ ప్రజారోగ్య విభాగాధికారులు , వెటర్నరీ విభాగాల మధ్య సమన్వయ లోపం కరాణంగా నాసిరకం, నాణ్యత లోపించిన మాంసం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. విజయనగరం పట్టణంలో చికెన్ సెంటర్లు 130, మటన్ విక్రయశాలలు 64 వరకు ఉన్నట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. అయితే ఇటు అధికారికంగా... అటు అనధికారికంగా నిర్వహిస్తోన్న మాంసం విక్రయకేంద్రాలు నిబంధనలు పాటించడం లేదు. ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నాయి. ఎక్కడ పడితే అక్కడే మాంసం విక్రయిస్తున్నారు. చేపల విక్రయాల పరిస్థితీ ఇదే. మురుగు కాలువలకు అనుకుని, రోడ్లు మీదనే విక్రయాలు చేస్తున్నారు. అపరిశుభ్ర పరిసరాల్లోనే విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఆది, మంగళవారాల్లో అయితే పరిస్థితి మరింత దారుణం. మటన్ రూ.520 నుంచి రూ.600లకు కిలో విక్రయిస్తున్నారు. మిగులు మాంసాన్ని మరుసటి రోజు ధర తగ్గించి విక్రయిస్తున్నారు. నాసిరకం, వయస్సు మళ్లిన , అనారోగ్యంగా ఉన్న గొర్రెలు, మేకల నుంచి సేకరించే మాంసాన్ని తక్కువ ధరకే హోటళ్లకు విక్రయిస్తున్నట్టు సమాచారం. చికెన్ అమ్ముడయ్యే ప్రాంతాలు... రోజురోజుకు విస్తరిస్తోన్న విజయనగరం పట్టణంలో చికెన్ సెంటర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. మున్సిపల్ ప్రజారోగ్య విభాగం అధికారిక లెక్కల ప్రకారం 130 వరకు దుకాణాలు అనుమతులతో నిర్వహిస్తుండగా... అధికారికంగా ఎటువంటి అనుమతులు లేకుండా అంతకన్నా రెట్టింపు కేంద్రాల్లో విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ప్రధానంగా మున్సిపల్ కార్యాలయం జంక్షన్, గూడ్స్‌షెడ్ రోడ్ కోట జంక్షన్, దాసన్నపేట కూడలి, రింగ్‌రోడ్, రైల్వేస్టేషన్ రోడ్, కలెక్టరేట్ జంక్షన్ల వద్ద అధికారిక దుకాణాలు నడుస్తుండగా... వీధికొకటి చొప్పున వెలుస్తున్న సెంటర్లు సైతం వందల్లో ఉండడం గమనార్హం. రోడ్డుపక్కన చిన్నపాటి బల్లపెట్టి ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ విక్రయాలు చేపట్టి ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు. మిగులు వ్యర్థాలను కాలువల్లో వేయడంతో పరిసరాలు దుర్ఘంధ భరితంగా మారుతున్నాయి. ప్రాంతం : విజయనగరం మున్సిపాలిటీ మొత్తం జనాభా : 3 లక్షల పైమాటే చికెన్ సెంటర్లు : 130 పైబడి మటన్ విక్రయ కేంద్రాలు : 64 నాన్‌వెజ్ హోటళ్లు : 25 పట్టణ శివార్లలో దాబాల సంఖ్య : 12 రోజు వారీ మటన్ విక్రయాలు : సగటున 1000 కిలోలు ఆది, మంగళవారాల్లో విక్రయాలు : 2వేల కిలోల పైమాటే రోజు వారీ చికెన్ విక్రయాలు : 4 వేలకు పైగా కిలోలు ఆది, మంగళవారాల్లో విక్రయాలు : సుమారు 10 వేల కిలోలు నిబంధనలు ఇలా.... అనుమతి ఉన్న దుకాణాల్లో మాత్రమే మాసం విక్రయాలు చేయాలి. మున్సిపాలిటీకి చెందిన పశువైద్యాధికారి «ధ్రువీకరించిన తర్వాతనే స్లాటర్ హైస్‌లో జంతువధ చేయాలి. ఆపై మున్సిపల్ శాఖ ముద్ర వేయాలి. ఆ తర్వాత విక్రయించాలి. జంతువు ఆరోగ్యంగా ఉందా, బతికి ఉండగానే వధించారా..? లేదా అని వెటర్నరీ అధికారులు నిర్ధారించాలి. నగరంలో ఇటువంటి పరిస్థితులు, తనిఖీలు లేవు. జాగ్రత్తలు ఇలా... లేత తెలుపు రంగులోని మాంసం ఆరోగ్యకరమైనది. గట్టిదనం ఉంటేనే తాజాదనం ఉన్నట్టు. విక్రయిస్తున్న మాంసం కబేళా నుంచి తెచ్చినదా.. లేదా అన్నది దుకాణదారులను ప్రశ్నించాలి. మున్సిపల్ అధికారులు అధికారికంగా వేసే ముద్రను పరిశీలించాలి. ఎరుపు రంగులో ఉన్నా మడతలు ఉన్నా కొనకపోవడం మంచిది కొన్ని సందర్భాల్లో చూడటానికి తాజాగా ఉన్నా వండే సమయంలో చెడువాసన వస్తే అలాంటి మాంసాన్ని తినకూడదు. అనుమానం వస్తే మున్సిపల్ , వెటర్నరీ వైద్యులకు సమాచారం ఇవ్వాలి. చర్యలు తీసుకుంటాం... మున్సిపాలిటీ పరిధిలో అధిక మొత్తంలో మాంసం విక్రయ శాలల ఉండటం నిజమే. పక్షం రోజుల కిందట పట్టణంలో నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో విక్రయ శాలల్లో లోపాలను గుర్తించాం. సుమారు 10 దుకాణాలు పరిశీలిస్తే అందులో ఏ ఒక్కరు నియమ నిబంధనలు పాటించడం లేదన్న విషయాన్ని గుర్తించాం. సుమారు రూ.25 వేల అపరాధ రుసుం విధించాం. వినియోగదారులు కూడా మాంసం కొనుగోలు సమయంలో జాగ్రత్తలు పాటించాలి. మున్సిపాలిటీ ముద్ర వేసి ఉన్న మాంసం ఉత్పత్తులను కొనుగోలు చేయడం మేలు. – డాక్టర్ శివకుమార్, ప్రజారోగ్య అధికారి, విజయనగరం మున్సిపాలిటీ -
మా గంజిలోన ఉప్పు చూసి గొణుగుడెందుకు?
కందుకూరు అర్బన్: దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు ఓ చిత్రంలో పేదల పట్ల ధనవంతులు వ్యవహరిస్తున్న తీరుకు అద్దం పట్టేలా ఓ పాటను చిత్రీకరించారు. ‘పాయసంలో జీడిపప్పు తినే వాళ్లకు..మా గంజిలోన ఉప్పుచూసి గొణగుడెందుకూ..’ అంటూ చిత్రంలోని ధనవంతులను తన పాటలో సూటిగా ప్రశ్నించారు. అలాంటి ప్రశ్నే ఇప్పుడు కందుకూరు పట్టణంలోని పేదల నుంచి అధికారులు, పాలకులను ఉద్దేశించి ఉత్పన్నమైంది. తెలుగుదేశం పార్టీ నాయకులు అనుసరిస్తున్న తీరు అచ్చం అలాగే ఉంది. అయిన వారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లో అన్న సామెత మున్సిపల్ అధికారుల చర్యలు ప్రస్పుటం చేస్తున్నాయి. మున్సిపల్ స్థలంలో ఉన్న లారీ స్టాండ్‌ను స్వాధీనం చేసుకోవాలని రెండున్నరేళ్ల క్రితమే కోర్టు తీర్పు ఇచ్చినా రాజకీయ నాయకులు అటువైపు కన్నెతి చూడలేదు. ఏళ్ల నుంచి రాబందుల చేతుల్లో ఉన్న స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు చేతగానీ మున్సిపల్ అధికారులు 50 ఏళ్లుగా బంకులు పెట్టుకొని జీవనం సాగిస్తున్న బడుగుజీవులపై కన్నెర్రజేశారు. ఇదీ.. అసలు కథ కందుకూరు పంచాయతీగా ఉన్నప్పటి నుంచి రావిచెట్టు సెంటర్లో చేపల మార్కెట్ ఉండేది. దాని చుట్టు పక్కల నిరుపేదలైన 20 ముస్లిం కుటుంబాలు ఎన్నో ఏళ్లుగా బంకులు పెట్టుకొని జీవనం సాగిస్తున్నాయి. ఇటీవల మున్సిపల్ అధికారులు అక్కడ అన్న క్యాంటీన్ నిర్మించాలని ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. అక్కడ బంకులు తొలగించాలని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా బడుగులకు హుకుం జారీ చేశారు. నిరుపేదలైన బంకుల యజమానులు స్థానిక ఎమ్మెల్యేను కలిసి న్యాయం చేయాలని వేడుకొన్నారు. ఆయన కూడా పట్టించుకోలేదు. ప్రజాసంఘాల నాయకులు రంగంలోకి దిగి బాధితులకు న్యాయం చేయాలని, ప్రత్యామ్నాయ స్థలం చూపించిన తర్వాతే బంకులు తొలగించాలని డిమాండ్ చేశారు. ఇదంతా పట్టించుకోని మున్సిపల్ అధికారులు పోలీసు బలగాలతో జులుం ప్రదర్శించి బంకులను ధ్వంసం చేశారు. అన్నా క్యాంటీన్ కోసం పవిత్ర రంజాన్ మాసంలో కఠిన ఉపవాస దీక్షలో ఉన్న నిరుపేద కుటుంబాల పొట్టకొట్టడం ఎంతవరకు భావ్యమని వివిధ పార్టీల నాయకులు మండిపడుతున్నారు. ఏళ్ల తరబడి చిన్న బంకులు పెట్టుకొని జీవనం సాగిస్తున్న నిరు పేదలను ఖాళీ చేయించడం దుర్మార్గమంటున్నారు. రెక్కాడితేగానీ డొక్కాడని నిరుపేదలకు ప్రత్యామ్నాయం చూపకుండా ఆగమేఘాలమీద బంకులు ఖాళీ చేయించడం అన్యాయమని పట్టణ ప్రజలు పేర్కొంటున్నారు. గుండంకట్ట, ప్రభుత్వ వైద్యశాల తదితర ప్రాంతాల్లో మున్సిపల్ స్థలాన్ని యథేచ్ఛగా ఆక్రమించిన ధనవంతులు పాలకులు, అధికారులకు కనిపించడంలేదా..అని ప్రశ్నిస్తున్నారు. పిచ్చుకలపై బ్రహ్మాస్త్రం గుండంకట్ట పక్కన రాజకీయ పలుకుబడి కలిగిన బలమైన సామాజికవర్గం వారు మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించి లారీ స్టాండ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. దీనిపై మున్సిపల్ అధికారులు కోర్టుకు వెళ్లడంతో స్థలాన్ని తక్షణమే స్వాధీనం చేసుకోవాలని సుమారు రెండున్నర సంవత్సరాల క్రితం ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయం మున్సిపల్ అధికారులు, ఎమ్మెల్యే పోతుల రామారావుకు తెలుసు. ఈ స్థలం అన్న క్యాంటీన్ ఏర్పాటుకు అనుకూలంగా కూడా ఉంటుంది. లారీస్టాండ్ యజమానులు ఆర్థికంగా, రాజకీయ పలుకుబడి ఉన్న వారు కావడంతో మున్సిపల్ అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడలేదని ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లారీ స్టాండ్ గొడవ ఎందుకన్నట్లు ఎమ్మెల్యే గద్దల జోలిక వెళ్లకుండా పిచ్చుకలపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి అన్న క్యాంటీన్ పేరుతో పేద ముస్లిం బతుకలను ఛిద్రం చేశారని వామపక్షాలు ఆరోపిస్తున్నాయి. రెండున్నర సంవత్సరాల క్రితం అంకమ్మతల్లి దేవాలయం వద్ద ఉన్న పేదల బంకులను కూడా అధికార పార్టీ నాయకులు నిలువునా తొలగించి వారి పొట్టకొట్టారు. -
నిరుపేదలకూ టోపీ
సూళ్లూరుపేట : క్యామెల్ సంస్థ నిర్వాకాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. బ్యాంకులకే కాకుండా నిరుపేదలకూ టోపీ పెట్టారు. చిత్తూరు జిల్లాకు చెందిన గరిక ఈశ్వరయ్య, ఈశ్వరమ్మ సూళ్లూరుపేట కేంద్రంగా క్యామెల్ స్వచ్ఛంద సేవా సంస్థను నిర్వహించారు. సేవా కార్యక్రమాలు చేస్తూ సంస్థను అభివృద్ధి చేసుకున్నారు. సంస్థకు అనుబంధంగా క్యామెల్ మహిళా మ్యాక్స్ అనే సంస్థను 2002లో స్థాపించి రిజిస్ట్రేషన్ చేయించారు. 2002 నుంచి ఈ సంస్థలో మహిళలు గ్రూపులుగా ఏర్పడి పొదుపు చేసుకుంటే తామే రుణాలిచ్చి ఆదుకుంటామని సూళ్లూరుపేట, సత్యవేడు నియోజకవర్గాల్లో నాలుగు బ్రాంచీలను స్థాపించారు. సూళ్లూరుపేట, నాయుడుపేట, శ్రీకాళహస్తి, వరదయ్యపాళెంలో నాలుగు బ్రాంచీలను ఏర్పాటు చేసి 500 గ్రూపులను తయారు చేశారు. సుమారు 10 వేల మంది పొదుపు మహిళలను చేర్చుకొని వారితో రూ.20 నుంచి రూ.200 వరకు పొదుపు చేయించి నగదును వీరి వద్దే ఉంచుకున్నారు. పొదుపు కట్టిన పుస్తకాలను కూడా వీరివద్దే ఉంచుకున్నారు. 2002 నుంచి 2009 వరకు పొదుపు చేసిన మొత్తాన్ని చూపించి నాబార్డు, ఇతర బ్యాంకుల నుంచి సుమారు రూ.9.21 కోట్లను రుణంగా తీసుకున్నారు. ఇందులో మహిళలకు రుణాలిస్తూ కట్టుకుంటూ వచ్చారు. నాబార్డు శాఖ రూ.50 పైసల వడ్డీకే సంస్థలకు రుణాలిస్తే దాన్ని పొదుపు మహిళలకు రూ.రెండు వడ్డీకి ఇచ్చి అందులో రూ.1.5 వడ్డీని ఆదాయంగా మలుచుకున్నారు. మెయింటెనెన్స్ కింద నాబార్డు వారు క్యామెల్ మహిళా మ్యాక్స్‌కు 2.5 శాతం ఇవ్వగా, క్యామెల్ వారు మాత్రం పొదుపు మహిళల నుంచి ఐదు శాతాన్ని వసూలు చేశారు. గ్రూపుల్లో ఎవరైనా రుణాలు తీసుకోకపోయినా, వారి పేర్లపై కూడా తీసుకున్నట్లు రికార్డులు ఉన్నాయని చెప్తున్నారు. గ్రూపునకు రూ.రెండు లక్షలు ఇచ్చినట్లు వారి వద్ద నుంచి సంతకాలు చేయించుకొని 2 పక్కనే 1 వేసుకొని రూ.10 లక్షలు తీసుకున్న సందర్భాలున్నాయని వారి వద్ద పనిచేసిన వారు చెప్పడం విశేషం. చాలా మంది రుణాలను చెల్లించినా వారికి క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో మండలంలోని పేర్నాడు పల్లెల్లో చాలా మందికి హైకోర్టు నుంచి నోటీసులు కూడా వచ్చాయి. ముందుగా ఆమె వచ్చి తాము కట్టిన పొదుపు నగదు మొత్తం ఎంత ఉంది..ఎంత కట్టాలనే విషయాలను నిగ్గుతేలిస్తే ఆమే తమకు బాకీ పడుతుందని అంటున్నారు. భారీగా స్థిరాస్తులు నిరక్షరాస్యులను మోసం చేశారు. చివరికి బ్యాంక్ అధికారుల ఫిర్యాదుతో పొలీసుల కస్టడీలోకి తీసుకున్న ఈశ్వరమ్మను టీడీపీ నేత పరసా వెంకటరత్నయ్య వదిలేయమని చెప్పడంతో కథ అడ్డం తిరిగింది. ఆమెను పూర్తిస్థాయిలో విచారించి ఉంటే నిజాలు నిగ్గుతేలి ఉండేవి. ఓజిలి మండలంలో 16 ఎకరాలు, తనియేలి వద్ద 12 ఎకరాలు, సూళ్లూరుపేటలో మూడేసి అంతస్తులు కలిగిన రెండు పెద్ద భవనాలు, పరమేశ్వరినగర్‌లో రెండు ప్లాట్లతో పాటు నెల్లూరు, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో కూడా స్థిరాస్తులను కూడబెట్టినట్టు సమాచారం. హోంగార్డు నాగూరమ్మను బలిచేసే యత్నం ఆర్థికపరమైన కేసులో ఈశ్వరమ్మను పట్టుకొని అధికార పార్టీకి చెందిన పరసారత్నం ఫోన్ చేశారని వదిలిపెట్టేసి ఇప్పుడు హోంగార్డు నాగూరమ్మను బాధ్యులు చేయాలని సీఐ కిషోర్‌బాబు ఒత్తిడి తెస్తున్నారు. తప్పు చేశావని అంగీకరించి సంతకం చేయమని సీఐ ఒత్తిడి చేస్తున్నారని నాగూరమ్మ ఆరోపిస్తున్నారు. నెల్లూరులో ఆమె ఎస్పీ రామకృష్ణను కలిసి తన గోడును తెలియజేశారు. ఇందులో తనకు సంబంధం లేకపోయినా హోంగార్డునని బలిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గూడూరు డీఎస్పీ విచారణ సూళ్లూరుపేట రూరల్ : తన తప్పిదాన్ని గుర్తించి ఎస్పీ ఎక్కడ చర్యలు తీసుకుంటారోనని భయపడిన ఎస్సై నెపాన్ని హోంగార్డుపై వేసే యత్నం చేస్తున్నారు. అంతటితో ఆగకుండా ఆమెను సరెండర్ చేస్తూ మెమో ఇచ్చారు. అందులో ఆర్ఐ, హోంగార్డు అని రాయాల్సిన చోట ఆర్ఐ, వీఆర్ అని రాయడంతో నాగూరమ్మను వీఆర్ పోలీసులు సరెండర్ చేసుకోలేదు. దీంతో ఆమె తిరిగి సూళ్లూరుపేటకు వచ్చేశారు. శనివారం మధ్యాహ్నం గూడూరు డీఎస్పీ రాంబాబు ఘటనపై విచారణ జరిపారు. అందర్నీ పిలిచి వివరాలను సేకరించారు. ఆ సమయంలో ఎస్సై మరోసారి నాగూరమ్మకు సరెండర్ మెమో ఇచ్చి నెల్లూరుకు పంపించేశారు. ఈ ఫొటోలోని మహిళ పేరు కుప్పంపాటి నాగమ్మ. సూళ్లూరులోని బొగ్గుల కాలనీలో 32 మందితో ఝాన్సీ మహిళా సంఘాన్ని ఏర్పాటు చేశారు. మనిషికి రూ.20 చొప్పున గరిక ఈశ్వరమ్మ నిర్వహిస్తున్న క్యామెల్ మహిళా మ్యాక్స్‌లో పొదుపు చేసుకుంటూ వచ్చారు. మధ్యలో కొన్ని గ్రూపుల్లో సభ్యులు తక్కువగా ఉండటంతో ఎక్కువగా ఉన్న గ్రూపుల నుంచి సర్దుబాటు చేయడంతో 20 మంది లెక్కన ఒక్కో గ్రూపులో ఉంటూ వచ్చారు. రూ.20తో ప్రారంభించిన పొదుపును 2013 నాటికి నెలకు రూ.200 వరకు చెల్లించారు. ఈ గ్రూపులను ఆధారంగా చేసుకొని ఒక్క నాబార్డు సొసైటీ నుంచి మహిళా సాధికారత పేరుతో రూ.7.21 కోట్లను రుణాలుగా తీసుకొచ్చారు. పొదుపు మహిళలకు ప్రతి గ్రూపునకు రూ.రెండు లక్షల చొప్పున ఇచ్చారు. ఈ నగదుకు రూ.రెండు వడ్డీ లెక్కన వసూలు చేసి, మహిళలు పొదుపు చేసుకున్న డబ్బులకు మాత్రం రూ.0.50 పైసల వడ్డీ ఇస్తూ వచ్చారు. ముందుగా పొదుపు కింద ఎంత కట్టారో లెక్కలు చూపించకుండా రుణంగా తీసుకున్న మొత్తాన్ని కట్టాలని ఇటీవల ఒత్తిడి చేశారు. పొదుపు మహిళలు ఎంత పొదుపు చేసుకున్నారో చూపిస్తే రుణం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. బ్యాంకులను మోసం చేసినట్లే పొదుపు సంఘాల్లో నిరుపేద మహిళలనూ ఈశ్వరమ్మ మోసం చేశారు. -
‘టీడీపీ తొత్తుగా వ్యవహరిస్తున్నారు’
శ్రీకాళహస్తి: అధికారులు టీడీపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపించారు. వైఎస్సార్ సీపీ శ్రీకాళహస్తి నియోజకవర్గ సమన్వయకర్త బియ్యపు మధుసూదనరెడ్డి జన్మదినం సందర్భంగా మున్సిపల్ కమిషనర్ అనుమతితో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మున్సిపల్ సి బ్బంది గురువారం తొలగించారు. దీనిపై ఆగ్రహించిన వైఎస్సార్ సీపీ నేతలు మిద్దెల హరి, కొట్టేడి మధుశేఖర్, వడ్లతాంగల్ బాలాజీ ప్రసాద్‌రెడ్డి ఉదయం 10.30 గంటలకు మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరుకుని మూడు గంటల పాటు ధర్నా చేశారు. ఆ సమయంలో మున్సిపల్ కమిషనర్ రమేష్‌బాబు కార్యాలయంలో లేరు. ధర్నా విషయాన్ని మున్సిపల్ సిబ్బంది ద్వారా తెలుసుకున్న ఆయన, పోలీసులకు సమాచారం ఇచ్చా రు. ఎస్ఐ శివయ్య పోలీస్ బలగాలతో మున్సిప ల్ కార్యాలయానికి చేరుకుని ధర్నా విరమించా లని వైఎస్సార్ సీపీ నేతలను ఆదేశించారు. ఈ సందర్భంగా మిద్దెల హరి మాట్లాడుతూ తాము శాంతియుతంగా ధర్నా చేస్తున్నామని, ఎవరికీ ఆటంకం కలిగించలేదని, కమిషనర్ వచ్చి, తమతో మాట్లాడి న్యాయం చేస్తే వెళతామని అన్నారు. అనంతరం సీఐ సత్యనారాయణ మరింత మంది పోలీస్ బలగాలతో మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. ధర్నా విరమించాలని చెప్పారు. వైఎస్సార్ సీపీ నేతలు మాట్లాడుతూ తమపై కేసులు పెట్టి, అరెస్టు చేసినా తాము కమిషనర్ వచ్చి సమాధానం చెప్పే వరకు ధర్నా విరమించే ప్రసక్తేలేదని భీష్మించారు. రెండు గంటల పాటు ధర్నా జరిగినా కమిషనర్ రాకపోవడంతో ఎండ తీవ్రతకు తట్టుకోలేక మిద్దెల హరి, కొట్టెడి మధుశేఖర్ అస్వస్థతకు గురై, అక్కడే పడుకున్నారు. పరిస్థితి విషమించడంతో సీఐ సత్యనారాయణ ఈ విషయమై డీఎస్పీ వెంకటకిషోర్‌కు సమాచారం అందజేశారు. దీంతో డీఎస్పీ మున్సిపల్ కమిషనర్ రమేష్‌బాబుతో ఫోన్లో మాట్లాడి, మున్సిపల్ కార్యాలయాలనికి వెళ్లాలని సూచించారు. దీంతో ము న్సిపల్ కమిషనర్ రమేష్‌బాబు మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చిం చారు. ఈ సందర్భంగా నేతలు మిద్దెల హరి, కొట్టేడి మధుశేఖర్, వడ్లతాంగల్ బాలాజీ ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ తాము చలానా కట్టి, మున్సి పల్ అధికారుల అనుమతితోనే ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినా ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. గత నెల 15వ తేదీన స్థానిక ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి జన్మదినం సందర్భంగా పట్టణంలో అన్ని ప్రాంతాల్లో టీటీడీ నేతలు అనుమతి లేకుండానే ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినా ఎందుకు తొలగించలేదని ప్రశ్నించారు. అయితే మున్సిపల్ కమిషనర్ వారికి సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉండి పోయారు. కొంత సేపటి తరువాత కమిషనర్ రమేష్‌బాబు మాట్లాడుతూ తనని క్షమించాలని, రాజకీయ ఒత్తిళ్లతోనే అనుమతి పొందినప్పటికీ మీ ఫ్లెక్సీలు తొలగించాల్సి వచ్చిందని చెప్పారు. మరోసారి ఇలా జరగకుండా చూస్తామన్నారు. అనుమతి లేని ఫ్లెక్సీలు మాత్రం పార్టీలతో నిమిత్తం లేకుండా అన్ని పార్టీలకు చెందిన వాటిని తొలగిస్తామన్నారు. దీంతో వైఎస్సార్ సీపీ నేతలు ధర్నాను విరమించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నేతలు ఎత్తిరాజులు, షేక్ సిరాజ్‌బాషా, అమాన్, జయశ్యామ్‌రాయల్, మహిధర్ పాల్గొన్నారు.