శ్మశానవాటికపై భూబకాసురుల కన్ను? | Burial ground place in occupation | Sakshi
Sakshi News home page

శ్మశానవాటికపై భూబకాసురుల కన్ను?

Published Sun, Feb 14 2016 10:38 PM | Last Updated on Tue, Oct 16 2018 6:27 PM

శ్మశానవాటికపై భూబకాసురుల కన్ను? - Sakshi

శ్మశానవాటికపై భూబకాసురుల కన్ను?

‘కంచే చేను మేసింది’ అనే చందంగా ప్రభుత్వ స్థలాలను కాపాడాల్సిన వారే కాజేయడానికి సిద్ధమయ్యారు.

 ఐదువేల గజాల స్థలాన్ని కాజేయాలని పన్నాగం..
మార్కెట్ విలువ రూ.5 కోట్లకు పైమాటే..
కాపాడాల్సిన వారే  కాజేయడానికి సిద్ధమైన వైనం..
 విచారణ కమిటీ వేసిన సబ్ కలెక్టర్..
ఆ తరువాత రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్ట్రార్

 
 వికారాబాద్: ‘కంచే చేను మేసింది’ అనే చందంగా ప్రభుత్వ స్థలాలను కాపాడాల్సిన వారే కాజేయడానికి సిద్ధమయ్యారు. చట్టబద్ధంగా తప్పించుకునేందుకు అన్ని జాగ్రతలు తీసుకుని, వాటిని ఆక్రమించుకోవడానికి తమదైన శైలిలో భూ బకాసురులు ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వ స్థలాలను భూ బకాసురులు ఆక్రమించుకున్న తరువాత వాటిని చట్టప్రకారం పొందడానికి న్యాయస్థానాలను ఆశ్రయిస్తూ తప్పించుకుంటున్నారు. ఈ సలహాలు సైతం వారికి మున్సిపల్ యంత్రాంగమే ఇవ్వడం విడ్డూరంగా ఉంది. న్యాయస్థానాల్లో కేసులు నడుస్తున్నా.. మున్సిపల్ స్థలాలు పాత శిశుమందిర్ దగ్గర ఉన్న స్థలం, పోలీస్‌స్టేషన్ దగ్గర ప్రభుత్వ టాయిలెట్స్ స్థలం.. ఇలా అనేక ప్రాంతాల్లో మున్సిపల్ స్థలాలను కబ్జా చేసుకుని, వాటిని న్యాయస్థానాల ద్వారా భూ బకాసురులు దక్కించుకొని ఇళ్లు నిర్మించుకుని విక్రయిస్తున్నారు. ఇదిలా ఉండగా బీఆర్‌ఎస్, ఎల్‌ఆర్‌ఎస్ పథకం కింద వాటిని రెగ్యులరైజ్ చేసుకోవడానికి ఇటీవల అక్రమార్కులు కొందరు బినామీ పేర్లతో దరఖాస్తులు చేసుకోవడం గమనార్హం. అక్రమ కబ్జాలపై అనేకసార్లు పత్రికల్లో కథనాలు వచ్చినా.. అధికారులు స్పందించకపోవడంతో కాపాడాల్సిన వారే కాసులకు కక్కుర్తి పడుతున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


 సమాధుల స్థలంపై భూ బకాసురుల దృష్టి..
రామయ్యగూడ, అంబేద్కర్ కాలనీ దగ్గర ఉన్న ఎంఐజీ, ఎల్‌ఐజీ సమీపంలోని వికారాబాద్ నుంచి అనంతగిరి పల్లి వైపు వెళ్లే రోడ్డుకు ఆనుకొని ఉన్న ప్రభుత్వ స్థలం సర్వే నంబర్ 224, 225, 226లో ఐదు వేల గజాలకుపైగా స్థలం ఉంది. దీనిపై భూ బకాసురుల కన్ను పడింది. ప్రభుత్వం ఎంఐజీ, ఎల్‌ఐజీలో ఉంటున్న ప్రజలకోసం శ్మశానవాటిక స్థలాన్ని హోజింగ్‌బోర్డు కేటాయించింది. ఇప్పటికే చాలామంది సమాధులను ఏర్పాటు చేశారు. మిగిలిన స్థలం మాత్రం హాట్‌కేక్‌లా ఉంటుంది. సమాధుల స్థలానికి రెండువైపులా రోడ్డు మార్గాలున్నాయి. ఈ స్థలం సుమారుగా ఐదు వేల నుంచి ఆరు వేల గజాల వరకు ఉంటుందని స్థానిక ఎంఐజీ కాలనీ వాసులు పేర్కొంటున్నారు. ఈ స్థలం గజం విలువ సుమారు రూ.10 వేల నుంచి రూ.16 వేల వరకు పలుకుతుందంటున్నారు.


దీంతో భూ బకాసురుల కన్ను దీనిపై పడింది. రోడ్డుకు ఇరువైపులా కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మిస్తే కోట్లాది రూపాయలు తమ స్వంతం అవుతాయని భావించి కొందరు ఆ దిశగా ప్రణాళికను రూపొందించారు. అనుకున్నదే తడువుగా మున్సిపల్ పాలకవర్గంలో ఉన్న కొందరు కీలకనేతలు, రెవెన్యూ విభాగంలో కీలకపోస్టుల్లో ఉన్నవారి అండదండలతో సమాధుల స్థలాన్ని కొల్లగొట్టడానికి శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో రికార్డులను పకడ్బందీగా మార్చడానికి ప్రణాళికను రూపొందించారు. సబ్ కలెక్టర్ స్పందించి గ్రేవ్‌యార్డుకు కేటాయించిన ఖాళీ స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేసి భూ బకాసురుల పాలు కాకుండా చూస్తే బాగుంటుందని ఎంఐజీ కాలనీ ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement