వికారాబాద్‌లో ప్రధాని సతీమణి
- నాగదేవత ఆలయంలో పూజలు
- అంబేడ్కర్, బుద్ధ విగ్రహాలకు నివాళి
అనంతగిరి: వికారాబాద్ జిల్లా కేంద్రంలోని నాగదేవత ఆలయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సతీమణి జశోదాబెన్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 6 నుంచి 8 గం టల వరకు నాగులపుట్టకు, నాగబుద్ధ అంబేడ్కర్ విగ్రహా నికి, విఘ్నేశ్వరుడు, పంచవృక్షాలు, అష్టాదశ శక్తి పీఠాలు, దశావతారాలు, తుల్జాభవాని, గోపూజ, తులసీవనం, నవగ్రహాల పూజలు చేశారు. ఆలయంలోని మొత్తం 61 విగ్రహాలకు పూజలు నిర్వహించారు. మ«ధ్యాహ్నం ఒంటిగంటకు నిర్వహించిన నిత్య అన్నదాన కార్యక్రమం లో పాల్గొని పలువురికి భోజనం వడ్డించారు. శివరాంనగర్ సంతోషిమాత ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
మోదీ పాలన భేష్: జశోదాబెన్
దేశంలో పాలన బాగుందని ప్రధాని నరేంద్ర మోదీ సతీమణి జశోదాబెన్ కితాబిచ్చారు. భవిష్యత్‌లో కూడా ఇలాగే ఉండాలని ఆశిస్తున్నానని చెప్పారు. దేశ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. వికారాబాద్‌లో ఒకే దగ్గర ఇన్ని విగ్రహాలు ఉండటం సంతోషకరమని చెప్పారు. ఇక్కడి నాగదేవతా ఆలయాన్ని సందర్శించడం ఆనందంగా ఉందన్నారు. కాగా, ప్రధాని సతీమణి రాకపై పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. దీంతో ఆమె సాధారణ వ్యక్తిగా తన పర్యటన ముగిం చారు. శనివారం తెల్లవారుజామున జశోదాబెన్ తిరుగు ప్రయాణం కానున్నట్లు ఆలయ నిర్వాహకులు బరాడి రమేశ్, సరిత దంపతులు తెలిపారు.