కు.ని. క్యాప్సూల్స్‌ ఇక మగాళ్లే మింగాలి! | Women have achieved equality in many things | Sakshi
Sakshi News home page

అహంకారం...  మింగుతావా!

Published Wed, Nov 14 2018 11:31 PM | Last Updated on Thu, Nov 15 2018 11:57 AM

Women have achieved equality in many things - Sakshi

ఇక కుటుంబ నియంత్రణ క్యాప్సూల్స్‌ మగాళ్లే మింగాలి! ఇప్పటి దాకా ఆడవాళ్లే బర్త్‌ కంట్రోల్‌ పిల్స్‌ వేసుకునేవారు. ఒరవడి మారుతోంది. మగాడు అహంకారం మింగాల్సిందేనా?

‘‘ఎన్నో విషయాల్లో స్త్రీలు సమానత్వాన్ని సాధించారు. కానీ, కుటుంబ నియంత్రణ విషయంలో మాత్రం 99 శాతం భారం స్త్రీలే మోస్తున్నారు. ఈ బాధ్యతని మగవారు కూడా పంచుకోవాలని, ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేని కుటుంబ నియంత్రణ మాత్రలు కనుక్కోవాలని ప్రయోగాలు ప్రారంభించి సఫలమయ్యాం’’ అని చెప్పారు షమీమ్‌ సుల్తానా. తెలంగాణ, వికారాబాద్‌లోని పరిగికి చెందిన షమీమ్‌ అమెరికాలోని ప్రఖ్యాత యూనివర్సిటీ ఆఫ్‌ మిన్నెసోటలో ఐదేళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. యూనివర్సిటీ పరిశోధనలో భాగంగా పురుషులకు కుటుంబ నియంత్రణ మాత్రలు కనిపెట్టిన శాస్త్రవేత్తల బృందానికి షమీమ్‌ టీమ్‌ లీడర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రపంచం గుర్తించే పనిలో మన తెలుగు యువతి షమీమ్‌ సుల్తానా ప్రధాన భూమికగా ఉండటం దేశానికే గర్వకారణం. 

టీ క్యాంటీన్‌ నుంచి
పరిగి బస్‌స్టాండులో ఓ చిన్న క్యాంటీన్‌ నడుపుకునే సయ్యద్‌ మగ్బూల్‌ కూతురు షమీమ్‌. ఆయనకు 21 మంది సంతానం. షమీమ్‌ పదేళ్లు దాటే వరకు బడి గడప తొక్కింది లేదు. క్యాంటీన్‌లో చాయ్‌లు అందిస్తూ తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటూ పెరిగింది. పిల్లలందరినీ చదివిస్తూ ఈమెనొక్కదాన్నే ఇంటిపట్టున ఉంచి పనులు చేయించటం ఎందుకనుకున్న తండ్రి ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుని సాయంతో షమీమ్‌ 12వ ఏట నేరుగా 6వ తరగతిలో చేర్చాడు. అప్పటి వరకు పుస్తకాల ముఖం చూడని షమీమ్‌ మొదట్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. అ, ఆ.. లతో మొదలు పెట్టి ఏడాది తిరక్కుండానే అన్ని సబ్జెక్టులలో మంచి మార్కులు సాధించి ప్రతిభావంతురాలు అనిపించుకుంది. ఐదేళ్లలోనే 10వ తరగతి పూర్తి చేసి మంచి మార్కులతో ఉత్తీర్ణురాలైంది. ఆమె పట్టుదలను గుర్తించిన తల్లిదండ్రులు పరిగి ప్రభుత్వ కళాశాలలో ఇంటర్‌ చదివించారు. 

‘బంగారు’ తల్లి
పరిగిలో డిగ్రీ కళాశాల లేకపోవటంతో హైదరాబాద్‌లోని వనిత కళాశాలలో చేరింది షమీమ్‌. మొదట్నించి చురుకుగా ఉండే షమీమ్‌ డిగ్రీలోనూ మంచి మార్కులతో పాస్‌ అయింది. పెళ్లి చేసేస్తే బాధ్యత తీరిపోతుంది అనుకున్నప్పటికీ షమీమ్‌ ప్రతిభను గుర్తించి ఉన్నత చదువుల వైపే మొగ్గు చూపారు తల్లీదండ్రి. దీంతో ఉస్మానియా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ కెమిస్ట్రీలో చేరిన షమీమ్‌ తన ప్రతిభను మరోసారి రుజువు చేసుకుంది. అప్పటి రాష్ట్రపతి అబ్దుల్‌ కలామ్, సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, ఇద్దరు గవర్నర్లు రంగరాజన్, రామేశ్వర్‌ ఠాకూర్‌ల  చేతుల మీదుగా ఎమ్మెస్సీలో గోల్డ్‌మెడల్‌ అందుకుంది. ఇదే సమయంలో ఫీజు రీయింబర్స్‌మెంటు కూడా చదువు కొనసాగించటానికి దోహదపడిందని షమీమ్‌ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. అనంతరం ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ ప్రస్తుత ఐఐసీటీలో పీహెచ్‌డి పూర్తి చేసి డాక్టరేట్‌ పొందారు. 

పరిగి టు అమెరికా
షమీమ్‌ పట్టుదల తెలిసినవారంతా ఆమెను ఇంకా చదివిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుందన్నవారే. దీంతో ఎంత కష్టమైనా సరే కూతుర్ని విదేశాలలో ఉన్నత చదువులు చదివించాలని నిర్ణయించుకున్నాడు మగ్బూల్‌. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ మిన్నెసోటలో షమీమ్‌కు పరిశోధనలలో అవకాశం రావడంతో అక్కడకు పంపించాడు. అక్కడే కాలేజ్‌ ఆఫ్‌ ఫార్మసి మెడికల్‌ కెమిస్ట్రీలో పరిశోధనలు ప్రారంభించారు షమీమ్‌. ఆరుగురు సభ్యుల బృందానికి టీంలీడర్‌గా వ్యవహరిస్తూ అనుకున్న సమయానికి ముందుగానే పరిశోధనలను అధికారుల ముందుంచారు. ‘కుటుంబ నియంత్రణ పాటించేందుకు ఆడవారికి 1960 నుంచే మాత్రలు అందుబాటులో ఉన్నాయి. ఆ తర్వాత ట్యూబెక్టమీ, డీపీఎల్‌.. లాంటి ఇతర కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు అందుబాటులోకి వచ్చాయి. కుటుంబ నియంత్రణ కోసం మగవారు పాటించే వాసెక్టమి ఆపరేషన్‌ అందుబాటులో ఉన్నప్పటికీ ఆ ఆపరేషన్‌ చేయించుకునే వారి సంఖ్య 1 శాతానికి మించిన దాఖలాలు లేవు. కుటుంబ నియంత్రణ బాధ్యత పూర్తిగా మహిళలే మోస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కుటుంబ నియంత్రణ బాధ్యతను పురుషులకు కూడా పంచాలని భావించింది మా శాస్త్రవేత్తల బృందం. ఆపరేషన్‌ ద్వారా శుక్ర కణాలను నిలిపివేసే కుటుంబ నియంత్రణ పద్ధతులను పాటించటాన్ని పురుషులు అంగీకరించటంలేదనే సత్యాన్ని గ్రహించాం. అందుకే తాత్కాలిక పద్ధతిలో మాత్రలను పురుషులకు పంచితే స్త్రీల ఆరోగ్యం బాగుంటుందని, అంతేకాకుండా మగవారూ దీనిని అంగీకరించి స్వాగతించే అవకాశం ఉందనే అభిప్రాయానికి వచ్చాం. దీంతో పురుషులు వేసుకునే కుటుంబ నియంత్రణ మాత్రలు తయారు చేయాలని నిర్ణయించి పరిశోధనలు ప్రారంభించి, సక్సెస్‌ అయ్యాం. అధికారిరంగా ఇది వెలుగులోకి రావాల్సి ఉంది’’ అని వివరించారు షమీమ్‌.

మరింత వివరంగా 
‘‘ఆఫ్రికాలోని ఓ అరుదైన మొక్కనుంచి లభించే ఒవాబిన్‌ పదార్థాన్ని గుండె జబ్బులు తగ్గించటంతో పాటు, కొన్ని రకాల రోగాలకూ ఇప్పటికే వినియోగిస్తూ వస్తున్నారు. ఈ పదార్థాన్ని వినియోగించే పురుషుల కుటుంబ నియంత్రణ మాత్రలను తయారు చేయాలని సంకల్పించాం. ఈ మొక్కలోని రసాయనాలు కేవలం శుక్రకణాల్లో మాత్రమే ఉండే ఎక్స్‌–4 ను అచేతన పరిచి, వాటి పరుగును మందగింపజేస్తుంది. దీంతో శుక్రకణాలు అండంతో ఫలదీకరణ చెందడం ఆగిపోతుంది. అయితే, ఈ ఎక్స్‌–4.. వృద్ధి చెందిన శుక్ర కణాలను మాత్రమే అడ్డుకుంటుంది. కొత్తగా వృద్ధి చెందే శుక్రకణాలపై ఎలాంటి ప్రభావం ఉండదు. ఈ మాత్రలు వేసుకున్నప్పుడు మాత్రమే కుటుంబ నియంత్రణ జరుగుతుంది. వేసుకోవటం మానేస్తే తిరిగి సంతానాన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా పొందవచ్చు. ఈ మాలిక్యూల్‌ పురుషులకు తాత్కాలిక కుటుంబ నియంత్రణ వ్యవస్థగా ఉపయోగపడనుంది. మా బృందం తయారు చేసిన కుటుంబ నియంత్రణ మాలిక్యూల్‌ను మొదటి దశలో ఎలుకలు, తరువాత దశలో కుందేళ్లపై ప్రయోగించి సఫలీకృతమయ్యాం. ప్రస్తుతం కోతులపై ఈ ప్రయోగం జరుగుతోంది. అనంతరం మనుషులపై ప్రయోగించి ఈ మందును మార్కెట్‌లోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఈ మందు తయారీ విషయంలో ఇప్పటికే మా శాస్త్రవేత్తల బృందం పేటెంట్‌ హక్కులు సైతం పొందింది’’ అని తెలిపారు షమీమ్‌ సుల్తానా.

ఇష్టపడి చదివాను
పరిగి నుంచి అమెరికా వరకు ప్రతి అడుగులోనూ నా తల్లిదండ్రుల కృషి ఉంది. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నప్పటికీ పై చదువులు చదివించారు. ఆడపిల్ల అని వెనుకంజ వేయకుండా అమెరికా యూనివర్సిటీలో చేరడానికి ప్రోత్సహించారు. ప్రపంచ స్థాయి సైంటిస్టుగా గుర్తింపు పొందటానికి మరో అడుగు దూరంలో ఉన్నాను. ఇప్పటికే అమెరికాలోని ప్రసారమాధ్యమాల్లో మా ప్రయోగాలకు సంబంధించిన వార్తలు ఎన్నో వచ్చాయి. 
– షమీమ్‌ సుల్తానా, సైంటిస్టు

చదువే పరిష్కారం
పరిగి బస్‌స్టాండులో 16 ఏళ్లపాటు క్యాంటిన్‌ నడిపాను. నా కుటుంబం పెద్దది. కుటుంబం బాగుపడాలంటే చదువొక్కటే మార్గమని నమ్మినవాడిని. ఎంత కష్టమైనా ఆడా మగ తేడా లేకుండా పిల్లలందరినీ చదివించాను. టిఫిన్లు, చాయ్‌లు అమ్ముతూనే పిల్లలందరినీ ఉన్నత విద్యావంతులను చేశాను. ఈ రోజు వారందరూ ప్రయోజకులయ్యారు. ఇంజనీర్లుగా, ఉపాధ్యాయులుగా, వ్యాపారవేత్తలుగా, డాక్టర్లుగా ఇండియాతో పాటు ప్రపంచంలోని ఆయా దేశాల్లో స్థిరపడ్డారు. షమీమ్‌ సైంటిస్టుగా అమెరికాలో స్థిరపడింది. ప్రస్తుతం పరిగిలోనే ఓ కిరాణ దుకాణం నిర్వహిస్తున్నాను. నా బిడ్డ సాధించిన విజయానికి నాకెంతో గర్వంగానూ, ఆనందంగానూ ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement