vicarabad
-
3 జిల్లాలకు నాన్–కేడర్ కలెక్టర్లు
సాక్షి, హైదరాబాద్: కొత్తగా ఏర్పడిన రెండు జిల్లాలతోపాటు వికారాబాద్ జిల్లాకు కొత్త కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. నాన్ కేడర్ అధికారులకు పదోన్నతులిస్తూ ఈ నియామకాలు చేపట్టారు. ఖమ్మం జిల్లా జాయింట్ కలెక్టర్ మస్రత్ ఖానమ్ ఆయేషాకు వికారాబాద్ జిల్లా కలెక్టర్‌గా నియమించారు. నల్లగొండ జిల్లా జేసీగా ఉన్న సి.నారాయణరెడ్డిని కొత్తగా ఏర్పడిన ములుగు జిల్లా కలెక్టర్‌గా, మహబూబ్‌నగర్ జేసీ ఎస్.వెంకటరావును మరో కొత్త జిల్లా నారాయణపేట కలెక్టర్‌గా నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్లుగా నియమితులైన ముగ్గురూ నాన్ ఐఏఎస్ అధికారులే. ప్రస్తుతం వీరు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ (ఎస్జీడీసీ) హోదాను కలిగి ఉన్నారు. వీరికి ఐఏఎస్ హోదా కల్పించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదించిందని అధికారవర్గాలు తెలిపాయి. కొత్త జిల్లాల ఏర్పాటుతో రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య 33కు పెరిగిన విషయం తెలిసిందే. పెరిగిపోయిన జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలను నియమించేందుకు సరిపోయే సంఖ్యలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు రాష్ట్రంలో లేరు. కొందరు ఐఏఎస్‌లు కొన్నేళ్లుగా అప్రధాన్య పోస్టుల్లో కొనసాగుతున్నారు. పోస్టింగ్‌ల విషయంలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఈ ఐఏఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా పక్కనబెట్టి నాన్ ఐఏఎస్ అధికారులను కలెక్టర్లుగా నియమించడం గమనార్హం. ఐఏఎస్ కాని వారిని కలెక్టర్లుగా నియమించడం ఇదే తొలిసారి అని, ఇంతకు ముందు నాన్ ఐపీఎస్ అధికారులను జిల్లా ఎస్పీలుగా నియమించడంతో ఈ సంప్రదాయం ప్రారంభమైందని అధికారవర్గాల్లో చర్చ జరుగుతోంది. బి.జనార్దన్ రెడ్డికివిద్యాశాఖ బాధ్యతలు విద్యాశాఖ కార్యదర్శిగా బి.జనార్దన్‌రెడ్డి నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఆయన పురపాలక శాఖ డైరెక్టర్‌గా, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ కమిషనర్లుగా పనిచేశారు. గత కొంతకాలంగా పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. -
కు.ని. క్యాప్సూల్స్ ఇక మగాళ్లే మింగాలి!
‘‘ఎన్నో విషయాల్లో స్త్రీలు సమానత్వాన్ని సాధించారు. కానీ, కుటుంబ నియంత్రణ విషయంలో మాత్రం 99 శాతం భారం స్త్రీలే మోస్తున్నారు. ఈ బాధ్యతని మగవారు కూడా పంచుకోవాలని, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని కుటుంబ నియంత్రణ మాత్రలు కనుక్కోవాలని ప్రయోగాలు ప్రారంభించి సఫలమయ్యాం’’ అని చెప్పారు షమీమ్ సుల్తానా. తెలంగాణ, వికారాబాద్‌లోని పరిగికి చెందిన షమీమ్ అమెరికాలోని ప్రఖ్యాత యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటలో ఐదేళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. యూనివర్సిటీ పరిశోధనలో భాగంగా పురుషులకు కుటుంబ నియంత్రణ మాత్రలు కనిపెట్టిన శాస్త్రవేత్తల బృందానికి షమీమ్ టీమ్ లీడర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రపంచం గుర్తించే పనిలో మన తెలుగు యువతి షమీమ్ సుల్తానా ప్రధాన భూమికగా ఉండటం దేశానికే గర్వకారణం. టీ క్యాంటీన్ నుంచి పరిగి బస్‌స్టాండులో ఓ చిన్న క్యాంటీన్ నడుపుకునే సయ్యద్ మగ్బూల్ కూతురు షమీమ్. ఆయనకు 21 మంది సంతానం. షమీమ్ పదేళ్లు దాటే వరకు బడి గడప తొక్కింది లేదు. క్యాంటీన్లో చాయ్‌లు అందిస్తూ తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటూ పెరిగింది. పిల్లలందరినీ చదివిస్తూ ఈమెనొక్కదాన్నే ఇంటిపట్టున ఉంచి పనులు చేయించటం ఎందుకనుకున్న తండ్రి ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుని సాయంతో షమీమ్ 12వ ఏట నేరుగా 6వ తరగతిలో చేర్చాడు. అప్పటి వరకు పుస్తకాల ముఖం చూడని షమీమ్ మొదట్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. అ, ఆ.. లతో మొదలు పెట్టి ఏడాది తిరక్కుండానే అన్ని సబ్జెక్టులలో మంచి మార్కులు సాధించి ప్రతిభావంతురాలు అనిపించుకుంది. ఐదేళ్లలోనే 10వ తరగతి పూర్తి చేసి మంచి మార్కులతో ఉత్తీర్ణురాలైంది. ఆమె పట్టుదలను గుర్తించిన తల్లిదండ్రులు పరిగి ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ చదివించారు. ‘బంగారు’ తల్లి పరిగిలో డిగ్రీ కళాశాల లేకపోవటంతో హైదరాబాద్‌లోని వనిత కళాశాలలో చేరింది షమీమ్. మొదట్నించి చురుకుగా ఉండే షమీమ్ డిగ్రీలోనూ మంచి మార్కులతో పాస్ అయింది. పెళ్లి చేసేస్తే బాధ్యత తీరిపోతుంది అనుకున్నప్పటికీ షమీమ్ ప్రతిభను గుర్తించి ఉన్నత చదువుల వైపే మొగ్గు చూపారు తల్లీదండ్రి. దీంతో ఉస్మానియా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ కెమిస్ట్రీలో చేరిన షమీమ్ తన ప్రతిభను మరోసారి రుజువు చేసుకుంది. అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలామ్, సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, ఇద్దరు గవర్నర్లు రంగరాజన్, రామేశ్వర్ ఠాకూర్ల చేతుల మీదుగా ఎమ్మెస్సీలో గోల్డ్‌మెడల్ అందుకుంది. ఇదే సమయంలో ఫీజు రీయింబర్స్‌మెంటు కూడా చదువు కొనసాగించటానికి దోహదపడిందని షమీమ్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. అనంతరం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ప్రస్తుత ఐఐసీటీలో పీహెచ్‌డి పూర్తి చేసి డాక్టరేట్ పొందారు. పరిగి టు అమెరికా షమీమ్ పట్టుదల తెలిసినవారంతా ఆమెను ఇంకా చదివిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుందన్నవారే. దీంతో ఎంత కష్టమైనా సరే కూతుర్ని విదేశాలలో ఉన్నత చదువులు చదివించాలని నిర్ణయించుకున్నాడు మగ్బూల్. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటలో షమీమ్‌కు పరిశోధనలలో అవకాశం రావడంతో అక్కడకు పంపించాడు. అక్కడే కాలేజ్ ఆఫ్ ఫార్మసి మెడికల్ కెమిస్ట్రీలో పరిశోధనలు ప్రారంభించారు షమీమ్. ఆరుగురు సభ్యుల బృందానికి టీంలీడర్‌గా వ్యవహరిస్తూ అనుకున్న సమయానికి ముందుగానే పరిశోధనలను అధికారుల ముందుంచారు. ‘కుటుంబ నియంత్రణ పాటించేందుకు ఆడవారికి 1960 నుంచే మాత్రలు అందుబాటులో ఉన్నాయి. ఆ తర్వాత ట్యూబెక్టమీ, డీపీఎల్.. లాంటి ఇతర కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు అందుబాటులోకి వచ్చాయి. కుటుంబ నియంత్రణ కోసం మగవారు పాటించే వాసెక్టమి ఆపరేషన్ అందుబాటులో ఉన్నప్పటికీ ఆ ఆపరేషన్ చేయించుకునే వారి సంఖ్య 1 శాతానికి మించిన దాఖలాలు లేవు. కుటుంబ నియంత్రణ బాధ్యత పూర్తిగా మహిళలే మోస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కుటుంబ నియంత్రణ బాధ్యతను పురుషులకు కూడా పంచాలని భావించింది మా శాస్త్రవేత్తల బృందం. ఆపరేషన్ ద్వారా శుక్ర కణాలను నిలిపివేసే కుటుంబ నియంత్రణ పద్ధతులను పాటించటాన్ని పురుషులు అంగీకరించటంలేదనే సత్యాన్ని గ్రహించాం. అందుకే తాత్కాలిక పద్ధతిలో మాత్రలను పురుషులకు పంచితే స్త్రీల ఆరోగ్యం బాగుంటుందని, అంతేకాకుండా మగవారూ దీనిని అంగీకరించి స్వాగతించే అవకాశం ఉందనే అభిప్రాయానికి వచ్చాం. దీంతో పురుషులు వేసుకునే కుటుంబ నియంత్రణ మాత్రలు తయారు చేయాలని నిర్ణయించి పరిశోధనలు ప్రారంభించి, సక్సెస్ అయ్యాం. అధికారిరంగా ఇది వెలుగులోకి రావాల్సి ఉంది’’ అని వివరించారు షమీమ్. మరింత వివరంగా ‘‘ఆఫ్రికాలోని ఓ అరుదైన మొక్కనుంచి లభించే ఒవాబిన్ పదార్థాన్ని గుండె జబ్బులు తగ్గించటంతో పాటు, కొన్ని రకాల రోగాలకూ ఇప్పటికే వినియోగిస్తూ వస్తున్నారు. ఈ పదార్థాన్ని వినియోగించే పురుషుల కుటుంబ నియంత్రణ మాత్రలను తయారు చేయాలని సంకల్పించాం. ఈ మొక్కలోని రసాయనాలు కేవలం శుక్రకణాల్లో మాత్రమే ఉండే ఎక్స్–4 ను అచేతన పరిచి, వాటి పరుగును మందగింపజేస్తుంది. దీంతో శుక్రకణాలు అండంతో ఫలదీకరణ చెందడం ఆగిపోతుంది. అయితే, ఈ ఎక్స్–4.. వృద్ధి చెందిన శుక్ర కణాలను మాత్రమే అడ్డుకుంటుంది. కొత్తగా వృద్ధి చెందే శుక్రకణాలపై ఎలాంటి ప్రభావం ఉండదు. ఈ మాత్రలు వేసుకున్నప్పుడు మాత్రమే కుటుంబ నియంత్రణ జరుగుతుంది. వేసుకోవటం మానేస్తే తిరిగి సంతానాన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా పొందవచ్చు. ఈ మాలిక్యూల్ పురుషులకు తాత్కాలిక కుటుంబ నియంత్రణ వ్యవస్థగా ఉపయోగపడనుంది. మా బృందం తయారు చేసిన కుటుంబ నియంత్రణ మాలిక్యూల్‌ను మొదటి దశలో ఎలుకలు, తరువాత దశలో కుందేళ్లపై ప్రయోగించి సఫలీకృతమయ్యాం. ప్రస్తుతం కోతులపై ఈ ప్రయోగం జరుగుతోంది. అనంతరం మనుషులపై ప్రయోగించి ఈ మందును మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఈ మందు తయారీ విషయంలో ఇప్పటికే మా శాస్త్రవేత్తల బృందం పేటెంట్ హక్కులు సైతం పొందింది’’ అని తెలిపారు షమీమ్ సుల్తానా. ఇష్టపడి చదివాను పరిగి నుంచి అమెరికా వరకు ప్రతి అడుగులోనూ నా తల్లిదండ్రుల కృషి ఉంది. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నప్పటికీ పై చదువులు చదివించారు. ఆడపిల్ల అని వెనుకంజ వేయకుండా అమెరికా యూనివర్సిటీలో చేరడానికి ప్రోత్సహించారు. ప్రపంచ స్థాయి సైంటిస్టుగా గుర్తింపు పొందటానికి మరో అడుగు దూరంలో ఉన్నాను. ఇప్పటికే అమెరికాలోని ప్రసారమాధ్యమాల్లో మా ప్రయోగాలకు సంబంధించిన వార్తలు ఎన్నో వచ్చాయి. – షమీమ్ సుల్తానా, సైంటిస్టు చదువే పరిష్కారం పరిగి బస్‌స్టాండులో 16 ఏళ్లపాటు క్యాంటిన్ నడిపాను. నా కుటుంబం పెద్దది. కుటుంబం బాగుపడాలంటే చదువొక్కటే మార్గమని నమ్మినవాడిని. ఎంత కష్టమైనా ఆడా మగ తేడా లేకుండా పిల్లలందరినీ చదివించాను. టిఫిన్లు, చాయ్‌లు అమ్ముతూనే పిల్లలందరినీ ఉన్నత విద్యావంతులను చేశాను. ఈ రోజు వారందరూ ప్రయోజకులయ్యారు. ఇంజనీర్లుగా, ఉపాధ్యాయులుగా, వ్యాపారవేత్తలుగా, డాక్టర్లుగా ఇండియాతో పాటు ప్రపంచంలోని ఆయా దేశాల్లో స్థిరపడ్డారు. షమీమ్ సైంటిస్టుగా అమెరికాలో స్థిరపడింది. ప్రస్తుతం పరిగిలోనే ఓ కిరాణ దుకాణం నిర్వహిస్తున్నాను. నా బిడ్డ సాధించిన విజయానికి నాకెంతో గర్వంగానూ, ఆనందంగానూ ఉంది. -
వికారాబాద్‌లో ప్రధాని సతీమణి
- నాగదేవత ఆలయంలో పూజలు - అంబేడ్కర్, బుద్ధ విగ్రహాలకు నివాళి అనంతగిరి: వికారాబాద్ జిల్లా కేంద్రంలోని నాగదేవత ఆలయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సతీమణి జశోదాబెన్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 6 నుంచి 8 గం టల వరకు నాగులపుట్టకు, నాగబుద్ధ అంబేడ్కర్ విగ్రహా నికి, విఘ్నేశ్వరుడు, పంచవృక్షాలు, అష్టాదశ శక్తి పీఠాలు, దశావతారాలు, తుల్జాభవాని, గోపూజ, తులసీవనం, నవగ్రహాల పూజలు చేశారు. ఆలయంలోని మొత్తం 61 విగ్రహాలకు పూజలు నిర్వహించారు. మ«ధ్యాహ్నం ఒంటిగంటకు నిర్వహించిన నిత్య అన్నదాన కార్యక్రమం లో పాల్గొని పలువురికి భోజనం వడ్డించారు. శివరాంనగర్ సంతోషిమాత ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మోదీ పాలన భేష్: జశోదాబెన్ దేశంలో పాలన బాగుందని ప్రధాని నరేంద్ర మోదీ సతీమణి జశోదాబెన్ కితాబిచ్చారు. భవిష్యత్‌లో కూడా ఇలాగే ఉండాలని ఆశిస్తున్నానని చెప్పారు. దేశ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. వికారాబాద్‌లో ఒకే దగ్గర ఇన్ని విగ్రహాలు ఉండటం సంతోషకరమని చెప్పారు. ఇక్కడి నాగదేవతా ఆలయాన్ని సందర్శించడం ఆనందంగా ఉందన్నారు. కాగా, ప్రధాని సతీమణి రాకపై పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. దీంతో ఆమె సాధారణ వ్యక్తిగా తన పర్యటన ముగిం చారు. శనివారం తెల్లవారుజామున జశోదాబెన్ తిరుగు ప్రయాణం కానున్నట్లు ఆలయ నిర్వాహకులు బరాడి రమేశ్, సరిత దంపతులు తెలిపారు. -
వికారాబాద్‌లో YSRCP విస్తృత స్థాయి సమావేశం
-
బార్వాద్ టు ముంబై.. వయా వికారాబాద్
► యథేచ్ఛగా గంజాయి రవాణా చేస్తున్న స్మగ్లర్లు ► రైతులను పావులుగా వాడుకుంటూ సాగు ► రైల్వే పోలీసుల కళ్లుగప్పి బోగీల్లో తరలింపు ► ముంబై, సూరత్, పుణెల్లో అమ్మకాలు సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: గంజాయి రవాణాకు వికారాబాద్ అడ్డాగా మారుతోంది. గుట్టుగా సాగుతున్న ఈ దందా వెనుక బడా ముఠా ఉన్నట్లు తెలుస్తోంది. కోట్‌పల్లి, బంట్వారం మండలంలో వాణిజ్య పంటల మాటున సాగు చేస్తున్న గంజాయి రైలు మార్గాన ఇతర రాష్ట్రాలకు తరలిపోతోంది. రైళ్లలో నిఘా, చెక్‌పోస్టులు లేకపోవడంతో మత్తు పదార్థాల రవాణా యథేచ్ఛగా సాగు తోంది. మహారాష్ట్ర లాతూరు కేంద్రంగా పని చేస్తున్న స్మగ్లర్లు ఇక్కడి రైతులను పావులుగా చేసుకొని ఈ అక్రమ దందాను సాగిస్తున్నట్లు ఇటీవల అధికారుల దాడిలో బయటపడింది. నల్లబజారులో గంజాయికి డిమాండ్ నిషేధిత మత్తు పదార్థం కావడంతో నల్లబజారులో గంజాయికి భారీ డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలోనే లాతూరుకు చెందిన స్మగ్లర్లు అమాయక రైతాంగానికి ఆశ చూపి.. తమ పొలాల్లో గంజాయి సేద్యం చేసేలా ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. ఈ క్రమం లోనే కర్ణాటక సరిహద్దులోని కోట్‌పల్లి మం డల పరిధిలోని గ్రామాల్లో గంజాయి పంట సాగవుతోంది. పసుపు, కంది పంటల మధ్య లో ఎకరాకు 25 గంజాయి మొక్కలను పెంచు తారు. ఒక్కో మొక్క నుంచి సుమారు అరకేజీ వరకు గంజాయి ఉత్పత్తి అవుతుంది. ఇలా పండించిన గంజాయిని ఎండపెట్టి ఇంట్లో నిల్వ చేసిన తర్వాత లాతూరుకు చెందిన స్మగ్లర్లు గ్రామాలకు వచ్చి.. కిలోకు రూ.2 వేల చొప్పున ఖరీదు చేస్తారు. నేరుగా మధ్యవర్తు లో.. స్మగ్లర్లో ఇంటికే వచ్చి సేకరిస్తున్నందున ఈజీ మనీకి అలవాటు పడ్డ కొందరు రైతులు గంజాయి ఉచ్చులో పడ్డారు. ఇదే అదనుగా గతంలో కేవలం బార్వాద్కే పరిమితమైన ఈ దందా ఇతర గ్రామాలకూ పాకింది. తరలింపు ఇలా.. బార్వాద్ నుంచి వికా>రాబాద్ రైల్వేస్టేషన్ మార్గమధ్యంలో చెక్ పోస్టులు లేకపోవడం స్మగ్లర్లకు అనుకూలంగా మారింది. ఈ ప్రాం తం రాష్ట్ర సరిహద్దులో ఉండడం.. చుట్టూ అటవీ ప్రాంతం ఉండడంతో ఎవరూ పసి గట్టరని భావిస్తున్న అక్రమార్కులు గంజాయి సాగుకు ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు కనిపి స్తోంది. వికారాబాద్ నుంచి రాకపోకలు సాగించే రామేశ్వరం –ఓకా ఎక్స్‌ప్రెస్, విశాఖ పట్నం –ముం బై ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్, కాచి గూడ ప్యాసింజర్, కోణార్క్ ఎక్స్‌ప్రెస్, గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్ లలో గంజాయిని ముంబై, లాతూరు ప్రాంతాలకు తరలుతున్నట్లు విచారణలో తేలిందని తాండూరు ఎక్సైజ్ ఇన్్స క్టర్ భరత్‌భూషణ్ ‘సాక్షి’కి తెలిపారు. కనిపెట్టకుండా... గంజాయి రవాణాలో ముఠా సభ్యులు పక్కా ప్లాన్ తో వ్యవహరిస్తున్నారు. రైతుల నుంచి సేకరించిన మత్తు పదార్థాన్ని లగేజీ బ్యాగుల్లో భద్ర పరిచి.. దాన్ని ప్రయాణికుల బోగీల సీట్ల కింది భాగంలో దాచిపెడతారు. ఈ సంచు లపై అనుమానం రాకుండా మరో బోగీలో ముఠాసభ్యులు ప్రయాణిస్తారు. ఎవరైనా సంచులను పసిగట్టినా ఏమి మట్టి అంటకుం డా బయటపడాలనే ఆలోచనతోనే ఈ ఎత్తు గడ వేస్తున్నట్లు తెలిసింది. రైల్వే పోలీసులు గుర్తించకపోతే ముంబై, సూరత్, పుణెలకు చేరవేస్తారు. కిలో గంజాయిని రూ.7 వేల వర కు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. గుట్టు వెలుగులోకి వచ్చిందిలా..? వికారాబాద్ జిల్లాలో నెల రోజుల క్రితం తాండూరు ఎక్సైజ్ సీఐ భరత్‌భూషణ్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. దాం తో బార్వాద్ కేంద్రంగా కొన‘సాగు’ తోన్న గంజాయి గుట్టు రట్టైంది. వ్యవసాయ పొలా ల్లో సాధారణ పంటల మధ్యలో గంజాయి మొక్కల పెంపకం బహిర్గతమైంది. అధికా రులు రైతులుగా భావిస్తున్న లక్ష్మారెడ్డి, వెంక టయ్య, రాచయ్య, శ్రీశైలం, పాండయ్య ఇళ్ల లో తనిఖీలు నిర్వహించగా బ్యాగుల్లో ఉన్న 43 కిలోల ఎండబెట్టిన గంజాయి లభిం చింది. లక్ష్మారెడ్డి, వెంకటయ్య సాగుచేస్తున్న పసుపు, పత్తి పొలాల్లోనూ అధికారులు తని ఖీలు నిర్వహించారు. పత్తి, పసుపు పొలాల మధ్య గంజాయిసాగు చేసినట్టు తనిఖీల్లో తేలింది. పొలాల్లో 50 కిలోల మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. బార్వాద్ నుంచి వికారాబాద్ రైల్వేస్టేషన్ వరకు చెక్‌పోస్టులు లేకపోవడం.. రైళ్లలో కూడా నిఘా తక్కువగా ఉండడంతో గంజాయి రవాణా సులువుగా సాగుతుండడంతో ఈ ప్రాంతం తమకు అనువుగా స్మగ్లర్లు మలుచుకున్నారు. -
సబ్ కలెక్టర్ ఆఫీసు ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం
స్థలానికి పట్టా చేయకపోవడంతో మనస్తాపం వికారాబాద్ టౌన్: అధికారులు సర్టిఫికెట్ ఇచ్చిన స్థలాన్ని పట్టా చేయాలని ఆయన ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగాడు. కాగా, సదరు స్థలం తమదంటూ మున్సిపల్, మార్కెట్ కమిటీ అధికారులు పేచీ పెట్టారు. జీవనాధారమైన స్థలం కోల్పోతానేమోనని మనస్తాపం చెందిన ఆయన కలెక్టర్‌కు విన్నవించాలనుకున్నాడు. కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో అక్కడే పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో కలకలం సృష్టించిన ఈ ఘటన మంగళవారం జరిగింది. పట్టణంలోని ఎడ్ల బజార్ సమీపంలో ఉండే లక్ష్మయ్య(55)కు వికలాంగురాలైన భార్య బాలమణి, ముగ్గురు కూతుళ్లు, కొడుకు ఉన్నారు. ఆయన స్థానిక మార్కెట్లో ఎద్దుల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వికారాబాద్ సుభాష్‌నగర్ రోడ్డులో 1961 నుంచి సర్వేనంబర్ 20లో ఆయన 260 గజాల స్థలం కబ్జాలో ఉంది. కాగా, తన ఐదుగురు అన్నదమ్ములతో కలిసి అందులో పాక వేసుకొని గేదెలను సాకుతున్నాడు. సదరు స్థలం తనకు కేటారుుంచాలని లక్ష్మయ్య అప్పటి సీఎం చంద్రబాబుతో పాటు పలువురు కలెక్టర్లను వేడుకున్నాడు. దీంతో అధికారులు 1998లో ఆయనకు సర్టిఫికెట్ ఇచ్చారు. స్థలాన్ని పట్టా చేసుకోవాలని లక్ష్మయ్య మున్సిపల్ కార్యాలయానికి వెళ్లగా మార్కెట్ కమిటీ వాళ్లు స్థలం తమదంటూ పేచీ పెట్టారు. దీంతో వ్యవహారం కోర్టులో నడుస్తోంది. స్థలం పట్టా చేసిస్తామని ఇటీవల లక్ష్మయ్య నుంచి మార్కెట్ కమిటీ అధికారులు రూ.3లక్షలు కట్టించుకొని అనంతరం వేధించసాగారు. రెండు శాఖల అధికారులు ఇబ్బంది పెట్టడం, చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో మనస్తాపం చెందిన లక్ష్మయ్య సబ్‌కలెక్టర్ కార్యాలయానికి వీడియో కాన్ఫరెన్స కోసం వచ్చిన కలెక్టర్ దివ్యను కలిసి విన్నవించుకోవాలని భావించాడు. ఆమె అందుబాటులో లేకపోవడంతో తనతో తెచ్చుకున్న పురుగులమందును కార్యాలయం దగ్గర తాగేశాడు. అపస్మారక స్థితికి చేరుకున్న అతడిని పట్టణంలోని మిషన్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. లక్ష్మయ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. -
‘ సీఎం అలా అనటం దివాళాకోరుతనం’
టీఆర్ఎస్ వొంగి సలాం కొట్టే సంస్కృతిని కొనసాగిస్తోందని బీజేపీ ఎల్పీ నేత కిషన్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ మాదిరిగానే అధికార టీఆర్ఎస్ వ్యవహరిస్తోందని ఆరోపించారు.ఎంఐఎం టీఆర్ఎస్ మిత్రపక్షంగా సీఎం పేర్కొనటాన్ని దివాళాకోరుతనంగా అభివర్ణించారు. ఎందుకు ఎంఐఎం మిత్రపక్షమైందో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఏ నిర్ణయమైనా ఎంఐఎంను అడిగే తీసుకుంటున్నారని, హైదరాబాద్‌ను ఆ పార్టీకి కట్టబెట్టారా అని ప్రశ్నించారు. సీఎం వైఖరి ప్రజాస్వామ్య వ్యతిరేకంగా ఉందని దుయ్యబట్టారు. ఎంఐఎం సలహాతోనే సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవాన్ని మూసీలో కలిపారని అన్నారు. వికారాబాద్ జిల్లా పేరు అనంతగిరిగా పెట్టాలని అంటే ఎంఐఎం మాటలు విని వికారాబాద్‌గా ఉంచారని అన్నారు. అవినీతి రాజ్యం ఏలటానికే అధికారంలో ఉన్న పార్టీలతో ఎంఐఎం స్నేహంగా ఉంటోందని కిషన్‌రెడ్డి ఆరోపించారు. -
రంగారెడ్డి జిల్లాకు 9 మైనారిటీ స్కూళ్లు
ప్రభుత్వం ప్రకటించిన 71 మైనారిటీ ఇంగ్లిష్ మీడియం పాఠశాలల్లో రంగారెడ్డి జిల్లాకు తొమ్మిది ఉన్నాయని వికారాబాద్ ఎమ్మెల్యే బి.సంజీవరావు తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుంచే వికారాబాద్ బాలుర పాఠశాలలో 5, 6,7 తరగతులను ప్రారంభిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆయన శుక్రవారం రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ ఎండీ షఫీ ఉల్లాతో కలిసి శివారెడ్డిపేట్‌లో ఉన్న ప్రభుత్వ భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పాఠశాలల్లో చదివే విద్యార్థులు మైనార్టీలు 75 శాతం ఉంటే 25 శాతం ఇతర కులాల పేదవారు ఉంటారని తెలిపారు. -
ఏఎస్పీ చొరవతో బతికాడు..
ఏఎస్పీ చొరవ తీసుకోవడంతో.. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడు ప్రాణాపాయం తప్పించుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. వికారాబాద్ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో సోమవారం రాత్రి 11.30 గంటలకు రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు, బైక్ ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో బేగంపేటకు చెందిన శ్రీనివాస్(27) తీవ్రంగా గాయపడ్డాడు. రక్తపు మడుగులో ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. దీంతో స్థానికులు 108కు ఫోన్ చేశారు. అదే సమయంలో కార్పొరేటర్ల సమావేశంలో సీఎం బందోబస్తుకు వెళ్లి వస్తున్న తాండూరు ఏఎస్పీ చందన దీప్తి ప్రమాదాన్ని గుర్తించి వాహనాన్ని నిలిపి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వెంటనే 108కు ఫోన్‌చేశారు. కాసేపటికే.. 108 వాహనం రాక ఆలస్యమయ్యేలా ఉందని గ్రహించారు. వెంటనే క్షతగాత్రుడిని తన కారులో వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించారు. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో శ్రీనివాస్ వద్ద ఉన్న గుర్తింపు కార్డుల ఆధారంగా బంధువులకు సమాచారం అందించే ప్రయత్నం చేశారు. గంటకు పైగా అక్కడే ఉండి.. వైద్యుల సూచనల మేరకు స్వయంగా ప్రైవేట్ అంబులెన్స్‌ను పిలిపించి అతన్ని నగరంలోని ఉస్మానియాకు తరలించారు. అనంతరం అక్కడి వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషి చేశారు. దీంతో శ్రీనివాస్ ప్రాణపాయ స్థితి నుంచి బయట పడ్డాడని, అతని పరిస్థితి మెరుగైందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు వికారాబాద్ సీఐ రవి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఒక పోలీసు ఉన్నతాధికారి అధికారి స్వయంగా దగ్గరుండి.. ప్రమాదంలో ఉన్న వ్యక్తి ని కాపాడేందుకు కృషిచేయడం చూసి.. వికారాబాద్ వాసులు ఆశ్చర్య పోయారు. అధికారులు ఆదేశాలు జారీ చేయడం చూశాం కానీ, ఇలా దగ్గరుండి పనిచేయడం చూడలేదని అన్నారు. ఏఎస్పీ చందన దీప్తి చొరవకు సంతోషం వ్యక్తం చేశారు. -
వికారాబాద్‌లో మహిళ దారుణ హత్య
వికారాబాద్ మండలం అంతగిరిపల్లె సమీపంలో ఓ మహిళ దారుణహత్యకు గురైంది. గుర్తుతెలియని దుండగులు మహిళను బాగా కొట్టి చంపినట్లు తెలుస్తోంది. మృతురాలు తాండూరుకు చెందిన వరలక్ష్మి(36)గా గుర్తించారు. సంఘటనాస్థలానికి జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరీ చేరుకుని పరిశీలించారు. డాగ్‌స్క్వాడ్ బృందంతో ఆధారాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
శ్మశానవాటికపై భూబకాసురుల కన్ను?
ఐదువేల గజాల స్థలాన్ని కాజేయాలని పన్నాగం.. మార్కెట్ విలువ రూ.5 కోట్లకు పైమాటే.. కాపాడాల్సిన వారే కాజేయడానికి సిద్ధమైన వైనం.. విచారణ కమిటీ వేసిన సబ్ కలెక్టర్.. ఆ తరువాత రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్ట్రార్ వికారాబాద్: ‘కంచే చేను మేసింది’ అనే చందంగా ప్రభుత్వ స్థలాలను కాపాడాల్సిన వారే కాజేయడానికి సిద్ధమయ్యారు. చట్టబద్ధంగా తప్పించుకునేందుకు అన్ని జాగ్రతలు తీసుకుని, వాటిని ఆక్రమించుకోవడానికి తమదైన శైలిలో భూ బకాసురులు ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వ స్థలాలను భూ బకాసురులు ఆక్రమించుకున్న తరువాత వాటిని చట్టప్రకారం పొందడానికి న్యాయస్థానాలను ఆశ్రయిస్తూ తప్పించుకుంటున్నారు. ఈ సలహాలు సైతం వారికి మున్సిపల్ యంత్రాంగమే ఇవ్వడం విడ్డూరంగా ఉంది. న్యాయస్థానాల్లో కేసులు నడుస్తున్నా.. మున్సిపల్ స్థలాలు పాత శిశుమందిర్ దగ్గర ఉన్న స్థలం, పోలీస్‌స్టేషన్ దగ్గర ప్రభుత్వ టాయిలెట్స్ స్థలం.. ఇలా అనేక ప్రాంతాల్లో మున్సిపల్ స్థలాలను కబ్జా చేసుకుని, వాటిని న్యాయస్థానాల ద్వారా భూ బకాసురులు దక్కించుకొని ఇళ్లు నిర్మించుకుని విక్రయిస్తున్నారు. ఇదిలా ఉండగా బీఆర్ఎస్, ఎల్ఆర్ఎస్ పథకం కింద వాటిని రెగ్యులరైజ్ చేసుకోవడానికి ఇటీవల అక్రమార్కులు కొందరు బినామీ పేర్లతో దరఖాస్తులు చేసుకోవడం గమనార్హం. అక్రమ కబ్జాలపై అనేకసార్లు పత్రికల్లో కథనాలు వచ్చినా.. అధికారులు స్పందించకపోవడంతో కాపాడాల్సిన వారే కాసులకు కక్కుర్తి పడుతున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సమాధుల స్థలంపై భూ బకాసురుల దృష్టి.. రామయ్యగూడ, అంబేద్కర్ కాలనీ దగ్గర ఉన్న ఎంఐజీ, ఎల్ఐజీ సమీపంలోని వికారాబాద్ నుంచి అనంతగిరి పల్లి వైపు వెళ్లే రోడ్డుకు ఆనుకొని ఉన్న ప్రభుత్వ స్థలం సర్వే నంబర్ 224, 225, 226లో ఐదు వేల గజాలకుపైగా స్థలం ఉంది. దీనిపై భూ బకాసురుల కన్ను పడింది. ప్రభుత్వం ఎంఐజీ, ఎల్‌ఐజీలో ఉంటున్న ప్రజలకోసం శ్మశానవాటిక స్థలాన్ని హోజింగ్బోర్డు కేటాయించింది. ఇప్పటికే చాలామంది సమాధులను ఏర్పాటు చేశారు. మిగిలిన స్థలం మాత్రం హాట్‌కేక్‌లా ఉంటుంది. సమాధుల స్థలానికి రెండువైపులా రోడ్డు మార్గాలున్నాయి. ఈ స్థలం సుమారుగా ఐదు వేల నుంచి ఆరు వేల గజాల వరకు ఉంటుందని స్థానిక ఎంఐజీ కాలనీ వాసులు పేర్కొంటున్నారు. ఈ స్థలం గజం విలువ సుమారు రూ.10 వేల నుంచి రూ.16 వేల వరకు పలుకుతుందంటున్నారు. దీంతో భూ బకాసురుల కన్ను దీనిపై పడింది. రోడ్డుకు ఇరువైపులా కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మిస్తే కోట్లాది రూపాయలు తమ స్వంతం అవుతాయని భావించి కొందరు ఆ దిశగా ప్రణాళికను రూపొందించారు. అనుకున్నదే తడువుగా మున్సిపల్ పాలకవర్గంలో ఉన్న కొందరు కీలకనేతలు, రెవెన్యూ విభాగంలో కీలకపోస్టుల్లో ఉన్నవారి అండదండలతో సమాధుల స్థలాన్ని కొల్లగొట్టడానికి శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో రికార్డులను పకడ్బందీగా మార్చడానికి ప్రణాళికను రూపొందించారు. సబ్ కలెక్టర్ స్పందించి గ్రేవ్‌యార్డుకు కేటాయించిన ఖాళీ స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేసి భూ బకాసురుల పాలు కాకుండా చూస్తే బాగుంటుందని ఎంఐజీ కాలనీ ప్రజలు కోరుతున్నారు. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
అప్పులు తీరేమార్గం లేదని మనస్తాపం చెందిన ఓ రైతు ట్రాన్స్ఫార్మర్ వద్ద కరెంట్ తీగను పట్టుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాదం రంగారెడ్డి జిల్లా వికారాబాద్ మండల పరిధిలో పులుసుమామిడి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన కేశపల్లి గోపాల్‌రెడ్డి(50), రత్నమ్మ దంపతులు. వీరికి సంతానం స్వప్న, సందీప్‌రెడ్డి ఉన్నారు. గోపాల్‌రెడ్డి తనకున్న ఎకరంన్నర పొలంలో వ్యవసాయం చేస్తున్నాడు. మూడేళ్ల క్రితం కూతురు వివాహం కోసం రూ. 2 లక్షలు అప్పు చేశాడు. కుమారుడు సందీప్‌రెడ్డి చదువు కోసం కూడా కొంతమేర రుణం తీసుకున్నాడు. వర్షాభావ పరిస్థితులతో మూడేళ్లుగా సరిగా పంటలు పండడం లేదు. ఖరీఫ్‌లో సాగుచేసిన పత్తిపంట చేతికి రాకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురైయ్యాడు. 15 రోజులుగా సరిగా మతిస్థిమితం లేకుండా ప్రవర్తిసున్నాడు. అప్పటి నుంచి భార్య రత్నమ్మ గోపాల్‌రెడ్డిని కనిపెట్టుకుంటూ ఉంది. శనివారం ఉదయం 6 గంటలకు రైతు పొలానికి వెళ్లాడు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో పక్క పొలంలోని ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లి విద్యుత్ తీగను చేతితో పట్టుకున్నాడు. దీంతో విద్యుదాఘాతానికి గురైన ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. వికారాబాద్‌లోని గొల్కోండ బ్యాంక్‌లో రూ. 23 వేలు, ప్రైవేటు వ్యక్తుల వద్ద మరో రూ. 3 లక్షల అప్పు ఉందని మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కోర్టు ఆవరణలో వృద్ధుని ఆత్మహత్య
రంగారెడ్డి జిల్లా వికారాబాద్ పట్టణంలోని కోర్టు ఆవరణని మామిడి చెట్టుకు ఉరివేసుకుని ఒక వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఉదయం విధులకు హాజరైన సిబ్బంది గమనించి పోలీసులకు సమాచారం అందించారు. 70 ఏళ్ల వయసున్న గుర్తుతెలియని వృద్ధుడు చెట్టుకు ఉరివేసుకున్నాడు. తెల్ల చొక్కా. తెల్ల దోవతి, తెల్ల కండువా ధరించి ఉన్నాడు. అతని బ్యాగులో కర్ణాటకకు చెందిన బీడీల కట్ట ఉంది. బహుశా అతను కర్ణాటకకు చెందినవాడని భావిస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
త్వరలో కల సాకారం
ఆవిర్భావ దినోత్సవం నాటికి జిల్లా కేంద్రంగా వికారాబాద్ నెరవేరనున్న ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ శివసాగర్ చెరువును మినీ ట్యాంక్‌బండ్ చేస్తాం రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు దేవాలయాభివృద్ధికి కృషి చేస్తా రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి వికారాబాద్: రాష్ర్ట ఆవిర్భావ దినోత్సవం నాటికి వికారాబాద్ జిల్లా కేంద్రంగా ఏర్పడుతుందని, దీంతో ఈ ప్రాంత ప్రజల కల సాకారం కానుందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు పేర్కొన్నారు. మంగళవారం వికారాబాద్‌లోని వేంకటేశ్వరస్వామి దేవాలయంలో నూతన రాజగోపుర ప్రారంభోత్సవం, ధ్వజస్తంభ పునః ప్రతిష్టాపన కార్యక్రమాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో హరీష్‌రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధికి కోసం ఎంతగానో పాటుపడుతున్నారన్నారు. ఈ ప్రాంత ప్రజల ఎన్నో ఏళ్ల కల సాకారం కాబోతుందన్నారు. సీఎస్ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా కేంద్రంగా ఏర్పాటు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇక్కడి శివసాగర్ చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా మారుస్తామని స్పష్టంచేశారు. సాయంత్ర సమయంలో చిన్నారులు ఆడుకోవడానికి, బతుకమ్మలను నీటిలో వదలడానికి చెరువు చుట్టూ మెట్లను కూడా నిర్మిస్తామన్నారు. వికారాబాద్ పట్టణంలో తాగునీరు, రోడ్లు తదితర సదుపాయాల కల్పనకు నిధులు కేటాయిస్తామన్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంగా ఏర్పడితే ఈ ప్రాంత దశాదిశ మారుతుందని ఆయన స్పష్టం చేశారు. మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ. వెంకటేశ్వర దేవాలయ అభివృద్ధికి తమవంతు కృషి చేస్తానన్నారు. అంతకు ముందు ఆలయ అర్చకులు మంత్రులకు ఘనస్వాగతం పలికారు. స్వామివారికి మంత్రి హరిశ్వర్రావు పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. అనంతరం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈ నెల 16న నిర్వహించే బతుకమ్మ వేడుకల పాటల సీడీలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సంజీవరావు, కాలే యాదయ్య, ఎంపీపీ సామల భాగ్యలక్ష్మి ఎల్లారెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు ముత్తార్ షరీప్, మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ, వైస్ చైర్మన్ సురేష్, మున్సిపల్ కౌన్సిలర్ విజేందర్‌గౌడ్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు నాగేందర్‌గౌడ్, టీఆర్ఎస్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు స్వప్న, టీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శుభప్రద్‌పటేల్, టీఆర్ఎస్ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు భూమోళ్ల కృష్ణయ్య, నాయకులు ఎల్లారెడ్డి, రాంచంద్రారెడ్డి, బొత్స శ్రీకాంత్, కిషోర్, గోపి, పాండు, మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు. -
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్యాయత్నం.. మృతి
రంగారెడ్డి జిల్లా వికారాబాద్ పట్టణంలో ఆత్మహత్యాయత్నం చేసిన ఎస్ఏపీ కళాశాల విద్యార్థి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రాథమిక సమాచారం మేరకు... మహబూబ్‌నగర్ జిల్లా కుందూరు మండలం రేగడి చిల్కమర్రి గ్రామానికి చెందిన భరత్‌రెడ్డి (21) వికారాబాద్‌లోని ఎస్ఏపీ కళాశాలలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం సాయంత్రం స్థానిక బ్లాక్‌గ్రౌండ్‌లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అదే విషయాన్ని స్నేహితులకు ఫోన్ ద్వారా తెలియజేశాడు. దీంతో అతన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. రాత్రి అతడి పరిస్థితి విషమంగా ఉండంతో మెరుగైన చికిత్స కోసం మిషన్ హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం భరత్‌రెడ్డి మృతిచెందాడు. కాగా, ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియరాలేదు. -
బదిలీల కోసం ఈ నెల 27లోపు ..టీచర్లు దరఖాస్తు చేసుకోవాలి
వికారాబాద్: బదిలీలు కోరుకుంటున్న ఉపాధ్యాయులు ఈ నెల 27వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ రమేష్ పేర్కొన్నారు. వెబ్సైట్లో పొందు పరిచిన వివరాలకు సంబంధించి ఏమైనా అభ్యంతరాలుంటే ఎంఈ వోల దృష్టికి తీసుకురావాలని సూచించారు. స్థానిక మేరి నాట్స్ పాఠశాలలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భార్యాభర్తలు ఇద్దరూ ఉపాధ్యాయులైతే ఎనిమిదేళ్లలో ఒకసారి మాత్రమే పాయింట్లు వినియోగించుకోవాల్సి ఉంటుందన్నారు. గతం లో ఈ సదుపాయాన్ని వినియోగించుకోలేదని ధ్రువీకరణ పత్రం అందజేయాల్సి ఉంటుందన్నారు. 1:30 నిష్పత్తి ప్రకారం రేషనలైజేషన్ చేయగా, 380 పోస్టులు సర్‌ప్లస్‌గా ఉన్నట్లు గుర్తించామని, ఆ పోస్టులను అవసరమైన పాఠశాలలకు కేటాయంచడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం జిల్లాలో 673 పోస్టులు అవసరం ఉండగా, 380 సర్ప్లస్ పోగా ఇంకా 273 కొత్త పోస్టులు ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు అవసరం ఉన్నాయని, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు. డీఎస్సీ కోసం జిల్లాలో 785 ఉపాధ్యాయుల పోస్టులు అవసరమని ఇదివరకే గుర్తించగా, ఈ పోస్టులు అదనమని స్పష్టం చేశారు. పాఠశాలల్లో ఖాళీల వివరాల తుది జాబితాను ఈ నెల 28న ప్రకటిస్తామని వెల్లడించారు. జూలై 6 నుంచి ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. 1:3 నిష్పత్తిలో సీనియర్టీ జాబితాలో వెబ్సైట్లో ఉంచామని, అభ్యంతరాలుంటే ఈ నెల 27వ తేదీలోగా డీఈఓ కార్యాలయంలో సంప్రదిం చాలన్నారు. హరితహారం కింద ప్రతి పాఠశాలలో ఒక్కో విద్యార్థి ఐదు మొక్కలు నాటి, వాటిని సంరక్షించే బాధ్యత తీసుకునేలా ప్రయత్నం చేస్తున్నామన్నారు. బోగస్ ధ్రువీకరణ పత్రాలతో ఉద్యోగులు పొందిన విషయమై విచారణ తుది దశకు చేరుకుందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ ఈఓ హరిశ్చందర్, ఎంఈ వోలు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. -
చంద్రబాబుపై కఠిన చర్యలు తీసుకోవాలి
వికారాబాద్ రూరల్: చంద్రబాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్వీ రాష్ట్రప్రధాన కార్యదర్శి ఎన్. శుభప్రద్‌పటేల్ పేర్కొన్నారు. టీ న్యూస్‌కు ఇచ్చిన లీగల్ నోటీసులకు నిరసనగా శనివారం వికారాబాద్‌లో విలేకరులతో కలిసి ఎన్టీఆర్ చౌరస్తాలో చంద్రబాబు దిష్టిబొమ్మను దహ నం చేశారు. అనంతరం స్థానిక అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటుకు నోటు కేసులో ప్రధాన ముద్దా యి అయిన చంద్రబాబును వెంటనే అరెస్ట్ చేసి జైలుకు పంపాలని డిమాం డ్ చేశారు. నిజాలను నిర్భయంగా ప్రసారం చేసే చానళ్లకు ఇలా లీగల్ నోటీసులు పంపడం వారి వివేకానికి నిదర్శనమన్నారు. తెలంగాణలో ఆంధ్రా పోలీసులను మోహరించడం దారుణమన్నారు. తెలంగాణలో చంద్రబాబు కుట్రలు సాగవన్నారు. కార్యక్రమంలో జేఏసీ నియోజకవర్గ ఇన్చార్జి కల్కోడ నర్సిములు, టీఆర్ఎస్ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు భూమోళ్ల కృష్ణయ్య, టీఆర్ఎస్ నాయకులు నర్సిములు, శంకర్, సత్యనారాయణరెడ్డి, మహేందర్‌రెడ్డి, చంద్రకాంత్‌రెడ్డి, బాలయ్య, బందయ్య, విలేకరులు రుమాండ్ల మఠం గిరీశ్వర స్వామి, రమణ ముదిరాజ్, అశోక్ , నర్సిములు, శివకుమార్, రవి, సంతోష్, శేఖర్, క్రాంతి, కృష్ణచారి, శ్రీధర్, చుక్కయ్య, కటిక నరేష్, ఆనందం, మహేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్ అమలు చేయాలి
వికారాబాద్ రూరల్: ఎస్టీలకు ప్రభుత్వం 12 శాతం రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలని, 6 శాతం రిజర్వేషన్‌తో ఎస్టీలు నష్టపోతున్నారని ఆలిండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు టి.కిషన్‌సింగ్ అన్నారు. స్థానిక అతిథిగృహంలో శనివారం బంజారా భేరీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలతోపాటు ఇవ్వని హామీలను కూడా నెరవేర్చడం సంతోషకరమన్నారు. బంజారాల కోసం హైదరాబాద్‌లో ఎకర స్థలంలో భవనం నిర్మించడం, సేవాలాల్ మహరాజ్ జన్మదిన వేడుకలకు ప్రభుత్వం కోటి రూపాయలు ఇవ్వడం కూడా సంతోషించదగ్గ విషయమన్నారు. కానీ ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్‌ను కల్పిస్తామని చెప్పి ఇప్పటివరకు ప్రకటించకపోవడం బాధాకరమన్నారు. ఎస్టీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ వెంటనే ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం వచ్చే నెలలో ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటిస్తుందని, అదే 6 శాతం రిజర్వేషన్వల్ల ఎస్టీ నిరుద్యోగులు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. 12 శాతం రిజర్వేషన్ ప్రకటించిన తరువాత ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 500 కుటుంబాలు ఉన్న తండాలను గ్రామ పంచాయతీలుగా ప్రకటించాలన్నారు. బంజారా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఉద్దేశంతో జూలై 5న పశ్చిమ రంగారెడ్డి జిల్లాలో భారీ బహిరంగసభ ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఈ సభకు పెద్దఎత్తున బంజారాలు తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బంజారా సంఘం నాయకులు ధనంజయ్, ప్రధాన కార్యదర్శి అమర్‌సింగ్ పవార్, జిల్లా అధ్యక్షుడు రాఘవన్‌నాయక్, నాయకులు కిషన్‌నాయక్, విఠల్‌నాయక్, హరినాయక్, తాండూరు, పరిగి, వికారాబాద్, చేవెళ్ల నియోజకవర్గాల బంజారా నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
బాంబు కలకలం
వికారాబాద్: గుర్తుతెలియని వ్యక్తులు రైల్వేస్టేషన్లలో, రైళ్లలో బాంబులు పెట్టామని సికింద్రాబాద్ రైల్వే కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇవ్వడంతో కలకలం రేగింది. దీంతో పోలీసులు ఉదయం 1:30 గంటల నుంచి జాగిలాలతో వికారాబాద్ రైల్వేస్టేషన్‌తో పాటు ఈ ప్రాంతం మీదుగా రాకపోకలు సాగించే రైళ్లలో జాగిలాలు, బాంబ్‌స్క్వాడ్‌తో త నిఖీలు చేశారు. హైదరాబాద్ నుంచి మొదలుకొని వాడీ, బీదర్ వరకు అన్ని రైల్వేస్టేషన్లలో, ఫ్లాట్‌ఫాంలలో క్షణ్ణంగా పరిశీలించారు. తనిఖీలు సుమారుగా రెండు గంటల పాటు సాగాయి. పోలీసులు అనుమానిత వస్తువులు, అనుమానితులను తనిఖీ చేశారు. వికారాబాద్ రైల్వే జంక్షన్లో ఆర్పీఎఫ్ సీఐ ర మేష్చందర్రెడ్డి, జీఆర్పీ ఎస్ఐ తిరుపతి, స్థానిక డీఎస్పీ స్వామి, సీఐ రవి,ఎస్ఐలు శేఖర్,నాగరాజు బాంబుస్కాడ్ సిబ్బంది, జాగిలాలతో పరిశీలించారు. ఎట్టకేలకు ఆకతాయి సమాచారం అని నిర్ధారించుకొని ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. -
ఎట్టకేలకు కదిలారు..!
వికారాబాద్: ఎట్టకేలకు పట్టణంలోని మార్కెట్ స్థలాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రూ. 30 కోట్ల విలువ చేసే ఈ స్థలంపై గతంలో వివాదాలు కొనసాగాయి. అయితే ఈ స్థలం మార్కెట్దేనని గతేడాది హైకోర్టు తీర్పునిచ్చింది. ఏడాది తర్వాత కదిలిన అధికారులు మంగళవారం ఆ భూమిలోని డబ్బాలను తొలగించి స్వాధీనం చేసుకున్నారు. ఇది వివాదం.. వికారాబాద్ పట్టణంలోని మార్కెట్ కార్యాలయం పరిధిలో సర్వేనంబర్ 131లో 5.31 ఎకరాల భూమి ఉండేది. అయితే గతంలో మార్కెట్ కమిటీ పాలకవర్గం ఆదాయ నిమిత్తం అందులో కొంత భూమిని అమ్మగా ఇంకా 10 వేల గజాల స్థలం మిగిలింది. ప్రస్తుతం ఇక్కడ గజం భూమి విలువ రూ. 30 వేల నుంచి రూ. 40 వేల వరకు పలుకుతోంది. అయితే ఈ స్థలంలో కొందరు డబ్బాలు పెట్టుకొని వ్యాపారాలు ప్రారంభించారు. కాగా కోట్ల రూపాయల విలువైన ఈ స్థలాన్ని కాజేయడానికి కావాలనే కొందరు బడా వ్యక్తులు తమకు అనుకూలంగా ఉన్న వారితో ఇక్కడ చిరు వ్యాపారాలను ఏర్పాటు చేయించారనే ఆరోపణలున్నాయి. ఈక్రమంలో ఈ స్థలంలో తాము ఎప్పటినుంచో ఉంటుంన్నందునా క్రమబద్ధీకరించాలని సదరు చిరువ్యాపారులు కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ స్థలం మార్కెట్ కార్యాలయందంటూ అధికారులు కోర్టునుఆశ్రయించారు. కొంతకాలంపాటు వాదోపవాదనలు సాగిన తర్వాత కోర్టు నిర్ణయం మార్కెట్ కార్యాలయానికి అనుకూలంగా వచ్చింది. అయినప్పటికీ ఆ స్థలం జోలికి అటు అధికారులుగాని ఇటు ప్రజాప్రతినిధులుగాని వెళ్లేవారు కాదు. అనధికారికంగా చిరువ్యాపారుల నుంచి కిరాయి కూడా వసూలు చేసేవారు. దీనిపై ‘సాక్షి’ వరుస కథనాలను ప్రచురించింది. ఎట్టకేలకు కదిలిన అధికారులు మంగళవారం పోలీసుల సాయంతో ఆ స్థలంలోని అక్రమ కట్టడాలను తొలగింపజేశారు. మార్కెట్ స్థలంలోని కట్టడాలను కూల్చివేసేందుకు వెళ్లిన అధికారులను చిరువ్యాపారులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అయితే ఈ స్థలంలో 10 దుకాణాలను నిర్మించేందుకు ప్రభుత్వం రూ. 40 లక్షల నిధులు మంజూరు చేసిందని, ఈ దుకాణాల కేటాయింపు మొదటి ప్రాధాన్యత మీకే ఇస్తామని అధికారులు చిరువ్యాపారులకు నచ్చజెప్పారు. దీంతో వారు ఆందోళన ముగించారు. అనంతరం జేసీబీల సాయంతో కట్టడాల తొలగింపు కొనసాగింది. డీఎస్పీ టి.స్వామి, సీఐలు రవి, లచ్చీరాంనాయక్ పోలీసుల బందోబస్తును పర్యవేక్షించారు.